తెలుగులో సెరెనా విలియమ్స్ బయోగ్రఫీ | Serena Williams
Biographies

తెలుగులో సెరెనా విలియమ్స్ బయోగ్రఫీ | Serena Williams

టెన్నిస్ ప్రపంచ చరిత్రలో స్థిరస్థాయిగా లిఖించబడిన పేరు 'సెరెనా విలియమ్స్'. ఓపెన్ ఎరా టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత ఆమె. పుట్టుకతో ఎవరూ విజేతలు కాలేరు, కాని సెరెనా పుట్టక ముందే విజేతగా ప్రకటించబడింది.

నాలుగేళ్లకే టెన్నిస్ రాకెట్ అందుకున్న ఈ అమెరికన్ బ్లాక్ బ్యూటీ..ప్రపంచ టెన్నిస్ చరిత్రను తిరగ రాసేంత గొప్ప క్రీడాకారిణిగా ఎదగటం వెనుక ఒక అసాధారణమైన కథ ఉంది. ఈ కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది.

సెరెనా విలియమ్స్ బయోగ్రఫీ

సెరెనా విలియమ్స్ బాల్యం & టెన్నిస్ కెరీర్ ప్రారంభం

సెరెనా విలియమ్స్ 1981 లో మిచిగాన్‌లోని సాగినావ్‌లో రిచర్డ్ విలియమ్స్ మరియు ఒరాసిన్ ప్రైస్ దంపతులకు జన్మించింది. రిచర్డ్ విలియమ్స్ మరియు ఒరాసిన్ ప్రైస్లకు ఇది రెండవ వివాహం. ఒరాసిన్ ప్రైస్'కు ఇదివరకే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సవతి సోదరీమణులు యెతుండే, లిండ్రియా మరియు ఇషా ప్రైస్ మరియు అక్క వీనస్'ల అందరిలో సెరెనా చిన్నది.

పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే రిచర్డ్ కుటుంబం కాలిఫోర్నియాలోని కాంప్టన్ సిటీకి మకాం మార్చారు. రిచర్డ్ విలియమ్స్, టెన్నిస్ క్రీడకు పిచ్చి అభిమాని. విలియమ్స్ సిస్టర్లు పుట్టకముందే వారిని టెన్నిస్ ఛాంపియన్లుగా ఊహించుకునే వాడు. వారు పుట్టిన నాలుగేళ్లకే వారితో టెన్నిస్ రాకెట్ పట్టించాడు.

పరిమితమైన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన స్థానిక టెన్నిస్ కోర్టుల వద్ద వాడిపడేసిన బాల్స్, బ్యాట్స్ సేకరించి, దగ్గరలో ఉండే పబ్లిక్ గ్రౌండులో, కూతుర్లతో టెన్నిస్ ప్రాక్టీస్ చేయించేవాడు. పేపర్ కటింగ్స్, వీడియో క్లిపింగ్స్ ద్వారా టెన్నిస్ శిక్షణ అందించాడు. చదివించే స్తోమత లేకపోవడంతో ఐదుగురు పిల్లలను ఇంట్లోనే చదివించాడు.

కూతుర్ల ప్రతిభను చూపిస్తూ స్పాన్సర్ల కోసం, శిక్షకుల కోసం రోడ్ల వెంబడి తిరిగే వాడు. తన కూతుర్లను కాబోయే టెన్నిస్ ఛాంపియన్లుగా నమ్మిన మొదటి వ్యక్తి ఆయన. నిజానికి విలియమ్స్ సిస్టర్లు పుట్టుకతోనే టెన్నిస్ క్రీడాకారుణిలుగా అవతరించారు. వాళ్ళు ఏ రోజు తండ్రిని నిరుత్సాహపర్చలేదు.

నాలుగేళ్ళ వయస్సులో మొదటి టోర్నమెంట్‌ ఆడిన సెరెనా

సెరెనా నాలుగేళ్ళ వయస్సులో తన మొదటి టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొంది, తరువాతి ఐదు సంవత్సరాలలో, ఆమె ఆడిన తదుపరి నలభై-తొమ్మిది టోర్నమెంట్‌లలో నలభై ఆరు గెలుచుకుంది.

