తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 24 ఏప్రిల్ 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం
Study Material Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 24 ఏప్రిల్ 2023 | పోటీ పరీక్షల ప్రత్యేకం

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 24 ఏప్రిల్ 2023 ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఏప్రిల్ 22న చేపట్టిన ఇస్రో యొక్క పీఎస్‌ఎల్‌వీ-సీ55 ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంను ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) చెప్పట్టింది. ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా సింగపూర్‌కు చెందిన అగిల్ స్పేస్ యొక్క టెలీయోస్-2 మరియు లుమెలైట్-4 అనే రెండు భూ పరిశీలన ఉపగ్రహను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది పీఎస్‌ఎల్‌వీ యొక్క 57వ ప్రయోగం, అలానే పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ కాన్ఫిగరేషన్ (PSLV-CA) వేరియంట్ యొక్క 16వ మిషన్.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) భారతదేశం యొక్క మూడవ తరంకు చెందిన ఉపగ్రహ ప్రయోగ వాహనం. అక్టోబర్ 1994లో మొదటి విజయవంతమైన ప్రయోగం తర్వాత, పీఎస్‌ఎల్‌వీ భారతదేశం యొక్క విశ్వసనీయ మరియు బహుముఖ ప్రయోగ వాహనంగా ఉద్భవించింది. పీఎస్‌ఎల్‌వీ లిక్విడ్ మరియు సాలిడ్ ఇందనలతో 4 దశలలో ప్రయోగించబడుతుంది.

మొదటి దశ ఘన ఇంధనంతో ఆరు స్ట్రాప్-ఆన్ సాలిడ్ రాకెట్ బూస్టర్‌లను చుట్టి ఉంటుంది. రెండవ దశ ద్రవ ఇంధనంతో ఉంటుంది, అయితే మూడవ దశలో ఘన ఇంధనంతో కూడిన రాకెట్ మోటారు ఉంటుంది. నాల్గవ దశలో లాంచర్ బాహ్య అంతరిక్షంలో బూస్ట్ చేయడానికి ద్రవ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగిస్తుంది.

గ్యాలంట్రీ అవార్డు అందుకున్న మొదటి ఐఎఎఫ్ మహిళా అధికారిగా దీపికా మిశ్రా

వింగ్ కమాండర్ దీపికా మిశ్రా, భారత వైమానిక దళంలో గ్యాలంట్రీ అవార్డును అందుకున్న మొదటి మహిళా అధికారిగా అవతరించారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఆమెకు ఈ వాయు సేవా పతకాన్ని ప్రకటించారు. ఆ అవార్డును భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఆమెకు అందజేశారు. 2021 ఆగస్టులో ఉత్తర మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఆకస్మిక వరదల సమయంలో వింగ్ కమాండర్ దీపికా మిశ్రా చేసిన మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలకు ఈ గౌరవం లభించింది. ఆ సమయంలో ఆమె దాదాపు 47 మంది ప్రాణాలను కాపాడారు.

జు-జిట్సు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సబ్‌కత్ మాలిక్

కాశ్మీర్‌లోని బందిపొర జిల్లాలోని విజ్జారా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల బాలిక సబ్‌కత్ మాలిక్ ఈ ఏడాది మంగోలియాలో జరగనున్న జు-జిట్సు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఎంపిక అయ్యింది. దీనితో మార్షల్ ఆర్ట్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి కాశ్మీరీ మహిళగా అవతరించనున్నారు. సబ్‌కత్ మాలిక్ ఇదివరకు నేషనల్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో 9 సార్లు పాల్గొనగా 6 సార్లు గోల్డ్ మెడల్ మరియు 3 సార్లు సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.

ఢిల్లీలో ఈయూ-ఇండియా ఏవియేషన్ సమ్మిట్ 2023

యూరోపియన్ కమిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏప్రిల్ 20-21 తేదీలలో ఈయూ-ఇండియా ఏవియేషన్ సమ్మిట్‌ను ఢిల్లీలో నిర్వహించాయి. ఈ శిఖరాగ్ర సమావేశంలో కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య మరియు యూరోపియన్ కమిషనర్‌ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ శ్రీమతి ఆదినా వాలియన్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇండియా-ఈయూ దేశాల మధ్య కోవిడ్ అనంతర ఎయిర్ ట్రాఫిక్ పునరుద్ధరణ, వైమానిక రంగంలో సుస్థిరత & భద్రత, మానవ రహిత విమాన వ్యవస్థల అభివృద్ధి మరియు ఇరు ప్రాంతాల పరస్పర భాగస్వామ్య సవాళ్లు మరియు అవకాశాలపై దృష్టి సారించారు.

అలానే ఈ సమ్మిట్ సందర్భంగా యూరోకంట్రోల్‌తో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ఇంటెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేసింది. అదే సమయంలో ఇరు ప్రాంతాల సన్నిహిత సహకారం మరో ఇంటెంట్ మెమోరాండం లెటర్‌పై కూడా యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంతకం చేసింది.

వ్యవసాయ భూవివాదాల పరిష్కారం కోసం మహారాష్ట్రలో సలోఖ యోజన పథకం

మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూవివాదాల పరిష్కారం కోసం కొత్తగా సలోఖ యోజన పథకంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులు నామమాత్రపు రిజిస్ట్రేషన్ రుసుము 1,000/- మరియు స్టాంప్ డ్యూటీ 1,000/- చెల్లించి తమ భూములను ఇతర రైతులతో మార్పిడి చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ పథకం వ్యవసాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది, వ్యవసాయేతర, నివాస మరియు వాణిజ్య భూములకు వర్తించదు. ఈ పథకం భూ వివాదాలను పరిష్కరించడంలో పాటుగా సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడంలో రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

స్పేస్‌ఎక్స్ మొదటి స్టార్‌షిప్ రాకెట్ టెస్ట్ ప్రయోగం విఫలం

స్పేస్‌ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం సాంకేతిక కారణంతో విఫలమైంది. ఏప్రిల్ 20, 2023న టెక్సాస్‌లోని బోకా చికాలోని స్టార్‌బేస్ నుండి ప్రయోగించిన ఈ రాకెట్, పైకి ఎగిరిన కొద్దీ సమయంలోనే పేలుడు సంభవించి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో నేలకూలింది. ఇది స్పేస్‌ఎక్స్ ఇప్పటివరకు నిర్మించబడిన అత్యంత శక్తివంతమైన రాకెట్ వాహనంగా పరిగణించబడింది. ఈ ప్రయోగం వాహనంకి సంబంధించి ఇది మొదటి టెస్ట్ ఫ్లైట్‌గా గుర్తించబడింది.

