Advertisement
తెలుగులో మార్క్ జుకర్‌బర్గ్ బయోగ్రఫీ | Mark Zuckerberg
Biographies

తెలుగులో మార్క్ జుకర్‌బర్గ్ బయోగ్రఫీ | Mark Zuckerberg

"జీవితంలో ఏ రిస్కూ చేయక పోవడమే అతిపెద్ద రిస్కు చేయడంతో సమానం ". ఈ వాక్యం ప్రతీ ఎంటర్‌ప్రెన్యూర్ నోట ఏదొక సందర్భంలో విని ఉంటాం. మార్క్ జుకర్‌బర్గ్ నోట ఇంకా ఎక్కువ సార్లు విని వింటాం. జుకర్‌బర్గ్ జీవితంలో 2004 ఎప్పటికి గుర్తుండిపోయే ఏడాది. ఏ అంచనాలు లేని ఫేస్‌బుక్‌ డెవలప్మెంట్ కోసం ఏకంగా హార్వర్డ్ డిగ్రీని వద్దునుకున్నాడు.

అదే ఏడాది ఫేస్‌బుక్‌ రూపంలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాటుఫారంను ఆవిష్కరించాడు. మొదటి నిర్ణయం తీసుకుని ఉండకుంటే, ఫేస్‌బుక్‌ ఆవిష్కరణ జరిగి ఉండేది కాదు. 28 ఏళ్లకే వరల్డ్ యంగెస్ట్ బిలియనర్ అయ్యి ఉండేవాడు కూడా కాదు. సరైన సమయంలో సరైన రిస్క్ తీసుకున్నాడు కాబట్టే, ఈ హార్వర్డ్ డ్రాప్ ఔట్ స్టూడెంట్.. ఒక దశాబ్దపు యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు.

మార్క్ జుకర్‌బర్గ్ బాల్యం

మార్క్ జుకర్‌బర్గ్, 14 మే 1984 లో న్యూయార్క్‌ నగరానికి 20 మైళ్ళ దూరంలోని వైట్ ప్లెయిన్స్‌లో జన్మించాడు. ఎడ్వర్డ్ మరియు కరెన్ దంపతుల నలుగురు పిల్లల సంతానంలో రెండవ వాడు మరియు ఏకైక మగ పిల్లవాడు. తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులుగా స్థిరపడ్డారు. తండ్రి ఎడ్వర్డ్, ఇంటి పక్కనే డెంటల్ ప్రాక్టీస్ చేసేవాడు. తల్లి మానసిక వైద్యరాలు. వీరిది ఏ చీకు-చింత లేని సగటు అమెరికన్ మధ్య తరగతి కుటుంబం.

మొదటి ఆవిష్కరణ 

జుకర్‌బర్గ్ చిన్ననాటి నుండే చురుకైన వాడు. కొడుకు ఉత్సాహాన్ని తండ్రి ఎడ్వర్డ్ ఒక వైపు గమనిస్తూనే ఉన్నాడు. 8 ఏళ్ళ వయసులో తన ఆఫీసులో కంప్యూటర్ చూసి ఆకర్షితుడైనా కొడుకుకు కోసం, ఇంటెల్ 486 సిరీసుకు చెందిన క్వాంటెక్స్ 486 డిఎక్స్ మోడల్ పీసీని బహుమతిగా అందించాడు. పదేళ్ల వయస్సులో కంప్యూటర్  ప్రోగ్రామింగ్ యందు ఆసక్తి కనబర్చుతున్న కొడుకు కోసం డేవిడ్ న్యూమాన్‌ను అనే ట్యూటరును నియమించాడు. తండ్రి అంచనా తప్పలేదు. సరిగ్గా ఇది జరిగిన రెండేళ్లకు తండ్రి దంత వైద్యశాల కోసం ఏకంగా జుక్ నెట్ అనే మెసేజింగ్ ప్రోగ్రామ్‌ను రూపొందించే స్థాయికి ఎదిగాడు.

