Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 13 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 13 మార్చి 2024

తెలుగులో 13 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

96వ అకాడమీ అవార్డులు : ఆస్కార్ అవార్డుల విజేతలు

96వ అకాడమీ అవార్డుల వేడుక మార్చి 10, 2024న లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో హాట్టహాసంగా జరిగింది. జిమ్మీ కిమ్మెల్ నాల్గవసారి ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు. 2023లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉత్తమ చిత్రాలకు 23 విభాగాలలో ఈ అకాడమీ అవార్డులను అందజేశారు.

2024 ఆస్కార్ అవార్డుల నామినీలను జనవరి 23, 2024న బెవర్లీ హిల్స్‌లోని శామ్యూల్ గోల్డ్‌విన్ థియేటర్‌లో నటులు జాజీ బీట్జ్ మరియు జాక్ క్వాయిడ్ ప్రకటించారు. మార్చి 10, 2024న జరిగిన అవార్డుల వేడుకలో విజేతలకు అవార్డులు అందజేశారు.

ఈ ఏడాది ఓపెన్‌హైమర్ చిత్రం అత్యధికంగా 13 నామినేషన్లు దక్కించుకుంది. అలానే పూర్ థింగ్స్ మరియు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వరుసగా 11 మరియు 10 నామినేషన్లతో ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఒపెన్‌హైమర్ ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడుతో సహా అత్యధికంగా ఏడు అవార్డులను గెలుచుకుంది. ఇతర ప్రధాన విజేతలలో పూర్ థింగ్స్ నాలుగు అవార్డులు మరియు ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండు అవార్డులను గెలుచుకుంది.

ఈ ఏడాది ఇండియా నుండి 'టు కిల్ ఎ టైగర్' అనే డాక్యుమెంటరీ మాత్రమే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడింది. అయితే ఉక్రేనియన్ యుద్ధం నేపథ్యంలో తీసిన 20 డేస్ ఇన్ మారియుపోల్ డాక్యుమెంటరీ చిత్రం ఈ విభాగంలో అవార్డును గెలుచుకుంది.

అవార్డు కేటగిరి అవార్డు విజేత
ఉత్తమ చిత్రం ఒపెన్‌ హైమర్
ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ (ఒపెన్‌ హైమర్)
ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే జస్టిన్ ట్రైట్ & ఆర్థర్ హరారి (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ది బాయ్ అండ్ ది హెరాన్
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (యూకే)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ మారియుపోల్‌లో 20 రోజులు
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది లాస్ట్ రిపేర్ షాప్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ వార్ ఈజ్ ఓవర్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లుడ్విగ్ గోరాన్సన్ (ఒపెన్‌హైమర్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? (బిల్లీ ఎలిష్ పైరేట్ బైర్డ్ )
ఉత్తమ సౌండ్ టార్న్ విల్లర్స్ & జానీ బర్న్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ జేమ్స్ ప్రైస్ & షోనా హీత్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయ్టే వాన్ హోటెమా (ఒపెన్‌హైమర్)
ఉత్తమ మేకప్ & హెయిర్‌స్టైలింగ్ నాడియా స్టాసీ, మార్క్ కౌలియర్ & జోష్ వెస్టన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ హోలీ వాడింగ్టన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గాడ్జిల్లా మైనస్ వన్

పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్

కోయంబత్తూరుకు చెందిన ఇంజనీర్ చంద్రశేఖర్ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు మొదటి దక్షిణ భారత ఉపాధ్యక్షుడిగా ఎన్నికయి చరిత్ర సృష్టించాడు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పిసిఐ) ఎన్నికల సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఈ కమిటీలో దక్షిణ భారతీయుడు ఇంత ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని పొందడం ఇదే తొలిసారి.

ప్రస్తుతం తమిళనాడు పారాలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి విజేతగా నిలిచారు. వికలాంగ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడంలో అతని విస్తృత అనుభవం మరియు వారిని క్రీడలలో చేరికను ప్రోత్సహించడంలో అంకితభావంకు ఈ విజయం దక్కింది.

పారిస్‌లో రాబోయే అంతర్జాతీయ పారాలింపిక్ క్రీడలు షెడ్యూల్ చేయబడినందున, ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయడానికి చంద్రశేఖర్ కమిటీ బాధ్యత వహిస్తుంది. వికలాంగ క్రీడాకారులు తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ వేదికపై భారత్‌కు మరిన్ని పతకాలు సాధించేలా చేసేందుకు నిరంతర శిక్షణ మరియు మద్దతు అవసరం.

చంద్రశేఖర్ నియామకం భారతదేశంలో పారాలింపిక్ క్రీడలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుంది. ఇది పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాలో ప్రాంతీయ ప్రాతినిధ్యం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా పారాలింపిక్ అథ్లెట్లకు మరింత సమగ్ర భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేస్తుంది.

