Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 24 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 24 మార్చి 2024

24 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నవీన్ జిందాల్

జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఛైర్మన్ నవీన్ జిందాల్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మార్చి 22న బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ గవర్నింగ్ బాడీ అయిన అపెక్స్ కమిటీ ద్వారా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నవీన్ జిందాల్ ఒక భారతీయ బిలియనీరుగా, పారిశ్రామికవేత్తగా మరియు పరోపకారిగా గుర్తింపు పొందారు. నవీన్ గతంలో హర్యానాలోని కురుక్షేత్ర నుండి లోక్‌సభ సభ్యుడుగా సేవలు అందించారు. ప్రస్తుతం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఛైర్మన్‌గా మరియు ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • ఇండియన్ స్టీల్ అసోసియేషన్ భారతదేశంలోని అన్ని ప్రధాన పబ్లిక్ సెక్టార్ మరియు ప్రైవేట్ సెక్టార్ స్టీల్ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.
  • స్టీల్ అసోసియేషన్ దాని సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ భారతీయ ఉక్కు పరిశ్రమకు వాయిస్‌గా పనిచేస్తుంది.
  • ఈ సంస్థ ఉక్కు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వంతో సహకరించడానికి, సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పని చేస్తుంది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త ఛైర్మన్‌గా ఎంవీ రావు ఎన్నిక

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొత్త ఛైర్మన్‌గా ఎంవీ రావు ఎన్నికయ్యారు. ఎంవీ రావు ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. అలానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ ఖరా, ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎల్ జైన్ మరియు సిటీ యూనియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ కామకోడి వైస్ చైర్మన్‌లుగా ఎన్నుకోబడ్డారు.

అలాగే బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ మరియు కువైట్ కంట్రీ హెడ్ మాధవ్ నాయర్‌ను గౌరవ కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అనేది భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన ప్రధాన సేవా సంస్థ.

1946లో స్థాపించబడిన ఐబిఎ, గత 75 సంవత్సరాలకు పైగా భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు దీనిలో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ 247 బ్యాంకింగ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

యునెస్కో తాత్కాలిక ప్రపంచంలో జాబితాలో 6 కొత్త భారతీయ సైట్లు

మధ్యప్రదేశ్‌లోని ఆరు వారసత్వ ప్రదేశాలు ఇటీవలే యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి. ఈ ఆరు ప్రదేశాలలో గ్వాలియర్ కోట, చారిత్రాత్మక ధమ్నార్ రాక్-కట్ గుహలు మరియు భోజ్‌పూర్‌లోని భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం, చంబల్ యొక్క రాక్ ఆర్ట్ సైట్, బుర్హాన్‌పూర్‌లోని ఖూనీ భండారా మరియు రాంనగర్ మరియు మండలాలోని గోండు స్మారక చిహ్నాలు ఉన్నాయి.

1. గ్వాలియర్ కోట : దీనిని సాధారణంగా గ్వాలియర్ ఖిలా అని పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని కొండపై ఉంది. దీనిలో దొరికన శాసనాలు మరియు స్మారక చిహ్నాలు 6వ శతాబ్దం కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక కోట, రాజా సౌర్య సేన చేత ప్రారంభించబడింది. అతను 773CEలో పీఠభూమి చుట్టూ ఈ కోట వ్యవస్థను ఏర్పాటు చేశాడు.

గ్వాలియర్ కోటకు రాతియుగం నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. గ్వాలియర్‌కు పశ్చిమాన 3 కిమీ దూరంలో ఉన్న గుప్తేశ్వర్‌లో కనుగొనబడిన అనేక కళాఖండాల ద్వారా ఇది రుజువు చేయబడింది. ఈ ప్రాంతం యొక్క ప్రారంభ పాలకులలో మౌర్యులు, సుంగాలు, కుషాలు మరియు నాగాలు ఉన్నారు.

2. హిస్టారికల్ గ్రూప్ ఆఫ్ ధామ్నార్: ధమ్నార్ గుహలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాలో 5.2 హెక్టార్ల విస్తీర్ణంలో ధామ్నార్ గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై ఉన్నాయి. ఈ రాక్ కట్ సైట్‌లో మొత్తం 51 గుహలు ఉన్నాయి. ఈ కొండ రెండు సమూహాల నిర్మాణాలను కలిగి ఉంది. అందులో ఒకటి బౌద్ధ గుహల శ్రేణి మరియు రెండవది ధర్మరాజేశ్వర ఆలయం అని పిలువబడే హిందూ దేవాలయ సముదాయం.

