తెలుగులో కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2022 | పోటీపరీక్షల ప్రత్యేకం
Magazine 2022

తెలుగులో కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2022 | పోటీపరీక్షల ప్రత్యేకం

తెలుగులో కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2022 కు చెందిన తాజా ముఖ్యాంశాలు చదవండి.  పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థుల కోసం నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్ అంశాలకు చెందిన పూర్తిస్థాయి తాజా వర్తమాన అంశాలను మీ కోసం అందుబాటులో ఉంచుతున్నాం.

ఇండియన్ అఫైర్స్ - డిసెంబర్ 2022

డిసెంబరు నుంచి జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌

భారతదేశం అధికారికంగా ఒక సంవత్సరం పాటు G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. 1 డిసెంబర్ 2022 నుండి నవంబర్ 20, 2023 వరకు ఒక సంవత్సరం పాటు ఈ హోదాను కలిగి ఉండటంతో పాటుగా వివిధ సమావేశాలకు ఆతిథ్యమివ్వనుంది. ఈ సందర్భంగా జి-20 లోగోతో పాటుగా 100 స్మారక చిహ్నాలను విడుదల చేశారు.

వన్ ఎర్త్, వన్ ఫామిలీ, వన్ ఫ్యూచర్ థీమ్'తో ఈ ఏడాది పొడుగునా 32 విభిన్న రంగాల్లో 200 పైగా మీటింగు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 లీడర్స్ సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశాల్లో జీ20 దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు పాల్గొంటారు.

జీ20 అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఫోరమ్. ఇందులో ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూకే, యూఎస్ఏ మరియు యూరోపియన్ యూనియన్‌తో సహా 19 దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

సిసియూఎస్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించిన నీతి ఆయోగ్

నీతి ఆయోగ్ ఇటీవలే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (CCUS) పాలసీ ఫ్రేమ్‌వర్క్ మరియు దాని డిప్లాయ్‌మెంట్ మెకానిజంను భారతదేశంలో ప్రారంభించింది. దీని ద్వారా ఉక్కు, సిమెంట్, చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, రసాయనాలు మరియు ఎరువులు వంటి అధిక కాలుష్య రంగాల నుండి కార్బన్ డయాక్సైడును డీకార్బనైజ్ చేసే సాంకేతికతను ఉపయోగించి 2050 నాటికి 750 mtpa కార్బన్ క్యాప్చర్‌ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

చైనా మరియు యూఎస్ తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద CO2 ఉద్గారిణిగా భారతదేశం ఉంది. గత ఏడాది చివరిలో గ్లాస్గోలో జరిగిన COP 26 కార్యక్రమంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2070 నాటికి నికర సున్నాని సాధించడంతోపాటు వాతావరణ మార్పులను తగ్గించడానికి పంచామృతాన్ని ప్రకటించారు. దీనికి అనుగుణంగా భారతదేశం తన డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి కార్బన్ క్యాప్చర్ వినియోగం దృష్టి సారించింది.

నాగాలాండ్‌లో 23వ హార్న్‌బిల్ ఫెస్టివల్‌ ప్రారంభం

నాగాలాండ్‌ హార్న్‌బిల్ ఫెస్టివల్ 2022 యొక్క 23వ ఎడిషన్ నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద దేశీయ పండుగలలో ఇది ఒకటి.

ఈ 10 రోజుల పండుగలో అన్ని నాగా తెగలకు చెందిన సంస్కృతిని మరియు విశిష్టతను తెలియజేసే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా హార్న్‌బిల్ మ్యూజిక్ ఫెస్టివల్, ఫోటో ఫెస్ట్, ఫ్యాషన్ షోలు, అడ్వెంచర్ స్పోర్ట్స్, నైట్ కార్నివాల్, హార్టిస్‌కేప్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఢిల్లీలో ఇండియా - సెంట్రల్ ఆసియా మీటింగ్

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క ఇండియా -సెంట్రల్ ఆసియా మీటింగును మొదటిసారి న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. మధ్య ఆసియా దేశాలతో ఇండియా కనెక్టివిటీని పెంపొందించేందుకు, టెర్రర్ ఫైనాన్సింగ్‌, ఉగ్రవాద నిర్ములన చర్యలపై చర్చలు జరిపారు.

కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌తో సహా మధ్య ఆసియా దేశాల నుండి అత్యున్నత భద్రతా అధికారులతో కూడిన ఈ సమ్మేళనాన్ని భారతదేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.

చెన్నైలో మొదటి డ్రోన్ స్కిల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిసెంబరు 6 న చెన్నైలో భారతదేశపు మొట్టమొదటి డ్రోన్ స్కిల్ ట్రైనింగ్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా భారతదేశంలోని 777 జిల్లాల పరిధిలో వివిధ వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్‌ల సామర్థ్యాన్ని బోధించే మరియు ప్రదర్శించే గరుడ ఏరోస్పేస్ డ్రోన్ యాత్ర 'ఆపరేషన్ 777'ని కూడా ఏకకాలంలో ఫ్లాగ్ చేశారు.

గరుడ యొక్క దేశవ్యాప్త డ్రోన్ యాత్ర ద్వారా రైతులకు గరుడ యొక్క కిసాన్ డ్రోన్‌ల ఉపయోగం మరియు వాటి ప్రయోజనాలతో పాటు వాటి యొక్క విశేషాలను పరిచయం చేయనున్నారు.  అదే సమయంలో వచ్చే ఏడాదిలోపు 25,000 మేడ్ ఇన్ ఇండియా కిసాన్ డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

బంగాళాఖాతంలో మాండౌస్ తుఫాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 6న తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారింది. దీనికి మాండౌస్ తుఫానుగా నామకరణం చేసారు. ఇది డిసెంబర్ 10 తెల్లవారుజామున 65-75 కిలోమీటర్ల వేగంతో చెన్నై సమీపంలోని మామల్లపురంలో తీరం దాటనుంది. మాండౌస్ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. అరబిక్ భాషలో మాండౌస్ అనగా "నిధి పెట్టె" అని అర్ధం.

ఐఐటీ మద్రాస్ పరిశోధకుల ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్‌

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులు, సముద్ర అలల నుండి విద్యుదుత్పత్తి చేయగల 'ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్'ని అభివృద్ధి చేశారు. దీనికి సంబంధించిన మొదటి దశ ప్రయోగం డిసెంబర్ 7న విజయవంతంగా పూర్తిచేశారు. ఈ పరికరానికి సింధూజ-I' అని నామకరణం చేసారు. ఈ యంత్రం ద్వారా వచ్చే మూడేళ్ళ కాలంలో ఒక మిలియన్ వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదటి సిల్చార్-సిల్హెట్ ఫెస్టివల్ ప్రారంభం

భారతదేశం - బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించేందుకు నిర్వహిస్తున్న మొదటి సిల్చార్-సిల్హెట్ ఫెస్టివల్ డిసెంబర్ 2న అస్సాంలోని బరాక్ వ్యాలీలో ప్రారంభమైంది. వేడుకను ఇండియా ఫౌండేషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు.

2022 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇది సరిహద్దుకు ఇరువైపులా నివాసితుల జీవితాలను శాశ్వతంగా మార్చిన చారిత్రాత్మక సంఘటన. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందిన 50వ వార్షికోత్సవం కూడా ఈ సంవత్సరం. భారత ప్రభుత్వం 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"గా జరుపుకుంటుంది.

సంగై ఫెస్టివల్ 2022

10 రోజుల సుదీర్ఘ వార్షిక కల్చరల్-కమ్-టూరిజం ఫెస్టివల్ 'మణిపూర్ సంగై ఫెస్టివల్' నవంబర్ 30న ప్రారంభమైంది. మణిపూర్‌లో మాత్రమే కనిపించే రాష్ట్ర జంతువు సంగై (నుదురు-కొమ్ముల జింక) పేరు మీద ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని 2010లో మణిపూర్ టూరిజంను ప్రపంచ దేశాలకు చేరవేసే లక్ష్యంతో ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

 గోవాలో ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్‌పో

9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్‌పో 2022 గోవాలో డిసెంబర్ 8న ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యాటక మరియు షిప్పింగ్, ఓడరేవులు మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 8 నుండి 11 మధ్య ఆయుష్ వైద్య వ్యవస్థల సమర్థత మరియు బలాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా నిర్వహించారు.

భారత ప్రభుత్వం 2014లో ప్రత్యేక ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆయుష్ చికిత్స కోసం ఇండియాకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. తద్వారా ఆయుర్వేదం ప్రపంచవ్యాప్త విస్తరణకు దోహదపడుతుంది. భారతదేశ స్ఫూర్తితో 2015లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రస్తుతం యోగ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది.

గోవాలో మోపా విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11, 2022 న ఉత్తర గోవాలోని మోపాలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క మొదటి దశను ప్రారంభించారు. ఈ కొత్త విమానాశ్రయానికి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఇది గోవాలో రెండవ విమానాశ్రయం, మొదటి విమానాశ్రయం దబోలిమ్‌లో ఉంది.

దాదాపు ₹ 2,870 కోట్లతో సుస్థిర మౌలిక సదుపాయాల ఆలోచనతో విమానాశ్రయాన్ని నిర్మించారు . 2016 నవంబర్‌లో ప్రధాని మోదీ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 05 జనవరి 2023 నుండి ఈ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ సేవలు అందించనుంది.

కొచ్చిలో ముజిరిస్ బినాలే ఐదవ ఎడిషన్ ప్రారంభం

వారసత్వ ఆస్తులు మరియు ఆర్ట్ గ్యాలరీల ప్రదర్శనకు సంబంధించిన కొచ్చి - ముజిరిస్ బినాలే ఐదవ ఎడిషన్ డిసెంబర్ 12న ప్రారంభమైంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ ఎగ్జిబిషనుగా పేరుగాంచింది. కొచ్చి-ముజిరిస్ బినాలే కేరళ ప్రభుత్వ సహకారంతో కొచ్చి బినాలే ఫౌండేషన్ 2012 లో ప్రారంభించింది.

కొచ్చి బినాలే ఫౌండేషన్ (KBF) అనేది భారతదేశంలో కళ & సంస్కృతి మరియు విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్న లాభాపేక్షలేని స్వచ్ఛంద. ఈ ఏడాది ఎగ్జిబిషనులో ప్రపంచ దేశాలకు చెందిన 90 మంది ఆర్టిస్టులు దాదాపు 200 రకాల క్రియేటివ్ ప్రాజెక్టులతో ప్రదర్శన ఇవ్వనున్నారు.

కేరళలో దేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఫామ్ ప్రారంభం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అలువాలో ఉన్న సీడ్ ఫామ్‌ను దేశంలోనే మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ ఫామ్‌గా ప్రకటించారు. కేరళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని సీడ్ ఫారమ్, వ్యవసాయంలో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంద్వారా కార్బన్ న్యూట్రల్ స్థితిని సాధించడంలో దోహదపడిందని ఆయన ప్రకటించారు.

ఈ వ్యవసాయ క్షేత్రంలో 213 టన్నుల కర్బన ఉద్గారాలు ఏర్పడగా, 170 టన్నులకు పైగా కార్బన్‌ను సేకరించడం జరిగిందని, ఇది దేశంలోనే మొదటి కార్బన్ న్యూట్రల్ సీడ్ ఫామ్‌గా ప్రకటించబడడానికి దోహదపడిందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రయోగాన్ని రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు.

కేరళలో 13 ఫామ్‌లను కార్బన్‌ న్యూట్రల్‌గా మార్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని, మహిళా సంఘాల ద్వారా కార్బన్‌ న్యూట్రల్‌ వ్యవసాయ పద్దతులను అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 30 శాతం వ్యవసాయం నుండి వస్తున్నాయని, దీనిని నిరోధించవచ్చని మరియు కార్బన్ న్యూట్రల్ వ్యవసాయ పద్ధతుల ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలియజేసారు.

భారతదేశ 9వ జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భారతదేశ 9వ జాతీయ పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26 న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ చేత స్థాపించబడింది. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి ఈ పార్టీ పుట్టుకొచ్చింది.

2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో పార్టీ మొత్తం 70 సీట్లలో 28 సీట్లు సాధించి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ బయటి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో కనీవిని ఎరుగని రీతిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలో మొత్తం 70 శాసనసభ స్థానాల్లో 67 సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఇటీవలే జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో 5 సీట్లు సాధించడంతో పాటుగా 12శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఈ పార్టీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఉంది.

భారత ఎన్నికల సంఘం ప్రకారం, ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు లోక్‌సభ లేదా శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికలలో, నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్లను పొంది ఉండాలి. లేదా ఏదైనా రాష్ట్రం నుండి 4 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలి. ఈ పార్టీకి ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు లేకపోయినా ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవాలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉంది.

ప్రస్తుతం దేశంలో మొత్తం 9 రాజకీయ పార్టీలకు జాతీయ గుర్తింపు ఉంది. ఈ జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), భారత జాతీయ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి.

ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో మూడు హిమాలయ ఔషధ మొక్కలు

హిమాలయాలలో కనుగొనబడిన మూడు ఔషధ మొక్కలకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) యొక్క రెడ్ లిస్టులో చేర్చినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కనిపించే మీజోట్రోపిస్ పెల్లిటా, ఫ్రిటిల్లోరియా సిర్రోసా మరియు డాక్టిలోరిజా హటగిరియా అంతరించే ప్రమాదంలో ఉన్నట్లు ఐయూసీఎన్ నివేదించింది.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ప్రకృతి మరియు సహజ వనరుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. ఇది 1948 లో స్విట్జర్లాండ్ (గ్లాండ్) లో స్థాపించబడింది. ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ప్రస్తుతం 62,600 కంటే ఎక్కువ వృక్ష జాతులు ఉన్నాయి, ఇవి ప్రపంచంలోని తెలిసిన మొక్కలలో 154% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అలానే గుర్తించబడ్డ 2,143 ఔషధ జాతులలో మొత్తం 457 జాతులు ప్రమాదంలో ఉన్నాయి.

బెంగుళూరులో G20 ఫైనాన్స్ & సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం

G20 ఫైనాన్స్ & సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం డిసెంబర్ 14న బెంగళూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాలు, ఫోరమ్‌కి ఆహ్వానించబడిన పలు ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 మరియు 25 మధ్య బెంగళూరులో జరగనున్న G-20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి ఇది లీడ్ చేయనుంది.

G20 ఫైనాన్స్ ట్రాక్ గ్లోబల్ ఎకానమీకి సంబంధించిన కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆర్థిక మరియు ఆర్థిక సమస్యలపై మాట్లాడారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్సింగ్, సస్టైనబుల్ ఫైనాన్స్, గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ మరియు ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌తో సహా ఫైనాన్షియల్ సెక్టార్ అంశాలు ఈ చర్చలోప్రధాన ఎజెండా ఉన్నాయి.

ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ 7వ ఎడిషన్

ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క 7వ ఎడిషన్ డిసెంబర్ 15 నుండి 17 మధ్య ఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సులో పెద్ద నదీ పరీవాహక ప్రాంతాల్లోని చిన్న నదులను రక్షించే మార్గాలపై దేశ, విదేశాలకు చెందిన నిపుణులు చర్చలు జరిపారు.

ఇదే వేదిక ద్వారా నీరు, పర్యావరణం మరియు పరిపాలనా రంగాలకు చెందిన నిపుణులతో దేశంలో ఒక జాతీయ రివర్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాల్సిన అత్యవసర అవసరానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ వేడుకకు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG) డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్ అధ్యక్షత వహించారు.

దేశంలో 7 జోనల్ కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా కళలు, సంస్కృతి మరియు హస్తకళలను పరిరక్షించడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడు జోనల్ కల్చరల్ సెంటర్‌లను పాటియాలా, నాగ్‌పూర్, ఉదయపూర్, ప్రయాగ్‌రాజ్, కోల్‌కతా, దిమాపూర్ మరియు తంజావూరులో అందుబాటులోకి రానున్నాయి.

జోనల్ సాంస్కృతిక కేంద్రాలు తమ ప్రోగ్రామ్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కళ మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి కనీసం 42 ప్రాంతీయ పండుగలను నిర్వహిస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలు దేశంలోని వివిధ జానపద కళలు మరియు సంస్కృతిని పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి అనేక పథకాలను కూడా అమలు చేయనున్నాయి.

వారణాసిలో రెండు రోజుల ఆరోగ్య మంత్రుల సదస్సు

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC) డే 2022 జ్ఞాపకార్థం, వారణాసిలో 2-రోజుల జాతీయ ఆరోగ్య మంత్రుల సమ్మేళనం నిర్వహించబడింది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరచడం మరియు విధాన సంస్కరణల ద్వారా హెల్త్ & వెల్‌నెస్ సెంటర్‌లను (HWCలు) బలోపేతం చేయడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రారంభించారు.

భోపాల్‌లో 8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్

8వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2022 నుండి వచ్చే ఏడాది జనవరి 21 నుండి 24 మధ్య భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించబడుతోంది. ఈ ఫెస్టివల్‌కు దాదాపు 5,000 మంది ఆహ్వానిత ప్రతినిధులు మరియు 10,000 మంది స్థానిక సందర్శకులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇది 2015 నుండి ఏటా నివహిస్తున్నారు.

28వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

28వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 డిసెంబర్ 15 నుండి 22 వరకు కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ ఏడాది 42 దేశాల నుండి 130 చలనచిత్రాలు మరియు 52 లఘు మరియు డాక్యుమెంటరీ చిత్రాలను ఈ 7 రోజులలో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్ సమాచార మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ నిర్వహిస్తుంది. ప్రారంభ వేడుకలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అమితాబ్ బచ్చన్ , జయా బచ్చన్, షారుఖ్ ఖాన్ , రాణి ముఖర్జీ మరియు క్రికెటర్ సౌరవ్ గంగూలీ హాజరయ్యారు. దీనిని 1995 లో మొదటిసారి ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా తొమ్మిది ఉత్పత్తులకు జిఐ ట్యాగ్

భారత ప్రభుత్వం కొత్తగా వివిధ రాష్ట్రాల నుండి 9 కొత్త ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ని మంజూరు చేసింది. ఈ 9 ట్యాగ్‌లలో ఐదు కేరళ ఉత్పత్తులకు ఇవ్వబడింది. దీంతో భారతదేశంలో నమోదైన జిఐ ఉత్పత్తుల సంఖ్య 432కి చేరింది.

భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ అనేది ప్రత్యేక ఆహార మరియు తయారు చేసే ఉత్పత్తులకు అందిస్తారు. ఇది ఒకరకంగా సదురు ఉత్పత్తికి సంబంధించి పెటెంట్ హక్కు లాంటిది. అత్యధిక జిఐ ట్యాగ్‌లు కలిగిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక మరియు తమిళనాడు, కేరళ (35) లు మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ (34), మరియు మహారాష్ట్ర (31) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి రాష్ట్రం
గామోసా : అస్సాం ప్రజలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన సాంప్రదాయ వస్త్రం. పూజ మరియు 'నామ్ ప్రసంగ్'కు సంబంధించిన అన్ని ఆచారాలలో, గామోసాను పురుషులు మరియు మహిళలు ఇద్దరూ మెడకు చుట్టుకుంటారు. అస్సాం
అలీబాగ్ వైట్ ఆనియన్ : మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్ తహసీల్‌లో కనిపించే ఈ ప్రత్యేకమైన ఉల్లిపాయకు సాధారణంగా మార్కెట్‌లో లభించే ప్రామాణిక ఉల్లిపాయల వంటి బలమైన వాసన ఉండదు. ఇది ఇతర ఉల్లిపాయల కంటే భిన్నమైన తీపి రుచిని కలిగి ఉంటుంది. మహారాష్ట్ర
తాండూరు రెడ్‌గ్రామ్ : పావురం బఠానీ (ఎర్ర కందులు) గా పిలుచుకునే ఈ పప్పు ప్రాంతీయ వైవిధ్యంతో తాండూరు మరియు చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాలలో పండిస్తారు. ఇది పూర్తి వర్షాధార పంట. ఇందులో 22-24% ప్రోటీన్ ఉంటుంది, ఇది ఇతర తృణధాన్యాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణ
రక్తసేయ్ కార్పో ఆప్రికాట్‌ : లడఖ్ యందు ముప్పై రకాల ఆప్రికాట్‌లు (నేరేడు పండు) కనిపిస్తాయి. అయితే రక్ష్‌సే కార్పో రకం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనది. సాటిలేని రుచితో, తెలుపు కెర్నల్‌ రంగుతో ఇది ప్రత్యేకత సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నేరేడు పండులో గోధుమ గింజల రాళ్లు ఉంటాయి. అయితే, రాక్సే కార్పో పండు యొక్క విత్తనాలు తెల్లటి విత్తన రాళ్లను కలిగి ఉంటాయి. లడఖ్
అట్టప్పాడి తువర : కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అట్టప్పాడి గిరిజన ప్రాంతంలో కనిపించే ఒక ముఖ్యమైన సాంప్రదాయ పంట. ఇది చెక్కతో కూడిన పొద. గిరిజన ప్రజల జీవనోపాధికి భద్రత కల్పించడం కోసం కేరళ ప్రభుత్వం అట్టప్పాడి మిల్లెట్ విలేజ్ కార్యక్రమం కింద ఈ ప్రాంతంలోని సాంప్రదాయ పంటలను సంరక్షించేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. కేరళ
కాంతల్లూరు వట్టవాడ వెలుతుల్లి : కాంతళ్లూరు మరియు వట్టవాడ పంచాయతీలో కనిపించే ఈ వెల్లుల్లి, ఇతర ప్రాంతలతో పోల్చితే ఇది ప్రత్యేక రుచి, ఘాటు, రుచి, ఔషధ గుణాలు మరియు ఎక్కువ షెల్ఫ్ జీవితానికి ప్రసిద్ధి చెందింది. దీనిని స్థానికంగా కొన్నిసార్లు సింగపూండు అని పిలుస్తారు. కేరళ
కొడంగల్లూర్ పొట్టువెల్లారి (కొడంగల్లూర్ స్నాప్ మెలోన్) : జ్యూస్ తయారీకి ఉపయోగించే ఈ పండు కేరళలో ప్రాంతంలో ప్రత్యేకత కలిగి ఉంది. వేసవిలో, కొడంగల్లూర్, త్రిస్సూర్, పరవూరు మరియు ఎర్నాకులంలో రోడ్డుపై పొట్టువెల్లారి జ్యూస్ స్టాల్స్ సాధారణ దృశ్యం. దీని కూరగాయగా కూడా ఉపయోగిస్తారు. కేరళ
అట్టప్పాడి ఆట్టుకొంబు అవరా : గిరిజనలు పండించే ఒక ప్రత్యేక కూరగాయ పంట కేరళ
ఒనాట్టుకర ఎల్లు సీమ్‌సేమ్ (నువ్వులు) : ఒనాట్టుకర ప్రాంతంలో పండించే పురాతన మరియు సాంప్రదాయ వార్షిక నూనెగింజల పంట. కేరళ

మాంగ్‌డెచ్చు హైడ్రో ప్రాజెక్టు భూటాన్‌కు అప్పగింత

భారతదేశ సహాయంతో నిర్మించిన 720 మెగావాట్ల మాంగ్డెచ్చు జలవిద్యుత్ ప్రాజెక్ట్, భూటాన్‌లోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ (డిజిపిసి)కి అప్పగించబడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇండియా ఆర్థిక సహాయంతో పాటుగా ఇంజనీరింగ్ సహాయాన్ని కూడా అందించింది. ఈ ప్రాజెక్ట్‌ను అప్పగించడంతో, భారతదేశం మరియు భూటాన్ నాలుగు మెగా జలవిద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందం విజయవంతంగా పూర్తియింది.

ఇంటర్నేషనల్ అఫైర్స్ - డిసెంబర్ 2022

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) కన్నుమూత

1989లో టియానన్మెన్ అణిచివేత తర్వాత ఒక దశాబ్దం పాటు దేశాన్ని వేగవంతమైన ఆర్థిక వృద్ధికి నాయకత్వం వహించిన మాజీ చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ తన 96వ యేటా అనారోగ్యంతో మరణించారు. జియాంగ్ జెమిన్ 1993 నుండి 2003 వరకు చైనా అధ్యక్షులుగా పని చేసారు. అదే సమయంలో 1989 నుండి 2002 వరకు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉన్నారు.

మంకీపాక్స్ వ్యాధికి కొత్త పేరును సిఫార్సు చేసిన డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ నిపుణులతో వరుస సంప్రదింపుల తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌కు కొత్త పేరును సిఫార్సు చేసింది. ఇందులో భాగంగా మంకీపాక్స్‌కు పర్యాయపదంగా "mpox" అనే కొత్త పేరును ఉపయోగించనున్నట్లు తెలిపింది.

మంకీపాక్స్‌ అనేది mpox వైరస్ వల్ల కలిగే అరుదైన వ్యాధి. ఈ వైరస్ సాధారణంగా ఎలుకలు లేదా కోతులు వంటి మానవరహిత ప్రైమేట్‌లను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికా దేశాలలో కనిపిస్తుంది.

అంతర్జాతీయ లూసోఫోన్ ఫెస్టివల్ 2022

అంతర్జాతీయ లూసోఫోన్ ఫెస్టివల్ డిసెంబర్ 3 నుండి 6 వరకు గోవాలో ఘనంగా నిర్వహిచారు. ఈ ఫెస్టివల్ నిర్వహణలో విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మరియు గోవా ప్రభుత్వం భాగస్వామ్యం అయ్యాయి. అంతర్జాతీయ లూసోఫోన్ ఫెస్టివల్‌ను డిసెంబర్ 3న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించారు.

లూసోఫోన్ ఫెస్టివల్ అనేది పోర్చుగీస్ భాష మరియు సంస్కృతిక వేడుక. కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ (CPLP) సభ్య దేశాలతో మన ఆర్థిక, సాంస్కృతిక సహకారం మరియు ప్రజల నుండి ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఈ వేడుక నిర్వహిస్తున్నారు.

ఇటలీలో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ప్రారంభ వేడుక

ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం 2023 యొక్క ప్రారంభ వేడుకను ఇటలీలోని రోమ్‌లో నిర్వహించనుంది. ఇదివరకే భారత్ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితికి విన్నపించింది.

పెరూ మొదటి మహిళా అధ్యక్షురాలిగా డినా బోలువార్టే

పెరూ మొదటి మహిళా అధ్యక్షురాలిగా డినా బోలువార్టే ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికలో ప్రత్యర్థి ఫుజిమోరిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు. దీనితో గత ఐదేళ్లలో పెరూ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 6వ వ్యక్తిగా నిలిచారు. 130 మంది సభ్యులతో కూడిన పెరూ శాసనమండలిలో మెజారిటీ 101 మంది సభ్యులు మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ఓటుతో తెలగించడంతో ఈ ఎన్నిక జరిగింది.

ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా "గోబ్లిన్ మోడ్"

ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌ 2022 గా "గోబ్లిన్ మోడ్" ఎంపిక చేయబడింది. ఈ పదం మొదటిసారి జనరల్ పబ్లిక్ ఓటింగు ద్వారా ఎంపిక చేయబడింది. ఆక్స్‌ఫర్డ్ లెక్సికోగ్రాఫర్‌లచే ఇటీవలే ఎంపిక చేయబడిన "మెటావర్స్" పదంకు "గోబ్లిన్ మోడ్" పదంకు మధ్య ఓటింగు నిర్వహించగా, గోబ్లిన్ మోడ్ వర్డుకు అత్యధిక మంది ఓటు వేశారు. ఈ ఓటింగ్ యందు 340,000 మంది వ్యక్తులు పాల్గొనగా, గోబ్లిన్ మోడ్‌కు 318,956 ఓట్లు వచ్చాయి.

మొదటి లూనార్ రోవర్ ఆవిష్కరించిన యూఏఈ

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ మొదటి లూనార్ రోవర్ రషీద్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇది స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో డిసెంబర్ 12న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి ప్రయోగించబడింది. రషీద్ రోవర్‌ను దుబాయ్‌లోని మహ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ రూపొందించింది. దీనికి సంబందించిన ఇంజనీరింగ్ సాంకేతికతను జపాన్ స్టార్టప్ హకుటో-ఆర్ నుండి తీసుకుంది.

కెనడాలో బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2022

15వ ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ (COP15) కెనడాలోని మాంట్రియల్‌లో డిసెంబర్ 7 నుండి 19 మధ్య నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకృతి వనరులను రక్షించడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టడంపై దృష్టి సారిస్తున్నారు. 2030 నాటికి 30 శాతం భూములు మరియు మహాసముద్రాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేయనున్నారు.

COP15 సంబంధించి ఇవి రెండవ దశ సమావేశాలు. మొదటి దశ సమావేశాలు ఇది వరకు చైనాలో నిర్వహించబడ్డాయి. బయోలాజికల్ డైవర్సిటీపై కన్వెన్షన్ (CBD) మొదటిసారి 1992 రియో ​​ఎర్త్ సమ్మిట్‌లో ద్వారా ప్రారంభించారు. దీనికి సంబందించిన తీర్మానంపై 150 మంది ప్రభుత్వ నాయకులు సంతకం చేశారు.

న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగంలో చారిత్రాత్మక పురోగతి

అమెరికా పరిశోధకులు చారిత్రాత్మక న్యూక్లియర్ ఫ్యూజన్ పురోగతిని ప్రకటించారు. ఇది ప్రత్యామ్నాయ సహజ ఇంధన వనరులకు మార్గం సుగమం చేయనున్నట్లు ప్రకటించారు. అమెరికాకు చెందిన లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ లాబొరేటరీ (LLNL) పరిశోధకులు సూర్యుని నుండి శక్తి ఉద్భవించే ఫ్యూజన్ రియాక్షన్‌ మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద లేజర్‌ని మొదటిసారిగా రూపొందించారు.

ఈ ప్రయోగం రాబోయే కాలంలో శిలాజ ఇందనలపై మానవులు ఆధారపడటాన్ని తగ్గించవచ్చు అని ప్రకటించారు. సూర్యుని వాలే అపరిమితమైన కార్బన్ ఫ్రీ ఎనర్జీ ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయొచ్చు అని ప్రయోగాత్మకంగా నిరూపించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టుగా సర్ జెరెమీ ఫరార్‌

చైనీస్ ప్రయోగశాల నుండి కోవిడ్ లీక్ కావచ్చనే సూచనలను అణిచివేయడంలో సహాయపడిన ప్రభావవంతమైన బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ జెరెమీ ఫరార్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నూతన చీఫ్ సైంటిస్టుగా నియమితులయ్యారు. సౌమ్య స్వామినాథన్ స్థానంలో జెరెమీ ఫర్రార్ 2023 రెండవ త్రైమాసికంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరనున్నారు. ఈయన 2013 నుండి వెల్‌కమ్ ట్రస్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.

సింగపూర్‌లో 17వ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ సమావేశం

అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 17వ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతీయ సమావేశం డిసెంబర్ 6-9 తేదీలలో సింగపూర్‌లో నిర్వహించారు. ఈ వేదిక ద్వారా ఆసియా, పసిఫిక్ మరియు అరబ్ రాష్ట్రాల్లో ఉపాధి మరియు పని ప్రపంచాన్ని ప్రభావితం చేసేవివిధ సమస్యలపై చర్చించారు. ఈ మీటింగ్ ముగింపు చర్చలు సింగపూర్ స్టేట్మెంట్ పేరుతొ ముగించారు.

న్యూజిలాండులో సిగరెట్లను నిషేధిస్తూ చట్టం

న్యూజిలాండ్ ప్రభుత్వం భవిష్యత్ తరాల కోసం సిగరెట్లను నిషేధించే చట్టాన్ని ఆమోదించింది. వచ్చే ఏడాది నుండి దాదాపుగా పొగాను నిషేదించనుంది. ఈ కొత్త ధూమపాన నిరోధక చట్టంలో భాగంగా న్యూజిలాండ్ దేశస్థుల భవిష్యత్ తరాలు పొగాకును కొనుగోలు చేయకుండా నిషేధించబడతాయి.

2025 నాటికి ధూమపాన రహితంగా మారాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2010లో భవిష్యత్ తరాల కోసం ధూమపానాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. అయితే సిగరెట్ అమ్మకాలను నిషేధించిన ఏకైక దేశంగా భూటాన్ ఉంది.

డెన్మార్క్ ప్రధానమంత్రిగా మెట్టె ఫ్రెడరిక్సెన్

డెన్మార్క్ ప్రధానమంత్రిగా మెట్టె ఫ్రెడరిక్సన్ తిరిగి ఎన్నికయ్యారు. ఆమె 2019 లో డెన్మార్క్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. తాజాగా డిసెంబరు 13 2022న జరిగిన ఆ దేశ ఎన్నికలలో ఆమె తిరిగి విజేతగా నిలిచారు. విజయం సాధించినప్పటికీ, సోషల్ డెమోక్రటిక్ మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ఫ్రెడరిక్సెన్, లిబరల్స్ మరియు మోడరేట్‌లతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంను ఏర్పాటు చేసారు.

యూఎన్ మహిళా కమిషన్ నుండి ఇరాన్ తొలగింపు

మహిళలు మరియు బాలికలపై ఇరాన్ ప్రభుత్వం యొక్క దైహిక అణచివేతకు ప్రతిస్పందనగా ఐక్యరాజ్యసమితి మహిళా హక్కుల కమిషన్ నుండి ఇరాన్‌ను తొలగించింది. దీనికి సంబంధించి 54-సభ్యుల ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ECOSOC)  ఇరాన్‌ను కమిషన్ నుండి తొలగించే తీర్మానాన్ని ఆమోదించింది.

కస్టడీలో ఉన్న యువతి మరణం, టెహ్రాన్ అణిచివేత తర్వాత యునైటెడ్ స్టేట్స్ దీనికి సంబంధించిన తక్షణ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ముందు ఉంచింది. ఈ ప్రతిపాదనకు యూఎన్ సభ్య దేశాలు ఏకాభిప్రాయంతో ఓటు వేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి ఇదివరకే తన 2021 రిపోర్టులో ఇరాన్ మహిళలు ఆదేశ సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా బతుకుతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చింది.