పాఠశాల విద్య

జుకర్‌బర్గ్ న్యూ హాంప్‌షైర్‌లోని ఫిలిప్స్ ఎక్సెటర్ అకాడమీలో పాఠశాల విద్యను పూర్తిచేసాడు. కంప్యూటరుతో పాటుగా స్పోర్ట్స్ యందు కూడా ఆసక్తి ఉండేది. ఫిలిప్స్ ఎక్సెటర్ అకాడమీలో చదువుతున్న రోజుల్లో ఫెన్సింగ్ (కర్ర/కత్తి సాము) క్రీడ యందు పాఠశాల జట్టులో, కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత కొత్త ప్రోగ్రామ్‌ల అభివృద్ధి చేయడంలో పడి దాన్ని పక్కన పెట్టేసాడు. సరదా కోసం కంప్యూటర్ గేమ్స్ రూపొందించి తన స్నేహితులతో ఆటలు ఆడేవాడు. ఇదే అకాడమీ నుండి క్లాసిక్‌లో డిప్లొమా పూర్తిచేసాడు. జుకర్‌బర్గ్'కు సంగీతంపైన, సాహిత్యం పైన కూడా అభిరుచి ఉండేది.

పాఠశాలలో చదువుకునే రోజుల్లో పండోర అనే సంగీత సాఫ్ట్‌వేర్ యొక్క ప్రారంభ వెర్షన్ సృష్టించాడు. ఈ సాఫ్ట్‌వేర్ కొనేందుకు AOL, మైక్రోసాఫ్ట్ సహా అనేక కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేయడంతో పాటుగా తమ సంస్థలలో జాబ్ ఆఫర్ చేసాయి. జుకర్‌బర్గ్ వాటన్నిటిని చిరునవ్వుతో తిరస్కరించాడు.

ఎక్సెటర్ అకాడమీ నుండి హార్వర్డ్ యూనివర్సిటీకి

జుకర్‌బర్గ్ 2002 లో ఎక్సెటర్ అకాడమీ నుండి డిప్లొమా పూర్తిచేశాక గ్రాడ్యుయేషన్ కోసం హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. హార్వర్డ్ వాతావరణం జుకర్‌బర్గ్ ఆలోచన పరిధిని పెంచింది. తన జీవితంలో గుర్తుండిపోయే రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అవి హార్వర్డ్'లో గడిపిన రోజులు మాత్రమే అని యిప్పటికీ చెప్తూ ఉంటాడు. అలా అని హార్వర్డ్ రోజులన్నీ గొప్పవని కాదు. అక్కడ కొన్ని అపజయాలు కొన్ని అవమానాలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో హార్వర్డ్'ని వదిలేయాల్సి వచ్చింది.

ఫేస్‌మాష్‌ లొల్లి

జుకర్‌బర్గ్, హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ & కంప్యూటర్ సైన్స్ కోర్సు చేసేందుకు చేరాడు. మొదటి ఏడాదిలో ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా విద్యార్థుల జాబితాను రూపొందించే "కోర్స్‌మ్యాచ్" అనే ప్రోగ్రామ్‌ను నిర్మించాడు. రెండవ ఏడాదిలో క్యాంపస్‌లోని ఇద్దరు విద్యార్థుల చిత్రాలను సరిపోల్చుతూ ఉత్తమ దానికి ఓటు వేచే ఫేస్‌మాష్‌ అప్లికేషన్ సృష్టించాడు. అది అనుకోని రీతిలో రాత్రికి రాత్రి వైరల్ అయ్యి యూనివర్సిటీ యాజమాన్యం బ్యాన్ చేసేవరకు వెళ్ళింది. విద్యార్థునిల అనుమతి లేకుండా వారి ఫోటోలు ఉపయోగించడంపై పెద్ద రచ్చ జరిగింది. ఫలితంగా యూనివర్సిటీ, విద్యార్థుల అందరికి జుకర్‌బర్గ్ ద్వారా క్షేమపణ చెప్పించింది.

ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హార్వర్డ్  స్నేహితులైన దివ్య నరేంద్ర, మరియు కవలలు కామెరాన్ మరియు టైలర్ వింక్లెవోస్ లతో కలిసి హార్వర్డ్ కనెక్షన్ పేరుతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ రూపొందించే పనిలో పడ్డారు. దీని ద్వారా సేకరించిన డేటా ఆధారంగా హార్వర్డ్ ఉన్నతవర్గాల కోసం డేటింగ్ సైట్‌ను రూపొందించే ప్రణాళిక చేసారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉన్న సందర్భంలోనే మార్కు మైండులో ఫేస్‌బుక్‌ ఆలోచన పురుడుపోచుకుంది. ఈ ఆలోచన తక్షణ అమలు కోసం మార్కు హార్వర్డ్ కనెక్షన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.

