Bill Gates | తెలుగులో బిల్ గేట్స్ బయోగ్రఫీ
Biographies

Bill Gates | తెలుగులో బిల్ గేట్స్ బయోగ్రఫీ

విలియం హెన్రీ గేట్స్ III

బిల్ గేట్స్ , ఈ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడుగా, ప్రపంచ కుబేరుడుగా, విజయవంతమైన పెట్టుబడిదారునిగా, అవధలు లేని పరోపకారిగా..ఈ ఇంటర్నెట్ పితామహుడు కోసం కొత్తగా తెలుసుకునేందుకు ఏముంటుంది. 13 ఏళ్ళ వయస్సులో మొదటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను చేసిన ఈ కుర్రోడు, 31 సంవత్సరాల వయస్సులో ప్రపంచ బిలియనీర్‌గా మారడం వెనుక...ఏదో ఒక కథ లేకుండా, ఎలా ఉంటుంది !. ఈ హార్వర్డ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్, ప్రపంచ అతిపెద్ద వ్యక్తిగత-కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించడం వెనుక చాల పెద్ద కథ ఉంది..అదేంటో తెలుసుకుందాం పదండి.

బిల్ గేట్స్ ప్రారంభ జీవితం

బిల్ గేట్స్ 1955 లో వాషింగ్టన్‌లోని సియాటిల్ నగరంలో జన్మించారు. తండ్రి విలియం హెచ్. గేట్స్ సీనియర్, ప్రముఖ న్యాయవాది. తల్లి, మేరీ మాక్స్‌వెల్ గేట్స్ ఉపాద్యాయరాలుగా పనిచేసేవారు. ఈ దంపతుల ముగ్గురు పిల్లల సంతానంలో బిల్ గేట్స్ రెండవ వాడు. గేట్స్ తన అక్క క్రిస్టియాన్ మరియు చెల్లెలు లిబ్బితో ఉన్నత-మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు.

బిల్ గేట్స్ చిన్ననాటి నుండి చురుకుగా ఉండేవాడు. చదువుపై కంటే ఆటలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. గేట్స్ సీనియర్, కొడుకును తనల న్యాయవాదిని చేయాలనే కోరిక ఉండేది. కానీ కొడుకు మ్యాథ్స్ సబ్జెక్టుపై ఎక్కువ ఆసక్తి చూపించడంతో అటువైపు ప్రోత్సహించాడు. ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసుకున్నాక, సెకండరీ ఎడ్యుకేషన్ కోసం స్థానిక లేక్‌సైడ్ ప్రిపరేషన్ స్కూల్‌లో చేరాడు. ఇక్కడే తన చిరకాల మిత్రుడు పాల్ అలెన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అలవాట్లు, వ్యాపకాలు ఒకటి కావడంతో కొద్దికాలంలోనే మంచి స్నేహితులుగా మారారు. ఇద్దరూ క్లాసులు బంకు కొట్టి మరీ కంప్యూటరుతో గడిపేవారు. ఇదే స్కూల్లో 13 ఏళ్ళ వయసులో తమ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను రాసారు.

వ్యాపారం వైపు అడుగులు

లేక్‌సైడ్ ప్రిపరేషన్ స్కూల్‌లో సీనియర్ సెకండరీ పూర్తిచేశాక, స్నేహితులు ఇద్దరు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. ఇదే సమయంలో సీటెల్ ప్రాంతంలో ట్రాఫిక్ స్టాటిస్టిక్స్'ను అంచనా వేసేందుకు ట్రాఫ్-ఓ-డేటా పేరుతో సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ రూపొందించారు. దీనిని అమ్మడం ద్వారా సుమారు ఇరవైవేల డాలర్లు సంపాదించారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పట్ల అమితమైన ఆసక్తి మరియు స్పష్టమైన అభిరుచి ఉన్నప్పటికీ, తండ్రి ఆదేశం కారణంగా గేట్స్ 1973 చివరలో హార్వర్డ్‌లో ప్రవేశించాడు.

