తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : అవార్డులు & గౌరవాలు
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : అవార్డులు & గౌరవాలు

2023 జనవరి నెలలోచోటు చేసుకున్న తాజా కరెంట్ అఫైర్స్ తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

Advertisement

ఒడిశా జగా మిషన్ ప్రోగ్రాంకు వరల్డ్ హాబిటాట్ అవార్డు

ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న జగా మిషన్ ప్రోగ్రాంకు యూఎన్ హాబిటాట్స్ వరల్డ్ హాబిటాట్ అవార్డు 2023 లభించింది. యునైటెడ్ నేషన్స్ యొక్క హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్ అనేది మానవ నివాసాలు మరియు స్థిరమైన పట్టణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం. ఇది 1977లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబిలో ఉంది.

జగా మిషన్ కార్యక్రమాన్ని ఒడిశా ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. మురికివాడల నివాసితుల జీవితాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం, ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ టైటిల్ మరియు స్లమ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రాంగా నిలిచింది. దీనిని ది ఒడిషా ల్యాండ్ రైట్స్ టు స్లమ్ డ్వెల్లర్స్ యాక్ట్, 2017" ద్వారా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2023 చివరి నాటికి దేశంలో మొదటి మురికివాడల రహిత రాష్టంగా ఒడిశా మారనుంది.

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతలు

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుక కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్‌లో జనవరి 10న హట్టసంగా జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) చే ఎంపిక చేయబడిన 2022లోని ఉత్తమ చిత్రాలు మరియు ఉత్తమ అమెరికన్ టెలివిజన్‌ షోలకు అందించబడుతుంది. ఈ ఏడాది తెలుగు చిత్రం 'ఆర్ఆర్ఆర్'కు చెందిన నాటు నాటు గీతం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో  గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది.

అలానే 28వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో 'ఆర్ఆర్ఆర్'కు చెందిన నాటు నాటు గీతం ఉత్తమ సాంగ్ అవార్డు అందుకోవడంతో పాటుగా విదేశీ చిత్రాల జాబితాలో ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది.

  1. బెస్ట్ మోషన్ పిక్చర్  (డ్రామా) - ది ఫాబెల్మాన్స్
  2. బెస్ట్ మోషన్ పిక్చర్  (కామెడీ & మ్యూజిక్) - ది బన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్
  3. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
  4. ఉత్తమ విదేశీ చిత్రం - అర్జెంటీనా 1985 
  5. ఉత్తమ నటుడు (డ్రామా) - ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
  6. ఉత్తమ నటి (డ్రామా) - కేథరీన్ ఎలిస్ బ్లాంచెట్ (టార్)
  7. బెస్ట్ డైరెక్టర్ - స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫాబెల్మాన్స్)
  8. బెస్ట్ స్క్రీన్ ప్లే - మార్టిన్ మెక్‌డొనాగ్ (ది బాన్‌షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
  9. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - జస్టిన్ హర్విట్జ్ (బాబిలోన్)
  10. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నాటు నాటు - ఆర్ఆర్ఆర్ (కీరవాణి & చంద్రబోస్)

తిరు శివకుమార్ నడేసన్‌కు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు

శ్రీలంకలోని ప్రముఖ తమిళ వార్తాపత్రిక సంపాదకుడు తిరు శివకుమార్ నడేసన్‌కు 2023 ఏడాదికి సంబంధించి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందించారు. కోవిడ్ సమయంలో శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు సహాయం చేయడానికి నడేసన్ నిర్వహించిన నిధుల సమీకరణ కార్యక్రమంకు గాను ఈ అవార్డు అందించారు.

శ్రీలంక నుండి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్న రెండవ వ్యక్తిగా శివకుమార్ నడేసన్‌ నిలిచారు. శ్రీలంకలో అధికారికంగా 15 లక్షల మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు నివసిస్తున్నారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు.

ప్రవాసీ భారతీయ సమ్మాన్ అనేది నాన్-రెసిడెంట్ ఇండియన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా లేదా నాన్-రెసిడెంట్ భారతీయులు లేదా వ్యక్తులచే స్థాపించబడిన సంస్థలకు అందించే అత్యున్నత భారతీయ పురస్కారం. దీనిని 2003లో ప్రారంభించబడింది.