ఫేస్‌బుక్‌ ఆవిష్కరణ

హార్వర్డ్ కనెక్షన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాక రూమ్ మేట్స్ డస్టిన్ మోస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్ మరియు ఎడ్వర్డో సావెరిన్ లతో కలిసి ఫేస్‌బుక్‌ ఐడియా పై పనిచేయడం మొదలు పెట్టారు. 2004 లో www.thefacebook.com పేరుతో  డొమైన్ రిజిస్టర్ చేశారు. యూజర్స్ తమ వ్యక్తిగత ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకునే సౌలభ్యంతో పాటుగా, ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి మరియు ఇతర యూజర్లతో కమ్యూనికేట్ చేసేందుకు అవకాశం ఉండే విధంగా ఫేస్‌బుక్‌ నిర్మాణం పూర్తిచేశారు.

అదే ఏడాది 4 ఫిబ్రవరి 2004 న హార్వర్డ్ వసతి గది నుండే ఫేస్‌బుక్‌ ఆవిష్కరించారు. ఊహించినట్లే ఫేస్‌బుక్‌ ఆలోచన విజయవంతమైంది. ఊహించని రీతిలో ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్యా పెరగడం ప్రారంభమైంది. ఫేస్‌బుక్‌ భవిష్యత్ పై జుకర్‌బర్గ్'కు పూర్తి అంచనా కుదిరింది. తక్షణమే హార్వర్డ్ వదిలి కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు మకాం మార్చాడు. 2004 చివరి నాటికీ ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్యా అక్షరాలా 1 మిలియన్ మార్కుకు చేరుకుంది.

తిరుగులేని వ్యాపార ప్రణాళిక

ఫేస్‌బుక్‌ ఆవిష్కరణకు నెల రోజుల ముందు, గూగుల్ సంస్థ నుండి ఆర్కుట్ సోషల్ మీడియా సైట్ మార్కెట్లోకి విడుదలయి పెద్ద విజయం సాధించింది. దీని సక్సెస్ చూసిన ఇతర పోటీ సంస్థల కన్ను ఫేస్‌బుక్‌ పై పడింది. ఇదే సమయంలో ఫేస్‌బుక్‌'ను మరో స్థాయికి చేర్చేందుకు మార్కుకు నిధుల కొరత అడ్డొచ్చింది. దీనితో ఇన్వెస్టర్ల కోసం వేట మొదలు పెట్టాడు. లక్కీగా 2005 లో వెంచర్ క్యాపిటల్ సంస్థ యాక్సెల్ పార్ట్‌నర్స్ నుండి భారీ ప్రోత్సాహాన్ని పొందింది. యాక్సెల్ ఏకంగా 12.7 మిలియన్ల డాల్లర్లను మార్కు సంస్థలో పెట్టుబడి పెట్టింది.

ఈ ప్రోత్సాహంతో ఫేస్‌బుక్‌'ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీలకు చేరువ అయ్యేలా ప్రణాళిక రచించాడు. 2005 చివరి నాటికీ ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్య 5.5 మిలియన్లకు చేరువయ్యింది. దీనితో మార్కు ఇప్పుడు ఆధాయ వనురులను వెతికే పనిలో పడ్డాడు. ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్యను చూపించి ప్రకటన సంస్థలను ఆకర్షించాడు. మరో వైపు మైక్రోసాఫ్ట్, యాహూ, MTV నెట్‌వర్క్‌ వంటి బడా సంస్థలు ఫేస్‌బుక్‌'ను దక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేసాయి. వీటన్నిటిని జుకర్‌బర్గ్ చిరునవ్వుతో తిరస్కరించి, ఫేస్‌బుక్‌ విస్తరించడంపై దృష్టి సారించాడు. బయటి డెవలపర్‌లకు తన సంస్థలో చోటు కల్పించి ఫేస్‌బుక్‌'కు అదనపు మెరుగులు దిద్దాడు. ఆ తర్వాత మార్కు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఫేస్‌బుక్‌ సోషల్ మీడియా వేదికల రారాజుగా సక్సెస్ అయ్యింది.