దీనిని ధర్మనాథ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ గుహల శ్రేణిలో 14 పెద్ద గుహలు మరియు 37 చిన్న గుహలు ఉన్నాయి. ఇవి 5 నుండి 7వ శతాబ్దం కాలంలో నిర్మించినవిగా భావిస్తున్నారు. ఈ గృహాలు అంతర్జాతీయ స్థాయిలో ఇథియోపియాలోని లాలిబెలా మరియు శ్రీలంకలోని రాంగిరి దంబుల్లా గుహ దేవాలయంతో పోల్చవచ్చు.

3. భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న భోజేశ్వర్ మహాదేవ్ ఆలయం, బెత్వా నదికి అభిముఖంగా ఉన్న శివునికి అంకితం చేయబడిన వెయ్యి సంవత్సరాల పురాతన ఆలయం. భోజ్‌పూర్‌లోని రాజా భోజ్ ఆధ్వర్యంలో 11వ శతాబ్దంలో దీనిని నిర్మించినట్లు భావిస్తున్నారు. ఈ ఆలయ వాస్తుశిల్పం భూమిజ శైలిని అనుసరిస్తుంది.

4. చంబల్ రాక్ ఆర్ట్ సైట్లు : చంబల్ బేసిన్ మరియు మధ్య భారత ప్రాంతం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ రాక్ ఆర్ట్ సైట్‌లను కలిగి ఉంది. పురాతన కాలంలో చార్మావతి అని పిలువబడే చంబల్ నది మాల్వా ట్రాప్ జోన్ నుండి ఉద్భవించింది. ఇవి వివిధ చారిత్రక కాలాల్లో వివిధ నాగరికతలచే రూపొందించబడినట్లు భావిస్తున్నారు.

చంబల్ లోయ ప్రాంతం యొక్క పురావస్తు సాంస్కృతిక ప్రకృతి దృశ్యం అచెలియన్, దిగువ, మధ్య మరియు ఎగువ పురాతన శిలాయుగం, మధ్యశిలాయుగం, చాల్‌కోలిథిక్ మరియు ప్రారంభ చారిత్రక కాలాల నాగరికతకు అసాధారణమైన సాక్ష్యంగా ఉంది.

ఈ ప్రాంతంలోని రాక్ ఆర్ట్ ఎక్కువగా ఆ కాలపు ప్రజల జీవన విధానానికి సంబంధించిన చిత్రణలను కలిగి ఉంటుంది. మెసోలిథిక్ కాలంకు సంబంధించి పెయింటింగ్‌ల ఇతివృత్తంలో వేట, సేకరణ, సేకరించడం మరియు చేపలు పట్టడం వంటివి ఉన్నాయి. చాల్‌కోలిథిక్ కాలంకు సంబంధించి పశువుల పెంపకం చిత్రాలు అలానే చారిత్రిక మరియు మధ్యయుగ కాలంకు సంబంధించి మతం-కేంద్రీకృత పెయింటింగులు ఇక్కడ కనిపిస్తాయి.

5. ఖూనీ భండారా : ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని చారిత్రాత్మక నగరం బుర్హాన్‌పూర్‌లో నిర్మించిన ఎనిమిది వాటర్‌వర్క్‌లతో కూడిన పురాతన భూగర్భ నీటి నిర్వహణ వ్యవస్థ. ఈ ప్రత్యేకమైన భూగర్భ నీటి నిల్వ వ్యవస్థ గత యుగం నుండి అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసాలను ప్రదర్శిస్తుంది.

ఖూనీ భండారా కనాట్ వ్యవస్థ, మొఘల్ పాలకులచే రూపొందించబడింది. ఈ సాంకేతికత పెర్షియన్ దేశాల నుండి దిగుమతి చేయబడిందని భావిస్తున్నారు. ఖూనీ భండారా కనాట్ వ్యవస్థ భారతదేశంలోని పాక్షిక-శుష్క ప్రాంతాలలో నీటిని అందించడానికి నాడు నిర్మించారు.

6. గోండు స్మారక చిహ్నాలు : రామ్‌నగర్‌లోని గోండు స్మారక చిహ్నాలు గార్హా రాజవంశం యొక్క చివరి ప్రముఖ పాలకుడు హిర్దే షా రాజు యొక్క అద్భుతమైన పాలనకు గుర్తుగా ఉన్నాయి. ఈ ప్రదేశాలు భారతదేశంలోని స్థానిక తెగ అయిన గోండు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయి.