  1. పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) అనేది పారాలింపిక్ గేమ్స్ ఈవెంట్‌లలో భారత జట్లను నిర్వహించడానికి అథ్లెట్లను ఎంపిక చేసే బాధ్యతను నిర్వహిస్తుంది.
  2. ఈ సంస్థ 1992లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా స్థాపించబడింది.
  3. పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు ఆర్టీఐ చట్టం 2005 ద్వారా పబ్లిక్ అథారిటీ హోదా ఇవ్వబడింది.
  4. ఈ సంస్థ ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీతో పాటు ఇంటర్నేషనల్ వీల్‌చైర్ మరియు యాంప్యూటీ స్పోర్ట్స్ ఫెడరేషన్‌కు అనుబంధ సంస్థగా ఉంది.
  5. పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుత అధ్యక్షరాలుగా దీపా మాలిక్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ విజేతగా సాత్విక్-చిరాగ్

ఫ్రెంచ్ ఓపెన్ 2024 బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి సొంతం చేసుకున్నారు. మార్చి 10న జరిగిన ఫైనల్‌లో 21-11, 21-17తో చైనీస్ తైపీకి చెందిన లీ జే-హువే-యాంగ్ పో-హ్సువాన్‌లపై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.

ఇది చిరాగ్-సాత్విక్‌లకు 2024 బ్యాడ్మింటన్ సీజన్‌లో మొదటి టైటిల్. ఈ ద్వయంకు ఇది రెండవ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఇది వరకు 2022లో ఈ జోడి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నారు, 2019లో రన్నరప్‌గా కూడా నిలిచారు. బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్‌లో ఇది సాత్విక్ మరియు చిరాగ్‌లకు ఏడో టైటిల్. గతేడాది ఈ జోడి స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్‌లను కైవసం చేసుకుంది.

చిరాగ్-సాత్విక్ ఈ సంవత్సరం బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్‌లో వారి మూడవ వరుస ఫైనల్‌లో పోటీ పడ్డారు. ఫ్రెంచ్ ఓపెన్ గెలవడానికి ముందు వారు మలేషియా ఓపెన్ మరియు ఇండియా ఓపెన్ ఫైనల్స్‌లో ఓటమి చవిచూశారు. తాజా విజయం పారిస్ 2024 ఒలింపిక్స్ ముంది టెస్ట్ ఈవెంట్‌గా వారికీ ఉపయోగపడుతుంది. 2024 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ భారత షట్లర్లు ఒక్క గేమ్‌ను కూడా కోల్పోలేదు.

ఏడాది బ్యాడ్మింటన్ సిరీస్ మెడల్
2018 కామన్వెల్త్ గేమ్స్ (ఆస్ట్రేలియా) సిల్వర్ మెడల్
2022 కామన్వెల్త్ గేమ్స్ (ఇంగ్లాండ్) గోల్డ్ మెడల్
2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (టోక్యో) బ్రాంజ్ మెడల్
2022 ఆసియా క్రీడలు (చైనా) గోల్డ్ మెడల్
2022 ఇండియన్ ఓపెన్ గోల్డ్ మెడల్
2022 ప్రెంచ్ ఓపెన్ గోల్డ్ మెడల్
2023 ఆసియా ఛాంపియన్‌షిప్‌ గోల్డ్ మెడల్
2023 స్విస్ ఓపెన్ గోల్డ్ మెడల్
2023 ఇండోనేషియా ఓపెన్ గోల్డ్ మెడల్
2023 కొరియా ఓపెన్ గోల్డ్ మెడల్
2024 ఫ్రెంచ్ ఓపెన్ గోల్డ్ మెడల్

పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం

ఆసిఫ్ అలీ జర్దారీ మార్చి 10న పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని ప్రెసిడెంట్ హౌస్‌లో పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫేజ్ ఇసా, జర్దారీతో ప్రమాణం చేయించారు. ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికలలో జర్దారీ ఏకపక్ష విజయం సాధించి, రెండవసారి అద్యక్షడుగా బాధ్యతలు స్వీకరించారు.

ఆసిఫ్ అలీ జర్దారీ రెండవసారి పాకిస్తాన్ రాష్ట్రాధిపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా నిలిచారు. అలానే ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలాన్ని పూర్తి చేసిన నలుగురు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అధ్యక్షుల్లో ఒకరుగా నిలిచారు. జర్దారీ అంతకుముందు 2008 నుండి 2013 వరకు పాకిస్తాన్ 11వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన రెండుసార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన దిగవంత బెనజీర్ భుట్టో యొక్క భర్త.

ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మరియు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఇతర సీనియర్ ఆర్మీ మరియు సివిల్ అధికారులు మరియు దౌత్యవేత్తలు పాల్గొన్నారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) సహ-ఛైర్మన్ అయిన జర్దారీ, పాలక కూటమి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఈ ఎన్నికలలో నిలబడ్డారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి మహమూద్ ఖాన్ అచక్‌జాయ్‌ని ఓడించి ఆయన ఈ ఎన్నికలలో విజయం సాధించారు.