ఫేస్‌బుక్‌ సక్సెస్ ప్రేరణగా, తర్వాత కాలంలో కొన్ని వందల సంఖ్యలో సోషల్ మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇదే సమయంలో ఆర్కుట్, గూగుల్+ వంటి వేదికలు మూసుకోవాల్సి వచ్చింది. ఎన్ని వచ్చినా, ఎన్ని పోయినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని విమర్శలు వెలువెత్తిన.. సోషల్ మీడియా వేదికల్లో ఇప్పటికీ ఫేస్‌బుక్‌ అగ్రగామిగా వర్థిల్లుతుంది. 2010 లో జుకర్‌బర్గ్'ను టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా కీర్తించింది. ఇదే ఏడాది మార్క్ జీవితం ఆధారంగా నిర్మించిన "ది సోషల్ నెట్‌వర్క్" చిత్రం వెండితెరపై కాసుల వర్షం కురిపించింది. ఏకంగా 2 అకాడమీ అవార్డులతో పాటుగా 50 కి పైగా ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.

అతిపెద్ద ఇంటర్నెట్ ఐపిఓ

2012 లో ఫేస్‌బుక్‌ షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రారంభ ఐపీఓ లో ఏకంగా 16 బిలియన్ డాల్లర్ల సంపదను సేకరించింది. ఇది అతిపెద్ద ఇంటర్నెట్ ఐపిఓగా చరిత్రకు ఎక్కింది. 2013 నాటికీ ఫేస్‌బుక్‌ ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. 28 ఏళ్ళ మార్క్ జుకర్‌బర్గ్, యాంగెస్ట్ సీఈఓ గా చరిత్ర సృష్టించాడు. 2019 లో, ఫోర్బ్స్ ప్రపంచ 'బిలియనీర్స్' జాబితాలో జుకర్‌బర్గ్ 8 వ స్థానంలో నిలిచాడు. ఇది అక్షరాలా ఫేస్‌బుక్‌ విజయం..కాదు జుకర్‌బర్గ్ విజయం.

పెళ్లి - పిల్లలు - దాతృత్యం

జుకర్‌బర్గ్ 2012 లో చైనీస్-అమెరికన్ వైద్య విద్యార్థి ప్రిస్సిల్లా చాన్‌ను తన ఇంట్లో 100 మంది స్నేహుతుల మధ్య నిడంబరంగా వివాహం చేసుకున్నాడు. మార్కు మరియు చాన్‌'లు రింగులు మార్చుకునే వరకు అది వివాహ వేడుకని చాలా మంది స్నేహితులకు తెలియనంత నిడంబరంగా వీరిద్దరి పెళ్లి తంతు ముగిచింది. మార్కు, చాన్‌ ల మధ్య హార్వర్డ్‌లో కలిసిన రోజుల నుండే ఒక తెలియని ఆకర్షణ ఉంది. దానికి వివాహ బంధతో ముగింపు పలికారు. వివాహం తర్వాత మార్కులో ఊహించని పరిణతి చోటు చేసుకుంది. మార్కు హటార్తుగా ఫ్యామిలీ మ్యాన్'లా మారిపోయాడు. పెళ్ళైన మూడేళ్ల తర్వాత 2015 లో మాక్స్ పుట్టినప్పుడు ఏకంగా 2 నెలల పితృత్వ సెలవు తీసుకుని సగటు మగజాతిని ఆశ్చర్యపర్చాడు. ఈ నిర్ణయం ఎందరో అభిమానులను మార్కుకు దగ్గర చేసింది. 2017 లో ఆగస్టు పుట్టాక ఇద్దరి కూతుర్లను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసాడు.

దాతృత్వంలో రారాజు

సంపాధించడంలోనే కాదు తిరిగి ఇవ్వడంలో కూడా జుకర్‌బర్గ్ తనదైన మార్కు చూపించాడు. జుకర్‌బర్గ్ 2010 లో మొదటిసారి న్యూజెర్సీలో విఫలమైన నెవార్క్ పబ్లిక్ స్కూళ్ల వ్యవస్థను కాపాడటానికి100 మిలియన్ డాలర్లు విరాళంగా అందించాడు. ఇదే ఏడాది చివరిలో బిల్ గేట్స్ , వారెన్ బఫ్ఫెట్ మరియు జార్జ్ లూకాస్ మాదిరిగా తన జీవితకాలంలో 50% సంపదను విరాళంగా ఇచ్చేనందుకు "గివింగ్ ప్లెడ్జ్" పై సంతకం చేశాడు.

