January 06, 2024 Current affairs in Telugu. పోటీ పరీక్షల రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహులకు ఉపయోగపడతాయి.
మధ్యప్రదేశ్‌లో రాణి దుర్గావతి శ్రీ అన్న ప్రోత్సాహక యోజన
మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాణి దుర్గావతి అన్న ప్రోత్సాహన్ యోజన అనే నూతన సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ముతక ధాన్యాల ఉత్పత్తిపై రైతులకు కిలోకు రూ.10 ప్రోత్సాహక మొత్తాన్ని ప్రభుత్వం అందజేయనుంది. ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక మద్దతు కల్పించడంతో పాటుగా వారి జీవనశైలి మరియు ఆహారంలో శ్రీ అన్నను (మిల్లెట్స్ లేదా ముతక ధాన్యాలు) భాగమయ్యేలా ప్రోత్సహిస్తుంది.
జబల్‌పూర్‌లో నిర్వహించిన మోహన్ యాదవ్ ప్రభుత్వం యొక్క మూడవ క్యాబినెట్ సమావేశంలో ముతక ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ రాణి దుర్గావతి శ్రీ అన్న ప్రోత్సాహన్ యోజన ఆమోదించబడింది. ఈ పథకం కింద ముతక ధాన్యాల ఉత్పత్తిపై రైతులకు కిలోకు రూ.10 ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ ప్రోత్సాహక మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికలలో ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఇది ఒకటి.
డిజిటల్ స్కెంజెన్ వీసాను జారీ చేసిన మొదటి ఈయూ దేశంగా ఫ్రాన్స్
డిజిటల్ స్కెంజెన్ వీసాలు జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ అవతరించింది. 2024 పారిస్ ఒలింపిక్ మరియు పారాలింపిక్ క్రీడల కోసం వెళ్లే అథ్లెట్లు, జర్నలిస్టులు మరియు ఇతర ప్రతినిధుల కోసం 70,000 వీసాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో జారీ చేస్తుంది. యూరోపియన్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆథరైజేషన్ సిస్టమ్ ద్వారా ఈ వీసా-రహిత స్కెంజెన్ ప్రయాణాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
ఈ ప్రక్రియ ఫ్రాన్స్-వీసాస్ పోర్టల్ ద్వారా జనవరి 1 నుండి ప్రారంభించింది. ఈ విధానం ద్వారా వీసాలు నేరుగా అక్రిడిటేషన్ కార్డులలోకి అనుసంధానించబడి జారీ చేయబడతాయి. జనవరి 1, 2024 నుండి, "ఒలింపిక్ కాన్సులేట్" అనే కొత్త వ్యవస్థను నిర్వహించడం ప్రారంభించింది. ఇది 15,000 మంది అంతర్జాతీయ అథ్లెట్లు, 9,000 మంది జర్నలిస్టులు మరియు 2024 ఒలింపిక్ మరియు పారాలింపిక్ గేమ్స్‌లో పాల్గొనే విదేశీ దేశాల ప్రతినిధుల దరఖాస్తులను ప్రాసెస్ చేస్తుంది.
2024 పారిస్ ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా ఈవెంట్ ముగిసిన వెంటనే పారాలింపిక్ క్రీడలు ఆగష్టు 28 నుండి సెప్టెంబర్ 8, 2024 వరకు జరగనున్నాయి. ఈ రెండు ఈవెంటులకు దాదాపు 1.5 మిలియన్ల మంది ప్రేక్షకులు హాజరుకానున్నారు. ఈ క్రీడల సందర్భంగా ఎలాంటి భద్రతాపరమైన ముప్పులు తలెత్తకుండా ఉండేందుకు ఫ్రాన్స్ భారీగా డబ్బును, శక్తిని వెచ్చిస్తోంది.
కిర్గిజిస్తాన్ జాతీయ చిహ్నంగా మంచు చిరుత
కిర్గిజిస్తాన్ అధికారికంగా మంచు చిరుతపులిని తన జాతీయ చిహ్నంగా ప్రకటించింది. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జాపరోవ్ దీనికి సంబందించిన అధికారిక నోట్ విడుదల చేశారు. పురాతన కిర్గిజ్ సంస్కృతిలో, పాంథెర అన్సియా లేదా మంచు చిరుతపులి అనేది అత్యంత గౌరవప్రదమైన జంతువు. కిర్గిజ్ సంస్కృతిలో మంచు చిరుతపులి ధైర్యం మరియు శక్తికి చిహ్నంగా భావిస్తారు.
కిర్గిజిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో మంచు చిరుత సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 2013లో దీని రాజధాని నగరమైన బిష్కెక్‌లో గ్లోబల్ స్నో లెపార్డ్ ఫోరమ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మంచు చిరుత రక్షణపై బిష్కెక్ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదించబడింది. అదనంగా 12 మంచు చిరుత శ్రేణి దేశాలు మరియు గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ కమ్యూనిటీ ప్రతినిధుల సహకారంతో గ్లోబల్ స్నో లెపార్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంను కూడా ప్రారంభించింది.
