Advertisement
తెలుగులో ఈరోజు కరెంట్ అఫైర్స్ 11 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో ఈరోజు కరెంట్ అఫైర్స్ 11 మార్చి 2024

తెలుగులో 11 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.

ఇండియా - యుఎస్ మారిటైమ్ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్ 'సీ డిఫెండర్స్-2024'

ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ మధ్య సమగ్ర సముద్ర భద్రతా వ్యాయామం ' సీ డిఫెండర్స్ - 2024 మార్చి 7 నుండి 9 మధ్య పోర్ట్ బ్లెయిర్‌లో నిర్వహించబడింది. ఈ వ్యాయామం ఈ దేశాల కోస్ట్ గార్డ్ దళాల మధ్య సముద్ర సహకారం మరియు భద్రత చర్యను పెంపొందించే లక్ష్యంతో జరిగింది.

ఈ వ్యాయామంలో కాలుష్య ప్రతిస్పందన ప్రదర్శనలతో సహా అనేక రకాల ఇతర ప్రదర్శనలను కూడా నిర్వహించారు. భారతీయ కోస్ట్ గార్డ్ నౌకలు మరియు విమానాలు సముద్రంలో చమురు చిందటం మరియు ఇతర పర్యావరణ ప్రమాదాలకు ప్రతిస్పందించడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. అలానే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన అనుమానిత నౌకలను తనిఖీ చేయడానికి విజిట్ బోర్డ్ సెర్చ్ అండ్ సీజర్ ఆఫరేషన్ కూడా నిర్వహించారు.

  • ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ మరియు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ సెర్చ్ & రెస్క్యూ మరియు పొల్యూషన్ రెస్పాన్స్ ప్రదర్శనలను నిర్వహించారు.
  • డ్రోన్ ఆధారిత వైమానిక నిఘా మరియు రెస్క్యూ మిషన్‌లను చేపట్టడంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

ఈ ఉమ్మడి వ్యాయామం రెండు కోస్ట్ గార్డ్‌లకు విలువైన శిక్షణ అవకాశాలను అందించింది. ఇరు దళాల నైపుణ్యాలను మెరుగుపరచడానికి, సమన్వయ పద్ధతిలో కలిసి పనిచేసే వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వీలు కల్పించింది.

యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ బెర్తాల్ఫ్ పోర్ట్ బ్లెయిర్ సందర్శన యూఎస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి శక్తివంతమైన చిహ్నంగా పనిచేస్తుంది. ఈ సముద్ర సహకార ప్రయత్నాల ద్వారా, రెండు దేశాలు సురక్షితమైన మరియు మరింత రక్షితమైన సముద్ర వాతావరణాన్ని పెంపొందిస్తాయి.

ముడి జూట్‌కు కనీస మద్దతు ధరను ఆమోదించిన క్యాబినెట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, 2024-25 సీజన్ కోసం ముడి జూట్‌కు కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాకు రూ. 285 పెంచి మొత్తం ధరను రూ. 5,335గా ప్రకటించింది.

ఈ నిర్ణయం దేశంలోని 4.0 మిలియన్ల జనపనార రైతులు మరియు వారి కుటుంబాలు మరియు జూట్ మిల్లులతో సంబంధం ఉన్న 500,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని పభుత్వం అంచనా వేస్తుంది. 2024-25 సీజన్‌కు ముడి జూట్‌ ఎమ్‌ఎస్‌పి 2018-19 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం భారతదేశం యొక్క మొత్తం సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధరను నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా నిర్ణయించినట్లు పేర్కొంది.

  • ఈ కొత్త మద్దతు ధర ఆల్-ఇండియా వెయిటెడ్ సగటు ఉత్పత్తి వ్యయం కంటే 64.8% రాబడిని నిర్ధారిస్తున్నట్లు తెలిపింది.
  • ఈ సీజన్‌లో ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రూ. 524.32 కోట్ల అంచనా వ్యయంతో 624,000 కంటే ఎక్కువ ముడి జనపనార బేళ్లను సేకరించినట్లు నివేదించింది.
  • ఈ సేకరణ దాదాపు 165,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది.

