రోజువారీ కరెంట్ అఫైర్స్ 30 నవంబర్ 2023 | Current affairs in Telugu
Telugu Current Affairs

రోజువారీ కరెంట్ అఫైర్స్ 30 నవంబర్ 2023 | Current affairs in Telugu

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 30 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

Advertisement

భారతదేశానికి చెందిన సఫీనా హుస్సేన్‌కు ఖతార్ వైస్ ప్రైజ్

భారతదేశానికి చెందిన సఫీనా హుస్సేన్‌కు ఖతార్ వైస్ ప్రైజ్ 2023 అందించబడింది. ఎడ్యుకేట్ గర్ల్స్ ఫౌండర్ అయినా సఫీనా హుస్సేన్‌, గ్రామీణ భారతదేశంలోని విద్యలో లింగ అంతరాన్ని తగ్గించినందుకు చేసిన కృషికిగాను ఈ అవార్డు అందించబడింది. భారతదేశంలో విద్యలో లింగ వ్యత్యాసాన్ని తగ్గించడంలో సఫీనా యొక్క నిబద్ధతకు ఇది విలువైన గౌరవం.

వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ ఫర్ ఎడ్యుకేషన్ (WISE) ప్రైజ్ అనేది విద్యకు విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా బృందాలను గుర్తించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, ఆవిష్కర్తలు మరియు విధాన రూపకర్తల సమ్మేళనం అయిన వైస్ సమ్మిట్‌లో ప్రతి సంవత్సరం ఈ బహుమతిని ప్రదానం చేస్తారు.

కొచ్చిన్ షిప్‌యార్డ్ నుండి 3 యాంటీ సబ్‌మెరైన్ వాటర్‌క్రాఫ్ట్‌లు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ భారత నౌకాదళం కోసం మూడు యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్‌లను ప్రారంభించింది. లక్షద్వీప్ ద్వీపసమూహంలోని మహే, మాల్వాన్ మరియు మాంగ్రోల్ దీవుల పేరుతో ఈ నౌకలు 30 నవంబర్ 20223న కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వద్ద ప్రారంభించబడ్డాయి. ఈ ఓడలు సోనార్ సిస్టమ్, టార్పెడోలు మరియు తుపాకీతో సహా వివిధ రకాల సెన్సార్లు మరియు ఆయుధాలను కలిగి ఉంటాయి.

30 ఏప్రిల్ 2019లో రక్షణ మంత్రిత్వ శాఖ మరియు కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మధ్య ఎనిమిది యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్‌ షిప్‌ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేయబడింది. ఈ మహే క్లాస్ షిప్‌లు దేశీయంగా అభివృద్ధి చేయబడిన, అత్యాధునిక సెన్సార్‌ ఆధారితమైనవి. వీటిని తీరప్రాంత జలాల్లో యాంటీ సబ్‌మెరైన్ కార్యకలాపాలతో పాటు తక్కువ తీవ్రత ఉన్న సముద్ర కార్యకలాపాలు మరియు మైన్ లేయింగ్ ఆపరేషన్‌లను చేపట్టడం కోసం రూపొందించారు.

ఢిల్లీలో 40 వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూ ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెచ్‌క్యూలో 40వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల సదస్సును ప్రారంభించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ దేశం యొక్క తీరప్రాంత రక్షణ మరియు సముద్ర సామర్థ్యాలను బలోపేతం చేయడంలో అంకితభావం మరియు వృత్తి నైపుణ్యంతో పనిచేయాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. భారతదేశ తీరప్రాంతం, ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ మరియు ఆఫ్‌షోర్ ఆస్తులతో సహా భారతదేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ పాత్రను సింగ్ హైలైట్ చేశారు.

