Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 11, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 11, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 11, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

యూఎస్ ఓపెన్ 2023 విజేతలు

2023 యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ యొక్క 143వ ఎడిషన్ న్యూయార్క్ నగరంలోని ఉస్తా బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్‌లోని అవుట్‌డోర్ హార్డ్ కోర్ట్‌లలో ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 10, 2023 వరకు జరిగింది. ఇది ఏడాది పొడుగునా జరిగే నాలుగు పాపులర్ గ్రాండ్ స్లామ్ ఈవెంట్లలో చివరిది. 1881లో ప్రారంభమైనప్పటి నుండి ప్రతి సంవత్సరం నిర్వహించిన ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఇది. అలానే అవుట్‌డోర్ హార్డ్ కోర్ట్‌లో (గ్రాస్ కోర్టు) జరిగే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కూడా ఇదే.

2023 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత : యుఎస్ ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నారు. సెప్టెంబర్ 10న జరిగిన తుదిపోరులో 6–3, 7–6, 6–3తో రష్యన్ క్రీడాకారుడు డానియల్ మెద్వెదేవ్‌ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచాడు. ఇది నోవాక్ జకోవిచ్ కెరీరులో నాల్గువ యుఎస్ ఓపెన్ టైటిల్. అలానే ఇది తన 24వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విజయం.

ఈ విజయం ఆయన్ని అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విజేత అయినా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) రికార్డుతో సమం చేయించింది. అలానే అత్యధిక పురుషుల సింగిల్స్ విజేతగా నిలిపింది. అలానే ఓపెన్ ఎరాలో యూఎస్ ఓపెన్ గెలిచిన అతి పెద్ద వ్యక్తి గా (36 ఏళ్లు)  కూడా అవతరించాడు.

2023 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత : 2023 యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను అమెరికాకు చెందిన 19 ఏళ్ళ కోకో గౌఫ్ సొంతం చేసుకుంది. తుది పోరులో 2–6, 6–3, 6–2తో ప్రపంచ నెంబర్ వన్ అరీనా సబలెంకాను ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. ఇది తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ విజయం. 1999లో సెరెనా విలియమ్స్ తర్వాత గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన అమెరికన్ మహిళగా గౌఫ్ నిలిచింది.

2023 యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేతలు : రాజీవ్ రామ్ మరియు సాలిస్‌బరీ ఫైనల్‌లో రోహన్ బోపన్న మరియు మాథ్యూ ఎబ్డెన్‌లను 2-6, 6-3, 6-4తో ఓడించి వరుసగా మూడో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఓపెన్ ఎరాలో వరుసగా మూడు యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన తొలి జోడిగా వీరు ఆతరించారు. రామ్ మరియు సాలిస్‌బరీ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన డబుల్స్ జోడిలో ఒకటి. మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (2020 మరియు 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2022 మరియు 2023 యూఎస్ ఓపెన్) సహా 15 ఏటీపీ టూర్ టైటిళ్లను వారు కలిసి గెలుచుకున్నారు. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్లు కూడా ఈ జోడినే.

2023 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలు : కెనడియన్ గాబ్రియేలా డబ్రోవ్‌స్కీ మరియు న్యూజిలాండ్ క్రీడాకారిణి ఎరిన్ రౌట్‌లిఫ్ 2023 మహిళల డబుల్స్ విజేతలుగా నిలిచారు. ఫైనల్ మ్యాచులో మాజీ ఛాంపియన్‌లు జర్మనీకి చెందిన లారా సీగెమండ్ మరియు వెరా జ్వోనరేవాను 7-6(9), 6-3తో ఓడించి విజేతగా నిలిచారు. ఇది వారి మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ విజయం. డబ్రోవ్‌స్కీ మహిళల డబుల్స్ మేజర్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి కెనడియన్‌గా నిలిచారు. అలానే రౌట్‌లిఫ్ యూఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి న్యూజిలాండ్ క్రీడాకారిణిగా నిలిచారు.

2023 యూఎస్ మిక్సడ్ డబుల్స్ విజేతలు : అన్నా డానిలినా మరియు హ్యారీ హెలియోవారా ఫైనల్లో జెస్సికా పెగులా మరియు ఆస్టిన్ క్రాజిసెక్‌లను ఓడించి 2023 యూఎస్ మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. డానిలినా మొదటి కజకిస్తానీ మేజర్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌గా నిలిచింది.  హెలియోవారా మొదటి ఫిన్నిష్ యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌గా అవతరించింది.

ఆసియా కప్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లీ-రాహుల్

విరాట్ కోహ్లీ - కేఎల్ రాహుల్ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన 2023 ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచులో 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో 194 బంతులలో ఈ భాగస్వామ్యం నెలకొల్పారు.

