Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : స్పోర్ట్స్ అఫైర్స్
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : స్పోర్ట్స్ అఫైర్స్

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన క్రీడా అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

భారతదేశ 78వ గ్రాండ్ మాస్టరుగా కౌస్తవ్ ఛటర్జీ

డిసెంబర్ 30న న్యూఢిల్లీలో జరిగిన ఎంపిఎల్ 59వ జాతీయ సీనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచినా కౌస్తవ్ ఛటర్జీ, భారతదేశం యొక్క 78వ గ్రాండ్‌మాస్టరుగా అవతరించాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఈ 19 సంవత్సరాల కౌస్తవ్ ఛటర్జీ, ఆ రాష్ట్రం నుండి 10వ గ్రాండ్‌మాస్టరుగా నిలిచాడు. 2021లో బంగ్లాదేశ్‌లోని షేక్ రస్సెల్ GM 2021లో కౌస్తవ్ తన మొదటి GM-నార్మ్‌ని పొందాడు. తన రెండవ GM ఆసియా కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ 2022లో సాధించాడు.

గ్రాండ్ మాస్టర్ (GM) అనేది చెస్ క్రీడాకారులకు, ఇంటెర్నేషన్ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రదానం చేసే బిరుదు. ఒకసారి సాధించిన ఈ గౌరవం జీవితాంతం ఉంచబడుతుంది. గ్రాండ్ మాస్టర్ హోదా పొందేందుకు కనీసం మూడు GM నిబంధనలను పొందాలి, 2,500 Elo పాయింట్ల ప్రత్యక్ష రేటింగ్‌ను కలిగి ఉండాలి. ఆటగాడి ప్రత్యర్థుల్లో కనీసం 33% మంది గ్రాండ్‌మాస్టర్‌లు అయి ఉండాలి. ఆటగాడి ప్రత్యర్థులు తప్పనిసరిగా కనీసం 3 వేర్వేరు చెస్ సమాఖ్యల నుండి వచ్చి ఉండాలి.

భారతదేశ 79వ గ్రాండ్ మాస్టరుగా ఎం ప్రాణేష్

తమిళనాడుకు చెందిన ఎం ప్రాణేష్ ఇటీవల రిల్టన్ కప్‌లో టైటిల్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ 79వ చెస్ గ్రాండ్‌మాస్టరుగా అవతరించాడు. 16 ఏళ్ల ఈ యువ చదరంగ క్రీడాకారుడు 29 దేశాల నుంచి మొత్తం 136 మంది ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నీలో నార్వేకు చెందిన గ్రాండ్ మాస్టర్  ఫ్రోడ్ ఒలావ్ ఒల్సేన్ ఉర్కెడల్‌ను ఓడించడం ద్వారా 2500 ELO రేటింగ్‌లను సాధించాడు. దీంతో ఈ ఏడాది భారత్‌కు తొలి గ్రాండ్‌మాస్టరుగా నిలిచాడు.

బ్యాంకాక్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న యూకీ-సాకేత్ జోడి

బ్యాంకాక్‌ ఓపెన్‌ టెన్నిస్‌ 2023 టైటిల్‌ను యూకీ భాంబ్రీ, సాకేత్‌ మైనేనిలతో కూడిన భారత టాప్‌ సీడ్‌ గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లోని నొంతబురిలో జరిగిన తుది పోరులో ఇండోనేషియా-ఆస్ట్రేలియన్ కాంబో క్రిస్టోఫర్ రంగట్ మరియు అకిరా శాంటిల్లాన్‌లను 2-6 7-6, 14-12 తేడాతో ఓడించడం ద్వారా విజేతగా నిలిచారు. దీనితో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్‌లో పోటీపడే అవకాశం దక్కించుకున్నారు.

డబల్ సెంచరీ చేసిన అతి పిన్న క్రికెటరుగా శుభమాన్ గిల్

అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 5 వ భారత ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. అలానే 23ఏళ్ళ వయస్సులో డబల్ సెంచరీ చేసిన  అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా అవతరించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్నా ద్వైపాక్షిక సిరీసులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కేవలం 145 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు.

అలానే కేవలం 19 మ్యాచ్‌లలో గిల్ భారత్ తరఫున కెరీర్‌లో 1000 వన్డే పరుగులను కూడా చేరుకున్నాడు. ఈ విభాగంలో అత్యుత్తమ రికార్డు పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్ (18 మ్యాచులలో 1000 పరుగులు) పేరిట ఉంది.