ఇష్టంలేని ఈ కొత్త ప్రయాణం గేట్స్'ను ఉక్కిరిబిక్కిరి చేసింది. మనిషి హార్వర్డ్‌లో ఉన్న, మనసు ఎక్కడెక్కడో విహరించేది. తరగతి గదిలో కంటే వీడియో గేమ్‌లు, పోకర్ వంటి ఆటలు ఆడుతూ ఎక్కువ సమయం గడిపేవాడు. ఇలా ఏడాది గడిశాక, 1974 లో అలెన్ ప్రపంచంలోని మొట్టమొదటి మైక్రో కంప్యూటర్ ఆల్టెయిర్ 8800 గురించి ఒక పత్రిక కథనాన్ని గేట్స్‌కి చూపించాడు. ఇద్దరూ కలిసి న్యూ మెక్సికోలోని ఆ సంస్థ యజమానిని సంప్రదించారు. ఆల్టెయిర్ కోసం ప్రసిద్ధ కంప్యూటర్ భాష బేసిక్ తమ దగ్గర ఉన్నట్లు నమ్మించారు. వారిదగ్గర లేని ఈ కంప్యూటర్ భాష కోసం హార్వర్డ్ కంప్యూటర్ ల్యాబ్‌లో రాత్రీపగలూ లెక్కలేకుండా పనిచేసి, దానిని డెలివరీ చేసారు.

ఈ ప్రయోగం అంత విజయవంతం కాకున్నా, కమోడోర్, యాపిల్ మరియు టాండీ కార్ప్‌తో సహా ఇతర కంప్యూటర్ స్టార్ట్-అప్‌ల నుండి ఇదే రకమైన సాఫ్ట్‌వేర్లు రూపొందించే ఆర్డర్లు వచ్చాయి. దీనితో గేట్స్, హార్వర్డ్ నుండి న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీకి మకాం మార్చాడు.

మైక్రోసాఫ్ట్ ప్రారంభం

అల్బుకెర్కీకి మకాం మార్చక ఇద్దరూ కలిసి మైక్రోసాఫ్ట్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను ప్రారంభించారు. 1979 వరకు అల్బుకెర్కీ నుండే వివిధ సంస్థలకు సాఫ్ట్‌వేర్ కోడింగ్ అందించారు. 1979 లో బిల్ గేట్స్ తల్లి ద్వారా ఐబీఎం సంస్థ యొక్క కొత్త కంప్యూటరుకు సాఫ్ట్‌వేర్ రూపొందించే అవకాశం దొరికింది. దీనితో తమ సంస్థను వాషింగ్టన్'లోని సియాటెల్'కు తరలించారు. ఐబీఎం పీసీకి ఓఎస్ రూపొందించేందుకు సమయం తక్కువ ఉండటంతో, స్థానిక సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి ఆపరేటింగ్ సిస్టమ్‌ను కొనుగోలు చేసి, దానిని MS-DOS (మైక్రోసాఫ్ట్ డాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్)గా అభివృద్ధి చేశాడు,

మైక్రోసాఫ్ట్ డాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్కమేధోపరమైన హక్కులు ఐబీఎంకు అందించి, దాని ప్రతులను ఇతర కంప్యూటర్ తయారీదారులకు అమ్ముకునే హక్కును మైక్రోసాఫ్ట్ ఉంచుకుంది. ఈ నిర్ణయం మైక్రోసాఫ్ట్ యొక్క దశ, దిశను మార్చింది. చాల కంపెనీలు తమ సొంత ఆపరేటింగ్ వ్యవస్థలను రూపొందించుకోవడం మానేసి చౌకగా లభించే మైక్రోసాఫ్ట్ డాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్'ను ఉపయోగించడం ప్రారంభించాయి. దీనితో  మైక్రోసాఫ్ట్ విక్రయాలు 1980లో 7.5 మిలియన్ డాలర్ల నుండి 1981లో 16 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పరంపర 1984 లో ఆపిల్ మొదటి మ్యాకింతోష్ కంప్యూటర్‌ను ప్రవేశపెట్టే వరకు కొనసాగింది.

