తెలుగులో వారెన్ బఫెట్ బయోగ్రఫీ | Warren Buffett
Biographies

తెలుగులో వారెన్ బఫెట్ బయోగ్రఫీ | Warren Buffett

"30 రోజుల్లో ఇంగ్లీష్ భాషను నేర్చుకోండి" వంటి పుస్తకాలు చదివి.. ఎంత మంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నారో తెలియదు కాని, "వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు" అనే పుస్తకం చదివి ఒక కుర్రోడు ప్రపంచ కుబేరుడు అయ్యాడు. ఆ కుర్రోడి పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్.

పరిచయం అక్కర్లేని ఈ అమెరికన్ క్యాపిటలిస్ట్, జీరో నుండి హీరోగా మారడం వెనుక చాల పెద్ద స్టోరీ ఉంది. ఒక వ్యాపారవేత్తగా, బెర్క్‌షైర్ హాత్వే చైర్మనుగా, పరిమితులు లేని పరోపకారిగా, 20వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారునిగా ప్రసిద్ధి చెందిన బఫెట్ జీవిత విశేషాలు ఈ తరం యువతకు తప్పక స్ఫూర్తినిస్తాయి.

వారెన్ బఫెట్ లైఫ్ స్టోరీ

వారెన్ బఫెట్ భాల్యం

బఫెట్ 1930లో నెబ్రాస్కాలోని ఒమాహాలో జన్మించాడు. హోవార్డ్ బఫెట్‌ మరియు లీలా (నీ స్టాల్) దంపతుల ముగ్గురు పిల్లల సంతానంలో రెండవవాడు మరియు ఏకైక కుమారుడు. బఫెట్ ప్రాథమిక విద్యాబ్యాసం రోజ్ హిల్ ఎలిమెంటరీ స్కూల్‌ నుండి ప్రారంభమైంది.

1942లో అతని కుటుంబం వాషింగ్టన్ డీసీకి మకాం మార్చడంతో మిగిలిన ప్రాథమిక విద్యను ఇక్కడ పూర్తిచేసాడు. ఇదే క్రమంలో ఆలిస్ డీల్ జూనియర్ హైస్కూల్‌ నుండి సెకండరీ ఎడ్యుకేషన్, వుడ్రో విల్సన్ హైస్కూల్‌ నుండి సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసి మమ అనిపించాడు.

వారెన్ బఫెట్ గ్రాడ్యుయేషన్ vs బిజినెస్

బఫెట్'కు చిన్ననాటి నుండి వ్యాపారం అంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. తండ్రి హోవార్డ్ బఫెట్‌, వ్యాపారం మరియు రాజకీయాల్లో ఉండటం వలన సహజంగా ఈ ఆసక్తి అలవడింది. ఏడేళ్ల ప్రాయంలో ఒమాహా పబ్లిక్ లైబ్రరీ యందు చూసిన '1000 డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు' అనే పుస్తకం బఫెట్'కు విశేషంగా ఆకర్షించింది. అది ఎంతలా అంటే ఆ పుస్తకంలో ఉండే వెయ్యి సంపాదన మార్గాలను అమలు పర్చేందుకు ప్రణాళిక చేసాడు.

ఇందులో భాగంగా చూయింగ్ గమ్ విక్రయించడం, కోకా-కోలా సీసాలు అమ్మడం, వారపత్రికలను ఇంటింటికీ వేయడం, తాత కిరాణా దుకాణంలో పనిచేయడం వంటి మార్గాల ద్వారా డబ్బును సంపాదించడం ప్రారంభించాడు.

ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు కూడా వార్తాపత్రికలను పంపిణీ చేయడం, గోల్ఫ్ బంతులు, స్టాంపులు విక్రయించడం మరియు కార్ల షోరూమ్ యందు పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించడం కొనసాగించాడు. 1944లో తన మొదటి ఆదాయపు పన్ను కట్టే సమయంలో తన సైకిల్ మరియు వాచ్‌ని చూపించి 35 డాలర్లు రిటర్న్ పొందాడు.

