ఆర్ట్ & కల్చర్ అఫైర్స్ | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

ఆర్ట్ & కల్చర్ అఫైర్స్ | ఫిబ్రవరి 2022

లడఖ్‌లో వార్షిక స్పితుక్ గస్టర్ ఫెస్టివల్ ప్రారంభం

లడఖీ సంస్కృతి మరియు సాంప్రదాయ వారసత్వంకు చెందిన రెండు రోజుల వార్షిక స్పితుక్ గస్టోర్ ఫెస్టివల్ జనవరి 30 & 31వ తేదీల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ రంగురంగుల ఉత్సవాలను చూసేందుకు, భక్తులు ప్రతి సంవత్సరం స్పిటుక్ మొనాస్టరీకి పెద్ద మొత్తంలో చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో స్థానికంగా "చామ్స్" అని పిలవబడే రంగుల ముసుగు నృత్యం బాగా పాపులర్. ఈ పండగ స్థానిక స్పితుక్ తెగ శాంతి మరియు శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు.

Advertisement

నవదీప్ సింగ్ రాసిన 'గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా' పుస్తకం విడుదల

క్రీడా రచయిత నవదీప్ సింగ్ గిల్ రచించిన 'గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా' పుస్తకం విడుదల అయ్యింది. 72 పేజీల ఈ మినీ బయోగ్రఫీ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాకు సంబంధించింది. ఈ పుస్తకంలో నీరజ్ చోప్రా జీవిత విశేషాలతో పాటుగా టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పథకం సాధించిన వరకు తను అనుభవించిన సాధకబాధకాలు వివరించారు.

హైదరాబాద్‌లో 216 అడుగుల 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' విగ్రహావిష్కరణ

11వ శతాబ్దపు భక్తి సన్యాసి, వైష్ణవ తత్వవేత్త రామానుజాచార్య స్మారకార్థం 216 అడుగుల ఎత్తైన ' స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ' విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇదే రోజు పటన్ చెరూలోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవ వేడుకలలో కూడా ఆయన పాల్గున్నారు.

'స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి సంబంధించిన రామానుజాచార్య విగ్రహమును హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ ట్రస్ట్ ఆవరణలో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహం చైనాలో తయారు చేయబడింది. రామానుజాచార్య 1000వ జన్మదిన జ్ఞాపకార్థం చిన్న జీయర్ ట్రస్ట్ దీన్ని ఏర్పాటు చేసింది.

కిరణ్ బేడీ కొత్త పుస్తకం "ఫియర్లెస్ గవర్నెన్స్" విడుదల

పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ రచించిన ' ఫియర్‌లెస్ గవర్నెన్స్ ' పుస్తకం విడుదలయ్యింది. ఈ పుస్తకమును ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రా నూయి మరియు ప్రొఫెసర్ దేబాషిస్ ఛటర్జీలు ప్రారంబించారు. ఈ పుస్తకం లెఫ్టినెంట్ గవర్నర్‌గా డాక్టర్ బేడీ దాదాపు ఐదు సంవత్సరాల సేవలో ఉన్న వాస్తవాలను హైలైట్ చేస్తుంది.

ఆస్కార్ రేసులో ఇండియన్ డాక్యూమెంటరీ చిత్రం 'రైటింగ్ విత్ ఫైర్'

భారతీయ డాక్యుమెంటరీ “ రైటింగ్ విత్ ఫైర్ ” అకాడమీ అవార్డుల 94వ ఎడిషన్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేట్ చేయబడింది. షార్ట్ లిస్ట్ చేయబడ్డ టాప్ 5 డాక్యుమెంటరీలలో రైటింగ్ విత్ ఫైర్ చోటు దక్కించుకుంది. దీనితో డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్ నామినేషన్‌ పొందిన మొదటి ఇండియన్ డాక్యూమెంటరీగా నిలిచింది. దీనిని ఢిల్లీకి చెందిన ఫిల్మ్ మేకర్స్ రింటూ థామస్ మరియు సుష్మిత్ ఘోష్ రూపొందించారు. ఇది దళిత స్త్రీలు నిర్వహిస్తున్న భారతదేశంలోని ఏకైక వార్తాపత్రిక 'ఖబర్ లహరియా' యొక్క జర్నలిస్టుల కథ.

రాజస్థాన్‌ 'మారు' ఎడారి మహోత్సవం ప్రారంభం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జైసల్మేర్ ఎడారి ఉత్సవాలు 13 ఫిబ్రవరి 2022న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను గోల్డెన్ సిటీ 'మారు మహోత్సవ్' అని కూడా పిలుస్తారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం రంగురంగుల భారీ ఊరేగింపుతో జరగనుంది. తర్వాత మిస్ పోకరన్ మరియు మిస్టర్ పోక్రాన్ పోటీలు నిర్వహిస్తారు. ముగింపు వేడుకలో నిర్వహించే క్యామెల్ సఫారీ, ఒంటెల బ్యూటిఫికేషన్ షోలు, క్యామెల్ పోలో మ్యాచ్, క్యామెల్ టాటూ షో గుర్రపు పందెం, ఒంటెల నృత్యం వంటి వివిధ కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2022

మధ్యప్రదేశ్ కళా పరిషత్ నిర్వహించే ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్, ఏటా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలోని ఖజురహో దేవాలయాల పక్కన వారం రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ వేడుక శాస్త్రీయ నృత్యాల మనుగడను కాపాడేందుకు, నృత్య కళాకారులను ప్రోత్సహించేందుకు జరుగుతుంది. ఈ ఏడాది ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో నేషనల్ కాళిదాసు అవార్డుతో పాటుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రూపాంకర్ కళా అవార్డు అందిస్తారు.

ప్రియమ్ గాంధీ-మోడీ కొత్త పుస్తకం 'ఎ నేషన్ టు ప్రొటెక్ట్'

ప్రముఖ రచయిత్రి ప్రియమ్ గాంధీ-మోడీ, తన కొత్త పుస్తకం 'ఎ నేషన్ టు ప్రొటెక్ట్' ను విడుదల చేసారు. ఈ పుస్తకం నరేంద్ర మోడీ నాయకత్వంలో, కోవిడ్ సంక్షోభం నుండి భారత్ ఏ విధంగా బయటపడిందో వివరిస్తుంది.

Advertisement

Post Comment