తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 07 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆమోదం
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. పౌర చట్టాలలో ఏకరూపతను నెలకొల్పేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ఫిబ్రవరి 6 న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో సమర్పించారు. ఈ యూసిసి బిల్లు షెడ్యూల్డ్ తెగలను మినహాయించి ఆ రాష్ట్రంలోని మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వివాహం, విడాకులు, భూమి, ఆస్తి మరియు వారసత్వంపై ఉమ్మడి చట్టాన్ని ప్రతిపాదిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యూనిఫాం సివిల్ కోడ్ ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియలో ఉంది. ఇది ప్రస్తుతం భారత లా కమిషన్ సమీక్షిస్తుంది. అయితే భారత స్వాతంత్రం తర్వాత యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ప్రవేశ పెట్టడం ఏ రాష్ట్రంలో అయిన ఇదే తొలిసారి. ఇది ఆమోదం పొందినట్లయితే, యూసీసీని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుంది.
రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ యూసీసీ ముసాయిదాను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అందించింది. దీనితో 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ చేసిన ఈ ముఖ్యమైన వాగ్దానాన్ని నెరవేర్చింది. ఈ బిల్లు ప్రవేశపెట్టాక ఆ రాష్ట్ర అసెంబ్లీ వాయిదా పడింది. అధికార బీజేపీ పార్టీలో కొనసాగుతున్న చర్చల కారణంగా ఇది ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది.
ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ఆ రాష్ట్రంలో లివ్-ఇన్ రిలేషన్షిప్‌ల నమోదును కూడా తప్పనిసరి చేస్తుంది. దీని ప్రకారం లివ్-ఇన్ రిలేషన్ షిప్ ద్వారా జన్మించిన పిల్లలు చట్టబద్ధంగా పరిగణించబడతారు. అలానే భాగస్వాములచే విడిచిపెట్టబడిన మహిళలకు భరణం పొందేందుకు ఇది అర్హత కల్పిస్తుంది. లైవ్-ఇన్ రిలేషన్షిప్ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం అందించిన వ్యక్తులకు భారీ మొత్తంలో జరిమానా మరియు 3నెలల జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఈ బిల్లు బాల్య వివాహాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తుంది.
జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2024 విజేతలు
జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2024 పోటీలు జైపూర్‌లోని రైల్వే స్టేడియంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ మధ్య నిర్వహించారు. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ నవీన్ మాలిక్ పురుషుల 74 కిలోల ఫ్రీస్టైల్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల 55 కిలోల విభాగంలో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేత వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం దక్కించుకుంది. 2023 ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సునీల్ కుమార్ గ్రీకో-రోమన్ 87 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నాడు.
నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2024 పురుషుల ఫ్రీస్టైల్ మెడల్ విజేతలు | |||
---|---|---|---|
రెజ్లింగ్ విభాగం | గోల్డ్ మెడల్ | సిల్వర్ మెడల్ | బ్రాంజ్ మెడల్ |
