తెలుగులో ఎంఎస్ ధోని బయోగ్రఫీ | M.S. Dhoni Facts, & Awards
Biographies

తెలుగులో ఎంఎస్ ధోని బయోగ్రఫీ | M.S. Dhoni Facts, & Awards

భారత్ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ఒక ప్రత్యేక అధ్యాయం. భారత క్రికెట్టులొ యెంత మంది లెజెండ్లు ఉన్నా ఆయన స్థానం ప్రత్యేకం. క్రికెటును ఒక మతంగా భావించే దేశంలో క్రికెటరుగా పాపులర్ కావడం సర్వసాధాణం..కాని ఆ క్రికెటు క్రీడకే పాపులారిటీ తీసుకొచ్చిన క్రీడాకారుడు ఎంఎస్ ధోని.

వికెట్ కీపరుగా, బ్యాట్స్‌మనుగా, జట్టు కెప్టెనుగా ఎంఎస్ ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు తిరగ రాయొచ్చేమో కాని..తనలాంటి దూకుడైన క్రికెట్ జీనియస్'ను తిరిగి పొందటం అసాధ్యం. ఎక్కడో రాంచీలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి భారత క్రికెట్ తలరాతను మార్చిన ఈ జార్ఖండ్ డైనమైట్ ..తనకు ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ క్రీడను వదిలి, ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటరుగా ఎదగడం వెనుక ఉన్న అన్‌టోల్డ్ స్టోరీని తెలుసుకోండి.

ధోని జీవిత విశేషాలు

ధోని ప్రారంభ జీవితం

మహేంద్ర సింగ్ ధోనీ 1981 లో జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఒక మధ్యతరగతి హిందూ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించాడు. అప్పట్లో రాంచీ బీహార్‌ రాష్ట్రంలో భాగంగా ఉండేది. తండ్రి పేరు పాన్ సింగ్ ధోని. తల్లి పేరు దేవకీ దేవి. వీరికి మొగ్గురు సంతానం. అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. వీరి ముగ్గురిలో ధోని చిన్నవాడు.

తండ్రి పాన్ సింగ్ ధోని స్థానిక మెకాన్ కంపెనీలో జూనియర్ మేనేజర్‌గా పనిచేసేవాడు. అందరి తండ్రులలానే ఆయన కూడా పిల్లలను ఉన్నత చదువులు చదివించి, వారిని తనకంటే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కనేవాడు.

ధోని ప్రాథమిక విద్యాభ్యాసం రాంచీలోని జవహర్ విద్యా మందిర్‌లో పూర్తిచేసాడు. ధోనికి చిన్నతనం నుండి క్రీడలు అంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఫుట్‌బాల్ మరియు బ్యాడ్మింటన్‌ క్రీడలను అద్భుతంగా ఆడేవాడు. తన స్కూల్ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెనుగా ఉండేవాడు.

ఫుట్‌బాల్ నుండి క్రికెట్ వైపు

ధోనికి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడడమంటే మక్కువ. తన స్కూల్ ఫుట్‌బాల్ జట్టుకు అద్భుతమైన గోల్ కీపర్ ఉండేవాడు. జిల్లా స్థాయిలో అనేక ఫుట్‌బాల్ మ్యాచులలో పాల్గున్నాడు. ఇలా ఒక మ్యాచులో ధోని గోల్ కీపింగ్‌ ప్రతిభను చూసిన స్థానిక క్రికెట్ క్లబ్ నిర్వాహకుడు, తనని క్రికెట్ వైపు ప్రయత్నించామని సలహా ఇచ్చాడు.

అదే నిర్వాహకుడు పనిలోపనిగా తమ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్‌గా చేరమని ఆఫర్ చేసాడు. అప్పటికి ధోనికి క్రికెట్టులొ ఓనమాలు తెలియకపోవడంతో నిర్ణయం తీసుకునేందుకు డైలమాలో పడ్డాడు కాని, క్రమంగా క్రికెట్‌తో ప్రేమలో పడటం ప్రారంభించాడు. అతని వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో స్థానిక కమాండో క్రికెట్ క్లబ్‌లో రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. దీనితో ఫుట్‌బాల్ గోల్ కీపర్ కాస్త..క్రికెట్ కీపర్ అయ్యాడు.

