తెలుగులో ఈరోజు కరెంట్ అఫైర్స్ 10 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో ఈరోజు కరెంట్ అఫైర్స్ 10 మార్చి 2024

తెలుగులో ఈరోజు కరెంట్ అఫైర్స్ 10 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

గిరిజన అభివృద్ధి కోసం వివిధ సంస్థలతో  కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం

గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వ సంస్థలతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ భాగస్వామ్యం అయ్యింది. ఈ సంస్థలలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) బెంగళూరు, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కలకత్తా మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ వంటివి ఉన్నాయి.

మార్చి 7న కేంద్ర గిరిజన వ్యవహారాలు మంత్రి అర్జున్ ముండా ఈ గ్రౌండ్ బ్రేకింగ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. ఈ భాగస్వామ్యాలు స్వదేశీ పద్ధతులతో సహా కీలక డొమైన్‌లపై దృష్టి సారించాయి. వీటిలో టెలిమెడిసిన్, గిరిజన ఆరోగ్యం, శిక్షణ & కెపాసిటీ బిల్డింగ్, వ్యవస్థాపకత, టెక్నాలజీ బదిలీ, పేటెంట్, ఐపీఆర్ మరియు డిజిటలైజేషన్ వంటివి ఉన్నాయి.

ఢిల్లీ ఎయిమ్స్ యందు భగవాన్ బిర్సా ముండా చైర్‌ను ఏర్పాటు

గిరిజనల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆరోగ్య సంరక్షణ మరియు పరిశోధనలో భారతదేశపు ప్రధాన సంస్థ అయిన ఢిల్లీలోని ఎయిమ్స్ యందు భగవాన్ బిర్సా ముండా చైర్‌ను ఏర్పాటు చేయాలని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

  • ఈ విభాగం సికిల్ సెల్ అనీమియాపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
  • అలానే గిరిజన ఆరోగ్య సమస్యలపై అధునాతన పరిశోధనలు మరియు బోధించడంపై కూడా ఈ చైర్ దృష్టి సారిస్తుంది.
  • ఫీల్డ్‌ లెవెల్ వైద్య నిపుణులకు మార్గదర్శకత్వం అందించడానికి టెలిమెడిసిన్ సౌకర్యం ఏర్పాటు చేస్తుంది.
  • ఈ చైర్ ప్రారంభంలో 3 సంవత్సరాలకు స్థాపించబడుతుంది. పరస్పర ఒప్పందం ఆధారంగా ఈ భాగస్వామ్యం పొడిగించబడుతుంది.
  • ఈ చైర్ సభ్యుల జీతాలు యూజీసీ నిబంధనలకు కట్టుబడి అందజేస్తారు.

సెమీ కండక్టర్ ఫ్యాబ్‌లో శిక్షణ కోసం బెంగళూరు ఐఐఎస్‌సితో భాగస్వామ్యం

షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు సెమీకండక్టర్ కోర్సులలో శిక్షణా సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీరికి నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్ ధృవీకరించబడిన స్థాయి 6.0 & 6.5 శిక్షణను అందిస్తుంది.

  • వచ్చే మూడేళ్లలో 600 మంది అభ్యర్థులకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో అధునాతన శిక్షణ కల్పిస్తుంది.
  • వచ్చే మూడేళ్లలో 1500 మంది అభ్యర్థులకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫౌండేషన్ ప్రోగ్రామ్ అందిస్తుంది.
  • ఏడాదికి 100 పాఠశాల మరియు డిప్లొమా విద్యార్థులకు సెమీకండక్టర్ సెక్టార్‌పై ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్‌లు బోధిస్తుంది.
  • గిరిజన మంత్రిత్వ శాఖ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పథకం కింద వచ్చే మూడేళ్ళకి రూ. 13.02 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
  • ప్రారంభ 3 సంవత్సరాల వ్యవధి తర్వాత విజయాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ యొక్క పునరుద్ధరణ పరిగణించబడుతుంది.

