తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 17 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 17 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 17 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

వియత్నాంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన జైశంకర్

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ . వియత్నాంలోని హోచిమిన్ సిటీలోని టావో డాన్ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని జైశంకర్ ఆవిష్కరించారు. వియత్నాంలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నా ఆయన హోచిమిన్ సిటీ పార్టీ సెక్రటరీ గుయెన్ వాన్ నెన్‌ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ చేశారు.

ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ జైశంకర్ మాట్లాడుతూ, భారతదేశం మరియు వియత్నాం మధ్య బలమైన స్నేహం మరియు సహకారానికి మహాత్మా గాంధీ విగ్రహం ప్రతీక అని అన్నారు. మహాత్మాగాంధీ అహింస, శాంతి బోధలు ప్రపంచంలో గతంలో కంటే నేటికీ చాలా సందర్భోచితంగా ఉన్నాయని ఆయన అన్నారు.

మహాత్మా గాంధీ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి వియత్నాం ఉప ప్రధాని ఫామ్ బిన్ మిన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన నాయకులలో ఒకరైన మహాత్మాగాంధీకి ఈ విగ్రహం సముచితమైన నివాళి అని ఆయన అన్నారు.

ఢిల్లీలో 5వ ఎడిషన్ ఇండియా స్టెమ్ సమ్మిట్ 2023

ఐదవ ఎడిషన్ ఇండియా స్టెమ్ సమ్మిట్ 2023 న్యూఢిల్లీలో నిర్వహించబడింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ (STEM) సమ్మిట్ అనేది వార్షిక సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ మరియు మ్యాథ్ కాన్ఫరెన్స్. స్టెమ్ అనేది ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యార్థులను కళాశాల, గ్రాడ్యుయేట్ అధ్యయనం మరియు సైన్స్ రంగాలలో కెరీర్‌ల కోసం సిద్ధం చేయడానికి అభివృద్ధి చేయబడిన అబ్యాసం.

ఈ సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రశంగించిన ఆయన ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విజ్ఞానం, ఆవిష్కరణలు రెండు ముఖ్యమైన మూల స్తంభాలని అన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం గిరిజన, గ్రామీణ మరియు వ్యవసాయ-కేంద్రీకృత పరిశోధన మరియు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

స్వలింగ వివాహాల చట్టబద్ధతాను నిరాకరించిన సుప్రీం కోర్టు

భారత సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలు మరియు వాటికి సంబందించిన పౌర సంఘాలను (సుప్రియో v. యూనియన్ ఆఫ్ ఇండియా) గుర్తించడానికి నిరాకరించింది. వివాహం చేసుకునే ప్రాథమిక హక్కును రాజ్యాంగం స్పష్టంగా గుర్తించలేదని ధర్మాసనం తీర్పు చెప్పింది. క్వీర్ వివాహాన్ని, సంఘాలను గుర్తించి, నియంత్రించే చట్టాలను రూపొందించడం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల పరిధిలో ఉందని తెలిపింది.

స్వలింగ జంటలు, లింగమార్పిడి వ్యక్తులు మరియు LGBTQIA+ కార్యకర్తలు మరియు వాటికి సంబందించిన పౌర సంఘాల గుర్తింపు ఉపశమనాలు కోరుతూ దాఖలు చేసిన 21 పిటిషన్‌లకు ప్రతిస్పందనగా  ఈ తీర్పు వెలువడింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 17న ఈ తీర్పు ఇచ్చింది. ఈ ధర్మశానంలో ఎస్‌కె కౌల్, ఎస్‌ఆర్ భట్, హిమా కోహ్లీ, పిఎస్ నరసింహ ఉన్నారు.

లైంగిక మరియు లింగ మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన పిటిషనర్లు, జంటలు మరియు వ్యక్తులు , వివక్ష నుండి రక్షణ, సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత మరియు వ్యక్తిగత స్వయంప్రతిపత్తి మరియు మనస్సాక్షి స్వేచ్ఛ ఆధారంగా వివాహం చేసుకునే మరియు కుటుంబాన్ని స్థాపించే హక్కును గుర్తించాలని అభ్యర్థించారు.

పిటిషన్లు ప్రత్యేక వివాహ చట్టం 1954, హిందూ వివాహ చట్టం 1955 మరియు విదేశీ వివాహ చట్టం 1969లోని నిబంధనలను సమిష్టిగా సవాలు చేశాయి. ప్రత్యేకించి, ఈ చట్టాలు ప్రస్తుత సమాజానికి అనుకూలంగా లేవని, భిన్న లింగేతర వివాహాలను గుర్తించడం లేదని, తద్వారా వివక్షను కొనసాగిస్తున్నాయని వారు వాదించారు.