సీనియర్ సెకండరీ చదువుతున్న రోజుల్లో తన స్నేహితుడుతో కలిసి 25 డాలర్లు వెచ్చింది పిన్‌బాల్ మెషిన్ కొనుగోలు చేసారు. దానిని స్థానిక బార్బర్ షాప్‌లో అందుబాటులో ఉంచి వ్యాపారం చేసారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో ఒమాహా అంతటా మూడు వేర్వేరు బార్బర్ షాపులకు విస్తరించారు.

ఏడాది తర్వాత దీని హక్కులను వేరొకిరికి అమ్మడం ద్వారా దాదాపు 12 వేల డాలర్ల లాభాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్ పోస్ట్‌ను డెలివరీ చేయడం ద్వారా ప్రతి నెల 180 పైగా డాలర్లు సంపాదిస్తూ, వాటిని తండ్రికి చెందిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవాడు. 15 ఏళ్ళ వయసులో 12 వందల డాలర్లు వెచ్చించి 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. బఫెట్ సీనియర్ సెకండరీ పూర్తి చేసే సమయానికి తన పొదుపు ఖాతాలో 9,800 డాలర్లకు పైగా సేవింగ్స్ కలిగిఉన్నాడు.

సీనియర్ సెకండరీ పూర్తియ్యాక, ఒకానొక సమయంలో గ్రాడ్యుయేషన్ చేసే బదులు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. దీనికి తండ్రి అనుమతి నిరాకరించడంతో 1947లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం యొక్క వార్టన్ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ ప్రవేశం పొందాడు. రెండేళ్ల తర్వాత నెబ్రాస్కా విశ్వవిద్యాలయానికి బదిలీ అయ్యి, అక్కడే అతను 19 సంవత్సరాల వయస్సులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌తో పట్టభద్రుడయ్యాడు.

గ్రాడ్యుయేషన్ పూర్తియ్యాక మాస్టర్స్ కోసం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కోసం దరఖాస్తు చేయగా, అది తిరస్కరించబడింది. ఈ తిరస్కరణను అదృష్టంగా భావించిన బఫెట్, కేవలం బెంజమిన్ గ్రాహం యొక్క స్టాక్ మార్కెట్ పాఠాల కోసం కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా బిజినెస్ స్కూల్‌లో ప్రవేశం పొందాడు. ఇదే బిజినెస్ స్కూల్‌ నుండి 1951 లో ఎకనామిక్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు.

బెంజమిన్ గ్రాహం నుండి వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ పాఠాలు

హైస్కూల్‌ రోజుల్లో బఫెట్ నడిపే సైడ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ వ్యాపార ఆలోచనలలో స్టాక్ మార్కెట్ యందు పెట్టుబడిపెట్టాలనే ఆలోచన ఉండేది. దీని సంగతేంటో తెలుసుకుందామని ప్రతిరోజూ తన తండ్రికి చెందిన స్టాక్ బ్రోకరేజ్‌లోని కస్టమర్ల లాంజ్‌లో గడిపేవాడు.

పదేళ్ల వయసులో న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడు, మొదట న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ని సందర్శించాలని పట్టుబట్టాడు. 11 ఏళ్ళ వయసులో తన సోదరి డోరిస్ బఫెట్'తో కలిసి తనకు ఇష్టమైన సిటీస్ సర్వీసుకు చెందిన మూడు షేర్లను కొనుగోలు చేశాడు. కేవలం ఈ ఆసక్తితోనే మాస్టర్ డిగ్రీ కోసం కొలొంబో వరకు వెళ్ళాడు.

బఫెట్ కాలేజీ రోజుల్లో వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి బెంజమిన్ గ్రాహం మరియు డేవిడ్ డాడ్'లు రాసిన 'సెక్యూరిటీ అనాలిసిస్' అనే పుస్తకం చదివి స్ఫూర్తి పొందాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్ దొరక్కపోవడంతో ఇతర యూనివర్సిటీలలో అడ్మిషన్ కోసం ప్రయత్నం చేసాడు.

