Advertisement
Azim Premji | తెలుగులో అజీమ్ ప్రేమ్‌జీ బయోగ్రఫీ
Biographies

Azim Premji | తెలుగులో అజీమ్ ప్రేమ్‌జీ బయోగ్రఫీ

అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ

గొప్ప వ్యాపారవేత్తలు ఎందరో ఉంటారు. కానీ మంచి వ్యాపారవేత్తలు కొందరే ఉంటారు. ఆ అతికొద్ది మనసున్న మహారాజుల్లో అజీమ్ హషీమ్ ప్రేమ్‌జీ ఒకరు. భారతదేశ అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన విప్రో లిమిటెడ్ స్థాపన వెనుక ఆయన అవిరామమైన కృషి ఉంది, అపరిమితమైన దర్శినికత ఉంది. విలువకట్టలేని దాతృత్వం ఉంది. అనుకోని పరిస్థితులలో 19 ఏళ్లకే తండ్రి వ్యాపార బాధ్యతలు స్వీకరించిన అజీమ్ ప్రేమ్‌జీ, ఆల్ టైమ్ 30 మంది గొప్ప గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌లలో ఒకరిగా ఎదగడం వెనుకున్న కథను తెలుసుకోండి.

అజీమ్ ప్రేమ్‌జీ ప్రారంభ జీవితం

అజీమ్ ప్రేమ్‌జీ 1945 లో భారతదేశంలోని బొంబాయిలో, ఒక గుజరాతీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి మహమ్మద్ ప్రేమ్‌జీ, బియ్యం మరియు వంట నూనెల వ్యాపారం చేసేవారు. ఆయన స్థానికంగా రైస్ కింగ్ ఆఫ్ బర్మాగా ప్రసిద్ధి. తల్లి గుల్బానూ ప్రేమ్‌జీ వైద్య వృత్తిలో ఉండేవారు. అజీమ్ పుట్టిన రెండేళ్ళకి భారత్, పాకిస్తాన్ విభజన చోటు చేసుకుంది.  ఈ విభజనలో కీలక భూమిక పోషించిన ముహమ్మద్ అలీ జిన్నా, వీరి కుటుంబాన్ని పాకిస్తానుకు ఆహ్వానించారు. మహమ్మద్ హషేమ్ ఈ ఆహ్వానాన్ని తిరస్కిరించారు.

అజీమ్ ప్రేమ్‌జీ తన పాఠశాల మరియు కాలేజీ విద్యను ముంబైలోనే పూర్తిచేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్  కోసం యునైటెడ్ స్టేట్స్‌లోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఇంజినీరింగులో ఎలక్ట్రికల్ బ్రాంచును ఎంపిక చేసుకున్న ప్రేమ్‌జీ, 1966లో తన తండ్రి ఆకస్మిక మరణం తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు.

21 ఏళ్లకే విప్రో అధ్యక్ష బాధ్యతలు

1966లో తండ్రి ఆకస్మిక మరణంతో, అజీమ్ ప్రేమ్‌జీ జీవితం ఎటూ తేల్చుకోలేని సంధిగ్ధంలో పడింది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరో వైపు తండ్రి వ్యాపార బాధ్యతలు.. ఇంకో వైపు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్. ఈ క్రాస్ రోడ్డు జంక్షన్లో ప్రేమ్‌జీ మొదటి రెండిటిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. దీనితో ఇంజనీరింగ్ విద్యకు మధ్యలో మంగళం పాడాడు. దీనితో 21 ఏళ్ళ అజీమ్ ప్రేమ్‌జీ, తండ్రి యొక్క వెస్ట్రన్ ఇండియన్ వెజిటబుల్ ప్రొడక్ట్స్ యొక్క అధ్యక్ష బాధ్యతలు నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది.

వెస్ట్రన్ ఇండియన్ వెజిటబుల్ ప్రొడక్ట్స్ యొక్క చైర్మనుగా బాధ్యతలు తీసుకునే సమయంలో, కంపెనీలోని ఇతర వాటాదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. 20 ఏళ్ళ పిల్లోడికి అంత పెద్ద బాధ్యతలు అప్పజెప్పడం తెలివైన నిర్ణయం కాదని వాదించారు. ఆ కంపెనీలో ప్రేమ్‌జీ కుటుంబానికి ఉన్న మెజారిటీ వాటా కారణంగా, వారు అంతకు మించి ఏం చేయలేకపోయారు.

అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార దక్షత

అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార బాధ్యతలు తీసుకునే సమయానికి, వారి కంపెనీ కేవలం హైడ్రోజనేటెడ్ కుకింగ్ ఆయిల్ తయారీలో మాత్రమే ఉండేది. అయితే అజీమ్ ప్రేమ్‌జీ తరువాత కంపెనీని బేకరీ ఫ్యాట్స్, పూజ ఉత్పత్తులు, హెయిర్ సంరక్షణ సబ్బులు, పిల్లల టాయిలెట్‌ ఉత్పత్తులు, లైటింగ్ ఉత్పత్తులు మరియు హైడ్రాలిక్ సిలిండర్లకు విస్తరించాడు. తండ్రి మరణానికి ముందు అజీమ్ ప్రేమ్‌జీకి వ్యాపార జ్ఞానం శున్యం. ఏరోజు ఆయన వ్యాపారం వైపు కన్నెత్తి చూసింది కూడా లేదు. కానీ బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలంలోనే ఆ సంస్థను విజయాలబాట పట్టించాడు.

వ్యాపారరంగంలో విప్లవాత్మక నిర్ణయాలు ఊహించని విజయాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఆ రంగంలో వాక్యూమ్‌ ఉన్నప్పుడు. 1980వ దశకంలో, రాజకీయ కారణాలతో ఐబీఎం సంస్థ ఇండియా నుండి నిష్క్రమించడంతో, భారత ఐటీ రంగంలో ఒక రకమైన సందిగ్ధం ఏర్పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం యొక్క ప్రాముఖ్యత తెలిసిన అజీమ్ ప్రేమ్‌జీ, ఆ వాక్యూమ్‌ను సద్వినియోగం చేసుకునేందుకు విప్రో లిమిటెడ్ పేరుతో భారత టెక్నాలజీ రంగంలోకి ప్రవేశించాడు. అలానే అమెరికాకు చెందిన సెంటినెల్ కంప్యూటర్ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో విప్రో పేరుతో మినీ కంప్యూటర్లు రూపొందించి భారత్ మార్కెట్లోకి విడుదల చేసాడు. ఇది లాభాలను ఆర్జించడంతో సాంప్రదాయ వ్యాపారం నుండి సాఫ్ట్‌వేర్ వైపు దృష్టి సారించాడు.

ఇదే సమయంలో భారత తయారీ రంగంలో కూడా కంపెనీని విస్తరించాడు. 1983లో హైడ్రాలిక్ టిప్పింగ్ సిస్టమ్‌లను ఉత్పత్తి చేయడానికి కర్మాగారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత పారిశ్రామిక సిలిండర్లు మరియు హైడ్రాలిక్ సిలిండర్ల తయారీని కూడా ప్రారంభించాడు. 1991లో భారతదేశం యొక్క ఆర్థిక నియంత్రణ సడలింపు తరువాత, విప్రో ఉత్పత్తుల సంఖ్యా పెరుగుతూ వచ్చింది. అందులో లైట్స్, పౌడర్లు, చమురు ఆధారిత సహజ ఉత్పత్తులు, వైద్య మరియు రోగనిర్ధారణ పరికరాలు, ప్రింటర్లు, స్కానర్‌ల వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులు వంటివి ఉన్నాయి.

1999లో విప్రో, యూఎస్ నేషనల్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లాబొరేటరీ నుండి వై2కే-కంప్లైంట్ సర్టిఫికేషన్ పొందిన ఏకైక భారతీయ కంప్యూటర్ తయారీదారుగా అవతరించింది. ఇది భారతదేశంలో ఇంటర్నెట్ సేవరంగంలోకి ప్రవేశించేందుకు ఉపయోగపడింది. మరుసటి సంవత్సరం, విప్రో అమెరికన్ డిపాజిటరీ రసీదుల ద్వారా యూఎస్ కంపెనీల జాబితాలో లిస్ట్ చేయబడింది. దీనితో భారతదేశం యొక్క అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారులలో ఒకటిగా మరియు భారతదేశంలో రెండవ-అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా ఉద్భవించింది. 2002లో బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) యూనిట్‌ను కూడా ప్రారంభించింది. 1998 నుండి 2003 వరకు భారతీయ స్టాక్ మార్కెట్టులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్టాక్‌లలో ఒకటిగా విప్రో నిలిచింది.