ఈ 6 సైట్‌లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చడం ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా వాటి సంభావ్య గుర్తింపు కోసం కీలకమైన దశను సూచిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక హోదా వాటి గ్లోబల్ విజిబిలిటీని మెరుగుపరచడమే కాకుండా వాటి సంరక్షణ మరియు ప్రమోషన్ కోసం అంతర్జాతీయ మద్దతును కూడా ఆకర్షిస్తుంది.

హైతీలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుకు ఆపరేషన్ ఇంద్రావతి

హైతీలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఇంద్రావతిని మార్చి 21న ప్రారంభించింది. హైతీలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితికి ప్రతిస్పందనగా, పొరుగున ఉన్న డొమినికన్ రిపబ్లిక్‌కు తన పౌరులను తరలించడానికి భారతదేశం ఆపరేషన్ ఇంద్రావతిని ప్రారంభించింది.

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఆపరేషన్ ప్రారంభాన్ని ధృవీకరించారు, మొదటి రోజు పన్నెండు మంది భారతీయ పౌరులను విజయవంతంగా తరలించినట్లు ప్రకటించారు. కరేబియన్ దేశమైన హైతీలో సాయుధ ముఠాలు ప్రధాన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో హింసాత్మకంగా మారింది. ఈ గందరగోళం హైతీ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

ఆపరేషన్ ఇంద్రావతి వివరాలు పూర్తిగా బహిర్గతం కానప్పటికీ, ఇది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు డొమినికన్ రిపబ్లిక్ మధ్య సహకారాన్ని కలిగి ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. హైతీలో భారతదేశానికి రాయబార కార్యాలయం లేదు. ఈ ఆపరేషన్ డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని భారతీయ రాయభారి ద్వారా పర్యవేక్షించబడింది.

హైతీలో భారతీయ పౌరుల సంఖ్య కూడా తక్కువ ఉంది. అధికారిక అంచనాల ప్రకారం 75 నుండి 90 మంది వరకు ఉన్నారు. వారిలో దాదాపు 60 మంది సంభావ్య తరలింపు కోసం భారతీయ అధికారుల వద్ద నమోదు చేసుకున్నారని మునుపటి నివేదికలు సూచించాయి.

3వ ఎడిషన్ నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 నాగాలాండ్‌లో ప్రారంభం

నార్త్ ఈస్ట్ గేమ్స్ 2024 యొక్క 3వ ఎడిషన్ సోవిమాలోని రీజినల్ సెంటర్ ఫర్ స్పోర్టింగ్ ఎక్సలెన్స్‌లో మార్చి 22న ప్రారంభమైయ్యాయి. నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ఈ క్రీడలను ప్రారంభించారు. ఈ ప్రాంత రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇది ఉమ్మడి వేదికను అందిస్తుంది. ఈ క్రీడా ఈవెంటును నార్త్ ఈస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహిస్తుంది.

భారతదేశంలోని మొత్తం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు అయిన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం మరియు త్రిపుర నుండి 3,000 మంది అథ్లెట్లు 15 విభిన్న క్రీడా విభాగాలలో పోటీ పడ్డారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్, పెన్‌కాక్ సిలాట్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, వాలీబాల్ మరియు వుషు వంటి అనేక రకాల క్రీడలు ఈ గేమ్‌లలో ఉన్నాయి.

నార్త్ ఈస్ట్ గేమ్స్ యొక్క 3వ ఎడిషన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రీడా ఈవెంట్ వారి ఐక్యతా స్ఫూర్తిని పెంపొందించింది, ఈ ప్రాంతం యొక్క అపారమైన క్రీడా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ గేమ్‌లు నార్త్ ఈస్ట్ నుండి భవిష్యత్ ఛాంపియన్‌లను వెలికితీసేందుకు మరియు పెంపొందించడానికి ఒక వేదికగా కొనసాగుతాయని భావిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి వచ్చిన తొమ్మిది సమన్లకు ఆయన ప్రతిస్పందించలేదనే కారణం అరెస్ట్ చేశారు. దీనితో భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉంటూ అరెస్ట్ కాబడిన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ నిలిచారు.

జూన్ 2022లో రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో బహుళ కోట్ల కుంభకోణం జరిగిందనే ఫిర్యాదుపై ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కుమార్ చౌదరి ఢిల్లీ పోలీసులకు ఈ పిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసును అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుంది.

