తెలుగులో కరెంట్ అఫైర్స్ 12 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 12 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 12 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

Advertisement

స్కాట్లాండ్‌లో కొత్త ఫ్లయింగ్ డైనోసార్ శిలాజం

స్కాట్లాండ్‌ ద్విపంలో కొత్త ఫ్లయింగ్ డైనోసార్ శిలాజంను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శిలాజం మధ్య జురాసిక్ కాలంలో 166 నుండి 168 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించివున్నట్లు విశ్వసించబడే సియోప్టెరా ఎవాన్సే అనే పేరుగల ఒకే టెరోసార్ యొక్క అవశేషాలుగా పరిశోధికులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పరిశోధన వ్యాసం ఫిబ్రవరి 5న జర్నల్ ఆఫ్ వెర్టిబ్రేట్ పాలియోంటాలజీలో ప్రచురించబడింది.

టెరోసార్ అనేది డైనోసార్‌లకు దగ్గరి సంబంధం ఉన్న సరీసృపాలు. టెరోసార్ సాంకేతికంగా డైనోసార్‌లు కాదు. ఈ పరిశోధనకు నేచురల్ హిస్టరీ మ్యూజియం, యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ మరియు యూనివర్శిటీ ఆఫ్ లివర్‌పూల్ శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు.

సియోప్టెరా ఎవాన్సే యొక్క అసంపూర్ణ శిలాజ అవశేషాలు ఇదివరకే 2006లో ఐల్ ఆఫ్ స్కైలోని స్ట్రాథైర్డ్ ద్వీపకల్పంలో లోచ్ స్కావైగ్ తీరప్రాంతంలో ఒక చిన్న బీచ్‌లో కనుగొనబడినట్లు శాస్త్రవేత్తలు నివేదించారు. పరిశోధకుల నివేదిక ప్రకారం సియోప్టెరా ఎవాన్సే, డార్వినోప్టెరా అని పిలువబడే టెటోసార్ల సమూహం నుండి ఉద్బవించాయి. ఇవి ప్రధానంగా చైనా ప్రాంతంలో నివశించేవని నమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో ఈ జాతుల శిలాజాలు ఇంతకు ముందు కనుగొనబడ్డాయి.

అయితే స్కాట్లాండ్‌లో వీటిని కనుగొనడం వలన డార్వినోప్టెరా గతంలో అర్థం చేసుకున్న దానికంటే 25 మిలియన్ సంవత్సరాలు ఎక్కువ కాలం జీవించి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది ప్రారంభ జురాసిక్ కాలం నుండి తాజా జురాసిక్ వరకు జాతుల వైవిధ్యంపై అంతర్దృష్టిని ఇస్తుంది.

టెరోసార్ జాతులు ఎగరగలిగేలా పరిణామం చెందిన తొలి సకశేరుకాలలో ఒకటిగా ఈ కొత్త విశ్లేషణ సూచిస్తుంది. ఇవి అవియాలన్‌లతో పాటు నివసించిన జాతులుగా బావించబడుతున్నాయి. దీనితో డైనోసార్ జాతులు ఆధునిక పక్షులుగా పరిణామం చెందుతాయని నమ్ముతున్నారు.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ప్రసంగించిన తొలి పసిఫిక్ నాయకుడుగా జేమ్స్ మరాపే

పాపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరాపే ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన పసిఫిక్ ద్వీప దేశం యొక్క మొదటి నాయకుడుగా  అవతరించాడు. ఈ పసిఫిక్ దేశంతో చైనా భద్రతా చర్చలను నిలిపివేసే ప్రయత్నాల మధ్య ఈ ఆస్ట్రేలియా పర్యటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం పాపువా న్యూ గినియా ప్రధాన మంత్రి జేమ్స్ మరాపేకు రెడ్ కార్పెట్‌తో స్వాగతించింది. ఈ గౌరవం పొందిన మొదటి పసిఫిక్ నాయకుడుగా జేమ్స్ మరాపే నిలిచారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పసిఫిక్ దీవులలో చైనా తన ప్రభావాన్ని పెంచుతోంది. ఇది ఆస్ట్రేలియా మరియు పపువా న్యూ గినియా వంటి పసిఫిక్ దేశాల మధ్య భాగస్వామ్య ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. రెండు నెలల క్రితమే ఆస్ట్రేలియ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరియు పాపువా న్యూ గినియా ప్రధాని మరాపేలు ఒక భద్రత ఒప్పందంపై సంతకం చేశారు.