అంతర్జాతీయ వన్డే క్రికెట్టుతో ఇప్పటి వరకు 8 డబల్ సెంచరీలు నమోదు కాగా, అందులో 5 డబల్ సెంచరీలు భారత క్రీడాకారుల నుండి నమోదు అయ్యాయి. ఇందులో అత్యధికంగా మూడు సార్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మార్కు నమోదు చేసాడు. అదే సమయంలో అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు (264 పరుగులు) రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. ఇకపోతే మొదటి అంతర్జాతీయ వన్డే డబల్ సెంచరీని 2010లో సచిన్ టెండూల్కర్ నమోదు చేసాడు.

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో బెలిండా క్లార్క్ కాంస్య విగ్రహం

ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెట్ కెప్టెన్ బెలిండా క్లార్క్ ప్రపంచంలో విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి మహిళా క్రికెటర్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటుకు ఆమె చేసిన సేవలకు గాను సిడ్నీ క్రికెట్ గ్రౌండు వెలుపల ఆమె కాంస్య విగ్రహాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది. ఈ ఘనత పొందిన ఏకైక మహిళా ఈమె మాత్రమే.

బెలిండా జేన్ క్లార్క్, దాదాపు 11 ఏళ్ళు ఆస్ట్రేలియా మహిళా కక్రికెట్ జట్టుకు కెప్టెనుగా వ్యవహరించారు. ఈమే నాయకత్వంలో ఆస్ట్రేలియా మహిళా జట్టు 83% విజయాలను నమోదు చేసింది. మహిళా వన్డే క్రికెటులో మొదటి డబల్ సెంచరీ సాధించిన ఘనత బెలిండా సొంతం. అలానే ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చోటు దక్కించుకున్న మొదటి మహిళ క్రికెటరుగా కూడా నిలిచారు.

హాకీవర్ప్‌ను ప్రారంభించిన హాకీ ఇండియా

హాకీ ఇండియా మెటావర్స్ ప్రపంచంలోకి ప్రవేశించిన మొదటి జాతీయ క్రీడా సమాఖ్యగా అవతరించింది. భువనేశ్వర్ మరియు రూర్కెలాలో జరుగుతున్న పురుషుల ప్రపంచ హాకీ కప్‌ మ్యాచులకు సంబంధించి మెటావర్స్ అనుభూతిని కల్పించేందుకు 'హాకీవర్స్' పేరుతొ కొత్త వర్చువల్ ప్లాటుఫామ్ ప్రారంభించింది.

హాకీవర్స్ హాకీ క్రీడకు సంబంధించి కొత్త వర్చువల్ అనుభవాన్ని అందిస్తుంది. గ్లోబల్ హాకీ అభిమానులు తమ అభిమాన క్రీడను వీరిక్షించవచ్చు మరియు అనుభవించవచ్చు. 2023 హాకీ ప్రపంచ కప్‌కు ఒడిశా (భారత్) ఆతిధ్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్ జనవరి 13 నుండి 29 మధ్య భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో మరియు రూర్కెలాలోని కొత్తగా నిర్మించిన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో జరగనుంది.

ఈ టోర్నమెంటులో ఇండియాతో సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బెల్జియం, చిలీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, కొరియా, మలేషియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, స్పెయిన్ మరియు వేల్స్'తో కలిపి మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ప్రస్తుతం ఇండియా ప్రపంచ హాకీ ర్యాంకింగులో 5 ర్యాంకులో ఉంది. హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.

ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా యాన్ సెయాంగ్

న్యూఢిల్లీలోని కెడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కొరియా క్రీడాకారిణి యాన్ సెయాంగ్ విజేతగా నిలిచింది. తుది పోరులో జపనీస్‌ క్రీడాకారిణి ప్రస్తుత ప్రపంచ నంబర్ 1 అకానె యమగుచిను 15-21, 21-16, 21-12 తో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది.

పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్‌సెన్'ను ఓడించడం ద్వారా థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్‌సర్న్‌ విజేతగా నిలిచాడు. 2023 ఇండియా ఓపెన్ అధికారికంగా యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2023 గా పిలవబడుతుంది. ఈ టోర్నమెంటు జనవరి 17 నుండి 22 మధ్య న్యూఢిల్లీలోని కెడి జాదవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు.

