Advertisement
యూనియన్ బడ్జెట్ 2022 -23 – పోటీ పరీక్షల ప్రత్యేకం
Telugu Current Affairs

యూనియన్ బడ్జెట్ 2022 -23 – పోటీ పరీక్షల ప్రత్యేకం

కేంద్ర బడ్జెట్ 2022-23 ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 01 ఫిబ్రవరి 2022 న లోకసభలో ప్రవేశపెట్టారు. వరుసగా రెండవ ఏడాది డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రసంగం నిరవధికంగా గంటన్నరకు పైగా సాగింది. భారత ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన నాల్గువ వార్షిక బడ్జెట్ ఇది.

కేంద్ర బడ్జెట్ 2022

2022 -23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ అంచనాలు 39 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం మరికొంతకాలం కొనసాగుతోందని, కోవిడ్ అనంతర ప్రపంచంలో మారుతున్న రాజకీయ, ఆర్థిక మరియు వ్యూహాత్మక అంశాల యందు భారత్ తెలివైన అడుగులు వేస్తుందని వెల్లడించారు.
దాదాపు రెండున్నరేళ్ల కోవిడ్ కష్టకాలం తర్వాత ప్రవేశపెట్టిన ఈ బడ్జెటులో రాజకీయ సంక్షేమ ప్రకటనల వైపు పోకుండా దేశ విద్య, ఆరోగ్య, మౌలిక మరియు ఇన్నోవేషన్ అంశాలకు పెద్దపీట వేశారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోండి.

కేంద్ర బడ్జెట్ 2022-23 వివరాలు

కేంద్ర బడ్జెట్ అంచనాలు 2022

  • 2022-23 మొత్తం బడ్జెట్ అంచనాలు 39.45 లక్షల కోట్లు
  • మొత్తం రెవిన్యూ వసూళ్ల అంచనా : 22.04 లక్షల కోట్లు
  • మూలధన వసూళ్ల అంచనా : 17.40 లక్షల కోట్లు
  • మొత్తం బడ్జెట్ వసూళ్ల అంచనా : 39.44 లక్షల కోట్లు
  • 2022-23 బడ్జెట్ ద్రవ్య లోటు 6.9 శాతం
  • మొత్తం ద్రవ్యలోటు 17 లక్షల కోట్లు
  • 2025-26 నాటికీ ద్రవ్య లోటు 4.5 శాతానికి తగ్గింపే లక్ష్యం
  • 2022- 23 ఆదాయ వనరుల అంచనా 22.84 లక్షల కోట్లు
  • 2022 జనవరిలో జీఎస్టీ వసూళ్లు 1.41 లక్షల కోట్లు.

తృణధాన్యాల సంవత్సరంగా 2023

దేశంలో తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు మరియు వాటికీ ఒక బ్రాండ్ కల్పించేందుకు 2023 యేడాదిని తృణధాన్యాల ఏడాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వరి అధికంగా వాడటం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడేందుకు మిల్లెట్ల వాడకాన్ని పెంపొందించనుంది. భారత్ చేసిన ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుని 2023 ను ప్రపంచ మిల్లెట్ ఇయర్'గా ప్రకటించింది.

దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు

దేశవ్యాప్తంగా 3.8 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీటి కనెక్షన్లు అందించేందుకు ఈ బడ్జెట్'లో 60 వేల కోట్లు కేటాయించారు.  2023 మార్చి 31 లోపు ఈ లక్ష్యాన్ని చేరేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే గడిచిన రెండేళ్లో 5.5 కోట్ల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు అందించి ఉన్నారు.

ఒక దేశం - ఒకే రిజిస్ట్రేషన్

ఒక దేశం - ఒకే రిజిస్ట్రేషన్ ద్యేయంతో జాతీయ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను వినియోగించుకోవాలని 2022-23 బడ్జెట్ సూచిస్తుంది. అలానే భూరికార్డుల సమగ్ర నిర్వహణకు ఐటి ఆధారిత భూ గుర్తింపు సంఖ్యను వినియోగించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది. ఆయా రికార్డులు షెడ్యూల్ 8 లో పేర్కొన్న భాషల్లో అందుబాటులో ఉండేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరింది.

స్థిరాస్తి విక్రయంపై టీడీఎస్

50 లక్షలకు పైబడిన వ్యవసాయేతర స్థిరాస్తి అమ్మకం ధర లేదా స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఏది ఎక్కువ అయితే దానిపై ఒక శాతం టీడీఎస్ ను వర్తింపచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పన్ను చట్టంలో సవరణల అనంతరం ఇది వర్తిస్తుంది.