గత సంవత్సరం చైనా దాదాపు 10 పసిఫిక్‌ దేశాలతో విస్తృతమైన భద్రత మరియు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటన చైనా నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటున్న పసిఫిక్ ప్రాంతంపై ఆస్ట్రేలియా పునరుద్ధరించిన నిబద్ధతకు సంకేతంగా భావించబడుతుంది.

పాపువా న్యూ గినియాలో పోలీసు శిక్షణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా ఆ దేశం యొక్క అంతర్గత భద్రతకు మద్దతుగా ఆస్ట్రేలియా $100 మిలియన్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్రాంతంలో స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా యొక్క నిబద్ధతను ఇది ప్రదర్శిస్తుంది.

ఢిల్లీలో ఆది మహోత్సవ్ 2024 వేడుకలు ప్రారంభం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 10 ఫిబ్రవరి 2024న న్యూ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఆది మహోత్సవ్ 2024 వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశపు గిరిజన వారసత్వం యొక్క గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించే వార్షిక జాతీయ గిరిజన పండుగ. ఈ మహోత్సవం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడింది.

ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా 1,000 మంది గిరిజన కళాకారులు పాల్గొన్నారు. ఈ వేదిక ద్వారా వారు తమ సంప్రదాయ కళలు, హస్తకళలు, సహజ ఉత్పత్తులు మరియు వంటకాలను ప్రదర్శించారు. ఆది మహోత్సవం అనేది గిరిజన సంస్కృతి మరియు వారసత్వంపై అవగాహన పెంపొందించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది గిరిజన కళాకారులకు వారి నైపుణ్యాలను మరియు ఉత్పత్తులను విస్తృత ప్రేక్షకులకు ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందిస్తుంది. భారతదేశంలో 11 కోట్లకు పైగా గిరిజన జనాభా ఉంది.

ఇదే వేదిక ద్వారా గిరిజన వ్యవహారాల కేంద్ర మంత్రి అర్జున్ ముండా షెడ్యూల్డ్ తెగల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ (VCF-ST)ను ప్రారంభించారు. ఇది ఎస్టీ కమ్యూనిటీ ప్రజలలో వ్యవస్థాపకత మరియు స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. గిరిజన సమాజంలోని యువత కొత్త సంస్థలను స్థాపించి స్వావలంబన భారతదేశ నిర్మాణానికి సహాయపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం కింద గిరిజన వ్యవస్థాపకులకు రూ.10 లక్షల నుండి రూ.5 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు.

ప్యారేలాల్ శర్మకు లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డు

ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్యారేలాల్ శర్మను లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును గత 33 ఏళ్లుగా నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో భాగంగా సంగీత విద్వాంసులు ఎల్‌.సుబ్రమణ్యం, కవితా కృష్ణమూర్తి సుబ్రమణ్యంల చేతుల మీదుగా అందుకున్నారు.

83 ఏళ్ల ప్యారేలాల్‌ శర్మ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయినా పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. సంగీత కళకు ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు అందించబడింది.

లక్ష్మీనారాయణ అంతర్జాతీయ అవార్డు సంగీత ప్రపంచానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ అవార్డుకు వయోలిన్ మాస్ట్రో లక్ష్మీనారాయణ పేరు పెట్టారు. ఈ అవార్డు అనేక సంవత్సరాలుగా ప్రసిద్ధ సంగీతకారులకు అందించబడింది.

లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది భారతీయ మరియు అంతర్జాతీయ సంగీతాన్ని ప్రదర్శించే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఈ ఉత్సవం శాస్త్రీయ నుండి సమకాలీన వరకు మరియు భారతీయ నుండి అంతర్జాతీయ వరకు అనేక రకాల ప్రదర్శనలకు వేదిక అందిస్తుంది. ఈ సంగీత వేడుక గత 33 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నరేంద్ర కుమార్

ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ నూతన బ్రాండ్  అంబాసిడర్‌గా ఐఆర్ఎస్ అధికారి నరేంద్ర కుమార్ యాదవ్ నియమితులయ్యారు. దీనితో భారతదేశ చరిత్రలో ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన మొట్టమొదటి పౌర సేవకుడుగా నరేంద్ర యాదవ్ నిలిచాడు. నరేంద్ర కుమార్ ప్రస్తుతం జీఎస్టీ అదనపు డైరెక్టరుగా ఉన్నారు.