ఈ క్రమంలో బెంజమిన్ గ్రాహం మరియు డేవిడ్ డాడ్'లు కొలంబియా బిజినెస్ స్కూల్‌ యందు పనిచేస్తున్నారని తెలుసుకుని వారికీ లిఖితపూర్వక దరఖాస్తు చేసుకున్నాడు. వీరి సానిహిత్యంలో బఫెట్ విలువైన పెట్టుబడి పాఠాలు నేర్చుకున్నాడు. తర్వాత వీరిదగ్గరే గ్రాహం-న్యూమాన్ కార్పోరేషన్‌లో సెక్యూరిటీ అనలిస్ట్‌గా కూడా పనిచేసాడు.

వారెన్ బఫెట్ వ్యాపారం & ఇన్వెస్ట్‌మెంట్ కెరీర్

మొదటి నుండి వ్యాపారంపై అమిత ఆసక్తితో ఉన్న బఫెట్, మాస్టర్స్ పూర్తివగానే వాల్ స్ట్రీట్‌లో పని చేయాలనుకుంన్నాడు. కానీ తండ్రి, గురువు బెంజమిన్ గ్రాహంలు ఈ ఆలోచనను నిరాకరించడంతో చివరికి తండ్రికి చెందిన బఫెట్-ఫాక్ & కో.లో ఇన్వెస్ట్‌మెంట్ యందు సేల్స్‌మ్యాన్‌గా చేరాడు.

1951-1954 వరకు దాదాపు నాలుగేళ్లు ఇదే వృత్తిలో ఉన్నాడు. సేల్స్‌మ్యాన్‌గా చేస్తూనే చిన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టేవాడు. ఈ నాలుగేళ్ళ ఉద్యోగ ప్రయాణం వృత్తి అనుభవాన్ని ఇచ్చినా, ఆర్థికంగా కొన్ని నష్టాలను పరిచయం చేసింది. ఇంకా అందులో కొనసాగే ఇష్టంలేక తిరిగి ఇంటికి చేరాడు.

ఈ క్రమంలో డేల్ కార్నెగీ పబ్లిక్ స్పీకింగ్ కోర్సుకు హాజరయ్యాడు. దీని తర్వాత స్టాక్ బ్రోకర్‌గా పొందిన అనుభవాలను నెబ్రాస్కా-ఒమాహా విశ్వవిద్యాలయంలో "ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్స్" నైట్ క్లాస్‌ల విద్యార్థులకు భోధించేవాడు. 1954 తర్వాత బెంజమిన్ గ్రాహం పిలుపుతో గ్రాహం-న్యూమాన్ కార్పొరేషన్ యందు ఉద్యోగంలో చేరాడు.

కొన్నాళ్ల తర్వాత బెంజమిన్ గ్రాహం ఉద్యోగ విరమణ చేయడంతో, వారెన్ కూడా తప్పుకుని స్వంతంగా బఫ్ఫెట్ పార్టనర్‌షిప్ లిమిటెడ్‌ని ప్రారంభించాడు. దీని కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు దాదాపు లక్ష డాలర్లు విరాళాలు అందించగా, బఫెట్ కేవలం వంద డాలర్లు మాత్రమే పెట్టుబడి పెట్టాడు.

స్టాక్ మార్కెట్ గురూజీగా వారెన్ బఫెట్

బఫెట్ వ్యాపార ఆలోచనలు, పెట్టుబడి విధానాలు ఎవరికి అంతుచిక్కనవి. విజయానికి అవకాశం లేని చోట ఎలా విజేతగా నిలవాలో బఫెట్'కు మాత్రమే తెలుసు. బఫ్ఫెట్ పార్టనర్‌షిప్ లిమిటెడ్‌ ఏర్పాటు చేశాక అనేక సంస్థలు, వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. 1961లో భాగస్వామ్య ఆస్తులలో 35% వాటాను నష్టాల్లో ఉన్న శాన్‌బార్న్ మ్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాడు.

