ముఖ్యమైన రోజులు మరియు తేదీలు మే 2023 కోసం చదవండి. మే నెలలో జరుపుకునే వివిధ జాతీయ దినోత్సవాలు మరియు అంతర్జాతీయ దినోత్సవాల వివరాలు తెలుసుకోండి. ప్రముఖుల పుట్టిన రోజులు, మరణాల సమాచారం కూడా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం | మే 01
ఏటా మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంను మే డే అని కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమంను కార్మికుల పోరాటాలు మరియు త్యాగాలను గుర్తుచేసుకోవడానికి జరుపుకుంటారు. 1886 లో చికాగో కార్మిక సమ్మెలో బాంబు దాడి తరువాత, దాని జ్ఞాపకార్దంగా 1889లో మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ ఈ వేడుకను ప్రతిపాదించింది.
ఉజ్వల దివస్ | మే 01
ఏటా మే 1వ తేదీని ఉజ్వల దివాసుగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంను ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం యొక్క విజయోత్సవ కార్యక్రమంగా జరుపుకొనున్నారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) అనేది దేశంలోని ప్రతి బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌ని అందించే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ పథకంను 1 మే 2016న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉజ్వల దివాసును మొదటిసారి 2022 లో నిర్వహించారు.
వరల్డ్ లాఫ్టర్ డే | మే మొదటి ఆదివారం
ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారంను ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ వార్షిక కార్యక్రమం నవ్వు మరియు దాని యొక్క అనేక వైద్యం ప్రయోజనాల గురించి అవగహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ఇది మొదటిసారి 1998లో భారతదేశంలోని ముంబై నగరంలో నిర్వహించబడింది, దీనిని ప్రపంచవ్యాప్త నవ్వుల యోగా ఉద్యమాన్ని స్థాపించిన డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించారు.
ప్రపంచ ట్యూనా దినోత్సవం | మే 02
ప్రపంచ ట్యూనా దినోత్సవంను ప్రతి ఏడాది మే 2వ తేదీన నిర్వహిస్తారు. దీనిని ట్యూనా చేపలకు సంబంధించి స్థిరమైన ఫిషింగ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడంతో పాటుగా ఆ జాతుల సంరక్షణ కోసం తెలియజెప్పేందుకు నిర్వహిస్తారు. దీనిని 2017 లో ఐక్యరాజ్యసమితి మొదటిసారి ప్రారంభించింది.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే | మే 03
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంను ఏటా మే 3వ తేదీన నిర్వహిస్తారు. ఈ వార్షిక కార్యక్రమంను పత్రికా స్వేచ్ఛ మరియు భావప్రకటనా స్వేచ్ఛ గురించి అంతర్జాతీయ సమాజానికి తెలియజేయడానికి నిర్వహిస్తారు. దీని ప్రధాన వేడుకను యూఎన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) నిర్వహిస్తుంది.
ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే | మే 04
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక నిపుణులకు నివాళులర్పించేందుకు ప్రతి సంవత్సరం మే 4న అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రతిపాదన మొదట 1999 లో ఆస్ట్రేలియాలోని బుష్‌ఫైర్‌లో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మరణించిన కారణంగా చోటుచేసుకుంది.
కోల్ మైనర్స్ డే | మే 04
బొగ్గు గని కార్మికుల త్యాగం మరియు దేశానికి వారు చేసిన కృషిని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం మే 4వ తేదీన బొగ్గు గని కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మైనింగ్ కార్మికులు ఎక్కువ సమయం ఫీల్డింగ్ ప్రక్రియలో గడుపుతారు. బొగ్గు గనులలో పనిచేయడం కష్టతరమైన వృత్తులలో ఒకటిగా పరిగణిస్తారు.
ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ డే | మే 08
అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ మూవ్‌మెంట్ సూత్రాలను స్మరించుకునే ప్రయత్నంలోభాగంగా ప్రతి సంవత్సరం మే 8 వ తేదీని ప్రపంచ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ డేగా జరుపుకుంటారు. ఈ తేదీ అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ICRC) స్థాపకుడు మరియు మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినా జీన్-హెన్రీ డ్యునాంట్ యొక్క జన్మదినోత్సవం.