డా. సందుక్ రూట్‌కు బహ్రెయిన్ ఐఎస్ఏ అవార్డు

నేపాల్ వైద్య నిపుణుడు మరియు హిమాలయన్ క్యాటరాక్ట్ ప్రాజెక్ట్ సహ-వ్యవస్థాపకుడు డాక్టర్ సందుక్ రూట్, బహ్రెయిన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన ఐఎస్ఏ అవార్డును గెలుచుకున్నారు. బహ్రెయిన్ రాజు హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాచే 2009లో స్థాపించబడిన ఈ అవార్డును అత్యుత్తమ మానవత్వా సేవలకు అందిస్తారు. గ్రహితకు $1 మిలియన్ యూఎస్ డాలర్ల నగదు బహుమతి అందిస్తారు.

సందుక్ రూట్, రిమోట్ ప్రాంతాలలోని నిరుపేద గ్రామీణుల కోసం ఉచిత కంటి శిబిరాలు నిర్వహించి, 1,20,000 మందికి కంటి చూపును అందించారు. అధిక-నాణ్యత మైక్రోసర్జికల్ చికిత్స విధానాలను సరసమైన ధరలో ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలకు అందుబాటులోకి తెచ్చాడు. ఈయన్ని గౌరవంగా గాడ్ ఆఫ్ సైట్ అని పిలుచుకుంటారు.

డాక్టర్ రూట్ 650 మందికి పైగా వైద్యులకు శిక్షణ అందించారు, నివారించగల అంధత్వాన్ని నయం చేయడం గురించి వారికి పూర్తి నైపుణ్యం కల్పించారు. రూట్ ఇదివరకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు, భూటాన్ ప్రభుత్వం నుండి ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ భూటాన్ అందుకున్నారు. అలాగే ఈయన ఖాతాలో రామన్ మెగసెసే అవార్డు, ఆసియన్ గేమ్ చేంజెర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డు ఉన్నాయి.

ఆర్వీ ప్రసాద్‌కు అత్యంత విశిష్ట శాస్త్రవేత్త అవార్డు

ఇండియన్ అచీవర్స్ అవార్డ్ 2022 లో ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విష్ణు ప్రసాద్‌కు అత్యంత విశిష్ట శాస్త్రవేత్త అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ అవార్డు వేడుకలో క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డు అందించారు. విష్ణు ప్రసాద్‌ దాదాపు 69 ఆవిష్కరణలకు సంబంధించి పేటెంట్లు కలిగి ఉన్నారు.

ఇండియన్ అచీవర్స్ అవార్డులను సంస్కృతి, సైన్స్, క్రీడలు మరియు ఆవిష్కరణలతో సహా వివిధ రంగాలలో వారి అత్యుత్తమ సేవలు అందించే వ్యక్తులకు, సంస్థలకు అందిస్తారు.

డాక్టర్ ప్రభా ఆత్రేకి పండిట్ హరిప్రసాద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

హిందుస్థానీ గాయని పద్మవిభూషణ్ డా. ప్రభా ఆత్రేకి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ముంబై సమీపంలోని థానేలో జరిగిన అవార్డు కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమె 90వ పుట్టిన రోజును పురస్కరించుకుని 90 మంది ఫ్లూటిస్టుల సింఫొనీని ప్రదర్శించారు.

పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అనేది శాస్త్రీయ సంగీత రంగంలో గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను గుర్తించి, సత్కరించే అవార్డు. ఈ అవార్డు గ్రహీతకు ప్రశంసా పత్రంతో పాటుగా లక్ష రూపాయల నగదు బహుమతి అందజేస్తారు.

గోవా ఎయిర్‌పోర్టుకు బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్‌ఫీల్డ్ అవార్డు

అసోచామ్ 14వ అంతర్జాతీయ సదస్సులో ఏవియేషన్ సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ కింద గోవా మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (MIA) ప్రతిష్టాత్మకమైన "బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్" అవార్డు అందుకుంది. ఈ అవార్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అందజేశారు. ఈ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూపు నిర్వహిస్తుంది.