వాస్తవ కంపెనీ షేర్ విలువ 45 డాలర్లు ఉంటె, బఫెట్ 65 డాలర్ల చెప్పున దాదాపు 75% కంపెనీ షేర్లను చేజిక్కించుకున్నాడు. ఇక్కడ కట్ చేస్తే, రెండేళ్లలో ఆ షేర్ల విలువ డబల్ అయ్యింది. పెట్టిన పెట్టుబడిపై బఫెట్ దాదాపు 50 శాతం లాభాన్ని దక్కించుకున్నాడు. 1962 చివరిలో బఫెట్ భాగస్వామ్యాల విలువ 7,178,500 డాలర్లు ఉండగా, అందులో బఫెట్ వాటా అక్షరాలా 1,025,000  డాలర్లు.

అలానే విండ్‌మిల్ తయారీ సంస్థ అయిన డెంప్‌స్టర్‌ లో పెట్టుబడి పెట్టి ఏడాదిలో మూడురెట్ల లాభాన్ని ఆర్జించాడు. అంతర్గత కుంభకోణంతో దివాళా తీస్తున్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ షేర్లను ప్రపంచం మొత్తం విక్రయిస్తున్నప్పుడు, బఫ్ఫెట్ మాత్రమే దాని షేర్లను కొనుగోలు చేయడం కొసమెరుపు. ఇవి కొద్దీ కాలంలోనే బఫెట్'కు రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టాయి. అలానే ఏబీసీ మీడియా సంస్థలో పెట్టుబడులు,  ది కోకా-కోలా కంపెనీలో పెట్టుబడులు బఫెట్'ను విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టాయి.

అందుకే బఫెట్ స్టాక్ మార్కెట్ గురుజీగా ప్రసిద్ధి చెందాడు. స్టాక్ మార్కెట్ అంటే బఫెట్, బఫెట్ అంటే స్టాక్ మార్కెట్ అనేంతలా ఎదిగాడు. మదుపర్లు మార్కెట్ సూచీలను బదులు బఫెట్'ను అనుచరించేవారు. ఒకానొక సమయంలో బఫెట్ అమ్మకాలు, కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేసాయి. అందుకే బఫెట్, 20వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుగా ప్రసిద్ధి చెందాడు మరియు కీర్తించబడ్డాడు.

ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా వారెన్ బఫెట్

1962లో బఫెట్ కన్ను నష్టాల్లో ట్రేడ్ అవుతన్న బెర్క్‌షైర్ హాత్వే అనే వస్త్ర తయారీ సంస్థపై పడింది. ఆ సంస్థ షేర్ 8 డాలర్ల కంటే తక్కువ విలువతో ట్రేడ్ అవ్వడం గమనించి, వాటిని కొనడం ప్రారంభించాడు. కొద్దికాలానికే బెర్క్‌షైర్ హాత్వే యొక్క అతిపెద్ద వాటాదారుడయ్యాడు. కొద్దీ కాలానికే బెర్క్‌షైర్ హాత్వే బఫెట్ వశమయ్యింది. ఆ తర్వాత  ఈ టెక్స్‌టైల్ వ్యాపారం బఫెట్'ను నిరాచపర్చినా, సరైన సమయంలో వాటి నిధులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం  ద్వారా విజయవంతమయ్యాడు.

1985 నాటికీ టెక్స్‌టైల్ వ్యాపారానికి ముగింపు చెప్పాడు. కాని బెర్క్‌షైర్ హాత్వే బ్రాండింగ్ వదువుకోలేదు. తర్వాత దశలో బెర్క్‌షైర్ హాత్వే పేరుతో చేసిన వ్యాపారాలు బఫెట్'ను ప్రపంచ కుబేరుడును చేసాయి. ఆ సంస్థ చైర్మనుగా, సీఈఓగా సుదీర్ఘకాలం వ్యవహరించారు. ఒమాహా కేంద్రంగా బెర్క్‌షైర్ హాత్వే అతిపెద్ద అమెరికన్ బహుళజాతి సమ్మేళన హోల్డింగ్ కంపెనీగా తీర్చదిద్దబడింది. అందుకే బఫెట్'ను ముద్దుగా ఒరాకిల్ ఆఫ్ ఒమాహా అంటారు.