గిరిజన గ్రామాలలో వీ-శాట్ స్టేషన్ల ఏర్పాటుకు ఇస్రోతో భాగస్వామ్యం

మారుమూల గిరిజన గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని తీసుకురావడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా మరియు మహారాష్ట్ర వంటి నాలుగు రాష్ట్రాల్లోని దాదాపు 80 గ్రామాలలో పైలట్ ప్రాతిపదికన విశాట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది.

  • ఇస్రో యొక్క ఉపగ్రహ ఆధారిత (వీశాట్  పరిష్కారాలు ఈ ప్రాంతాల కనెక్టివిటీ సవాళ్లను గణనీయంగా పరిష్కరించగలవుని ప్రభుత్వం భావిస్తుంది.
  • వీశాట్  స్టేషన్లను స్టాటిక్ ప్రాంతాలలో లేదా వాహనాలపై అమర్చేందుకు ప్రణాళిక చేస్తున్నారు.
  • ఈ స్టేషన్ల యందు 100 ఎంబిపిఎస్ వైఫై సామర్థ్యాన్ని కల్పిస్తాయి. బూస్టర్‌లతో మరో 100 ఎంబిపిఎస్ వరకు విస్తరించేందుకు అవకాశం కల్పిస్తుంది.
  • ఈ చొరవ గిరిజన గ్రామాలలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, తద్వారా గిరిజన సంఘాలకు అవసరమైన సేవలకు ప్రాప్యతను అందిస్తుంది.
  • ఈ చొరవ అట్టడుగున ఉన్న ఈ కమ్యూనిటీల డిజిటల్ సాధికారత దిశగా ఇది సానుకూల అడుగుగా భావించవచ్చు.
  • ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భారతదేశం అంతటా ఇతర గిరిజన గ్రామాలలో ఇలాంటి కార్యక్రమాలకు దారి తీస్తుంది.

ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ఐఐటీ ఢిల్లీలో భగవాన్ బిర్సా ముండా చైర్

గిరిజన యువతలో వ్యవస్థాపకత ఆలోచనలు బలోపేతం చేసేందుకు మరియు సాంకేతికత మరియు ఆవిష్కరణలలో వారిని భాగస్వామ్యం చేసేందుకు ఐఐటీ ఢిల్లీలో భగవాన్ బిర్సా ముండా చైర్ ఏర్పాటు చేయనుంది. ఇది గిరిజన వర్గాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంకితం చేయబడుతుంది.

  • ఇది గిరిజన యువత కోసం దేశవ్యాప్తంగా వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
  • గిరిజన యువ వ్యాపారవేత్తలకు నిధులు, ఇంక్యుబేషన్, బ్రాండింగ్, మార్కెటింగ్ మరియు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లకు ప్రాప్యతకు మద్దతు అందిస్తుంది.
  • బి2బి సమావేశాలు, వ్యవస్థాపక ఈవెంట్‌లు, విలువ ఆధారిత కోర్సులు మరియు ఇంక్యుబేషన్ సెంటర్‌ల ద్వారా గిరిజన యువ వ్యాపారవేత్తలకు మెంటర్‌షిప్ అందిస్తుంది.
  • స్టార్టప్ ఇండియా, ఎస్ఐడిబిఐ, ఎంఎస్ఎంఈ మొదలైన సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా సహకారం అందిస్తుంది.
  • సాంకేతికత మరియు ఆవిష్కరణల ద్వారా దేశీయ పద్ధతులను ప్రోత్సహించడానికి పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
  • ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో అవగాహన డ్రైవ్‌లు మరియు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది.

ఉజ్వల పథకం కింద రూ. 300 ఎల్పీజీ సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు సిలిండర్‌కు రూ. 300 ఎల్‌పిజి సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం మరో ఏడాది పొడిగించింది. ఈ పొడిగింపు ఏప్రిల్ 1, 2024న ప్రారంభమై తదుపరి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ వరకు వర్తిస్తుంది. అలానే మహిళా దినోత్సవం 2024 సందర్బంగా రెగ్యులర్ ఎల్‌పిజి సిలెండర్ ధరను మరో వంద రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

మార్చి 7న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 1 నాటికి ఉజ్వల యోజన పథకం కింద దాదాపు 102.7 మిలియన్ల మంది లబ్ధిదారులు ఈ సబ్సిడీని పొందుతున్నారు, ఇది నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది.

