Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 05 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 05 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 05 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2024

మహారాష్ట్ర ఎల్లోరా అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2024 ఫిబ్రవరి 2 నుండి 4 వరకు హాట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో కళ, సంగీతం మరియు సంస్కృతికి సంబంధించిన మూడు రోజుల విజయవంతమైన వేడుక. ఎల్లోరా-అజంతా అంతర్జాతీయ ఉత్సవం 2016 నుండి మధ్యలో ఆరు ఏళ్ళు నిర్వహించడం మానేశారు జరిగింది. గత ఏడాది నుండి దీనిని పునరుద్దిరించారు.

ప్రధాన సాంస్కృతిక మహోత్సవానికి ముందు, ఫిబ్రవరి 2న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సంత్ ఏకనాథ్ రంగ్ మందిర్‌లో 'పూర్వారంగ్' అనే ప్రీ-ఫెస్టివల్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ప్రీ-ఫెస్టివల్ ఈవెంట్‌లో ప్రముఖ కళాకారులచే మరాఠీ సంగీత ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన మూడు రోజుల ఎల్లోరా-అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో, అనేక మంది ప్రముఖ స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ కళాకారులు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు.

ఔరంగాబాద్ జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఎల్లోరా-అజంతా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గత ఏడాది పునరుద్ధరించబడింది. 1985లో మొదటిసారి ప్రారంభించబడినప్పుడు ఈ పండుగ భారీ విజయాన్ని సాధించింది. మొదటిలో ఈ వేడుకలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన ఎల్లోరా గుహల వద్ద నిర్వహించే వారు.

అజంతా గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న రెండవ శతాబ్దం నాటి 29 రాక్-కట్ బౌద్ధ గుహ స్మారక చిహ్నాలు. అజంతా గుహలు 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఇవి విశ్వవ్యాప్తంగా బౌద్ధ మత కళ యొక్క కళాఖండాలుగా పరిగణించబడుతున్నాయి. గుహలలో అనేక పెయింటింగ్‌లు మరియు రాక్-కట్ శిల్పాలు ఉన్నాయి. ఇవి పురాతన భారతీయ కళ యొక్క అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా వర్ణించబడ్డాయి.

ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న 6వ శతాబ్దం నాటి శాసనాలతో కూడిన రాతి-కట్ గుహ సముదాయం. వీటిని వెరుల్ గుహలు అని కూడా అంటారు. ఇవి దాదాపు 100 కంటే ఎక్కువ గుహల సమూహం. వీటిలో 34 ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని ఎల్లోరా స్మారక చిహ్నాలు శాతవాహనుల కాలంలో నిర్మించబడ్డాయి. ఎల్లోరా గుహలు కూడా 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి.

878 రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్న రష్యన్ వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో

రష్యన్ వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన వ్యక్తిగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. రష్యా యొక్క అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ప్రకారం, ఒలేగ్ కోనొనెంకో తన దేశస్థుడు గెన్నాడి పడల్కా సృష్టించిన గత రికార్డును ఫిబ్రవరి 4న అధిగమించాడు. పదల్కా 2017లో పదవీ విరమణ చేయడానికి ముందు ఐదు అంతరిక్ష విమానాల్లో 878 రోజుల, 11 గంటల, 29 నిమిషాల మరియు 48 సెకన్లు గడిపాడు.

59 ఏళ్ళ కోనోనెంకో తన ఐదవ అంతరిక్ష ప్రయాణంలో భూమి నుండి 263 మైళ్ళు (423 కిమీ) కక్ష్యలో తిరుగుతూ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అతని ప్రస్తుత స్పేస్ ఫ్లైట్ సెప్టెంబర్ చివరిలో ముగియనుంది, ఆ సమయానికి అతని అంతరిక్షంలో గడిపిన మొత్తం సమయం 1,110 రోజులకు చేరుకుంటుంది.

డా. బీనా మోడీకి అవుట్‌స్టాండింగ్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

మోడీ ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ డాక్టర్ బీనా మోడీ, 2023 సంవత్సరానికి గాను అత్యుత్తమ వ్యాపార మహిళగా ఎంపికయ్యారు. 30 జనవరి 2024న ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ప్రతిష్టాత్మక అమృతకల్-ఆత్మనిర్భర్ సదస్సులో ఆమెకు ఈ అవార్డును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అందించారు.

