కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, స్వామిత్వ యోజన, గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, అటల్ భుజల్ యోజన వంటి ప్రధాన పథకాలతో పాటుగా పదుల సంఖ్యలో ఇతర సంక్షేమ పథకాలను అందిస్తుంది. పోటీ పరీక్షల దృక్కోణంలో వాటికీ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
అగ్నిపథ్ పథకం
అగ్నిపథ్ పథకం అనేది త్రివిధ దళాలకు సంబందించిన నూతన రిక్రూట్మెంట్ కార్యక్రమం. ఇది కమీషన్డ్ ర్యాంక్ కంటే తక్కువ స్థాయి సైనికుల నియామకం కోసం ఉద్దేశించబడింది. దీనిని 14 జూన్ 2022 లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రిక్రూట్ అయిన వారందరూ నాలుగు సంవత్సరాల కాలానికి మాత్రమే నియమించబడతారు. ఈ పథకం కింద ఎంపిక చేయబడిన యువతను అగ్నివీర్స్ అని పిలుస్తారు.
ఇంటర్మీడియట్ పూర్తిచేసి, 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ పథకం పరిధిలో దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పథకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో 4.76 లక్షల వార్షిక ప్యాకేజీ అందించబడుతుంది. 4వ సంవత్సరం బయటకు వచ్చే సమయానికి 6.9 లక్షల వరకు వార్షిక వేతనం పెంచబడుతుంది. నాలుగేళ్ళ తర్వాత బయటకు వచ్చిన సైనికులకు సేవా నిధి నుండి 11.7 లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది, ఈ డబ్బు పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. నాలుగు సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత, అగ్నివీర్లు తమకు నచ్చిన ఉద్యోగంలో తమ వృత్తిని కొనసాగించడానికి ఇతర రంగాలలో ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తారు.
- పథకం పేరు : అగ్నిపథ్ పథకం
- ప్రారంభ తేదీ : 14 జూన్ 2022
- మంత్రిత్వ శాఖ : రక్షణ మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది 1 ఏప్రిల్ 2023 నుండి 31 మార్చి 2025 మధ్య రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే వన్-టైమ్ సేవింగ్ స్కీమ్. మహిళల్లో పెట్టుబడిని ప్రోత్సహించడానికి బడ్జెట్ 2023 ద్వారా ప్రకటించబడింది. ఈ పథకం కింద మహిళలు స్థానిక పోస్టాఫీసు లేదా ఏదైనా రిజిస్టర్డ్ బ్యాంక్‌లో ప్రత్యేక ఖాతా తెరిసి గరిష్టంగా 2 లక్షల వరకు పెట్టుబడిపెట్టే అవకాశం కల్పిస్తుంది. ఇది రెండేళ్లపాటు ఇతర పొదుపు పథకాల కంటే 7.50% హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. 18 ఏళ్ళు నిండిన మహిళలు అందరూ దీనికి అర్హులు.
- పథకం పేరు : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC)
- ప్రారంభ తేదీ : 01 ఏప్రిల్ 2023
- మంత్రిత్వ శాఖ : ఆర్థిక మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : మహిళల పెట్టుబడిపై 7.5 స్థిర వడ్డీ ప్రయోజనం
పీఎం పోషణ్ శక్తి నిర్మాణ అభియాన్
ఇది 1995లో పాఠశాల పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించడానికి ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం యొక్క పునరుద్ధరించబడిన వెర్షన్. ఈ పథకాన్ని విద్యా మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద, దేశంలోని 11.20 లక్షల పాఠశాలల్లో చదువుతున్న I నుండి 8 తరగతులకు చెందిన 11.80 కోట్ల మంది పిల్లలకు అదనంగా ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-స్కూల్స్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తుంది. ఈ నూతన పథకం 2021 లో ప్రారంభించబడింది.