రెడ్‌క్రాస్ అనేది 1863లో స్విట్జర్లాండ్‌లో స్థాపించబడిన అంతర్జాతీయ మానవతావాద నెట్‌వర్క్, ఇది ప్రపంచవ్యాప్తంగా విపత్తులు, సాయుధ పోరాటాలు మరియు ఆరోగ్య సంక్షోభాల బాధితులకు పూర్తిస్థాయి సహాయం అందించేందుకు పనిచేస్తుంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 97 మిలియన్ల వాలంటీర్లు, సభ్యులు మరియు సిబ్బందితో కూడిన మానవతా వ్యవస్థ ఉంది.
ప్రపంచ లూపస్ డే | మే 10
లూపస్ అనే దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 10న ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. లూపస్‌పో వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా ఐదు మిలియన్ల మంది ప్రజలు పోరాడుతున్నారు.
లూపస్ అనేది మానవ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ తన స్వంత కణజాలం మరియు అవయవాలపై దాడి చేసినప్పుడు సంభవించే వ్యాధి (ఆటో ఇమ్యూన్ డిసీజ్). లూపస్ వల్ల కీళ్ళు వాపు, చర్మపై దద్దర్లతో పాటుగా మూత్రపిండాలు, రక్త కణాలు, మెదడు, గుండె మరియు ఊపిరితిత్తులతో సహా అనేక విభిన్న శరీర వ్యవస్థలను ప్రభావితం అవుతాయి. రోగ లక్షణాలను నియంత్రించడం మినహా లూపస్‌కు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు.
నేషనల్ టెక్నాలజీ డే | మే 11
జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 11న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. స్వాతంత్రం తర్వాత దేశంలో సాంకేతిక పురోగతికి కారణమైన శాస్త్రవేత్తలు, పరిశోధకుల సహకారాన్ని గౌరవించటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1998 మే 11న జరిపిన భారత అణు పరీక్షల విజయవంతం తర్వాత, అప్పటి భారత ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి.. మే 11 ని భారతదేశంలో జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. 1999 లో భారత్ తన మొదటి తీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంది.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ | మే 12
మొక్కల భద్రతపై అవగాహన కల్పించేందుకు యేటా మే 12న అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని (IDPH) జరుపుకుత్నున్నారు. ఈ వేడుకను ఐక్యరాజ్యసమితి 2022 లో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటుగా వాటి ద్వారా ప్రపంచ ఆకలిని అంతం చేయడం, పేదరికాన్ని తగ్గించడం, జీవవైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణ మరియు ఆర్థికాభివృద్ధి పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త అవగాహన కల్పించనున్నారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం | మే 12
ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినమైన ప్రతి మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినాన్ని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సుస్ 1974 నుండి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నర్సులు సమాజానికి చేస్తున్న సేవలకు గౌరవార్దంగా ఈ వేడుక నిర్వహిస్తారు.
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం | మే 14
ప్రపంచ వలస పక్షుల దినోత్సవం (WMBD) అనేది వలస పక్షులు మరియు వాటి ఆవాసాల పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసే వార్షిక అవగాహన దినోత్సవం. దీనిని యేటా మే 14 మరియు అక్టోబరు 8 వ తేదీలలోజరుపుకుంటారు. ప్రపంచ వలస పక్షుల దినోత్సవంను మొదట 2006 లో ఐక్యరాజ్యసమితి ప్రారంభించింది. ఈ ఈవెంట్‌ను సుమారు 118 దేశాలు యేటా జరుపుకుంటున్నాయి.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫామిలీస్ | మే 15
ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ A/RES/47/237 తీర్మానంతో ప్రకటించింది. ప్రపంచాన్ని రూపొందించడంలో కుటుంబాల ప్రాముఖ్యత మరియు వాటి విలువల గురించి అవగాహన పెంపొందించడంలో భాగంగా దీనిని నిర్వహిస్తారు.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ | మే 16
1960లో భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజనీర్ అయిన థియోడర్ మైమాన్ జరిపిన లేజర్ యొక్క మొదటి విజయవంతమైన ఆపరేషన్ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 16న అంతర్జాతీయ కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును సైన్స్, సంస్కృతి, కళ, విద్య వైద్యం వంటి విభిన్న రంగాలలో కాంతి పోషిస్తున్న శాస్త్రీయ సహకారాన్ని గుర్తించేందుకు దీని జరుపుకుంటారు.