ప్రభుత్వం 2014-15లో ముడి జూట్‌ ఎమ్‌ఎస్‌పి క్వింటాల్‌కు రూ.2,400 ఉండగా, ప్రస్తుతం ముడి జూట్‌ ఎమ్‌ఎస్‌పి రూ.5,335/-కి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది, గత పదేళ్లలో ఇది 122 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎమ్‌ఎస్‌పి కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. దాని కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్ చేస్తుందని తెలిపింది.

లోకల్ కరెన్సీ ప్రోత్సహించడానికి బ్యాంక్ ఇండోనేషియాతో ఆర్‌బిఐ ఎంఓయూ

భారత్, ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఆర్‌బిఐ మరియు బ్యాంక్ ఇండోనేషియాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మార్చి 7న ముంబైలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం స్థానిక కరెన్సీలు అంటే భారతీయ రూపాయి (ఐఎన్ఆర్) మరియు ఇండోనేషియా రూపాయిల (ఐడిఆర్) వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి.

ఈ ఎంఓయుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీ శక్తికాంత దాస్ మరియు బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వైపాక్షికంగా ఇరుదేశాల స్థానిక కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎమ్ఒయు రెండు దేశాలు అంగీకరించిన విధంగా అన్ని కరెంట్ ఖాతా లావాదేవీలు, అనుమతించదగిన మూలధన ఖాతా లావాదేవీలు మరియు ఏదైనా ఇతర ఆర్థిక మరియు వాణిజ్య లావాదేవీలను కవర్ చేస్తుంది.

  • ఈ ఫ్రేమ్‌వర్క్ ఎగుమతిదారులు మరియు దిగుమతిదారులకు వారి సంబంధిత దేశీయ కరెన్సీలలో ఇన్‌వాయిస్ చెల్లింపులు జరపడానికి వీలు కల్పిస్తుంది.
  • ఇది ఐఎన్ఆర్-ఐడిఆర్ విదేశీ మారకపు మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది.
  • ఇది స్థానిక కరెన్సీల వినియోగం లావాదేవీల ఖర్చులు మరియు సెటిల్‌మెంట్‌ల సమయాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది.
  • ఇది ద్వైపాక్షిక సెటిల్‌మెంట్ల కోసం యూఎస్ డాలర్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
  • ఇది జూలై 2022లో ఆర్‌బిఐ ప్రవేశపెట్టిన ఐఎన్ఆర్ ట్రేడ్ సెటిల్‌మెంట్ మెకానిజం అమలులో ఒక భాగం.
  • ఈ మెకానిజం భారతీయ ఎగుమతులను ప్రోత్సహించడానికి మరియు రూపాయి యొక్క అంతర్జాతీకరణను పెంచడానికి రూపొందించబడింది.
  • ఈ మెకానిజం కింద భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయిలలో చెల్లించవచ్చు.

ఈ సహకారం ఆర్‌బిఐ మరియు బ్యాంక్ ఇండోనేషియాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. ద్వైపాక్షిక లావాదేవీలలో స్థానిక కరెన్సీల ఉపయోగం చివరికి భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక ఏకీకరణను మరింతగా పెంచడానికి తోడ్పడుతుంది. అలానే ఇరు దేశాల మధ్య సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక మరియు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదం చేస్తుంది.

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 97వ సభ్యదేశంగా పనామా

పనామా అధికారికంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ యొక్క 97వ సభ్యదేశంగా అవతరించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. మార్చి 8న న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో జాయింట్ సెక్రటరీ అభిషేకిఫ్‌లకు రాయబారి యాసియెల్ బురిల్లో ర్యాటిఫికేషన్ ఇన్‌స్ట్రుమెంట్‌ను అందించడంతో ఈ చేరిక ఖరారు అయ్యింది.

ఈ అధికారిక చట్టం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ యొక్క ఫ్రేమ్‌వర్క్‌లో సహకరించడానికి పనామా యొక్క ఆలోచనను తెలియజేస్తుంది. ఇప్పుడు పనామా సౌరశక్తిని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఇతర దేశాల సరసన చేరింది. ఇది తన సరిహద్దుల్లో సౌరశక్తిని అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడంలో పనామా యొక్క నిబద్ధతను సూచిస్తుంది.

అయితే మార్చి 5న అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశంగా మాల్టా అవతరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ యొక్క ఫ్రేమ్‌వర్క్‌ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల సంఖ్య 116కు చేరినట్లు పేర్కొంది.

  • ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఎ) అనేది 116 కంటే ఎక్కువ దేశాలు సంతకం చేసిన కూటమి.
  • ఈ కూటమిని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ సోలార్ పాలసీ అండ్ అప్లికేషన్ అని కూడా అంటారు.
  • సాంప్రదాయ శిలాజ ఇంధనాల స్థానంలో సౌరశక్తిని సమర్ధవంతంగా వినియోగించుకోవడం ఈ కూటమి యొక్క ప్రాథమిక లక్ష్యం.
  • ఈ కూటమి కర్కాటక మరియు మకర రేఖ మధ్య ఉన్న సూర్యరశ్మి దేశాల లక్ష్యంగా రూపుదిద్దుకుంది.
  • ఈ చొరవను భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 2015లో వెంబ్లీ స్టేడియంలో చేసిన ప్రసంగంలో మొదటిసారిగా ప్రతిపాదించారు.
  • అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం నవంబర్ 2016లో మొరాకోలోని మరాకేష్‌లో జరిగింది. నాడు ఈ కూటమిలో 102 దేశాలు చేరాయి.
  • అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ఆరవ అసెంబ్లీ అక్టోబర్ 31న దేశ రాజధానిలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగింది.
  • 2018లో సౌర ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌కు వీలుగా 350 మిలియన్ డాలర్ల సోలార్ డెవలప్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
  • గత ఏడాది ఈ కూటమి రికార్డు స్థాయిలో 310 బిలియన్ల పెట్టుబడులను రాబట్టింది.
  • ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోలార్ ప్రాజెక్టులలో 9.5 గిగా వాట్ల సౌరశక్తి వృద్ధికి ఐఎస్ఎ మద్దతు ఇస్తుంది.
  • అబుదాబిలో జరిగిన వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్‌లో గ్లోబల్ సోలార్ అట్లాస్‌ను ప్రారంభించేందుకు ప్రపంచ బ్యాంక్‌తో ఈ కూటమి భాగస్వామ్యం కుదుర్చుకుంది.
  • గ్లోబల్ సోలార్ అట్లాస్ అనేది ఒక ఆన్‌లైన్ మ్యాపింగ్ వేదిక, ఇది ప్రపంచంలోని ఏ ప్రదేశంలోనైనా వార్షిక సగటు సౌరశక్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.
  • ఐఎస్ఎ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని హర్యానాలో ఉంది.
  • దీనిని జనవరి 2016లో నరేంద్ర మోడీ మరియు అప్పటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే సంయుక్తంగా శంకుస్థాపన చేశారు.

అరుణాచల్ ప్రదేశ్‌ యొక్క 27వ జిల్లాగా బిచోమ్

అరుణాచల్ ప్రదేశ్‌ యొక్క పశ్చిమ మరియు తూర్పు కమెంగ్ నుండి వేరు చేయబడిన బిచోమ్, అరుణాచల్ ప్రదేశ్‌ యొక్క 27వ జిల్లాగా ఏర్పాటు చేయబడింది. మార్చి 7న ముఖ్యమంత్రి పెమా ఖండూ నాపాంగ్‌ఫుంగ్‌ను కొత్త జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రతిపాదిస్తూ ఈ ప్రకటన చేశారు. ఈ జిల్లా ఏర్పాటుకు సంబంధించి 1984 నుంచి పెండింగ్‌లో ఉన్న చిరకాల డిమాండ్‌ను నెరవేర్చినట్లు ఆయన ప్రకటన చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బిచోమ్ మరియు కీ పన్యోర్ జిల్లాల ఏర్పాటు కోసం రాష్ట్ర అసెంబ్లీ అరుణాచల్ ప్రదేశ్ (జిల్లాల పునర్వ్యవస్థీకరణ) (సవరణ) బిల్లు, 2024ను ఆమోదించింది. పశ్చిమ కమెంగ్ నుండి మొత్తం 27 గ్రామాలు మరియు తూర్పు కమెంగ్ నుండి 28 గ్రామాలు బిచోమ్ జిల్లాలో చేర్చబడ్డాయి.

