January 20, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.
సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్‌గా దల్జీత్ సింగ్ చౌదరి
సశాస్త్ర సీమా బల్ నూతన డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. దల్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. ఆయన ఈ హోదాలో నవంబర్ 30, 2025 వరకు అంటే అతని పదవీ విరమణ తేదీ వరకు సేవలు అందిస్తారు. ఈ నెల ప్రారంభంలో మాజీ చీఫ్ రష్మీ శుక్లా మహారాష్ట్ర డిజిపిగా నియమితులైన తర్వాత నుండి ఎస్‌ఎస్‌బి డీజీ పోస్ట్ ఖాళీగా ఉంది.
సశాస్త్ర సీమా బల్ అనేది నేపాల్ మరియు భూటాన్‌లతో సరిహద్దుల వెంబడి మోహరించిన భారతదేశ సరిహద్దు రక్షణ దళం. ఇది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న ఏడు కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. దీనిని 1963లో ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
- సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ : దల్జీత్ సింగ్ చౌదరి
- ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ : రాహుల్ రస్గోత్రా
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ : అనిష్ దయాల్ సింగ్
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీ : ఓం ప్రకాష్ సింగ్
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ : నితిన్ అగర్వాల్
- అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ : చంద్రన్ నాయర్
- నేషనల్ సెక్యూరిటీ గార్డ్ : ఎంఎ గణపతి
గూగుల్ పే & ఇండియా ఎన్‌పిసిఐ మధ్య ఎంఒయు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పరిధిని భారతదేశం దాటి విస్తరించేందుకు గూగుల్ పే ఇండియా మరియు ఎన్‌పిసిఐ ఇంటర్నేషనల్ జనవరి 17, 2024న ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశాయి. విదేశాలలో ఉన్న భారతీయ ప్రయాణికుల కోసం యూపీఐ డిజిటల్ లావాదేవీలు సులభతరం చేయడం ఈ ఎంఓయూ లక్ష్యం.
ఈ చర్య విదేశీ వ్యాపారులు భారతీయ కస్టమర్లను యాక్సెస్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుందని గూగుల్ పే తెలిపింది. అటువంటి కస్టమర్‌లు విదేశీ కరెన్సీ, క్రెడిట్ లేదా ఫారెక్స్ కార్డ్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా భారతదేశం నుండి యూపీఐ-ఆధారిత యాప్‌లను ఉపయోగించి చెల్లింపులు చేసేందుకు అవకాశం లభిస్తుంది.
ఎన్‌పిసిఐ గత జూలై 2023లో కూడా ఫ్రాన్స్‌కు చెందిన లైరాతో ఇలాంటి ఎంఓయూ పైనే సంతకం చేసింది. ఇది యూరోపియన్ దేశలలో యూపీఐ మరియు రూపే కార్డ్‌ల చెల్లింపులను అందుబాటులోకి తెస్తుంది. అలానే భూటాన్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు కెనడా దేశాలతో కూడా ఇప్పటికే యూపీఐ చెల్లింపు ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.
భారతీయ బ్యాంకులు అయిన యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ యాప్‌ల ద్వారా అంతర్జాతీయ యూపీఐ లావాదేవీలు అందుబాటులోకి తెచ్చాయి.
ఎన్‌పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. ఇది ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల విస్తరణపై దృష్టి సారిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో రిటైల్ చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థలను నిర్వహించే సంస్థ. భారతదేశంలో పటిష్టమైన చెల్లింపు & సెటిల్‌మెంట్ మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం దీనిని 2008లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది.
బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా జకోవిచ్
ఎన్‌బిఎ స్టార్ నికోలా జోకిక్‌ను అధిగమించి నొవాక్ జొకోవిచ్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. బల్గేరియన్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన వార్షిక పోల్ ద్వారా ఈ విజేతను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది మొత్తం 58 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనగా జొకోవిచ్ అత్యధిక ఓటింగ్ పొందాడు. 36 ఏళ్ల జొకోవిచ్ 2023లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకోవడంతో పాటుగా, ప్రపంచ అత్యధిక టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ (24 టైటిల్స్) విజేతగా నిలిచాడు.
బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అనేది బాల్కన్ ప్రాంతానికి చెందిన అత్యుత్తమ అథ్లెట్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక వార్షిక అవార్డు. బల్గేరియన్ టెలిగ్రాఫ్ ఏజెన్సీ ఈ అవార్డును అందిస్తుంది. మొదటి బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 1973 లో ఇవ్వబడింది. దీనిని బల్గేరియన్ స్ప్రింటర్ మరియు మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన స్వెత్లా జ్లాటేవా గెలుచుకున్నారు. సెర్బియా టెన్నిస్ ఆటగాడు నోవాక్ జొకోవిచ్ అత్యధిక అవార్డులను 8 సార్లు గెలుచుకున్నాడు, జొకోవిచ్ 2011 నుండి 2015 వరకు మరియు 2019, 2021, 2023 ఏడాదిలో ఈ అవార్డును గెలుచుకున్నాడు.