2012లో మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో భారత్‌పై తొలి వికెట్‌కు 224 పరుగులు జోడించిన పాకిస్థాన్ ద్వయం నాసిర్ జంషెడ్ మరియు మహ్మద్ హఫీజ్ రికార్డును వీరు అధిగమించారు. ఈ రికార్డు జాబితాలో యూనిస్-షోయబ్ (223) , ఇఫ్తీకర్-బాబర్ ( 214) మరియు రహానే-కోహ్లీ (213) మరియు టాప్ 5 భాగస్వామ్యాలుగా ఉన్నారు.

జైపూర్‌లో డ్యామ్ భద్రతపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు

జైపూర్‌లో డ్యామ్ భద్రతపై నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ "సేఫ్ & సెక్యూర్ డ్యామ్‌స్ ఎన్సుర్ నేషన్స్" అనే అంశంతో నిర్వహించబడింది. ఈ సమావేశం గంగా పునరుజ్జీవన శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖచే నిర్వహించబడింది.

డ్యామ్‌ల రక్షణ మరియు భద్రతను ఎలా నిర్ధారించాలనే దానిపై జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు ఉత్తమ పద్ధతులను చర్చించడానికి ప్రపంచం నలుమూలల నుండి డ్యామ్ భద్రత రంగంలో నిపుణులు మరియు నాయకులను ఈ సదస్సు ఒకచోట చేర్చింది. నీటిపారుదల, తాగునీరు మరియు జలవిద్యుత్ ఉత్పత్తికి నీటిని అందించడంలో ఆనకట్టలు కీలక పాత్ర పోషిస్తున్నందున, జాతీయ శ్రేయస్సు కోసం డ్యామ్ భద్రత యొక్క ప్రాముఖ్యతపై కూడా సమావేశం దృష్టి సారించింది.

జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో ఆరు వేలకు పైగా ఆనకట్టలు ఉన్నాయి. ఆనకట్టల సంఖ్యా పరంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. ఈ డ్యామ్‌లలో దాదాపు 80 శాతం 25 ఏళ్లు పైబడినవి ఉన్నాయి. ఈ డ్యామ్ భద్రత మరియు నిర్వహణలో అత్యాధునిక అంశాలపై చర్చించడానికి నిపుణులకు ఒక ప్రధాన వేదికను అందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.

భారత్-సౌదీ అరేబియా మధ్య పలు రంగాల్లో అవగాహన ఒప్పందం

భారత్ - సౌదీ అరేబియాలు సెప్టెంబరు 2023లో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశ పర్యటన సందర్భంగా ఇంధనం, డిజిటలైజేషన్ మరియు పెట్టుబడితో సహా అనేక రంగాలలో ఎనిమిది అవగాహన ఒప్పందాలు చేశాయి. 10 సెప్టెంబర్ 2023న న్యూ ఢిల్లీలో భారత ప్రభుత్వ నూతన & పునరుత్పాదక ఇంధనం & విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, సౌదీ అరేబియా ఇంధన మంత్రి హిస్ రాయల్ హైనెస్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అల్-సౌద్ మధ్య ఈ ఒప్పందం జరిగింది.

దీనికి ముందు భారతదేశం-సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ & సౌదీ అరేబియా ప్రధాన మంత్రి మరియు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సమావేశం అయ్యారు. ఇంధన సహకారంపై అవగాహన ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య పునరుత్పాదక శక్తి, ఇంధన సామర్థ్యం, ​​హైడ్రోజన్, విద్యుత్ మరియు గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్, పెట్రోలియం, సహజ వాయువు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు మరియు ఇంధన భద్రతను కవర్ చేస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు సైబర్‌సెక్యూరిటీ వంటి డిజిటలైజేషన్ సహకారంపై మరో అవగాహన ఒప్పందం జరిగింది. పెట్టుబడి సహకారంపై అవగాహన ఒప్పందం జరిగింది. ఇది ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ మరియు ఆహార భద్రతతో సహా వివిధ రంగాలలో ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన దశ. రెండు దేశాలు ఇప్పటికే వాణిజ్యం మరియు పెట్టుబడులలో సన్నిహిత భాగస్వాములుగా ఉన్నాయి మరియు ఈ అవగాహన ఒప్పందాలు విస్తృతమైన రంగాలలో మరింత లోతైన సహకారానికి మార్గం సుగమం చేస్తాయి.