స్టార్‌షిప్ అనేది ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న సూపర్ హెవీ-లిఫ్ట్ స్పేస్ లాంచ్ వెహికల్. ఇది 120 మీటర్ల ఎత్తుతో 5,000 మెట్రిక్ టన్నుల లిఫ్ట్‌ఆఫ్ చేసే సామర్థ్యం కలిగిఉంది. ఈ వాహక నౌకలో 33 సూపర్ హెవీ ఇంజిన్లు అమర్చబడి ఉంటాయి. స్టార్‌షిప్ ఇప్పటివరకు ఎగురవేయబడిన అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనంగా ఉండనుంది. అదే సమయంలో ఇది పూర్తి పునర్వినియోగపరచడానికి ఉద్దేశించినది. దీనిని మానవసహిత అంతరిక్ష పర్యటనల కోసం స్పేస్‌ఎక్స్ రూపొందిస్తుంది.

అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌కు వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఉక్రేనియన్‌లో మారియుపోల్ ఆసుపత్రి దాడికి సంబంధించిన అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ తీసిన చిత్రానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఈ చిత్రం మార్చి 9, 2022లో మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై రష్యా యొక్క క్రూరమైన దాడి తర్వాత  ప్రాణాంతకంగా గాయపడిన ఒక మహిళను రెస్క్యూ చేసిన సంధర్బంలోనిది.

ఈ చిత్రంలోని ఇరినా కాలినినా అనే 32 ఏళ్ల ఉక్రెయిన్ మహిళ, నిర్జీవమైన శరీరానికి జన్మనిచ్చిన అరగంట తర్వాత ఆమె గాయాలతో మరణించింది. ఈ చిత్రాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్‌ అయినా ఎవ్జెనీ మలోలెట్కా తన కెమెరాలో బంధించారు. ఈ దాడిలో 600 మంది పౌరులు మృతి చెందారు.

గ్రీస్ బహుపాక్షిక-వ్యాయామంలో పాల్గొన్న భారత వైమానిక దళం

భారత వైమానిక దళం ఏప్రిల్ 24 నుండి మే 4 మధ్య గ్రీస్‌లో జరిగే మెగా బహుపాక్షిక వ్యాయామం 'ఇనియోచోస్-2023 ఎక్సర్‌సైజ్‌' యందు పాల్గొంది. ఈ వ్యాయామం గ్రీసులో ఆండ్రావిడ వైమానిక స్థావరంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భారత వైమానిక దళానికి చెందిన నాలుగు సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, రెండు బోయింగ్ C-17 ఫైటర్ ఫ్లయిట్స్ పాల్గొన్నాయి.

దీనితో పాటుగా ఏప్రిల్ 17 నుండి మే 05 మధ్య ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ యొక్క వైమానిక దళ స్థావరం అయిన మోంట్-డి-మార్సన్‌లో నిర్వహిస్తున్న ఓరియన్ వ్యాయామంలో కూడా భారత వైమానిక దళం భాగస్వామ్యం అయ్యింది. ఈ వ్యాయామంలో ఇండియాతో పాటుగా జర్మనీ, గ్రీస్, ఇటలీ, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వైమానిక దళాలు కూడా పాల్గొన్నాయి.

హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2023లో భారత్‌కు మూడో స్థానం

హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రచురించిన గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం 68 యునికార్న్‌లతో 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు చైనా దేశాలు టాప్ రెండు స్థానాలలో ఉన్నాయి. భారతదేశం మొత్తం 138 యునికార్న్‌లను కలిగి ఉన్నప్పటికీ ఇందులో కేవలం 68 మాత్రమే భారతదేశంలోనే ఉన్నాయని వెల్లడించింది. మిగతా 70 భారతీయ సహ వ్యవస్థాపకులచే స్థాపించబడినవి వీటి  ప్రధాన కార్యాలయాలు భారతదేశం వెలుపల ఉన్నాయని నివేదించింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన నాన్-స్టేట్-నియంత్రిత వ్యాపారాల జాబితా అయిన హురున్ గ్లోబల్ 500 కంపెనీల ర్యాంకింగులో భారతదేశం ఐదవ స్థానంలో ఉంది. అలానే యునికార్న్ పెట్టుబడిదారుల పరంగా సీక్వోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ మరియు సాఫ్ట్‌బ్యాంక్ వరుసగా 238, 179 మరియు 168 యునికార్న్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టి మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.

అస్సాం, అరుణాచల్ సరిహద్దుల పరిష్కార ఒప్పందంపై సంతకాలు

అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తమ 50 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏప్రిల్ 20వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఈ ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండు రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న 123 గ్రామాలకు సంబంధించిన వివాదానికి ముగింపు పలకనుంది.

1971 యొక్క ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అస్సాం నుండి అరుణాచల్ ప్రదేశ్ వేరుపడింది. 1972లో అరుణాచల్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. ఈ సమయంలో అనేక ఆదివాసీ గ్రామాలు, వ్యవసాయ మైదానాలు అస్సాంలో కలపబడ్డాయి. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న దాదాపు 700 కిలోమీటర్ల సరిహద్దు వెంబడీ ఉంది. 2018 నుండి ఈశాన్య ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం బిఆర్‌యు, బోడో, కర్బీ ఆంగ్లోంగ్ మరియు గిరిజన శాంతి ఒప్పందంతో సహా అనేక ఒప్పందాలపై సంతకం చేయిస్తూ వస్తుంది.

ఛత్తీస్‌గఢ్ పంచాయితీలకు ఫెస్టివల్ గ్రాంట్స్

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పంచాయితీల పరిధిలో స్థానిక పండుగలను జరుపుకోవడానికి గ్రాంట్లు అందించే పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని 6,000 నాన్-షెడ్యూల్డ్ పంచాయితీల కోసం 'ముఖ్యమంత్రి ఛత్తీస్‌గఢి పరబ్ సమ్మాన్ నిధి యోజన' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద స్థానిక పండుగలను జరుపుకోవడానికి, ప్రతి గ్రామ పంచాయతీకి రెండు విడతలుగా రూ. 10,000 మొత్తం ఇవ్వబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక పండుగలు, సంస్కృతి మరియు గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను పరిరక్షించే మరియు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

కర్ణాటక ఎన్నికలలో 'ఓట్ ఫ్రమ్ హోమ్' అవకాశం

భారత ఎన్నికల కమిషన్ మొదటిసారిగా ఇంటి నుండి ఓటు ఎంపికను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. పట్టణ ప్రాంతాల్లో పౌరుల ఎన్నికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎంపికను ప్రవేశపెట్టింది. అయితే ఈ ఎంపిక ప్రస్తుతం వయస్సు కారణంగా (80 ఏళ్ళు మించి) లేదా అంగవైకల్యం కారణంగా పోలింగ్ బూత్‌ను సందర్శించలేని వారి కోసం మాత్రమే అందుబాటులో ఉంచింది. ఈ ఆప్షన్ పొందేందుకు ఓటర్లు 12డి ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న ఓటర్ల ఓటును నమోదు చేసేందుకు ఎన్నికల తేదికి 4 రోజుల ముందుగానే అధికారులు వారి ఇళ్లను సందర్శిస్తారు. ఈ గ్రూపులో స్థానిక ప్రిసైడింగ్ అధికారి, బూత్ స్థాయి అధికారి, పోలీసు సిబ్బంది మరియు వీడియోగ్రాఫర్ ఉంటారు. సంబంధిత అధికారి ఓటరుకు బ్యాలెట్ పేపర్‌తో కూడిన కవరు అందించి గోప్యత విధానంలో తిరిగి దానిని స్వీకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడుతుంది.

