January 03, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.
స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ మెగా ప్రాజెక్ట్‌లో చేరిన భారత్
భారతదేశం అధికారికంగా స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ (ఎస్‌కేఏఓ) ప్రాజెక్టు భాగస్వామ్యం కోసం చేసింది చేసింది. దాదాపు 1250 కోట్ల అంచనా వ్యయంతో ఈ అంతర్జాతీయ మెగా సైన్స్ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తదుపరి 7 సంవత్సరాలలో ఎస్‌కేఏఓ ప్రాజెక్టు నిర్మాణ దశకు నిధుల మద్దతును అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయి.
స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ అనేది ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాలో నిర్మించబడుతున్న ఇంటర్‌గవర్నమెంటల్ అంతర్జాతీయ రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్. దీని ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని జోడ్రెల్ బ్యాంక్ అబ్జర్వేటరీలో ఉంది. ఎస్‌కేఏఓ కన్సార్టియం రోమ్‌లో 2019 మార్చిలో ఏడు ప్రారంభ సభ్య దేశాలచే స్థాపించబడింది, తరువాత అనేక ఇతర దేశాలు ఇందులో చేరాయి..2023 నాటికి కన్సార్టియంలో 16 మంది సభ్యులు ఉన్నారు. దీని భవిష్యత్తు విస్తరణకు మద్దతుగా మరో ఎనిమిది ఆఫ్రికన్ భాగస్వామి దేశాలు సహాయం అందిస్తున్నాయి.
స్క్వేర్ కిలోమీటర్ అర్రే అనేది వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వేలాది చిన్న యాంటెన్నాల సమూహంతో ఏర్పడ్డ ప్రపంచ అతిపెద్ద రేడియో టెలిస్కోప్. ఈ సాంకేతికత వేలాది చిన్న యాంటెన్నాల ద్వారా అందుకున్న సిగ్నల్‌లను మిళితం చేసి, ఎపర్చరు (బిలం) సంశ్లేషణ అనే సాంకేతికతను ఉపయోగించి, అత్యంత సున్నితమైన మరియు కోణీయ రిజల్యూషన్‌ని కలిగి ఉండే ఒక పెద్ద రేడియో టెలిస్కోప్‌ను ఏర్పరుస్తుంది.
స్క్వేర్ కిలోమీటర్ అర్రే అబ్జర్వేటరీ చాల ప్రతిష్టాత్మకమైనది. ఖగోళ భౌతిక శాస్త్రంలో మిగిలి ఉన్న కొన్ని అతిపెద్ద రహస్యాలకు సమాధానాలు వెతకడానికి ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయబడుతుంది. మొట్టమొదటి నక్షత్రాలు మరియు గెలాక్సీలు ఏర్పడినప్పటి నుండి తోలి కాస్మిక్ డేటా వరకు విశ్వం యొక్క చరిత్రను తిరిగి చూసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఇది 21వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన శాస్త్రీయ పరికరాలలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇది నక్షత్రాల నుండి గెలాక్సీల ఏర్పాటు వరకు విశ్వాన్ని మునుపెన్నడూ లేని విధంగా మరింత వివరంగా అధ్యయనం చేయగలదని పేర్కొంటున్నారు.
పీఎం విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి యూటీగా కాశ్మీర్
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనని అమలులోకి తెచ్చిన దేశంలో మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అవతరించింది. ఐటిఐ షోపియన్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారుడు రాజీవ్ రాయ్ భట్నాగర్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీతో కలిసి దర్జీ క్రాఫ్ట్‌లో 30 మందితో కూడిన మొదటి బ్యాచ్ (విశ్వకర్మలు) ప్రారంభించారు.
ఇందులో భాగంగా స్థానిక హస్తకళాకారులకు 7 నుండి 15 రోజుల శిక్షణ అందిస్తారు. శిక్షణ పొందిన విశ్వకర్మలకు సాఫ్ట్ లోన్లు మరియు మార్కెటింగ్ సపోర్ట్‌తో పాటు రూ.15,000 ఆధునిక టూల్‌కిట్‌ను కూడా ఈ పథకం కింద అందజేస్తారు.
