Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 08 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 08 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 08 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023

డచ్-ఆధారిత టెక్ కంపెనీ అయిన టామ్‌టామ్, 2023 ఏడాదికి సంబంధించి ప్రపంచ ట్రాఫిక్ ఇండెక్స్‌ యొక్క 13వ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఇండెక్స్ 600 మిలియన్లకు పైగా ఇన్-కార్ నావిగేషన్ సిస్టమ్‌లు మరియు స్మార్ట్‌ఫోన్‌ల నుండి సేకరించిన డేటా ఆధారంగా 6 ఖండాలలోని 55 దేశాలలో 387 నగరాల ట్రాఫిక్ అంచనా వేసింది.

టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు మరియు కర్బన ఉద్గారాల ప్రభావాన్ని నొక్కి చెప్తుంది. రోజువారీ ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడంలో ఈ సూచిక సహాయం చేస్తుంది.

టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ప్రకారం లండన్ అత్యంత రద్దీ వీధులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ నగరంలో 10 కి.మీల సగటు ప్రయాణ సమయం 37 నిమిషాల 20 సెకన్లుగా అంచనా వేసింది. దీని తర్వాత డబ్లిన్ (ఐర్లాండ్) 29.30 నిముషాలతో రెండవ స్థానంలో నిలిచింది. అలానే టొరంటో సుమారు 29 నిమిషాల ప్రయాణ సమయంతో 3వ స్థానంలో ఉంది.

ఈ నివేదికలో భారతదేశం నుండి బెంగళూరు, పూణే నగరాలు టాప్ 10 స్థానాల్లో ఉన్నాయి. 6వ స్థానంలో ఉన్న బెంగళూరులో 10 కి.మీలు ప్రయాణించడానికి ఒక ప్రయాణికుడికి సగటున 28 నిమిషాల 10 సెకన్లు పడుతుండగా, 7వ స్థానంలో ఉన్న పూణేలో ప్రయాణించే వ్యక్తికి 27 నిమిషాల 50 సెకన్లు పడుతుంది. అలానే ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 44వ స్థానంలో, ముంబై 54వ స్థానంలో ఉన్నాయి.

  1. లండన్ (యూకే)
  2. డబ్లిన్ (ఐర్లాండ్)
  3. టొరంటో (కెనడా)
  4. మిలన్ (ఇటలీ)
  5. లిమా (పెరు)
  6. బెంగళూరు (భారతదేశం)
  7. పూణే (భారతదేశం)
  8. బుకారెస్ట్ (రొమేనియా)
  9. మనీలా (ఫిలిప్పీన్స్)
  10. బ్రస్సెల్స్ (బెల్జియం)

బీహార్ రైతుల కోసం 'నితీష్' డివైజ్ ప్రారంభం

బీహార్ ప్రభుత్వం రైతులు మరియు సాధారణ ప్రజలను పిడుగులు, వరదలు, వేడిగాలులు మరియు చలిగాలులపై అప్రమత్తం చేయడానికి సీఎం నితీష్ పేరుతో కొత్త పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. నితీష్ డివైజ్ అనగా నొవెల్ ఇనిషియేటివ్ టెక్నలాజికల్ ఇంటర్వెన్షన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ హ్యూమన్‌లీవ్స్ అని అర్ధం. దీనిని స్మార్ట్ ఎక్రోనిం లేదా బిడ్ అని కూడా పిలుస్తున్నారు.

నితీష్ డివైజ్ అనేది మెరుపులు, వరదలు, వేడిగాలులు మరియు చలిగాలులు వంటి సంభావ్య ప్రకృతి వైపరీత్యాల గురించి రైతులు మరియు ప్రజలను అప్రమత్తం చేయడానికి రూపొందించిన లాకెట్టు ఆకారంలో పరికరం. బీహార్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టాన్ని తగ్గించడం ఈ పరికరం ప్రధాన లక్ష్యం.

నితీష్ డివైజ్‌ను ఐఐటీ పాట్నా సహాయంతో బీహార్ రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ రూపొందించింది. ఈ డివైజ్ బీహార్ వాతావరణ సేవా కేంద్రం అనుసంధానంతో రియల్ టైమ్ వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. సంభావ్య విపత్తు సంభవించడానికి 30 నిమిషాల ముందు ఇది వినియోగదారులకు హెచ్చరికలను పంపుతుంది. ఆ సమయంలో ప్రమాదాన్ని సూచించడానికి ఈ పరికరం ఆకుపచ్చ నుండి ఎరుపుకు మారుతుంది.

సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌కు యూఏఈ గోల్డెన్ వీసా మంజూరు

సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్‌కు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ ప్రతిష్టాత్మక వీసా అతనికి యూఏఈలో దీర్ఘకాలం నివాసం ఉండేందుకు అనుమతిస్తుంది. విద్యా రంగానికి చేసిన సేవలకు గాను ఆనంద్ కుమార్‌ ఈ గౌరవం దక్కించుకున్నారు.

ఆనంద్ కుమార్‌ 2002 నుండి తన సూపర్ 30 ప్రోగ్రామ్ ద్వారా, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ మరియు మెంటర్‌షిప్ అందిస్తున్నారు. ఈ వినూత్న మరియు తన విజయవంతమైన విద్యా విధానం ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.

వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన వందలాది మంది విద్యార్థులకు వారి కలలను సాధించడంలో సహాయం అందించాడు. 2010లో టైమ్ మ్యాగజైన్ యొక్క బెస్ట్ ఆఫ్ ఆసియా జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. సాంప్రదాయకంగా బాలీవుడ్ మరియు క్రీడా ప్రముఖులు ఆధిపత్యం చెలాయించే గోల్డెన్ వీసా గ్రహీతల జాబితాలో అకడమిక్ రంగం నుండి కుమార్ ఈ గౌరవం దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విజయం.

యూఏఈ ప్రభుత్వం 2019లో గోల్డెన్ వీసా ప్రవేశ పెట్టింది. సైన్స్, విజ్ఞానం, సంస్కృతి మరియు కళలతో సహా వివిధ రంగాలకు గణనీయమైన కృషి చేసిన వ్యక్తులను గుర్తించి, వారికి దానిని అందజేస్తుంది. గోల్డెన్ వీసా అనేది 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే దీర్ఘకాలిక రెసిడెన్సీ అనుమతి. ఇది స్పాన్సర్ అవసరం లేకుండానే యూఏఈలో నివసించే, పని చేసే మరియు చదువుకునే హక్కును స్వీకర్తలకు మంజూరు చేస్తుంది.

ఇప్పటి వరకు 14 మంది భారతీయ పౌరులకు యూఏఈ గోల్డెన్ వీసా అందించారు. వీరిలో షారూఖ్ ఖాన్, సంజయ్ దత్, సానియా మీర్జా, బోనీ కపూర్, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, మౌని రాయ్, ఊర్వశి రౌటేలా, సునీల్ శెట్టి, నేహా కక్కర్, ఫరా ఖాన్ కుందర్, సోనూ సూద్, రణవీర్ సింగ్ మరియు ఆనంద్ కుమార్‌ ఉన్నారు.

నోయిడాను వాటర్ వారియర్ సిటీగా గుర్తించిన కేంద్ర జల మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్ లోని నోయిడా సిటీ, మురుగునీటి శుద్ధి మరియు పునర్వినియోగానికి సంబంధించిన కార్యక్రమాలకు గాను కేంద్ర జల మంత్రిత్వ శాఖ నుండి "వాటర్ వారియర్" సిటీ గుర్తింపు అందుకుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ఉన్న ఈ నగరం, మురుగునీటి శుద్ధి మరియు నీటి పునర్వినియోగంలో ఆదర్శప్రాయమైన విజయాలు సాధించినందుకు గాను ఈ ప్రశంసలు దక్కించుకుంది.

నోయిడా ఉత్తమ మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్టిపి) మరియు నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ (ఎంఎల్‌డి) అనే రెండు విభాగాలలో ఈ అవార్డును అందుకుంది. ఈ గుర్తింపు నీటి సంరక్షణకు నోయిడా యొక్క నిబద్ధతను మరియు భారతదేశంలోని ఇతర నగరాలకు ఉదాహరణగా ఉంచడంలో దాని పాత్రను హైలైట్ చేస్తుంది.

నోయిడాలో ప్రస్తుతం 411 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డి) రోజువారీ సామర్థ్యంతో ఎనిమిది మురుగునీటి శుద్ధి కేంద్రాలు (STPలు) అందుబాటులో ఉన్నాయి . ఈ ప్లాంట్లు ప్రతిరోజూ 260 ఎంఎల్‌డిల మురుగునీటిని సమర్థవంతంగా శుద్ధి చేస్తున్నాయి. నోయిడా శుద్ధి చేసిన నీటిలో గణనీయమైన భాగాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ శుద్ధి చేసిన నీరు గ్రీన్ బెల్ట్‌ల నీటిపారుదల, గోల్ఫ్ కోర్స్‌లు, నిర్మాణ కార్యకలాపాలు మరియు అగ్నిమాపక వంటి వివిధ అనువర్తనాలకు ఉపయోగిస్తుంది.

ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం

ఢిల్లీ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పబ్లిక్ బస్సు రవాణాను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత వ్యక్తులకు జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాలు జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా ఈ ప్రయోజనం కల్పిస్తారు.

ఈ ప్రతిపాదన అమలుకు ముందు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. కొద్ది వారాల్లోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ఢిల్లీలో మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఉన్న ఉచిత బస్సు ప్రయాణానికి కొనసాగింపుగా ఉంటుంది.

సాంఘిక సంక్షేమ శాఖ నుండి పొందిన డేటా ఆధారంగా లింగమార్పిడి వ్యక్తులు ఉచిత బస్సు సేవలను పొందుతారు. ట్రాన్స్‌జెండర్ల మొత్తం డేటాను ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కోసం ఏకీకృతం చేయడానికి సాంఘిక సంక్షేమ శాఖతో చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ చొరవ ఢిల్లీలోని వేలాది మంది లింగమార్పిడి వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ల జనాభా 4.87 లక్షలుగా ఉంది. ఢిల్లీ జనాభాలో 0.86% ట్రాన్స్‌జెండర్ల జనాభా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ప్రభుత్వం 2019 అక్టోబర్‌లో మహిళలకు మరియు  సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద అప్పటి నుండి సుమారు 147 కోట్ల ఉచిత టిక్కెట్లు ఉచితంగా అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ఆరు రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నాయి. వీటిలో ఢిల్లీ (2019), పంజాబ్ (2021), కేరళ (2021), తమిళనాడు (2021), కర్ణాటక (2023), తెలంగాణ (2023) రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీ దేశంలో ఈ పథకం అందుబాటులోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఉంది.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2023

మంచుకొండపై నిద్రపోతున్న ధృవపు ఎలుగుబంటి యొక్క మంత్రముగ్దులను చేసే చిత్రం 2023 ఏడాదికి గాను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ ఛాయిస్ అవార్డును అందుకుంది. ఈ అద్భుతమైన చిత్రాన్ని నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో బ్రిటీష్ ఫోటోగ్రాఫర్ నిమా సరిఖానీ తీశారు.

ఈ చిత్రం నార్వేలోని స్వాల్‌బార్డ్ ద్వీపసమూహంలో చెక్కబడిన మంచు మంచంపై ప్రశాంతంగా నిద్రిస్తున్న యువ ధ్రువ ఎలుగుబంటిని వర్ణిస్తుంది. ఈ ఫోటోగ్రాఫ్ ధృవపు ఎలుబంటుల గంభీరమైన జీవుల అందాన్ని ప్రదర్శించడమే కాకుండా వాతావరణ మార్పుల కారణంగా ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థ యొక్క దుర్బలత్వానికి పదునైన రిమైండర్‌గా కూడా నిలిచింది.

ఐస్ బెడ్ పేరుతొ ప్రచురించిన ఈ ఫోటోగ్రాప్ సృష్టికర్త నిమా సరిఖానీ, లండన్ ఆధారిత పెట్టుబడి సంస్థ సహ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. ఈ ఫోటో కోసం ఆమె మూడు రోజులు వేచి చూసినట్లు పేర్కొన్నారు. ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థపై వాతావరణ మార్పుల ప్రభావం మరియు ఈ అద్భుతమైన జీవులను రక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపేందుకు ఈ చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు అనేది నేచర్ ఫోటోగ్రఫీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీలలో ఒకటి. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు పాల్గొంటారు. ప్రకృతి అందం మరియు వైవిధ్యాన్ని సంగ్రహించడం మరియు ప్రజలకు ప్రకృతి పట్ల అవగాహన కల్పించడం ఈ పోటీ యొక్క లక్ష్యం.

ఈ ఏడాది వేలాది ఎంట్రీలు నమోదు కాగా వాటిలో 25 చిత్రాలు తుది జాబితాకు చేర్చబడ్డాయి. వాటిలో ఐదు చిత్రాలకు పబ్లిక్ ఓటింగ్ ద్వారా అవార్డు అందించారు. వీటిలో బేర్ ఐస్ బెడ్ (నిమా సరిఖానీ), ది హ్యాపీ టర్టిల్ (త్జాహి ఫింకెల్‌స్టెయిన్), స్టార్లింగ్ మర్మరేషన్ (డానియల్ డెన్సెస్కు), షేర్డ్ పేరెంటింగ్ (మార్క్ బోయిడ్), అరోరా జెల్లీస్ (ఆడున్ రికార్డ్‌సెన్) ఉన్నాయి.

Post Comment