1995–1998 మధ్య దాదాపు మూడేళ్లు కమాండో క్రికెట్ క్లబ్ తరుపున అనేక మ్యాచులు ఆడాడు. ఇక్కడే ధోని ఆసక్తి కీపింగ్ నుండి కాస్త బ్యాటింగ్ వైపు మళ్లింది. నిరంతర సాధన ద్వారా మంచి బ్యాట్స్‌మన్‌గా మారాడు.

ఈ క్లబ్‌లోనే కాకుండా స్కూల్ మరియు ఇతర క్లబ్‌లలో, అతను తన మైండ్ బ్లోయింగ్ సిక్స్‌లతో పాపులర్ అయి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీనితో 1997/98 సీజన్ వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది.

1998 లో రాంచీ జిల్లా క్రికెట్ ప్రెసిడెంటుగా ఉన్న దేవల్ సహాయ్, ధోని ప్రతిభను గుర్తించి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) జట్టుకు ఆడేందుకు అవకాశం కల్పించాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెటులోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ధోని టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. అక్కడితో ఆగకుండా నువ్వు కొట్టే కొట్టే ప్రతి సిక్సర్‌కు 50 రూపాయలు ప్రైజ్ మనీ ప్రకటించాడు. దీనితో ధోని  చేసిన సెంచరీలకు దేవల్ సహాయ్ చాలా ప్రైజ్ మనీ ఇవ్వాల్సి వచ్చింది.

దేవల్ సహాయ్, ధోని హార్డ్-హిట్టింగ్ షాట్‌లను ఇష్టపడేవాడు. ఇదే నీ ప్రధాన బలం అని, దాన్ని అలానే అట్టిపెట్టుకో అని ధోనికి సలహా ఇచ్చేవాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెటరుగా మారడం వెనుక దేవల్ సహాయ్ పాత్ర ఉంది. తనలో క్రమశిక్షణ, క్రికెట్ పట్ల అంకితభావం పెంపొందించడంలో దేవల్ సహాయ్ ఉన్నట్లు ధోని పలుమార్లు వెల్లడించాడు. ఇకపోతే సీసీఎల్ జట్టు తరుపున ధోని చేసిన సెంచరీలు బీహార్ జూనియర్ జట్టులో చోటు కల్పించాయి. అలానే రాంచీ జట్టు తరుపున ఆడేందుకు అవకాశం దొరికింది.

1999-2000 సీజన్‌లో బీహార్ తరఫున దేశవాళీ రంజీ టోర్నమెంటులో అరంగేట్రం చేశాడు. అస్సాం క్రికెట్ జట్టుతో జరిగిన తోలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజనులో ధోని మొత్తం 5 మ్యాచ్‌ల్లో 283 పరుగులు సాధించాడు. 2000/01 సీజన్‌లో బీహార్ తరపున ఆడిన ధోని తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని నమోదుచేసాడు. 2003/04 సీజన్‌లో జింబాబ్వే మరియు కెన్యా పర్యటన కోసం ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు.

కెరీర్ వర్సెస్ క్రికెట్

ఇంటర్మీడియట్ పూర్తిచేశాక, కెరీర్ పరంగా ధోని అతిపెద్ద క్రాస్ రోడ్డును దాటాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితిలు దృష్ట్యా కొడుకును క్రీడలు వైపు పంపించేందుకు తండ్రికి ఇష్టంలేదు..తన మధ్య తరగతి కష్టాలు చెప్పి ధోనిని ఉద్యోగం వైపు మళ్లించే ప్రయత్నాలు చేసాడు. కొడుకుతో బలవంతంగా రైల్వే నియామక పరీక్ష రాయించాడు. స్పోర్ట్ కోటాలో సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టిటిఇ) గా ఉద్యోగాల్లో చేరాడు.

ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తను ఉండాల్సింది ఇక్కడ కాదనే వాస్తవం ధోనికి అర్థమైంది. ఆ సమయంలో ఆయన ఆలోచనలు భారతీయ రైల్వే నెటవర్క్ కంటే గందరగోళంగా ఉండేవి. కాని కుటుంబం కోసం ఉదోగానికే కట్టుబడ్డాడు. ఈ స్థితి ధోని జీవితంలో ఒక భయంకరమైన రోతపూర్వక ప్రయాస.

ఈ దశ దాదాపు ప్రతి భారతీయ యువకుడిలో ఏదో ఒక దశలో ఎదురౌతుంది. 2001 నుండి 2003 మధ్య దాదాపు మూడేళ్లు ఇదే స్టేషన్ యందు ధోని ఇష్టంలేని టిటిఇగా విధులు నిర్వర్తించాడు. చివరికి భారత్ ఏ జట్టుకు ఎంపికవ్వడంతో ఉద్యోగ పర్వానికి ముగింపు పలికాడు.