ఆప్ ప్రభుత్వం మద్యం లైసెన్సులను విచ్చలవిడిగా విక్రయించి, ప్రైవేట్ విక్రేతల నుండి కిక్‌బ్యాక్‌ పొందిందని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. అదే సమయంలో లిక్కర్ గ్రూప్ నుంచి ఆప్‌కి మిలియన్ డాలర్లు అందినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది.

ఈ కేసులో ఇప్పటికే 2023 మార్చిలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా, ఆప్ పార్టీకి చెందిన పలువురు ఉన్నత స్థాయి సభ్యులను, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కే కవితను అరెస్టు చేసింది. తాజాగా 21 మార్చి 2024 న కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేశారు.

అయితే కేవలం 100 కోట్ల రాజకీయ కుంభకోణంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు, దేశాలు ఖండించాయి. భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయడం, భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్ అవ్వడం కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణికి అద్దం పడుతున్నట్లు భావిస్తున్నారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు జర్మనీ వంటి దేశాలు ఈ సంఘటనలపై స్పందించాయి. ఇండియాలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగాలని వీరు కోరుకున్నారు.

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ కుంభకోణం.
  • ఈ స్కామ్ 2021 నుండి 2022 వరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా చోటు చేసుకుంది.
  • ఈ లిక్కర్ పాలసీ ప్రైవేట్ సంస్థలు మరియు ఎంటర్‌ప్రైజ్ కంపెనీలను రిటైల్ మద్యం రంగాలలోకి తీసుకువచ్చింది.
  • ప్రైవేట్ రంగాల యజమానులకు మరియు వాటాదారులకు ప్రభుత్వం అనుకూలంగా ఉండటం ద్వారా ఈ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
  • వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించిన ఈ ఎక్సైజ్ పాలసీ 2021–22, ఎక్సైజ్ మరియు రిటైల్ మద్యం రంగంలో ఒక సంస్కరణగా అంచనా వేసింది.
  • ఈ విధానాన్ని క్యాబినెట్‌లోని మంత్రుల బృందం రూపొందించి, మార్చి 2021లో ప్రభుత్వంచే ఆమోదింపజేశారు.
  • ఈ విధానం ప్రధానంగా మద్యం రంగంలో ప్రైవేటీకరణకు అనుమతిస్తుంది.
  • ఈ విధానం ద్వారా ప్రభుత్వం రూ. 9,500 కోట్ల ఆదాయాన్ని సృష్టించింది. అయితే ఇది రాజకీయంగా వివాదంగా మారింది.
  • ఫిబ్రవరి 2021లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో సంస్కరణలను పరిశీలించడానికి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
  • ఆ తర్వాత కొన్ని నెలలకు కొత్త విధానాన్ని ఉపసంహరించుకుని, పాత విధానాన్ని కొనసాగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ అమలు తర్వాత, ఈ పాలసీలో బహుళ కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఒకటి జూన్ 2022లో ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చౌదరి అనిల్ కుమార్ ద్వారా ఢిల్లీ పోలీసులకు దాఖలు చేయబడింది. ఈ బిల్లుకు ప్రతిపక్ష బీజేపీ మరియు కాంగ్రెస్ నుండి కూడా తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.

ప్రభుత్వం డబ్బుకు బదులుగా అన్ని లైసెన్సులను విక్రయించిందని, ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టిందని ఈ రెండు జాతీయ పార్టీలు ఆరోపించాయి. మద్యం లైసెన్స్‌దారులకు వారి ఇష్టానుసారం గడువు పొడిగించారని కూడా ఆరోపించారు.

ఈ కొత్త విధానాలు ఎక్సైజ్ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, వ్యాపారులకు వారి ఇష్టానుసారం 30 కోట్ల మినహాయింపు ఇచ్చారని ప్రతిపక్షం ఆరోపించింది. దీనిపై విచారణ జరిపేందుకు కేంద్ర సంస్థల జోక్యాన్ని కూడా ఇరు పార్టీలు కోరాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్టు చేశారు.

పేరు రాజకీయ పార్టీ అరెస్టు తేదీ
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 21 మార్చి 2024
కె. కవిత భారత రాష్ట్ర సమితి 15 మార్చి 2024
సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ 4 అక్టోబర్ 2023
మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ 26 ఫిబ్రవరి 2023
సత్యేంద్ర కుమార్ జైన్ ఆమ్ ఆద్మీ పార్టీ మే 2022

Post Comment