Advertisement
తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ నవంబర్ 11, 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి), శ్రీలంక క్రికెట్ ఐసిసి సభ్యత్వాన్ని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలనలో ప్రభుత్వ లేదా రాజకీయ జోక్యం కారణంగా తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రపంచ కప్పులో తమ జాతీయ జట్టు ప్రదర్శన బాగులేదనే కారణంతో శ్రీలంక క్రికెట్ బోర్డును తొలగించి, అర్జున రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమించింది.

ఈ చర్య ఐసీసీ సభ్యునిగా శ్రీలంక క్రికెట్ బోర్డు యొక్క బాధ్యతలను ఉల్లంఘించినట్లు ఐసీసీ నిర్ధారించింది, ప్రత్యేకించి దాని వ్యవహారాలను స్వయంప్రతిపత్తిగా మరియు ప్రభుత్వ జోక్యం లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఈ సస్పెన్షన్‌తో శ్రీలంక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు మరియు ఈవెంట్‌లలో పాల్గొనకుండా నిషేధించబడుతుంది. అయితే నిర్ణీత సమయంలో పరిస్థితిని సమీక్షించి, సస్పెన్షన్‌ను ఎత్తివేసే పరిస్థితులపై నిర్ణయం తీసుకుంటామని ఐసిసి పేర్కొంది.

సుప్రీంకోర్టులో మిట్టి కేఫ్‌ను ప్రారంభించిన సీజేఐ డీవై చంద్రచూడ్

భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ నవంబర్ 10న సుప్రీంకోర్టు కాంప్లెక్స్‌లో 'మిట్టి కేఫ్'ని ప్రారంభించారు. మిట్టి కేఫ్ అనేది శారీరక మరియు మేధో వైకల్యాలు ఉన్న వ్యక్తులచే నిర్వహించబడే లాభాపేక్ష లేని కేఫ్‌ల గొలుసు. శారీరక, మేధో మరియు మానసిక వైకల్యాలు ఉన్న పెద్దలకు మరియు ఇతర బలహీన వర్గాల వ్యక్తులకు ఆర్థిక స్వాతంత్రం మరియు గౌరవం అందించేందుకు ఇది పనిచేస్తుంది. కోవిడ్ 19 సమయంలో ఈ కేఫ్ సభ్యులు 6 మిలియన్ల మందికి భోజనాన్ని అందించారు.

సాంప్రదాయ సాయుధ ఒప్పందం నుండి వైదొలిగిన రష్యా

నాటో యొక్క విస్తరణ సహకారానికి అవరోధంగా ఉందని పేర్కొంటూ రష్యా అధికారికంగా యూరప్‌లోని సాంప్రదాయ ఆయుధాల వినియోగాన్ని పరిమితం చేసే అంతర్జాతీయ భద్రతా ఒప్పందం (సీఎఫ్ఈ) నుండి నవంబర్ 7న వైదొలిగింది. రష్యా ఇటీవలే తమ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ (సిటీబీటీ)ని రద్దు చేయడంతో పాటుగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి 2007లో రష్యా తన భాగస్వామ్యాన్ని సీఎఫ్ఈలో నిలిపివేసింది, నాటో యొక్క తూర్పువైపు విస్తరణకు సంబంధించిన ఆందోళనలతో ఈ నిర్ణయం తీసుకుంది. 2015లో రష్యా అధికారికంగా ఈ ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని పూర్తిగా నిలిపివేసింది. 2023 నవంబర్ 7న ఈ ఒప్పందం నుండి అధికారకంగా వైదొలిగింది.

ఐరోపాలో సాంప్రదాయ సాయుధ దళాలపై ఒప్పందం బెర్లిన్ గోడ పతనం తర్వాత 1990లో సంతకం చేయబడింది. ఈ ఒప్పందం నాటో మరియు అప్పటి-వార్సా ఒప్పంద దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇది ఒక ప్రధాన అడుగుగా పరిగణించబడింది. ఐరోపాలో ప్రతి దేశం మోహరించే ట్యాంకులు, సాయుధ సిబ్బంది వాహకాలు, ఫిరంగి మరియు యుద్ధ విమానాల సంఖ్యపై ఈ ఒప్పందం పరిమితులను విధించింది. ఈ ఒప్పందంపై 22 దేశాలు నవంబర్ 19, 1990న పారిస్‌లో సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం పై సంతకాలు చేసిన 16 నాటో దేశాలలో యునైటెడ్ స్టేట్స్, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, స్పెయిన్, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు బెల్జియం ఉన్నాయి. అలానే సంతకం చేసిన ఆరు వార్సా ఒప్పంద దేశాలలో బల్గేరియా, చెకోస్లోవేకియా, హంగేరీ, పోలాండ్, రొమేనియా మరియు సోవియట్ యూనియన్ (రష్యా మిత్ర దేశాలు) ఉన్నాయి.