బెర్క్‌షైర్ హాత్వే ప్రస్తుతం విభిన్నరంగాల్లో వ్యాపారాలు నిర్వర్తిస్తుంది. అందులో రియల్ ఎస్టేట్ & బీమా, యుటిలిటీస్, రెస్టారెంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, బొమ్మలు, మీడియా, ఆటోమోటివ్, క్రీడా వస్తువులు, వినియోగదారు ఉత్పత్తులు, ఇంటర్నెట్ వంటివి ఉన్నాయి.

వారెన్ బఫెట్ జీవితంలో కొన్ని సంక్షోభాలు & విమర్శలు

మదుపర్లకు బఫెట్ ఎప్పుడూ రెండు నియమాలు గుర్తుపెట్టుకోమని చెప్తూఉంటాడు. అందులో ఒకటి "స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవద్దు", రెండవది, మొదటి నియమాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇది వారెన్ బఫెట్'కు వర్తిస్తుంది. ఆయన జీవితంలో ఎప్పుడు ఎదుర్కొని సంక్షోభంను గ్రేట్ రిసెషన్ సమయంలో ఎదుర్కున్నాడు.

2007-2009 మధ్య తలెత్తిన అమెరికా రియల్ ఎస్టేట్ సంక్షోభం బెర్క్‌షైర్ హాత్వే పునాదులు పెకిలించింది. ఎప్పుడూ రాకెట్స్'లా దూసుకుపోయే బెర్క్‌షైర్ హాత్వే షేర్స్ నేల చూపులు చూశాయి. 70 శాతానికి పైగా ఆదాయం కొన్ని నెలలలో ఆవిరి అయిపోయింది. ఫోర్బ్స్ ప్రకారం, బఫ్ఫెట్ 2008/2009 సమయంలో 12 నెలల కాలంలో $25 బిలియన్లను కోల్పోయాడు.

ఈ సమయంలో బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడులు బఫెట్,ను రక్షించాయి. అదే సమయంలో యాహు విలువ మైక్రోసాఫ్టును అధిగమించడంతో ఆశ్చర్యంగా సంక్షోభ సమయంలో కూడా 2008లో బఫెట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఈ జాబితాలో గత 13 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్‌ రెండవ స్థానానికి పరిమితి కావాల్సి వచ్చింది.

2008 బెర్క్‌షైర్ హాత్వే సంక్షోభం ఎందరో మదుపర్లను వీధిన పడేసింది. వీటిలో పాటు మరెన్నో వివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ అవి ఆరోపణలు వరకే సరిపెట్టుకున్నయి.

టెక్నాలజీ స్టాక్‌లు ప్రజాదరణ పొందే వరకు బఫెట్ యొక్క స్టాక్ మార్కెట్ రహస్యం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ. 1990ల చివరలో టెక్నాలజీ స్టాక్స్‌లో అద్భుతమైన రన్-అప్‌లో ఉన్నప్పుడు బఫెట్ వాటికీ దూరంగా ఉన్నాడు. దీనితో వాల్ స్ట్రీట్ నిపుణుల ధిక్కారాన్ని పొందాడు. బఫెట్ పని అయిపోయిందని నిర్దారించారు.

డాట్‌కామ్ బుడగ పేలినప్పుడు సంభవించిన సాంకేతిక విధ్వంసం ఆ నిపుణులలో చాలా మందిని దివాలా తీసింది. ఆ సమయంలో బఫెట్ లాభాలు రెట్టింపు అయ్యాయి. అందుకే ఆయన 20వ శతాబ్దపు అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడు అయ్యాడు.

వారెన్ బఫెట్ పెళ్లి, పిల్లలు మరియు వ్యక్తిగత జీవితం

బఫెట్-ఫాక్ & కో.లో పనిచేస్తున్న సందర్భంలో పరిచయస్తురాలు అయినా సుసాన్ థాంప్సన్‌తో డేటింగ్ చేసాడు. ఇది కాస్త పెళ్లివరకు దారితీసింది. ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో 1952లో డూండీ ప్రెస్బిటేరియన్ చర్చిలో సుసాన్ థాంప్సన్‌ను వివాహం చేసుకున్నాడు.