భారత్ ఏ జట్టు తరుపున జింబాబ్వే సిరీస్'తో పాటుగా, పాకిస్తాన్, కెన్యా మరియు భారత్ ఏ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు టోర్నమెంట్‌లో ధోని అత్యుత్తమ ప్రదర్శన చేసి, అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ దృష్టిలో పడ్డాడు.

మొదటి మ్యాచులో ధోని డకౌట్

భారత్ ఏ జట్టు తరుపున చేసిన ప్రదర్శన, భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ పాసుల పనిచేసింది. 2004/05 లో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ధోని ఎంపికయ్యాడు. ఎన్నో ఆశలు, ఆశయాలతో జాతీయ జట్టులోకి ఎంట్రీ పొందిన ధోనీ, తన మొదటి మ్యాచులో డకౌట్ అయ్యాడు.

ఈ సిరీస్ అన్ని మ్యాచులో ధోని విఫలమైన, ఆ తర్వాత జరిగిన పాకిస్థాన్ వన్డే సిరీస్‌కు ధోనీని ఎంపిక చేసారు. కెప్టెన్ గంగూలీ ఈ సిరీసులో ధోనిని 3వ స్థానానికి ప్రమోట్ చేసాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ సిరీస్ రెండవ మ్యాచులో కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి గంగూలీ నమ్మకాన్ని నిజం చేసాడు. ఇది ధోనికి 5 వ అంతర్జాతీయ మ్యాచ్.

విశాఖపట్నంలో చేసిన సెంచరీ ధోని మొదటి వన్డే సెంచరీ, ఇది భారత వికెట్ కీపర్ల తరుపున అత్యధిక వ్యక్తిగత రికార్డు. ఈ రికార్డు సంవత్సరం ముగిసేలోపు తిరిగి రాసాడు. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో, ఛేదనలో 145 బంతుల్లో అజేయంగా 183 పరుగులు చేసి భారత జట్టును గెలిపించాడు. రాత్రికి రాత్రి ఈ జులపాల జట్టు కుర్రోడు క్రికెట్ అభిమానుల హీరోగా మారాడు.

అదే అభిమానులు, ఇదే హీరోను 2007 క్రికెట్ ప్రపంచ కప్పులో పేలవ ప్రదర్శన చేసాక జీరోను చేసారు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి తర్వాత, ధోని తన స్వస్థలమైన రాంచీలో నిర్మిస్తున్న ఇంటిని జేఎంఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో స్థానిక పోలీసులు అతని కుటుంబానికి భద్రత కల్పించాల్సి వచ్చింది.

భారత జట్టు కెప్టెనుగా ఎంఎస్ ధోని

2007 క్రికెట్ ప్రపంచ కప్పులో పేలవ ప్రదర్శన తర్వాత సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇదే ఏడాది చివరిలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. ఈ పర్యటనకు భారత జట్టుకు కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేసింది.

ధోని సారథ్యంలోని భారత టీ ట్వంటీ జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌ జట్టులను ఓడించి ఫైనలకు చేరుకుంది. ధోని పన్నిన వ్యూహాలు జట్టుకు గొప్ప ఫలితాలు ఇచ్చాయి. దీనితో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో ధోనీ ప్రదర్శన అతడిని టీమిండియా వన్డే కెప్టెన్‌గా మార్చింది.

2008 లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగులో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన క్రికెటరుగా ధోని నిలిచాడు. ప్రారంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని, ఆ జట్టుకు నాలుగు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. ధోని సారధ్యంలో ఆ జట్టు ఒకానొక విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది.

2011 లో భారత్'లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సాధించడం ద్వారా, 1983 చరిత్రను తిరగరాసింది. ఫైనల్ పోరులో ధోని 79 బంతుల్లో 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్..భారత అబిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 2013 లో ధోని సారధ్యంలోని భారత్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీనితో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలిచిన మొదటి మరియు ఏకైక కెప్టెనుగా ధోని నిలిచాడు.