విప్రో కార్పొరేట్ సామ్రాజ్యం

అజీమ్ ప్రేమ్‌జీలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఒక నూనెల తయారీ కంపెనీని, బిలియన్ డాలర్ల ఎంటర్‌ప్రైజ్‌గా మార్చడంలో అవి కీలకపాత్ర పోషించాయి అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇండియాలో కార్పరేటు వర్క్ ఫార్మేట్'ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ విప్రో. వ్యాపార రంగంలో టీమ్ వర్క్ అనేది కీలక భూమిక పోషిస్తుందని ప్రేమ్‌జీ బలంగా నమ్ముతారు. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు దానికి అవసరమయ్యే ఖచ్చితమైన టీంను ఏర్పాటు చేసుకోవడంపైనే దానియొక్క విజయం ఆధారపడి ఉంటుంది అని ఆయన అంటారు.

2011 వరకు జాయింట్ సీఈఓలు కంపెనీగా విప్రో నడిచింది. ఇది ఆ కంపెనీ విజయంలో కీలక భూమిక పోషించింది. 2005లో, విప్రోను బిలియన్-డాలర్ ఎంటర్‌ప్రైజ్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషించిన సీఈఓ వివేక్ పాల్ నిష్క్రమణ తరువాత, సీఈఓకి మద్దతుగా మరియు రోజువారీ కార్యకలాపాలు, ఉత్పత్తి డెలివరీ మరియు కస్టమర్ కార్యకలాపాలు చూసేందుకు కొత్తగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హోదాను సృష్టించింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత, విప్రో రాబడి వృద్ధి నిలిచిపోయింది. దీనితో విప్రో వ్యాపార నమూనాను పునర్నిర్మించవలసి వచ్చింది.

ప్రేమ్‌జీ నాయకత్వంలో విప్రో ఆదాయాలు 1960ల చివరలో దాదాపు $2 మిలియన్‌ల నుండి 2014లో దాదాపు $7 బిలియన్లకు పెరిగాయి. ఈ మొత్తం ఆదాయంలో దాదాపు 75 శాతం లాభాలు ఐటీ పరిశ్రమ నుండి ఆర్జించారు. జూలై 2019లో అజీమ్ ప్రేమ్‌జీ విప్రో బోర్డు ఛైర్‌గా వైదొలిగి, తన కుమారుడు రిషాద్‌కు బాధ్యతలు అప్పగించారు. దాని 2018-2019 వార్షిక నివేదికలో కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8.4 బిలియన్ డాలర్లుగా నివేదించింది. విప్రో షేర్లలో 73 శాతం షేర్లను కలిగిఉంది.

అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం

అజీమ్ ప్రేమ్‌జీ, ఇండియన్ కార్పొరేట్ దాతృత్వపు మహారాజుగా కీర్తించబడ్డారు. ప్రేమ్‌జీ తన సంపదలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం ఉపయోగించారు. దీని కోసం 2021లో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. భారతదేశంలో పాఠశాల విద్యను మెరుగుపరచడానికి 2010 లో దాదాపు  2 బిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల పరిధిలో 350,000 పాఠశాల అభివృద్ధికి దీర్ఘకాల భాగస్వామిగా పనిచేస్తుంది. అలానే తక్కువ ఖర్చుతో ప్రీమియం ఉన్నత విద్యను అందించేందుకు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఇది విద్య మరియు మానవాభివృద్ధికి సంబంధించిన ఇతర రంగాలలో బోధన మరియు పరిశోధన కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది.

వీటికోసం విప్రో లిమిటెడ్ యొక్క 213 మిలియన్ల ఈక్విటీ షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్‌కు బదిలీ చేసారు. ఈ విరాళం భారతదేశంలోనే అతిపెద్దది. మార్చి 2019లో, ప్రేమ్‌జీ తన వద్ద ఉన్న విప్రో స్టాక్‌లో అదనంగా 34% ఫౌండేషన్‌కు తాకట్టు పెట్టారు. సుమారు 7.5 బిలియన్ డాలర్లకు సమానం. ప్రస్తుతం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ 21 బిలియన్ డాలర్ల హస్తులను కలిగి ఉంది.

ధనవంతుడు కావడం తనను ఏరోజు థ్రిల్ చేయలేదని ప్రేమ్‌జీ అంటుంటారు. తన సంపద సమాజ శ్రయస్సు కోసం ఉపయోగపడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వెల్లడించారు. ఈ గొప్ప లక్షణం తన తల్లి నుండి వారసత్వనగా వచ్చినట్లు చెప్తుంటారు. 2013 లో వారెన్ బఫ్ఫెట్ మరియు బిల్ గేట్స్ నేతృత్వంలోని గివింగ్ ప్లెడ్జ్ పై సంతకం చేసిన మొదటి భారతీయుడుగా ప్రేమ్‌జీ నిలిచారు. రిచర్డ్ బ్రాన్సన్, డేవిడ్ సైన్స్‌బరీ తర్వాత ఈ క్లబ్‌లో చేరిన మూడవ నాన్-అమెరికన్'గా అవతరించారు. 2013 నాటికీ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 32.8 బిలియన్ల నికర విలువతో భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరుగా ఉన్న ప్రేమ్‌జీ, గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేయడం ద్వారా తన కుబేరుడు స్థానం పోతుందని తెలిసిన ఆయన దాతృత్వానికే ఓటు వేశారు. 2019లో భారీ మొత్తంలో చేసిన దాతృత్వం తర్వాత ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్‌లో 2వ స్థానం నుండి 17వ స్థానానికి ప్రేమ్‌జీ పడిపోయారు.