యూఎస్ స్వలింగ సంపర్కుల సమాఖ్య రక్షణ చట్టంపై బిడెన్ సంతకం

యునైటెడ్ స్టేట్స్‌లో స్వలింగ మరియు వర్ణాంతర వివాహాలకు రక్షణ కల్పించే చట్టంపై అధ్యక్షుడు జో బిడెన్ సంతకం చేశారు. స్వలింగ సంఘాలను చట్టబద్ధం చేయాలనే 2015 నిర్ణయాన్ని యూఎస్ సుప్రీం కోర్ట్ ఒబెర్జెఫెల్ v. హోడ్జెస్‌ను తిరస్కరిస్తే, దీనికి విరుద్దంగా స్వలింగ సంపర్కుల వివాహాలను రక్షణ కల్పిస్తూ బిడెన్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం కులాంతర వివాహాలకు కూడా రక్షణ కల్పిస్తుంది.

నాసా నుండి సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ (SWOT) మిషన్

భూమి యొక్క ఉపరితలంపై ఉన్న దాదాపు మొత్తం నీటిని ట్రాక్ చేయడానికి నాసా సరికొత్త సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ (SWOT) అనే ఇంటెర్నేషన్ మిషన్ ప్రారంభించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్‌లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ 4E నుండి డిసెంబర్ 16నా స్పేస్‌క్రాఫ్ట్ ఆన్‌బోర్డ్‌తో స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగించింది.

ఈ ప్రయోగంలో నాసాతో పాటుగా ఫ్రాన్సుకు చెందిన సెంటర్ నేషనల్ డి'ఎటూడ్స్ స్పేషియల్స్ (CNES) కూడా బాగస్వామ్యమయ్యింది. అలానే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA) మరియు యూకే స్పేస్ ఏజెన్సీ కూడా దీనికి సహకారాన్ని అందిస్తున్నాయి.

వేడెక్కుతున్న సముద్రాలు, విపరీతమైన వాతావరణం, అడవుల్లో మంటలు వంటి వాతావరణ మార్పుల కారణంగా మానవులు ఎదుర్కొనే భవిష్యత్ పరిణామాలును ఈ ప్రయోగం ద్వారా అంచనా వేయనున్నారు. ఈ సాటిలైట్ భూమి యొక్క మొత్తం ఉపరితలాన్ని 78 డిగ్రీల దక్షిణం మరియు 78 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య కనీసం 21 రోజులకు ఒకసారి కవర్ చేస్తుంది. రోజుకు ఒక టెరాబైట్ ప్రాసెస్ చేయని డేటాను నాసాకు పంపుతుంది.

ఐర్లాండ్ కొత్త ప్రధానిగా లియో వరద్కర్

భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్ రెండోసారి ఐర్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 43 ఏళ్ల వరద్కర్, 2017 మరియు 2020 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన నాయకుడుగా మరియు మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడైన ప్రధాన మంత్రిగా లియో వరద్కర్  ఘనత సాధించారు.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌కు యూఏఈ ఆతిధ్యం

2024 ఫిబ్రవరిలో నిర్వహించే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 13 వ మంత్రివర్గ సమావేశంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి ఆతిధ్యం ఇవ్వనుంది. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP28) యొక్క 28వ సెషన్‌ను అనుసరిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై చర్చింది, నిర్ణయాలు తీసుకోవడానికి రెండేళ్ళకో ఒకసారి ఈ సమావేశం నిర్వహిస్తారు.

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే మరియు సులభతరం చేసే ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ. దీనిని 1995 లో ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండులోని జెనీవాలో ఉంది. దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్'గా డా న్గోజీ ఒకోంజో-ఇవేలా ఉన్నారు.

మయన్మార్‌పై మొట్టమొదటి తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ఎస్‌సీ

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 74 సంవత్సరాలలో మయన్మార్‌ సంబంధించి మొట్టమొదటి తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆ దేశంలో కొనసాగుతున్న హింసను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. బహిష్కరించబడిన ఆ దేశ ప్రధాని ఆంగ్ సాన్ సూకీతో సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛ మరియు చట్ట పాలనను గౌరవించాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న మిలటరీ అధ్యక్షుడు జుంటాను కోరింది.

దాదాపు రెండు సంవత్సరాల క్రితం మయన్మార్‌ సైన్యం, ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆమెను బలవంతంగా బంధించింది. ప్రజా అసమ్మతిని హింసాత్మకంగా అణిచివేసింది. ఈ క్రమంలో ఎంతో మంది పౌరులు మరణించారు. గత రెండేళ్లుగా ఆంగ్ సాన్ సూకీ ఖైదీగా ఉన్నారు.

మయన్మార్ సంక్షోభంపై చర్యలకు చైనా, రష్యాలు ఇన్నాళ్లు వ్యతిరేకంగా వాదించడంతో, ఈ అంశంపై ఎలా వ్యవహరించాలనే దానిపై 15 మంది సభ్యుల కౌన్సిల్ చాలా కాలంగా చర్చలు జరిపింది. తాజాగా జరిగిన ఈ ఓటింగులో భారత్‌తోపాటు ఆ రెండు దేశాలు దూరంగా ఉన్నాయి. మిగిలిన 12 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీనితో సూకీ మరియు మాజీ అధ్యక్షుడు విన్ మైంట్‌తో సహా ఏకపక్షంగా నిర్బంధించబడిన ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలని తీర్మానం జుంటాను కోరింది.

ఫిజీ కొత్త ప్రధానమంత్రిగా సితివేని రబుకా

సితివేని రబుకా, ఫిజీ 12వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ చిన్న పసిఫిక్ ద్వీప దేశంలో కొద్దీ కాలంగా రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. ఇటీవలే జరిగిన ఆ దేశ ఎన్నికలలో హంగ్ పార్లమెంట్‌ ఏర్పాటు అయ్యింది. దీనితో గత 16 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఫ్రాంక్ బైనిమరామకు, సితివేని రబుకాకు పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకోవాల్సి వచ్చింది.

దీనికి సంబంధించి నిర్వహించిన రహస్య పార్లమెంటరీ ఓటింగులో 28 మంది పార్లమెంటు సభ్యులు రబుకాకు ఓటు వేయగా, 27 మంది బైనిమరామకు మద్దతుగా ఓటు వేశారు. దీనితో సితివేని రబుకా నేతృత్వంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.

ఫిజీ, దక్షిణ పసిఫిక్‌లోని ఒక చిన్న దేశం. ఇది ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండంలో ఉంది. 300 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహంలో 9 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. ఫిజీ రాజధాని నగరంగా సువా, ఈ దేశ కరెన్సీ ఫిజియన్ డాలర్.

వార్తల్లో వ్యక్తులు - డిసెంబర్ 2022

అవని లేఖరాకు పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు

టోక్యో 2020 పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన పారా షూటర్ అవని లేఖరా పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ఇయర్ 2022 అవార్డును అందుకుంది. అలానే మాజీ రంజీ క్రికెటర్ సర్కార్ తల్వార్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ఆధ్వర్యంలో ఫెడరేషన్ హౌస్‌లో జరిగిన ఫిక్కీ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుకలో వీటిని అందించారు.

ఎన్‌సిబిసి చైర్‌పర్సన్‌గా హన్స్‌రాజ్ అహిర్

జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్‌పర్సన్‌గా హన్సరాజ్ గంగారామ్ అహిర్ నియమితులయ్యారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన హన్సరాజ్ వృత్తిరీత్యా వ్యవసాయకుడు.

హన్సరాజ్ గంగారామ్ అహిర్ మహారాష్ట్రలోని చంద్రపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. అతను 16వ లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరియు భారత ప్రభుత్వంలోని రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు

ఐసీఏఐ అధ్యక్షుడిగా విజేందర్ శర్మ

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా విజేందర్ శర్మ మరియు వైస్ ప్రెసిడెంట్‌గా రాకేష్ భల్లా ఎన్నికయ్యారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది దేశంలో ఒక ప్రొఫెషనల్ అకౌంటెన్సీ బాడీ. ఇది భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది.

ఓఎన్‌జీసీ చైర్మన్‌గా అరుణ్ కుమార్ సింగ్

ఆయిల్ రిఫైనింగ్ మరియు మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్ మాజీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్, ఓఎన్‌జీసీ యొక్క నూతన ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వచ్చే మూడేళ్ళ కాలానికి ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఓఎన్‌జీసీ ఏప్రిల్ 2021 నుండి రెగ్యులర్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ లేకుండా ఉంది.

పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో బోర్డు-స్థాయి స్థానానికి 58 ఏళ్లకు మించిన వ్యక్తులకు నియమానించే అవకాశం లేదు. అయితే తాజాగా 60 ఏళ్లు మించకూడదని మంత్రిత్వ శాఖ నిబంధనలను మార్చింది. పదవీ విరమణ చేసిన వ్యక్తిని అధిపతిగా నియమించడం ఇదే మొదటిసారి.

అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ కుమార్

గ్రూప్ఎమ్ మీడియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సౌత్ ఏషియా సీఈఓ ప్రశాంత్ కుమార్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI) యొక్క నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలానే హవాస్ గ్రూప్ ఇండియా గ్రూప్ సీఈవో రాణా బారువా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అడ్వర్టైజింగ్ ఏజన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI) అనేది ప్రకటనల ఏజెన్సీల యొక్క అధికారిక, జాతీయ సంస్థ, ఇది ప్రకటనల ఏజెన్సీల ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ఏర్పడింది.

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండవసారి డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేసారు. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 182 సీట్లకు గాను 156 సీట్లతో భారీ మెజారిటీని గెలుచుకుని వరుసగా 6వ సారి అధికారం నిలబెట్టుకుంది.

14వ గుజరాత్ శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది 18 ఫిబ్రవరి 2023న ముగియనుంది. ఈ గడువు ముగిచేలోపే 15వ శాసనసభ ఏర్పాటు జరిగింది. 2017 లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ రూపానీ ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ రూపానీ 11 సెప్టెంబర్ 2021న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతని తర్వాత సెప్టెంబర్ 21న భూపేంద్ర పటేల్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ ప్రమాణ స్వీకారం

హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్‌విందర్ సింగ్ సుఖు డిసెంబర్ 11 న సిమ్లాలోని చారిత్రక రిడ్జ్‌లో ప్రమాణస్వీకారం చేసారు. ఇదే కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చేతుల మీదిగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరయ్యారు.

12 నవంబర్ 2022న జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 సీట్లు, బీజేపీ 25 సీట్లు మరియు స్వతంత్రులు 3 గెలుపొందారు. 1985 నుండి హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ తర్వాత ఎన్నికలో విజయం సాధించలేదు.

నాబార్డ్ కొత్త చైర్మన్‌గా కేవీ షాజీ

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) కొత్త ఛైర్మన్‌గా షాజీ కెవి బాధ్యతలు స్వీకరించారు. షాజీ కెవి గతంలో నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టరుగా విధులు నిర్వర్తించారు.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు అపెక్స్ కోఆపరేటివ్ బ్యాంకులను నియంత్రణ కోసం ఒక అపెక్స్ రెగ్యులేటరీ బాడీ. దీనిని 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 100 కోట్ల ప్రారంభ మూలధనంతో ఏర్పాటు చేసారు. దీని చెల్లింపు మూలధనం 31 మార్చి 2022 నాటికి 17,080 కోట్లుగా ఉంది.

జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఎండీగా మీనేష్ సి షా

నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా మీనేష్ సి షా బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ అనేది భారత పార్లమెంటు చట్టం ద్వారా 1965లో ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది భారత ప్రభుత్వం యొక్క ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఉంది. దీని ప్రధాన కార్యాలయం గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ నగరంలో ఉంది.

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మొదటి వైస్ ప్రెసిడెంట్‌గా సుస్మితా శుక్లా

భారతీయ సంతతికి చెందిన సుస్మితా శుక్లా, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ యొక్క మొదటి వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం మార్చి 2023 నుండి అమలులోకి వస్తుంది. ఈ నియామకాన్ని ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ యొక్క గవర్నర్ల బోర్డు ఆమోదించింది.

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ అనేది యునైటెడ్ స్టేట్స్ యొక్క 12 ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌లలో ఒకటి. ఇది ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ యొక్క సెకండ్ డిస్ట్రిక్ట్ అండ్ ది నేషన్‌కు సేవలు అందిస్తోంది. ఓపెన్ మార్కెట్ కమిటీ తరపున ద్రవ్య విధానాన్ని అమలు చేస్తుంది మరియు మొత్తం ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ యొక్క మార్కెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

ఎంసీడీ తొలి ట్రాన్స్‌జెండర్ కౌన్సిలరుగా బాబీ కిన్నర్

ఇటీవలే జరిగిన ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బాబీ కిన్నర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మొదటి ట్రాన్స్‌జెండర్ కౌన్సిలరుగా నిలిచారు. ఈమె సుల్తాన్‌పురి-ఎ వార్డు నుండి భారతీయ జనతా పార్టీకి చెందిన ఏక్తా జాతవ్ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన వరుణను ఓడించడం ద్వారా ఈ ఘనతను సాధించింది. బాబీ కిన్నర్ ప్రస్తుతం ఢిల్లీ యూనిట్ సంబంధించి హిందూ యువ సమాజ్ ఏక్తా అవామ్ యాంటీ టెర్రరిజం కమిటికీ అధ్యక్షరాలుగా కూడా ఉన్నారు.

తమిళనాడు కేబినెట్‌లో ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర యువజన సంక్షేమం మరియు క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిగా డిసెంబర్ 14న తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయనిధి స్టాలిన్ ఇదివరకు డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. ఈయన తమిళనాడులోని చెపాక్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే విజయం సాధించారు. ఉదయనిధి ఇదివరకు కొన్ని తమిళ్, తెలుగు సినిమాలలో నటించారు.

శ్రీ అరబిందో 150వ జయంతిలో పాల్గొననున్న మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13 డిసెంబర్ 2022న 5 శ్రీ అరబిందో 150వ జయంతిని పురస్కరించుకున్నారు. శ్రీ అరబిందో గౌరవార్థం స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంప్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో పుదుచ్చేరిలోని కంబన్ కలై సంగమ్‌లో ఈ వేడుకను నిర్వహించారు.

శ్రీ అరబిందో బెంగాల్‌లో పుట్టి గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, హిందీ మరియు సంస్కృతంతో సహా అనేక భాషలు తెలిసినందున ఆయన జీవితం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'కి ప్రతిబింబమని ప్రధాన మంత్రి అన్నారు. బెంగాల్ విభజన సమయంలో తాను చేసిన 'రాజీ లేదు' నినాదాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు.

ఆయన సైద్ధాంతిక స్పష్టత, సాంస్కృతిక బలం, దేశభక్తి ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులకు ఆదర్శంగా నిలిచాయి. లోతైన తాత్విక మరియు ఆధ్యాత్మిక అంశాలపై పట్టుదలతో ఉండే శ్రీ అరబిందో యొక్క ఔనుత్యాన్ని ప్రధాని తెలియజేసారు.

శ్రీ అరబిందో 1872 లో అప్పటి కలకత్తా నగరంలో జన్మించారు. భారతీయ తత్వవేత్తగా, యోగిగా, మహర్షిగా, కవిగా మరియు భారతీయ జాతీయవాదిగా ప్రసిద్ధి చెందారు. వందేమాతరం వంటి వార్తాపత్రికలకు సంపాదకుడుగా పనిచేశారు. బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం కోసం భారతీయ ఉద్యమంలో చేరాడు, 1910 వరకు ఉద్యమంలో ప్రభావవంతమైన నాయకులలో ఒకడుగా నిలిచారు, ఆపై ఆధ్యాత్మిక సంస్కర్తగా మారాడు, మానవ పురోగతి మరియు ఆధ్యాత్మిక పరిణామంపై తన దృష్టిని పరిచయం చేశాడు.

మిసెస్ వరల్డ్ 2022 విజేతగా సర్గమ్ కౌశల్

భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబయికి చెందిన ఈమె 63 దేశాలకు చెందిన పోటీదారులను ఓడించి, 21 సంవత్సరాల తర్వాత టైటిల్‌ను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చింది. 2001లో నటి-మోడల్ అదితి గోవిత్రికర్ చివరిగా ఇండియా నుండి మిసెస్ వరల్డ్ గౌరవం అందుకున్నారు.

వెస్ట్‌గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన ఈ కార్యక్రమంలో ముంబైకి చెందిన శ్రీమతి కౌశల్‌కు అమెరికాకు చెందిన మిసెస్ వరల్డ్ 2021 షైలిన్ ఫోర్డ్ కిరీటాన్ని బహూకరించారు. శ్రీమతి పాలినేషియా మొదటి రన్నరప్‌గా ఎంపికైంది.

సౌదీ అరేబియాలో భారత రాయబారిగా సుహెల్ అజాజ్ ఖాన్

సౌదీ అరేబియాలో తదుపరి భారత రాయబారిగా డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ నియమితులయ్యారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ లెబనాన్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

50 మంది ప్రపంచ గొప్ప నటుల జాబితాలో షారుఖ్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అంతర్జాతీయంగా 50 మంది గొప్ప నటుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడుగా నిలిచాడు. ప్రముఖ బ్రిటీష్ మ్యాగజైన్ ఎంపైర్ రూపొందించిన  జాబితాలో లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డి నిరో, హీత్ లెడ్జర్, డెంజెల్ వాషింగ్టన్, ఆంథోనీ మార్లోన్ వంటి హాలీవుడ్ నటులతో పాటు షారుఖ్ ఖాన్ ఈ గౌరవం అందుకున్నారు.

ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క శర్మ

ప్యూమా ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి అనుష్క శర్మను నియమించింది. జర్మానికీ చెందిన ఈ స్పోర్ట్స్ బ్రాండ్ క్రీడాకారుల పాదరక్షలు, దుస్తులు మరియు ఉపకరణాలను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేస్తుంది. ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడరర్లుగా ఇప్పటికే కరీనా కపూర్, మేరీ కోమ్, యువరాజ్ సింగ్ వంటి ప్రముఖలు ఉన్నారు.