పిఎం విశ్వకర్మ యోజన 17 సెప్టెంబర్, 2023న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడింది. పనిముట్లతో పని చేసే కళాకారులు మరియు హస్తకళాకారులకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అందించడానికి ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 2023 -24 నుండి 2027-28 సంవత్సరం వరకు 13వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది.
విశ్వకర్మలు దేశీయ, ప్రపంచ విశ్వ గొలుసులతో ఏకీకృతమయ్యేలా చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా శిక్షణ పొందిన చేతి వృత్తుల వారికీ ఒక ఐడి కార్డు, 15 వేల ఉచిత నగదు సహాయం అందించబడుతుంది. అలానే వ్యాపార నిర్వహణ కోసం 5% వడ్డీతో మొదటి విడతలో లక్ష రూపాయల రుణం, రెండో విడతలో రెండు లక్షల రూపాయలు రుణం అందించబడుతుంది.
వెస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్
వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ యొక్క ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా జనవరి 3న బాధ్యతలు స్వీకరించారు. ఐఎన్ఎస్ షిక్రా వద్ద జరిగిన సెరిమోనియల్ పెరేడ్ సంధర్బంగా ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత వెస్ట్రన్ నావల్ కమాండ్ యొక్క వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో ఆయన బాధ్యతలు పొందారు.
వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ గతంలో నావికాదళానికి వైస్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. సుమారు 38 సంవత్సరాల పాటు సాగిన అతని కెరీర్‌లోభారత నావికాదళానికి చెందిన చాలా క్లాస్ షిప్‌లలో పనిచేశాడు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్, ఫ్లాగ్ ఆఫీసర్‌తో సహా అనేక రకాల కమాండ్, ట్రైనింగ్ మరియు స్టాఫ్ నియామకాలను ఆయన నిర్వహించారు.
భారత నావికాదళం యొక్క మూడు కమాండ్-లెవల్ ఫార్మేషన్లలో వెస్ట్రన్ నావల్ కమాండ్ ఒకటి. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఇది అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రంతో పాటుగా భారతదేశ పశ్చిమ తీరంలో ఉన్న నౌకా స్థాపనలకు బాధ్యత వహిస్తుంది.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి
ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న అరిందమ్ బాగ్చీ, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశ తదుపరి రాయబారి/శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. అరిందమ్ బాగ్చీ 1955-బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. మార్చి 2020లో అతనికి విదేశాంగ మంత్రిత్వ శాఖలో ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించారు. తన పదవీ కాలంలో, తూర్పు లడఖ్‌లోని చైనా-భారత సరిహద్దు వరుసలో భారత ప్రభుత్వం యొక్క కోవిడ్-19 వ్యూహం అమలు చేయడంలో ఆయన విజయవంతమయ్యారు.
అరిందమ్ బాగ్చీ ఇది వరకు తూర్పు యూరప్‌లోని క్రొయేషియాలో భారత రాయబారిగా మరియు పొరుగున ఉన్న శ్రీలంకలో డిప్యూటీ హైకమిషనర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. యూఎన్ ప్రధాన కార్యాలయంలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నియమింపబడే రాయబారులనే యూఎన్ శాశ్వత ప్రతినిధులు అంటారు.
నేపాల్‌లో భారత్-నేపాల్ 7వ జాయింట్ కమిషన్ సమావేశం
ఖాట్మండులో నిర్వహించిన భారత్-నేపాల్ జాయింట్ కమిషన్ 7వ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. జనవరి 4-5 తేదీల్లో జరిగిన ఈ ద్వైపాక్షిక సంయుక్త కమిషన్ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పి సౌద్‌లు సహ అధ్యక్షత వహించారు.
ఈ జాయింట్ కమిషన్ సమావేశం (జేసీఎం)లో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీ, వాణిజ్యం, రవాణా, విద్యుత్ మరియు నీటి వనరులతో సహా ద్వైపాక్షిక సంబంధాల యొక్క వివిధ అంశాలపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో రెండు ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో మొదటిది విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక ఒప్పందం మరియు మరొకటి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులలో పెట్టుబడిని పెంచే ఒప్పందం ఉన్నాయి.