ఏప్రిల్ 18, 2023న ఈ కేసు విచారణ ప్రారంభం కాగా, కఠినమైన చర్చల తర్వాత, మే 11, 2023న దాని తీర్పును ధర్మాసనం రిజర్వ్‌లో ఉంచింది.  తుది తీర్పును అక్టోబర్ ఇచ్చింది. తీర్పులో ధర్మశనం వారి వివాహంను చట్టబద్ధంగా గుర్తించకుండా, క్వీర్ జంటలు ఎటువంటి హింసకు తావు లేకుండా సహజీవనం చేసే హక్కును కలిగి ఉంటారని పేర్కొంది. అయితే వివాహాలు వంటి సంబంధాలను అధికారికంగా గుర్తించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆ బాధ్యత చట్ట సభలకు వదిలేచింది.

అయితే, స్వలింగ జంటల కొన్ని హక్కులపై న్యాయమూర్తులు విభేదించారు. క్వీర్ జంటలకు "సివిల్ యూనియన్" మరియు పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో పాటు సిజెఐ తీర్పు ఇచ్చారు. జస్టిస్‌లు ఎస్‌ రవీంద్ర భట్‌, హిమా కోహ్లి దీనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు, పీఎస్‌ నరసింహా వారితో ఏకీభవించారు.

అయితే, తమ ప్రత్యేక తీర్పులలో స్వలింగ జంటలకు మరిన్ని హక్కులు మరియు ప్రయోజనాలను కల్పించడాన్ని పరిశీలించేందుకు ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను న్యాయమూర్తులు అంగీకరించారు. స్వలింగ వివాహాల ధ్రువీకరణ మరియు దత్తత హక్కులు, పాఠశాలల్లో తల్లిదండ్రులుగా నమోదు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు తెరవడం వంటివి ఇందులో ఉన్నాయి.

గే కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల సామాజిక, మానసిక మరియు భావోద్వేగ అవసరాలతో వ్యవహరించడంలో పరిజ్ఞానం మరియు అనుభవం ఉన్న నిపుణులను ఈ ప్యానెల్ కలిగి ఉండాలని పేర్కొంది. చంద్రచూడ్ స్వలింగ జంటల సంఘాలు లేదా పౌర సంఘాలను గుర్తించడాన్ని ప్రస్తావించారు కానీ మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు అంగీకరించలేదు. వివాహం అనేది ఒక సామాజిక సంస్థ. వైవాహిక హోదాను రాజ్యాంగం ఇవ్వదని రవీంద్ర భట్ అన్నారు. వివాహం అనే ఆలోచన ప్రాథమిక హక్కు కాదని గుర్తుచేశారు.

స్వలింగ వివాహాన్ని అంగీకరించడంలో ఆసియా చాలా వెనుకబడి ఉన్నాయి. తైవాన్ మరియు నేపాల్ మాత్రమే వీటిని అనుమతిస్తున్నాయి. స్వలింగ సంపర్కంపై నిషేధాన్ని రద్దు చేసిన 2018 తీర్పు వారి రాజ్యాంగ హక్కులను ధృవీకరిస్తున్నప్పటికీ, భిన్న లింగ వివాహిత జంటలు అనుభవించే ప్రాథమిక హక్కు అయిన యూనియన్‌లకు ఇప్పటికీ చట్టపరమైన మద్దతు లేకపోవడం అన్యాయమని కార్యకర్తలు అంటున్నారు.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో 8 మంది కొత్త సభ్యులు

అక్టోబర్ 17, 2023న ముంబైలో జరిగిన 141వ సెషన్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎనిమిది మంది కొత్త అభ్యర్థులను కొత్త సభ్యులుగా ఆమోదించింది. వీరిలో నలుగురు మహిళలు మరియు నలుగురు పురుషులు ఉన్నారు. దీనితో మహిళా ప్రాతినిధ్యం 41.1 శాతానికి చేరుకుంది, మొత్తం ఐఓసీ సభ్యుల సంఖ్యా 107కి చేరుకుంది.