- పథకం పేరు : పీఎం పోషణ్ శక్తి నిర్మాణ అభియాన్
- ప్రారంభ తేదీ : 15 ఆగష్టు 1995 (న్యూ వెర్షన్ 2021)
- మంత్రిత్వ శాఖ : విద్య మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : పాఠశాల పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం
స్వామిత్వ యోజన
స్వామిత్వ యోజన అనేది గ్రామాలలో మెరుగైన సాంకేతికతతో కూడిన సర్వే, మ్యాపింగ్ కోసం ఏర్పాటు చేసిన పథకం. ఇది సామాజిక-ఆర్థిక సాధికారతను, స్వీయ సాధికారతను ప్రోత్సహించడానికి ఏప్రిల్ 24, 2020న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ భూభాగాలను మ్యాపింగ్ చేసి, అర్హులకు చట్టపరమైన యాజమాన్య కార్డులను అందజేస్తారు.
ఈ పథకం 2021 నుండి 2025 మధ్య దేశవ్యాప్తంగా 6.62 లక్షల గ్రామాలలో భూసర్వే చేయబడుతుంది. ఈ పథకం వ్యక్తుల ఆస్తులపై యాజమాన్య హక్కులను అందిస్తుంది. అదే సమయంలో గ్రామ ఆస్తుల మ్యాపింగ్ చేయడం ద్వారా ప్రతి గ్రామానికి నిర్దిష్ట గ్రామ సరిహద్దుల నిర్దేశించి, గ్రామీణ ప్రాంతాల బలమైన అభివృద్ధికి ద్రోహదపడుతుంది.
- పథకం పేరు : స్వామిత్వ యోజన
- ప్రారంభ తేదీ : 24 ఏప్రిల్ 2020
- మంత్రిత్వ శాఖ : పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : సార్వత్రిక గ్రామీణ భూసర్వే 2021 -25
గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్
భారతదేశంలోని కార్మికులపై కోవిడ్19 ప్రభావాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ చొరవను ప్రారంభించింది. ఇది గ్రామీణ పేదల కోసం రూపొందించిన ఉపాధి పథకం. ఇది 20 జూన్ 2020న ప్రారంభమై 22 అక్టోబర్ 2020న ముగించబడినది. ఈ పథకం పట్టణ ప్రాంతాల నుండి గ్రామాలకు వలస వెళ్లిన 670,000 మంది కార్మికులకు కోవిడ్ సమయంలో 125 రోజుల ఉపాధిని కల్పించింది. ఈ పథకం బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా మరియు జార్ఖండ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల పరిధిలో అమలు చేయబడింది.
- పథకం పేరు : గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్
- ప్రారంభ తేదీ : 20 జూన్ 2020
- మంత్రిత్వ శాఖ : 12 మంత్రిత్వ శాఖలు
- ప్రయోజనం : వలస కార్మికులకు తాత్కాలిక ఉపాధి
పీఎం మత్స్య సంపద యోజన
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన అనేది మత్స్యకార రంగంలో మౌలిక సదుపాయాల అంతరాలను తగ్గించడానికి ప్రారంభించిన ఒక చొరవ. ఈ కార్యక్రమం 5 జూలై 2019న న ప్రారంభించబడింది. 2019–20 కేంద్ర బడ్జెట్‌లో, కొత్తగా ఏర్పడిన ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరానికి మత్స్య రంగంలో ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి దాదాపు 804.75 కోట్లు బడ్జెట్ కేటాయించారు.
- పథకం పేరు : పీఎం మత్స్య సంపద యోజన
- ప్రారంభ తేదీ : 5 జూలై 2019
- మంత్రిత్వ శాఖ : ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : మత్స్యకార రంగంలో మౌలిక సదుపాయాల కల్పన
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు కనీస వ్యవసాయ పెట్టుబడి మద్దతుగా సంవత్సరానికి 6,000 /- అందించే భారత ప్రభుత్వం యొక్కకార్యక్రమం. దీనిని 1 ఫిబ్రవరి 2019లో 2019 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన, మధ్యంతర కేంద్ర బడ్జెట్ సమయంలో పీయూష్ గోయల్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం యొక్క రైతు బంధు పథకం స్ఫూర్తిగా రూపొందించబడింది.