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభం

ఆపిల్ యొక్క మ్యాకింతోష్ కంప్యూటర్‌ సొగసైన గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI) తో సులభంగా ఉపయోగించే అవకాశం ఉండటంతో, మైక్రోసాఫ్ట్ డాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పరపతి క్రమంగా తగ్గిపోసాగింది. ఈ మార్పును గమనించిన గేట్స్, కొత్తగా మైక్రోసాఫ్ట్ విండోస్ అని పిలవబడే దాని స్వంత GUI-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాడు.దీనికి సంబంధించి మూలధన సేకరణ కోసం1986లో మైక్రోసాఫ్ట్ ఐపీవో ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా సుమారు 61 మిలియన్ డాలర్లు సేకరించి. గేట్స్‌ను రాత్రికి రాత్రే దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా చేసింది.

మైక్రోసాఫ్ట్ యొక్క మొదటి విండోస్ బేసిక్ వెర్షన్ 1985 లో విడుదల అయ్యింది. ఇది నెమ్మదైన పనితీరుతో విమర్శలకు గురయింది. అదే సమయంలో ఆపిల్, ఇది మాకింతోష్ ఆపరేటింగ్ సిస్టమ్‌ యొక్క కాపీ వెర్షన్'గా కోర్టులో దావా వేసింది. ఈ కేసు తర్వాత దశలో వీగిపోయినా, విండోస్‌ రూపురేఖలు మార్చేందుకు, దాన్ని మరెంత మెరుగుపర్చేందుకు గేట్స్ నిశ్చయించుకున్నాడు. థర్డ్-పార్టీ ప్రోగ్రామర్ల ద్వారా విండోస్ ఆధారిత ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోసాగాయి. 1993 నాటికి విండోస్ నెలకు 1 మిలియన్ కాపీల చొప్పున అమ్ముడయి, ప్రపంచంలోని దాదాపు 85 శాతం కంప్యూటర్‌లలో రన్ అవుతుందని అంచనా వేయబడింది.

1995లో విడుదలైన విండోస్ 95, కొత్త ఫీచర్లతో సరికొత్త ప్రమాణాలను లిఖించింది. విండోస్ 95 లో తీసుకొచ్చిన సంస్కరణలు విండోస్ 2000 నుండి, విండోస్ XP, విండోస్ విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 మరియు తాజా విండోస్ 11 వరకు అన్ని భవిష్యత్ విడుదలలకు వెన్నెముకగా నిలిచాయి. 1995 తర్వాత కొత్త కంప్యూటర్లు ప్రీలోలెడ్ విండోస్ సాఫ్ట్‌వేర్‌తో వచ్చే విధంగా తయారీదారులతో ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లే ఈ వ్యూహం చాలా బాగా పనిచేసింది. 1999 నాటికి మైక్రోసాఫ్ట్ 19.7 బిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది. గేట్స్ వ్యక్తిగత సంపద అసాధారణంగా 90 బిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. 1987 లో గేట్స్ మొదటిసారి, ఫోర్బ్స్ ప్రపంచ అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో చేర్చబడ్డాడు. 1995 నుండి 2017 వరకు, మధ్యలో 2010-13 మినహాయిస్తే, అత్యధిక కాలం ప్రపంచ కుబేరుడుగా ఉన్నాడు.

బిల్ గేట్స్ కుటుంబ జీవితం

బిల్ గేట్స్ 1987 లో మైక్రోసాఫ్ట్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న మెలిండా ఫ్రెంచ్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరు దాదాపు ఎనిమిదేళ్ల డేటింగ్ తర్వాత 1994 లో హవాయిలో దీవుల్లో ఆమెను గుట్టుగా పెళ్లిచేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం జెన్నిఫర్, రోరీ మరియు ఫోబ్ గేట్స్. 27 సంవత్సరాల వీరి వివాహ బంధం 2021 లో విడాకులతో ముగిసించి. తమ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో ఉమ్మడి ప్రకటనలో ప్రకటించారు. భవిష్యత్తు దాతృత్వపు కార్యక్రమాల విషయంలో ఇద్దరు కలిసి పనిచేసేందుకు నిర్ణహించుకున్నారు.