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2023

సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ విజేతలను కేంద్రం ప్రకటించింది. 2023 సంవత్సరానికి, ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (OSDMA) మరియు మిజోరాంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్ (LFS) లు విపత్తు నిర్వహణలో అత్యుత్తమ సేవలకు గాను ఈ అవార్డు అందుకున్నాయి.

విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు మరియు సంస్థలు అందించిన అమూల్యమైన సహకారాన్ని మరియు నిస్వార్థ సేవలను గుర్తించి, గౌరవించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనే వార్షిక అవార్డును ఏర్పాటు చేసింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రతి సంవత్సరం ఈ అవార్డును ప్రకటిస్తారు. ఈ అవార్డు గెలుచుకున్న సంస్థలకు రూ. 51 లక్షలు, వ్యక్తులకు రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ అందిస్తారు.

ఆస్కార్ నామినేట్ జాబితాలో భారతీయ చిత్రాలు

95వ ఆస్కార్ అవార్థుల తుది నామినేషన్ జాబితాలో మూడు భారతీయ చిత్రాలు వివిధ విభాగాల్లో చోటు సంపాదించుకున్నాయి. ఇందులో షౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఆల్ దట్ బ్రీత్స్ 'ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో నామినేట్ అవ్వగా, కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ఎలిఫెంట్ విస్పరర్స్ 'ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' విభాగంలో నామినేట్ చేయబడింది.

అదే సమయంలో ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం నాటు నాటు గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో తుది నామినేషన్ దక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డుల వేడుక 12 మార్చి 2023న జరగనుంది. తుది విజేతలను ఆ రోజున ప్రకటిస్తారు.

వైజాగ్ రైల్వే స్టేషన్‌కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్

ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ అత్యధిక రేటింగ్‌తో 'గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్‌'ను పొందింది. దీనితో ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికేట్ పొందిన అతికొద్ది రైల్వే స్టేషన్లలో విశాఖపట్నం ఆర్ఎస్ చేరింది. ఆరు పర్యావరణ విభాగాల్లో విశాఖపట్నం 100 కి 82 పాయింట్లు సాధించించడం ద్వారా ఈ ఘనతను సాధించింది.

ఈ గ్రీన్ రైల్వే స్టేషన్ రేటింగ్ సిస్టమ్‌ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) సహాయంతో ఇండియన్ రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఉత్తమ నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్వి ఎనర్జీ నియోగం, వర్జిన్ మెటీరియల్‌ల వినియోగం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు వంటి జాతీయ ప్రాధాన్యతల ఆధారితంగా ఈ సర్టిఫికేట్ అందిస్తుంది.

పద్మ అవార్డు విజేతలు 2023

2023 ఏడాదికి సంబంధించి పద్మ అవార్డుల విజేతలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 106 మంది ప్రముఖలకు పద్మ అవార్డులు అందించారు. ఇందులో ఆరు మందికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేశారు. పద్మ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులకు ప్రకటిస్తారు.

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 12 మంది పద్మ అవార్డులు అందుకున్నారు. ఇందులో రెండు పద్మభూషణ్ అవార్డులు ఉండగా మిగతా వారందరికీ పద్మశ్రీలు ఇవ్వబడ్డాయి. తెలంగాణ కేంద్రంగా అద్యాత్మక సేవలు అందిస్తున్న, స్వామి చిన్న జీయర్ మరియు కమలేష్ డి పటేల్ లకు పద్మభూషణ్ అవార్డులు ఇవ్వబడ్డాయి.

పద్మ అవార్డులు, భారతరత్న తర్వాత ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత పౌర పురష్కారాలుగా పరిగణించబడతాయి. వీటిని పద్మ విభూషణ్ (అసాధారణమైన మరియు విశిష్ట సేవలకు), పద్మభూషణ్ (అత్యున్నత స్థాయికి చెందిన విశిష్ట సేవ), పద్మశ్రీ (విశిష్ట సేవ) పేర్లతో దేశంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వ్యక్తులకు పై ప్రాధాన్యత క్రమంలో అందిస్తారు. వీటిని 1954 నుండి ప్రభుత్వం అందిస్తుంది.