వీరికి ముగ్గురు సంతానం. సుసాన్ ఆలిస్ బఫెట్, హోవార్డ్ గ్రాహం బఫెట్, పీటర్ బఫెట్. పెళ్ళైన కొత్తలో నెలకు 65 డాలర్లు చెల్లిస్తూ అద్దె అపార్టుమెంటులో ఉండేవారు. పిల్లలు పుట్టాక 31,500 డాలర్లు పెట్టి ఒమాహా, ఫర్నామ్ స్ట్రీట్‌లో ఐదు పడకగదుల ఇంటిని కొనుగోలు చేశాడు. ప్రపంచ కుబేరుడు అయినా బఫెట్ ఇప్పటికి అదే ఇంట్లో నివసిస్తున్నాడు.

బఫెట్ వ్యక్తిగత జీవితం చాల సాధారణమైనది. ప్రపంచ కుబేరుడైన,  ఆయనకు మధ్యతరగతి లైఫ్ స్టైల్'ను మాత్రమే ఇష్టపడతాడు. బఫెట్ భోజన ప్రియుడు. ఆయనకు ఫ్యామిలీ మరియు స్నేహితులే ప్రపంచం. బఫెట్'కు పెళ్లిపై బలమైన అభిప్రయాలు ఉన్నాయి. పెళ్లి వ్యక్తిగత జీవితాన్ని మార్చుతుందనేది ఆయన బలమైన నమ్మకం.

మనం ఎంపిక చేసుకునే జీవిత భాగస్వామి మరియు మన చుట్టూ ఉండే స్నేహితులే మన జయ అపజయాలను నిర్ణయిస్తారని నమ్ముతాడు. తన జీవితంలో సుసాన్ థాంప్సన్‌ ఆ మార్పును తీర్చుకొచ్చిందని, తాను లేకుంటే ఇన్ని విజయాలు సాధించేవాడిని కాదని బఫెట్ తరుసు చెప్తుంటాడు.

ఈ జంట 1977 నుండి విడాకులు కాకున్నా విడివిడిగా జీవించారు. 2004 లో సుసాన్ థాంప్సన్ మరణించిన తర్వాత రెండేళ్ళకి, 2006 లో 76 వయసులో తన చిరకాల శృంగార భాగస్వామి ఆస్ట్రిడ్ మెంక్స్‌'ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

వారెన్ బఫెట్'కు స్నేహితులు అంటే ప్రాణం. బఫెట్ స్నేహితుల జాబితా చాల పెద్దది. బెర్క్‌షైర్ హాత్వేలో సగం మంది బోర్డు సభ్యులలో ఆయన ప్రాణస్నేతులులే ఉన్నారు. తన వ్యాపార భాగస్వామీ చార్లీ ముంగెర్'తో గత 60 ఏళ్లుగా స్నేహం కొనసాగిస్తున్నాడు.

మరో కుబేరుడు బిల్ గేట్స్'తో బఫెట్'కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. రోజూ కలిసి బ్రిడ్జ్ ఆటను ఆస్వాదిస్తారు. అలానే గ్యారీ గ్రీన్‌ వంటి వ్యాపారవేత్తలతో బఫెట్'కు మంచి అనుబంధం ఉంది.

బఫెట్'కు ఫుట్‌బాల్‌ క్రీడ అంటే మహా ఇష్టం. వీలు దొరికినప్పుడంతా ఫుట్‌బాల్‌ మ్యాచులు చూసేందుకు వెళ్తుంటాడు. అలానే గోల్ఫ్‌లో కూడా బఫెట్'కు కొద్దిపాటి నైపుణ్యం ఉంది. అలానే మ్యూజిక్'ను ఇష్టపడతాడు. తన మొదటి ప్రియరాలకు ఉకులేలే ఇష్టమని తెలిసి, దాన్ని కొని మరీ నేర్చుకున్నాడు. ఈ ప్రేమకథ విఫలమైన, అతని సంగీత ఆసక్తి సుసాన్ థాంప్సన్'ను దగ్గర చేసింది. ఈ పరిచయం వారి వివాహానికి దారితీసింది.