సినర్జీ గ్రూపుకు ప్రతిష్టాత్మక ట్యాంకర్ ఆపరేటర్ అవార్డు

ప్రముఖ షిప్పింగ్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సినర్జీ గ్రూప్, గ్లోబల్ ట్యాంకర్ మేనేజ్‌మెంట్‌లో లీడర్‌షిప్ రోల్‌కి గాను ప్రతిష్టాత్మక గ్రీన్4సి ట్యాంకర్ ఆపరేటర్ అవార్డు అందుకుంది. ఈ అవార్డును ఏప్రిల్ 20 న ఏథెన్స్‌లో జరిగిన హైబ్రిడ్ ఈవెంట్‌లో సొంతం చేసుకున్నారు. సినర్జీ గ్రూప్‌ను 2006లో కేరళకు చెందిన కెప్టెన్ రాజేష్ ఉన్ని స్థాపించారు.

ప్రస్తుతం ఈ గ్రూపు ఇది 13 దేశాలలో 22 కార్యాలయాల నుండి పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 21,000 మందికి పైగా నావిక సిబ్బందిని కలిగి ఉంది. 560 కంటే ఎక్కువ నౌకల యొక్క సాంకేతిక నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మెర్స్క్ ట్యాంకర్ల తయారీలో నిమగ్నమయ్యి ఉంది.

ఏంజెలా మెర్కెల్‌కు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం

జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆ దేశ అత్యున్నత గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును ప్రెసిడెంట్ ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మీర్ ఆమెకు అందజేశారు. ఏంజెలా మెర్కెల్ దాదాపు 16 సంవత్సరాలకు పైగా ఆ దేశానికి ఛాన్సలర్‌గా పనిచేశారు. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో మరియు 2015 శరణార్థుల సంక్షోభంతో సహా అనేక క్లిష్ట సమయాల్లో జర్మనీని విజయవంతంగా నడిపించిన మెర్కెల్‌ అపూర్వమైన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు.

ఆశా భోంస్లేకు లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించబడ్డారు. గత ఏడాది ఫిబ్రవరి మరణించిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఆమె కుటుంబం మరియు ట్రస్ట్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఈ అవార్డును ఏప్రిల్ 24న వారి తండ్రి మరియు ప్రముఖ థియేటర్-సంగీత కళాకారుడు దీనానాథ్ మంగేష్కర్ స్మారక దినం నాడు అందుకున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం దేశం మరియు సమాజం కోసం మార్గనిర్దేశం చేసిన వ్యక్తికి ఇవ్వబడుతుంది. గత ఏడాది ప్రారంభించిన ఈ అవార్డు తోలి గ్రహీతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు.

బ్యాంకాక్‌లో 8వ భారత్-థాయ్‌లాండ్ డిఫెన్స్ డైలాగ్

8వ ఇండియా-థాయ్‌లాండ్ డిఫెన్స్ డైలాగ్ బ్యాంకాక్‌లో ఏప్రిల్ 20న నిర్వహించబడింది. థాయిలాండ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్లా వర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు. గత దశాబ్ద కాలంగా భారతదేశం & థాయ్‌లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య నెలకొన్న రక్షణ సహకార అంశాలను సమీక్షించడంతో పాటుగా ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై ఇరు పక్షాలు అభిప్రాయాలను పంచుకున్నారు.

ఏపీలో 27 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు అందించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 9 అంశాల యందు ఉత్తమ పనితీరు కనబర్చిన మూడేసి పంచాయితీలకు అవార్డులు అందించారు.

గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంధర్బంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందిస్తుంది.

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 9 విభాగాల్లో అవార్డులు అందుకోగా, ఏపీ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా లభించలేదు. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉత్తమ పంచాయితీలను ఎంపిక చేసి అవార్డులు అందించింది.

అవార్డు థీమ్ పంచాయతీ జిల్లా
పేదరిక నిర్మూలన - ఉపాధి అవకాశాలు కల్పన గంగిరెడ్డిపల్లి
రాచర్ల
మల్లూరు
వైఎస్ఆర్ జిల్లా
ప్రకాశం జిల్లా
నెల్లూరు జిల్లా
హెల్దీ పంచాయతీ తరువ
భీమవరం
నడింపాలెం
అనకాపల్లి జిల్లా
అల్లూరి సీతారామరాజు
గుంటూరు
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ కసిపాడు
నేలమూరు
కుంతముక్కల
పల్నాడు జిల్లా
పశ్చిమ గోదావరి
ఎన్టీఆర్ జిల్లా
వాటర్ సఫిషియెంట్ పంచాయతీ ఇల్లూరు కొత్తపేట
వి.వి కండ్రిక
ధూపాడు
నంద్యాల
అన్నమయ్య
ఎన్టీఆర్ జిల్లా
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ కడలూరు
బిళ్ళనందూరు
జోగింపేట
తిరుపతి
కాకినాడ
మన్యం
సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ నందిగాం
కట్టకిందపల్లి
సూరప్పగూడెం
శ్రీకాకుళం
అనంతపురం
ఏలూరు
సోషియాల్లీ సెక్యూర్డ్ పంచాయతీ పశ్చిమ పెద్దవారిపాలెం
మందగేరి
రామభద్రాపురం
బాపట్ల
కర్నూలు
విజయనగరం
పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ సఖినేటిపల్లి లంక
నగరపాలెం
చోరగుడి
కోనసీమ
విశాఖపట్నం
కృష్ణ
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ మేడాపురం
జేగురుపాడు
మార్టూరు
శ్రీసత్యసాయి
తూర్పు గోదావరి
అనకాపల్లి

తెలంగాణకు 12 జాతీయ పంచాయతీ అవార్డులు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏప్రిల్ 17న దేశ వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలకు జాతీయ పంచాయితీ అవార్డులను అందించారు. ఇదే వేదిక ద్వారా న్యూఢిల్లీలో పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. పంచాయితీల సమగ్ర అభివృద్ధికి పిలుపునిస్తూ, ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కింద నిర్దేశించబడిన తొమ్మిది ఇతివృత్తాల ఆధారంగా ఈ అవార్డులు అందించారు.

గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ పార్లమెంట్ చేసిన 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన సంధర్బంగా ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉత్తమ పంచాయతీలకు అవార్డులను అందిస్తుంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ 12 విభాగాల్లో అవార్డులు అందుకోగా, ఏపీ రాష్ట్రానికి ఒక్క అవార్డు కూడా లభించలేదు. ఈ అవార్డులను నాలుగు కేటగిరిల వారీగా వివిధ థీమ్స్ ఆధారంగా చేసుకుని అందిస్తారు.