ఏప్రిల్-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజా ఆకర్షణ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తుంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు రెగ్యులర్ ఎల్‌పిజి సిలెండర్ ధరను రూ. 200 తగ్గించడంతో పాటుగా రెండు వందలు ఉన్న ఉజ్వల యోజన సబ్సిడీని మూడు వందలకు పెంచింది.

  • ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం 2016లో ప్రారంభించబడింది.
  • ఈ పథకం నిరుపేద మహిళలకు ఎల్‌పిజి కనెక్షన్‌లను అందిస్తుంది.
  • ఈ పథకం ప్రారంభించిన మూడు సంవత్సరాలలో 7.5 మిలియన్ ఉచిత వంట గ్యాస్ కనెక్షన్‌లను ప్రభుత్వం అందించింది.
  • దీని కోసం రూ. 1,650 కోట్ల వ్యయం ఖర్చు చేసింది.
  • ఈ పథకం అమలు తర్వాత భారతదేశంలో గ్యాస్ సిలిండర్ వ్యాప్తి మే 2016లో 62 శాతం నుండి 1 ఏప్రిల్ 2021 నాటికి 99.8 శాతానికి మెరుగుపడింది.

నాటోలో కూటమి యొక్క 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్

స్వీడన్ మార్చి 7 న అధికారికంగా నాటో కూటమిలో చేరిన 32వ సభ్య దేశంగా అవతరించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల తటస్థతను పక్కన పెట్టి ఈ కూటమితో జతకట్టింది. స్వీడన్ పొరుగు దేశం ఫిన్‌లాండ్ ఇప్పటికే 2023 ఏప్రిల్‌లో నాటో సభ్య దేశంగా అవతరించింది.

స్వీడన్ నాటో సభ్యత్వం బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న నాటో భూభాగం యొక్క వ్యూహాత్మక వలయాన్ని పూర్తి చేసింది. ఈ కూటమి యొక్క సామూహిక భద్రతా హామీ నుండి ఈ దేశం ఇప్పుడు ప్రయోజనం పొందనుంది. తాజాగా నాటో దేశాలు అన్ని కలిసి నిర్వహిస్తున్న నార్డిక్ డ్రిల్ యందు కూడా స్వీడన్ సైన్యం పాల్గొంటుంది. ఈ డ్రిల్ యందు 13 దేశాల నుండి 20,000 మంది సైనికులు పాల్గొంటున్నారు.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయిలో దాడి చేసిన తర్వాత స్వీడన్ ఈ రక్షణ కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే టర్కీ మరియు హంగేరీలు దీనిని వ్యతిరేకించడంతో ఈ చేరిక ఆలస్యం అయ్యింది. స్వీడన్ చేరికకు గుర్తుగా మార్చి 4న బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో దాని జెండా ఎగురవేసే కార్యక్రమం జరగనుంది.

  • నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని అర్ధం.
  • నాటో 1949లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూఎస్, యూకే, కెనడా మరియు ఫ్రాన్స్‌లతో సహా 12 యూరప్ దేశాలచే ఏర్పాటు చేయబడింది.
  • ప్రస్తుతం నాటో సభ్య దేశాల సంఖ్య 32కు చేరుకుంది.
  • రష్యాతో కూడిన కమ్యూనిస్ట్ రాజ్యాల సమూహం (సోవియట్ యూనియన్) విస్తరణను నిరోధించడం దీని ప్రధాన లక్ష్యం.
  • ఈ సంస్థ 4 ఏప్రిల్ 1949న వాషింగ్టన్, డీసీలో సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది.
  • నాటో అనేది ఒక సామూహిక భద్రతా వ్యవస్థ. యుద్ధం సమయంలో దాని స్వతంత్ర సభ్య దేశాలు పరస్పరం సహకారంతో ఉమ్మడి సైనిక దాడిని అమలు చేస్తాయి.
  • నాటోకు దాని స్వంత సైన్యం లేదు, కానీ సభ్య దేశాలు సంక్షోభాలకు ప్రతిస్పందనగా సామూహిక సైనిక చర్యకు పూనుకుంటాయి.
  • నాటో యొక్క ప్రధాన ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది.
  • అయితే నాటో యొక్క సైనిక ప్రధాన కార్యాలయం బెల్జియంలోని మోన్స్ సమీపంలో ఉంది.
  • నాటోలో చివరిగా చేరిన సభ్యదేశం స్వీడన్ (7 మార్చి 2024)
  • వీటికి అదనంగా, నాటో ప్రస్తుతం బోస్నియా మరియు హెర్జెగోవినా, జార్జియా మరియు ఉక్రెయిన్‌లను ఔత్సాహిక సభ్యులుగా గుర్తిస్తుంది.
  • నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ - జెన్స్ స్టోల్టెన్‌బర్గ్
  • నాటో ప్రస్తుత మిలిటరీ కమిటీ చైర్ - రాబర్ట్ పీటర్ బాయర్

నాటోకు ఇప్పుడు యూకే, యుఎస్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ మరియు టర్కీతో సహా యూరప్ మరియు ఉత్తర అమెరికా అంతటా 32 మంది సభ్యులు ఉన్నారు. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత, అనేక తూర్పు యూరోపియన్ దేశాలు ఈ కూటమిలో చేరాయి. ఈ జాబితాలో అల్బేనియా, బల్గేరియా, హంగేరి, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, లిథువేనియా, లాట్వియా మరియు ఎస్టోనియా వంటి దేశాలు ఉన్నాయి.

గోవాకు డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఐటీబీ బెర్లిన్ సదస్సులో గోవా 'బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకుంది. పునరుత్పాదక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో గోవా చేస్తున్న కృషికి గుర్తింపుగా పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ ఈ అవార్డును అందజేసింది.

పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ గత 24 ఏళ్లుగా ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్స్ అందజేస్తుంది. తాజాగా 2024 ఏడాదికి సంబంధించి విజేతలను ప్రకటించింది. ఈ అవార్డులు పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో కృషి చేసిన ప్రభుత్వాలు, సంస్థలు, బ్రాండ్‌లు, మంత్రులు మరియు వ్యక్తులకు అందిస్తారు.

ఈ జాబితాలో ఎయిర్‌లైన్స్, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్‌లు, గమ్యస్థానాలు, ప్రభుత్వ సంస్థలు, పర్యాటక మంత్రిత్వ శాఖలు మరియు వాణిజ్యంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధించిన ఇతర సర్వీస్ ప్రొవైడర్‌లు ఉన్నారు.

  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (ఇండియా) : గోవా
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (కల్చర్) : తమిళనాడు
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (ఫార్మ్ & రూరల్ టూరిజం) : పంజాబ్
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (మెడిటరేనియన్ రీజియన్) : మాల్టా
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (హానిమూన్స్ & సెక్స్ హాలిడేస్) : జమైకా
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (ఎకోలాజికల్ టూరిజం) : గయానా
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (హిస్టరీ) : అర్మేనియా
  • డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ (కంట్రీ) : బ్రెజిల్
  • బెస్ట్ సిటీ హోటల్ : న్యూ ఢిల్లీ లే మెరిడియన్
  • ఉత్తమ హోటల్ చైన్ : దక్షిణాసియా రాడిసన్ హోటల్ గ్రూప్
  • బెస్ట్ ఉమెన్ ప్రొఫెషనల్ ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ : కనికా హస్రత్ (ఇండియా)
  • బెస్ట్ ప్రొఫెషనల్ ఇన్ హాస్పిటాలిటీ డెవలప్‌మెంట్ : మీనా భాటియా (భారతదేశం)
  • ఉమెన్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ : హే అన్మోల్ గగన్ మాన్ (ఇండియా, పంజాబ్)