డాక్టర్ బీనా మోడీ నాయకత్వంలో మోడీ ఎంటర్‌ప్రైజెస్, కేకే మోడీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీలు అయిన గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ మరియు ఇండోఫిల్ రికార్డులను బద్దలు కొడుతూ స్థిరంగా అభివృద్ధి చెందాయి. డాక్టర్ బీనా మోడీ ఇటీవలే ది ఏషియావన్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ లీడర్‌షిప్ ప్రిన్సిపల్స్ అవార్డును మరియు ఔట్‌లుక్ బిజినెస్ స్పాట్‌లైట్ విజనరీ లీడర్ అవార్డ్ 2023 యొక్క 'మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డును కూడా అందుకున్నారు.

ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా రాధా రాటూరి

1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి రాధా రాటూరి, ఉత్తరాఖండ్ మొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇటీవలే పదవీకాలం ముగిసిన సుఖ్‌బీర్ సింగ్ సంధు స్థానంలో ఆమె రాష్ట్రంలో అత్యున్నత పరిపాలనా పదవిని చేపట్టిన మొదటి మహిళగా నిలిచారు. ఆమె భర్త అనిల్ రాటూరి కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిగా, ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా 2020 నవంబర్‌లో పదవీ విరమణ చేశారు .

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాలతో ఫిబ్రవరి 3, 2024 న రాజీనామా చేశారు. బన్వరీలాల్ పురోహిత్ ఆగస్టు 2021 నుండి పంజాబ్ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. తన రాజీనామా లేఖలో పురోహిత్ వ్యక్తిగత కారణాలు మరియు కొన్ని ఇతర కట్టుబాట్ల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ కారణాలు ఏమిటో ఆయన వివరించలేదు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరుసటి రోజే పురోహిత్ రాజీనామా చేశారు.

పురోహిత్ రాజీనామా పంజాబ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం మరియు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పోరు నడుమ పురోహిత్ రాజీనామా జరిగింది. రాష్ట్ర వ్యవహారాల్లో ఇటీవలే పురోహిత్ జోక్యం చేసుకుంటున్నారని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది.

ఇటీవలే జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, మూడు పదవులను కైవసం చేసుకుంది. కాంగ్రెస్-ఆప్ కూటమి మెజారిటీ ఓట్లు పొందినా, చెల్లుబాటు కాలేదు అనే కారణంతో ఈ కూటమి ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించినప్పటికీ బ్యాలెట్ పేపర్ ట్యాంపరింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ సంఘటన జాతీయ స్థాయిలో చర్చనీయం అయ్యింది.

ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ (ఆప్)కి మధ్యంతర ఉపశమనం కోరింది. దీనిని కోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆప్ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆప్ కౌన్సిలర్ చేసిన అభ్యర్థనను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

పురోహిత్ రాజీనామా నేపథ్యంలో పంజాబ్‌లో రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేయడంతో పాటు ఆప్ ప్రభుత్వం దుష్పరిపాలనకు పాల్పడుతోందని పేర్కొంటుంది.

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు 2024

భారతదేశం అంతటా వివిధ పబ్లిక్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ మరియు చీటింగ్‌లను అరికట్టడం లక్ష్యంగా 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) బిల్లు 2024' ను ఫిబ్రవరి 6న లోక్‌సభ ఆమోదించింది. ఈ చట్టం యూపీఎస్సీ, ఎస్ఎస్సీ మొదలైన రిక్రూట్‌మెంట్ పరీక్షలు మరియు నీట్, జేఈఈ మరియు సియూఈటీ వంటి ప్రవేశ పరీక్షలలో పేపర్ లీక్‌లు, అక్రమాలు అలాగే వ్యవస్థీకృత అవకతవకలను అరికట్టనుంది.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా నిర్వహించబడే ప్రవేశ పరీక్షలను కూడా ఇది కవర్ చేస్తుంది. దేశ జనాభాలో 70% ఉన్న 40 ఏళ్లలోపు యువత భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా, 2047 నాటికి వారిని విక్షిత్ భారత్‌లో వాటాదారులుగా చేసేందుకు ఈ బిల్లు రూపొందించింది.