ఇజ్రాయెల్‌కు చెందిన యేల్ అరాడ్, హంగేరియన్ బాలాజ్ ఫుర్జెస్ మరియు పెరూకు చెందిన సిసిలియా రోక్సానా టైట్ విల్లాకోర్టాలను స్వతంత్ర ఐఓసీ సభ్యులుగా ఎన్నుకుంది. మలేషియా నటి మిచెల్ యోహ్ మరియు జర్మనీకి చెందిన క్రీడా వ్యవస్థాపకుడు మైఖేల్ మ్రోంజ్ కూడా ఒలింపిక్ చార్టర్ యొక్క నియమం 16.1.1.1 ప్రకారం స్వతంత్ర సభ్యులుగా చేరారు. జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా ట్యునీషియాకు చెందిన మెహ్రెజ్ బౌస్సేన్ ఐఓసీ సభ్యత్వానికి ఎన్నికయ్యారు.

తమిళనాడులో ఏనుగు కోసం ఎఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ

రైల్వే లైన్‌లలో అడవి ఏనుగులు రైళ్లలో ఢీకొనకుండా నిరోధించడానికి తమిళనాడు మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేస్తుంది. ఈ వ్యవస్థ ఏనుగు కదలికల గురించి అటవీ శాఖ సిబ్బందికి మరియు రైల్వే అధికారులకు ముందుస్తు సమాచారం తెలియజేస్తుంది. దానికి అనుగుణంగా రైలు వేగాన్ని తగ్గించడానికి లోకో పైలట్‌లను అనుమతిస్తుంది.

ఈ వ్యవస్థ ఎట్టిమడై-వాళయార్ రైల్వే సెక్షన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది తమిళనాడులోని ప్రముఖ ఏనుగుల కారిడార్. ఈ వ్యవస్థ రైలు పట్టాల దగ్గర ఏనుగుల కదలికలను గుర్తించేందుకు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు మరియు కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఏనుగును గుర్తించిన తర్వాత, సిస్టమ్ అటవీ శాఖ మరియు రైల్వే అధికారులకు హెచ్చరికను పంపుతుంది, తద్వారా రైళ్లను వేగాన్ని తగ్గించడం లేదా వాటిని వేరే మార్గంలో మళ్లించడం వంటి అవసరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ భారతదేశంలో ఏనుగుల మరణాలకు ప్రధాన కారణమైన ఏనుగు-రైలు ఢీకొనే సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ రైలు ప్రయాణికులు మరియు రైల్వే సిబ్బంది భద్రతను మెరుగుపరుస్తుందని కూడా భావిస్తున్నారు.

భారతదేశంలో మొదటిసారి కార్ట్-టి సెల్ థెరపీకి డిసిజిఐ ఆమోదం

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మొదటిసారి CAR-T (చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ -టీ) సెల్ థెరపీకి మార్కెట్ అధికారాన్ని జారీ చేసింది. భారతదేశంలోని క్యాన్సర్ రోగులకు ఇది ఒక ముఖ్యమైన పరిణామం, ఇది కొన్ని రకాల రక్త క్యాన్సర్‌లకు కొత్త మరియు సమర్థవంతమైన నివారణ చికిత్స ఎంపికను అందిస్తుంది. చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ (CAR) T-సెల్ థెరపీ, క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి జన్యుపరంగా మార్పు చెందిన T కణాలను ఉపయోగించే ఒక రకమైన క్యాన్సర్ చికిత్స.

B-సెల్ లింఫోమాస్ మరియు లుకేమియా చికిత్స కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా NexCAR19 పేరుతొ CAR T-సెల్ థెరపీని ఆమోదించింది. ఈ NexCAR19 అనేది CD19-టార్గెటెడ్ CAR T-సెల్ థెరపీ. CD19 అనేది B కణాల ఉపరితలంపై కనిపించే ప్రోటీన్. CAR T- సెల్ థెరపీ అనేది ఒక రకమైన ఇమ్యునోథెరపీ, ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి రోగి యొక్క స్వంత రోగనిరోధక కణాలను ఉపయోగిస్తుంది. టీ- కణాలు రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే ఒక రకమైన తెల్ల రక్త కణం.