57 కేజీలు | రాహుల్ | అరవింద్ కుమార్ | ఉదిత్ & కుల్దీప్ |
61 కేజీలు | ఆకాశ్ దహియా | సాహిల్ కుందు | రమేష్ రావు & నవీన్ రాఠి |
65 కేజీలు | సుజీత్ కల్కల్ | రోహిత్ | మంగళ్& అనుజ్ |
70 కేజీలు | పర్వీన్ | సాహిల్ | శర్వాన్ & నవీన్ |
74 కేజీలు | నవీన్ మాలిక్ | యశ్ | చందర్ మోహన్ & రాహుల్ |
79 కేజీలు | సాగర్ జగ్లాన్ | పర్విందర్ సింగ్ | సచిన్ మోర్ & విజయ్ |
86 కేజీలు | సంజీత్ | రాహుల్ రాఠి | మున్నీర్ అహ్మద్ & దీపక్ |
92 కేజీలు | ఆకాష్ | పర్వీన్ | నీరాజ్ & పర్వీన్ చాహర్ |
97 కేజీలు | విక్కీ | కరణదీప్ సింగ్ నహల్ | గౌరవ్ బలియన్ & దీపక్ |
125 కేజీలు | అనిరుధ్ | దినేష్ | మహేంద్ర & మోను దహియా |
నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2024 గ్రీకో-రోమన్ పతక విజేతలు | |||
---|---|---|---|
రెజ్లింగ్ విభాగం | గోల్డ్ మెడల్ | సిల్వర్ మెడల్ | బ్రాంజ్ మెడల్ |
55 కేజీలు | విశ్వజిత్ | సంజీవ్ | రోహిత్ యాదవ్ & మంజీత్ |
60 కేజీలు | జ్ఞానేందర్ | సూరజ్ | విక్రమ్ కురాడే & ప్రవీణ్ |
63 కేజీలు | సన్నీ కుమార్ | షంషేర్ సింగ్ | ఉమేష్ & సందీప్ కుమార్ |
67 కేజీలు | అషు | సచిన్ సెహ్రావత్ | వినాయక్ పాటిల్ & వినయ్ |
72 కేజీలు | కుల్దీప్ మాలిక్ | సమీర్ | విశాల్ & అంకిత్ గులియా |
77 కేజీలు | వికాస్ | కరణ్ | తరుణ్ & రాహుల్ |
82 కేజీలు | రాహిత్ దహియా. | నీరజ్ | శివాజీ & లవ్‌ప్రీత్ సింగ్ |
87 కేజీలు | సునీల్ కుమార్ | మనోజ్ కుమార్ | రోహిత్ బురా & రవీందర్ ఖత్రి |
97 కేజీలు | నితేష్ | కపిల్ | నరీందర్ చీమా & సునీల్ |
130 కేజీలు | నవీన్ | హర్దీప్ | తుషార్ & మెహర్ సింగ్ |
నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2024 మహిళా పతక విజేతలు | |||
---|---|---|---|
రెజ్లింగ్ విభాగం | గోల్డ్ మెడల్ | సిల్వర్ మెడల్ | బ్రాంజ్ మెడల్ |
50 కేజీలు | నిర్మల | నీలం | సోనియా చౌదరి & అంజు |
53కేజీలు | అంకుష్ | జ్యోతి | కవితా మాలి & స్వాతి |
55 కేజీలు | వినేష్ ఫోగట్ | జ్యోతి | స్వాతి & తమన్నా |
57 కేజీలు | అంజు | తప్స్య | శిల్ప & భాను |
59 కేజీలు | అన్షు మాలిక్ | సరితా మోర్ | దీప్తి & అంజలి |
62 కేజీలు | మాన్సీ | సోనికా కుమారి | సవిత & సీమ |
65 కేజీలు | సోనాలి | దీక్షా మాలిక్ | భతేరి & ప్రియాంక |
68 కేజీలు | నిషా | రాధిక | ప్రియాంక & అన్ను |
72 కేజీలు | జ్యోతి | నిక్కీ | జషన్‌బీర్ కౌర్ & ప్రియాంక |
76 కేజీలు | రీతికా | సునేనా | మంజు & హర్షిత |
కజకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా ఒల్జాస్ బెక్టెనోవ్ నియామకం
కజకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఒల్జాస్ బెక్టెనోవ్ నియమితులయ్యారు. కజఖ్‌స్థాన్ ప్రెసిడెంట్ కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ ఫిబ్రవరి 6న ఓల్జాస్ బెక్టెనోవ్‌ను కొత్త ప్రధానిగా నియమిస్తూ డిక్రీపై సంతకం చేశారు. 43 ఏళ్ళ బెక్టెనోవ్, గతంలో ప్రెసిడెంట్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మరియు యాంటీ కరప్షన్ ఏజెన్సీ ఛైర్మన్‌గా పనిచేశారు.
కజకిస్తాన్‌లో గత కొంత కాలంగా అవినీతికి సంబంధించి కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో 2022 నుండి ప్రధానమంత్రిగా ఉన్న అలీఖాన్ స్మైలోవ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన స్థానంలో ఒల్జాస్ బెక్టెనోవ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు.