రిచర్డ్ విలియమ్స్, ఆరేడేళ్ల వయస్సులో ఉన్న కూతుర్లకు, పీట్ సంప్రాస్ మరియు జాన్ మెకన్రో ఆట చూపించేందుకు దగ్గరలో ఉన్న టెన్నిస్ కోర్టుకు తీసుకెళ్లాడు. అక్కడ టెన్నిస్ కోచ్ పాల్ కోహెన్‌నుకు కూతుర్ల ఆటను చూపించాడు. వారి ప్రతిభను గమనించిన పాల్ కోహెన్‌, వీనస్'కు మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు.

అక్క వీనస్'కు కోచ్ దొరకడంతో, సెరెనా ఒంటరిది అయ్యంది. ఈ సమయంలో తల్లి ఒరాసిన్ ప్రైస్, సెరెనా యొక్క శిక్షణ బాధ్యతలు తీసుకుంది. అలానే తండ్రి రిచర్డ్, వీనస్ శిక్షణ తరగతులు రికార్డు చేసి సెరెనాకు అందించేవాడు.

దీనితో సెరెనా  సొంతంగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది. తండ్రికి తెలియకుండా వివిధ టోర్నమెంటులలో పోటీపడేది. ఒకొనొక సమయంలో తాను తండ్రి నిర్లక్ష్యానికి గురువుతున్నానే మానసిక స్థితికి చేరుకుంటుంది. సెరెనా స్థితిని గమనించిన తండ్రి రిచర్డ్ విలియమ్స్, సెరెనాలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించేవాడు. సెరెనాను తన ప్రత్యామ్నాయ వ్యూహంగా అభివర్ణించే వాడు.

అక్క వీనస్ విలియమ్స్ భవిష్యత్తులో ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి కావొచ్చు. కాని సెరెనా విలియమ్స్, ఆల్ టైమ్ బెస్ట్ టెన్నిస్ ప్లేయరుగా కీర్తించ బడుతుందని కూతురితో ఛాలెంజ్ చేసేవాడు. అది జరిగిన 30 ఏళ్ళ తర్వాత, రిచర్డ్ మాటలు అక్షరాల నిజమయ్యాయి.

రిక్ మక్కీ అకాడమీ నుండి మొదటి యూఎస్ ఓపెన్ ఆడిన సెరెనా

విలియమ్స్ సిస్టర్లకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు, ఫ్లోరిడాకు చెందిన టెన్నిస్ అకాడమీ కోచ్ రిక్ మక్కీని, రిచర్డ్ తన ఇంటికి ఆహ్వానించాడు. విలియమ్స్ సిస్టర్ల ప్రతిభను గమనించిన ఆయన, వారికీ పూర్తిస్థాయి ప్రీమియం శిక్షణ అందించేందుకు ఆసక్తి చూపుతాడు.

దానికి బదులుగా భవిష్యత్తులో వారి సంపాదించే మొత్తంలో 15 శాతం ఆదాయం తనకు దక్కేలా ఒప్పందం ఆఫర్ చేస్తాడు రిక్ మక్కీ. ఈ ఒప్పందం బదులు, రిచర్డ్ కొత్త ఒప్పందాన్ని రిక్ ముందు ఉంచుతాడు. దీని ప్రకారం ఇద్దరి కూతుర్లతో పాటుగా మొత్తం ఫ్యామిలీకి అవసరమయ్యే వసతులు కల్పించాలని కోరుతాడు.

రిక్ మక్కీ ఈ ఒప్పందానికి ఒప్పుకోవడంతో రిచర్డ్ ఫామిలీ కాంప్టన్ నుండి ఫ్లోరిడాకు మకాం మారాల్సి వస్తుంది. ఈ మార్పు వారి స్థితిగతులను మార్చింది. శిక్షణ విషయంలో రిక్ మక్కీ, రిచర్డ్ మధ్య ఎన్నో బేదాభిప్రాయాలు ఉన్నా, విలియమ్ సిస్టర్ల ఇద్దరికి సొంత తండ్రి కంటే ఎక్కువ ఆదరించి శిక్షణ అందించాడు.