ధోని వ్యక్తిగత జీవిత విశేషాలు

ధోని వ్యక్తిగత జీవితం సంపూర్ణమైనది. ఆయన స్నేహతుల జాబితా పరిమితమైనది. ధోనికి మోటర్ సైకిల్స్ అంటే మహా ఇష్టం. తీరిక దొరికితే రాంచీ వీధుల్లో మారువేషాల్లో బైక్ విహారం చేస్తాడు. లేదనుకుంటే తన వ్యవసాయ భూమిలో తోటపని చేస్తూ కనిపిస్తాడు.

ధోని 2010 లో సాక్షి సింగ్ రావత్‌ను వివాహం చేసుకున్నాడు. సాక్షి సింగ్, ధోని చిన్ననాటి స్నేతురాలు. కాని 2008 లో సాక్షిని స్టేడియంలో చూసే వరకు వారి మధ్య సంబంధాలు లేవు. సాక్షికి ముందు ధోని జీవితంలో విధి విడదీసిన ప్రేమకథ ఉంది. సాక్షితో ధోని వివాహం ఒక్కరాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. అనేక పాత మానసిక సంఘర్షణల తరువాత సాక్షితో జతకట్టాడు. ఈ జంట 2015 లో జివా ధోనికి జన్మనిచ్చింది.

2016 లో ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద విజయాన్ని దక్కించుకుని. ఈ చిత్రంలో ధోని బాల్యం నుండి 2011 క్రికెట్ ప్రపంచ కప్ వరకు చూపించిన కథ ఎందరో భారతీయ యువతకు స్ఫూర్తి నిచ్చింది. ఈ సినిమాలో ధోని పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రాత్రికి రాత్రి బాలీవుడ్ సూపర్ స్టారుగా ఎదిగాడు.

కెరీర్ ప్రారంభంలో ధోని జులపాల జుట్టుతో కనిపించేవాడు. ఈ హెయిర్ స్టైలకు సామాన్యులతో పాటుగా, సెలెబ్రెటీ అభిమానులు కూడా ఉండేవారు. 2007 లో టీ ట్వంటీ కప్ విజయం తర్వాత ఆ స్టైలుకు స్వప్తి పలికాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తరువాత ఏకంగా బోడి గుండుతో కనిపించి ఆశ్చర్యపర్చాడు.

ధోనికి భారత ఆర్మీ అంటే ప్రత్యేక అభిమానం.

ధోనికి భారత ఆర్మీ అంటే ప్రత్యేక అభిమానం. సైన్యం దుస్తులు చూస్తే తనకో రకమైన పూనకం వస్తుంది అంటాడు. బాల్యంలో సైనికులను చూసి ఏదో ఒక రోజు తాను సైనికుడు అవ్వాలనుకునే వాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత ధోనికి, భారత సైన్యంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

ధోనీ, ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ యొక్క పారాచూట్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. భారత్ క్రికెటుకు చేసిన సేవలకు గాను 2011 లో భారత సైన్యం అతనికి ఈ గౌరవ ర్యాంక్ అందించింది. 2015 లో ధోని క్వాలిఫైడ్ పారాట్రూపరుగా అర్హుత సాధించాడు.

2019 లో జమ్మూ మరియు కాశ్మీర్‌లోని టెరిటోరియల్ ఆర్మీతో కలిసి రెండు వారాలు సైనికుడిగా విధులు నిర్వర్తించాడు. 2018 లో పద్మభూషణ్ అవార్డు తీసుకున్న సమయంలో సైనిక దుస్తుల్లో హాజరయ్యి..భారత సైన్యానికి తన గౌరవాన్ని అందించాడు.

ధోని క్రికెట్ రికార్డులు & అవార్డులు

ధోని కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా పొందిన అవార్డులు మరియు గౌరవాల జాబితా చాల పెద్దది. ధోని సారధ్యంలో భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ మరియు ఛాంపియన్ కప్ సాధించింది. ధోని అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెనుగా నిలిచాడు. ధోని సారథ్యంలో భారత్ 2010 మరియు 2016 లో రెండు సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది.

ధోని నాయకత్వంలో 2010 & 2011 రెండు సార్లు ఐసిసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ మేస్‌ను కూడా భారత్ గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. అలానే రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్స్ దక్కించుకుంది. ఇవే కాకుండా ధోని పేరునా ఎన్నో అరుదైన రికార్డులు క్రికెట్ చరిత్రలో లిఖించబడి ఉన్నాయి.