NHAI చైర్మన్‌గా సంతోష్ కుమార్ యాదవ్

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నూతన చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ సంతోష్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. యూపీ కేడర్, 1995-బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారైనా సంతోష్ కుమార్, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అదనపు సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.

బ్రెజిల్ లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే కన్నుమూశారు

బ్రెజిల్ దేశానికి రికార్డు స్థాయిలో మూడు ప్రపంచ కప్‌లు అందించిన ఫుట్‌బాల్ లెజెండ్ పీలే 82 ఏళ్ల వయసులో కాన్సరుతో కన్నుమూశారు. సాకర్ యొక్క గొప్ప ఆటగాళ్ళ జాబితాలో ఒకరిగా ప్రసిద్ధి పొందిన పీలే, 21 సంవత్సరాల తన కెరీర్‌లో 1,363 మ్యాచ్‌లలో 1,281 గోల్స్ నమోదు చేసాడు. తన దేశం తరుపున 92 మ్యాచ్‌లలో 77 గోల్స్‌తో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు.

1958, 1962 మరియు 1970లో మూడుసార్లు ఫిఫా ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆల్ టైమ్ ఏకైక ఆటగాడుగా పీలే గుర్తింపు పొందాడు. 2000లో ఫిఫా యొక్క ప్లేయర్ ఆఫ్ ది 20th సెంచరీ (20వ శతాబ్దపు ఆటగాడు) గౌరవం అందుకున్నాడు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాసిమెంటో. ఈయన 23 అక్టోబర్ 1940 లో బ్రెజీల్ లోని మినాస్ గెరైస్ రాష్ట్రంలో జన్మించారు.

ఎఫ్ఎస్ఎస్ఎఐ సీఈఓగా గంజి కమల వర్ధనరావు

ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) యొక్క నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా గంజి కమల వర్ధనరావు నియమితులయ్యారు. కేరళ కేడరుకు చెందిన వర్ధనరావు, 1990 బ్యాచుకు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్. ఈయన గతంలో సెంట్రల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా కూడా పనిచేసారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ క్రింద స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. ఇది ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం 2008లో స్థాపించబడింది, ఇది భారతదేశంలో ఆహార భద్రత మరియు నియంత్రణకు సంబంధించిన కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

 

ప్రభుత్వ పథకాలు & పాలసీలు - డిసెంబర్ 2022

మేఘాలయలో మెంటల్ హెల్త్ & సోషల్ కేర్ పాలసీ

మేఘాలయలో మెంటల్ హెల్త్ అండ్ సోషల్ కేర్ పాలసీకి కాన్రాడ్ సంగ్మా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో మానసిక ఆరోగ్యం మరియు సామాజిక సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని కలిగి ఉన్న దేశంలో మూడవ రాష్ట్రంగా అవతరించింది. అలానే ఈ పాలసీ ప్రవేశపెట్టిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా నిలిచింది.

మూడు విమానాశ్రయాల్లో డిజి యాత్ర ప్రారంభం

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణీకులను కాంటాక్ట్‌లెస్, సీమ్‌లెస్ ప్రాసెసింగ్‌ను అందించేందుకు రూపొందించిన డిజి యాత్రను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా డిసెంబర్ 1న ప్రారంభించారు. ప్రస్తుతం దీనిని న్యూఢిల్లీ, వారణాసి, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీనికి సంబంధించి ప్రయాణికుల నుండి ఆధార్ ఆధారిత ధ్రువీకరణ మరియు స్వీయ-చిత్రం క్యాప్చర్‌ని ఉపయోగించి డిజి యాత్ర యాప్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. ఈ ప్రాజెక్ట్ ప్రయాణీకుల సౌకర్యాన్ని మరియు ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చనుంది.

అలానే ప్రయాణికుల వ్యక్తిగత సమాచారంకు పూర్తి భద్రత ఉంటుంది. ప్రయాణీకుల ఐడీ మరియు ప్రయాణ ఆధారాలు ప్రయాణీకుల స్మార్ట్‌ఫోన్‌లోనే సురక్షితమైన వాలెట్‌లో నిల్వ చేయబడతాయి. అప్‌లోడ్ చేసిన డేటా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది మరియు 24 గంటలలోపు సర్వర్‌ల నుండి డేటా మొత్తం తొలగించబడుతుంది.

భారత్, జర్మనీ మధ్య మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందం

భారత్, జర్మనీ దేశాలు ద్విపాక్షిక మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేసాయి.  డిసెంబర్ 5న ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మరియు జర్మనీ ఫెడరల్ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య విద్యా, ఉపాధి అవకాశాల కోసం వెళ్లే పౌరుల కదలికలను సులభతరం చేయనుంది.

హిమాలయన్ యాక్'కు ఫుడ్ యానిమల్ ట్యాగ్

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హిమాలయన్ యాక్‌కు 'ఫుడ్ యానిమల్' ట్యాగ్ అందించింది. సాంప్రదాయ పాలు మరియు మాంసం పరిశ్రమలో భాగం చేయడం ద్వారా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ బోవిన్ జంతువుల వృద్ధికి సహాయం అందించనున్నారు. మానవ ఆహార వినియోగం కోసం పెంచబడే క్షీరదం, పౌల్ట్రీ, కోడి, చేపలు లేదా ఇతర జంతువులను ఆహార జంతువులు అంటారు.

'దివ్య కళా మేళా' 2022 ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల పారిశ్రామికవేత్తలు/కళాకారుల ఉత్పత్తులు మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించే దివ్య కళా మేళా 2022 ఇండియా గేట్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం (కర్తవ్య మార్గం) వద్ద ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 2న కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించారు.

ఈ మేళాలో దాదాపు 22 రాష్ట్రాలు/యూటీల నుండి దాదాపు 200 మంది దివ్యాంగుల కళాకారులు మరియు వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులు మరియు నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.

మహారాష్ట్రలో ప్రత్యేక దివ్యాంగుల శాఖ ఏర్పాటు

దివ్యాంగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర అవతరించింది. వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక దివ్యాంగుల శాఖ ఏర్పాటు నిర్ణయానికి ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం నవంబర్ 29 న ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా సుమారు 1143 కోట్ల నిధులతో రాష్ట్రంలోని శారీరకంగా మరియు మానసికంగా వికలాంగులకు విద్యాపరంగా మరియు వృత్తిపరంగా ప్రత్యేక భరోసా కల్పించనున్నారు.

మేఘాలయలో ఆసియా మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ ప్రారంభం

మేఘాలయ ప్రభుత్వం స్టార్టప్ టెక్ ఈగల్ భాగస్వామ్యంతో ఆసియాలో మొట్టమొదటి డ్రోన్ డెలివరీ హబ్ మరియు నెట్‌వర్క్‌ను ఆవిష్కరించింది. దీనికి సంబంధించి మొదటి అధికారిక డ్రోన్ ఫ్లైట్ 5 డిసెంబర్ 2022 న జెంగ్జల్ సబ్ డివిజనల్ హాస్పిటల్ నుండి పదేల్‌డోబా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో మందులను డెలివరీ చేసింది.

ఇదే డెలివరీ రోడ్డు మార్గం ద్వారా అయితే 2.50 గంటల సమయం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రగ్స్, డయాగ్నస్టిక్ శాంపిల్స్, టీకాలు, రక్తం మరియు బ్లడ్ కాంపోనెంట్స్ వంటి కీలకమైన సామాగ్రిని త్వరగా మరియు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

త్వరలో వారణాసి & తమిళనాడు మధ్య కొత్త రైలు

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వారణాసి మరియు తమిళనాడు మధ్య 'కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్' పేరుతొ కొత్త రైలును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాశీ మరియు తమిళనాడు మధ్య అపురూపమైన సాంస్కృతిక బంధానికి గుర్తుగా ఉత్తరప్రదేశ్ మరియు తమిళనాడు మధ్య ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ కేటగిరీలో జమ్మూ కాశ్మీరుకు మొదటి బహుమతి

జమ్మూ కాశ్మీర్‌కు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ జనరేషన్ విభాగంలో 1వ బహుమతి మరియు టెలికన్సల్టేషన్ విభాగంలో 2వ బహుమతి లభించింది. డిసెంబర్ 10 మరియు 11వ తేదీల్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్‌లో నిర్వహించిన యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2022 వేడుకల సందర్భంగా ఈ అవార్డులు అందించారు.

పార్లమెంటులో ఎనర్జీ కన్జర్వేషన్ (సవరణ) బిల్లు 2022 ఆమోదం

ఎనర్జీ కన్జర్వేషన్ (సవరణ) బిల్లు 2022ను డిసెంబర్ 12న పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లుకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదం తెలపగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్లు 2001 నాటి ఇంధన పరిరక్షణ చట్టాన్ని సవరించడానికి రూపొందించారు. ఈ సవరణ ప్రరిశ్రమల కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్‌కు సంబంధించిన నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రబుత్వానికి అందిస్తుంది.

వినియోగదారులు తమ విద్యుత్/ఎనర్జీ అవసరాలలో కొంత భాగాన్ని శిలాజ రహిత వనరుల నుండి తీర్చుకోవాలని కూడా ఈ చట్టం నిర్దేశిస్తుంది. 100 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ లోడ్ ఉపయోగించే కార్యాలయాలు మరియు నివాస భవనాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ సవరణ ద్వారా కార్బన్ పొదుపు ధృవీకరణ పత్రాలను జారీ చేయడం ద్వారా క్లీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారు.

2015లో COP-21 సమావేశాల్లో భారతదేశం 2030 నాటికీ తన స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 40 శాతం నాన్-ఫాసిల్ ఎనర్జీ వనరుల నుండి సేకరించేందుకు నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన లక్ష్యం కంటే తొమ్మిదేళ్లు ముందుగా 2021 నవంబర్‌లో భారతదేశం ఈ లక్ష్యాన్ని సాధించింది.

అటవీ పునరుద్ధరణకు 'వనికరణ్' ప్రాజెక్టు ప్రారంభం

సహజ వృక్షసంపదను పునరుద్ధరించేందుకు కేరళ అటవీ శాఖ 'వనికరణ్' పేరుతొ నూతన ప్రాజెక్టును ప్రారంభించింది. వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలోని సుల్తాన్ బతేరి అటవీ రేంజ్ పరిధిలోని 30 హెక్టార్ల అటవీప్రాంతంలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా స్థానిక మొక్క జాతులకు తీవ్రమైన ముప్పు కలిగిస్తున్న సెన్నా స్పెక్టాబిలిస్, యుపటోరియం, మికానియా మైక్రోంత మరియు లాంటానా కమారా వంటి అన్యదేశ ఆక్రమణ మొక్కలు తొలగించి, వెదురు, ఇతర పండ్ల జాతుల మొక్కలను వృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించనున్నారు.

రాజ్యసభలో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు

జాతీయ న్యాయ కమిషన్ ద్వారా న్యాయమూర్తుల నియామకాన్ని నియంత్రించే నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ 2022 బిల్లును డిసెంబర్ 9న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సీపీఐ (ఎం) పార్టీకి చెందిన బికాష్ రంజన్ భట్టాచార్య ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కొలీజియం వ్యవస్థను సమీక్షించాలనే ఆలోచనతో రూపొందించబడింది.

ప్రస్తుత న్యాయమూర్తుల నియామక విధానం, కొలీజియం వ్యవస్థ తీరు ప్రజల మరియు ప్రజాసభ యొక్క భావాలను ప్రతిబింబించడం లేదనేది రాజకీయ పార్టీల మనోగతం. వీరి నియామకంలో అధికారిక యంత్రాంగం లేదా సచివాలయం ప్రమేయం లేనందున, ఈ వ్యవస్థలో పారదర్శకత లేదని విమర్శిస్తున్నారు. వీరి నియామకంలో ప్రభుత్వాలకు నిర్ణయాధికారం ఉండాలనేది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.

దీనికి సంబంధించి గతంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (NJAC) చట్టాన్ని 2014లో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేయబడింది. కొలీజియం వ్యవస్థ స్థానంలో న్యాయమూర్తుల నియామకం కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి 2014లో పార్లమెంటు ద్వారా ఇది ఏర్పాటు చేయబడింది. ఇది న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పాత్రను తప్పనిసరి చేస్తుంది.

ఈ రాజ్యాంగ సవరణ చట్టం 13 ఏప్రిల్ 2015 నుండి అమల్లోకి వచ్చింది. అయితే 16 అక్టోబర్ 2015న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో కొలీజియం వ్యవస్థను సమర్థించింది, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది.

న్యాయవ్యవస్థలో రాజకీయ ప్రమేయం పెరిగితే న్యాయస్థానాల స్వేచ్చకు ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. దీని కారణంగా న్యాయమూర్తుల అవినీతిని నియంత్రించడమనే విషయం పక్కనపెడితే మొత్తం న్యాయ వ్యవస్థే ప్రమాదంలో పడే అవకాశం ఉందినేది సుప్రీమ్ కోర్టు ఉద్దేశ్యం.

ప్రస్తుత కొలీజియం వ్యవస్థలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్, భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు నలుగురు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సహాయంతో ఇతర న్యాయమూర్తుల నియామకాలు మరియు బదిలీలను సిఫార్సు చేస్తారు.

అదే సమయంలో హైకోర్టు కొలీజియం ప్రకారం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మరియు ఆ కోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు దీనికి నేతృత్వం వహిస్తారు. వీరు పంపించిన జాబితాను కొద్దిపాటి విచారణతో ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవస్థలలో మార్పు కోసం ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

భారత్, ఫిన్‌లాండ్‌ మధ్య మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందం

భారత్, ఫిన్‌లాండ్‌ దేశాలు ద్విపాక్షిక మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేసాయి. దీని ద్వారా ఇరుదేశాలు అమరికలేని సహకారం అందించుకునేందుకు ఉమ్మడి ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నాయి.

డిసెంబర్ 13న ఈ డిక్లరేషన్‌పై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ మరియు ఫిన్లాండ్ ఉపాధి మంత్రి శ్రీమతి తులా హాటైనెన్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య విద్యార్థులు, విద్యావేత్తలు, పరిశోధకులు, వ్యాపారవేత్తలు మరియు నిపుణుల కదలికలను సులభతరం చేస్తుంది.

స్వంత క్లైమేట్ చేంజ్ మిషన్‌ను ప్రారంభించిన తమిళనాడు

తమిళనాడులోని సహజ వనరులను పరిరక్షించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిసెంబర్ 9న స్వంత క్లైమేట్ చేంజ్ మిషన్‌ను ప్రారంభించారు. దీనితో ఇటువంటి మిషన్ ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది.

ఈ సంధర్బంగా 2070 జాతీయ లక్ష్యం కంటే చాలా ముందుగానే, 2030 నాటికీ తమిళనాడు రాష్ట్రం కార్బన్ న్యూట్రాలిటీని సాధిస్తుందని తెలిపారు. డిసెంబర్ 8 మరియు 9 మధ్య చెన్నైలో నిర్వహించిన తమిళనాడు వాతావరణ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మిషన్ తమిళనాడు గ్రీన్ క్లైమేట్ కంపెనీ (TNGCC) ద్వారా అమలు చేయనున్నారు.

ప్రధాన మంత్రి కౌశల్ కామ్ కార్యక్రమం పేరు మార్పు

ప్రధాన మంత్రి కౌశల్ కో కామ్ కార్యక్రమం (PMKKK) ను ప్రధాన మంత్రి విరాసత్ కా సంవర్ధన్ (పీఎం వికాస్) పథకంగా పేరు మార్చినట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ లోక్‌సభలో దీనికి సంబంధించిన ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అలానే ఇదే పధకంలో సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, హమారీ ధరోహర్, నై రోష్ని మరియు నై మంజిల్ వంటి పూర్వ పథకాలు విలీనం చేసినట్లు వెల్లడించారు.

నైపుణ్యాభివృద్ధి, విద్య, మహిళా నాయకత్వం & వ్యవస్థాపకత వంటి అంశాలలో మైనారిటీల జీవనోపాధిని మెరుగుపరచడమే పీఎం వికాస్ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలియజేసారు. లబ్ధిదారుల ఆదాయాలను పెంచడం మరియు క్రెడిట్, మార్కెట్ అనుసంధానాలను సులభతరం చేయడం ద్వారా వారికీ మద్దతు అందిస్తారు.

స్వదేశ్ దర్శన్ 2.0 లో గయ, నలంద ఎంపిక

స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ధి చేసేందుకు బీహార్‌లోని గయ, నలందను ఎంపిక చేసినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశంలో టూరిజం యొక్క సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం ఈ పథకం 2014-15 లో ప్రారంభించబడింది.

ఈ స్వదేశ్ దర్శన్ పథకం కింద, కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ రాష్టాల పరిధిలో ఎంపిక చేసిన పర్యాటక ప్రదేశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. స్వదేశ్ దర్శన్ పథకం (SDS) కింద మొదటి విడుతలో దాదాపు 76 ప్రాజెక్టులను దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు 5399.15 కోట్లు మంజూరు చేసారు. వీటిలో గిరిజన మరియు గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

మారిటైమ్ యాంటీ పైరసీ బిల్లు 2022 రాజ్యసభలో ఆమోదం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022 లో సముద్రయాన వ్యతిరేక పైరసీ బిల్లు 2022 ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందగా, తాజాగా డిసెంబర్ 21న రాజ్యసభలో కూడా ఆమోదించబడింది. ఈ బిల్లు సముద్రపు పైరసీని నిరోధించడానికి రూపొందించబడింది. ఈ బిల్లు వాణిజ్య సముద్ర ప్రయాణాలకు భద్రత కల్పిస్తుంది. పైరసీకి పాల్పడే వారిని న్యాయ పరంగా శిక్షిస్తుంది.