మంచు చిరుతలు (పాంథెర అన్సియా) దట్టమైన తెల్లని బూడిద రంగు బొచ్చుతో, నల్లని రోసెట్‌లతో ఎత్తైన పర్వత ప్రాంతాలలో నివసిస్తాయి. తరచుగా వీటిని 'పర్వతాల దెయ్యాలు' అని పిలుస్తారు. అంతుచిక్కని జీవులు అప్రయత్నంగా తమ పరిసరాల్లో కలిసిపోతాయి. వాటి సహజ ఆవాసాలలో దాదాపుగా ఇవి గుర్తించలేనివిగా జీవిస్తాయి.
మంచు చిరుతలు ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, చైనా, భారతదేశం, కజక్‌స్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌తో సహా ఆసియాలోని 12 దేశాల పర్వత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ప్రపంచ వన్యప్రాణుల సంస్థ ప్రకారం, ఈ విస్తృతమైన పరిధి సుమారు 772,204 చదరపు మైళ్లు. అత్యధికంగా చైనాలో 60% నివాసాలను కలిగి ఉన్నాయి.
కిర్గిజ్ రిపబ్లిక్, మధ్యాసియాకు చెందిన ఒక భూపరివేష్టిత దేశం. ఇది కొండలు పర్వతాలతో చుట్టబడియున్నది. దీని ఉత్తరాన కజకస్తాన్, పశ్చిమాన ఉజ్బెకిస్తాన్, నైఋతీదిశన తజకిస్తాన్, తూర్పున చైనాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇది మధ్య ఆసియాలో 4వ-అత్యధిక జనాభా కలిగిన దేశం.
- దేశం : కిర్గిజ్ రిపబ్లిక్
- రాజధాని : బిష్కెక్
- అధికారిక భాషలు : కిర్గిజ్ & రష్యన్
- అధ్యక్షుడు : సదిర్ జపరోవ్
అవామ్ సే అవామ్ కే లియే పోర్టల్‌ను ప్రారంభించిన కాశ్మీర్ పోలీసులు
జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసులు, పౌరుల సమస్యలను పరిష్కరించడం కోసం 'అవామ్ సే అవామ్ లియే' అనే ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 1న అందుబాటులోకి తెచ్చిన ఈ పోర్టల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కరానికి సంబంధించి సేవలు అందిస్తుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వైన్ దీనిని ప్రజలకు అంకితం చేశారు.
ఈ పోర్టల్ పౌరుల ఫిర్యాదులను స్వీకరించడంతో పాటుగా వాటి యధాస్థితిని ట్రాక్ చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. పౌరులు తమ మొబైల్ నెంబర్ సహాయంతో నేరుగా ఈ పోర్టల్ యందు ప్రవేశించవచ్చు. ఫిర్యాదుదారులు తమ సమస్యకు సంబందించిన డాక్యుమెంట్ సాక్ష్యాలను కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫిర్యాదు పరిష్కారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికి అప్పుడు మెస్సేజ్ మరియు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదుదారునికి చేర వేస్తారు.
గుణోత్సవ్ 2024ను ప్రారంభించిన అస్సాం ప్రభుత్వం
అస్సాం ప్రభుత్వం, పాఠశాలల్లోని 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి 'గుణోత్సవ్ 2024' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ఆ రాష్ట్రంలోని 35 జిల్లాల్లోని 43,498 ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల అకాడమిక్ పనితీరును అంచనా వేస్తుంది. ఇది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలను కవర్ చేస్తోంది. ఈ మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,098 మంది బాహ్య మూల్యాంకనదారులను నియమించారు.
జనవరి 3న ప్రారంభమైన ఈ కసరత్తు ఫిబ్రవరి 8 వరకు మూడు దశల్లో ముగుస్తుంది. మొదటి దశలో జనవరి 3 నుండి 6 వరకు 12 జిల్లాలను కవర్ చేస్తున్నారు. రెండవ దశ జనవరి 10 నుండి 12 వరకు 13 జిల్లాలలో, మూడవ దశ ఫిబ్రవరి 6 నుండి 8 వరకు 10 జిల్లాలలో షెడ్యూల్ చేసారు.
గుణోత్సవ్ 2024 కార్యక్రమం అస్సాం రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు సంబందించిన సమగ్ర నివేదిక అందిస్తుంది. ప్రతి విద్యార్థిలో నేర్చుకునే అంతరాలను గుర్తించి, గ్రేడ్-నిర్దిష్ట ఫలితాలతో నాణ్యమైన విద్యను అందజేస్తుందని అస్సాం ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు. దీనికి అదనంగా పాఠశాలల పనితీరును కూడా ఇది మూల్యాంకనం చేస్తుంది, వీటిలో స్కాలస్టిక్ మరియు కో-స్కాలస్టిక్ అంశాలు, మౌలిక సదుపాయాల లభ్యత మరియు వినియోగం మరియు సమాజ భాగస్వామ్యం వంటి అంశాలు ఉన్నాయి. అస్సాం ప్రభుత్వం 2017లో తొలిసారి ఈ గుణోత్సవ్ కార్యక్రమం నిర్వహించింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన టాంగైల్, కొరియాల్ & గరద్ చీరలకు జీఐ ట్యాగ్
జాతీయ జియోగ్రాఫికల్ ఇండికేషన్ డ్రైవ్ మిషన్‌లో భాగంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొన్ని ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ని మంజూరు చేశారు. ఈ ఉత్పత్తుల జాబితాలో సుందర్‌బన్ తేనె, బ్లాక్ నునియా బియ్యం, తంగైల్, గోరోడ్ మరియు కడియాల్ చీరలు ఉన్నాయి.