సీఎఫ్ఈ ఒప్పందం నుండి రష్యా అధికారికంగా వైదొలగడం యూరోపియన్ భద్రతకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఈ ఒప్పందం యూరప్‌లో ఆయుధాల నియంత్రణలో కీలక స్తంభంగా పరిగణించబడింది. ఈ ఉపసంహరణ రష్యా పశ్చిమ దేశాల నుండి పెరుగుతున్న ఒంటరితనానికి మరింత సంకేతం.

రైట్ టు లీగల్ ఎయిడ్ అవగాహనా కార్యక్రమం ప్రారంభించిన సీజేఐ చంద్రచూడ్

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నవంబర్ 9న రైట్ టు లీగల్ ఎయిడ్ అనే అవగాహనా కార్యక్రమంను మరియు అప్‌గ్రేడ్ చేసిన నల్సా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో అద్భుతమైన చట్టాలు ఉన్నాయని, అయితే ప్రజాస్వామ్యం యొక్క పరివర్తన సామర్థ్యాన్ని ఉపయోగించి ప్రజలకు హక్కులను సాధించడం నిజమైన సవాలు అని అన్నారు.

న్యూఢిల్లీలో న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో చంద్రచూడ్ ప్రసంగిస్తూ, 'న్యాయ సహాయం పొందే హక్కు' రాజ్యాంగం ఆవిర్భవించినప్పుడు ఇవ్వలేదని, న్యాయ సహాయ ఉద్యమం తర్వాత ఆర్టికల్ 39A అమలులోకి వచ్చిందని అన్నారు. లింగం, కులం, వైకల్యం లేదా హింసకు గురైన వారిని అణగదొక్కడం వంటి కారణాల వల్ల చాలా తరచుగా హక్కుల సాధనకు అడ్డంకిగా మారుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డిసెంబరు 1న ప్రారంభం కానున్న "విధాన్ సే సమాధాన్" అనే చట్టపరమైన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం న్యాయ వ్యవస్థ మరియు సామాన్య ప్రజల మధ్య ఉన్న అంతరాన్నితగ్గించేందుకు రూపొందించబడింది. ఈ కార్యక్రమం మొదటి దశ 11 రాష్ట్రాల్లో డిసెంబర్ 1 నుండి మార్చి 31, 2024 వరకు కొనసాగుతుంది. రెండవ దశ ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 వరకు నిర్వహిస్తారు.

ఇదే వేదికలో చంద్రచూడ్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) హెల్ప్‌లైన్ నంబర్ 15100 మరియు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీబీ) యొక్క మొబైల్ అప్లికేషన్ "హర్ లీగల్ గైడ్" (అప్‌గ్రేడ్ వెర్షన్‌) కూడా ప్రారంభించారు. ఈ అప్లికేషన్ ఒకే వేదికపై మహిళలకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన మొత్తం సమాచారం అందిస్తుంది.

నేరాలను ఎదుర్కోవడానికి చేతులు కలిపిన ఇండియా & నేపాల్ సరిహద్దు దళాలు

భారతదేశం మరియు నేపాల్ సరిహద్దు దళాలు, సరిహద్దు నేరాలను అరికట్టడం, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై దృష్టి సారించడం కోసం చేతులు కలిపాయి. ఇరుదేశాల సరిహద్దు వెంబడి ద్వైపాక్షిక భద్రతా ప్రయత్నాలను బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి. నవంబర్ 9న న్యూఢిల్లీలో నిర్వహించిన సశాస్త్ర సీమా బల్ ఆఫ్ ఇండియా మరియు నేపాల్ సాయుధ పోలీసు దళం యొక్క ఏడవ వార్షిక సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సమావేశంలో భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై దృష్టి సారించి విస్తృత చర్చలు జరిగాయి. సమన్వయం మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి అదనపు చర్యలను అమలు చేయాలని ఇరుపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. సశాస్త్ర సీమా బల్ మరియు సాయుధ పోలీసు దళం రెండింటిచే ఏర్పాటు చేయబడిన హెల్ప్ డెస్క్‌లు ఇండో-నేపాల్ సరిహద్దులోని ప్రధాన రవాణా కేంద్రాలలో, ముఖ్యంగా పండుగ సీజన్లలో రెండు దేశాల పౌరుల తరలింపును సులభతరం చేయడానికి పనిచేస్తాయి. తదుపరి కో-ఆర్డినేషన్ సమావేశం వచ్చే ఏడాది నేపాల్‌లో జరగనుంది.