పద్మవిభూషణ్ అవార్డు విజేతలు

  1. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంకు చెందిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) మార్గదర్శకుడు దిలీప్ మహలనోబిస్‌కు మరణానంతరం మెడిసిన్ (పీడియాట్రిక్స్) విభాగంలో పద్మవిభూషణ్ అందిస్తున్నారు.
  2. ఉత్తర ప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు మరణానంతరం ప్రజా వ్యవహారాల రంగంలో పద్మవిభూషణ్ అవార్డు అందిస్తున్నారు.
  3. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు జాకీర్ హుస్సేన్‌కు ఈ ఏడాది పద్మవిభూషణ్ అవార్డు అందిస్తున్నారు. హుస్సేన్‌కు ప్రభుత్వం ఇదివరకే 1988లో పద్మశ్రీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది.
  4. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సోమనహల్లి మల్లయ్య కృష్ణ (ఎస్ఎం కృష్ణ) ప్రజా వ్యవహారాల రంగంలో కర్ణాటక నుండి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
  5. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన గణిత శాస్త్రజ్ఞులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఇండో-అమెరికన్ శతమంగళం రంగా అయ్యంగార్ శ్రీనివాస వరదన్ ఈ ఏడాది సైన్స్ & ఇంజనీరింగ్ విభాగంలో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
  6. ఆర్కిటెక్ రంగంలో అగ్రగామిగా పేరొందిన ప్రముఖ గుజరాతీ ఆర్కిటెక్ట్‌ బాలకృష్ణ దోషికి మరణానంతరం ఆర్కిటెక్చర్ విభాగంలో పద్మవిభూషణ్ అందజేస్తున్నారు.

పద్మభూషణ్ అవార్డు విజేతలు

  1. ఎస్ ఎల్ భైరప్ప - సాహిత్యం & విద్య (కర్ణాటక)
  2. కుమార్ మంగళం బిర్లా - వాణిజ్యం & పరిశ్రమ (మహారాష్ట్ర)
  3. దీపక్ ధర్ - సైన్స్ & ఇంజనీరింగ్ (మహారాష్ట్ర)
  4. వాణీ జైరాం - కళ (తమిళనాడు)
  5. స్వామి చిన్న జీయర్ - ఆధ్యాత్మికత (తెలంగాణ)
  6. సుమన్ కళ్యాణ్పూర్ - కళ (మహారాష్ట్ర)
  7. కపిల్ కపూర్ - సాహిత్యం & విద్య (ఢిల్లీ)
  8. సుధా మూర్తి - సామాజిక సేవ (కర్ణాటక)
  9. కమలేష్ డి పటేల్ - ఆధ్యాత్మికత (తెలంగాణ)

తెలుగు రాష్ట్రాల నుండి పద్మ అవార్డులు

  1. స్వామి చిన్న జీయర్ - ఆధ్యాత్మికత (తెలంగాణ)
  2. కమలేష్ డి పటేల్ - ఆధ్యాత్మికత (తెలంగాణ)
  3. మోడడుగు విజయ్ గుప్తా - సైన్స్ & ఇంజనీరింగ్ (తెలంగాణ)
  4. హనుమంత రావు పసుపులేటి - మెడిసిన్ (తెలంగాణ)
  5. బి రామకృష్ణ రెడ్డి - సాహిత్యం & విద్య (తెలంగాణ)
  6. ఎంఎం కీరవాణి - కళ (ఆంధ్రప్రదేశ్)
  7. గణేష్ నాగప్ప కృష్ణరాజనగర - సైన్స్ & ఇంజనీరింగ్ (ఆంధ్రప్రదేశ్)
  8. సివి రాజు - కళ (ఆంధ్రప్రదేశ్)
  9. అబ్బారెడ్డి నాగేశ్వరరావు - సైన్స్ & ఇంజనీరింగ్ (ఆంధ్రప్రదేశ్)
  10. కోట సచ్చిదానంద శాస్త్రి - కళ (ఆంధ్రప్రదేశ్)
  11. సంకురాత్రి చంద్ర శేఖర్ - సామాజిక సేవ (ఆంధ్రప్రదేశ్)
  12. ప్రకాష్ చంద్ర సూద్ - సాహిత్యం & విద్య (ఆంధ్రప్రదేశ్)

Advertisement

Post Comment