తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 17 ఏప్రిల్ 2023 ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.
మిస్ ఇండియా 2023 విజేతగా నందిని గుప్తా
రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా 2023 కిరీటాన్ని గెలుచుకుంది. ఏప్రిల్ 16న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన 59వ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌లో ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజాను వెన్నక్కినెట్టి విజేతగా నిలిచింది. దీనితో ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. 19ఏళ్ళ నందిని గుప్తా, దక్షిణ రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందివారు. ఈమె బిజినెస్ మానేజ్మెంట్ యందు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.
మిస్ ఇండియా లేదా ఫెమినా మిస్ ఇండియా అనేది భారతదేశంలో నిర్వహించే జాతీయ అందాల పోటీ. ఇది ప్రధాన అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటైన మిస్ వరల్డ్‌లో పోటీ చేయడానికి ప్రతి సంవత్సరం ప్రతినిధులను ఎంపిక చేస్తుంది. ఇది టైమ్స్ గ్రూప్ ప్రచురించిన ఫెమినా అనే మహిళా పత్రికచే నిర్వహించబడుతుంది. దీని యాజమాని వినీత్ జైన్, వీరి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
వాషింగ్టన్ డీసీలో 2వ జి20 ఆర్థిక మంత్రుల సమావేశం
భారత జి20 ప్రెసిడెన్సీలో జి20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల 2వ సమావేశంను, ఏప్రిల్ 12-13 తేదీలలో వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జి20 సభ్యులు, 13 ఆహ్వానిత దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థల నుండి దాదాపు 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశం ప్రధానంగా గ్లోబల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్, సస్టైనబుల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ సెక్టార్, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్, మరియు ఇంటర్నేషనల్ టాక్సేషన్ అంశాలకు సంబంధించి చర్చిందేందుకు నిర్వహించారు. అలానే క్యాపిటల్ అడిక్వసీ ఫ్రేమ్‌వర్క్స్ (CAF) సిఫార్సుల అమలు పురోగతిపై కూడా మంత్రులు మరియు గవర్నర్‌లు చర్చించారు. ఈ సమావేశంను ఫిబ్రవరి 24-25 మధ్య కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన మొదటి జి20 ఆర్థిక మంత్రుల సమావేశానికి కొనసాగింపుగా నిర్వహించారు.
వారణాసిలో జి20 అగ్రి చీఫ్ శాస్త్రవేత్తల సమావేశం
అగ్రి చీఫ్ శాస్త్రవేత్తల మూడు రోజుల జి20 సమావేశానికి వారణాసి ఆతిథ్యం ఇచ్చింది. భారత జి20 అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంను ఏప్రిల్ 17 -19 తేదీల్లో నిర్వహించారు. జి20 సభ్య దేశాల నుంచి దాదాపు 80 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది భారత జి20 అధ్యక్షతన నిర్వహించిన100వ ఈవెంట్‌గా నిలిచింది.
ఈ సమావేశంను 'ఒక భూమి, ఒక కుటుంబం' అనే ధీమ్‌తో నిర్వహించారు. ఈ సమావేశం ప్రధానంగా ప్రజారోగ్యం కోసం స్థిరమైన వ్యవసాయం & ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయడం అనే అంశంపై నిర్వహించారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పోషకాహార సమస్యలను తగ్గించేందుకు బయో-ఫోర్టిఫైడ్ పంటసాగు సత్వర పరిస్కారంగా పేర్కొన్నారు.
భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారతదేశపు అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. దేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ-ప్రమాణ ఎన్నికల అఫిడవిట్‌లను విశ్లేషించగా, అందులో 29 మంది సీఎంలు కోటీశ్వరులుగా ఉన్నారు. ఈ జాబితాలో వైఎస్ జగన్ 510 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ 15 లక్షలతో అట్టడుగున నిలిచారు.
ఎడిఆర్ నివేదిక ప్రకారం ప్రస్తుత 30 మంది సీఎంలలో 13 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ మరియు క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. ఆస్తుల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జగన్ మోహన్ రెడ్డి (510 కోట్లు), అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన పెమా ఖండూ (163 కోట్లు), ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (63 కోట్లు) ఉన్నారు.
చివరి మూడు స్థానాల్లో కేరళకు చెందిన పినరయి విజయన్ మరియు హర్యానాకు చెందిన మనోహర్ లాల్ ఒక కోటికి పైగా ఆస్తులను కలిగి ఉండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ కేవలం 15 లక్షల వ్యక్తిగత ఆస్తులను మాత్రమే కలిగి ఉన్నట్లు నివేదించింది. అలానే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ 3 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కెసిఆర్ 23 కోట్ల వ్యక్తిగత ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.