CAR T-సెల్ థెరపీలో చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ వ్యక్తీకరించడానికి రోగి యొక్క T-కణాలను జన్యుపరంగా ఇంజనీరింగ్ చేస్తారు. CAR లు T-కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేయడంలో సహాయపడే ప్రోటీన్లు. తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా, నాన్-హాడ్కిన్ లింఫోమా వంటి కొన్ని రకాల రక్త క్యాన్సర్‌లకు చికిత్స చేయడంలో CAR T- సెల్ థెరపీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొన్ని క్లినికల్ ట్రయల్స్‌లో, ఇతర చికిత్సలలో విఫలమైన రోగులలో CAR T- సెల్ థెరపీ పూర్తి ఉపశమనం కలిగిస్తుంది.

సైక్ మెటల్ ఆస్టరాయిడ్ మిషన్‌ను ప్రారంభించిన నాసా

నాసా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి అక్టోబర్ 13న సైకీ అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఈ ప్రయోగం అంగారక గ్రహం మరియు బృహస్పతి మధ్య బెల్ట్‌లో ఉన్న ప్రధాన గ్రహశకలం సైకీపై లోహపు ఉల్కను అన్వేషించడానికి నిర్వహించబడింది. సైకి అనేది ఒక ప్రత్యేకమైన గ్రహశకలం, ఇది ప్రోటోప్లానెట్ యొక్క బహిర్గత కేంద్రంగా భావించబడుతుంది. ఈ గ్రహ శకలం ఇనుము మరియు నికెల్‌తో రూపొందించబడినట్లు భావిస్తున్నారు. ఇది సౌర వ్యవస్థలోని అతిపెద్ద లోహ గ్రహశకలాలలో ఒకటిగా భావించబడుతుంది.

సైకిని అధ్యయనం చేయడం ద్వారా, గ్రహాలు ఎలా ఏర్పడతాయి మరియు ఎలా అభివృద్ధి చెందుతాయి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుంది. సైకి 2026లో గ్రహశకలం వద్దకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు గ్రహశకలం చుట్టూ తిరుగుతూ డేటాను సేకరిస్తుంది. గ్రహశకలం యొక్క కూర్పు, నిర్మాణం మరియు అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయడానికి డేటా ఉపయోగించబడుతుంది.

సౌర వ్యవస్థ యొక్క అన్వేషణలో సైక్ మిషన్ ఒక ప్రధాన మైలురాయి. ఇది లోహ గ్రహశకలం అన్వేషించడానికి మొదటి మిషన్, మరియు ఇది గ్రహాల ఏర్పాటు మరియు సౌర వ్యవస్థ యొక్క పరిణామంపై కొత్త అంతర్దృష్టులను అందించగలదని భావిస్తున్నారు.

మిజోరంలోని డంపా టైగర్ రిజర్వ్‌లో కొత్త టోడ్ జాతులు

భారతదేశం మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం మిజోరంలోని డంపా టైగర్ రిజర్వ్‌లో కొత్త జాతి టోడ్‌లను కనుగొన్నారు. టోడ్ అనేది కొన్ని కప్పలకు చెందిన ఒక సాధారణ పేరు. దీనికి బుఫోయిడ్స్ భూపతి అని నామకరణం చేశారు. ఈ కొత్త జాతి ఈశాన్య భారతదేశంలో చాలా ఇరుకైన ప్రాంతంలో మాత్రమే కనిపించే బుఫోయిడ్స్ జాతిలో ఇది మూడవదిగా భావిస్తున్నారు.

ఇతర రెండు జాతులైన బుఫోయిడ్స్ మేఘాలయనస్ మరియు బుఫోయిడ్స్ కెంపిలు మిజోరాం పొరుగు రాష్ట్రమైన మేఘాలయలో కనిపిస్తాయి. ఈ కప్పలు ముదురు మచ్చలతో గోధుమ రంగులో ఉంటాయి. వీటికి ప్రఖ్యాత భారతీయ హెర్పెటాలజిస్ట్ అయిన డాక్టర్ సుబ్రమణియన్ భూపతి పేరు మీద బుఫోయిడ్స్ భూపతి అని పేరు పెట్టారు. బుఫోయిడ్స్ భూపతి ఇతర బుఫోయిడ్ జాతుల నుండి దాని ఇంటర్‌డిజిటల్ వెబ్బింగ్, రంగు, చర్మ క్షయ మరియు అణగారిన పరోటిడ్ గ్రంధుల ఉనికి ద్వారా వేరు చేయబడుతుంది.