2.5 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్

అంగన్‌వాడీ కేంద్రాలను ఇంటరాక్టివ్‌గా పిల్లలకు మరింత స్నేహపూర్వకంగా చేసేందుకు క్రెచ్ మరియు స్మార్ట్ టీచింగ్/లెర్నింగ్ ఎయిడ్ వంటి సౌకర్యాలతో సేవలను అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబందించిన మూడు పథకాలను సమగ్రంగా పునరుద్దించినట్లు వెల్లడించారు.

నదుల అనుసంధానానికి లైన్ క్లియర్

దేశంలో నీటి వనరుల లభ్యతను పెంచేందుకు, వృధా అవుతున్న నీటిని ఒడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నదులు అనుసనుసంధానం చేయాలని ఎప్పటి నుండో ఉన్న డిమాండును పరిష్కరించేలా చర్యలు ప్రారంభించింది. తాజా బడ్జెట్ యందు దీని కోసం 14 వందల కోట్లు కేటాయించింది. అలానే కీలకమైన ఐదు నదుల అనుసంధానానికి సంబంధించి  మూడు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) లను సిద్ధం చేసింది. వీటిలో దమన్'గంగా - పింజల్, పార్-తాపి-నర్మదా, కృష్ణ-గోదావరి-పెన్నా, పెన్నార్-కావేరి నదులు ఉన్నాయి. అలానే 44.6 వేల కోట్ల వ్యయంతో మధ్యప్రదేశ్-యూపీల మధ్య ఉన్న కెన్-బెత్వా నదుల అనుసంధానాన్ని చేపట్టనున్నారు.

కృష్ణ-గోదావరి-పెన్నా నదుల అనుసంధానం వలన ఏటా సముద్రంలో వృధాగా కలిసే 247 టీఎంసీల నీటిని ఒడిచిపెట్టే వీలుంది. కెన్-బెత్వా నదుల అనుసంధానం వలన 9.08 లక్షల హెక్టర్ల వ్యవసాయ భూమికి సాగు నీరు అందుబాటులోకి రానుంది. దమన్'గంగా - పింజల్ నదుల అనుసంధానం మహారాష్ట్ర-గుజరాత్ సాగు భూములకు లబ్ధి చేకూరనుంది. పార్-తాపి-నర్మదా నదుల అనుసంధానం ఉత్తర మహారాష్ట్ర-దక్షణ గుజరాత్ ప్రాంతాలలో నీటి లభ్యతను పెంచనుంది. ఈ ప్రాంతంలో కొత్తగా 7 రిజర్వాయర్లు నిర్మించనున్నారు. పెన్నార్-కావేరి నదుల అనుసంధానం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండనుంది.

బడ్జెట్ 2022 ఇతర ముఖ్యాంశాలు

బడ్జెట్ మొత్తం : 2022-23 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 39.45 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించింది, ఈ బడ్జెట్ ప్రధానంగా దేశీయ మౌలిక సదుపాయాల పెట్టుబడిపై దృష్టి సారించింది.

ఆర్థిక లోటు లక్ష్యం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.9%గా అంచనా వేయబడింది, ఇది అంతకుముందు లక్ష్యంగా పెట్టుకున్న 6.8% కంటే కొంచెం ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి, 6.4% లోటు లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ఊహించిన దాని కంటే ఎక్కువ.

ప్రైవేటీకరణ: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం 2023 నాటికీ పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.65,000 కోట్లుగా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని రూ.78,000 కోట్లకు తగ్గించింది. మార్కెట్ గందరగోళాల నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించే ప్రణాళికలపై ప్రభుత్వం వేగం తగ్గించింది.

2023 నాటికీ 80 లక్షల ఇళ్లు : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే 80 లక్షల ఇళ్లను పూర్తి చేసినట్లు మరియు మంత్రి ఆవాస్ యోజన అర్బన్ మరియు రూరల్ కింద రూ. 48,000 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించింది. 2023 నాటికి మరో 80 లక్షల ఇళ్లు పూర్తికానున్నట్లు అంచనా వేశారు.

రిటర్న్‌లను అప్‌డేట్'కు సమయం : ఐటీ రిటర్న్ దాఖలు ఇక సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం నుండి రెండేళ్లలోపు లోపాలను సరిదిద్దడానికి మరియు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించారు.

పన్ను మినహాయింపు : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తీసుకురావడానికి జాతీయ పెన్షన్ వ్యవస్థ యొక్క పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచారు.

ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ : బ్లాక్‌చెయిన్ మరియు ఇతర సపోర్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

క్రిప్టో ఆదాయంపై పన్ను : క్రిప్టోకరెన్సీలు మరియు ఇతర డిజిటల్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయంపై కేంద్రం 30% పన్నును విధించనుంది, వాటిని అత్యధిక పన్ను జాబితాలో ఉంచనున్నట్లు వెల్లడించింది. వాటి అమ్మకం వల్ల వచ్చే నష్టాలను ఇతర ఆదాయాలతో భర్తీ చేయలేమని కేంద్రం తెలిపింది.

వందే భారత్ రైళ్లు: రాబోయే మూడేళ్లలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లును అందుబాటులోకి తీసుకు రానున్నారు. అలానే ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా, 2,000 కి.మీల రైల్వే నెట్‌వర్క్‌ను ఆర్థిక సంవత్సరం 2023లో  అభివృద్ధి చేయనున్నారు. రైల్వే భద్రత మరియు సామర్థ్యాల పెంపుదల కోసం స్వదేశీ మరియు ప్రపంచ స్థాయి సాంకేతికతను ఉపయోగించనున్నారు.

గతి శక్తి మాస్టర్ ప్లాన్ : దేశంలో రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ప్రజా రవాణా, జలమార్గాలు మరియు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు. ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి కోసం 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించరు. రాబోయే మూడేళ్లలో 100 కొత్త కార్గో టెర్మినల్స్ నిర్మించబడనున్నాయి. అలానే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 25,000 కి.మీ మేర జాతీయ రహదారి నెట్‌వర్క్'ను విస్తరించనున్నారు.

డిజిటల్ విద్య : కోవిడ్ కారణంగా హస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పీఎం ఈవిద్య యొక్క 'వన్ క్లాస్-వన్ టీవీ ఛానెల్' కార్యక్రమంను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 12 టీవీ చానెల్స్ నుండి 200 టీవీ ఛానెళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది అన్ని రాష్ట్రాలు 1 నుండి 12 తరగతులకు ప్రాంతీయ భాషలలో అనుబంధ విద్యను అందించడానికి వీలు కల్పిస్తుంది.

కొత్త ఇ-పాస్‌పోర్ట్‌లు : విదేశీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఎంబెడెడ్ చిప్స్ మరియు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి ఇ-పాస్‌పోర్ట్‌లను ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నారు.

పోస్ట్ ఆఫీస్ బ్యాంకింగ్ : పోస్టల్ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను దేశంలో అన్ని పోస్ట్ ఆఫీసులకు విస్తరించనున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఏటీఎమ్'ల ద్వారా ఖాతాలను యాక్సెస్ చేయడం మరియు బ్యాంక్ ఖాతాల మధ్య ఆన్‌లైన్ బదిలీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మరియు సీనియర్ సిటిజన్లకు సహాయ పడనుంది.

సోలార్ మాడ్యూల్స్: 2030 నాటికి 280 గిగావాట్ల ఇన్‌స్టాల్ సోలార్ ఎనర్జీ కెపాసిటీని దేశీయంగా తయారు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు. అధిక సామర్థ్యం గల మాడ్యూళ్ల ఉత్పత్తికి ప్రభుత్వం రూ.19,500 కోట్ల అదనపు కేటాయింపులు అందుబాటులో ఉంచనుంది.

రక్షణ పెట్టుబాటులు : విదేశీ రక్షణ పరికరాల దిగుమతులను తగ్గించడానికి మరియు సాయుధ దళాల పరికరాలలో ఆత్మనిర్భర్తను ప్రోత్సహించడానికి, మూలధన సేకరణ బడ్జెట్‌లో 68 శాతం దేశీయ రక్షణ పరిశ్రమ కోసం కేటాయించబడింది.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇతర సంస్థల సహకారంతో మిలిటరీ ప్లాట్‌ఫారమ్‌ల అభివృద్ధి, రక్షణ పరికరాల రూపకల్పన మరియు వాటి అభివృద్ధిని చేపట్టేందుకు ప్రైవేట్ పరిశ్రమను  ప్రోత్సహించనున్నారు.

పేపర్‌లెస్ ఇ-బిల్లు వ్యవస్థ : ఈ బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడానికి మరియు చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి తదుపరి చర్యగా అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ కొనుగోళ్ల కోసం పూర్తిగా పేపర్‌లెస్, ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ ఇ-బిల్లు వ్యవస్థను ప్రారంభించనున్నాయి.

టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ : కోవిడ్ కష్టకాలంలో అన్ని వయసుల ప్రజలలో పురుడు పోసుకుంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను నివారించేందుకు మరియు నాణ్యమైన మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు జాతీయ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్'ను ప్రారంభించనున్నారు.