వారెన్ బఫెట్ దాతృత్వం & రాజకీయాలు

బఫెట్ ప్రపంచ కుబేరుడుగా యెంత పాపులర్ అయ్యారో, పరోపకారిగా కూడా అంతే పాపులర్, ఒకొనొక సమయంలో ప్రపంచ అతిపెద్ద పరోపకారిగా కీర్తించబడ్డాడు. బఫ్ఫెట్ 2006లో మొదటి సారి తన సంపదలో 99% దాతృత్వానికి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 83 శాతం బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్'కి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఇది సుమారు 30 బిలియన్ డాలర్లకు సమానం. ఇది చరిత్రలో అతిపెద్ద స్వచ్ఛంద విరాళంగా నిలిచింది. 2009లో బిల్ గేట్స్‌తో కలిసి ది గివింగ్ ప్లెడ్జ్‌ని స్థాపించడంలో బఫెట్ చొరవతీసుకున్నారు. గివింగ్ ప్లెడ్జ్‌ ద్వారా ప్రపంచ బిలియనీర్లను దాతృత్వంలో భాగస్వామ్యం అయ్యేలా పేరేపించారు.

వారెన్ ధాతృత్వపు ప్రయాణంలో బఫ్ఫెట్ ఫౌండేషన్‌ కీలక భూమిక పోషించింది. దీని ద్వారా ఎన్నో స్వచ్చంద సంస్థలకు విరాళాలు అందించారు. 2022 లో  వాషింగ్టన్‌లోని న్యూక్లియర్ థ్రెట్ ఇనిషియేటివ్‌కు దాదాపు 50 మిలియన్ల డాలర్ల విరాళం ప్రకటించాడు.

తన స్నేహుతులు, కుటుంబ సభ్యలకు చెందిన స్వచ్చంద సంస్థలకు పెద్దమొత్తంలో ఎప్పటికప్పుడు మద్దతిస్తూ వస్తున్నారు. ఇందులో సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్, షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫెట్ ఫౌండేషన్, నో.వూఫౌండేషన్, లెటర్స్ ఫౌండేషన్ మరియు లెర్నింగ్ బై గివింగ్ ఫౌండేషన్‌ వంటివి ఉన్నాయి.

బఫెట్ 2006 లో కొత్తరకపు దాతృత్వానికి పునాదులు వేశారు. ఇందులో భాగంగా గర్ల్స్ ఇంక్ సంస్థకు విరాళాలు సేకరించేందుకు తన 2001 మోడల్ లింకన్ టౌన్ కారును ఈబైలో వేలకు ఉంచాడు. అలానే 2007లో గ్లైడ్ ఫౌండేషన్'కు విరాళాలు సేకరించేందుకు న్యూయార్క్‌లోని స్మిత్ మరియు వోలెన్స్కీ స్టీక్ హౌస్‌లో తనతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించేందుకు బీడ్'కు ఆహ్వానించాడు. ఈ సాంప్రదయం ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు.

వారెన్ బఫెట్ తన పిల్లల కోసం హస్తులు కూడబెట్టలేదు. వారు తమ జీవితంలో ఎదిగేందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులను మాత్రమే అందించాడు. తండ్రుల ఆస్తులపై బతికే వారసత్వాన్ని బఫెట్ ఏనాడూ సమర్ధించలేదు. తన మరణాంతరం కూడా తన ఆస్తులు దాతృత్వానికి ఉపాయోగపడేలా ఏర్పాట్లు చేసుకున్నాడు.

వారెన్ బఫెట్ ముందు నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వ్యాపారవేత్త కావడం వలన పరస్పర కలయికలు సాధారణమే అయినా, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ 2008లో ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి మద్దతు ఇచ్చాడు. చికాగోలో ఒబామా ప్రచారం కోసం ఆర్థిక సాయాన్ని కూడా అంచాడు. ఒబామా తీసుకువచ్చిన అమెరికా ఆర్థిక సంస్కరణల వెనుక బఫెట్ హస్తం ఉంది.