నరేంద్ర యాదవ్ 2009లో అతి పిన్న వయస్కుడైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా చరిత్ర సృష్టించాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో తన మొదటి-ప్రయత్నంలోనే విజయం సాధించిన ఘనతను దక్కించుకున్నాడు. ప్రజా సేవ పట్ల అంకితభావం, అభిరుచి మరియు అచంచలమైన నిబద్ధతకు పేరుగాంచిన నరేంద్ర యాదవ్ తన ప్రేరణాత్మక చర్యల ద్వారా సివిల్ సర్వెంట్ ఆశావహులకు మార్గదర్శకుడుగా ఉన్నాడు.

సివిల్ సర్వీస్‌లో తన ఆదర్శప్రాయమైన కెరీర్‌కు మించి, నరేంద్ర యాదవ్ ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ అంశాలలో కూడా ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. పోషకాహారం మరియు ఫిట్‌నెస్‌ అంశాల యందు ఆసక్తితో, సంపూర్ణ వెల్‌నెస్ పద్ధతులను అధ్యయనం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి తనను తాను అంకితం చేసుకున్నారు.

ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అతని నియామకం ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది, ఎందుకంటే నరేంద్ర యాదవ్ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పదవిని నిర్వహించబోతున్నా భారతదేశంలో మొట్టమొదటి పౌర సేవకుడుగా అవతరించాడు.

ఫిట్ ఇండియా ఉద్యమం 2019 ఆగస్టు 29 న ఖేల్ దివస్ నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఏటా ఖేల్ దివస్ జరుపుకుంటారు . ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమం, వయస్సు, నేపథ్యం లేదా సామర్థ్యంతో సంబంధం లేకుండా భారతీయులందరికీ ఫిట్‌నెస్‌ను రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మార్చడం దీని లక్ష్యం.

కార్గిల్‌లో డెడికేటెడ్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేసిన యూపీఎస్సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కార్గిల్ ప్రాంతంలోని సివిల్ సర్వెంట్ ఔత్సహికుల కోసం డెడికేటెడ్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సుదూర ప్రాంతాల నుండి యూపీఎస్సీ పరీక్షలకు హాజరైనప్పుడు ప్రయాణం మరియు లాజిస్టిక్స్ వంటి సవాళ్లను వీరు ఎదుర్కొంటున్నారు. కార్గిల్‌లోని యూపీఎస్సీ ఆశావాదుల నిరంతర అభ్యర్థనలకు ప్రతిస్పందనగా ఈ కేంద్రం స్థాపించబడింది.

ఈ ఏడాది మే 26న జరగనున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షల నుండి ఈ పరీక్ష కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ చర్య ఫ్రాంటియర్ జిల్లాలోని ఔత్సాహిక అభ్యర్థులలో ఉపశమనం మరియు ఉత్సాహాన్ని తెస్తుందని భావిస్తున్నారు. ఇది మారుమూల ప్రాంతాల్లోని ఔత్సాహికులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడం ద్వారా పౌర సేవ యొక్క వారి కలలను కొనసాగించడానికి వారికి న్యాయమైన వేదికను అందిస్తుంది.

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా సిక్కిం

సిక్కిం తన ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా అవతరించింది. ఫిబ్రవరి 9, 2024న రాష్ట్ర స్థాయి తాత్కాలిక ఉద్యోగుల సదస్సు సందర్భంగా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ ప్రకటన చేశారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2006న లేదా ఆ తర్వాత నియమించబడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

మార్చి 31, 1990కి ముందు నియమించబడిన ఉద్యోగులకు ఇప్పటికే వర్తించే సిక్కిం సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1990లోని నిబంధనల క్రింద బెనిఫిట్స్ అందజేస్తారు. ఈ చొరవ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన చర్యగా పరిగణించబడుతుంది.

2004లో ఓపీఎస్ స్థానంలో న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిస్ఎస్) వచ్చింది. ఇది మార్కెట్-లింక్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఉద్యోగుల సహకారాన్ని పెట్టుబడి పెడుతుంది. ఎన్‌పిస్ఎస్ పనితీరు మరియు గ్యారెంటీ రాబడులు లేకపోవడం గురించి ఆందోళనలను ఉటంకిస్తూ ఓపీఎస్ పునరుద్ధరించాలని భారతదేశం అంతటా ఉద్యోగుల నుండి డిమాండ్లు పెరుగుతున్నాయి. సిక్కిం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.

సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఉద్యోగ ఓటర్లను ఆకర్షించడానికి ఇది రాజకీయ ఎత్తుగడగా ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఓపీఎస్ పునరుద్ధరణ యొక్క ఆర్థిక చిక్కులు ఇంకా పూర్తిగా అంచనా వేయబడలేదు. అయితే కొంతమంది నిపుణులు ఓపీఎస్ యొక్క దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం గురించి ఆందోళనలను లేవనెత్తారు. ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని వీరు ఆందోళన చేస్తున్నారు.