ముంబైలో గ్లోబల్ మారిటైమ్ ఇండియా యొక్క మూడవ ఎడిషన్‌

గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 యొక్క మూడవ ఎడిషన్‌ను అక్టోబర్ 17న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం. ఈ సమ్మిట్ ప్రాంతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం మరియు పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారా భారతీయ సముద్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సదస్సు వేదికగా బ్లూ ఎకానమీ సంబంధించిన బ్లూప్రింట్ 'అమృత్ కాల్ విజన్ 2047'ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. దీని కోసం 23,000 కోట్ల విలువైన సముద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా మారే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. చారిత్రాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాంతీయ మరియు ప్రపంచ వాణిజ్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని అన్నారు.

భారతదేశ చొరవ కారణంగా జి20 లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ఎకనామిక్ కారిడార్‌పై నిర్ణయం తీసుకోగలిగామని, ఇది లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడానికి, పర్యావరణ పరిరక్షణకు మరియు భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. రానున్న దశాబ్దాలలో ప్రపంచంలోని ఐదు అగ్రగామి నౌకలను నిర్మించే దేశాలలో ఒకటిగా భారత్ అవతరించనుందని, 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్' అనేది భారతదేశ మంత్రమని ప్రధాని పేర్కొన్నారు.

ఓడరేవుల కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, ఓడరేవుల వద్ద కంటైనర్ ఓడల టర్న్-అరౌండ్ సమయం గణనీయంగా మెరుగుపడిందని ఆయన తెలిపారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు బలోపేతం అవుతున్నాయని ప్రధాని చెప్పారు. గ్లోబల్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో భారతదేశం రేటింగ్ గత తొమ్మిదేళ్లలో మెరుగుపడిందని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.

గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్‌లో మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద్ సోన్వాల్, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై. నాయక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ సదస్సు ముంబైలోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో అక్టోబరు 19 వరకు మూడు రోజులు నిర్వహించబడింది.

తమిళనాడులో టిలాపియా పార్వోవైరస్ యొక్క మొదటి కేసు

వ్యవసాయ-జాతి టిలాపియా మంచినీటి చేపను ప్రభావితం చేసే టిలాపియా పార్వోవైరస్ మొట్టమొదటి కేసు తమిళనాడులో కనుగొనబడింది. కడలూరు జిల్లాలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో తిలాపియా చేపల నమూనాలో ఈ వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇది ఒకరకమైన డిఎన్ఏ వైరస్. ఇది టిలాపియా చేపలలో ఒక రకమైన అంటువ్యాధిని కలిగిస్తుంది, తద్వారా ఆజాతి సామూహిక మరణాలకు కారణమవుతుంది.

ఈ వైరస్ సోకిన చేపల మలం, నీరు మరియు ఆహారం ద్వారా ఇతర చేపలకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే వైరస్‌ను నియంత్రించడానికి ఏకైక మార్గం. కొత్త చేపలను నిర్బంధించడం మరియు పరికరాలను క్రిమిసంహారక చేయడం వంటి మంచి బయోసెక్యూరిటీ చర్యలను అభ్యసించడం ద్వారా దీనిని నియంత్రించవల్సి ఉంటుంది.

ఈ వైరస్ మొదటిసారిగా 2019లో చైనాలో, 2021లో థాయ్‌లాండ్‌లో నివేదించబడింది. ఈ వైరస్ సంభవించినట్లు నివేదించిన మూడవ దేశం భారతదేశం. ఈ వైరస్ మొప్పలు, గుండె, మెదడు, కాలేయం, క్లోమం, ప్లీహము, ప్రేగు, మూత్రపిండాలు, కళ్ళు మరియు టిలాపియా యొక్క కండరాలలో చేరి వ్యాధికి కారణమవుతుంది.

మొజాంబిక్ టిలాపియా/ జిలేబియాస్ చేపలు 1950లలో భారతీయ మత్య్స పరిశ్రమకు పరిచయం చేయబడ్డాయి. ఇవి తక్కువ ఆక్సిజన్ స్థాయిలలో జీవించగలవు. భారత ప్రభుత్వం 1970 తర్వాత ఒరియోక్రోమిస్ నీలోటికస్‌ను మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుమతినిచ్చింది. వాటి వేగవంతమైన పెరుగుదల మరియు మార్కెట్ డిమాండ్ కారణంగా రెడ్ హైబ్రిడ్‌లుగా పరిగణించబడుతున్నాయి. ఈ చేపలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళలో పెద్ద మొత్తంలో సాగు చేయబడుతున్నాయి.

Post Comment