Advertisement
రోజువారీ కరెంట్ అఫైర్స్ 29 నవంబర్ 2023 | Current affairs in Telugu
Telugu Current Affairs

రోజువారీ కరెంట్ అఫైర్స్ 29 నవంబర్ 2023 | Current affairs in Telugu

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 29 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఐఎఫ్‌ఎఫ్‌ఐలో రిషబ్‌ శెట్టి ప్రత్యేక జ్యూరీ అవార్డు

ఇటీవల గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కాంతారావు చిత్రానికి గాను రిషబ్ శెట్టికి ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ కాంతారా చిత్రం గత ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యి ప్రపంచ వ్యాప్తంగా విమర్శుకుల ప్రసంశలు అందుకుంది.

ఈ చిత్రం ఒక కల్పిత గ్రామంలో మానవత్వం మరియు ప్రకృతి వనరుల మధ్య సైద్ధాంతిక సంఘర్షణను వెండితెరపై చూపించి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం సంప్రదాయం మరియు ఆధునిక ఘర్షణ మధ్య శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. ఈ అవార్డు ప్రదానోత్సవం నవంబర్ 28, 2023 న గోవాలో జరిగింది. ఈ అవార్డును సిల్వర్ పీకాక్ అవార్డు అని కూడా అంటారు.

54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డులు

గోవాలో నిర్వహించిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు నవంబర్ 28న ముగిసాయి. ముగింపు వేడుక బాంబోలిమ్‌లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ముగింపు వేడుకలో 'ఫెదర్‌వెయిట్' అనే అమెరికన్ చిత్రాన్నీ ప్రదర్శించారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మరియు నిర్మాత మైఖేల్ డగ్లస్‌ను ముగింపు వేడుకలో సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అందజేశారు. ముగింపు కార్యక్రమంలో పలు అవార్డులను కూడా ప్రదానం చేశారు.

  • అబ్బాస్ అమినీ దర్శకత్వం వహించిన 'ఎండ్‌లెస్ బోర్డర్స్' ఈ ఏడాది ఉత్తమ చిత్రం లేదా గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకుంది.
  • ఉత్తమ దర్శకుడు అవార్డును 'బ్లాగాస్ లెసన్స్' చిత్రానికి స్టీఫన్ కొమందరేవ్‌ దక్కించుకున్నాడు.
  • 'ఎండ్‌లెస్ బోర్డర్స్' చిత్రానికి గానూ పౌరియా రహిమి సామ్ ఉత్తమ నటుడు (పురుషుడు) అవార్డును అందుకున్నాడు.
  • ఉత్తమ నటి (మహిళ) అవార్డును 'పార్టీ ఆఫ్ ఫూల్స్' చిత్రంలో నటనకు గాను మెలానీ థియరీకి అందజేశారు.
  • రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'కాంతారా'కు ప్రత్యేక జ్యూరీ లేదా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది.
  • టర్కీ దర్శకుడు రెగెర్ ఆజాద్ కయా తన 'వెన్ ద సీడ్లింగ్స్ గ్రో' చిత్రానికి గానూ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డు అందుకున్నారు.
  • సింగపూర్ చిత్రనిర్మాత ఆంథోనీ చెన్ 'డ్రిఫ్ట్' చిత్రానికి దర్శకత్వం వహించి ఐసీఎఫ్టి యునెస్కో గాంధీ మెడల్‌ను కైవసం చేసుకున్నారు.
  • ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్తమ వెబ్ సిరీస్ (ఓటీటీ) అవార్డును పంచాయత్ సీజన్ 2 చేజిక్కించుకుంది.

16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిబంధనలకు క్యాబినెట్ ఆమోదం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం పదహారవ ఫైనాన్స్ క‌మీష‌న్‌కు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ని ఆమోదించింది. ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమయ్యే వచ్చే ఐదేళ్ల కాలానికి సంబంధించి కేంద్ర, రాషా ల మధ్య పన్నుల నికర ఆదాయ పంపిణీ, నిధుల మంజూరు తదితర కీలక అంశాలకు ఈ 16వ ఆర్థిక సంఘం విధివిధానాలు బాధ్యత వహిస్తాయి. 2025 అక్టోబర్ 31 నాటికి 16వ ఆర్థికసంఘం తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అందులో చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదిస్తే 2026 ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్లపాటు అవి అమల్లో ఉంటాయి.

  • యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య పన్నుల నికర ఆదాయాల పంపిణీ రాజ్యాంగంలోని చాప్టర్ I, పార్ట్ XII కింద వాటి రాబడి యొక్క సంబంధిత వాటాల ఆధారంగా కేటాయింపు చేయాలని ప్రతిపాదించింది.
  • రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్రంలోని పంచాయతీలు మరియు మునిసిపాలిటీల వనరులకు అనుబంధంగా ఒక రాష్ట్రం యొక్క ఏకీకృత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టనుంది.
  • ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు రూ.11.80 లక్షల కోట్ల కేంద్ర సబ్సిడీతో 81.35 కోట్లమందికి ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేయనున్నారు.
  • ఆదివాసీలకు సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగు నీరు తదితర సౌకర్యాలు కల్పించేందుకు షెడ్యూల్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక కింద రాబోయే మూడేళ్లలో కేంద్రం రూ.15,336 కోట్లు కేటాయించింది. రాష్ట్రాలు ఈ మొత్తానికి అదనంగా తమ వాటాగా రూ.8768 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. దేశంలోని 10.45 కోట్ల మంది ఆదివాసీలకు సామాజిక, విద్యా రంగాల్లో జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ తోడ్పడుతుంది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.45 కోట్లు గిరిజన జనాభా ఉంది. అందులో 18 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ లోని 75 గిరిజన సమూహాలను ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించారు.
  • దేశంలోని 15 వేల మహిళా స్వయం సహాయ బృందాలకు డ్రోన్లను అందించేందుకు 2024 నుంచి రెండేళ్ల పాటు రూ.1261 కోట్లు కేటాయించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీంట్లో 80 శాతం ఖర్చును కేంద్రం భరిస్తుంది.
  • అర్హులైన మహిళలకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇస్తారు. 15 వేల మహిళా స్వయం సహాయక బృందా లకు స్థిరమైన వ్యాపారం, జీవనోపాధి లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.
  • లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు మరో మూడేళ్లపాటు ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను కొనసాగించేందుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దిల్లీలో నిర్భయ ఘటన తర్వాత 2018లో నేర శిక్షాస్మృతి(సవరణ) చట్టం ఆమోదించిన తర్వాత 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను ప్రత్యేకంగా పరిష్కరించే 389 కోర్టులు సహా 1,023 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఫైనాన్స్ కమిషన్ అనేది యూనియన్ (కేంద్ర) ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను సమీక్షించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం స్థాపించబడిన భారతదేశంలోని చట్టబద్ధమైన సంస్థ. యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య విభజించదగిన కేంద్ర పన్నుల కేటాయింపుపై మరియు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై సిఫార్సులు చేయడానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటవుతుంది.

2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలానికి సిఫార్సులు చేయడం కోసం 27.11.2017న పదిహేనవ ఆర్థిక సంఘం ఏర్పాటు చేయబడింది. ఇది తన మధ్యంతర మరియు తుది నివేదికల ద్వారా 1 ఏప్రిల్, 2020 నుండి ప్రారంభమయ్యే ఆరు సంవత్సరాల కాలానికి సంబంధించిన సిఫార్సులను చేసింది. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సులు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 2023 నుండి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు  అమలులోకి వస్తాయి.

ఎస్ఆర్ఎం ఉపకులపతి మనోజ్‌కు భాస్కర్ అవార్డు

మంగళగిరిలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉపకుల పతి ఆచార్య మనోజ్ కుమార్ అరోరాకు సైన్స్ అండ్ టెక్నా లజీ రంగంలో అత్యున్నతమైన భాస్కర్ అవార్డు లభించింది. అంతరిక్ష పరిశోధనల్లో పేరున్న ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఈ అవార్డును ప్రకటించింది. పూణెలో జరిగిన సొసైటీ వార్షిక సమావేశం సందర్భంగా మనోజ్ ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ శైలేష్ నాయక్, నేష నల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాశ్ చౌహాన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకు న్నారు.

రిమోట్ సెన్సింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ల్యాండ్ కవర్ మ్యాపింగ్, ఎర్త్ సైన్సెస్ రంగాల్లో మనోజ్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్టు సొసైటీ ప్రకటించింది. ఇప్పటివరకు ఈ అవార్డును ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్, మాజీ చైర్మన్లు డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శివన్ వంటి ప్రముఖులు మాత్రమే అందుకున్నారు. మెషిన్ లెర్నింగ్ టెక్నిక్లను ఉపయోగించి వివిధ రకాల రిమోట్ సెన్సింగ్ డేటాల ద్వారా కచ్చితమైన ల్యాండ్ కవర్ సమాచారాన్ని గుర్తించడంలో మనోజ్‌కు మంచి అనుభవం ఉంది.

అనంతపురం రైతుకు కర్మవీరచక్ర అవార్డు

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం మల్లాపురం గ్రామ రైతు ఎం. నారాయణప్ప ఢిల్లీలో కర్మవీర చక్ర అవార్డు అందుకున్నారు. వివిధ రంగాలలో విశేష కృషి చేస్తున్నవారికి ఈ అవార్డును అందజేస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల సమాఖ్య (ఐకాంగో) కర్మవీర్ చక్ర అవార్డును ఇస్తోంది.

2023-24 ఏడాదికి నారాయణప్పకు ఈ పురస్కారం దక్కింది. నారాయణప్ప తనకున్న 30 సెంట్ల పొలంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఏకంగా 20 రకాల పంటలను ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్న (ఏటీఎం మోడల్) ఈయన కృషిని గుర్తించి ఈ కర్మవీర చక్ర అవార్డుకు ఎంపిక చేశారు.

Post Comment