14 ఏళ్ళ వయస్సులో వీనస్ విలియమ్స్ యొక్క మొదటి గ్రాండ్ స్లామ్ ఎంట్రీ విఫలయత్నం, రిచర్డుకు బాగా గుర్తుంది. ఆనాడు తనకి ఇష్టం లేకున్నా, వీనస్ మరియు రిక్ మక్కీల కోసం బలవంతంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. కాని సెరెనా విషయంలో రిచర్డ్ ఆ తప్పు చేయదలచుకో లేదు.

సెరెనాకు 16 ఏళ్ళు నిండే వరకు వేచి ఉంచాడు. సెరెనా విలియమ్స్ 1997 లో తన మొదటి ప్రొఫిషినల్ టెన్నిస్ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది.  ఆ ఏడాది చికాగోలో జరిగిన అమెరిటెక్ కప్పులో 304 ర్యాంకరుగా ఉన్న సెరెనా, 99వ ర్యాంకరుగా ముగించింది. ఈ టోర్నీలో ఇద్దరు టాప్ 10 క్రీడాకారిణిలను ఓడించిన సెరెనా, సెమిస్ వరకు చేరుకుంది.

ఎన్నో విఫల ప్రయత్నాల తర్వాత, 1999 లో యూఎస్ ఓపెన్ గెలవడం ద్వారా సెరెనా విలియమ్స్ తన మొదటి గ్రాండ్ స్లామ్ ఖాతాను తెరిచింది. ఆ తర్వాత  తనకి తిరుగులేకుండా పోయింది. సెరెనా గెలిచిన ఏడాదికి. అక్క వీనస్ తన మొదటి గ్రాండ్ స్లామ్ బోణీ కొట్టింది.

2001 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు పోటీపడ్డారు. ఈ పోరులో వీనస్ విలియమ్స్ విజయం సాధించింది. 1999 లో సెరెనా మొదటి టైటిల్ గెలిచాక 2002 వరకు మరో టైటిల్  సాధించ లేదు..ఈ మధ్యలో వీనస్ మొత్తంగా 6 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకుంది.

2002 ప్రెంచ్ ఓపెన్ యందు అక్కాచెల్లెళ్లు మరోసారి పోటీపడ్డారు. ఈసారి విజయం సెరెనాకు వరించింది. ఈ ఏడాది ఇద్దరి మధ్య మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ జరగగా, మూడింటా అక్క వీనస్'ని ఓడించి విజేతగా నిలిచింది.

ఇద్దరు అక్కచెల్లెళ్ళు మధ్య వరుసగా జరిగిన ఐదు గ్రాండ్ స్లామ్'లలో సెరెనా విలియమ్స్ పైచేయి సాధించింది. వీరిద్దరి కెరీరులో ఒకరితో ఒకరు 9 గ్రాండ్ స్లామ్స్ ఫైనల్లో పోటీపడగా, ఏడు టైటిళ్లను సెరెనా దక్కించుకోగా, కేవలం రెండు టైటిళ్లు మాత్రమే వీనస్ విలియమ్స్ దక్కించుకుంది.

సెరెనా విలియమ్స్ టెన్నిస్ కెరీర్ రికార్డులు

సెరెనా విలియమ్స్ టెన్నిస్ చరిత్రలో అనేక రికార్డులు తిరగ రాసింది. ప్రస్తుతం ఓపెన్ ఎరా టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్ళు (23) గెలిచిన రికార్డు సెరెనా పేరట ఉంది. ఇందులో రికార్డు స్థాయిలో 13 టైటిళ్లను ఆమె హార్డ్ కోర్టులో దక్కించుకుంది.

ఇందులో 6 యూఎస్ ఓపెన్, 7 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి. ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (WTA) సంబంధించి దాదాపు 319 వారాల సుదీర్ఘ కాలం ఆమె ప్రపంచ టెన్నిస్ నెంబర్ వన్ ర్యాంకు నిలబెట్టుకుంది.