ఒబామా ప్రభుత్వం అమెరికన్లు అందరికి ఆరోగ్య భీమా కల్పించడంలో బఫెట్ పేరణ  ఉంది. 2010లో ఒబామా ప్రభుత్వం, అమెరికా అత్యున్నత గౌరవం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ అవార్డును బఫెట్'కు ప్రకటించింది. 2015 లో డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం బఫెట్ సహాయాన్ని అందించారు.

వారెన్ బఫెట్ కోసం మరికొన్ని

వారెన్  బఫెట్ వ్యక్తిగత జీవితం సంపూర్ణమైనది. ఆయన జీవితంలో ఏం చేయాలనుకున్నారో అదే చేసారు. ఏం సాధించాలనుకున్నారో అది సాధించారు. తాను ఎలా బతకాలని అనుకున్నాడో అలానే బతికాడు. ఒక వ్యక్తి జీవితంలో ఇంతకంటే సాధించేది ఏం ఉంటుంది. ఆయన ఒక సాంప్రదాయ పెట్టుబడిదారుడు కావొచ్చు.

ఆధునిక జనరేషన్'తో పోటీపడలేకపోవచ్చు, ఆయనకు తన పరపతిని బ్రాండింగ్ చేసుకోవడం రాకపోవచ్చు...కాని బఫెట్ అంటే ఈ ప్రపంచానికి ఎవరో తెలుసు. ఆయన సలహాల కోసం వేచి చూసేవారు, ఆయన మాట్లాడితే దాసోహమయ్యే వారు. ఆయనతో కలిసి భోజనం చేసేందుకు పోటీపడేవారు ఇప్పటికీ ఉన్నారు.

యూఎస్ టూడే నివేదిక ప్రకారం దాదాపు 50 కిపై పుస్తకాలు బఫ్ఫెట్ పేరుతో ప్రింట్‌ అయ్యి, అత్యధిక అమ్ముడవుతున్న పుస్తకాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఆయన క్రేజ్ ఇప్పటికి అలానే ఉంది. ఈ రోజుల్లో ఒక వ్యక్తి విజయం అంటే, అది అక్షరాలా ఆర్థిక విజయమే. అందుకే ఈ నాటి యువతకు, మీరు చేసే ప్రతి పనికి విలువకట్టండి అని చెప్తుంటాడు.

జీవితంలో ఎదిగేందుకు నిబద్దతతో కూడిన ఆర్థిక ప్రణాళిక, వ్యక్తిగత క్రమశిక్షణ తప్పనిసరని గుర్తుచేస్తాడు. అర్ధరాత్రి నిద్రపోయే సమయంలో కూడా మన డబ్బు, మనకోసం పనిచేయడమే నిజమైన ఆర్థిక స్వాతంత్ర అని సలహాయిస్తాడు..ఈ పాఠాలు మనకు ఏ యూనివర్సిటీలలో దొరకవు ..దీనికోసం మనం బఫెట్ యూనివర్సిటీలో చేరాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి...ప్రపంచ కుబేరుడు అయ్యేందుకు కాదు...క్రమశిక్షణతో కూడిన ఆర్థిక స్వాతంత్రం కోసం.

వారెన్ బఫెట్ బెస్ట్ కొటేషన్లు

“Rule No. 1 is never lose money. Rule No. 2 is never forget Rule No. 1.”

"Never invest in a business you cannot understand."

“Price is what you pay, value is what you get.”

“Risk comes from not knowing what you are doing.”

“The most important investment you can make is in yourself.”

“Never depend on a single income. Make an investment to create a second source.”

“It’s far better to buy a wonderful company at a fair price, than a fair company at a wonderful price.”

“I never attempt to make money on the stock market. I buy on the assumption that they could close the market the next day and not reopen it for five years."

"The stock market is designed to transfer money from the active to the patient.”

“The business schools reward difficult complex behavior more than simple behavior, but simple behavior is more effective.”

“You don’t need to be a rocket scientist. Investing is not a game where the guy with the 160 IQ beats the guy with 130 IQ.”

“No matter how great the talent or efforts, some things just take time. You can’t produce a baby in one month by getting nine women pregnant.”

“Forecasts may tell you a great deal about the forecaster; they tell you nothing about the future.”

Post Comment