- పథకం పేరు : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
- ప్రారంభ తేదీ : 1 ఫిబ్రవరి 2019
- మంత్రిత్వ శాఖ : ఆర్థిక మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : రైతులకు కనీస వ్యవసాయ పెట్టుబడి మద్దతు
జల్ జీవన్ మిషన్
జల్ జీవన్ మిషన్ అనేది 2024 నాటికి దేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన మరియు తగినంత త్రాగునీటిని అందించడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. దీనిని మొదటిసారి 1972లో ప్రారంభించారు. 2009లో నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్‌గా పునర్నిర్మించబడింది. 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ ఈ జల్ జీవన్ మిషన్ కోసం ప్రస్తావించారు. 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నది దీని సారాంశం.
జల్ జీవన్ మిషన్‌లో భాగంగా 2019-20 బడ్జెట్ ప్రసంగంలో హర్ ఘర్ నల్ సే జల్ (హర్ ఘర్ జల్) కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిలో భాగంగా గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, నీటి సంరక్షణ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పద్దతుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో నీటి పునర్వినియోగం వంటి మూలాధార స్థిరత్వ చర్యలను చేపట్టారు.ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి, భారతదేశంలో గృహ పరిశుభ్రమైన కుళాయి నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరిచింది.
ఈ మిషన్ పురోగతి వివరాలను ట్రాక్ చేయడానికి ప్రభుత్వం వెబ్‌సైట్ ఆధారిత డాష్‌బోర్డ్‌ను కూడా ప్రచురించింది. ఆగస్టు 2022లో, గోవా మరియు దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ 100% ట్యాప్-వాటర్ యాక్సెస్ సాధించి, మొదటి 'హర్ ఘర్ జల్' సర్టిఫికేట్ పొందిన రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించాయి. జనవరి 2023 నాటికి, హర్యానా, గుజరాత్, పుదుచ్చేరి మరియు తెలంగాణ రాష్ట్రాలు కూడా 100% కుళాయి-నీటి ప్రాప్యతను సాధించిన జాబితాలో చేరాయి.
- పథకం పేరు : జల్ జీవన్ మిషన్
- ప్రారంభ తేదీ : 1 ఫిబ్రవరి 2019
- మంత్రిత్వ శాఖ : జల్ శక్తి మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : దేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్లు ఏర్పాట్లు
అటల్ భుజల్ యోజన
అటల్ భుజల్ యోజన అనేది భూగర్భ జల నిర్వహణ కార్యక్రమం. దీనిని 25 డిసెంబర్ 2019న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశంలోని ఏడు రాష్ట్రాలలో భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ జాబితాలో గుజరాత్ , హర్యానా , కర్ణాటక , మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర , రాజస్థాన్ , మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
- పథకం పేరు : అటల్ భుజల్ యోజన
- ప్రారంభ తేదీ : 25 డిసెంబర్ 2019
- మంత్రిత్వ శాఖ : జల్ శక్తి మంత్రిత్వ శాఖ
- ప్రయోజనం : 7 రాష్ట్రాలలో భూగర్భ జల నిర్వహణ కార్యక్రమం.
పీఎం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్
ఈ పథకం రైతులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా సోలార్ పంపులు మరియు ఇతర పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూపొందించబడింది. ఇది ప్రధానంగా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతో పాటుగా సంప్రదాయ డీజిల్/విద్యుత్ వ్యవసాయ పంపుల స్థానంలో సోలారైజ్ పంపుల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది.
ఈ పథకం 2015 పారిస్ ఒప్పందం సమయంలో చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా రూపొందించబడి. ఇది బంజరు/వ్యవసాయేతర భూభాగాల్లో 500 కిలో వాట్స్ నుండి 2 మెగా వాట్స్ సామర్థ్యం గల సౌర లేదా ఇతర పునరుత్పాదక ఇంధన ఆధారిత పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందిస్తుంది. గరిష్టంగా 10 కోట్ల వరకు లేదా ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం రుణ సదుపాయం కల్పిస్తుంది.
- పథకం పేరు : పీఎం కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్
- ప్రారంభ తేదీ : మార్చి 2019
- మంత్రిత్వ శాఖ : మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ
- ప్రయోజనం : 7 రాష్ట్రాలలో భూగర్భ జల నిర్వహణ కార్యక్రమం.