Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 26 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 26 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 26 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త సీఈఓగా అశోక్ వాస్వానీ

కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా అశోక్ వాస్వానీని మూడేళ్ల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. సెప్టెంబరు 2న, కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఉదయ్ కోటక్ తన పదవీకాలం ముగియడంతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓగా దీపక్ గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. వచ్చే ఏడాది జనవరి 1న అశోక్ వాస్వానీ ఈ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ భారతదేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటి. 1985 లో స్థాపించబడిన ఈ బ్యాంకు ముంబై ప్రధాన కేంద్రంగా పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ మరియు వెల్త్ మేనేజ్‌మెంట్ రంగాలలో కార్పొరేట్ మరియు రిటైల్ కస్టమర్ల కోసం బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. దీనిని ఉదయ్ కోటక్ స్థాపించారు.

విమర్శ్ పేరుతొ 5G టెక్నాలజీపై జాతీయ హ్యాకథాన్

5G ​​టెక్నాలజీపై కర్టెన్ రైజర్ ఆఫ్ విమర్శ్ అనే నేషనల్ హ్యాకథాన్ న్యూ ఢిల్లీలో అక్టోబర్ 27-28, 2023 న నిర్వహించబడింది. ఈ హ్యాకథాన్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, టెలికాం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సహకారంతో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిర్వహించింది.

సైబర్ సేఫ్ ఇండియాను నిర్మించడం లక్ష్యంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అంతర్జాతీయంగా భద్రతా సంబంధిత వ్యవహారాలలో సైబర్ భద్రత ఒక ముఖ్యమైన అంశంగా మారినందున లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరియు సైబర్-సురక్షిత దేశాన్ని రూపొందించడానికి భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 5G అప్లికేషన్ల వినియోగ కేసుల ప్రయోజనం కోసం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నామినేట్ చేయబడింది. దీని ప్రకారం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సమస్యలను పరిష్కరించడానికి సాధనాలను అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ 5Gపై హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది.

సీసీఐకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్‌లో సభ్యత్వం

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్ యొక్క స్టీరింగ్ గ్రూప్‌లో ప్రముఖ సభ్యదేశంగా మారింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్ స్టీరింగ్ గ్రూప్ అనేది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్ యొక్క అపెక్స్ బాడీ. ఈ స్టీరింగ్ గ్రూప్ యందు రెండేళ్ల నిడివితో పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యత్వం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొందటం ఇదే తొలిసారి.

ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్ అనేది అనధికారిక, వర్చువల్ నెట్‌వర్క్, ఇది పోటీ న్యాయ అధికారుల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తుంది. యూఎస్ అటార్నీ జనరల్ అంతర్జాతీయ పోటీ విధాన సలహా కమిటీ యొక్క తుది నివేదికను ప్రచురించిన తర్వాత ఇది 2001లో స్థాపించబడింది. యుఎస్‌లోని పోటీ న్యాయ నిపుణులు విదేశీ అధికారులతో సహకారాన్ని పెంచుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పోటీ విధానంపై సమాచారాన్ని అమలు చేయడానికి మరియు పంచుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఇది 132 సభ్య దేశాలను కలిగి ఉంది.

సైబర్ ఎనేబుల్డ్ క్రైమ్ సిండికేట్‌లపై ఆపరేషన్ చక్ర II

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గత ఏడాది ప్రారంభించిన ఆపరేషన్ చక్రకు కొనసాగింపుగా ఆపరేషన్ చక్ర-IIను ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ వ్యవస్థీకృత సైబర్-ఎనేబుల్డ్ ఆర్థిక నేరాలను అణచివేచే ఒక కార్యక్రమం. ఇది భారతదేశంలో అంతర్జాతీయంగా నిర్వహించబడిన సైబర్ ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రారంభించబడింది. గతేడాది నిర్వహించిన ఆపరేషన్ చక్ర కింద , ఆర్థిక నేరాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లపై సీబీఐ 100కి పైగా చోట్ల దాడులు నిర్వహించింది.

ఆపరేషన్ చక్ర 2 కింద దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలలో 76 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సిమ్ కార్డ్‌లు మరియు సర్వర్ చిత్రాలతో సహా అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. నకిలీ సాంకేతిక మద్దతు స్కామ్‌లతో విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించే తొమ్మిది కాల్ సెంటర్‌లను కూడా ఏజెన్సీ ఛేదించింది. ఈ స్కామ్‌లను, సాధారణంగా టెక్ సపోర్ట్ ఫ్రాడ్ అని పిలుస్తారు. నేరస్థులు చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్‌లను స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మందిని మోసం చేస్తారు.

ఈ ఆపరేషన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌తో సహా జాతీయ మరియు అంతర్జాతీయ ఏజెన్సీల సహకారంతో నిర్వహించబడింది. ఇందులో సైబర్ క్రైమ్ డైరెక్టరేట్, మరియు ఇంటర్‌పోల్, యూకేలోని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ, సింగపూర్ పోలీస్ ఫోర్స్ మరియు జర్మనీకి చెందిన బీకేఎ వంటి సంస్థలు ఉన్నాయి.

సైబర్ క్రైమ్‌పై సీబీఐ చేస్తున్న పోరాటంలో ఆపరేషన్ చక్ర-2 ఒక ముఖ్యమైన అడుగు.సైబర్‌క్రిమినల్ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడానికి మరియు ఆర్థిక మోసాల నుండి వినియోగదారులు మరియు వ్యాపారాలను రక్షించడానికి జాతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ఏజెన్సీ కట్టుబడి ఉందని ఇది చూపిస్తుంది.

భారతదేశ మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్‌కు 50 ఏళ్లు

1973లో కేరళలోని కోజికోడ్‌లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్ ఈ ఏడాది అక్టోబర్ నాటికీ ఏభై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ స్టేషన్ యొక్క 50వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కోజికోడ్‌లో 1973 అక్టోబరు 27న భారతదేశపు మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్‌ను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా ప్రారంభించారు. 70వ దశకం ప్రారంభంలో మహిళలపై పునరావృతమయ్యే దాడులు మరియు అవమానాల నుండి రక్షణ కల్పించే ఆలోచనతో ఈ పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంది.

1973లో, కోజికోడ్ సిటీ పోలీస్ కమీషనర్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న కంట్రోల్ రూమ్ భవనంలో ఒక ఎస్‌ఐతో సహా 10 మంది పోలీసులతో ఈ స్టేషన్ ప్రారంభమైంది. ఆ సమయంలో మహిళా పోలీసు అధికారులకు తెల్ల చీర ప్రామాణిక యూనిఫాంగా ఉండేది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఎస్‌ఐతో సహా 35 మంది మహిళా సిబ్బంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భారత మహిళా క్రికెట్ ప్రధాన కోచ్‌గా అమోల్ ముజుందార్

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ దేశవాళీ ఆటగాడు మరియు కెప్టెన్ అయిన అమోల్ ముజుందార్‌ను బీసీసీఐ నియమించింది. గతేడాది డిసెంబర్‌లో ఆ పదవి నుంచి తొలగించబడిన రమేశ్ పొవార్ నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. ముజుందార్ 1994లో ఇంగ్లండ్ పర్యటన కోసం భారత అండర్-19 క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో ముంబై మరియు అస్సాం క్రికెట్ జట్లకు కూడా ఆడాడు.

Post Comment