ముస్లిం దేశాలకు కామన్ కరెన్సీని ప్రతిపాదించిన బంగ్లాదేశ్ ప్రధాని

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ముస్లిం-మెజారిటీ దేశాలకు కామన్ కరెన్సీని ఉండాలని ప్రతిపాదించారు. ముస్లిం దేశాల మధ్య వ్యాపారం మరియు వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి యూరోపియన్ యూనియన్ యొక్క యూరో మాదిరిగానే ముస్లిం దేశాలు ఉమ్మడి కరెన్సీని స్వీకరించాలనే ఆలోచనను ఆమె ప్రతిపాదించారు.

ఢాకాలోని తన అధికారిక నివాసం గణభబన్‌లో జరిగిన డి-8 వాణిజ్య మంత్రుల ప్రతినిధుల సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటుగా టర్కీ వాణిజ్య శాఖ డిప్యూటీ మంత్రి ముస్తఫా టిజ్కు కూడా పాల్గొన్నారు. యూరో వంటి ఉమ్మడి కరెన్సీని ప్రవేశపెట్టడం ముస్లిం దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అన్నారు.

  • డి-8 కూటమి అనేది ఎనిమిది ముస్లిం దేశాలైన బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, మలేషియా, నైజీరియా, పాకిస్తాన్ మరియు టర్కీలతో కూడిన ఆర్థిక సహకార సంస్థ.
  • ఇది ప్రధానంగా ఎనిమిది ముస్లిం దేశాల మధ్య వ్యాపారం మరియు వాణిజ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది.
  • దీనిని డి-8 ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటారు.
  • ఇది 15 జూన్ 1997లో ఇస్తాంబుల్ డిక్లరేషన్ ద్వారా స్థాపించబడింది.
  • ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్.
  • దీని ప్రస్తుత సెక్రటరీ జనరల్ : ఇసియాకా అబ్దుల్‌ఖాదిర్ ఇమామ్.
  • ఈ ఎనిమిది దేశాల ఉమ్మడి జనాభా దాదాపు 1.2 బిలియన్లు. ఇది ప్రపంచ మొత్తం ముస్లింలలో 60 %కు సమానం.
  • ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఈ కూటమి అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుంది.
  • డి-8 కూటమి చివరి సమావేశం ఏప్రిల్ 2021లో బంగ్లాదేశ్ యందు పర్చువల్ పద్దతిలో నిర్వహించబడింది.

ఆసియా క్రీడల విజేతలకు రివార్డులు ప్రకటించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆసియా క్రీడలు, బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ మరియు బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లతో సహా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో విజయం సాధించిన ఆటగాళ్లకు మరియు సహాయక సిబ్బందికి రూ. 1.12 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

  • బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ గెలిచినందుకు భారత మహిళల జట్టుకు రూ. 35 లక్షల నగదు బహుమతి అందించింది.
  • 2022 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలైన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టిలకు రూ. 12 లక్షలు అందించింది.
  • 2022 ఆసియా క్రీడలలో పురుషుల సింగిల్స్ యందు కాంస్య పతకం సాధించిన హెచ్‌ఎస్ ప్రణయ్‌కు 5 లక్షల రూపాయలు అందించింది.
  • 2022 ఆసియా క్రీడలలో రజత పతకాన్ని తొలిసారిగా గెలుచుకున్న పురుషుల జట్టుకు ఏకంగా 40 లక్షల రూపాయల నగదు బహుమతి అందించింది.
  • 2023 బీడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ఆయుష్ శెట్టికి లక్ష రూపాయల నగదు బహుమతి అందించింది.
  • బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ అండర్-15 బాలుర సింగిల్స్ ఛాంపియన్ బోర్నిల్ ఆకాష్ చాంగ్‌మైకు 2 లక్షలు అందించింది.
  • బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ అండర్-17 బాలికల సింగిల్స్ రజత పతక విజేత తన్వీ శర్మకు లక్ష రూపాయల నగదు అందించింది.
  • బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ అండర్-15 బాలుర సింగిల్స్ కాంస్య పతక విజేత జగ్షేర్ సింగ్ ఖంగుర్రాకు 50వేల నగదు బహుమతి అందజేసింది.