  • అరుణాచల్ ప్రదేశ్ 8 ఈశాన్య భారత రాష్ట్రాలలో ఒకటి.
  • ఇది నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ప్రాంతం నుండి ఏర్పడింది.
  • అరుణాచల్ ప్రదేశ్ 20 ఫిబ్రవరి 1987న రాష్ట్రంగా ప్రకటించింది.
  • అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్.
  • ఇది అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలను సరిహద్దుగా కలిగి ఉంది.
  • ఇది పశ్చిమాన భూటాన్‌తో , తూర్పున మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది.
  • ఇది మెక్‌మాన్ లైన్ వెంబడి ఉత్తరాన చైనా యొక్క టిబెట్ అటానమస్ రీజియన్‌తో 1,129 కి.మీ వివాదాస్పదమైన సరిహద్దును కలిగి ఉంది.
  • అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ : కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్.
  • అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి : పెమా ఖండూ ( బీజేపీ.

భారతదేశం మరియు నేపాల్ మధ్య యుపిఐ సేవలు ప్రారంభం

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసీఐ) యొక్క అంతర్జాతీయ విభాగమైన ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) మరియు నేపాల్ యొక్క అతిపెద్ద చెల్లింపు నెట్‌వర్క్ అయిన ఫోన్‌పే పేమెంట్ సర్వీస్ లిమిటెడ్ (Fonepay) ఇరుదేశాల సరిహద్దు లావాదేవీల కోసం భాగస్వామ్యం ప్రకటించాయి.

ఈ భాగస్వామ్యం ఇప్పుడు నేపాల్‌ను సందర్శించే భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్‌లలోని యూపీఐ యాప్‌లతో క్యూఆర్-కోడ్ ఆధారిత చెల్లింపులకు అనుమతి ఇస్తుంది. గత సెప్టెంబర్‌లో భారతదేశంలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో ఇరు సంస్థలు ఈ సహకారాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం భారత యూపీఐ సేవలు సింగపూర్, కెనడా, ఒమన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. యూపీఐ అంతర్జాతీయ విస్తరణ కోసం ఎన్‌పిసీఐ ఏకంగా ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ పేరుతొ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.

ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ యూపీఐ చెల్లింపులను విస్తరించేందుకు గూగుల్ పే ఇండియాతో ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. విదేశాలకు వెళ్లే వినియోగదారులకు యూపిఐ సేవను అందించడానికి ఫోన్‌పే మరియు పేటిఎం వంటి సంస్థలు సేవలు ప్రారంభించాయి.

హైదరాబాద్‌లో ఎంఎల్, ఏఐ హబ్ ఏర్పాటు కోసం డీఎస్‌టి, టి-హబ్ భాగస్వామ్యం

హైదరాబాద్‌లో మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ హబ్ (మ్యాథ్) ఏర్పాటుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టి) మరియు తెలంగాణలో ఒక ప్రధాన స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టి-హబ్ చేతులు కలిపాయి.

ఈ మినీ డేటా సెంటర్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచ స్థాయి లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అందిస్తుంది. ఈ రంగాల్లో సపోర్ట్ చేయడానికి బలమైన డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెస్తుంది.

ఇది హైదరాబాద్‌ను దేశవ్యాప్తంగా ఏఐ- ఆధారిత కార్యక్రమాలకు గో-టు డెస్టినేషన్‌గా మార్చడంతో పాటుగా 2025 నాటికి 500కి పైగా ఏఐ- సంబంధిత ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో సంవత్సరానికి 150 స్టార్టప్‌లను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

  • భారతదేశం యొక్క ఏఐ మార్కెట్ ఏటా 25-35% వృద్ధి చూపిస్తుంది.
  • 2027 నాటికి భారతదేశం యొక్క ఏఐ మార్కెట్ విలువ $17 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
  • టి-హబ్ (టెక్నాలజీ హబ్) అనేది తెలంగాణలోని రాయదుర్గంలో 5 నవంబర్ 2015లో ఏర్పాటు చేయబడింది.
  • ఇది తెలంగాణాలో స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు మరియు యాక్సిలరేటర్‌ల కోసం కమ్యూనిటీ స్పేస్ అందిస్తుంది.
  • ఇది హైదరాబాద్‌లోని మూడు విద్యా సంస్థలు ( హైదరాబాద్ ఐఐటీ , ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) మధ్య భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబడింది.
  • టి-హబ్ 2022 నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ యందు భారతదేశ ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డును గెలుచుకుంది.
  • 2023లో టి-హబ్ ఉత్తమ నేషనల్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌గా గుర్తింపు పొందింది.

Post Comment