125 అడుగుల లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

అస్సాంలోని జోర్హాట్‌లో 'అహోం జనరల్' లచిత్ బోర్ఫుకాన్ యొక్క 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9న ఆవిష్కరించారు. టెయోక్ సమీపంలోని హోలోంగాపర్ వద్ద లచిత్ బర్ఫుకాన్ మైదామ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ఈ శౌర్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా పాల్గొన్నారు.

ఈ విగ్రహాన్ని రామ్ వంజీ సుతార్ రూపొందించారు. ఈ విగ్రహం పొడవు 125 అడుగులు. ఈ విగ్రహానికి 2022 ఫిబ్రవరిలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పునాది వేశారు. ఈ విగ్రహంకు ది స్టాచ్యూ ఆఫ్ వాలర్ అని పేరు పెట్టారు.

  • లచిత్ బోర్ఫుకాన్ అహోం రాజ్యం యొక్క పురాణ సైనిక కమాండర్.
  • లచిత్ బోర్ఫుకాన్ 1671 సరైఘాట్ యుద్ధంలో అతని నాయకత్వం కోసం గౌరవించబడ్డాడు.
  • ఈ యుద్ధం అస్సామీ చరిత్రలో ఒక మలుపుగా పరిగణించబడుతుంది, ఇది మొఘల్ దండయాత్రను విజయవంతంగా అడ్డుకుంది.
  • సరైఘాట్ యుద్ధం బ్రహ్మపుత్ర నది ఒడ్డున జరిగింది. రాజా రాంసింగ్ I నేతృత్వంలోని మొఘల్ సైన్యంను ఆయన కోయి టెక్నిక్ అనే వ్యూహంతో ఓడించాడు.

అస్సాంలో బీజేపీ పార్టీ పుంజుకున్నప్పటి నుండి, లచిత్ బోర్ఫుకాన్ ముస్లిం దండయాత్రకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా కీర్తించబడుతున్నారు. లచిత్ బోర్ఫుకాన్ వారసత్వం అస్సామీ పరాక్రమం మరియు ప్రతిఘటనకు చిహ్నంగా ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయన గౌరవార్థం తాజాగా విగ్రహాన్ని అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మిస్ వరల్డ్ 2024 టైటిల్ విజేతగా క్రిస్టినా పిస్కోవా

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2024 టైటిల్‌ను చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా గెలుచుకుంది. 2006లో టటానా కుచరోవా తర్వాత చెక్ రిపబ్లిక్ నుండి ఈ ఘనత సాధించిన రెండవ మహిళగా అవతరించింది. పోలాండ్‌కు చెందిన గత ఏడాది ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కా ఫైనల్‌లో తన వారసురాలకి కిరీటాన్ని అందజేసారు.

ఈ పోటీలో లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ మొదటి రన్నరప్‌గా నిలిచింది. ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన అచే అబ్రహంస్ మరియు బోట్స్‌వానాకు చెందిన లెసెగో చోంబో తర్వాత ఫైనలిస్టులలో ఉన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సినీ శెట్టి టాప్ 8కి చేరుకుంది, అయితే తుది 4లో చోటు దక్కించుకోలేకపోయింది.

1996 తర్వాత భారతదేశంలో ఈ ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. 112 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొన్నారు. ఇవి 71వ మిస్ వరల్డ్ పోటీలు. ఈ పోటీకి కరణ్ జోహార్ మరియు మిస్ వరల్డ్ 2013 విజేత మేగాన్ యంగ్ సహ-హోస్ట్ చేశారు.

క్రిస్టినా పిస్కోవా తన తెలివితేటలు, దయ మరియు తన లక్ష్యం పట్ల అచంచలమైన అంకితభావంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ పోటీ కేవలం శారీరక సౌందర్యం గురించి మాత్రమే కాదు, ప్రపంచ సుందరి పోటీ సామాజిక అవగాహన మరియు సాధికారతను కూడా నొక్కి చెబుతుంది.

  • మిస్ వరల్డ్ అనేది ఇప్పటికే ఉన్న అతి పురాతన అంతర్జాతీయ అందాల పోటీ.
  • ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1951 లో ఎరిక్ మోర్లీచే సృష్టించబడింది.
  • 2000 లో అతను మరణించినప్పటి నుండి , మోర్లీ యొక్క భార్య జూలియా మోర్లే ఈ పోటీకి సహ-అధ్యక్షురాలుగా ఉన్నారు.
  • ఈ వేడుక మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్ మరియు మిస్ ఎర్త్ లతో పాటుగా బిగ్ ఫోర్ అందాల పోటీలలో ఒకటిగా ఉంది.

Post Comment