బాల్కన్ ప్రాంతం అనేది ఆగ్నేయ ఐరోపాలోని ఒక భౌగోళిక ప్రాంతం. బల్గేరియా అంతటా విస్తరించి ఉన్న బాల్కన్ పర్వతాల నుండి ఈ ప్రాంతంకు ఆ పేరు వచ్చింది. బాల్కన్ ప్రాంతంలో రోమానియా, బల్గేరియా, గ్రీస్, అల్బేనియా, మాసిడోనియా, క్రొయేషియా, టర్కీ, బోస్నియా-హెర్జెగోవినా, స్లోవేనియా, సెర్బియా మరియు మోంటెనెగ్రో వంటి దేశాలు ఉన్నాయి. యూరోపియన్ టర్కీ మరియు క్రొయేషియా మరియు సెర్బియాలు ఇందులో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి.
గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్ 2024లో భారతదేశంకు నాల్గొవ స్థానం
జనవరి 2024లో విడుదల చేసిన తాజా గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బలమైన మిలిటరీల జాబితాలో భారతదేశం మునపటి 4వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ 145 దేశాల ర్యాంకింగులో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది, రష్యా మరియు చైనా వరుసగా రెండు మరియు మూడవ స్థానాల్లో ఉన్నాయి. 2006 నుండి భారతదేశం తన స్థిరమైన సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ తన నాల్గవ స్థానాన్ని కొనసాగిస్తుంది.
గ్లోబల్ ఫైర్‌పవర్ (జిఎఫ్‌పి) ర్యాంకింగ్ ప్రపంచ దేశాలకు సంబందించిన త్రివిధ దళాల సైనిక శక్తి, ఆయుధాలు, ఆర్థిక అంశాలు, లాజిస్టిక్స్ మరియు భౌగోళికం వంటి 60 పైగా అంశాల ఆధారంగా సైనిక సామర్థ్యాలను అంచనా వేస్తుంది. దీని ద్వారా సంయుక్త పవర్‌ఇండెక్స్ స్కోర్ రూపొందిస్తుంది. ఈ సంయుక్త పవర్‌ఇండెక్స్ స్కోర్ తక్కువ ఉంటె బలమైన సైనిక సామర్థ్యాలను సూచిస్తుంది. ఈ సూచిక ప్రకారం, "0.0000" ఖచ్చితమైన స్కోర్‌గా పరిగణించబడుతుంది. ఇందులో భారత్ 0.1023 (PwrIndx) స్కోర్‌ను కలిగి ఉంది.
ఈ నివేదిక ప్రకారం సైనిక శక్తిలో యునైటెడ్ స్టేట్స్ గ్లోబల్ లీడర్‌గా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా సైనిక బలంలో మాత్రమే కాకుండా సాంకేతిక పురోగమనాలు, వైద్యం, ఏరోస్పేస్ మరియు కంప్యూటర్/టెలికాం రంగాలలో కూడా ముందుంది. యూఎస్ వద్ద 13,300 యుద్ధ విమానాలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో 983 దాడి హెలికాప్టర్లు ఉన్నాయి, యూఎస్ పవర్ ఇండెక్స్ 0.0699 స్కోరుతో సైనిక శక్తిలో దాని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది.
రష్యా 0.0702 పవర్ ఇండెక్స్ స్కోరుతో రెండవ స్థానంలో ఉండగా, చైనా 0.0706 పవర్ ఇండెక్స్ స్కోరుతో మూడవ స్థానంలో కొనసాగుతుంది. భారతదేశం 0.1023 పవర్ ఇండెక్స్ స్కోరుతో 2006 నుండి నాల్గవ స్థానంలో స్థిరంగా ఉంది. ఈ జాబితాలో దక్షిణ కొరియా ఐదో స్థానంలో, యూకే ఆరో స్థానంలో, జపాన్ మరియు టర్కీ వరుసగా ఏడు మరియు ఎనిమిదో స్థానాలలో, పాకిస్థాన్ తొమ్మిదో స్థానంలో, ఇటలీ పదవ స్థానంలో ఉన్నాయి.
భారతదేశపు తొమ్మిది సాంప్రదాయ భాషల్లో ఫార్సీకి చోటు
భారత ప్రభుత్వం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఫార్సీ (పర్షియన్) భాషను భారతదేశంలోని తొమ్మిది శాస్త్రీయ భాషలలో ఒకటిగా అధికారికంగా ప్రకటించింది. ఈ చొరవ భారతదేశం మరియు ఇరాన్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన చర్యగా భావిస్తున్నారు.