జాతీయ డెంగ్యూ దినోత్సవం | మే 16
భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిఫార్సుతో యేటా మే 16న భారతదేశంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వ్యాధిపై అవగాహనా పెంపొందించడంతో పాటుగా, సామూహిక వ్యాప్తి నివారణ మరియు హాట్‌స్పాట్‌లలో నివారణ చర్యలను అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
డెంగ్యూ ఏడిస్ జాతి దోమల కాటు ద్వారా మానవులకు సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. డెంగ్యూకి కారణమయ్యే వైరస్‌ను డెంగ్యూ వైరస్ అంటారు. ఈ వ్యాధి అధిక జ్వరం, తలనొప్పి, దద్దుర్లు మరియు కండరాలు మరియు కీళ్ల నొప్పులు లక్షణాలతో ప్రారంభమౌతుంది. తీవ్రమైన సందర్భాల్లో తీవ్రమైన రక్తస్రావం మరియు ప్రాణాంతకం కావచ్చు.
ఇంటర్నేషనల్ మ్యూజియం డే | మే 18
అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ICOM సమన్వయంతో 1977 లో మొదటి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంను నిర్వహించారు. ఈ వేడుకను మ్యూజియంల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు అంతర్జాతీయంగా మ్యూజియంలు ఎదుర్కొంటున్న సంబంధిత సమ్యలను తెలియపర్చేందుకు నిర్వహిస్తారు.
ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం | మే 18
హెచ్ఐవి వ్యాక్సిన్ అవేర్‌నెస్ డే అని కూడా పిలువబడే ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని ఏటా మే 18న జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని హెచ్‌ఐవి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించడానికి మరియు దాని కోసం పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పరిశోధకులు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహిస్తారు.
ప్రపంచ తేనెటీగల దినోత్సవం | మే 20
ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని ఏటా మే 20న జరుపుకుంటారు. తేనెటీగల పెంపకానికి మార్గదర్శకుడైన అంటోన్ జాన్సా 20 మే 1734లో జన్మించాడు. ఆయన జ్ణాపకార్దంగా ఈ వేడుకను నిర్వహిస్తారు. పర్యావరణ వ్యవస్థ నిర్మాణంలో తేనెటీగలు మరియు ఇతర పరాగ సంపర్క జీవుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ వేడుకను ఉపయోగించుకుంటారు. పరాగ సంపర్కాలు ఆహార భద్రతకు నేరుగా దోహదపడటమే కాకుండా, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి.
ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం | మే 20
ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం (WMD) ఏటా మే 20న ప్రపంచవ్యాప్తంగా మెట్రాలజీ, సైన్స్ గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. అలానే ఇది ఖచ్చితమైన కొలత యూనిట్ల అవసరాన్ని మరియు మెట్రాలజీ శాస్త్రీయ అధ్యయనంలో మెట్రాలజిస్టులు మరియు సంస్థల సహకారాన్ని హైలైట్ చేయడానికి జరుపుకుంటారు. ఈ తేదీ 1875లో మీటర్ కన్వెన్షన్‌పై సంతకం చేసిన వార్షికోత్సవం. మెట్రాలజీ అనగా కొలతలకు సంబంధించిన శాస్త్రం.
అంతర్జాతీయ టీ దినోత్సవం | మే 21
అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ఏటా మే 21న జరుపుకుంటారు. దీనికి సంబంధిత తీర్మానంను డిసెంబర్ 21, 2019న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ దినోత్సవాన్ని పాటించాలని పిలుపునిచ్చింది. సాధారణంగా టీ-ఉత్పత్తి చేసే దేశాలలో మేలో తేయాకు కోత సీజన్ ప్రారంభమవుతుంది. పంట చేతికొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకునేందుకు ఈ వేడుక నిర్వహిస్తారు.
జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం | మే 21
భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 21 న తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. ఉగ్రవాదం జాతీయ ప్రయోజనాలకు ఎలా విఘాతం కలిగిస్తుందో చూపడం ద్వారా యువతను ఉగ్రవాదం మరియు హింసా ప్రవృతి నుండి దూరం చేసేందుకు ఈ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మే 21 , 1991న భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులో హత్యకు గురైన తర్వాత తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం అమలులోకి వచ్చింది. యువతను తీవ్రవాదం నుంచి దూరం చేయడమే ఈ దినోత్సవాన్ని పాటించడం వెనుక ప్రధాన ఉద్దేశం.
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం | మే 22
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రతి సంవత్సరం మే 22న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబరు 2000లో దీనిని ఆమోదించింది. ఈ కార్యక్రమం జీవవైవిధ్య సమస్యల గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది. అదే సమయంలో భూగ్రహం పై ఉన్న వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క సమతుల్యతను పెంపొందించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తారు.
ప్రపంచ తాబేలు దినోత్సవం | మే 23
ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 2000లో అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ సంస్థ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా కనుమరుగవుతున్న జీవుల జాబితాలో తాబేళ్లు ఉండటంతో, వాటి మనుగడకు మరియు వృద్ధికి సహాయపడటానికి మానవ చర్యను ప్రోత్సహించడానికి ఈ అవగాహనా కార్యక్రమాన్ని జరుపుకుంటారు. దీనిని అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ స్పాన్సర్ చేస్తుంది.
కామన్వెల్త్ దినోత్సవం | మే 24
ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండవ సోమవారం కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కానీ ఇండియా మరియు కొన్ని దేశాల్లో మే 24న జరుపుకుంటారు. కామన్వెల్త్ దినోత్సవాన్ని సాధారణంగా ఎంపైర్ డే అని కూడా అంటారు. బ్రిటిష్ దేశాల్లో దీనిని1901లో మరణించిన క్వీన్ విక్టోరియా జన్మదిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు. కానీ భారతదేశంలో దీనిని బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన మరియు వారు చేసిన అభివృద్ధికి గుర్తుగా జరుపుకుంటారు. వ్యవస్థాపక కామన్వెల్త్ సభ్యు దేశాలుగా ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం | మే 25
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం (WTD) ప్రతి ఏడాది మే 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది ప్రధానంగా థైరాయిడ్ సమస్యలపై అవగాహనా పెంపొందించేందుకునిర్వహిస్తారు. శారీరిక పెరుగుదల మరియు జీవక్రియను నియంత్రించడంలో సహాయపడే థైరాయిడ్ హార్మోన్ మరియు కాల్సిటోనిన్ సరైన మొత్తంలో విడుదల కాకపోవడం హైపోథైరాయిడిజం సంభవిస్తుంది. ఈ దినోత్సవాన్ని 2007 లో యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్ (ETA) ప్రారంభించింది. మొదటి ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంను 2008లో నిర్వహించారు.
అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం | మే 29
ఎవరెస్ట్ శిఖరాన్ని మొదట అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ (న్యూజీలాండ్) మరియు టెన్జింగ్ నార్గే (నేపాల్) జ్ఞాపకార్థం ఏటా మే 29న అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని ఎడ్మండ్ హిల్లరీ మరణించిన సంవత్సరం 2008లో మొదటిసారిగా నిర్వహించారు. ఇది ప్రధానంగా పర్వత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్జింగ్ నార్గేలు మే 29, 1953 ఉదయం 11:30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులుగా నిలిచారు.
ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం | మే 31
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ వార్షిక వేడుకలు పొగాకును ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలపై అవగాహనా కల్పించేందుకు నిర్వహిస్తారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్య దేశాలు 1987లో ప్రారంభించాయి.
మీరు రూపొందించిన ఏ నెలలో ఏమి అనేవి పిల్లలకు చాలా ఉపయుక్తంగా ఉంది.
మీకు ధన్యవాదములు.