ఈ బిల్లు అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు కనీసం మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించాలని ప్రతిపాదిస్తుంది. అలానే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు కనీసం కోటి రూపాయల జరిమానా విధించబడుతుంది.  అయితే ఈ బిల్లు పరిధి నుండి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను లేదా అభ్యర్థులను మినహాయించింది. వారిని పరీక్షలు నిర్వహించే ఏజెన్సీల నిబంధనల ప్రకారం శిక్షించేందుకు అవకాశం కల్పించింది.

పబ్లిక్ పరీక్షా విధానంలో అధిక పారదర్శకత, సరసత మరియు విశ్వసనీయత తీసుకురావడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ బిల్లు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, పరీక్షా పత్రాలను లీక్ చేయడం, వంచన మరియు వ్యవస్థీకృత దుర్వినియోగాలతో సహా విస్తృతంగా "అన్యాయమైన మార్గాలను" నిర్వచిస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లు అనుమతి లేకుండా పరీక్షా కేంద్రాలను మార్చడాన్ని నిషేధిస్తుంది.

డైరెక్టర్లు మరియు సీనియర్ మేనేజ్‌మెంట్ వంటి వ్యక్తులు మాల్‌ప్రాక్టీస్‌లో పాలుపంచుకున్నట్లు లేదా సహకరించినట్లు తేలితే వారిని వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తుంది. పరీక్షల సమయంలో సోదాలు నిర్వహించడానికి మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులకు అధికారం ఇస్తుంది.

శ్రీ రామాయణ యాత్ర  భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ప్రారంభం

ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి 'శ్రీ రామాయణ యాత్ర' భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఫిబ్రవరి 4న జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ రామాయణ యాత్ర అనేది భరత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా నిర్వహించే థీమ్ ఆధారిత తీర్థయాత్ర. రామాయణ సర్క్యూట్‌లోని రాముడి జీవితానికి సంబంధించిన ప్రముఖ పవిత్ర స్థలాలను కవర్ చేస్తుంది.

రామాయణ సర్క్యూట్‌లో ఉన్న ప్రధాన తీర్థయాత్ర ప్రదేశాలలో అయోధ్య, నందిగ్రామ్, జనక్‌పూర్, సీతామర్హి, బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, శృంగవేర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం, భద్రాచలం మరియు నాగ్‌పూర్ వంటివి ఉన్నాయి. భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు చారిత్రక ప్రదేశాలను ప్రజలకు ప్రదర్శించడానికి 'దేఖో అప్నా దేశ్' కార్యక్రమం కింద ఈ రైలు నడుపుతున్నారు. ప్రజా డిమాండ్ కారణంగా ఈ ప్రత్యేక శ్రీ రామాయణ యాత్రను అందించేందుకు భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును భారతీయ రైల్వే అందుబాటులోకి తెచ్చింది.

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులను దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా వారం నుండి నెల రోజుల నిడివితో థీమ్ ఆధారిత తీర్థయాత్రలను అందిస్తుంది. ఈ రైళ్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

ఈ సౌకర్యవంతమైన టూరిస్ట్ రైలులకు ఏసీ 2 టైర్‌ శ్రేణిలో ఒక్కొక్కరికి రూ. 52250/- , ఏసీ 1 (క్యాబిన్) శ్రేణిలో రూ. 67140 మరియు ఏసీ 1 (కూపే) శ్రేణిలో రూ. 77400/- టికెట్ చార్జీలు వసులు చేస్తున్నారు. ఈ ధరలు సంబంధిత తరగతిలో రైలు ప్రయాణం, ఏసీ హోటళ్లలో రాత్రి బస, అన్ని భోజనాలను కవర్ చేస్తాయి. ప్రస్తుతం దేశంలో 17 ఆపరేషనల్ భారత్ గౌరవ్ సర్క్యూట్‌లలో వీటిని నడుపుతున్నారు. 2023లో భారత్ గౌరవ్ రైళ్లు 96491 మంది పర్యాటకులతో 172 ట్రిప్పులను పూర్తి చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Post Comment