భారతదేశ తీరప్రాంతానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలి దాటిన సముద్రానికి ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ ఓడ లేదా విమానంలోని సిబ్బంది లేదా ప్రయాణీకులు ప్రైవేట్ ప్రయోజనాల కోసం వ్యతిరేకంగా ఏదైనా చట్టవిరుద్ధమైన హింస, నిర్బంధం లేదా విధ్వంసం చేసే చర్యను పైరసీగా ఈ బిల్లు పేర్కొంది.

జైళ్లను హ్యూమనైజ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్‌

ఖైదీల వైఖరిలో మార్పు తెచ్చేందుకు మరియు సామాజిక మరియు పరిపాలనాపరమైన మార్పు కోసం అరుణాచల్ ప్రదేశ్, జైళ్లను "మానవీకరణ" చేస్తున్న మొదటి రాష్ట్రంగా నిలిచింది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని మొదటి సెంట్రల్ జైలుకు “కరెక్షనల్ సెంటర్” అని పేరు పెట్టనున్నట్లు వెల్లడించింది.

ఖైదీలను సంస్కరించడానికి మరియు వారిని సమాజంలో ఉత్పాదక భాగస్వామ్య సభ్యులుగా తీర్చి దిద్దెందుకు, శిక్ష ముగిశాక అర్ధవంతమైన పునరావాసం పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను, అవకాశాలను అందించడానికి ఈ మార్పులు చేస్తున్నారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీతో కలిసి జైలు ఖైదీల విద్యాభ్యాసాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా వారికి దూరవిద్యను అందిస్తుంది. ప్రస్తుతం ఇద్దరు ఖైదీలు పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారని, ముగ్గురు గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులను ప్రారంభిస్తున్నారని తెలిపింది. అరుణాచల్‌లో మహిళలు మరియు పిల్లలపై నేరాల రేటు భారతదేశంలో అత్యల్పంగా ఉంది.

వినియోగదారుల సాధికారత కోసం రైట్-టు-రిపేర్ పోర్టల్‌

కేంద్ర ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 24న రైట్-టు-రిపేర్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ తయారీదారులు, తమ ఉత్పత్తి వివరాల మాన్యువల్‌ను కస్టమర్‌లకు అందుబాటులో ఉంచనున్నారు.

దీని ద్వారా పని చేయాలని పరికరాల రిపేర్ కోసం తయారీదారులపై ఆధారపడకుండా స్వయంగా లేదా థర్డ్ పార్టీల ద్వారా రిపేర్ చేసుకునే అవకాశం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమంను మొదటి దశలో భాగంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ మరియు వ్యవసాయ పరికరాలకు కవర్ చేస్తున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో లోకాయుక్త బిల్లు ఆమోదం

ముఖ్యమంత్రి మరియు మంత్రుల మండలిని అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ పరిధిలోకి తీసుకువచ్చే లోకాయుక్త బిల్లు 2022ను మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీనితో ముఖ్యమంత్రిని ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర అవతరించింది.

లోక్‌పాల్ మరియు లోకాయుక్త చట్టాలు 2013లో ప్రజాపాలకుల అవినీతి ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. జాతీయ స్థాయిలో అవినీతి ఆరోపణలపై విచారణకు లోక్‌పాల్ బాధ్యత వహిస్తుండగా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త ఈ విధులు నిర్వర్తస్తుంది. లోకాయుక్త మరియు ఉపలోకాయుక్తలను గవర్నర్ నియమిస్తారు. లోక్‌పాల్ (లోకాయుక్తలు) సభ్యులను ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి నియమిస్తారు.

న్యాయమూర్తి లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరైనా లోకాయుక్తగా నియమించబడటానికి అర్హులు. వీరి వయస్సు కనీసం 45 ఏళ్ళు ఉండాలి. ఈ చట్టాలు ఆయా రాష్ట్రాల్లో చెల్లుబాటు అయ్యేందుకు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించాల్సి ఉంటుంది.

1971లోకాయుక్తను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. 2011లో అన్నా హజారే యొక్క అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొంది, అధికారికంగా లోక్‌పాల్ మరియు లోకాయుక్త చట్టాలుగా ఏర్పాటు చేయబడ్డాయి. 2016 లో ప్రభుత్వ అధికారులు, వారి జీవిత భాగస్వాములు మరియు వారిపై ఆధారపడిన పిల్లలు ప్రతి సంవత్సరం వారి ఆస్తులు & అప్పులను ప్రకటించి, దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టానికి సవరణ చేసింది.

అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రారంభించిన రైల్వే శాఖ

రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం భారతీయ రైల్వే 'అమృత్ భారత్ స్టేషన్' పేరుతొ నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న 1,000 చిన్న రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడానికి ప్రణాళిక చేస్తుంది. దీర్ఘకాలిక మాస్టర్ ప్లానుతో స్టేషన్ యొక్క డిమాండ్లు మరియు వినియోగానికి అవసరాలకు అనుగుణంగా స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేయనున్నారు.

పశ్చిమ బెంగాల్‌ నుండి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మరియు న్యూ జల్‌పైగురిని కలిపే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది పశ్చిమ బెంగాల్‌ నుండి ప్రారంభించిన తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌, మొత్తంగా దేశంలో 7వది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.

బిజినెస్ & ఎకానమీ అఫైర్స్ - డిసెంబర్ 2022

ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్, టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విలీనం చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నియంత్రణా అనుమతులకు లోబడి ఈ ప్రక్రియ మార్చి 2024 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ అనుసంధానం పూర్తయిన వెంటనే ఎయిర్ ఇండియాలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి అందుబాటులోకి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 1 న రిటైల్ డిజిటల్ రూపాయి (e₹-R) యొక్క మొదటి పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించింది. ఇందులో భాగంగా దశల వారీగా ఎనిమిది బ్యాంకుల ద్వారా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదటి దశలో దశ దేశవ్యాప్తంగా ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు మరియు భువనేశ్వర్‌తో నగరాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యెస్ బ్యాంక్ మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌ల ద్వారా ప్రవేశపెడుతున్నారు.

రెండవ దశలో అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా మరియు సిమ్లాలలో అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంకులకు విస్తరించనున్నారు. రిటైల్ కేంద్రాల్లో ఉండే క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి డిజిటల్ రూపాయిను వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చు.

ఐడీఎప్‌సి మ్యూచువల్ ఫండ్ పేరు మార్పు

ఐడీఎప్‌సి మ్యూచువల్ ఫండ్‌, బంధన్ మ్యూచువల్ ఫండ్‌గా పేరు మార్చుకుంది. ఐడీఎప్‌సి మ్యూచువల్ ఫండ్‌ను బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్, జీఐసీ మరియు క్రిస్ క్యాపిటల్‌లతో కూడిన కన్సార్టియం కొనుగోలు చేసింది. నవంబర్ నెలలో బ్యాంకింగ్ రెగ్యులేటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆగస్టు 2022లో ఈ ఒప్పందాన్ని ఆమోదించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద విండ్-సోలార్ హైబ్రిడ్‌గా అదానీ గ్రీన్

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ డెవలపర్‌గా అవతరించింది. జైసల్మేర్‌లో ఇటీవలే ప్రారంభించిన 420 MW సోలార్ మరియు 105 MW విండ్ ప్లాంట్‌లతో ఈ రికార్డు నెలకొల్పింది. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రస్తుతం 1,440 మెగావాట్లతో ప్రపంచ అతిపెద్ద హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.

క్రెడిట్ కార్డ్‌లకు యూపీఐ టెక్నాలజీ జోడించిన మొదటి సంస్థగా రేజర్పే

దేశంలో క్రెడిట్ కార్డ్‌లకు యూపీఐ టెక్నాలజీ జోడించిన మొదటి సంస్థగా రేజర్పే (Razorpay) నిలిచింది. ఈ సాంకేతికత ద్వారా క్రెడిట్ కార్డ్‌ వినియోగదారులు యూపీఐ లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్‌ల కస్టమర్లు ఈ ఆవిష్కరణ ప్రయోజనాలను త్వరలో ఆస్వాదించనున్నారు.

రేజర్పే ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ వ్యాపారాల కోసం ఆన్‌లైన్ చెల్లింపులను ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. ఇది మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్‌తో క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, నెట్‌బ్యాంకింగ్, వాలెట్ మరియు యూపీఐ చెల్లింపులను అనుమతిస్తుంది. దీనిని 2013 లో హర్షిల్ మాథుర్ మరియు శశాంక్ కుమార్'లు స్థాపించారు.

బజాజ్ అలియాంజ్ నుండి దేశంలో మొదటి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్‌

మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ బజాజ్ అలయన్జ్ నుండి భారతదేశపు మొట్టమొదటి ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తిని ప్రారంభించారు. ష్యూరిటీ బాండ్ అనేది మరొకరి రుణం, డిఫాల్ట్ లేదా వైఫల్యానికి బాధ్యత వహించే వాగ్దానం. వీటిని చెల్లింపు లేదా పనితీరుకు హామీ ఇచ్చే వ్రాతపూర్వక ఒప్పందంగా నిర్వచించవచ్చు.

నిర్దిష్ట రిస్క్‌ల నేపథ్యంలో పనితీరుకు హామీ ఇచ్చేలా ష్యూరిటీ బాండ్‌లు రూపొందించబడ్డాయి. వీటిని బీమా సంస్థలు జారీ చేస్తాయి. ష్యూరిటీ బాండ్ ఇన్సూరెన్స్ అనేది ప్రిన్సిపాల్‌కి రిస్క్ ట్రాన్స్‌ఫర్ సాధనంగా పనిచేస్తుంది. కాంట్రాక్టర్ తమ ఒప్పంద బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే తలెత్తే నష్టాల నుండి ప్రిన్సిపాల్‌ను కాపాడుతుంది.

భారతదేశపు మొదటి కార్బన్ న్యూట్రల్ పవర్ ఎక్స్‌చేంజ్‌గా ఐఈఎక్స్

భారతదేశపు ప్రముఖ ఇంధన వాణిజ్య ప్లాట్‌ఫారమ్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌చేంజ్‌ (IEX) దేశంలో మొట్టమొదటి కార్బన్ - న్యూట్రల్ పవర్ ఎక్స్‌చేంజ్‌గా అవతరించింది. క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద నమోదు చేయబడిన ప్రోజెక్టుల నుండి కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు స్వచ్ఛందంగా సిఈఆర్ లను (సర్టిఫైడ్ ఉద్గారాల తగ్గింపులను) రద్దు చేసుకుంది.

దేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ స్టీల్ బ్రాండ్‌ ఆవిష్కరణ

కేంద్ర ఉక్కు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ స్టీల్ బ్రాండ్ “కళ్యాణి ఫెర్రెస్టా” ను డిసెంబర్ 20న న్యూఢిల్లీలో ప్రారంభించారు. పర్యావరణంలోకి కార్బన్ ఉద్గారాలు వెదజల్లకుండా, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి పూణేకు చెందిన స్టీల్ కంపెనీ, కళ్యాణి గ్రూప్ ఈ మొట్టమొదటి గ్రీన్ ఉక్కును తయారు చేసింది. ఈ తయారీ ప్రాసెస్ యందు కేవలం 7శాతం కార్బన్ విడుదలయినట్లు వెల్లడించింది.

విదేశీ వాణిజ్య లావాదేవీల్లో భారత్ రూపాయి

అంతర్జాతీయ లావాదేవీల కోసం డాలర్లు మరియు ఇతర ప్రధాన కరెన్సీలకు బదులుగా భారతీయ రూపాయిలను ఉపయోగించడానికి పలు దేశాలు సిద్దమౌతున్నాయి. ఈ జాబితాలో  రష్యా, శ్రీలంక, క్యూబా, సుడాన్ మరియు లక్సెంబర్గ్ వంటి దేశాలు ఉన్నాయి.

ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆంక్షలకు గురైన రష్యా ఇప్పటికే భారతీయ రూపాయిలో ట్రేడ్ లావాదేవీలు నిర్వహిస్తుంది. శ్రీలంక కూడా రష్యాతో వర్తకం చేయడానికి భారత రూపాయిలను ఉపయోగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.

శ్రీలంక బ్యాంకులు కూడా రూపాయి ట్రేడింగ్ కోసం స్పెషల్ వోస్ట్రో రూపాయి ఖాతాలు లేదా SVRA అని పిలిచే ప్రత్యేక రూపాయి ట్రేడింగ్ ఖాతాను తెరిచినట్లు నివేదించబడింది. ఇదే వరసలో మిగతా చిన్న దేశాలు ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.

బీఎస్ఈ సీఈఓగా సుందరరామన్ రామమూర్తి

బాంబే స్టాక్ ఎక్స్‌చేెంజ్ (BSE) నూతన మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా సుందరరామన్ రామమూర్తి నియమితులయ్యారు. ఈ ఏడాది జులైలో బీఎస్ఈ మాజీ సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ రాజీనామా తర్వాత ఈ హోదా ఖాళీగా ఉంది. రామమూర్తి ఇప్పుడు ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.

బాంబే స్టాక్ ఎక్స్‌చేెంజ్ 1875లో ముంబైలోని దలాల్ స్ట్రీట్‌లో కాటన్ వ్యాపారి ప్రేమ్‌చంద్ రాయ్‌చంద్ చేత స్థాపించబడింది. ఇది ఆసియాలో అత్యంత పురాతన ఎక్స్‌చేెంజుగా గుర్తింపు పొందింది. ఈ స్టాక్ ఎక్స్‌చేెంజూలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 4800కి పైగా కంపెనీలు లిస్టింగ్ చేయబడి ఉన్నాయి.

డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ - డిసెంబర్ 2022

ఆగ్రాలో సమన్వయ్ ఎక్సరసైజ్ 2022

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్షిక జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) ఎక్సర్‌సైజ్ 2022 ఆగ్రాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నవంబర్ 28 నుండి 30 మధ్య నిర్వహించబడింది. కెపాబిలిటీ డెమోన్‌స్ట్రేషన్‌కు అంకితమైన ఈ మల్టీ ఏజెన్సీ ఎక్సర్‌సైజ్ యందు అగ్నేసియా సభ్యులతో సహా వివిధ భారతీయ వాటాదారులు పాల్గున్నారు. అలానే రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రాజస్థాన్ ఎడారులలో 'సుదర్శన్ ప్రహార్'

భారత సైన్యానికి చెందిన సుదర్శన్ చక్ర దళాలు డిసెంబర్ 1న రాజస్థాన్ ఎడారిలో నిర్వహించిన సుదర్శన్ ప్రహార్ ఎక్సర్ సైజ్‌లో పాల్గొన్నాయి. ఈ వ్యాయామం ద్వారా సైనిక దళాల్లో ఉన్నతస్థాయి వృత్తి నైపుణ్యం మరియు ప్రమాదకర స్ఫూర్తిని ప్రదర్శించే కొత్త యుద్ధ పద్ధతులపై తర్పీదు అందివ్వనున్నారు.

చెన్నైలో కోస్టల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌

కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ (CSC) ఆధ్వర్యంలో తొలి కోస్టల్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (CoSC) డిసెంబర్ 1న చెన్నైలో ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సదస్సులో భారత్, మాల్దీవులు, శ్రీలంక మరియు మారిషస్ పాల్గొన్నాయి. అలానే ప్రత్యేక అతిధిగా బంగ్లాదేశ్ కూడా ఈ సదస్సులో పాల్గొంటుంది.

భారత ప్రభుత్వ రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనే ఈ తొలి తీర భద్రతా సదస్సు (CoSC) - 2022ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని 'కోలబ్రెటివ్ ఎఫర్ట్స్ ఫర్ కోస్టల్ సెక్యూరిటీ' థీమ్'తో నిర్వహించారు. ఈ సమావేశంలో చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యం, సముద్ర వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం, ప్రకృతి వైపరీత్యాలు & సముద్ర ముప్పులను తగ్గించడం, సముద్ర పర్యావరణ పరిరక్షణ & రక్షణ మరియు స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా సముద్ర వాణిజ్యాన్ని పెంచడానికి బాధ్యతాయుతమైన సముద్ర కనెక్టివిటీని ప్రోత్సహించడం వంటి వివిధ అంశాలపై చర్చించారు.

అగ్ని వారియర్ ఎక్సర్‌సైజ్ 2022

నవంబర్ 13న ప్రారంభమైన సింగపూర్ మరియు ఇండియన్ ఆర్మీల జాయింట్ ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ 12వ ఎడిషన్ నవంబర్ 30న మహారాష్ట్రలోని దేవ్‌లాలీలో ముగిసింది. ఈ వ్యాయామం ద్వారా ఇరు సైన్యాల కసరత్తులు & విధానాలపై పరస్పర అవగాహనను పెంపొందించుకోనున్నారు.