పుసా-2090 వరి రకాలను అభివృద్ధి చేసిన ఐఎఆర్ఐ

ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పుసా-2090 అనే అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాన్ని అభివృద్ధి చేసింది. ఇది ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో వరి పొదలను కాల్చడం మరియు వాయు కాలుష్యం సవాళ్ల ముప్పును ఎదుర్కోవడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం సాగు చేస్తున్న భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ యొక్క పూసా-44 వరి రకం సాధారణంగా జూన్‌లో నాట్లు వేసిన తర్వాత పంట చేతికి వచ్చేసరికి అక్టోబరు చివరి పడుతుంది. దీంతో రైతులు తదుపరి గోధుమ పంటను విత్తేందుకు పొలాలను సిద్ధం చేసుకునేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే మిగులుతుంది. అందువల్ల, వారు వరి పొట్టను కాల్చడానికి ఆశ్రయిస్తున్నారు. దీని కారణంగా ఢిల్లీ, చండీఘర్ రాష్ట్రాలలో అధిక వాయు కాలుష్యానికి దారి తీస్తుంది.

ఐఎఆర్ఐ ఆవిష్కరించిన పుసా-2090 కొత్త వరి రకం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పూసా-44కి మెరుగైన వెర్షన్. ఇది పూసా-44తో పోలిస్తే 120 నుండి 125 రోజులలో పరిపక్వం చెందుతుంది. ఇది పూసా 44 యొక్క 155 నుండి 160 రోజుల పరిపక్వ నిడివి కంటే 30 రోజులు తక్కువ ఉంది. కావున ఈ కొత్త వరి రకం రైతులకు తమ పొలాలను తదుపరి పంటకు సిద్ధం చేసుకోవడానికి అదనపు సమయం ఇస్తుంది. తద్వారా వరి పొట్టను కాల్చే ప్రక్రియ నుండి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యా సమస్యకు కొద్దిగా ఉపశమనం కల్గిస్తుంది.

పూసా 2090 అనేది జపోనికా రైస్ లైన్ అయిన CB-501 వరి రకం. ఇది పుసా-44కు మెరుగైన వెర్షన్‌గా అభివృద్ధి చేయబడింది. ఈ కొత్త రకం తెగుళ్లు మరియు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది మెకానికల్ హార్వెస్టింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఐఎఆర్ఐ ఢిల్లీ మరియు ఒడిశాలో పూసా 2090 యొక్క ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించింది, ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ రకం హెక్టారుకు సగటున 45-50 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చినట్లు నివేదించింది.

65% రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన బీహార్ అసెంబ్లీ

షెడ్యూల్డ్ కులాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా పెంపునకు సంబంధించిన సవరణ బిల్లును బీహార్ అసెంబ్లీ నవంబర్ 9న ఏకగ్రీవంగా ఆమోదించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీ మరియు ఈబీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను 50% నుండి 65%కి పెంచడానికి సంబంధించిన సవరణ బిల్లు ప్రవేశపెట్టబడింది.

బీహార్ ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన కుల ఆధారిత సర్వే 2022 విడుదలైన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం వారి జనాభా పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలు, ఈబీసీలు మరియు వెనుకబడిన కులాల రిజర్వేషన్ కోటాను పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త సవరణ బిల్లులో బీసీలకు 18 శాతం, ఈబీసీలకు 25 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 2 శాతం రిజర్వేషన్ల కోటా నమూనాను ప్రతిపాదించింది.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న జనరల్ కేటగిరీలో పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను యెదాతదంగా కొనసాగిచింది. దీనితో మొత్తం రిజర్వేషన్ కోటా పరిమితి 75 శాతంకు చేరుకుంది. మిగతా 25 శాతం ఆన్ రిజర్వ్ కోటాగా ఉంచబడింది. ఈ ఎస్సీ, ఎస్టీలు, ఈబీసీలు, ఇతర బీసీల రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణ బిల్లుకు ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు పలికింది.

Post Comment