2015 లో మొదటి కుమార్తె మాక్సిమా పుట్టిన సంధర్భంలో ఫేస్‌బుక్‌ లో దంపతులు ఇద్దరికీ ఉన్న షేర్లలో 99% (దాదాపు 45 బిలియన్ డాలర్లు) షేర్లను మాక్సిమా తరానికి చెందిన పిల్లల మౌలిక అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. అలానే పిల్లలకు సంబంధించిన వ్యాధులపై పరిశోధన కోసం 3 బిలియన్ డాలర్లతో చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ (CZI) ఏర్పాటుచేశారు. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చెదుకు ఇంటర్నెట్.డాట్ ఏర్పాటు చేసాడు. అలానే భవిష్యత్ అవసరాల కోసం పనిచేసే ఇంజనీర్లు, కంప్యూటర్ శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తల కోసం వచ్చే పదేళ్లలో 600 మిలియన్ డాలర్లతో చాన్ జుకర్‌బర్గ్ బయోహబ్ ఏర్పాటు చేసారు. దీనిలో స్టాన్ఫోర్డ్, శాన్ ఫ్రాన్సిస్కో మరియు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలను భాగస్వాయం చేసారు.

వివాదాలు & ఆరోపణలు

జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ ఆవిష్కరణ యెంత గొప్ప విజయవంతమైందో, అంతే సంఖ్యలో వివాదాలు చుట్టుముట్టాయి. ఎన్నో ఆరోపణలు వెలువెత్తాయి ..ఒకానొక దశలో ఫేస్‌బుక్‌ పరిస్థితి ఆర్కుట్ మాదిరి సమాధి అవుతుందేమో అనిపించింది... కానీ జుకర్‌బర్గ్ లో ఉండే గొప్ప నాయకత్వ పటిమ ఆ సంస్థ కిందకి దిగజారిన ప్రతీసారి పైకి ఎగిచేలా చేసింది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనే తెలుగు సినిమా డైలాగ్ జుకర్‌బర్గ్'కు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో..!

హార్వర్డ్ కనెక్షన్ మేధో సంపత్తి చిక్కులు

జుకర్‌బర్గ్ 2016 లో ఫేస్‌బుక్‌ సంబంధించి మొదటి అడ్డంకిని ఎదుర్కొన్నాడు. హార్వర్డ్ కనెక్షన్ యొక్క రూపకర్తలు తమ ఐడియాను జుకర్‌బర్గ్ తస్కరించి ఫేస్‌బుక్‌ రూపొందించనట్లు, దాని వలన వారి హార్వర్డ్ కనెక్షన్  విఫలమైనట్లు కోర్టుకెక్కారు. దీనికి సంబంధించి ఫేస్‌బుక్‌ రికార్డులు పరిశీలించిన న్యాయ నిపుణులు, జుకర్‌బర్గ్ ఉద్దేశపూర్వకంగా హార్వర్డ్ కనెక్షన్ యొక్క మేధో సంపత్తిని దొంగిలించి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. హార్వర్డ్ కనెక్షన్ & ఫేస్‌బుక్‌ ఆలోచనలు రెండు విభిన్న రకాల సోషల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడి ఉన్నప్పటికీ, మార్కు ప్రారంభంలో హార్వర్డ్ కనెక్షన్ కోసం పనిచేసి మధ్యలో డ్రాప్ అవ్వడం వలన జుకర్‌బర్గ్ ఈ మోసాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మార్కు క్షమాపణలు చెప్పడంతో పాటుగా, ఇరు పార్టీల మధ్య 65 మిలియన్ డాలర్ల పరిష్కారం కురింది. అయినప్పటికీ 2011 వరకు మార్కు దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కున్నాడు.

ఫేక్ న్యూస్ & కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం

హార్వర్డ్ కనెక్షన్ వివాదం ముగిశాక 2016 లో ఫేక్ న్యూస్ & కేంబ్రిడ్జ్ అనలిటికా రూపంలో అతిపెద్ద సునామీ ఫేస్‌బుక్‌'ను చుట్టుముట్టింది. 2016 అమెరికా అధ్యక్షా ఎన్నికలలో కేంబ్రిడ్జ్ అనలిటికా, దాదాపు 87 మిలియన్ల ఫేస్‌బుక్‌ యూజర్ల వ్యక్తిగత అభిరుచుల డేటాను స్వార్థ పరమైన అవసరాల కోసం ఉపయోగించుకుంది అనే ఆరోపణలు వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ పై విమర్శల వర్షం కురిచింది. లక్షల సంఖ్యలో యూజర్లు ఫేస్‌బుక్‌'ను విడవడంతో పాటుగా ఫేస్‌బుక్‌ షేర్ విలువ దాదాపు 15% కి పైగా పడిపోయింది. కొన్ని గంటల వ్యవధిలో కొన్ని బిలియన్ల ఫేస్‌బుక్‌ సంపద ఆవిరి అయిపోయింది.