బంగ్లాదేశ్‌ ఐఎఫ్ఆర్-22లో పాల్గొన్న భారత నౌకాదళం

బంగ్లాదేశ్ నేవీ నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన కొచ్చి, కవరత్తి మరియు సుమేధ నౌకలు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ చేరుకున్నాయి. డిసెంబర్ 06 నుండి 09 వరకు బంగ్లాదేశ్ నేవీ నిర్వహిస్తున్న ఫ్లీట్ రివ్యూలో నిర్వహించే వివిధ రకాల కార్యకలాపాలలో ఈ నౌకలు పాల్గొన్నాయి. బంగ్లాదేశ్ జాతిపిత బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జన్మదిన జ్ఞాపకార్థం మొదటిసారి ఈ వేడుకను నిర్వహిస్తుంది.

గోవాలో 7వ ఎడిషన్ సంగమ్ ఎక్సర్‌సైజ్

ఇండియన్ నేవీ మార్కోస్ మరియు యుఎస్ నేవీ సీల్స్ మధ్య నిర్వహించే సంగమ్ ఎక్సర్‌సైజ్ యొక్క 7వ ఎడిషన్ డిసెంబర్ 1న గోవాలో ప్రారంభమైంది. సంగమ్ ఎక్సర్‌సైజ్ మొదటిసారిగా 1994లో ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సైనిక మరియు దౌత్య మరియు స్నేహ చొరవను పెంపొందించేందుకు దీనిని నిర్వహిస్తారు. ఈ వ్యాయామం మూడు వారాల పాటు ప్రణాళిక చేయబడింది.

ఇస్రో భవిష్యత్ ఉపగ్రహాలలో ఎల్1 ఫ్రీక్వెన్సీ

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అయిన ఇండియన్ కన్సల్టేషన్ ( నావిక్ ) తో పౌర వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో, అంతరిక్ష సంస్థ తన భవిష్యత్ ఉపగ్రహాలన్నింటిలో ఎల్1 ఫ్రీక్వెన్సీని ప్రవేశపెడుతోంది. NVS-01 నుండి ప్రారంభమయ్యే తదుపరి ఉపగ్రహాలు పౌర నావిగేషనల్ ఉపయోగం కోసం L1 బ్యాండ్‌ను కలిగి ఉంటాయి.

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)లో సాధారణంగా ఉపయోగించే ఫ్రీక్వెన్సీలలో L1 ఫ్రీక్వెన్సీ ఒకటి. ఇది తక్కువ-శక్తితో సింగిల్-ఫ్రీక్వెన్సీ చిప్‌లను ఉపయోగించే, ధరించగలిగే పరికరాలు మరియు వ్యక్తిగత ట్రాకర్‌లలో ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్ వినియోగాన్ని పెంచుతుంది.

NavIC అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చే అభివృద్ధి చేయబడిన స్వతంత్ర స్వతంత్ర నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది 2006లో $174 మిలియన్ల వ్యయంతో ఆమోదించబడింది. 2018లో ఇది కార్యాచరణలోకి వచ్చింది. ఈ నావిగేషన్ మొత్తం 8 ఉపగ్రహాలతో భారతదేశం యొక్క మొత్తం భూభాగాన్ని మరియు దాని సరిహద్దుల నుండి 1,500 కి.మీ (930 మైళ్ళు) వరకు కవర్ చేస్తుంది.

డిసెంబర్ 15 నుండి x-కాజింద్ మిలిటరీ ఎక్సర్‌సైజ్

ఇండో-కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ “కాజింద్ 2022” ఉమ్రోయ్ (మేఘాలయ) లో డిసెంబర్ 15 నుండి 28 వరకు నిర్వహించబడుతోంది. కజకిస్తాన్ ఆర్మీతో ఈ ఉమ్మడి వార్షిక శిక్షణ వ్యాయామం 2016లో ఎక్సర్‌సైజ్ ప్రబల్ దోస్టీక్‌గా ప్రారంభించబడింది. ఇది తరువాత కంపెనీ స్థాయి వ్యాయామంగా అప్‌గ్రేడ్ చేయబడింది. 2018లో x- కాజింద్‌గా పేరు మార్చబడింది.

ఈ వ్యాయామం ద్వారా భారత సైన్యం మరియు కజకిస్తాన్ ఆర్మీ మధ్య రక్షణ సహకార స్థాయిని పెంపొందించుకోనున్నారు. అలానే దీని ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు.

ఇండో-నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ 2022

భారతదేశం మరియు నేపాల్ మధ్య 16వ ఎడిషన్ ఇండో-నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్‌సైజ్ "సూర్య కిరణ్-XVI" డిసెంబర్ 16 నుండి 29 మధ్య నేపాల్ ఆర్మీ బాటిల్ స్కూల్, సల్ఝండిలో నిర్వహిస్తున్నారు. భారతదేశం మరియు నేపాల్ మధ్య ఏటా ఈ సూర్యకిరణ్ వ్యాయామం జరుగుతుంది.

ఈ వ్యాయామం పర్వత భూభాగంలో జంగిల్ వార్‌ఫేర్ మరియు కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్‌లలో పరస్పర చర్యను మెరుగుపరచడం కోసం నిర్వహిస్తారు. అదే సమయంలో ఐక్యరాజ్యసమితి ఆదేశం ప్రకారం పర్వత విపత్తుల సమయంలో మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమన సిబ్బంది ఈ శిక్షణ కోసం ఈ వ్యాయామం నిర్వహిస్తారు.

భారత నేవీలో ఐదవ స్కార్పెన్ జలాంతర్గామి 'వాగిర్'

భారత నావికాదళంలో డిసెంబర్ 20న ఐదవ స్కార్పెన్ -క్లాస్ జలాంతర్గామి వాగిర్‌ చేరింది. ప్రాజెక్ట్-75 పేరుతొ ఆరు స్కార్పెన్ జలాంతర్గాములను అభివృద్ధి చేస్తున్నారు. ఈ జలాంతర్గాముల నిర్మాణం ముంబయిలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)లో ఫ్రాన్స్‌కు చెందిన M/s నావల్ గ్రూప్ సహకారంతో జరుగుతోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన 4 స్కార్పెన్ జలాంతర్గాములు భారత నౌకాదళానికి అందించబడ్డాయి.

శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్న తొలి దేశంగా భారత్

ఉపగ్రహ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్న మొదటి దేశంగా భారతదేశం అవతరించనుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బిఐఎఫ్) నిర్వహించిన ఇండియా శాట్‌కామ్ 2022లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మెన్ పిడి వాఘేలా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు.

కేప్ టౌన్ టు రియో ​​రేస్ 2023లో ఐఎన్ఎస్‌వీ తారిణి

ఐఎన్ఎస్‌వీ తారిణి 50వ ఎడిషన్ కేప్ టు రియో ​​రేస్ 2023లో పాల్గొనడం కోసం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌కు బయలుదేరింది. ఈ ఓషన్ సెయిలింగ్ రేస్ జనవరి 2, 2023న కేప్ టౌన్ నుండి ప్రారంభమయి, బ్రెజిల్ లోని రియో ​​డి జనీరోలో ముగుస్తుంది.

ఈ రేసు అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రాన్స్-అట్లాంటిక్ మహాసముద్ర రేసుల్లో ఒకటి. ఇద్దరు మహిళా అధికారులతో సహా ఐదుగురు అధికారులతో కూడిన ఇండియన్ నేవీ సిబ్బంది ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రలో గోవా నుండి కేప్ టౌన్ మీదుగా రియో ​​డి జెనీరోకు మరియు తిరిగి గోవాకు చేరుకునేందుకు సుమారు 17000 నాటికల్ మైళ్ల దూరాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది.

5-6 నెలల వ్యవధితో సాగే ఈ ట్రాన్స్-ఓషియానిక్ ప్రయాణంలో భారతీయ, అట్లాంటిక్ మరియు దక్షిణ మహాసముద్రాల యొక్క తీవ్రమైన వాతావరణం మరియు కఠినమైన సముద్ర పరిస్థితులను ఎదుర్కొవలసి ఉంటుంది. నావిగేషన్, కమ్యూనికేషన్, టెక్నికల్ మరియు ప్లానింగ్‌తో సహా అవసరమైన సీమాన్‌షిప్ నైపుణ్యాలలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యం.

ఐఎన్ఎస్‌వీ తారిణి, భారత నౌకాదళానికి చెందిన రెండవ సెయిలింగ్ బోట్. ఇది గోవాలోని అక్వేరియస్ షిప్‌యార్డ్‌లో నిర్మించబడింది. విస్తృతమైన సముద్ర ట్రయల్స్ తర్వాత, ఇది 18 ఫిబ్రవరి 2017న ఇండియన్ నేవీ సర్వీస్‌కి అందించబడింది.

దీనిని ప్రారంభించిన తర్వాత లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి నేతృత్వంలోని మొత్తం 6 మంది మహిళా సిబ్బంది భూగోళాన్ని చుట్టి రావడానికి 'నావికా సాగర్ పరిక్రమ' పేరుతో ఒక సాహసయాత్రను చేపట్టారు. ఇది 10 సెప్టెంబర్ 2017న ప్రారంభమై, 21 మే 2018న ముగిచింది. 254 రోజుల పాటు సాగిన ఈ మొట్టమొదటి ప్రపంచ యాత్ర దాదాపు 21600 మైళ్లు కవర్ చేసింది.

బీఎస్ఎఫ్ జవాన్ల కోసం 'ప్రహరీ' యాప్‌ ప్రారంభం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, భారత సరిహద్దు భద్రతా దళం (BSF) కోసం ' డిసెంబర్ 29న ప్రహరీ' మొబైల్ యాప్ ప్రారంభించారు. ఈ ప్రహరీ మొబైల్ యాప్ ద్వారా జవాన్లు వారి మొబైల్‌లలో తమ వ్యక్తిగత సమాచారం, వసతి, ఆయుష్మాన్-సిఎపిఎఫ్ మరియు లీవ్‌లకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఈ యాప్ నేరుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖకు అనుసంధానించబడి ఉంటుంది.

రిపోర్టులు & ర్యాంకులు - డిసెంబర్ 2022

గ్లోబల్ ప్రైమ్ సిటీస్ ఇండెక్స్‌లో ముంబైకు 22వ స్థానం

నైట్ ఫ్రాంక్ రూపొందించిన గ్లోబల్ ప్రైమ్ సిటీస్ ఇండెక్స్‌లో ముంబై 22వ స్థానంలో నిలిచింది. ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా 45-ప్లస్ నగరాల్లో స్థానిక కరెన్సీలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో కదలికను ట్రాక్ చేసే వాల్యుయేషన్ ఆధారిత ఇండెక్స్.

గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగులో ఇండియాకు 48వ స్థానం

ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసిఎఒ) యొక్క గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ర్యాంకింగ్స్‌లో భారత్ 48వ స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల క్రితం ఈ ర్యాంకింగులో ఇండియా 102వ స్థానంలో ఉండేది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఉత్తమ విమానయాన భద్రత కలిగిన టాప్ 50 దేశాలలో ఒకటిగా ఉంది. ఈ పెద్ద పురోగతి భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా విస్తరించడానికి సహాయపడుతుంది.

ఈ ర్యాంకింగ్స్‌లో సింగపూర్ 99.69 శాతం స్కోర్‌తో అగ్రస్థానంలో ఉండగా. దీని తర్వాత 98.8 శాతం స్కోర్‌తో యూఏఈ రెండో స్థానంలో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మూడో స్థానంలో (98.24 శాతం) ఉన్నాయి. ఇండియా 85.49 శాతం స్కోరుతో 48వ స్థానంలో నిలిచింది.

హింసకు గురయ్యే దేశాల జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానం

సామూహిక హత్యల ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో పాకిస్తాన్ వరుసగా 3వ సారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన థింక్-టాంక్ యొక్క నివేదిక ప్రకారం 162 దేశాల అధ్యనంలో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలువగా యెమెన్ రెండవ స్థానంలో, మయన్మార్ మూడవ స్థానంలో ఇథియోపియా ఐదవ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారతదేశం ఎనిమిదో స్థానంలో చైనా, ఇరాన్‌, సిరియాల కంటే ముందుంది.

డేంజర్ జాబితాలో గ్రేట్ బారియర్ రీఫ్‌

ఆస్ట్రేలియా యొక్క గ్రేట్ బారియర్ రీఫ్ "ప్రమాదంలో ఉన్న" ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు జోడించలని యునెస్కో నివేదించింది. ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బ పర్యావరణ వ్యవస్థలో ఒకటైన బారియర్ రీఫ్ వాతావరణ మార్పులు మరియు వేడెక్కడం వల్ల గణనీయంగా ప్రభావితమైందని పేర్కొంది.

గ్రేట్ బారియర్ రీఫ్ 1981నుండి ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది. ఇవి సముద్ర జీవులలో నాలుగింట ఒక వంతు జీవులకు నివాసంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ జలాలలో 26% ఎసిడిటి ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం యునెస్కో డేంజర్ జాబితాలో 52 సైట్లు ఉన్నాయి.

ఆర్టన్ క్యాపిటల్ పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఇండియాకు 87వ స్థానం

ఆర్టన్ క్యాపిటల్ ప్రచురించిన పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం ప్రపంచంలోని బలమైన పాస్‌పోర్ట్ జాబితాలో భారతదేశం 87వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యూఏఈ, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు వరుసగా అగ్రస్థానం దక్కించుకున్నాయి. 121 దేశాలకు సంబంధించి అందించిన ఈ నివేదికలో అఫ్ఘనిస్తాన్ అట్టడుగున నిలిచింది. పొరుగున ఉన్న పాకిస్తాన్ 94వ స్థానంలో ఉంది.

అయితే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2022 ప్రకారం జపాన్ ఉత్తమ పాస్‌పోర్ట్ అయితే, ఆర్టన్ క్యాపిటల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ యూఏఈని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా పేర్కొంది. పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్ ప్రాధన్యత క్రమాన్ని తెలియజేస్తుంది. అధిక ర్యాంకు కలిగిన దేశాల ప్రయాణికులకు స్వచయుతమైన అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యం ఉంటుంది. వీరు అత్యధిక దేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆరుగురు భారతీయులు

ఫోర్బ్స్ వార్షిక ప్రపంచ 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదవసారి తన చోటు దక్కించుకున్నారు. తాజా జాబితాలో నిర్మలా సీతారామన్ 36వ ర్యాంకులో ఉండగా, గత ఏడాది 37వ ర్యాంకులో, 2020లో 41వ ర్యాంకులో, 2019లో 34వ ర్యాంక్‌లో నిలిచారు.

ఈ ఏడాది భారత్ నుండి నిర్మలా సీతారామన్ కాకుండా మరో ఐదుగురు భారతీయ మహిళా పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో హెచ్‌సిఎల్ టెక్ యువ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా 53వ స్థానంలో, సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ 54వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా చైర్‌పర్సన్ సోమ మొండల్ 67వ స్థానంలో నిలిచారు. అలానే బయోకాన్ ఎక్సిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ జాబితాలో 72వ స్థానంలో నిలవగా, దేశీయ బ్యూటీ బ్రాండ్ నైకా సీఈఓ ఫల్గుణి నాయర్ 89వ స్థానం దక్కించుకున్నారు.

ప్రపంచ వారీగా చూసుకుంటే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. కోవిడ్ 19 సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆమె పోషించిన కీలక పాత్రకు గాను అగ్రస్థానం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం జాబితాలో 39 మంది సీఈఓలు, పది మంది దేశాధినేతలు మరియు 11 మంది బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు.

ఆక్స్‌ఫామ్ ఇండియా ఇన్‌క్వాలిటీ రిపోర్ట్ 2022

ఆక్స్‌ఫామ్ ఇండియా 2022 ఏడాదికి సంబంధించి ' ఇండియా ఇన్‌క్వాలిటీ రిపోర్ట్ విడుదల చేసింది. ఇండియాలో కులం, లింగం, భౌగోళిక స్థానం మరియు తరగతి ఆధారంగా అసమానతలు ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. డిజిటల్ డివైడ్ పేరుతో విడుదల చేసిన నివేదికలో 2021లో 61 శాతం మంది పురుషులు మొబైల్ ఫోన్‌లను కలిగి ఉండగా, కేవలం 31 శాతం మహిళల వద్ద మాత్రమే మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి.

డిజిటల్ టెక్నాలజీల పరిధి ఎక్కువగా పురుషులు, పట్టణాలు, ఉన్నత-కులాలు మరియు ఉన్నత-తరగతి వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయబడిందని, సాధారణ కులాల్లో 8 శాతం మందికి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ అందుబాటులో ఉండగా, షెడ్యూల్డ్ తెగలలో (ఎస్‌టీ) 1 శాతం. షెడ్యూల్డ్ కులాలలో (ఎస్‌సి) 2 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నివేదించింది.

ఈ డిజిటల్ విభజన కారణంగా భారతదేశంలో అసమానత పెరిగిందని, విద్య, ఆరోగ్యం మరియు ప్రజా సేవలను యాక్సెస్ చేయడంలో మొబైల్ మరియు ఇంటర్నెట్ లేని వ్యక్తులు మరింత వెనుకబడిపోతారని నివేదించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీకి సార్వత్రిక ప్రాప్యతకల్పించాలని  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ఆక్స్‌ఫామ్ ఇండియా అనేది పిల్లల విద్యకు, మహిళలకు సాధికారత కల్పించడానికి మరియు భారతదేశంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పని చేస్తున్న అత్యుత్తమ లాభాపేక్షలేని సంస్థ. దీనిని 1942 లో స్థాపించారు. ఇది ప్రపంచ పేదరిక నిర్మూలనపై దృష్టి సారిస్తుంది.

గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ రిపోర్ట్ 2021

వాతావరణం, పర్యావరణం మరియు సామాజిక మార్పుల ప్రభావాలను అంచనా వేయడానికి ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తన మొదటి స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ 2021 నివేదికను ప్రచురించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నీటి డిమాండ్ మరియు భవిష్యత్ మంచినీటి వనరుల పర్యవేక్షణ మరియు నిర్వహణకు మద్దతు ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ఈ నివేదిక రూపొందించబడింది.

స్టేట్ ఆఫ్ గ్లోబల్ వాటర్ రిసోర్సెస్ రిపోర్ట్ 2021 ప్రకారం, ప్రస్తుతం, 3.6 బిలియన్ల మంది ప్రజలు కనీసం ఒక నెల నీటికి సరిపడా ప్రాప్యతను ఎదుర్కొంటున్నారని, 2050 నాటికీ వీరి సంఖ్యా 5 బిల్లియన్లకు చేరుకుంటుందని తెలిపింది. మంచినీటి వనరుల పర్యవేక్షణ మరియు నిర్వహణ సరిగా లేకుంటే భవిష్యత్ తరాలు మంచినీటి కొరతను ఎదుర్కొంటారని వెల్లడించింది.

కేరళలో అతిపెద్ద బిజినెస్ జెట్ టెర్మినల్ ప్రారంభం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, డిసెంబర్ 11న కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశంలోనే మొట్టమొదటి చార్టర్డ్ గేట్‌వే మరియు బిజినెస్ జెట్ టెర్మినల్‌ను ప్రారంభించారు. దీంతో కొచ్చిన్‌ విమానాశ్రయం ప్రైవేట్‌ జెట్‌ టెర్మినల్‌ను నిర్వహిస్తున్న దేశంలోనే నాలుగో విమానాశ్రయంగా అవతరించింది.

ఈ బిజినెస్ జెట్ టెర్మినల్‌ను దాదాపు 40 కోట్ల వ్యయంతో నిర్మించారు. చార్టర్ కార్యకలాపాలను నిర్వహించేందుకు నిర్మించిన ఈ బిజినెస్ జెట్ టెర్మినల్ 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్దది అవుతుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో విమానాశ్రయంలో అంతర్జాతీయ కార్గో కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ చైర్మన్ తెలిపారు.

వరల్డ్ మలేరియా రిపోర్టు 2022

ప్రపంచ మలేరియా నివేదిక 2022ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డిసెంబర్ 8 న విడుదల చేసింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 241 మిలియన్ మలేరియా కేసులు నమోదు  కాగా 627 000 మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ప్రపంచ మలేరియా కేసులలో ఆఫ్రికన్ ప్రాంతం అసమానమైన అధిక వాటాను కలిగి ఉందని, 2021లో ఈ ప్రాంతం 95% మలేరియా కేసులకు మరియు 96% మలేరియా మరణాలకు నిలయంగా నిలిచిందని నివేదించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారతదేశంలో 15 మిలియన్ల మలేరియా కేసులు నమోదు కాగా 19,500–20,000 మరణాలు చోటు చేసుకున్నట్లు అంచనా వేసింది. దాదాపు 84 దేశాలలో మలేరియా ప్రభావితం చేసినట్లు వెల్లడించింది.

మలేరియా అనేది ప్లాస్మోడియం పరాన్నజీవుల వల్ల కలిగే తీవ్రమైన జ్వరసంబంధమైన వ్యాధి. ఇది ప్లాస్మోడియం సోకిన ఆడ అనాఫిలిస్ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. మలేరియా యొక్క తీవ్రత ప్లాస్మోడియం జాతులపై ఆధారపడి ఉంటుంది. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా జ్వరం, చలి మరియు ఫ్లూ లాంటి అనారోగ్యాన్ని అనుభవిస్తారు. చికిత్స చేయకుండా వదిలేస్తే మరణానికి దారితీస్తుంది.

హురున్ గ్లోబల్ 500 లిస్ట్ 2022 లో భారత 5వ స్థానం

ఇటీవల విడుదల చేసిన హురున్ గ్లోబల్ 500 కంపెనీల జాబితా 2022 ప్రకారం, ప్రపంచంలోని 20 అత్యంత విలువైన కంపెనీలతో భారతదేశం ఐదవ స్థానానికి చేరుకుంది. గతంలో భారత్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉండేది. ఈ 20 కంపెనీల్లో పదకొండు ముంబైలో ఉండగా, 4 అహ్మదాబాద్‌లో మరియు నోయిడా, న్యూఢిల్లీ, బెంగళూరు మరియు కోల్‌కతాలో మిగతావి ఉన్నాయి.

ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ $202 బిలియన్లతో భారతదేశ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది, తర్వాతి స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ $139 బిలియన్లు మరియు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ $97 బిలియన్లతో తర్వాత స్థానంలో ఉన్నాయి. టాప్ 100 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రమే ఇండియా నుండి చోటు సంపాదించుకున్నాయి.

2022 హురున్ గ్లోబల్ 500 జాబితా ప్రకారం, యునైటెడ్ స్టేట్స్ 260 కంపెనీలతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది, 35 కంపెనీలతో చైనా రెండో స్థానంలో, 28 కంపెనీలతో జపాన్ 28 వ స్థానంలో మరియు 21 కంపెనీలతో యూకే 4వ స్థానంలో నిలిచాయి.

గ్లోబల్ సైంటిఫిక్ అవుట్‌పుట్‌లో భారత్ 3వ స్థానం

గ్లోబల్ సైంటిఫిక్ అవుట్‌పుట్‌లో భారతదేశం 7వ స్థానం నుండి 3వ స్థానానికి ఎగబాకింది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (NSF) మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క సైన్స్ & ఇంజనీరింగ్ ఇండికేటర్స్ 2022 నివేదిక ప్రకారం, శాస్త్రీయ ప్రచురణలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క స్థానం ఏడు నుండి మూడవ స్థానానికి మెరుగుపడిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ జాబితాలో చైనా, యూఎస్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

కాశ్మీరులో అత్యంత పొడవైన రైల్వే ఎస్కేప్ టన్నెల్ పూర్తి

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని 111 కి.మీ నిర్మాణంలో ఉన్న బనిహాల్-కత్రా రైల్వే లైన్‌పై నిర్మించబడిన 12.89 కి.మీ పొడవు గల భారతదేశపు పొడవైన ఎస్కేప్ టన్నెల్‌ను డిసెంబర్ 15న భారతీయ రైల్వేలు పూర్తి చేసింది. ఈ పొడవైన సొరంగం ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ (USBRL) ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది.

ఈ ఏడాది జనవరిలో పూర్తి చేసిన భారతీయ రైల్వేలో అత్యంత పొడవైన సొరంగం అయిన 12.75 కి.మీ టన్నెల్ T-49 తరువాత బనిహాల్-కత్రా మార్గంలో ఇది నాల్గవ సొరంగం. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) ద్వారా ఈ సొరంగం నిర్మించబడింది. ఇది డ్రిల్ మరియు బ్లాస్ట్ ప్రక్రియల యొక్క ఆధునిక సాంకేతికత.

గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2022

2022 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ (GFSI) నివేదికను బ్రిటిష్ వారపత్రిక ది ఎకనామిస్ట్ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 11వ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ యందు భారత్ 68వ స్థానంలో నిలిచింది.  113 దేశాలకు చెందిన ఈ నివేదికలో ఫిన్లాండ్, నార్వే దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 10 దేశాలలో 8 దేశాలు యూరప్ నుండి ఉన్నాయి.

ప్రతి వార్డులో గ్రంథాలయం కలిగిన నియోజకవర్గంగా ధర్మడం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ యొక్క ధర్మడం నియోజకవర్గం, భారతదేశంలో మొదటి సంపూర్ణ గ్రంథాలయ నియోజకవర్గంగా అవతరించింది. ఆ నియోజకవర్గంలో పరిధిలోని 136 వార్డులలో గ్రంధాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఘనతను దక్కించుకుంది.

కేరళ రాష్ట్రం, దేశంలో 100 శాతం అక్షరాస్యత కలిగిన ఏకైక రాష్ట్రంగా ఉంది. ప్రస్తుతం కేరళలో దాదాపు ప్రతి గ్రామంలో లైబ్రరీ అందుబాటులో ఉంది. ఈ ఘనతను సాధించేందుకు కేరళ రాష్ట్ర గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన పుతువాయిల్ నారాయణ పనికర్ 1990లోనే బీజం వేశారు. ఆనాడు, ఆయన ప్రారంభించిన కేరళ గ్రంధశాల సంఘం కార్యకలాపాలు ఈ రోజు కేరళలో సార్వత్రిక అక్షరాస్యతను సాధించేందుకు దోహదపడ్డయి.

అవార్డులు & గౌరవాలు - డిసెంబర్ 2022

కెనరా బ్యాంకుకు 'బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్' అవార్డు

కెనరా బ్యాంక్, భారతీయ బ్యాంకుల విభాగానికి సంబంధించి " బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022" గెలుచుకుంది. 1 డిసెంబర్ 2022 లండన్‌లో జరిగిన గ్లోబల్ బ్యాంకింగ్ సమ్మిట్‌లో కెనరా బ్యాంకు ఎండీ ఎల్వీ ప్రభాకర్ ఈ అవార్డు అందుకున్నారు.

టైమ్స్ 2022 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ

టైమ్ మ్యాగజైన్ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొంది. వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీని "ది స్పిరిట్ ఆఫ్ ఉక్రెయిన్" అని సంబోదించింది. రష్యా దాడిని దైర్యంగా ఎదుర్కోవడంలో పాటుగా, యుద్ధ సమయంలో ఉక్రేనియన్ ప్రజల పక్కన నిలిచిన తిరుకుగాను ఈ గౌరవం కల్పించింది. టైమ్ మ్యాగజైన్ 1927 నుండి యేటా, ఆ ఏడాది అత్యుత్తమ వ్యక్తులకు ఈ గౌరవం అందిస్తుంది.

గ్రీన్‌హౌస్-ఇన్-ఎ-బాక్స్ స్టార్టప్ ఖేతీకి ఎర్త్‌షాట్ ప్రైజ్

భారతదేశానికి చెందిన గ్రీన్ హౌస్-ఇన్-ఎ-బాక్స్ స్టార్టప్ ఖేతీ 2022 ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకుంది . యునైటెడ్ స్టేట్స్‌లోని బోస్టన్‌లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ప్రిన్స్ విలియం ప్రకటించిన ఐదుగురు విజేతలలో భారతదేశానికి చెందిన గ్రీన్‌హౌస్-ఇన్-ఎ-బాక్స్ కూడా ఉంది. ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్ విభాగంలో ఈ బహుమతిని గెలుచుకుంది. గత ఏడాది ప్రారంభించిన ఈ అవార్డును 'ఎకో ఆస్కార్స్' అని కూడా పిలుస్తారు.

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ఖేతీ, తెలంగాణలోని రైతులకు వాతావరణ మార్పుల కారణంగా వ్యవసాయం దెబ్బతినకుండా తక్కువ నీటితో వేగంగా వృద్ధి చెందే గ్రీన్‌హౌస్-ఇన్-ఎ-బాక్స్ పద్దతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానంగా చిన్నకారు రైతులకు అధిక లాభాలను పొందేలా ఖేతీ ఈ సేవలు అందిస్తుంది.

కృష్ణ వావిలాలకు యూఎస్ ప్రెసిడెన్షియల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండో-అమెరికన్ కృష్ణ వావిలాల, యూఎస్ ప్రెసిడెన్షియల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ప్రెసిడెన్షియల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అనేది అమెరికా యొక్క అత్యున్నత గగౌరవాలలో ఒకటి. దీనిని వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలు అందించే అమెరికన్ పౌరులకు అందిస్తారు. కృష్ణ వావిలాల ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ ఇండియా యొక్క వ్యవస్థాపకుడుగా మరియు ఛైర్మనుగా సేవలు అందిస్తున్నారు.

వీణా నాయర్'కు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అవార్డు

ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతి ఉపాధ్యాయురాలు వీణా నాయర్‌కు సెకండరీ సైన్స్ టీచింగ్‌లో శ్రేష్ఠత కోసం 2022 ఆస్ట్రేలియా ప్రధానమంత్రి బహుమతి అందుకున్నారు. ఈమె ఆస్ట్రేలియాలోని వ్యూబ్యాంక్ కాలేజ్ టెక్నాలజీ హెడ్ మరియు స్టీమ్ ప్రాజెక్ట్ లీడరుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

మేఘాలయ టీబీ నియంత్రణ కార్యక్రమంకు అవార్డు

మేఘాలయ జాతీయ వర్క్‌షాప్‌లో క్షయవ్యాధి నియంత్రణలో న్యాయవాద, కమ్యూనికేషన్ మరియు సామాజిక సమీకరణలో ఉత్తమ అభ్యాసానికి అవార్డు పొందింది. ఇటీవలే జరిగిన అడ్వకేసీ, కమ్యూనికేషన్ మరియు సోషల్ మొబిలైజేషన్ (ACSM) లో ఈ బెస్ట్ ప్రాక్టీస్ అవార్డును ఆ ప్రతినిధులకు అందించారు. మేఘాలయ ప్రభుత్వం ప్రారంభించిన క్షయ నిర్ములనకు సంబంధించిన 'జన్ అందోళన్' ఉద్యమం 2.6 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసినట్లు నివేదించింది.

తెలంగాణ తాండూర్ రెడ్ గ్రామ్ (తురు పప్పు)కు జిఐ ట్యాగ్

తెలంగాణలోని దాదాపు 3.74 లక్షల హెక్టార్లలో పండే పావురపు బఠానీ రకం తాండూరు ఎర్ర కందులకు భౌగోళిక సూచిక (జిఐ ట్యాగ్) లభించింది. దీనికి సంబంధించి యాలాల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సెప్టెంబరు 2020లో దరఖాస్తును దాఖలు చేసిన రెండేళ్ల తర్వాత ఈ గుర్తింపు కల్పించింది.

ఎర్ర కందులకు జీఐ గుర్తింపు వచ్చే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక చొరవ చూపింది. ఇది తెలంగాణ రాష్ట్రం నుండి జిఐ టాగ్ పొందిన 16వ ఉత్పత్తిగా అవతరించింది. పావురం బఠానీ (తురు పప్పు) గా పిలుచుకునే ఈ పప్పు ప్రాంతీయ వైవిధ్యంతో తాండూరు మరియు చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతాలలో పండిస్తారు. ఇది పూర్తి వర్షాధార పంట.

లడఖ్ రక్తసేయ్ కార్పో ఆప్రికాట్‌కు జిఐ ట్యాగ్

లడఖీ నేరేడు పండుగా పిలుచుకునే రక్తసేయ్ కార్పో ఆప్రికాట్‌, లడఖ్ నుండి భౌగోళిక సూచిక (జిఐ ట్యాగ్) పొందిన మొదటి ఉత్పత్తిగా నిలిచింది. లడఖ్ యందు ముప్పై రకాల ఆప్రికాట్‌లు కనిపిస్తాయి. అయితే రక్ష్‌సే కార్పో రకం ఈ ప్రాంతానికి ప్రత్యేకమైనది. సాటిలేని రుచితో, తెలుపు కెర్నల్‌ రంగుతో ఇది ప్రత్యేకత సంపాదించుకుంది.

లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత, ఆప్రికాట్ సాగును మెరుగుపరచడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. లడఖ్‌లోని ఉద్యానవన ఉత్పత్తులలో ఈ ఉత్పత్తి ప్రీమియం ఉత్పత్తిగా విక్రయించబడింది.

యూఐడిఎఐ కార్యాలయానికి గ్రీన్ బిల్డింగ్ అవార్డు

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రధాన కార్యాలయం ప్రతిష్టాత్మకమైన  గ్రిహా (GRIHA) ఎగ్జాంప్లరీ పెర్ఫార్మెన్స్ అవార్డ్ 2022 గెలుచుకుంది. GRIHA (గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్) అనేది భారతదేశంలోని గ్రీన్ బిల్డింగ్‌లకు అందించే జాతీయ రేటింగ్ సిస్టమ్.

యూఐడిఎఐ కార్యాలయం కార్బన్ ఉద్ఘారాలను తగ్గించడానికి రీసైకిల్ మరియు పునర్వినియోగ పద్దతులను అనుచరిస్తుంది. రోజువారీ విద్యుత్ అవసరాల కోసం సౌరశక్తిని ఉపయోగిస్తోంది. రోజువారీ నీటి వినియోగంలో 25% నుండి 30% రీసైకిల్ నీటిని ఉపయోగిస్తుంది. దీని ద్వారా సగటున సంవత్సరానికి 3590 కిలో లీటర్ల భూగర్భ జలాలను ఆదా చేస్తుంది.

ప్రొఫెసర్ తలపిల్ ప్రదీప్'కు విన్ ఫ్యూచర్ ప్రైజ్ 2022

భారతీయ శాస్త్రవేత్త, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ ప్రదీప్ తలప్పిల్, విన్‌ఫ్యూచర్ ప్రైజ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన విన్‌ఫ్యూచర్ ప్రైజ్ 2022ని గెలుచుకున్నారు. భూగర్భ జలాల నుండి ఆర్సెనిక్ మరియు ఇతర భారీ లోహాలను తొలగించడానికి తక్కువ-ధర వడపోత వ్యవస్థను ఆవిష్కరించినందుకు ఈ అవార్డు అందుకున్నారు. డిసెంబర్ 20న వియాత్నంలోని హనోయిలో జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో ఈ ప్రత్యేక బహుమతిని తీసుకున్నారు.

బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయరుగా బెత్ మీడ్

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి బెత్ మీడ్ 2022 బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న మొదటి మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా నిలిచారు. ఇంగ్లాండ్ దేశానికి మొదటి ఉమెన్స్ యూరో టైటిల్ అందించడంలో ఆమె పాత్రకు గాను ఈ గౌరవం అందించారు. మిగతా అవార్డుల జాబితా..

  • జెస్సికా గాడిరోవా - యంగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ
  • ఇంగ్లండ్ ఉమెన్ ఫుట్‌బాల్ టీం - టీమ్ ఆఫ్ ది ఇయర్
  • లియోనెల్ మెస్సీ - వరల్డ్ స్పోర్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్
  • ఉసేన్ బోల్ట్ - లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • రాబ్ బురో - హెలెన్ రోలాసన్ అవార్డు
  • మైక్ ఆల్డెన్ - అన్‌సంగ్ హీరో
  • సరీనా విగ్‌మాన్ - కోచ్ ఆఫ్ ది ఇయర్

రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి 2021-22

రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతి 2021-22 సుదీప్ సేన్ మరియు శోభన కుమార్ సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆంత్రోపోసీన్ : క్లైమేట్ చేంజ్, కంటాజియాన్, కన్సోలేషన్ కోసం సుదీప్ సేన్ ఈ అవార్డు అందుకోగా, శోభన కుమార్ తన హైబున్ కలెక్షన్ 'ఎ స్కై ఫుల్ ఆఫ్ బకెట్ లిస్ట్స్' కోసం ఈ అవార్డు అందుకున్నారు. 2018 లో ప్రారంభించిన ఈ అవార్డును ఏటా డిసెంబర్ నెలలో ఆ ఏడాది అత్యుత్తమ భారతీయ రచయితలకు అందిస్తారు.

సాహిత్య అకాడమీ అవార్డులు 2022

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించబడ్డాయి. 2022 ఏడాదికి సంబంధించి 23 విభిన్న భారతీయ భాషలకు ప్రకటించిన అవార్డులలో ఏడు కవితా సంకలనాలు, ఆరు నవలలు, రెండు కథా సంకలనాలు, రెండు సాహిత్య విమర్శలు, మూడు నాటకాలు మరియు ఒక ఆత్మకథ ఉన్నాయి.

2022కి గాను ఆంగ్ల సాహిత్యానికి అనురాధ రాయ్‌కు, హిందీ సాహిత్యానికి బద్రీ నారాయణ్‌కు మరియు మరాఠీ సాహిత్యానికి ప్రవీణ్ బాండేకర్‌కు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు. తెలుగు భాషకు సంబంధించి మనోధర్మపరాగం నవలకు గాను మధురాంతకం నరేంద్ర ఈ ఏడాది అవార్డు దక్కించుకున్నారు. అవార్డుల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి.

భారతీయ సైక్లిస్ట్ స్వస్తి సింగ్‌కు 30వ ఏకలబ్య పురస్కారం

ఒడిశాకు చెందిన అంతర్జాతీయ సైక్లిస్ట్ స్వస్తి సింగ్‌కు 2022 సంవత్సరానికి 30వ ఏకలబ్య పురస్కారం అందజేశారు. యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. అవార్డు గ్రహీతకు ఒక ప్రశంసా పత్రం, ట్రోఫీ మరియు రూ. 5 లక్షల నగదును అందిస్తారు.

2020 నుండి మార్చి 2022 వరకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆమె చేసిన ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. ఐఎమ్ఎఫ్ఎ యొక్క స్వచ్ఛంద విభాగం అయిన ఇండియన్ మెటల్స్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్. డిసెంబర్ 23న నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.

ప్రభు చంద్ర మిశ్రాకు అటల్ సమ్మాన్ అవార్డు

ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టెమ్‌సెల్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ అధ్యక్షుడు ప్రభు చంద్ర మిశ్రాకు 2022 అటల్ సమ్మాన్ అవార్డు లభించింది. సైన్స్ , రీసెర్చ్ రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అవార్డు అందజేశారు. డిసెంబర్ 27న నిర్వహించిన 9వ అటల్ సమ్మాన్ సమరోహ్ సందర్భంగా ఈ అవార్డును అందించారు.

స్పోర్ట్స్ అఫైర్స్ - డిసెంబర్ 2022

విజయ్ హజారే ట్రోఫీ 2022 సౌరాష్ట్ర సొంతం

విజయ్ హజారే ట్రోఫీ 2022 ను సౌరాష్ట్ర సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచులో 5 వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. విజయ్ హజారే ట్రోఫీని రంజీ వన్-డే ట్రోఫీ అని కూడా పిలుస్తారు. ఇది రంజీ రాష్ట్ర జట్లతో కూడిన వార్షిక పరిమిత ఓవర్ల క్రికెట్ దేశీయ పోటీ. దీనిని మాజీ భారత్ క్రికెటర్ విజయ్ హజారే పేరుతొ నిర్వహిస్తారు.

పెరూ పారా బ్యాడ్మింటన్ టోర్నీలో సుకాంత్ కదమ్'కు స్వర్ణం

పారా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత సుకాంత్ కదమ్ నేతృత్వంలోని భారత షట్లర్లు లిమాలోని పెరూ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో ఆరు స్వర్ణ పతకాలు సాధించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు మొత్తం 14 పతకాలు సాధించగా అందులో 6 గోల్డ్, 1 సిల్వర్ మరియు 7 బ్రోన్జ్ మెడల్స్ ఉన్నాయి.

మెక్‌లాఫ్లిన్-లెవ్రోన్, డుప్లాంటిస్'కు వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

ప్రపంచ ఛాంపియన్ అమెరికన్ హర్డిలర్ సిడ్నీ మెక్‌లాఫ్లిన్-లెవ్రోన్ మరియు స్వీడిష్ పోల్ వాల్టర్ మోండో డుప్లాంటిస్ 2022  సంబంధించి 'వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డులను గెలుచుకున్నారు. మెక్‌లాఫ్లిన్-లెవ్రోన్ ఈ ఏడాది మహిళల ప్రపంచ 400 మీటర్ల హర్డిల్స్ రికార్డును బద్దలు కొట్టగా, డుప్లాంటిస్ 2022లో మూడు ప్రపంచ రికార్డులతో పాటు పురుషుల ప్రపంచ ఇండోర్ టైటిల్‌ను వరుస మూడు సంవత్సరాలలో రెండవ సారి గెలుచుకున్నాడు.

కింగ్స్ కప్ రెగట్టాలో భారత సెయిలర్ ఆనందికి స్వర్ణం

34వ కింగ్స్ కప్ రెగట్టాలో ఓవరాల్ ఓపెన్ స్కిఫ్ విభాగంలో భారత సెయిలర్ ఆనంది నందన్ చందావర్కర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ముంబైకి చెందిన 13 ఏళ్ల ఆమె గత మూడేళ్లుగా ఓపెన్ స్కిఫ్ విభాగంలో సెయిలింగ్ చేస్తుంది. ఆమె ఇదివరకు ఫ్రెంచ్ ఓపెన్ స్కిఫ్, జపాన్ ఓపెన్ స్కిఫ్ పోటీలలో ప్రతిభను ప్రదర్శించింది. కింగ్స్ కప్ రెగట్టా 1987 లో ప్రారంభమైంది. ఇది ఏటా థాయిలాండ్ యందు నిర్వహిస్తారు.

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా మేఘనా అహ్లావత్

మేఘనా అహ్లావత్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మేఘనా అహ్లావత్ హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా భార్య. అలానే ఎనిమిది సార్లు మాజీ జాతీయ ఛాంపియన్ కమలేష్ మెహతా, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కొత్త సెక్రటరీ జనరల్'గా ఎన్నికయ్యారు.

భారత ఒలింపిక్ సంఘం మొదటి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష డిసెంబర్ 10 న ఎన్నికయ్యారు. ఇటీవలే జరిగిన ఐఓఏ ఎన్నికల్లో ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 95 ఏళ్ల చరిత్రలో ఐఓఏకి నాయకత్వం వహించిన మొదటి ఒలింపియన్ మరియు మొదటి అంతర్జాతీయ పతక విజేతగా ఉష నిలిచారు.

ఇదే ఎన్నికలలో భారత ఒలింపిక్ సంఘం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా అజయ్ హెచ్ పటేల్ , వైస్ ప్రెసిడెంట్‌లుగా రాజలక్ష్మి సింగ్ డియో మరియు గగన్ నారంగ్ ఎన్నికయ్యారు.

టెన్నిస్ ప్రీమియర్ లీగ్ 2022 విజేతగా హైదరాబాద్ స్ట్రైకర్స్

హైదరాబాద్ స్ట్రైకర్స్ వరుసగా రెండవ సంవత్సరం టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. పుణేలో జరిగిన 4వ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ ( TPL) 2022 తుదిపోరులో 41-32తో ముంబై లియోన్ ఆర్మీని ఓడించి హైదరాబాద్ స్ట్రైకర్స్ విజేతగా నిలిచింది.

ఫినా వరల్డ్ స్విమ్మింగ్‌లో శివ శ్రీధర్ జాతీయ రికార్డు

ఫినా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022 యొక్క 200 మీటర్ల మెడ్లేలో ఇండియాకు చెందిన శివ శ్రీధర్ జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఈవెంట్‌లో భారతదేశం మరియు తన యొక్క మునుపటి జాతీయ రికార్డు 2:02.42 సెకన్లు శివ శ్రీధర్ 1:59:80 ద్వారా అధిగమించాడు.

ఫినా వరల్డ్ స్విమ్మింగ్‌లో చాహత్ అరోరా జాతీయ రికార్డు

ఫినా వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022 యొక్క మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో భారత స్విమ్మర్ చాహత్ అరోరా జాతీయ రికార్డును నెలకొల్పింది. ఈ ఈవెంట్‌లో 1:13:13 సెకండ్లతోభారతదేశం యొక్క మునుపటి జాతీయ రికార్డును అధిగమించింది.

ఫిఫా ప్రపంచ కప్ 2022 విజేతగా అర్జెంటీనా

ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌తో అర్జెంటీనా విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. నాటకీయంగా సాగిన తుదిపోరులో అదనపు సమయం తర్వాత ఇరుజట్లు 3-3 డ్రాగా నిలిచాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి అర్జెంటీనా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

మొత్తం మీద అర్జెంటీనాకు ఇది మూడో ప్రపంచకప్ విజయం. 36 సంవత్సరాల క్రితం 1986లో డియెగో మారడోనా నాయకత్వంలో టైటిల్‌ గెలిచిన తర్వాత ఆర్జెంటినా గెలిచినా మొదటి కప్ ఇదే. ఈ జాబితాలో బ్రెజిల్ అత్యధికంగా 5 సార్లు ఫిఫా ప్రపంచ విజేతగా నిలవగా, జర్మనీ, ఇటలీ జట్లు నాలుగేసి సార్లు టైటిల్ సొంతం చేసుకున్నాయి.

ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో అర్జెంటీనాను విజయపథంలో నడిపించిన ఆ జట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది ప్రపంచ కప్‌లో ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్‌ను గెలుచుకున్నాడు. అదే సమయంలో తన కెరీరులో మొదటి ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్నాడు.

అర్జెంటీనాకు చెందిన మరో క్రీడాకారుడు ఎమిలియానో ​​మార్టినెజ్ గోల్డెన్ గ్లోవ్ అవార్డును గెలుచుకోగా, ఎంజో ఫెర్నాండెజ్ బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు. అయితే ఎనిమిది గోల్స్‌తో టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఫ్రాన్స్ క్రీడాకారుడు కైలియన్ బప్పీ గోల్డెన్ బూట్ సొంతం చేసుకున్నాడు.

అంధుల టీ20 ప్రపంచకప్‌ విజేతగా భారత్

అంధుల టీ20 ప్రపంచకప్‌ 2022 ను భారత్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 17న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను 120 పరుగుల తేడాతో ఓడించింది, వరుసగా మూడోసారి అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.

అంధుల టీ20 ప్రపంచకప్‌ 2022 కు భారత్ ఆతిధ్యం ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే 4వ ఎడిషన్ మ్యాచులకు పాకిస్తాన్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది ఈ టోర్నీలో ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గున్నాయి. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరించారు.

2022 మహిళల ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్‌ విజేతగా భారత్

భారత మహిళల హాకీ జట్టు ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. డిసెంబర్ 17న జరిగిన శిఖరాగ్ర పోరులో స్పెయిన్‌పై 1-0 తేడాతో విజయం సాధించిన భారత్ తొలి ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ హాకీ నేషన్స్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో 2023-24 ప్రో లీగ్‌లో భారత్ బెర్త్ ఖరారైంది.

అరంగేట్రంలో 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడుగా రెహాన్ అహ్మద్

ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన పురుషుల టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. 18 సంవత్సరాల 126 రోజుల వయసు ఉన్న రెహాన్ అహ్మద్, ఇటీవలే డిసెంబర్ 19న పాకిస్తానుతో జరిగిన మూడో టెస్టులో 5-48 ప్రదర్శనతో ఈ రికార్డు నమోదు చేసాడు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా సామ్ కుర్రాన్

ఇంగ్లాండ్ టీనేజ్ ఆల్ రౌండర్ శామ్ కుర్రాన్, మునపటి క్రిస్ మోరిస్ రికార్డును (16.25 కోట్లు ) బద్దలు కొట్టి ఐపిఎల్ వేలంలో అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా అవతరించాడు. డిసెంబర్ 23 నిర్వహించిన 2022 ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఇంగ్లీష్ క్రికెటరును 18.5 కోట్లు చెల్లించి పంజాబ్ కింగ్స్‌ యాజమాన్యం సొంతం చేసుకుంది.

జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ విజేతగా గెటో సోరా

డిసెంబర్ 23న మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన  అండర్ 9 టాప్ అరేనా జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గెటా సోరా దక్కించుకున్నాడు. ప్రత్యర్థిని వరుస సెట్లలో 21-5, 21-16 ఓడించడం ద్వారా విజేతగా నిలిచాడు. గత రెండు నెలల్లో సోరాకు ఇది రెండో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టైటిల్.

ఈ నవంబర్‌లో, థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లోని బాంథాంగ్‌యార్డ్ బ్యాడ్మింటన్ స్కూల్‌లో జరిగిన బహుళజాతి BTY-యోనెక్స్-సింగ ఛాంపియన్‌షిప్‌ను 7 ఏళ్ల సోరా గెలుచుకున్నాడు.

అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 25 మహిళా అథ్లెట్లలో పీవీ సింధు

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా అథ్లెట్ల యొక్క 2022 ఫోర్బ్స్ వార్షిక జాబితాలో టాప్ 25లో ఉన్న ఏకైక క్రీడాకారిణిగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నిలిచింది. ఈ జాబితాలో జపాన్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా వరుసగా మూడవ ఏడాది అగ్రస్థానంలో నిలవగా, సింధు 12వ స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో టాప్ 10లో సెరెనా విలియమ్స్, ఎమ్మా రాడుకాను, ఇగా స్వియాటెక్, వీనస్ విలియమ్స్, కోకో గౌఫ్ మరియు జెస్సికా పెగులా ఉన్నారు. ఇకపోతే జనరల్ కేటగిరిలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల ఫోర్బ్స్ జాబితాలో టాప్ 50లో చోటు దక్కించుకున్న ఇద్దరు మహిళలు ఒసాకా మరియు సెరెనా మాత్రమే.

షేన్ వార్న్ పేరుతో ఆస్ట్రేలియన్ టెస్ట్ ప్లేయర్ అవార్డు

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ గౌరవార్థం, ఆస్ట్రేలియా పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పేరును షేన్ వార్న్ మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా పేరు మార్చింది. ఈ ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులను జనవరి 30న ప్రకటించనున్నారు. షేన్ వార్న్ ఈ ఏడాది మార్చిలో అనుకోని విధంగా థాయిలాండులో మృతి చెందాడు.

ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపీకి రజతం

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండవ భారత చెస్ క్రీడాకారిణిగా కోనేరు హంపీ రికార్డు నమోదు చేసింది. కజకిస్తాన్‌లోని అల్మాటీలో జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ ఆఖరి రౌండ్‌లో చైనాకు చెందిన జోంగీ టాన్‌ను ఓడించి రజతం గెలుచుకుంది.

నాల్గవ సీడ్ హంపీ 12.5 పాయింట్లు సాధించి, కజకస్తాన్‌కు చెందిన స్వర్ణ పతక విజేత,  బిబిసర బాలబయెవా కంటే కేవలం సగం పాయింట్ వెనుకబడి స్వర్ణ పతకం కోల్పోయింది. దీనితో బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండవ భారత చెస్ క్రీడాకారిణిగా, మొదటి మహిళాగా నిలిచారు.

కోనేరు హంపీ 15 ఏళ్ళ, 27 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించిన అతి పిన్న వయస్కురాలుగా ప్రసిద్ధి చెందారు. ఈమె ఏ రేటింగ్ పొందిన భారతదేశపు తొలి మహిళా చెస్ క్రీడాకారిణి.

3 Comments

Comments are closed.