  1. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్
  2. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్
  3. గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్
  4. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌

దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ సతత్ వికాస్ పురస్కార్ కేటగిరిలో మొత్తం 9 రకాల థీమ్ అవార్డులు ఉండగా అందులో 8 అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పంచాయితీలు సొంతం చేసుకున్నాయి.

అవార్డు థీమ్ పంచాయతీ (బ్లాక్) జిల్లా
పేదరికం లేని & మెరుగైన జీవనోపాధి పంచాయితీ మండొడ్డి (రాజోలి) జోగులాంబ గద్వాడ్
హెల్దీ పంచాయతీ గౌతంపూర్ (చుంచుపల్లి) భద్రాద్రి కొత్తగూడెం
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ - -
వాటర్ సఫిషియెంట్ పంచాయతీ నెల్లుట్ల (లింగాలఘనపూర్) జనగాం
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ సుల్తాన్‌పూర్ (ఎలిగైడ్) పెద్దపల్లి
సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పంచాయతీ గంభీరావుపేట రాజన్న సిరిసిల్ల
సోషియాల్లీ సెక్యూర్డ్ పంచాయతీ కొంగట్‌పల్లి (హన్వాడ) మహబూబ్ నగర్
పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ చీమల్దారి (వికారాబాద్) మోమిన్‌పేట
ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ ఐపూర్ (ఆత్మకూర్) సూర్యాపేట

నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ విభాగంలో కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ ఉత్తమ బ్లాక్ పంచాయత్ అవార్డు చేజిక్కించుకుంది. అలానే తెలంగాణలోని ములుగు జిల్లా ఉత్తమ డిస్ట్రిక్ బ్లాక్ పంచాయత్ అవార్డు అందుకుంది.

గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కె) పంచాయతీ స్పెషల్ కేటగిరిలో అవార్డు పొందింది. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయత్ పురస్కార్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లాలోని కన్హా గ్రామ పంచాయితీ స్పెషల్ కేటగిరిలో అవార్డు పొందింది. అవార్డుల పార్టీ జాబితా

న్యూఢిల్లీలో మొద‌టి గ్లోబ‌ల్ బౌద్ధ స‌మిట్‌

అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 20న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ మరియు శ్రీమతి మీనాక్షి లేఖి అలానే అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్ డాక్టర్ దమ్మపియా కూడా పాల్గొన్నారు.

రెండు రోజుల నిడివితో నిర్వహించిన ఈ సమ్మిట్ 'రెస్పాన్సేస్ టు కాంటెంపరరీ ఛాలెంజెస్ : ఫీలోసోఫీ టూ ప్రాక్సిస్' అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా బౌద్ధమతం మరియు వారి జీవన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సమకాలీన పరిస్థితులలో బుద్ధ ధర్మం యొక్క ప్రాథమిక విలువలు ఎలా స్ఫూర్తిని మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తాయో ఈ వేదిక ద్వారా తెలియజేశారు.

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు రోజుల మిల్లెట్ మహోత్సవ్

ఏప్రిల్ 20,21 తేదీల్లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండు రోజుల మిల్లెట్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ మిల్లెట్స్ కాన్ఫరెన్స్‌ను కేంద్ర ఫుడ్ మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్త నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ఫుడ్ పరిశ్రమ నిపుణులు మరియు ఫుడ్ ప్రాసెసింగ్‌లో నిమగ్నమైన మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ల మధ్య ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించారు. దీనిలో  ప్రధానంగా వ్యవసాయ ఆహార ప్రాసెసింగ్ వ్యాపార అవకాశాలు, వివిధ పథకాలు, ప్రోత్సాహకాలు, మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు మరియు వివిధ మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులపై చర్చలు నిర్వహించారు.

జాతీయ క్వాంటం మిషన్‌కు క్యాబినెట్ ఆమోదం

దేశీయ క్వాంటం టెక్నాలజీలో సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్‌ను పెంపొందించడానికి సంబంధించి నేషనల్ క్వాంటం మిషన్‌కు ఏప్రిల్ 19న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 నుండి 2030-31 వరకు ఈ నేషనల్ క్వాంటం మిషన్ అమలులో ఉండనుంది. దీని కోసం దాదాపు 6003.65 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించింది. క్వాంటం టెక్నాలజీస్ & అప్లికేషన్స్ అభివృద్ధిలో భారతదేశాన్ని ప్రముఖ దేశాలలో ఒకటిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం దీనిని రూపొందించింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌తో సహా ఆరు దేశాలు క్వాంటం టెక్నాలజీలో రంగంలో ముందు వరుసలో ఉన్నాయి.

ఈ మిషన్ అటామిక్ సిస్టమ్స్‌లో అత్యంత సున్నితత్వంతో కూడిన మాగ్నెటోమీటర్‌లు మరియు ఖచ్చితమైన టైమ్, కమ్యూనికేషన్‌, నావిగేషన్ సమాచారం అందించే అటామిక్ క్లాక్‌లను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అలానే సూపర్ కండక్టర్స్, సెమీకండక్టర్ స్ట్రక్చర్‌లు మరియు క్వాంటం పరికరాల తయారీ కోసం టోపోలాజికల్ మెటీరియల్స్ వంటి క్వాంటం పదార్థాల రూపకల్పన మరియు సంశ్లేషణకు కూడా మద్దతు ఇస్తుంది.

ఇందులో భాగంగా దేశంలోని క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ & మెట్రాలజీ మరియు క్వాంటం మెటీరియల్స్ & డివైజెస్  డొమైన్‌లలోని టాప్ అకడమిక్ మరియు నేషనల్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో నాలుగు థీమాటిక్ హబ్‌లు (T-హబ్‌లు) ఏర్పాటు చేయనున్నారు. ఈ హబ్‌లు నిర్దేశించబడిన రంగాలలో పరిశోధనలను ప్రోత్సహిస్తాయి.

క్వాంటం టెక్నాలజీ అనేది ఫిజిక్స్ మరియు ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ఆధునిక సాంకేతిక విభాగం, ఇది క్వాంటం మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించడం ద్వారా పనిచేసే సాంకేతికత. క్వాంటం మెకానిక్స్ ముఖ్యంగా క్వాంటం ఎంటాంగిల్మెంట్, క్వాంటం సూపర్‌పొజిషన్ మరియు క్వాంటం టన్నెలింగ్ లక్షణాలపై ఆధారపడే సాంకేతికతలను కలిగి ఉంటుంది. మొదటి తరం క్వాంటం టెక్నాలజీ మనకు ట్రాన్సిస్టర్‌, లేజర్‌, సెమీకండక్టర్ మరియు జీపీఎస్ వంటి ఉత్పత్తులను ఇచ్చి ఆధునిక సాంకేతికతకు పునాది వేసింది. ప్రస్తుతం ఈ రంగంలో అత్యున్నత పరిశోధనలు జరుగుతున్నాయి.

