కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | ప్రభుత్వ పథకాలు & పాలసీలు
Magazine 2022

కరెంటు అఫైర్స్ – జూన్ 2022 | ప్రభుత్వ పథకాలు & పాలసీలు

ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌తో 'e-సంజీవని' అనుసంధానం

నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ప్రభుత్వం యొక్క 'ఈసంజీవని' టెలిమెడిసిన్ ప్లాట్‌ఫారమ్'ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌తో అనుసంధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అనుసంధానం ద్వారా  ప్రస్తుత ఈసంజీవని వినియోగదారులు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)ని సులభంగా రూపొందించుకోవడానికి మరియు ప్రిస్క్రిప్షన్‌లు, ల్యాబ్ రిపోర్ట్‌ల వంటి వారి ఆరోగ్య రికార్డులను లింక్ చేయడం వంటివి సులభతరం కానున్నట్లు వెల్లడించింది.

ఢిల్లీ హరిజన్ కాలనీలు & వీధులకు బాబాసాహెబ్ పేరు

ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ ఢిల్లీ పరిధిలో అన్ని హరిజన్ వీధులు మరియు కాలనీలకు పేరు మార్చే ప్రతిపాదనను అసెంబ్లీలో సమర్పించారు. ప్రస్తుత హరిజన్ పేరుతో ఉన్న కాలనీలు, బస్తీలు, మొహల్లాలు మరియు వీధులన్నింటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టనున్నారు.

“హర్ ఘర్ దస్తక్ 2.0” ప్రచార కార్యక్రమం ప్రారంభం

నవంబర్ 2021లో ప్రారంభించబడిన “హర్‌ ఘర్‌ దస్తక్ ప్రచార” కార్యక్రమం యొక్క 2.0 ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని వయసుల వారికి కోవిడ్-19 టీకాలను అందిస్తుంది. ఈ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగనుంది. 2.0 ప్రచార కార్యక్రంను కోవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ అరోరా ప్రారంభించారు.

ఢిల్లీలో నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం

కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా, ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌టిఆర్‌ఐ)ని ప్రారంభించారు. ఇది అట్టడుగు స్థాయి వరకు గిరిజన జనాభా కోసం పథకాలు రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాలు మరియు విధానాలు రూపొందించడం మరియు వాటి ఫలితాల ఆధారిత అమలకు కృషి చేయనుంది. ఈ కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా కూడా పాల్గున్నారు.

క్రెడిట్ లింక్డ్ లోన్‌ల కోసం 'జన్ సమర్థ్ పోర్టల్' ప్రారంభం

ప్రభుత్వ క్రెడిట్ పథకాలను అనుసంధానించే లక్ష్యంతో 'జన్ సమర్థ్ పోర్టల్' అలానే వన్-స్టాప్ డిజిటల్ ప్లాటుఫామ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ క్రెడిట్ ప్రయోజనాలను సులభంగా లబ్ధిదారులకు చేరువయ్యేలా చేయనున్నారు.

'బీచ్ విజిల్ యాప్'ను ప్రారంభించిన గోవా సీఎం

గోవా బీచ్‌లపై నిఘా ఉంచేందుకు, పర్యటకులకు మరింత భద్రత కల్పించేందుకు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ 'బీచ్ విజిల్ యాప్'ను ప్రవేశపెట్టారు. దీని గోవా ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.

రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో వివిధ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానించడం కోసం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడిన వివిధ అవార్డులకు వ్యక్తులు లేదా సంస్థలను నామినేట్ చేయడానికి పౌరులకు సులభతరం చేయనుంది.

ఆంధ్రప్రదేశ్'లో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అందజేస్తారు. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్ యందు నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఎనిమిది జిల్లాల రైతులకు సుమారు1200 ట్రాక్టర్లు, 20 కంబైన్డ్ హార్వెస్టర్లను ( వ్యవసాయ పనిముట్లు ) అందజేశారు.

రైతుల కోసం 'ఫ్రూట్స్' సాఫ్ట్‌వేర్‌ ప్రారంభించిన కర్ణాటక

రైతులు కోసం కర్ణాటక ప్రభుత్వం ' ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ & యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్'  (FRUITS) పేరుతో నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది. ఈ సాఫ్ట్‌వేర్‌, కర్ణాటక ప్రభుత్వం అందించే అన్ని రకాల రైతు పథకాలను ఒకే వేదిక ద్వారా యాక్సిస్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆధార్ ధ్రువీకరణ ఆధారిత ఈ సాఫ్ట్‌వేర్‌, కర్నాటక యొక్క ల్యాండ్ డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ సహాయంతో కలిసి రైతులకు సులభతర సేవలు అందించనుంది.

తమిళనాడులో ఎన్నుమ్ ఎజుతుమ్ మిషన్ ప్రారంభం

ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అభ్యాస అంతరాన్ని పరిష్కరించడం కోసం మరియు రాష్ట్రంలో అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించడం కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నుమ్ ఎజుతుమ్ మిషన్‌ను ప్రారంభించింది.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించిన ఈ పథకం ద్వారా 2025 నాటికీ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల నుండి 1 నుండి 3 తరగతుల విద్యార్థులను కవర్ చేస్తుంది. 8 ఏళ్ళ లోపు పాఠశాల విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టుల యందు ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించనున్నారు.

'బాలికా పంచాయితీ' ప్రారంభించిన తొలి రాష్ట్రంగా గుజరాత్

దేశంలో బాలికా పంచాయితీని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. బాలికా పంచాయితీల స్థాపన ద్వారా గుజరాత్‌లో బాలికా శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా, బాల్య వివాహాలు రూపుమాపడం, బాలిక విద్యను మెరుగుపరచడం వంటి లక్ష్యాలను సాదించనున్నారు.

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలలో పాల్గొనే ఆడపిల్లలు తమ నాయకుడికి ఓటు వేయడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ ఆకాంక్షలను, అవసరాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు. కచ్ జిల్లాలోని పునారియా పంచాయతీకి చెందిన బాలికా సర్పంచ్ గర్వా బటి, బాలికా పంచాయితీ యొక్క ప్రయోజనాలను వివరిస్తూ, సమాజం మరియు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు బాలికలను ప్రోత్సహిస్తున్నారు.

Post Comment