కజకిస్తాన్ మధ్య ఆసియాలో ఒక భూపరివేష్టిత దేశం. కజకిస్తాన్ ఉత్తరాన రష్యా , నైరుతి దిశలో కాస్పియన్ సముద్రం, దక్షిణాన తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు కిర్గిజ్ రిపబ్లిక్ అలానే తూర్పున చైనా సరిహద్దులుగా ఉన్నాయి. కజకిస్తాన్ 16 డిసెంబర్ 1991న మాజీ సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్రం పొందింది.
ఈ అతిపెద్ద భూపరివేష్టిత దేశంలో కేవలం 20 మిలియన్ల జనాభా మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలోని అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన దేశంలో ఒకటి, ఇక్కడ చదరపు కిలోమీటరుకు 6 మంది కంటే తక్కువ మంది జీవిస్తున్నారు. ఇది ప్రధానంగా దాని చమురు మరియు గ్యాస్ పరిశ్రమ ద్వారా విస్తారమైన ఖనిజ వనరులను కూడా కలిగి ఉంది. కజఖస్తాన్ ఈ ప్రాంతంలో అత్యధిక మానవ అభివృద్ధి సూచిక ర్యాంకింగ్‌ను కలిగి ఉంది. ఈ దేశం ప్రజాస్వామ్య, ఏకీకృత, రాజ్యాంగ గణతంత్ర రాజ్యం.
- దేశం : కజకిస్తాన్
- రాజధాని : అస్తానా
- కరెన్సీ : కజకిస్తానీ టెంగే
- అధికారిక భాషలు : రష్యన్, కజఖ్
- ఖండం : ఆసియా & యూరప్
- అధ్యక్షుడు : కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్
- ప్రధాన మంత్రి : ఒల్జాస్ బెక్టెనోవ్
రాజ్‌కోట్ స్టేడియంకు నిరంజన్ షా క్రికెట్ స్టేడియంగా పేరు మార్పు
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సిఎ) స్టేడియం, అధికారికంగా నిరంజన్ షా స్టేడియంగా పేరు మార్చబడింది. వెటరన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మరియు మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన నిరంజన్ షా, 1965 నుండి 1975 వరకు 12 ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎస్‌సిఎ సెక్రటరీగా పనిచేసిన ఆయన, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. సౌరాష్ట్ర క్రికెట్ అదృష్టాన్ని మలుపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఆ జట్టు రెండు రంజీ ట్రోఫీ టైటిల్స్ గెలవడంలో సహాయం అందించారు.
ఫిబ్రవరి 14, 2024న భారత్ మరియు ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమయ్యే ముందు రోజు ఈ నిర్ణయం ప్రకటించారు. సౌరాష్ట్ర క్రికెట్ పరిపాలనలో షా అందించిన విశేష కృషిని, ప్రత్యేకించి సౌరాష్ట్రలో క్రికెట్ అభివృద్ధిలో అతని పాత్రను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకోబడింది.
ఈ పేరు మార్చడంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది దీనిని షా అంకితభావానికి తగిన నివాళి అని కొనియాడగా, మరికొందరు క్రీడాకారులకు బదులుగా నిర్వాహకుల పేర్లను స్టేడియంలకు పెట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు.
విదేశాల్లోని విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన తెలంగాణ
విదేశాలలో, ముఖ్యంగా యూఎస్ఎ మరియు ఇతర దేశాలలో నివసిస్తున్న విద్యార్థులు మరియు యువత కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 7న ప్రకటించారు. అంతర్జాతీయంగా నివసిస్తున్న తెలంగాణ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చొరవను ప్రకటించింది.
హెల్ప్ డెస్క్ విదేశాలలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు భద్రతా ఆందోళనలు, విద్యాపరమైన మద్దతు, వీసా మరియు ఇమ్మిగ్రేషన్ సహాయం, ఆర్ధిక సహాయం, ఆరోగ్య సంరక్షణ యాక్సెస్, సామాజిక మరియు సాంస్కృతిక మద్దతు అవంటివి అందిస్తుంది.
ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో నలుగురు దొంగలు దాడి చేసిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. గత వారం అమెరికాలోని శ్రేయాస్ రెడ్డి అనే భారతీయ విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో శవమై కనిపించాడు. అయితే అతని మరణానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. వారం వ్యవధిలో ముగురు భారతీయ విద్యార్థులు మృతి చెందడం ఆందోళన కల్గిస్తుంది.