2012 లో ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించాక, సింగిల్స్ మరియు డబుల్స్ రెండింటిలోనూ కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన మొదటి టెన్నిస్ క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ నిలిచింది. మహిళల సింగిల్స్ చరిత్రలో అత్యధికంగా 365 మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఆమె కలిగి ఉంది.

అక్క వీనస్ విలియమ్స్ తో కలిసి 14 డబుల్స్ టైటిల్స్ సాధించింది. డబుల్స్ యందు వీరిద్దరూ కలిసి ఆడిన అన్ని ఫైనల్ మ్యాచులలో విజేతగా నిలిచారు. నటాషా జ్వెరెవా - జిగి ఫెర్నాండెజ్‌ (18) మరియు మార్టినా నవ్రతి - పామ్ ష్రివర్‌ల (20) ల తర్వాత మూడవ అత్యధిక మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను వీరు కలిగి ఉన్నారు.

అలానే నాలుగు ఒలింపిక్ బంగారు పతకాలు (డబుల్స్‌లో మూడు, సింగిల్స్ లో చెరొకటి) సాధించిన ఏకైక టెన్నిస్ క్రీడాకారుణిల రికార్డు వీరి పేరట ఉంది. అంతే కాకుండా ఒకే ఒలింపిక్స్ యందు సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాల్లో ఒలింపిక్ స్వర్ణం గెలుచుకున్న ఏకైక ఓపెన్ ఎరా మహిళా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మాత్రమే.

సెరెనా విలియమ్స్ 2016 లో దాదాపు 29 మిలియన్ డాలర్ల సంపాదనతో ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణిగా అవతరించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యధికంగా చెల్లించే 100 మంది అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక మహిళగా ఆమె నిలిచారు.

సెరెనా అత్యధిక సార్లు లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2003, 2010, 2016, 2018 అందుకున్న క్రీడాకారిణిగా ఉన్నారు. 2015 లో స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ మ్యాగజైన్ ద్వారా స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 2021 ఫోర్బ్స్  ప్రపంచ అత్యధికంగా చెల్లించే అథ్లెట్ల జాబితాలో సెరెనా 28వ స్థానంలో నిలిచింది.

సెరెనా విలియమ్స్ పెళ్లి & పిల్లలు & వ్యక్తిగత జీవితం

సెరెనా విలియమ్స్ 2016 లో రెడ్డిట్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్‌తో ప్రేమలో పడింది. 2017 లో జరిగిన వీరి వివాహంలో వీరి కూతురు అలెక్సిస్ ఒలింపియా ఒహానియన్ జూనియర్ ప్రత్యేక అథితిగా హాజరయ్యింది. వీరి వివాహానికి వచ్చిన అతిధులలో బియాన్స్, అన్నా వింటౌర్, కెల్లీ రోలాండ్ మరియు కిమ్ కర్దాషియాన్ వంటి హాలీవుడ్ అతిథిలు ఉన్నారు.

సెరెనా పెళ్లి తర్వాత ఒహానియన్‌తో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో సెటిల్ అయ్యింది. నాలుగేళ్ళ వయస్సులో రాకెట్ పట్టిన సెరెనా, తన కూతురుకు మూడేళ్లకే ఆ అవకాశం కల్పించింది. తన కోసం ప్రత్యేకంగా ఒక శిక్షకుడిని నియమించింది.

పెళ్లి తరువాత సెరెనా తిరిగి టెన్నిస్ పునరాగమనం చేసినా, ఆమెలో మునపటి వేగం తగ్గింది. తల్లి అయ్యాక ఒక గ్రాండ్ స్లామ్ సాధించినా, మెజారిటీ మ్యాచులలో ఓటమి పాలయ్యింది. 2021 నుండి సెరెనా టెన్నిస్ క్రీడకు దూరంగా ఉంది.

సెరెనా విలియమ్స్ ఫ్యాషన్ & లైఫ్ స్టైల్

మహిళా టెన్నిస్ క్రీడాకారిణులలో ఎప్పటికప్పుడు కొత్త ఫాషన్ ప్రయత్నించే వారిలో సెరెనా ముందు ఉంటారు. ఆమె ముందు నుండి ధరించే దుస్తుల్లో, కేశ అలంకరణలో ప్రత్యేకత చూపుతూ వస్తున్నారు. 2002 యూఎస్ ఓపెన్‌లో ఆమె నల్లటి లైక్రా క్యాట్‌సూట్ ధరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు.

