Advertisement
ఇండియన్ అఫైర్స్ | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

ఇండియన్ అఫైర్స్ | ఫిబ్రవరి 2022

జబల్‌పూర్‌లో భారతదేశపు మొట్టమొదటి జియోలాజికల్ పార్క్

భారతదేశంలోని మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న లమ్‌హేటా గ్రామంలో ఏర్పాటు చేయబడుతుంది. మైనింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పార్కు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఐదెకరాల స్థలంలో 35 కోట్ల రూపాయల పెట్టుబడితో పార్కును నిర్మించనున్నారు.

పంజాబ్ ఎలక్షన్ మస్కట్‌'గా 'షేరా'

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022కి ముందు ఓటర్లలో అవగహన పెంపొందించేందుకు ఎలక్షన్ ప్రచార మస్కట్‌ 'షేరా'ను పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్ కరుణ రాజు ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ వేడుకకు ఐదుగురు వికలాంగులను గౌరవ అతిథులుగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.

సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఎలెక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) ప్రణాళికలో భాగంగా, సోషల్ మీడియాలో ఓటరు అవగాహన సందేశాలను వ్యాప్తి చేయడంతో పాటు, సాంప్రదాయ పంజాబీ దుస్తులలో ఉన్న షేరా యొక్క పోస్టర్లను, కటౌట్‌లను ఉపయోగించి యువతను ఆకట్టుకున్నారు.

శ్రీకాకుళంలో గాంధీ మందిరం నిర్మించిన సామాజిక కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని మున్సిపల్ పార్కులో స్థానిక సామాజిక కార్యకర్తలు మహాత్మా గాంధీ మరియు స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం కోసం ఆలయాన్ని నిర్మించారు. దాతల సహకారంతో పార్కులో స్వాతంత్య్ర సమరయోధులు, సామాజిక కార్యకర్తల విగ్రహాలను ఏర్పాటు చేశారు. జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా స్మృతివనంతోపాటు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

భారత్ నుండి 420 బ్రాడ్-గేజ్ రైల్వే వ్యాగన్ల కొనుగోలుకు బంగ్లాదేశ్ ఒప్పందం

బంగ్లాదేశ్ రైల్వేలు భారతదేశం నుండి 420 బ్రాడ్-గేజ్ వ్యాగన్లను కొనుగోలకు ఒప్పందం చేసుకుంది. ఢాకాలో బంగ్లాదేశ్‌ రైల్వే ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మిజానూర్‌ రెహమాన్‌, హిందుస్థాన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. రోలింగ్ స్టాక్ ఆపరేషన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ కింద బంగ్లాదేశ్ ప్రభుత్వం మరియు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) సంయుక్త నిధులతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతోంది. బంగ్లాదేశ్ రైల్వేను ఆధునీకరణ చేయడంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ రైల్వే మంత్రి వెల్లడించారు.

విదేశీ డ్రోన్‌ల దిగుమతిపై నిషేధం

దేశీయ తయారీని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం కొన్ని మినహాయింపులతో విదేశీ డ్రోన్‌ల దిగుమతిని నిషేధించింది. మేక్ ఇన్ ఇండియా పథకం కింద స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ, భద్రత, పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోజనాల కోసం అవసరమైనవి మినహా విదేశీ తయారీ డ్రోన్‌ల దిగుమతిని ఇక మీదట అనుమతించారు.

భారతదేశపు యూపీఐ వ్యవస్థను స్వీకరించిన మొదటి దేశంగా నేపాల్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థను అనుచరించిన మొదటి దేశంగా నేపాల్ నిలిచింది. 11 ఏప్రిల్ 2016 లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన ఈ తక్షణ రియల్ టైమ్ ఇంటర్-బ్యాంక్ చెల్లింపు వ్యవస్థ, భారత్'ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించడంలో కీలక భూమిక పోషించింది.

మహారాష్ట్రలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ టాక్సీ సర్వీస్ ప్రారంభం

ముంబై మరియు నవీ ముంబై మధ్య వేగవంతమైన కనెక్టివిటీని పెంపొందించేందుకు ముంబై వాటర్ టాక్సీ సేవలు ప్రారంభించబడ్డాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరియు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ 17 ఫిబ్రవరి 2022న దేశంలో ఈ మొట్టమొదటి వాటర్ ట్యాక్సీని ప్రారంభించారు. ఇది కేంద్రప్రభుత్వ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. కోస్టల్ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టును అమలు చేస్తుంది.

చండీగఢ్ యూనివర్సిటీకి నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్

చండీగఢ్ యూనివర్సిటీ అందించే ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ డిగ్రీలకు  నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) లభించింది. దీనితో చండీగఢ్ విశ్వవిద్యాలయం NAAC A+ & NBA అక్రిడిటేషన్లను పొందిన భారతదేశపు మొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా నిలిచింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ పొందిన యూనివర్సిటీల్లో చదువుకున్న విద్యార్థులకు విదేశీ సంస్థలు ఎక్కువ ప్రాధన్యత ఇస్తాయి.

ఉక్రెయిన్ నుండి భారత విద్యార్థుల తరలింపుకు ఆపరేషన్ గంగా

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు మరియు పౌరులను తిరిగి దేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరుతో ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. ఈ మిషన్ ఉక్రెయిన్ పొరుగు దేశమైన రోమానియా నుండి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 18 వేలకు పైగా భారతీయులు ఉక్రెయిన్ యందు చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

Post Comment