ఇటీవలే ఇరాన్‌లో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇరాన్ కౌంటర్ హెచ్ అమీర్-అబ్దుల్లాహియాన్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ గుర్తింపు ఫార్సీకి సంస్కృతం, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా, పాళీ మరియు ప్రాకృత వంటి ఇతర భారతీయ సాంప్రదాయ భాషలతో సమాన హోదాను మంజూరు చేస్తుంది. ఈ గుర్తింపుతో భారతీయ విద్యా చట్రంలో ఫార్సీ భాషలో పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ చొరవ శతాబ్దాల నాటి భారతదేశం మరియు ఇరాన్‌లు పంచుకున్న గొప్ప సాంస్కృతిక మరియు భాషా వారసత్వానికి చారిత్రక గుర్తింపు. ఫార్సీ భారతీయ సాహిత్యం, సంగీతం మరియు వాస్తుశిల్పంపై తీవ్ర ప్రభావం చూపింది. 1582 లో మొఘల్ చక్రవర్తి అక్బర్ దీనిని అధికారిక లేదా రాష్ట్ర భాషగా భారతదేశంలో ప్రవేశపెట్టారు.
భారత ప్రభుత్వం, ప్రాచీన చరిత్ర మరియు విభిన్న సాహిత్య వారసత్వాన్నికలిగిన ప్రాంతీయ భాషలను భారతీయ శాస్త్రీయ భాషలుగా గుర్తిస్తుంది. తమిళం 2004లో భారతదేశంలో శాస్త్రీయ భాష హోదా పొందిన మొదటి భాషగా నిలిచింది. ఈ జాబితాలో సంస్కృతం, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా, పాళీ మరియు ప్రాకృతం ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కుల గణన ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 నుండి అధికారికంగా రాష్ట్రంలో సమగ్ర కుల గణనను ప్రారంభించింది. దీనితో దేశంలో బీహార్ తర్వాత కుల గణనను ప్రారంభించిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఈ కుల గణన కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ యాప్‌ను రూపొందించింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి రెండవ వారంలోపు పూర్తిచేసేందుకు ప్రణాళిక చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 139 ఉపకులాలతో బీసీలు దాదాపు 50 శాతం మంది ఉన్నారు. ఎస్సీలు దాదాపు 19 శాతం, ఎస్టీలు 5.6 శాతం ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లు మరియు సచివాలయాల సిబ్బంది సహాయంతో ఈ కుల గణన చేపట్టింది. వీరందరికి ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. కుల గణన కోసం రూపొందించిన మొబైల్ అప్లికేషన్‌లో 700 కంటే ఎక్కువ కుల పేర్లు జాబితా చేసారు, వీటిలో 'నో క్యాస్ట్' ఆప్షన్ కూడా అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని కులాలను లెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సేకరించిన డేటా ద్వారా వివిధ కుల సమూహాల సామాజిక-ఆర్థిక స్థితిపై విలువైన అంతర్దృష్టులను అంచనా వేయనుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం కుల గణనను నిర్వహించలేదు, జనాభా గణనలను మాత్రమే నిర్వహించడం వలన వివిధ రాష్ట్రాలలో వీటి ట్రెండ్ ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం దీనిని పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ కుల గణనపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో కులం యొక్క వాస్తవికతలను అర్థం చేసుకోవడం మరియు సామాజిక అభ్యున్నతి కోసం సమర్థవంతమైన విధానాలను రూపొందించడం అవసరమని కొందరు నమ్ముతారు. మరికొందరు డేటా దుర్వినియోగం మరియు సామాజిక ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే అవకాశం గురించి ఆందోళన చెందుతున్నారు.
జనాభా గణనలో సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, పరిపాలనా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. జనాభా గణన ప్రజలను విభజించడానికి ఉద్దేశించినది కాదని, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినదని వారు నొక్కి చెప్పారు.
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు టాటా సన్స్ సొంతం
టాటా గ్రూప్ మరో ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ హక్కులను సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో రూ. 2500 కోట్లతో క్యాష్ రిచ్ లీగ్‌తో తమ అనుబంధాన్ని వచ్చే ఐదేళ్లకు (2024-28) పునరుద్ధరించుకుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ టైటిల్ హక్కుల కోసం చివరి వరకు పోరాడినా, క్యాష్ రిచ్ లీగ్‌తో టాటా గ్రూప్ ఈ హక్కులను చేజిక్కించుకుంది.
టాటా సన్స్ ఇప్పటికే 2022 నుండి ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది, ఈ రెండేళ్ల హక్కుల కోసం రూ.670 కోట్లు చెల్లించింది. డిసెంబర్ 12న తేలిన టెండర్ ప్రకారం, బీసీసీఐ ఐదు సంవత్సరాల హక్కుల కోసం 1750 కోట్ల రూపాయలను లేదా ఒక్కో మ్యాచుకు 350 కోట్ల రూపాయల బేస్ ధరని నిర్ణయించింది. మరో వైపు మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌గా కూడా టాటా వ్యవహరిస్తోంది.