2004 యూఎస్ ఓపెన్‌లో ఏకంగా డెనిమ్ స్కర్ట్‌లు మరియు మోకాలి ఎత్తు బూట్‌లను ధరించి మొట్టికాయలు తింది. విలియమ్స్ సిస్టర్స్ కెరీర్ ప్రారంభంలో కేశ అలాకారణలో ఉపయోగించే పూసలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి.

ప్రారంభంలో ప్యూమా, తర్వాత నైక్‌తో కెరీర్ చివరిలో స్వంత డిజైనర్ దుస్తులు "అనెరెస్" తో ఎప్పటికప్పుడు వైవిద్యం చూపించింది. సెరెనా దగ్గర ప్రత్యేక హ్యాండ్‌బ్యాగ్‌లు, నగలు, సిగ్నేచర్ స్టేట్‌మెంట్ వంటి కలెక్షన్ ఉన్నాయి.

కెరీర్ ప్రారంభంలో సెరెనా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా, గత కొద్దీ కాలంగా తన అభిప్రాయాలను, అభిరుచులను వ్యక్తపర్చేందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుంది.

2016 తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా బ్లాక్ లైవ్స్ మేటర్‌కి సెరెనా మద్దతు ప్రకటించింది. అలానే 2016 లో సెరెనా విలియమ్స్ పోర్టర్ మ్యాగజైన్ యొక్క "ఇన్‌క్రెడిబుల్ ఉమెన్ ఆఫ్ 2016"లో లింగ సమానత్వం మరియు టెన్నిస్‌లో మహిళగా తన వ్యక్తిగత పోరాటాల గురించి బహిరంగ లేఖ రాసింది.

సెరెనాకు వినోద రంగంలో ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆమె చాల టెలివిజన్ షోలకు వాయిస్ వర్క్ అందించింది. విలియమ్స్ మై వైఫ్ అండ్ కిడ్స్, షోటైమ్స్ స్ట్రీట్ టైమ్ మరియు లా అండ్ ఆర్డర్‌తో సహా పలు టెలివిజన్ షోలలో అతిథి పాత్రలు పోషించింది. సెరెనా మాతృభాషగ ఆంగ్లంతో పాటుగా ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్ భాషలు మాట్లాడుతుంది.

సెరెనా విలియమ్స్ అల్టిమేట్ రోల్ మోడల్

సెరెనా విలియమ్స్ ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన మరియు ఉత్తేజకరమైన టెన్నిస్ క్రీడాకారిగా ప్రసిద్ధికెక్కింది. ఆమె అవుట్‌గోయింగ్ పర్సనాలిటీ, ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్ మరియు అద్భుతమైన లుక్స్‌, దూకుడైన ఆటతీరుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

కొన్ని సంవత్సరాల శిక్షణ, తన సహజ సామర్థ్యం, గెలవాలనే శక్తివంతమైన సంకల్పం...టెన్నిస్ కోర్టులో తనకు అసాధారణమైన ఫలితాలను అందించాయి. శ్వేతజాతి ఆటగాళ్లు ఆధిపత్యం వహించే టెన్నిస్ క్రీడలో, ఒక ఆఫ్రికన్ అమెరికన్ అథ్లెట్‌గా అరుదైన కీర్తిని దక్కించుకుంది.

పుట్టుకతో ఎవరు విజేతలు కాలేరు. పుట్టుక నుండే తమను తాము భవిష్యత్ విజేతలుగా భావించుకునే వారు. మాత్రం తప్పక విజయం సాధిస్తారు..దానికి సెరెనా విలియమ్స్ జీవితమే నిదర్శనం. లక్ష్యం చేరేందుకు ఎంతగా శ్రమించాలో సెరెనా విలియమ్స్ జీవితాన్ని చుస్తే అర్ధమౌతుంది. నేటి యువతకు ఆమె అల్టిమేట్ రోల్ మోడల్.

Post Comment