2023 ఇండియా ఓపెన్, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) 2023 వరల్డ్ టూర్‌లో రెండవ టోర్నమెంట్. దీనిని 2008 నుండి ఇండియా ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనుమతితో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది.

ఆస్ట్రేలియా ఓపెన్ 2023 విజేతలు

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మెల్బోర్న్ పార్క్‌లో జనవరి 16-29 మధ్య నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఈవెంట్‌లలో ఈ టోర్నమెంట్ మొదటిది. దీనిని 1905 లో ప్రారంభించారు. ఈ ఏడాది మొదటిసారి పురుష మరియు మహిళా క్రీడాకారులకు సమాన ప్రైజ్ మనీ అందించారు. విజేతకు ట్రోఫీతో పాటుగా A$ 76,500,000 ఆస్ట్రేలియన్ డాలర్లు అందజేస్తారు.

  1. పురుషుల సింగిల్స్ విజేత : ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ గెలుచుకున్నాడు. జనవరి 29న జరిగిన ఫైనల్‌లో గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్‌ను 6-3 7-6(4) 7-6(5)తో ఓడించడం ద్వారా తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్‌ సొంతం చేసుకున్నాడు. దీనితో ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజేతగా ఉన్న  రాఫెల్ నాదల్ రికార్డును సమం చేసాడు. ఇది జకోవిచ్‌ ఖాతాలో 10వ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్.
  2. మహిళా సింగిల్స్ విజేత : ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ దేశానికి చెందిన అరీనా సబలెంకా గెలుచుకుంది. జనవరి 28 జరిగిన ఫైనల్‌లో కజికిస్థాన్'కు చెందిన ఎలెనా రిబాకినాను 4–6, 6–3, 6–4తో ఓడించడం ద్వారా తన కెరీరులో మొదటి గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతు ఇచ్చిన బెలారస్ క్రీడాకారులకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేక పోవడంతో, ఆమె తటస్తంగా ఈ టోర్నీలో పాల్గొన్నారు.
  3. పురుషుల డబుల్స్ విజేత : ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు చెందిన రింకీ హిజికటా మరియు జాసన్ కుబ్లెర్ జోడి సొంతం చేసుకుంది. ఫైనల్‌లో హ్యూగో నైస్ మరియు జాన్ జీలిస్కీ జోడీని 6–4, 7–6(7–4) తో ఓడించడం ద్వారా విజేతగా నిలిచారు.
  4. మహిళల డబుల్స్ విజేత : ఆస్ట్రేలియా ఓపెన్ 2023 మహిళల డబుల్స్ టైటిల్‌ను చెక్ రిపబ్లిక్ చెందిన డిఫెండింగ్ ఛాంపియన్‌లు బార్బోరా క్రెజికోవా మరియు కటేరినా సినియాకోవా జోడి సొంతం చేసుకుంది. ఫైనల్‌లో షుకో అయోమా మరియు ఎనా షిబహారాను 6–4, 6–3తో ఓడించడం ద్వారా విజేతగా నిలిచారు.
  5. మిక్స్‌డ్ డబుల్స్ విజేత : ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టైటిల్‌ను బ్రెజిల్ దేశానికి చెందిన లూయిసా స్టెఫానీ మరియు రాఫెల్ మాటోస్ సొంతం చేసుకున్నారు. తుది పోరులో ఇండియన్ జోడి సానియా మీర్జా మరియు రోహన్ బోపన్నను 7–6, 6–2తో ఓడించడం ద్వారా విజేతగా నిలిచారు. సానియా మీర్జాకు ఇదే చివరి ఆస్ట్రేలియ ఓపెన్.

    న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ల కోసం డెబ్బీ హాక్లీ మెడల్‌

    న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ఈ ఏడాది నుండి అత్యుత్తమ మహిళా క్రికెటర్ల కోసం డెబ్బీ హాక్లీ మెడల్‌ పేరుతొ వార్షిక అవార్డును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పురుష క్రికెటర్లకు అందిస్తున్న సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌కి సమానంగా దీనిని ప్రవేశపెడుతున్నారు. ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మహిళా క్రికెటరుకు ఈ అవార్డు ప్రధానం చేస్తారు.