సెర్చ్ & రెస్క్యూ కార్యకలాపాలు, సముద్ర కాలుష్య ప్రతిస్పందన, నిషేధిత వస్తువులు/మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం, సముద్రంలో మత్స్యకారులు/నావికుల భద్రత, తీర ప్రాంత భద్రతా చర్యలను ఆప్టిమైజ్ చేయడం వంటి సముద్ర భద్రత మరియు రక్షణను పెంపొందించడం వంటి అనేక కీలకమైన అంశాలను ఈ సదస్సులో చర్చించారు. ఈ సదస్సు ఏటా ఒక నిర్వహించబడుతుంది. ఈ సదస్సులో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులందరూ భవిష్యత్తు కార్యక్రమాల రోడ్‌మ్యాప్‌ను రూపొంది, వాటి వివిధ విధానాలు మరియు వ్యూహాత్మక అంశాలపై చర్చిస్తారు.

పురుషుల సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్‌షిప్ పంజాబ్ సొంతం

చెన్నైలోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగిన 13వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల నేషనల్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హర్యానాపై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించిన పంజాబ్ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో హాకీ పంజాబ్ 2-2 (9-8 SO)తో హాకీ హర్యానాను ఓడించి విజేతగా నిలిచింది. అలానే మరో మ్యాచులో తమిళనాడు పెనాల్టీ షూటౌట్లలో కర్ణాటకను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్‌షిప్ అనేది హాకీ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర హాకీ సంఘాలు మరియు ప్రభుత్వ సంస్థలు పోటీ పడే జాతీయ ఫీల్డ్ హాకీ పోటీ. ఇది మొట్టమొదట 1928లో ఇండియన్ హాకీ ఫెడరేషన్ ప్రారంభించింది. దీనిని రంగస్వామి కప్ అని కూడా పిలుస్తారు. 2011 నుండి, దీనిని హాకీ ఇండియా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పేరుతో నిర్వహిస్తున్నారు.

స్వలింగ వివాహాలను నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా నేపాల్

నేపాల్ స్వలింగ వివాహాలను నమోదు చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా అవతరించింది. నేపాల్ సుప్రీం కోర్ట్ చట్టబద్ధం చేసిన ఐదు నెలల తర్వాత నేపాల్ ఈ తొలి స్వలింగ వివాహాన్ని నమోదు చేసింది. పశ్చిమ నేపాల్‌లోని లామ్‌జంగ్ జిల్లాలోని డోర్డి రూరల్ మునిసిపాలిటీలో 35 ఏళ్ల ట్రాన్స్-ఉమెన్ మాయా గురుంగ్ మరియు 27 ఏళ్ల గే మ్యాన్ సురేంద్ర పాండే మధ్య ఈ వివాహం జరిగింది.

వాస్తవానికి 2007లో నేపాల్ సుప్రీం కోర్ట్ స్వలింగ వివాహాలకు అనుమతిని మంజూరు చేసింది. 2015లో లైంగిక ధోరణి ఆధారంగా వివక్షను స్పష్టంగా నిషేధించేందుకు రాజ్యాంగం ద్వారా హామీ కల్పించింది. అయితే దీనిని ప్రభుత్వం అమలు చేయలేదు. తాజాగా జూన్ 27, 2023న, నేపాల్‌లో స్వలింగ వివాహాలను అధికారికంగా చట్టబద్ధం చేయాలని గురుంగ్‌ రిట్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రహించారు. దీనికి అనుకూలంగా సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ప్రభుత్వం ఈ వివాహాన్ని నమోదు చేయాల్సి వచ్చింది.

నేపాల్‌లో మొదటి స్వలింగ వివాహం నమోదు చేయడం అనేది దేశంలో LGBTQ+ హక్కుల కోసం ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది నేపాలీ సమాజంలో స్వలింగ సంబంధాలకు పెరుగుతున్న అంగీకారానికి నిదర్శనం. ఈ నిర్ణయం దక్షిణాసియా అంతటా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు దీనిని అనుసరించడానికి మరియు స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

Advertisement

Post Comment