1. సుందర్‌బన్ తేనె : ఈ తేనెను పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణాన ఉన్న విస్తారమైన మడ అడవులు సుందర్‌బన్స్ నుండి మౌలి అనే కమ్యూనిటీ సేకరిస్తుంది. ఈ తేనె దాని ప్రత్యేక రుచి మరియు సువాసనకు ప్రసిద్ధి చెందింది. పశ్చిమ బెంగాల్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిని ప్రాసెస్ చేసి, మౌబన్ అనే బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంది. దీని ప్రత్యేకమైన జీఐ ట్యాగ్ కోసం కూడా ఈ సంస్థనే దరఖాస్తు చేసింది. ఈ తాజా గుర్తింపు మౌళి సమాజం యొక్క జీవనోపాధిని కాపాడుతుంది.
2. బ్లాక్ నునియా రైస్ : బ్లాక్ నునియా వరిని ప్రిన్స్ ఆఫ్ రైస్ అని పిలుస్తారు. ఇది రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో పండిస్తారు. ఇది ఒకరకమైన దేశీయ వరి రకం. ఇది అధిక పోషక విలువలు మరియు ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందింది. దీనికి జీఐ ట్యాగ్ లభించడం వలన దీని సాగుకు ప్రోత్సాహం లభించడంతో పాటుగా రైతులు ప్రీమియం ధరను పొందడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు.
3. తంగైల్ చీరలు : పశ్చిమ బెంగాల్‌లోని నాడియా మరియు తూర్పు బుర్ద్వాన్ జిల్లాలలో ఉత్పత్తి చేయబడే ఈ టాంగైల్ చీరలు, వాటి చక్కటి మస్లిన్ ఫాబ్రిక్ మరియు క్లిష్టమైన డిజైన్‌లకు ప్రసిద్ధి చెందాయి. ఈ చీరలకు సంబంధించిన సంప్రదాయ నేత పద్ధతులను సంరక్షించడానికి ఈ గుర్తింపు సహాయపడుతుంది.
4. గోరోడ్ చీరలు : గరడ్ సిల్క్ చీర అనేది భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్భవించిన ఒక రకమైన పట్టు చీర . దీనిని సాంప్రదాయకంగా బెంగాలీ మహిళలు శుభ సందర్భాలలో, పండుగలు మరియు వివాహాల సమయంలో ధరిస్తారు.
5. కడియాల్ చీరలు : కడియాల్ చీరను పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా మిర్జాపూర్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఈ పట్టు దాని ప్రీమియం నాణ్యతకు ప్రసిద్ధి చెందింది.
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు చెందే ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు. ఇది ఒక ఉత్పత్తికి మంజూరు చేయబడిన ఒక రకమైన మేధో సంపత్తి హక్కు కూడా. ఈ గుర్తింపు సదురు ఉత్పత్తి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుండి ఉద్భవించిందని చెబుతోంది. ఈ గుర్తింపు వస్తువుల భౌగోళిక సూచనల (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం, 1999 ప్రకారం జారీ చేస్తారు. ఈ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ద్వారా జారీ చేయబడుతుంది. దీని ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
వన్డేలతో పాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఒన్డే మరియు టెస్ట్ క్రికెట్ కెరీరుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే పాకిస్థాన్‌తో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఈ నిర్ణయం ప్రకటించాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు మరియు ప్రపంచ వ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లపై దృష్టి సారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్నర్ పేర్కొన్నాడు.
డేవిడ్ వార్నర్ 2009లో టాస్మానియాలోని హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేశాడు. రిటైర్మెంట్ సమయనికి 161 వన్డేలలో 6,932 పరుగులు, 112 టెస్టులలో 8786 పరుగులు చేశాడు. వార్నర్ మైదానంలో తనదైన దూకుడైన ఆటతీరును ప్రసిద్ధి. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో రికీ పాంటింగ్ (27,368 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆస్ట్రేలియన్ ఆటగాడుగా వార్నర్ (18,612 పరుగులు) ఉన్నాడు.
డేవిడ్ వార్నర్ అద్భుతమైన టెస్ట్ బ్యాటర్, వార్నర్ 112 మ్యాచ్‌లలో 44.6 సగటుతో 8786 పరుగులు చేశాడు, ఇందులో 26 సెంచరీలు మరియు 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇందులో పాకిస్థాన్‌పై చేసిన 335 పరుగుల భారీ స్కోరు కూడా ఉంది. 2015 మరియు 2023లో ఆస్ట్రేలియా ప్రపంచకప్ విజయాల్లో కూడా వార్నర్ కీలక పాత్ర పోషించాడు.