తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 24, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.
9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 24న ప్రారంభించారు. ఈ 9 రైళ్లు 11 రాష్ట్రాలలోని మతపరమైన మరియు పర్యాటక ప్రాంతాల గుండా ప్రయాణించనున్నాయి. ఈ 9 కొత్త రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ రాష్ట్రాలకు కేటాయించారు.
ఈ 9 కొత్త రైళ్లతో కలుపుకుని దేశంలో మొత్తం 34 వందే భారత్ రైళ్లు ప్రారంభించబడ్డాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వే నిర్వహిస్తున్న సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు. వీటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి తయారు చేస్తుంది. ఇవి గంటకు గరిష్టంగా 160 కిమీ వేగంతో ప్రయాణించగలవు. కొత్తగా ప్రారంభించిన 9 కొత్త వందే భారత్ రైళ్లు జాబితా,
- ఉదయ్‌పూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- తిరునెల్వేలి-మధురై- చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- విజయవాడ - చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పాట్నా - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- రూర్కెలా - భువనేశ్వర్ - పూరివందే భారత్ ఎక్స్‌ప్రెస్
- రాంచీ - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
హైపర్‌టెన్షన్ ప్రభావాలపై నివేదిక విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిక రక్తపోటు యొక్క వినాశకరమైన ప్రపంచ ప్రభావంపై తన మొట్టమొదటి నివేదికను విడుదల చేసింది. "గ్లోబల్ రిపోర్ట్ ఆన్ హైపర్‌టెన్షన్" అనే ఈ నివేదిక ప్రకారం, ప్రతి 3 మందిలో ఒకరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నాట్లు తెలిపింది. అలానే హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న ప్రతి 5 మందిలో 4 మందికి తగిన చికిత్స అందించబడటం లేదని ఈ నివేదిక చూపిస్తుంది, అయితే దేశాలు కవరేజీని పెంచగలిగితే, 2023 మరియు 2050 మధ్య 76 మిలియన్ల మరణాలను నివారించవచ్చు అని ఈ నివేదిక తెలుపుతుంది.
అధిక రక్తపోటు ఒక ప్రాణాంతక పరిస్థితి. ఇది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాలు దెబ్బతినడం మరియు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. హైపర్‌టెన్షన్‌తో జీవిస్తున్న వారి సంఖ్య 1990 మరియు 2019 మధ్య 650 మిలియన్ల నుండి 1.3 బిలియన్లకు రెట్టింపు అయినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు ఉన్నవారిలో దాదాపు సగం మందికి ప్రస్తుతం వారి పరిస్థితి గురించి తెలియదు పేర్కొంది. అధిక రక్తపోటు ఉన్న పెద్దలలో మూడొంతుల కంటే ఎక్కువ మంది తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారని నివేదించింది.
వృద్ధాప్యం మరియు వంశపర్యంగా అధిక రక్తపోటును కలిగి ఉండే ప్రమాదాన్ని పెంచుతాయని, అయితే అధిక ఉప్పు ఆహారం తినడం, శారీరకంగా చురుకుగా ఉండకపోవడం మరియు ఎక్కువ మద్యం సేవించడం వంటి సవరించదగిన ప్రమాద కారకాలు కూడా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి తెలిపింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగాకు మానేయడం మరియు మరింత చురుకుగా ఉండటం వంటి జీవనశైలి మార్పులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రపంచ హైపర్‌టెన్షన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ చర్య తీసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ నివేదిక పిలుపునిచ్చింది. దేశాలు సమగ్ర రక్తపోటు నివారణ మరియు నియంత్రణ కార్యక్రమాలను అమలు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. ఈ కార్యక్రమాలు హైపర్‌టెన్షన్‌పై అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం మరియు ప్రతి ఒక్కరికీ సరసమైన మరియు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల పనితీరుపై 16వ నివేదిక
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల పనితీరుపై 16వ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు పరిష్కరించిన 1,21,004 ఫిర్యాదుల సరళిని నివేదించింది. 2023 సంవత్సరంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో సగటు ఫిర్యాదుల పరిష్కార సమయం జనవరి నుండి ఆగస్టు వరకు 19 రోజులు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఫిర్యాదుల పరిష్కార సమయానికి సంబంధించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐదు మంత్రిత్వ శాఖలు/విభాగాలలో రైల్వే మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వినియోగదారుల వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉండగా ఫిర్యాదుల పరిష్కార సమయం పరంగా దిగువన ఉన్న ఐదు పనితీరు మంత్రిత్వ శాఖలు/విభాగాలలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి మొదటి ఐదు స్థానాలలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంమీద, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు బాగా పనిచేస్తున్నాయని నివేదిక సూచిస్తుంది. అయినప్పటికీ, పబ్లిక్ గ్రీవెన్స్ అప్పీళ్ల పెండింగ్‌ను తగ్గించే విషయంలో ఇంకా మెరుగుదలకు అవకాశం ఉందని తెలిపింది.
పీఎం-కిసాన్ పథకం కోసం ఎఐ చాట్‌బాట్ ప్రారంభం
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎఐ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రారంభించారు. ఈ చాట్‌బాట్ రైతులకు స్కీమ్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు ఫిర్యాదులను పరిష్కరించే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రూపొందించబడింది.
ఈ చాట్‌బాట్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, ఒడియా మరియు తమిళంలో అందుబాటులో ఉంది. త్వరలో భారతదేశంలోని షెడ్యూల్ చేసిన మొత్తం 22 భాషలలో అందుబాటులో ఉంటుంది. దీనిని పీఎం కిసాన్ మొబైల్ యాప్ లేదా పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. రైతులు తమ దరఖాస్తు స్థితి, చెల్లింపు వివరాలు, అనర్హత స్థితి మరియు ఇతర స్కీమ్ సంబంధిత అప్‌డేట్‌ల గురించి సమాచారాన్ని పొందడానికి ఈ చాట్‌బాట్‌ను ఉపయోగించవచ్చు. ఇది ఫిర్యాదులను ఫైల్ చేయడానికి మరియు వారి స్థితిని ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.