2019 నాటికీ అజీమ్ ప్రేమ్‌జీ భారత అగ్రశ్రేణి పరోపకారి ఉన్నారు. 2020లో కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి అవసరమయ్యే టెస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచేందుకు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌తో మరియు ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్‌తో కలిసి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ పనిచేసింది.

అజీమ్ ప్రేమ్‌జీ అందుకున్న అవార్డులు & గౌరవాలు

వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా అజీమ్ ప్రేమ్‌జీ పొందిన అవార్డులు మరియు గౌరవాలు జాబితా చాల పెద్దది. 2009 బ్లూమ్‌బెర్గ్ బిజినెస్‌వీక్, విప్రోను ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటిగా గుర్తించింది, ప్రేమ్‌జీని "గ్రేటెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్"లో ఒకరిగా సంబోధించింది. 2000లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ద్వారా అజీమ్ ప్రేమ్‌జీకి లక్ష్య బిజినెస్ విజనరీ అవార్డు లభించింది. 2009లో వెస్లియన్ విశ్వవిద్యాలయం, అత్యుత్తమ దాతృత్వ సేవకు గౌరవ డాక్టరేట్ అందించింది. 2015లో మైసూర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఫారడే మెడల్ పొందిన తొలి భారతీయుడుగా ప్రేమ్‌జీ రికార్డుకెక్కారు. రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్, వారి అత్యున్నత పౌర పురస్కారమైన నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్‌ను ప్రేమ్‌జీకి ప్రదానం చేసింది. జనవరి 2011లో భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నాడు. 2017 లో కార్నెగీ మెడల్ ఆఫ్ ఫిలాంత్రోపీ అందుకున్నారు.

2017లో ఇండియా టుడే మ్యాగజైన్, భారతదేశంలోని 50 మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ప్రేమ్‌జీకి 9వ స్థానం కల్పించింది. 2019లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 30 మంది పరోపకారవేత్తల జాబితాలో ప్రేమ్‌జీకి చోటు కల్పించింది. 2019లో ఇదే మ్యాగజైన్ యుఎస్ వెలుపల ఉన్న ప్రపంచంలోని అత్యంత ఉదారమైన పరోపకారి జాబితాలో కూడా ప్రేమ్‌జీని చేర్చింది.

ముగింపు వ్యాఖ్యలు

21 ఏళ్ళ వయస్సులో అనుకోని పరిస్థితులలో వ్యాపారంగంలో ప్రవేశించిన అజీమ్ ప్రేమ్‌జీ, భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన వ్యాపార నాయకులలో అగ్రగామిగా నిలవడం సామాన్య విషయం కాదు. నైతికంగా, న్యాయమైన, పర్యావరణపరంగా సున్నితమైన వ్యాపార పద్ధతులను అమలు చేయడం అందరికి సాధ్యమయ్యేది కాదు. అజీమ్ కార్యాచరణలో, ఆయన అడుగుజాడల్లో విప్రో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో విస్తరిస్తూ, సామాజిక మరియు పర్యావరణ కార్యక్రమాల ద్వారా సుస్థిరత కలిగిన గ్లోబల్ లీడర్‌గా గుర్తించబడింది. దానికి ఎంతో నిబద్దత, క్రమశిక్షణ ఉండాలి. అవి అజీమ్ ప్రేమ్‌జీ దగ్గర టన్నులు టన్నులు. ఎప్పుడు చిరునవ్వును కనిపించే ప్రేమ్‌జీ, 1966 లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో మధ్యలో విడిచిపెట్టిన ఇంజనీరింగ్ డిగ్రీని 30 సంవత్సరాల తర్వాత 1999 లో పూర్తిచేసి తన ఇంజనీరింగ్ కలను నెరవేర్చుకున్నారు. ఆయన జీవితం ఈ తరం యువతకే కాదు రాబోయే తరాలకు కూడా ఆదర్శప్రాయం.

Post Comment