8 మంది భారతీయ నావికాదళ అధికారులను విడుదల చేసిన ఖతార్

గూఢచర్య ఆరోపణలపై అరెస్ట్ చేసిన 8 మంది భారతీయ నావికాదళ అధికారులను ఖతార్ విడుదల చేసింది. జలాంతర్గామి కార్యక్రమానికి సంబంధించి గూఢచర్యం ఆరోపణలపై ఎనిమిది మంది భారతీయ నావికా అధికారులు అక్టోబర్ 2022 నుండి ఖతార్‌లో నిర్బంధించబడ్డారు. ఈ కేసులో అధికారులకు ఖతార్ కోర్టు తొలుత మరణశిక్ష విధించింది.

భారత్ నుండి రాజకీయ ఒత్తిడితో మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. అయితే భారత ప్రభుత్వ దౌత్యపరమైన చర్యల వలన వారిని ఫిబ్రవరి 12, 2024న ఇండియాకు అప్పజెప్పింది. ఈ అరెస్టులతో భారత్, ఖతార్ మధ్య కొంత కాలం దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖతార్ దిగొచ్చింది.

ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన కేసులో ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుంది. జలాంతర్గామి కార్యక్రమానికి సంబంధించి గూఢచర్యం ఆరోపణలపై దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది మాజీ భారతీయ నేవీ సిబ్బందిని ఖతార్‌లో 2022 అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన భారతదేశం మరియు ఖతార్ మధ్య దౌత్య సంబంధాలలో సానుకూల అభివృద్ధిని సూచిస్తుంది.

ఈ అధికారులు విడుదలకు ఖచ్చితమైన కారణం బహిరంగంగా తెలియనప్పటికీ, భారతదేశం యొక్క దౌత్య ప్రయత్నాలు దీనికి దోహదపడినట్లు తెలుస్తుంది. ఖతార్ ఎమిర్ తమీమ్ ఇబ్న్ హమద్ అల్ థానీ నుండి వ్యక్తిగత క్షమాపణ ఫలితంగా ఈ విడుదల జరిగిందని భారత ప్రకటన సూచిస్తుంది. అలానే వారు విడుదలైనప్పటికీ, వారు నిజంగా గూఢచర్యానికి పాల్పడ్డారా అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు.

అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఆస్ట్రేలియా సొంతం

దక్షిణాఫ్రికాలో జరిగిన 2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్పును ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో టైటిల్ విజయం. గతంలో 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన ఉదయ్ సహారన్ (397 పరుగులుతో, దక్షిణాఫ్రికాకు చెందిన క్వేనా మఫాకా (21 వికెట్లు) ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు.

అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్పును భారతదేశం రికార్డు స్థాయిలో ఐదు ప్రపంచ కప్‌లను గెలుచుకుంది. భారత్ తర్వాత ఆస్ట్రేలియా నాలుగు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు మరియు బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మరియు వెస్టిండీస్ ఒక్కోసారి గెలిచాయి.

ఇది అండర్-19 ప్రపంచ కప్ యొక్క పదిహేనవ ఎడిషన్. అలానే ఈ టోర్నమెంట్ దక్షిణాఫ్రికాలో జరగడం ఇది మూడవసారి. ఇది వాస్తవానికి శ్రీలంకలో జరగాలని నిర్ణయించబడింది, అయితే శ్రీలంక క్రికెట్‌ను ఐసీసీ సస్పెండ్ చేసిన తర్వాత నవంబర్ 2023లో దాని హోస్టింగ్ నిలిపివేయబడింది. దాని స్థానంలో దక్షిణాఫ్రికాకు ఆతిధ్య బాధ్యతలు ఇవ్వబడ్డాయి.

ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అనేది ఐసీసీచే నిర్వహించబడే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్. ఇది జాతీయ అండర్-19 జట్ల మధ్య నిర్వహించబడుతుంది. ఇది యూత్ క్రికెట్ ప్రపంచ కప్‌గా 1988లో మొదటిసారి నిర్వహించబడింది. తొలి టోర్నమెంటు తర్వాత 1998 వరకు మళ్లీ దీనిని నిర్వహించలేదు. 1998 నుండి ఇది ద్వైవార్షిక కార్యక్రమంగా నిర్వహించబడుతుంది.

Advertisement

Post Comment