సీడ్ ట్రేసిబిలిటీ పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్‌ ప్రారంభం

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఏప్రిల్ 19న SATHI (సీడ్ ట్రేసిబిలిటీ, ఆథెంటికేషన్ అండ్ హోలిస్టిక్) అనే వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ యాప్ విత్తనోత్పత్తి, విత్తన నాణ్యత సవాళ్లను ఎదుర్కోవటం కోసం రూపొందించారు. ఇవి క్యూఆర్ కోడ్ ఆధారిత సాంకేతిక ద్వారా సంబంధిత విత్తన ప్యాకేజీకి సంబందించిన సమాచారాన్ని అందిస్తాయి.

సతి యాప్ విత్తన నాణ్యత హామీ వ్యవస్థను నిర్ధారిస్తుంది, విత్తన ఉత్పత్తి గొలుసులో విత్తన మూలాన్ని గుర్తిస్తుంది. ఈ గొలుసులో విత్తన పరిశోధన సంస్థ, విత్తన ధృవీకరణ సంస్థ, విత్తన లైసెన్సింగ్, సీడ్ కేటలాగ్, డీలర్ టు ఫార్మర్ సేల్స్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ వంటి సమాచారం ఉంటుంది.

సోనమ్ వాంగ్‌చుక్‌కి ప్రతిష్టాత్మక సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డు

లడఖ్‌ ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యా సంస్కరణవాది సోనమ్ వాంగ్‌చుక్ ప్రతిష్టాత్మక సంతోక్‌బా హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు.ఈ అవార్డు దివంగత పారిశ్రామికవేత్త సంతోక్‌బా ధోలాకియా గౌరవార్థం స్థాపించబడింది. ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 10న ఈ అవార్డు అందజేస్తారు. ఎడ్యుకేషన్, హెల్త్, మరియు సామజిక రంగంలో సేవలు అందించే వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. విజేతకు కోటి రూపాయల నగదు బహుమతి, జ్ఞాపికను అందిస్తారు.

లడఖ్‌లోని స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL) వ్యవస్థాపక-డైరెక్టరుగా ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌, విద్య మరియు అభ్యాస రంగంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా గుర్తింపు పొందారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం '3 ఇడియట్స్‌' ఈయన కాల్పనిక పాత్ర ఆధారంగానే రూపొందించబడింది. మెగససే అవార్డు గ్రహీత అయినా సోనమ్ వాంగ్‌చుక్, తన పేరుతో 400 కంటే ఎక్కువ పేటెంట్లను కలిగి ఉన్నాడు.

ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌కు అర్జెంటీనా ఆతిధ్యం

ఈ ఏడాది మే, జూన్ నెలలలో జరగాల్సిన ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌కు ఇండోనేషియా స్థానంలో అర్జెంటీనా ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రీడా ఈవెంట్ అధికారికంగా ఇండోనేసియాలో జరగాల్సి ఉంది. అయితే  ఇజ్రాయెల్ జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇండోనేషియా గవర్నర్ నిరాకరించడంతో పాటుగా బాలిలో జరగాల్సిన ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్  డ్రాను రద్దు చేయడంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.

గత కొద్దీ ఏళ్లుగా ఇండోనేషియాకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని ఇండోనేషియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతి కుదిరిన తర్వాత మాత్రమే ఇజ్రాయెల్‌తో పూర్తి దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడం సాధ్యమవుతుందని 2005లో ఇండోనేషియా పేర్కొంది. ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పెంపొందించేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకుల చర్యలు ప్రతిసారీ బెడిసికొట్టాయి.

జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించిన జి20 ప్రతినిధులు

పనాజీలో నిర్వహించిన జి 20 ఆరోగ్య కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న జి20 ప్రతినిధులు. దగ్గరలో ఉన్న జన్ ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా వీరికి జనౌషధి పరియోజన దేశంలోని ప్రతి మూల మరియు మూలలో ప్రజలకు నాణ్యమైన మరియు సరసమైన మందులను ఎలా అందజేస్తుందో వివరించారు. ఈ సంధర్బంగా ఆరోగ్య సూచికల పరంగా ఆఫ్రికాలో అత్యంత అధ్వాన్నంగా ఉన్న నైజీరియా, జన్ ఔషధి కేంద్రాల తరహాలో స్టోర్లను తమ దేశంలో ఏర్పాటు చేయడానికి భారతదేశ సహాయాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దేశంలో అందరికీ సరసమైన ధరలకు నాణ్యమైన జెనరిక్ ఔషధాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో  అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెంట్రల్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌తో కలిసి ఫార్మాస్యూటికల్స్ మంత్రిత్వ శాఖ వీటిని నిర్వహిస్తుంది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డేటా ప్రకారం, చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. చైనా కంటే భారత్ దాదాపు 3 మిలియన్ల అధిక జనాభాను కలిగివున్నట్లు నివేదించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తన దీర్ఘకాల హోదాను త్వరలో వదులుకోనుందని పేర్కొంది. ఏప్రిల్ 14, 2023 నాటికి భారతదేశ జనాభా 1,425,775,850కి చేరుకుంటుందని నివేదించింది.

2023 మరియు 2050 మధ్య, 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి సంఖ్య చైనా కంటే భారతదేశంలో రెండింతలు పెరుగుతుందని అంచనా వేయబడింది. అయితే మొత్తం జనాభా నిష్పత్తితో పోల్చుకుంటే భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుదల చైనా కంటే చాలా నెమ్మదిగా ఉండనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. తదుపరిది 2021లో ప్రారంభం కాగా కోవిడ్-19 కారణంగా వాయిదా వేయబడింది.

ఈ నివేదికను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రూపొందించింది. ఇది ప్రపంచ జనాభా అభివృద్ధి, లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై పనిచేసే అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ. దీనిని 1969లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది.

తమిళనాడు కంబమ్ ద్రాక్షకు జిఐ గుర్తింపు

తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కంబమ్ పన్నీర్ త్రాట్‌చై లేదా కుంబమ్ ద్రాక్ష ఇటీవలే భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ దక్కించుకుంది. దీనిని కొన్నిసార్లు మస్కట్ హాంబర్గ్ అని కూడా పిలుస్తారు. దాదాపు 2వేల ఎకరాలలో పండించే ఈ ద్రాక్షను వైన్, స్పిరిట్స్, జామ్‌లు, క్యాన్డ్ ద్రాక్ష రసం మరియు ఎండుద్రాక్షలను తయారు చేయడానికి విరివిగా ఉపయోగిస్తారు. తమిళనాడులోని పశ్చిమ కనుమల పరిధిలో కనిపించే కుంబమ్ లోయను దక్షిణ భారతదేశం యొక్క ద్రాక్ష నగరంగా పరిగణిస్తారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు

ప్రభుత్వ శాఖల్లో 100 శాతం ఈవీలను కలిగి ఉన్న దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించింది. యూపీ ప్రభుత్వం గత ఏడాదే 2030 నాటికీ అన్ని ప్రభుత్వ వాహనాలను ఎలెక్టిక్ వాహనాలతో భర్తీ చేసే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇకపోతే దేశంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించబడే మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ ఇప్పటికే ఈ గుర్తింపు పొందింది.

బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఐకాన్‌గా ట్రాన్స్‌జెండర్ మోనికా దాస్

బీహార్ ఎన్నికలకు రాష్ట్ర ఐకాన్‌గా ట్రాన్స్‌జెండర్ మోనికా దాస్‌ను నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనితో మోనికా తోలి ట్రాన్స్‌జెండర్ 'స్టేట్ ఐకాన్ ఆఫ్ బీహార్'గా ఘనతను సొంతం చేసుకుంది. గతంలో 2020లో జరిగిన బీహార్ ఎన్నికలలో మోనికా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు.

పాట్నా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో పీజీ చేసిన ఈమె దేశ చరిత్రలో మొదటి ట్రాన్స్‌జెండర్ బ్యాంకు ఉద్యోగిగా గుర్తింపు పొందారు. లింగమార్పిడి వ్యక్తులకు సంబందించిన  మంగళముఖి కమ్యూనిటీ ఎన్నికలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని జెమితాంగ్ గ్రామం బౌద్ధ సదస్సుకు ఆతిధ్యం

అరుణాచల్ ప్రదేశ్‌లోని జెమితాంగ్‌ గ్రామం ఒక ప్రధాన బౌద్ధ సదస్సుకు ఏప్రిల్ 17న ఆతిధ్యం ఇచ్చింది. ఈ సదస్సును ఇండియన్ హిమాలయన్ కౌన్సిల్ ఆఫ్ నలంద బుద్దిస్ట్ ట్రెడిషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టిబెటన్ ఆధ్యాత్మిక నాయకులతో సహా భారతదేశం అంతటా 600 పైగా బౌద్ధ సన్యాసులు హాజరయ్యారు. అలానే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా హాజరయ్యారు. నలంద బౌద్ధమత మూలాన్ని తిరిగి పొందడం అనే ప్రధాన అంశంపై ఈ జాతీయ సదస్సును నిర్వహించారు.

జెమితాంగ్ గ్రామం అంటే "ఇసుక లోయ" అని అర్ధం. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలో న్యామ్‌జాంగ్ చు నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు అని పిలువబడే పాంగ్‌చెన్పా ప్రజలకు నిలయం. ఈ ప్రాంతం 1959లో 14వ దలైలామా, చైనా-ఆక్రమిత టిబెట్ నుండి భారతదేశంలోకి ప్రవేశించిన చివరి మరియు మొదటి భారత సరిహద్దుగా గుర్తింపు పొందింది.

జైశంకర్ నాలుగు లాటిన్ అమెరికా దేశాల పర్యటన

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఏప్రిల్ 21 నుండి 29 మధ్య నాలుగు మధ్య మరియు లాటిన్ అమెరికా దేశాలలో పర్యటించారు. ఆయన పర్యటించిన దేశాల జాబితాలో గయానా (ఏప్రిల్ 21-23), పనామా (ఏప్రిల్ 24-25), కొలంబియా (ఏప్రిల్ 25-27) మరియు డొమినికన్ రిపబ్లిక్ (ఏప్రిల్ 27-29) ఉన్నాయి.

విదేశాంగ మంత్రిగా జైశంకర్ ఈ దేశాలను పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ప్రధానంగా వ్యాపార, వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధిత అంశాలలో సంబంధాలను ప్రోత్సహించడంతో పాటుగా సాంకేతికతతో సహా వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా సాగింది.

మణిపూర్‌లో హున్-థాడౌ కల్చరల్ ఫెస్టివల్ 2023

5వ వార్షిక మణిపూర్ హున్-థాడౌ సాంస్కృతిక ఉత్సవాలను ఏప్రిల్ 17, 18వ తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభ వేడుకను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ప్రారంభించారు. ముగింపు వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా హాజరయ్యారు.

హున్-తాడౌ  పండుగ అనేది మణిపూర్ యొక్క థాడస్ (థాడౌ) కమ్యూనిటీ యొక్క వార్షిక సాంస్కృతిక ఉత్సవం. ఈ పండుగలో థాడౌ తెగకు చెందిన సాంప్రదాయ ఆచార ప్రదర్శనలు, జానపద నృత్యాలు మరియు వారి సాంప్రదాయ ఆటలు, వారి పురాతన వస్తువుల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జి20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గాదరింగ్ కాన్ఫరెన్స్

రెండు రోజుల జి20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ గాదరింగ్ ( RIIG) యొక్క 2వ కాన్ఫరెన్స్ ఏప్రిల్ 19 మరియు 20వ తేదీలలో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో జి-20 సభ్యదేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, సైంటిఫిక్ కమ్యూనిటీకి చెందిన నిపుణులు పాల్గొన్నారు.

సమతౌల్య సమాజానికి పరిశోధన మరియు ఆవిష్కరణ అనేదే నినాదంతో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. దీనికి సంబందించిన మొదటి సమావేశం గత మార్చి 23న అస్సాంలోని దిబ్రూఘర్‌లో జరిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో స్టేట్‌గా సిరియా

పశ్చిమాసియా దేశమైన సిరియా ప్రపంచంలోనే అతిపెద్ద నార్కో-స్టేట్‌గా ప్రకటించబడింది. ప్రస్తుతం సిరియా నిషేదిత మారకద్రవ్యాలను ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఎగుమతి చేస్తున్న దేశంగా అవతరించింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ దీనిపైనే మనగడ సాధిస్తుందని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యంత వ్యసనపరమైన క్యాప్టాగన్ డ్రాగ్, ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాథమిక జీవనాధారంగా మారింది. దాని విదేశీ కరెన్సీలో 90% దీని ద్వారే ఆర్జిస్తుంది.

2021లో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) చే గుర్తించబడిన ఈ నిషేధిత డ్రగ్ అయిన క్యాప్‌గాన్, యాంఫేటమిన్ మరియు కెఫిన్‌లతో మిళితమై ఉంటుంది. ఈ సింథటిక్ ఉద్దీపన ఔషధం 1961లో జర్మన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ద్వారా ఉత్పత్తి చేయబడింది. అప్పటిలో దీనిని అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్, నార్కోలెప్సీ మరియు డిప్రెషన్ వంటి వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే వారు.

అయితే తర్వాత కాలంలో క్యాప్టాగన్ అత్యంత వ్యసనపరమైన మరియు మానసిక, శారీరక ఆరోగ్యానికి హానికరమైన ఔషధంగా గుర్తించబడింది. తద్వారా ఇది ప్రపంచ వ్యాప్తంగా నిషేదించబడింది.

యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

1960 జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద, కేంద్ర ప్రభుత్వం కొత్తగా యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023ని నోటిఫై చేసింది. ఈ రూల్స్ గతంలో నోటిఫై చేసిన 2001 యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ స్థానంలో భర్తీ చేసింది. ఈ కొత్త రూల్స్‌ను 2009 నాటి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు పీపుల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ స్ట్రే ట్రబుల్స్ యొక్క రిట్ పిటీషన్ నెం. 691లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుగుణంగా రూపొందించింది. అదే సమయంలో కుక్కల తరలింపుకు సంబంధించి సుప్రీంకోర్టు వివిధ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా నూతన నియమాలు చేర్చింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం, వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ & ఇమ్యునైజేషన్ సంబంధించి యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను సంబంధిత స్థానిక సంస్థలు/మున్సిపాలిటీలు/మున్సిపల్ కార్పొరేషన్లు మరియు పంచాయతీలు నిర్వహించాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా నిర్వహించకపోవడం వలన ఇటు మానవులకు, అటు కుక్కలకు భౌతిక నష్టం జరుగుతుంది. దీనిని నివారించేందుకు కొత్తగా ఈ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.

మనుషులు మరియు వీధికుక్కల సంఘర్షణను అధిగమించేందుకు ఒక ప్రాంతంలోని కుక్కలను తరలించకుండా, యాంటీ రేబీస్ ప్రోగ్రామ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కరించాలని సూచించింది. అదే విధంగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థలే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ నిర్వరించాలనే నిబంధనను చేర్చింది.

స్థానిక సంస్థలు ఈ నియమాలు స్ఫూర్తితో అమలు చేయడం ద్వారా జంతు జనన నియంత్రణ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించవచ్చు అని పేర్కొంది. ఈ నూతన రూల్స్ జంతు సంక్షేమ సమస్యలను పరిష్కరించడానికి అలానే వీధి కుక్కల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తుంది.

గ్రామీణ మహిళల కోసం 'సంగతన్ సే సమృద్ధి' పథకం

అట్టడుగున ఉన్న గ్రామీణ మహిళలను స్వయం సహాయక గ్రూపుల (ఎస్‌హెచ్‌జి) నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'సంగతన్ సే సమృద్ధి' పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబందించిన ప్రచార కార్యక్రమాన్ని ఏప్రిల్ 18న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు.

ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల పరిధిలో ఉన్న తొమ్మిది కోట్ల మంది మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దీనిని రూపొందించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించే మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న ప్రతి మహిళ ఏడాదికి లక్ష రూపాయలు సంపాదించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీర్చిదిద్దింది.

ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023కి చెన్నై ఆతిథ్యం

ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2023కి చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ ఈ ఏడాది ఆగస్టు 3 నుండి 12 వ తేదీల మధ్య జరగనుంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ టోర్నీలో భారత్‌తో పాటు మూడుసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేత మరియు డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా, మలేషియా, పాకిస్థాన్, జపాన్, చైనా జట్లు పాల్గొంటాయి.

భారత్ ఈ టోర్నీలో 2011, 2016 ఏడాదిలో విజేతగా నిలిచింది. ఈ వేదిక ఖరారు సంబంధించి చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో తమిళనాడు క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరియు హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ (హెచ్‌ఐ) భోలా నాథ్ సింగ్ పాల్గొన్నారు.

మహిళా సమ్మాన్ పొదుపు పథకంపై ప్రత్యేక కవర్‌ను విడుదల చేసిన పోస్టల్ శాఖ

తెలంగాణలో మహిళా సమ్మాన్ పొదుపు పథకంపై తపాలా శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జెసింగ్‌భాయ్ చౌహాన్ ఈ కవర్‌ను విడుదల చేశారు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది ఏప్రిల్ 2023 నుండి మార్చి 2025 వరకు రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే వన్-టైమ్ స్కీమ్. ఇది స్థిరంగా రెండేళ్లపాటు మహిళలు లేదా బాలికల పేరిట గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. దీనిని ఈ ఏడాది ఫిబ్రవరి 2023 బడ్జెట్‌ సమయంలో ప్రకటించారు. మహిళా పెట్టుబడిదారులలో పెట్టుబడి ఆలోచనను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రారంభించబడింది. 18 ఏళ్ళు నిండిన మహిళలు అందరూ అర్హులు. సేవింగ్స్ పై 7.50 శాతం వడ్డీని అందిస్తారు.

ఉత్సా పట్నాయక్‌కు మాల్కం ఆదిశేషయ్య అవార్డు

జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రఖ్యాత ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ ఈ ఏడాది మాల్కం ఆదిశేషయ్య అవార్డుకి ఎంపికయ్యారు. మాల్కం & ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును సామాజిక రంగంలో అత్యుత్తమ సేవలు అందించే వ్యక్తులకు అందజేస్తారు. మాల్కం & ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ ఆర్థిక శాస్త్రం మరియు అభివృద్ధి అధ్యయనాలలో ప్రాథమిక మరియు అనువర్తిత బోధన పరిశోధనలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేయబడింది.

మాల్కం సత్యనాథన్ ఆదిశేషయ్య ప్రముఖ భారతీయ ఆర్థిక మరియు విద్యావేత్త. ఈయన 1976లో భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్‌ను పొందారు. 1998లో యునెస్కో విద్య మరియు అక్షరాస్యతకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈయన పేరున యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత బహుమతిని సృష్టించింది. ఆదిశేషయ్య గతంలో మద్రాసు యూనివర్శిటీ వైస్ ఛాన్సలరుగా సేవలు అందించారు.

కార్బన్ రహిత విద్యుత్ ఉత్పత్తి దిశగా జీ7 దేశాలు

ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ సెవెన్ దేశాలు అయినా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌, 2035 నాటికి కార్బన్ రహిత విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేయాలని ప్రతిజ్ఞ చేశాయి. ఏప్రిల్ 15-16 తేదీలలో జపాన్‌లో వాతావరణం, ఇంధనం మరియు పర్యావరణంపై జరిగిన రెండు రోజుల జి7 మంత్రుల సమావేశం తర్వాత, సభ్య దేశాల మంత్రులు మరియు దూతలు ఈ ప్రకటన చేశారు.

వచ్చే నెలలో హిరోషిమాలో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందస్తూ సమావేశంగా దీనిని నిర్వహించారు. ప్రస్తుతం జపాన్ జీ7 దేశాల అధ్యక్ష హోదాలో ఉంది. ఈ సమావేశానికి ప్రస్తుతం జీ20 అద్యక్షతలో ఉన్న ఇండియాకు అతిధిగా హాజరయ్యేందుకు ఆహ్వానం అందగా, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ హాజరయ్యారు.