40% భారత ఎంపీలపై క్రిమినల్ కేసులు

భారత ఉభయ సభలలో ఉన్న మొత్తం 763 సభ్యులలో 306 (40 శాతం) సభ్యులుపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ ఇటీవలి నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం తమ స్వీయ ప్రమాణ పత్రాలలో క్రిమినల్ కేసులను ప్రకటించిన ఎంపీల చార్టులో కేరళ (73%) అగ్రస్థానంలో ఉండగా, బీహార్, మహారాష్ట్ర (57%), తెలంగాణ (50%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ మొత్తం సభ్యులలో 194 మంది అంటే 25 శాతం మంది తీవ్రమైన నేర చరిత్రను కలిగి ఉన్నట్లు నివేదించింది. బీహార్ (50%)లో అత్యధిక శాతం ఎంపీలు తీవ్రమైన క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ (37%), మహారాష్ట్ర (34%), కేరళ (10%), తెలంగాణ (9%)తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. క్రిమినల్ కేసులు నమోదు అయిన వారిలో అత్యధిక శాతం మంది ఎంపీలు (47శాతం) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నట్లు నివేదించింది.

ప్రజాప్రతినిధులు ఎక్కువ శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది మన ప్రజాస్వామ్య నాణ్యత మరియు మన ప్రజాప్రతినిధుల సమగ్రత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎక్కువ శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదవడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. బలమైన అవినీతి నిరోధక చట్టం లేకపోవడం ఒక అంశం అయితే, అవినీతి నిరోధక చట్టం, 1988 కాలం చెల్లడం మరో అంశం. అలానే అవినీతిని అరికట్టడానికి రాజకీయ సంకల్పం లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.

రాజకీయ పార్టీలు తమ శ్రేణుల్లోని అవినీతి పరులను తమ కంటికి రెప్పలా చూసుకుంటాయి. అధికారంలో ఉండే పార్టీలు ప్రతిపక్ష సభ్యులపై అవినీతి కేసులు మోపడం మినహా తమ నిజాయతీని పరీక్షించుకోవు. అవినీతి నిరోధక చట్టాలను బలోపేతం చేసే చర్యలకు మద్దతు ఇవ్వడానికి వారు ఇష్టపడరు. ఎక్కువ శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండడం కూడా మన ప్రజాస్వామ్య నాణ్యత క్షీణతకు అద్దం పడుతోంది.

రాజకీయాలలో ధనబలం, కండబలం పెరిగిపోతున్నాయి. దీంతో నిజాయితీ, అర్హత ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం కష్టమవుతోంది. రాజకీయ పార్టీలు క్లీన్ రికార్డ్స్ ఉన్న అభ్యర్థులను నామినేట్ చేయాలని ప్రజలు డిమాండ్ చేయాలి. అవినీతి నిరోధక చట్టాలను బలోపేతం చేయడానికి మరియు మన ప్రజాస్వామ్య నాణ్యతను మెరుగుపరిచే చర్యలకు ప్రజల మద్దతు అవసరం. పార్లమెంటులో మనకు ప్రాతినిధ్యం వహించడానికి మనం ఎన్నుకునే వ్యక్తుల పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.

లక్నోలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ప్రైడ్ వాక్‌

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, సెప్టెంబరు 11, 2023న మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ ప్రైడ్ వాక్‌కు వేదిక అయ్యింది. ఆదిశివ్ ట్రాన్స్‌జెండర్ ఫౌండేషన్ ఈ నడకను నిర్వహించింది. లింగమార్పిడి సంఘం సభ్యులు, వారి మిత్రులతో సహా 1,000 మందికి పైగా ప్రజలు, మద్దతుదారులు దీనికి హాజరయ్యారు. అంబేద్కర్ పార్కు వద్ద ప్రారంభమైన పాదయాత్ర 1090 క్రాసింగ్ వద్ద ముగిసింది.

లక్నోలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఈ నడక ఒక చారిత్రాత్మక సంఘటన. తమ హక్కులను బహిరంగంగా నిలబెట్టుకోవడానికి మరియు ఆమోదం కోరడానికి సంఘం కలిసి రావడం ఇదే మొదటిసారి. లింగమార్పిడి కమ్యూనిటీకి మద్దతుగా అన్ని వర్గాల నుండి అనేక మంది ప్రజలు ముందుకు రావడంతో ఈ పాదయాత్ర విస్తృత సమాజం నుండి సంఘీభావాన్ని పొందింది.

ట్రాన్స్‌జెండర్ ప్రైడ్ వాక్ భారతదేశంలోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన ముందడుగు. లింగమార్పిడి సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి మరియు అంగీకారం మరియు అవగాహనను పెంపొందించడానికి కూడా నడక సహాయపడుతుంది.

Post Comment