భారత బ్యాడ్మింటన్ పురోగమనంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది యొక్క కృషి మరియు అంకితభావంకు గాను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ నగదు ప్రొత్సాకాలతో గౌరవించింది. ఈ క్రీడాకారుల విజయాన్ని ప్రశంసించడంతో పాటుగా భవిష్యత్ యందు వారి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంది.

  • బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని బ్యాడ్మింటన్ యొక్క ప్రధాన పాలకమండలి.
  • 1934లో స్థాపించబడిన ఈ సంస్థ, 1936 నుండి భారతదేశంలో జాతీయ స్థాయి టోర్నమెంట్‌లను నిర్వహిస్తోంది.
  • దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
  • బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంక్షిప్తంగా 'బీఎఐ' అంటారు.
  • బీఎఐ ప్రస్తుత అధ్యక్షడుగా హిమంత బిస్వా శర్మ బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.

సాహిత్యోత్సవ్ పేరుతొ ఢిల్లీలో ప్రపంచ అతిపెద్ద సాహితీ ఉత్సవం

సాహిత్య అకాడమీ ద్వారా సాహిత్యోత్సవ్ పేరుతొ ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవం మార్చి 11 నుండి 16 వరకు న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఈ ఉత్సవాన్ని మార్చి 11న న్యూఢిల్లీలోని రవీంద్ర భవన్‌లో సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు. సాహిత్య అకాడమీ ఈ ఏడాదికి 70 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ వేడుక నిర్వహించింది.

ఈ సాహిత్యోత్సవ్ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా 190కి దేశాల నుండి 1100 మందికి పైగా ప్రముఖ రచయితలు, పండితులు హాజరయ్యారు. ఈ సాహిత్య ఉత్సవంలో దేశంలోని 175 భాషలు ప్రాతినిధ్యం వహించాయి. మార్చి 12న కమానీ ఆడిటోరియంలో సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023 ప్రదానోత్సవ వేడుక నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రాయ్ హాజరయ్యారు.

మూడు రాష్ట్రాల గవర్నర్లు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ (కేరళ), బిశ్వభూషణ్ హరిచందన్ (ఛత్తీస్‌గఢ్), సివి ఆనంద్ బోస్ (పశ్చిమ బెంగాల్) కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఉర్దూ రచయిత మరియు గీత రచయిత గుల్జార్ 175 భాషలకు  ప్రాతినిధ్యం వహిస్తూ సంవత్సర్ ఉపన్యాసం చేశారు.

  • భారత ప్రభుత్వం సాహిత్య అకాడమీడి (నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్‌) ని 1954లో అధికారికంగా స్థాపించింది.
  • ఇది భారతదేశంలోని ప్రాంతీయ భాషల సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అంకితం చేయబడ్డ సంస్థ.
  • దీని కార్యాలయం ఢిల్లీలోని మండి హౌస్ సమీపంలోని రవీంద్ర భవన్‌లో ఉంది.
  • సాహిత్య అకాడమీ యొక్క లైబ్రరీ భారతదేశంలోని అతిపెద్ద బహుళ-భాషా లైబ్రరీలలో ఒకటి.
  • ఇది ఇంగ్లీషులో ఇండియన్ లిటరేచర్ మరియు హిందీలో సంకలీన్ భారతీయ సాహిత్యం పేర్లతో రెండు ద్వైమాసిక సాహిత్య పత్రికలను ప్రచురిస్తుంది.
  • సాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సిల్ ఐదు సంవత్సరాల కాలానికి పనిచేస్తుంది, ఆ తర్వాత అది పునర్నిర్మించబడింది.
  • ప్రస్తుతం సాహిత్య అకాడమీడి అధ్యక్షుడుగా మాధవ్ కౌశిక్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Post Comment