    డెబ్బీ హాక్లీ మెడల్‌ అనేది న్యూజిలాండ్ మాజీ మహిళా క్రికెటర్ డెబోరా ఆన్ హాక్లీ గౌరవార్థం ఆమె పేరుతొ ప్రవేశ పెట్టారు. హాక్లీ 1979 నుండి 2000 మధ్య  న్యూజిలాండ్ తరపున 19 టెస్టులు 118 వన్డేలలో ప్రాతినిథ్యం వహించారు. ఈమె 4000 వన్డే పరుగులు మరియు 100 వన్డేలు ఆడిన మొదటి మహిళ క్రికెటరుగా గుర్తింపు పొందారు. హాక్లీ న్యూజిలాండ్ తరపున వన్డేలలో 1,000 పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటరూ కూడా.

    డెబ్బీ హాక్లీ 2013 లో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన నాల్గవ మహిళగా నిలిచారు. 2016లో ఆమె న్యూజిలాండ్ అధ్యక్షరాలుగా ఎన్నికయ్యారు. 122 ఏళ్ల న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా నిలిచారు.

ఐసీసీ 2022 అవార్డు విజేతలు

ఐసీసీ 2022 ఏడాదికి సంబంధించి వార్షిక అవార్డుల విజేతలను ప్రకటించింది. ఏడాదిలో వివిధ ఫార్మెట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఏటా ఐసీసీ ఈ అవార్డులు అందిస్తుంది. ఇది ఐసీసీ పద్దెనిమిదవ ఎడిషన్ అవార్డు వేడుక. 1 జనవరి 2022 మరియు 31 డిసెంబర్ 2022 మధ్య ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డులు అందిస్తున్నారు.

ఐసీసీ పురుషుల అవార్డులు 2023

  • పురుషుల క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - బాబర్ ఆజం (పాకిస్తాన్)
  • పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
  • పురుషుల వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - బాబర్ ఆజం (పాకిస్తాన్)
  • పురుషుల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)
  • పురుషుల ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - మార్కో జాన్సెన్ (దక్షిణ ఆఫ్రికా)
  • పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - గెర్హార్డ్ ఎరాస్మస్ (నమీబియా)
  • అంపైర్ ఆఫ్ ది ఇయర్ - రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్)
  • స్పిరిట్ ఆఫ్ క్రికెట్ - ఆసిఫ్ షేక్ (నేపాల్)
  1. ఐసీసీ పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : ఉస్మాన్ ఖవాజా, క్రైగ్ బ్రాత్‌వైట్, మార్నస్ లాబుస్చాగ్నే, బాబర్ ఆజం, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, కగిసో రబడ, నాథన్ లియోన్, జేమ్స్ ఆండర్సన్.
  2. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ : బాబర్ ఆజం (కెప్టెన్), ట్రావిస్ హెడ్, షాయ్ హోప్, శ్రేయాస్ అయ్యర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), సికందర్ రజా, మెహిదీ హసన్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జాంపా.
  3. ఐసీసీ పురుషుల టి20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ : జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్ రజా, హార్దిక్ పాండ్యా, సామ్ కర్రాన్, వానిందు హసరంగా, హరీస్ రవూఫ్, జోష్ లిటిల్.

ఐసీసీ మహిళల అవార్డులు 2023

  • మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - నాట్ స్కివర్ (ఇంగ్లండ్)
  • మహిళా వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ - నాట్ స్కివర్ (ఇంగ్లండ్)
  • మహిళల టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
  • మహిళా ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - రేణుకా సింగ్ (ఇండియా)
  • ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ - ఈషా ఓజా (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
  1. ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ : అలిస్సా హీలీ (వికెట్ కీపర్), స్మృతి మంధాన, లారా వోల్వార్డ్, నాట్ స్కివర్, బెత్ మూనీ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, సోఫీ ఎక్లెస్టోన్, ఆయబొంగ ఖాకా, రేణుకా సింగ్, షబ్నిమ్ ఇస్మాయిల్.
  2. ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ఆఫ్ ది ఇయర్ : స్మృతి మంధాన, బెత్ మూనీ, సోఫీ డివైన్ (కెప్టెన్), యాష్ గార్డనర్, తహిలా మెక్‌గ్రాత్, నిదా దార్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోకా రణవీర, రేణుకా సింగ్.

Post Comment