ఢిల్లీలో ఇండియా-స్పెయిన్ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్
ఇండియా-స్పెయిన్ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ (JCEC) యొక్క 12వ సెషన్, ఏప్రిల్ 13న ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ మరియు స్పెయిన్ ప్రభుత్వ వాణిజ్య కార్యదర్శి జియానా మెండెజ్‌లు సహ అధ్యక్షత వహించారు. ఈ సంధర్బంగా 1972లో ఏర్పాటైన ఇండియా-స్పెయిన్ జాయింట్ కమీషన్ మెకానిజం యొక్క స్వర్ణోత్సవ ఎడిషన్‌ను ఇరుపక్షాలు జరుపుకున్నాయి.
గత 50 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడుల్లో గణనీయమైన పెరుగుదల నమోదయినట్లు పేర్కొన్నారు. దాదాపు 250 స్పానిష్ కంపెనీలు భారతదేశంలో వ్యాపారం నిర్వర్తిస్తుండగా, 40కి పైగా భారతీయ కంపెనీలు స్పెయిన్‌లో ఐటీ, ఫార్మా, పునరుత్పాదక శక్తి, ఆటోమొబైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి మొదలైన రంగాలలో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రెన్యూవబుల్ ఎనర్జీ, షిప్పింగ్, పోర్ట్స్, టూరిజం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు డిఫెన్స్ రంగంలో మరింత సహకారం కోసం ఇరుపక్షాలు ఆసక్తి కనబర్చారు.
నేపాల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్‌తో ఒప్పందం
నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ అధ్యక్షతన జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు నేపాల్ 53వ సమావేశంలో 669 మెగావాట్ల దిగువ అరుణ్ జలవిద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు, భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ (SJVN) ప్రతిపాదించిన రూ. 92.68 బిలియన్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. 900 మెగావాట్ల అరుణ్-III మరియు 695 మెగావాట్ల అరుణ్-IV జలవిద్యుత్ ప్రాజెక్టుల తర్వాత అరుణ్ నదిపై చర్చల ద్వారా చేపట్టిన మూడవ ప్రాజెక్ట్ ఇది.
సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ ప్రస్తుతం అదే నదీ పరీవాహక ప్రాంతంలో మరో జలవిద్యుత్ ప్రాజెక్ట్ అయిన అరుణ్ IIIని అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు ప్రాజెక్టులు తూర్పు నేపాల్‌లోని అరుణ్ నది నుండి దాదాపు 2,300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి. 2022లో నేపాల్‌లోని లుంబినీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా, ఇరుపక్షాలు తమ తమ ప్రభుత్వాల తరపున అరుణ్-IV అభివృద్ధికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపులకు ఆమోదం
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్లలో ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ మరియు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అంతటా ఫారెస్ట్ ఎంట్రీ పాయింట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.
దీని ద్వారా అటవీ ప్రవేశ కేంద్రాల వద్ద వాహనాల ఉద్గారాలను అరికట్టడంతో పాటుగా సందర్శకుల వాహనాలకు పొడవైన క్యూలలో వేచిచూసే బెడద తొలగిపోయి, వన్యప్రాణులను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్, టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ టోల్ చెల్లింపులను నిర్వహించడానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతను ఉపయోగిస్తుంది. దేశంలో అన్ని 4-వీలర్‌లు & అంతకంటే ఎక్కువ వీల్స్ వాహనాలపై ఫాస్ట్‌ట్యాగ్‌ని అతికించడం తప్పనిసరి చేయబడింది.
అంబేద్కర్ సర్క్యూట్ సందర్శన కోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
ఇండియన్ రైల్వే అంబేద్కర్ సర్క్యూట్ సందర్శన కోసం ఏప్రిల్ 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది. ఈ రైలు ఏప్రిల్ 14న న్యూఢిల్లీ నుండి బయలుదేరి ఏప్రిల్ 15వ తేదీన ఇండోర్ మరియు నాగపూర్‌లో డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జన్మస్థలానికి చేరుకుంది. భీమ్ జన్మభూమిలోని స్మారక మందిరంలో ప్రయాణికులు సమావేశమై బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం, పోరాటాలు తదితర అంశాలపై చర్చించారు.