బిల్ గేట్స్'కు విభిన్న వ్యక్తిగత అభిరుచులు ఉన్నాయి. ఖాళీ సమయాల్లో పిల్లలతో గడపడం ఇష్టమైన కాలక్షేపంగా భావిస్తాడు. అవకాశం దొరికితే స్నేహితులతో బ్రిడ్జ్ ఆడుతూ కనిపిస్తాడు. అలానే టెన్నిస్ ఆడటమన్న, చూడటమన్న చాల ఇష్టం. లేదంటే బుక్స్చదువుతూ కనిపిస్తాడు. అప్పుడప్పు తనలోని రచయితకు పని చెప్తాడు.

బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్

2014 లో మైక్రోసాఫ్ట్ నుండి గేట్స్ పదవీవిరమణ చేసాక, ఎక్కువ సమయం దాతృత్వ కార్యక్రమాల కోసం వెచ్చించాడు. 2000 లో స్థాపించిన  బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ కోసం పనిచేయడం మొదలు పెట్టాడు. ఈ సంస్థకు దాదాపు 28 బిలియన్ డాలర్ల విరాళం అందించారు. 2020 నాటికి ఈ స్వచ్చంద సంస్థ 50 బిలియన్ డాలర్లతో ప్రపంచ రెండవ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా నివేదించబడింది. ఇదే ఫౌండేషన్ ద్వారా ప్రపంచ కుబేరులు అందరిని దాతృత్వలోకి ప్రవేశించేలా పేరేపించాడు.

బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా విస్తృత శ్రేణి ప్రజారోగ్య ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ఎయిడ్స్, క్షయ, మలేరియా మరియు పోలియో వంటి అంటురోగాల నివారణకు వాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీటికి సంబంధించిన లెర్నింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు లైబ్రరీలకు నిధులను మంజూరు చేస్తుంది. గ్లోబల్ ఎడ్యుకేషన్'లో భాగంగా విశ్వవిద్యాలయాలలో స్కాలర్‌షిప్‌లకు మద్దతు ఇస్తుంది. పేద దేశాలలో స్థిరమైన పారిశుద్ధ్య సేవలు మెరుగు పర్చేందుకు స్థానిక స్వచ్చంద సంస్థల ద్వారా కలిసి పనిచేస్తుంది.

పేద దేశాల్లో విటమిన్ ఎ లోపాన్ని నివారించేందుకు జన్యుపరమైన బియ్యాన్ని రూపొందించేందుకు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు ఆర్థిక వనరులు అందిస్తుంది. పేద దేశాల్లోని 120 మిలియన్ల మహిళలు మరియు బాలికలకు శానిటరీ సేవలను అందిస్తుంది.  దీర్ఘకాలిక లక్యంతో స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ ప్రాప్యతను ప్రోత్సహిస్తుంది.

2015 పారిస్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో కార్బఉద్గరాలూ తగ్గించేందుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేసేందుకు నిశ్చయించుకున్నాడు. బ్రేక్‌త్రూ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలలో అధిక-రిస్క్ స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చాడు. వాతావరణ మార్పులు, ఎనర్జీ గ్లోబల్ యాక్సెస్ మరియు స్వచ్ఛమైన, నమ్మదగిన ఇంధనాన్ని చౌకగా చేయడానికి పనిచేస్తున్న పరిశోధన సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు మద్దతు అందివ్వనున్నట్లు ప్రకటించాడు.

ముగింపు వ్యాఖ్యలు

బిల్ గేట్స్'కు బాల్యం నుండి పోటీతత్వం ఎక్కువ. ఏదైనా చేయాలనీ నిశ్చయించుకుంటే, అది సాధించే వరకు నిద్రపోడు. ఈ లక్షణమే ఆయన్ని ప్రపంచ కుబేరుడిని చేసింది. బాగా డబ్బు సంపాదించాలనేది బిల్ గేట్స్ చిన్ననాటి కల. ఆ కలను ఆయన ముప్పైఏళ్ళ లోపే నిజం చేసుకున్నాడు. యువతకు ఇదే విషయాన్ని చెప్తాడు. మీరు పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు.. కానీ మీరు పేదవారిగా మరణించడం ఖచ్చితంగా మీదే తప్పు. మీరు ఎంచుకున్న రంగంలో వంద శాతం కృషి చేయండి. ఫలితం పొందేవరకు దానిని విడవకండి అని సలహా ఇస్తాడు.

Post Comment