ఫిన్‌లాండ్‌లో అతిపెద్ద అణు రియాక్టర్ ప్రారంభం

ఐరోపాలో అత్యంత శక్తివంతమైన ఓల్కిలువోటో 3 అణు రియాక్టర్ ఫిన్లాండ్‌లో ప్రారంభమైంది. 1,600 మెగావాట్ సామర్థ్యం కలిగిన ఈ రియాక్టర్ గత మార్చి 2022లో ఫిన్నిష్ నేషనల్ పవర్ గ్రిడ్‌కి కనెక్ట్ చేయబడింది. తాజాగా ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో ఫిన్‌లాండ్ యొక్క ఇంధన భద్రతకు డోకా లేకుండాపోయింది. ఇది రాబోయే 60 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. ఫిన్లాండ్ ప్రస్తుతం రెండు పవర్ ప్లాంట్లలో ఐదు అణు రియాక్టర్లను కలిగి ఉంది. ఇవి 60% దేశీయ విద్యుత్‌ అవసరాన్ని తీర్చుతున్నాయి.

గుజరాత్‌లో సౌరాష్ట్ర - తమిళ సంగమం కల్చరల్ ఈవెంట్

గుజరాత్‌లోని సోమనాథ్‌లో సౌరాష్ట్ర తమిళ సంగమం సాంస్కృతిక మహోత్సవంను ఏప్రిల్ 17న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. పది రోజుల పాటు జరిగే ఈ సాంస్కృతిక మహోత్సవంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య పాల్గొన్నారు.

గుజరాత్ మరియు తమిళనాడు మధ్య పురాతన సాంస్కృతిక బంధాన్ని పెంపొందించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సంగమంలో భాగంగా, ప్రతినిధులు సోమనాథ్, ద్వారక మరియు ఐక్యతా విగ్రహం వంటి వివిధ వారసత్వ మరియు పర్యాటక ప్రదేశాలను సందర్శించి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

బీహార్‌లో థావే మహోత్సవం 2023

బీహార్ పర్యాటక శాఖ మరియు కళ మరియు సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఏప్రిల్ 15 మరియు 16 తేదీలలో గోపాల్‌గంజ్‌లో వార్షిక థావే ఉత్సవాన్ని నిర్వహించింది. దీనిని థావే దుర్గ దేవాలయ వార్షిక ఉత్సవాలలో భాగంగా జరుపుకుంటారు. దీనిని 2012 లో మొదటిసారి జరుపుకున్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. గోపాల్‌గంజ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం మరియు తావే దుర్గా ఆలయానికి సందర్శకులను ఆహ్వానించడం ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యం.

వారణాసిలో జీ20 అగ్రికల్చరల్ చీఫ్ సైంటిస్ట్స్ సమావేశం

భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం వారణాసిలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఏప్రిల్ 17- 19 తేదీలలో వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ (DARE) మరియు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉమ్మడిగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంను 'సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ హెల్తీ పీపుల్ అండ్ ప్లానెట్' అనే థీమ్‌తో నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆహార భద్రత మరియు పోషకాహారం, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ అగ్రికల్చర్, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ వంటి వాటితో సహా వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు.

బెంగళూరులో మొదటి జీ20 ఆర్థిక మంత్రులు & సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం

జీ20 ఇండియన్ ప్రెసిడెన్సీలో మొదటి జీ20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల (FMCBG) సమావేశం 2023 ఏప్రిల్ 23 నుండి 24 వ తేదీల్లో కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించబడింది. ఈ రెండు రోజుల సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి జీ20 సభ్యు దేశాల ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు మరియు వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యారు. 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను బలోపేతం చేయడమనే అంశంపై చర్చలు నిర్వహించారు.

సుడాన్‌ నుండి భారత పౌరుల తరలింపు కోసం ఆపరేషన్ కావేరి

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి 'ఆపరేషన్ కావేరి' పేరుతొ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సూడాన్ అంతటా ఉన్న దాదాపు 3,000 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తరలించడానికి భారత నౌకలు, విమానాలను ఉపయోగించింది. గత కొన్ని రోజులుగా సూడాన్‌ సైన్యం మరియు పారామిలటరీ గ్రూపు మధ్య జరుగుతున్నా ఆధిపత్య యుద్ధంలో దాదాపు వందల మంది సాధారణ పౌరులు మరణించారు.

1956 లో బ్రిటన్ నుండి స్వాతంత్రం పొందిన సుడాన్, ఏనాడూ సుస్థిరంగా, ప్రశాంతంగా ఉన్నా దాఖలాలు లేవు. 2019 లో సుడాన్ ప్రజలు30 ఏళ్ళ దుర్మార్గ ఒమర్ అల్-బషీర్‌ పాలనను అంతమొందించి, దేశంలో మధ్యంతర ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే 2021లో అప్పటి సైనిక అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, సైనిక కుట్రతో ఈ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవడంతో మళ్ళీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీనికి రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అనే మరో పారామిలిటరీ దళ నాయకుడు మొహమ్మద్ హమ్దాన్ కూడా సహకరించారు.

మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత వీరిద్దరి మధ్య సైనిక ఏకీకరణకు సంబందించిన ప్రతిపాదనలో వివాదం తలెత్తి యుద్దానికి దారి తీసింది. సైనిక అధ్యక్షుడుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న బుర్హాన్, ఇప్పుడు పారామిలిటరీ దళాన్ని కూడా సైన్యంలో విలీనం చేస్తే, తన భవిష్యత్తు అంధకారం అవుతుందనే భయంతో ఆర్ఎస్ఎఫ్ నాయకుడు మొహమ్మద్ హమ్దాన్ ఈ యుద్దానికి బీజం పోశారు. ఈ ఇరు దళాల మధ్య వైర్యం ఇప్పుడు సుడాన్ ప్రజల చావుకి వచ్చింది.

ఇకపోతే భారత్ గతంలో వివిధ పేర్లతో ఇటివంటి ఆపరేషన్లు నిర్వహించింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భూకంపంతో స్వర్వం కోల్పోయిన టర్కీ మరియు సిరియా దేశాలకు సహాయం చేయడానికి భారత్ 'ఆపరేషన్ దోస్త్' పేరుతొ శోధన మరియు రెస్క్యూ బృందాలను పంపింది.

2021 లో తాలిబన్లు, ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో భారత్ పౌరులను తరలింపు కోసం ఆపరేషన్ దేవి శక్తి పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కోవిడ్-19 సమయంలో విదేశాల నుండి భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే జాతీయ ప్రయత్నంలో భాగంగా మే 2020లో ఆపరేషన్ సముద్ర సేతు ప్రారంభించబడింది. 2021లో భారత నౌకాదళం భారతదేశానికి ఆక్సిజన్ నింపిన కంటైనర్‌లను రవాణా చేయడానికి ఆపరేషన్ సముద్ర సేతు-II ని నిర్వహించింది.

2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్ లో ఇరుక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా పేరుతొ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. 2015 లో నేపాల్ లో సంభవించిన భయంకర భూకంపములో సర్వం కోల్పోయిన నేపాల్ దేశానికి సహాయ సహకారాలు అందించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ మైత్రిని నిర్వహించింది.

Post Comment