జరిగిన తప్పును గ్రహించిన జుకర్‌బర్గ్, దానికి సంబంధించి భారీస్థాయిలో సంస్కరణలు చెప్పట్టాడు. ఫేస్‌బుక్‌'తో అనుసంధానమై పనిచేస్తున్న థర్డ్ పార్టీ డెవలపర్‌ల యూజర్ సమాచార ప్రాప్యతకు పరిమితులు విధించాడు. యూజర్ల వ్యక్తిగత సమాచారానికి పూర్తి రక్షణ కల్పించాడు. యూజర్ కోరుకునే ప్రైవసీ సదుపాయాలను అందుబాటులో ఉంచాడు. దీనితో పాటుగా మీడియా ముఖంగా ఫేస్‌బుక్‌ యూజర్లు అందరికి బహిరంగ క్షమాపణ కోరాడు. తిరిగి ఫేస్‌బుక్‌'ను గాడిలో పెట్టాడు.

హార్వర్డ్ నుండి గౌరవ డాక్టరేట్

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం అనే సామెత మనం తరుసూ వింటూనే ఉంటాం. దాదాపు అలాంటిదే జుకర్‌బర్గ్ జీవితంలో జరిగింది. 2004 లో ఫేస్‌బుక్‌ కోసం హార్వర్డ్ యూనివర్సిటీని వదిలి వెళ్లిన జుకర్‌బర్గ్'ను, 2017 లో అదే యూనివర్సిటీ నుండి గౌరవ అతిధిగా ఆహ్వానం అందింది. ఏ యూనివర్సిటీ అయితే జుకర్‌బర్గ్ చేత క్షమాపణలు చెప్పించిందో, ఏ యూనివర్సిటీ అయితే మార్కు ఆలోచనలను బ్యాన్ చేసిందో, ఏ యూనివర్సిటీ నుండి అయితే మార్క్ డ్రాప్ అవుట్ స్టూడెంటుగా బయటకు వెళ్ళాడో అదే హార్వర్డ్ యూనివర్సిటీ జుకర్‌బర్గ్ 'కు గౌరవ అతిధిగా ఆహ్వానించి, గౌరవ డాక్టర్ ఆఫ్ లా డిగ్రీతో సత్కరించింది. జుకర్‌బర్గ్ జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా...దీనికి మించిన విజయం మరొకటి ఉండదు.

జుకర్‌బర్గ్ హార్వర్డ్ చేరకుండా ఉండి ఉంటె..ప్రత్యామ్నాయంగా కొడుకుతో మెక్‌డొనాల్డ్ ఫ్రాంచైజ్ ఏర్పాటు చేసేందుకు జుకర్‌బర్గ్ తండ్రి ప్లాన్ చేశారంట. కానీ జుకర్‌బర్గ్ హార్వర్డ్ యూనివర్శిటీలో చేరి ఫేస్‌బుక్‌ రూపొందించాడు. హార్వర్డ్ నుండి డ్రాప్ అయినా సంధర్భం నుండి తిరిగి హార్వర్డ్'లో అడుగుపెట్టే వరకు ఏడాదికి 4.7 బిలియన్ డాలర్ల లెక్క దాదాపు 66.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద జుకర్‌బర్గ్ సృష్టించాడు. అందుకే డాక్టరేట్ అందుకునే సంధర్భంలో మార్కు చేసిన ప్రసంగాన్ని హార్వర్డ్  గ్రాడ్యుయేట్లే కాకా ప్రపంచమంతా ఆసక్తిగా తిలకించింది. ఈ హార్వర్డ్ డ్రాప్ అవుట్ కుర్రోడు కథ...ఈ దశాబ్డానికే కాదు..మరో పది దశాబ్దాల యువతకి కూడా స్ఫూర్తిదాయకం.

Post Comment