యెమెన్ కొత్త ప్రధానిగా అహ్మద్ అవద్ బిన్ ముబారక్
యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్, తన విదేశాంగ మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్‌ను ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించింది. ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ లీడర్‌షిప్ కౌన్సిల్ ఛైర్మన్‌కు పదవీ విరమణ చేసిన మాజీ ప్రధానమంత్రి మైన్ అబ్దుల్మాలిక్ సయీద్ ఆయన సలహాదారునిగా వ్యవహరిస్తారు.
బిన్ ముబారక్ గతంలో యెమెన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అతను దేశంలోని చాలా భాగాన్ని నియంత్రించే హౌతీ తిరుగుబాటుదారులపై తీవ్రమైన విమర్శకుడిగా ప్రసిద్ధి చెందాడు. గతంలో 2015లో ఆయన హౌతీ తిరుగుబాటుదారుల ద్వారా కిడ్నప్ చేయబడ్డారు. 2018లో బిన్ ముబారక్ ఐక్యరాజ్యసమితికి ఆ దేశ ప్రతినిధిగా కూడా నియమించబడ్డారు.
ఇటీవలే అరేబియా ద్వీపకల్పంలో ఉన్న యెమెన్, హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రపు నౌకలపై దాడుల ఫలితంగా యూఎస్, యూకే నుండి సైనిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యూఎస్ మరియు యూకే ప్రతీకార దాడుల కారణంగా యెమెన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ నియామకం జరిగింది.
2023 అక్టోబరు నుంచి గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా ఇరానియన్-మద్దతుగల హౌతీలు నెలల తరబడి ఎర్ర సముద్రం షిప్పింగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు జరుగుతున్నాయని తిరుగుబాటుదారులు తెలిపారు. ప్రధానంగా యూఎస్, యూకేలకు చెందిన 30 వాణిజ్య నౌకలపై దాడి చేసినట్లు నివేదించబడింది.
ఈ దాడులు ఎర్ర సముద్రంలో నౌక వాణిజ్యాన్ని కష్టతరం చేస్తుంది. కొన్ని షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్ర దాడుల నుండి తప్పించుకోవడానికి దక్షిణాఫ్రికా చుట్టూ తిరిగి గమ్యాన్ని చేరుకుంటున్నాయి. దీనికి ప్రతిస్పందనగా, యూఎస్ మరియు బ్రిటిష్ దళాలు హౌతీ క్షిపణి సైట్లు మరియు ఇతర సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించాయి.
ప్రస్తుతం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బిన్ ముబారక్, ఇటీవలే హౌతీలను ఉగ్రవాద సమూహంగా గుర్తించాలని యూరోపియన్ యూనియన్‌కు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఎర్ర సముద్ర దాడుల నేపథ్యంలో ప్రభుత్వ దళాలకు సైనిక మద్దతును కూడా పెంచారు. కావున ఈయన నియామకం హౌతీలపై కఠినమైన వైఖరిని సూచిస్తుంది. అయితే తాజా ప్రధాని మార్పు, ఈ సమస్యకు సంబంధించి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సవాళ్లను పెంచుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
రిపబ్లిక్ ఆఫ్ యెమెన్, పశ్చిమాసియాలోని ఒక దేశం. ఇది అరేబియా ద్వీపకల్పం యొక్క దక్షిణ చివరలో ఉంది. దీని ఉత్తరాన సౌదీ అరేబియా మరియు ఈశాన్యంలో ఒమన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇది ఎరిట్రియా, జిబౌటి మరియు సోమాలియాతో సముద్ర సరిహద్దులను పంచుకుంటుంది. యెమెన్ 2011 నుండి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పేదరికం, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా నిరసనలతో కొట్టిమిట్టాడుతుంది.
- దేశం : రిపబ్లిక్ ఆఫ్ యెమెన్
- రాజధాని : సనా
- ఖండం : ఆసియా
- కరెన్సీ : యెమెన్ రియాల్
- అధికారిక భాష : అరబిక్
- అధ్యక్షుడు (చైర్మన్) : రషద్ అల్-అలిమి
- ప్రధాన మంత్రి : అహ్మద్ అవద్ బిన్ ముబారక్