దీనితో పాటుగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) మధ్య కూడా ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం వచ్చే పదేళ్లలో నేపాల్ నుంచి భారత్‌కు 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. అలానే నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఇది నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన మ్యూనల్ శాటిలైట్ కోసం భారత్ సహాయం అందిస్తుంది.
ఈ పర్యటనలో డాక్టర్ జైశంకర్, నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ మరియు ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఖాట్మండులో నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు మరియు నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో కూడా కూడా సంభాషించారు.
2023లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు
భారతదేశం గడిసిన ఏడాదిలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలలో అసాధారణమైన పెరుగుదలను కనబర్చింది. గత ఏడాది డిసెంబర్‌లో నెలవారీ లావాదేవీ మొత్తం ₹ 18.23 లక్షల కోట్లకు చేరుకోవడంతో పాటుగా 2023 లో మొత్తం 182.2 లక్షల కోట్ల విలువతో 11,765 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా పేర్కొంది. ఇది 2022తో పోలిస్తే వాల్యూమ్ పరంగా 59% మరియు విలువ పరంగా 45% వృద్ధి నమోదు అయినట్లు పేర్కొంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అనేది 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఇండియన్ ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. ఇంటర్‌ఫేస్ ఇంటర్-బ్యాంక్ పీర్-టు-పీర్ మరియు పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలను సులభతరం చేస్తుంది. యూపీఐ వినియోగదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇది ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే చెల్లింపు వ్యవస్థలలో ఒకటి. 2023 నాటికి భారతదేశంలో 350 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులను ఇది కలిగి ఉంది.
కవరత్తి ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 3న కేంద్ర పాలిత ప్రాంతమైన క్షద్వీప్‌లోని కవరత్తి ద్వీపంలో రూ. 1,150 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులలో సాంకేతికత, శక్తి, నీటి వనరులు, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యతో సహా అనేక రంగాలకు చెందినవి ఉన్నాయి.
వీటితో పాటుగా ప్రధాన మంత్రి ల్యాప్‌టాప్ పథకం కింద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. బేటీ బచావో బేటీ పఢావో కింద పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. అలాగే రైతులు, మత్స్యకారుల లబ్ధిదారులకు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా అందజేశారు.
కొచ్చి-లక్షద్వీప్ దీవుల సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (KLI - SOFC) ప్రాజెక్టును కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ చొరవ లక్షద్వీప్ ప్రజలకు 100 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్‌ని అందిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య, డిజిటల్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. అలానే లక్షద్వీప్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. దీనితో పాటుగా నిర్మాణంలో ఉన్నకద్మత్‌లోని లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్ (ఎల్‌టిటిడి) ప్లాంట్ ద్వారా త్వరలో లక్షద్వీప్‌లోని ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు.
లక్షద్వీప్ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూర్చే హజ్ యాత్రికుల కోసం తీసుకున్న చర్యలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. హజ్ వీసా సౌలభ్యం మరియు వీసా ప్రక్రియ యొక్క డిజిటలైజేషన్ మరియు మహిళలు 'మెహ్రం' లేకుండా హజ్‌కు వెళ్లడానికి అందించే అనుమతి కోసం ఆయన వివరించారు. ఈ ప్రయత్నాలు 'ఉమ్రా' కోసం వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరగడానికి దారితీశాయని ఆయన అన్నారు.
గ్లోబల్ సీఫుడ్ మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ప్రధాన మంత్రి హైలైట్ చేశారు. ఈ చొరవ స్థానిక ట్యూనా చేపలను జపాన్‌కు ఎగుమతి చేయడం వల్ల లక్షద్వీప్‌కు ప్రయోజనాలు లభిస్తాయిని పేర్కొన్నారు. ఇది మత్స్యకారుల జీవితాలను మార్చడమే కాకుండా నాణ్యమైన స్థానిక చేపలను ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.