2006 లో ధోని మొదటిసారి ఏంటీవీ యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయరుగా నిలిచాడు. 2008 & 2008 ఏడాదిలో వరుసగా ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయరుగా నిలిచాడు. 2011 లో క్యాస్ట్రోల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. 2011-2020 ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది డికేడ్ క్రికెట్ అవార్డు దక్కించుకున్నాడు. అలానే 2011-22 దశాబ్దపు ఐసీసీ పురుషుల ఒన్డే మరియు టీ ట్వంటీ జట్టలకు కెప్టెన్ మరియు వికెట్ కీపరుగా ఎన్నికోబడ్డాడు.

ధోని భారత ప్రభుత్వం నుండి 2007-08 ఏడాదికి గాను మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎన్నుకోబడ్డాడు. అలానే 2009 లో పద్మశ్రీ అవార్డు, 2018 లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నాడు. 2011లో డి మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ డిగ్రీ అందుకున్నాడు. 2019 లో జార్ఖండ్ క్రికెట్ సంఘం తమ స్టేడియం సౌత్ స్టాండ్‌కి ధోని పేరు పెట్టి గౌరవించింది.

క్రికెటర్‌గా ధోనీ ప్రయాణం స్ఫూర్తిదాయకం

క్రికెటర్‌గా ధోనీ ప్రయాణం ఎందరో భారతీయ యువతకు స్ఫూర్తిదాయకం. క్రికెట్ చరిత్రలో ఎవరికి దొరకని అరుదైన అభిమానం, గౌరవం ధోనికి లభించాయి. క్రికెట్ ప్రేక్షుకుల అభిమానికి మించి తోటి క్రీడాకారుల గౌరవం పొందిన అతికొద్ది క్రికెటర్లలో ధోని ఒకడు. ధోని గేమ్ ప్లానుకు ఫిదా కాని విదేశీ కెప్టెన్ లేడు.

ధోని క్రీజులో ఉన్నంత వరకు స్టేడియంలలో ఒక రకమైన సునామీ హోరు వినిపిస్తుంది. ధోని ఆడుతున్నంత వరకు ప్రత్యర్థి జట్టులో ఓటమి ఘోష వినిపిస్తుంది. చివరి ఓవర్లలో బౌలర్లను పూర్తిగా హిప్నటైజ్ చేయడం ఎలాగో ధోనికి మాత్రమే తెలుసు.

ధోని క్రికెటర్లందరికీ రోల్ మోడల్‌గా ఉన్నాడు. వ్యక్తిగా, క్రీడాకారుడుగా వెతికిన లోపం దొరకని వ్యక్తత్వం ధోనీది. గ్రౌండులో ధోని ప్రదర్శించే చాకచక్యం, ప్రశాంతమైన ఆయన వ్యక్తిత్వం భారత జట్టుకు ప్రపంచ విజేతను చేసాయి. ఒత్తిడి పరిస్థితులలో ఎలా ప్రశాంతంగా ఉండాలో ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి ధోని.

ధోని భారత్ క్రికెట్ జట్టు కెప్టెనుగా విజయవంతం అవ్వడంతో వెనుక ఆయనలో ఉన్న విశేషమైన నాయకత్వ లక్షణాల పాత్ర ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాయకుని జట్టు, అద్భుత ఫలితాలు సాధిస్తుంది అనే దానికి ధోనీయే నిదర్శనం. తోటి క్రీడాకారులకు అవకాశాలు కల్పించడంలో, విఫలమైన సమయంలో అండగా నిల్వడంలో ధోని ముందు వరుసలో ఉంటాడు. ధోని నాయకత్వంలో ఒక అనామక క్రీడాకారుడు కూడా ప్రపంచ చాంపియన్ ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తాడు.

ప్రారంభంలో జులపాల జుట్టుతో, ఉషారు నింపే హెలికాప్టర్ షాట్లతో యువతను అలరించిన ధోని, తర్వాత దశలో ప్రశాంతమైన వ్యక్తత్వంతో, నిండుకుండా లాంటి ఆత్మవిశ్వసంతో, తప్పుపట్టలేని సమయస్ఫూర్తితో, వెలకట్టలేని నాయకత్వ లక్షణాలతో విశేషమైన గౌరవ ప్రతిష్టలు దక్కించుకున్నాడు. 'కెప్టెన్ కూల్' అని ప్రేమగా పిలుచుకునే ధోని జీవితం ఈ తరం యువతకే కాదు రాబోయే అన్ని తరాల యువతకు ఆదర్శప్రాయమే.

 

Post Comment