5జీ నెట్‌వర్క్ ప్రారంభం : ప్రైవేట్ టెలికామ్ సంస్థల సహాయంతో ఈ ఏడాది 5జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి స్పెక్ట్రమ్ వేలం త్వరలో నిర్వహించబడుతుంది. అలానే 2025 నాటికి వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం అన్ని గ్రామాలను ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాష్ట్రాలకు ఆర్థిక సహాయం : మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్లు కేటాయించారు.

కొత్త సెజ్ చట్టం : ఎంటర్‌ప్రైజ్ మరియు సర్వీస్ హబ్‌లను అభివృద్ధి చేయడంలో రాష్ట్రాలు భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కొత్త సెజ్ చట్టాన్ని తీసుకురానుంది. ఇది మౌలిక సదుపాయాలను సముచితంగా ఉపయోగించుకోవడానికి మరియు ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇప్పటికే ఉన్న అన్ని పెద్ద మరియు కొత్త పారిశ్రామిక ఎన్‌క్లేవ్‌లను కవర్ చేయనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ-స్వాపింగ్ విధానం : పట్టణ ప్రాంతాల్లో స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్తగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి బదులు బ్యాటరీ మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. అలానే ఈ బ్యాటరీ- లేదా ఎనర్జీ-ఎ-సర్వీస్ కోసం స్థిరమైన మరియు వినూత్న వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ రంగంను ప్రోత్సహించనుంది.

కిసాన్ డ్రోన్‌లు : పంట అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్ మరియు పురుగు మందుల పిచికారీ మరియు పోషకాలను పిచికారీ చేయడానికి కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళిక చేస్తుంది. అలానే ప్రయోగాత్మకంగా గంగా నది వెంబడి ఉన్న వ్యవసాయ భూములలో రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని పండించేందుకు ప్రోత్సహకాలు అందివ్వనున్నారు.

యానిమేషన్ మరియు గేమింగ్ : యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (AVGC) రంగంలో యువతకు ఉపాధి కల్పించడానికి కొత్తగా AVGC ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు.

బడ్జెట్ 2022-23 లో కీలక కేటాయింపులు

  • స్వచ్ఛ భారత్ - 9,492 కోట్లు
  • పంటల బీమా పథకం - 15,500 కోట్లు
  • జాతీయ ఆరోగ్య మిషన్ - 37, 800 కోట్లు
  • ప్రధానిమంత్రి ఆవాస్ యోజన - 48,000 కోట్లు
  • జల్ జీవన్ మిషన్ - 60,000 కోట్లు
  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి - 68,000 కోట్లు
  • ఉపాధి హామీ పథకం - 73,000 కోట్లు
  • జాతీయ రహదారుల సంస్థ - 1,34,015 కోట్లు
  • కృషి సించాయ్ యోజన - 12,954 కోట్లు
  • జాతీయ విద్య మిషన్ - 39,553 కోట్లు
  • ఈవిద్య పథకం - 1.05 లక్షల కోట్లు
  • రైల్వే బడ్జెట్ - 1,40,367 కోట్లు
  • రక్షణ బడ్జెట్ - 5.25 లక్షల కోట్లు
  • భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్'కు - 44,720 కోట్లు

అంకెల్లో 2022-23 బడ్జెట్ వివరాలు

 మొత్తం బడ్జెట్ - 39.45 లక్షల కోట్లు రెవెన్యూ వసూళ్లు - 22.04 లక్షల కోట్లు
మూలధన వసూళ్లు - 17.41 లక్షల కోట్లు
పథకాలపై వ్యయం 16.24 లక్షల కోట్లు
రాష్ట్రాలకు బదలాయింపు 4.96 లక్షల కోట్లు
జీత భత్యాలు, పింఛన్ల కోసం 6.92 లక్షల కోట్లు
ఇతర కేంద్ర ప్రభుత్వ వ్యయాలు 11.33 లక్షల కోట్లు
వివిధ పన్నుల రూపాన ఆదాయం - 27,57,820 కోట్లు
జీఎస్టీ ఆదాయం (28.28 %)
7,80,000 కోట్లు
కార్పొరేట్ పన్నులు (26.11%)
7,20,000 కోట్లు
ఐటి పన్నులు (25.38%)
7,00,000 కోట్లు
ఎక్సైజ్ పన్నులు (12.15%)
3,35,000 కోట్లు
కస్టమ్స్ ఆదాయం (7.72%)
2,13,000 కోట్లు
ఇతర ఆదాయం (0.36%)
9,820 కోట్లు

Post Comment