కేంద్ర ప్రభుత్వం 2022లో అంబేద్కర్ జీవితంతో అనుబంధించబడిన ఐదు కీలక ప్రదేశాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను ప్రకటించింది. దీనిని అంబేద్కర్ పంచతీర్థం అనికూడా అంటారు. ఈ యాత్ర ద్వారా బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ జీవిత చరిత్రతో ముడిపడిన 4 ప్రదేశాలను సందర్శించే భాగ్యంను ప్రయాణికులకు కల్పిస్తున్నారు.
8రోజుల నిడివితో సాగే ఈ యాత్రలో పర్యాటకులు దీక్షాభూమి, డ్రాగన్ ప్యాలెస్‌లను సందర్శించారు. దీక్షాభూమి అనేది అక్టోబర్ 1956లో డాక్టర్ అంబేద్కర్ తన లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించిన చారిత్రాత్మక ప్రదేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరి అవశేషాలు దీక్షభూమి స్థూపం మధ్య గోపురంలో ఉంచబడ్డాయి. నాగ్‌పూర్‌లోని కాంప్టీ పట్టణంలోని డ్రాగన్ ప్యాలెస్ ధ్యానం చేసేందుకు సరిపోయే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహం ప్రధాన ఆకర్షణ.
అంబేద్కర్ పంచతీర్థంలో ప్రదేశాలు
- జన్మ భూమి- మధ్యప్రదేశ్‌లోని అంబేద్కర్ జన్మస్థలం మోవ్.
- శిక్షా భూమి - యూకేలో చదువుకున్న ప్రదేశం.
- దీక్షా భూమి- నాగ్‌పూర్‌లోని అతను బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం.
- మహాపరినిర్వాన్ భూమి- ఢిల్లీలో ఆయన మరణించిన ప్రదేశం.
- చైత్య భూమి - ముంబైలో అతని దహన స్థలం.
ఖతార్ - బహ్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు పునఃప్రారంభం
ఖతార్ మరియు బహ్రెయిన్ రెండేళ్ల తర్వాత తమ దౌత్య సంబంధాలను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. సౌదీ అరేబియా, యుఎఇ, ఈజిప్ట్ మరియు బహ్రెయిన్ వంటి కొన్ని అరబ్ దేశాలు 5 జూన్ 2017 నుండి ఖతార్‌తో దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి. ఖతార్ నమోదిత విమానాలు మరియు నౌకలను తమ గగనతలం, సముద్ర జలాలు, భూమిని ఉపయోగించకుండా నిషేధించాయి.
ఖతార్, సిరియాలోని అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-నుస్రా ఫ్రంట్‌తో సహా సిరియాలోని తిరుగుబాటు గ్రూపులకు నిధులు సమకూర్చుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుదనేది మిగతా అరబ్ దేశాల ప్రధాన ఆరోపణ. ఇదే ఖాతర్ సంక్షోభానికి దారి తీసింది. అయితే 5 జనవరి 2021 న సౌదీ అరేబియా మరియు ఖతార్ మధ్య జరిగిన అల్ ఉలా డిక్లరేషన్ తర్వాత ఈ అరబ్ నిషేధం ఎత్తివేయబడింది. బహ్రెయిన్ మినహా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఈజిప్ట్ దేశాలు తమ వాణిజ్య, వ్యాపార సంబంధాలను అదే సమయంలో పునరుద్ధరించాయి. రెండేళ్ల తర్వాత తాజాగా బహ్రెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది.
వచ్చే ఐదేళ్లలో క్రీడా సౌకర్యాల కోసం రూ.3,200 కోట్లు
ఖేలో ఇండియా క్యాంపెయిన్ కింద వచ్చే ఐదేళ్లలో దేశంలో క్రీడా సౌకర్యాల కోసం సుమారు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడలు మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా క్రీడాకారులకు అత్యుత్తమ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన అన్నారు. ఏప్రిల్ 14న హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో సాయ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్‌సిఓఇ) ప్రారంభోత్సవం సంధర్బంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎంపీ ముఖ్యమంత్రి తీర్థ్ యోజన పరిధిలోకి అంబేద్కర్ పంచతీర్థం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం పరిధిలోకి 'అంబేద్కర్ పంచతీర్థం' సందర్శనను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఏప్రిల్ 14న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఆయన జీవితంతో ముడిపడి ఉన్న పంచ తీర్థాలను ముఖ్య మంత్రి తీర్థం-దర్శన్ యోజనకు అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం 2022లో అంబేద్కర్ జీవితంతో అనుబంధించబడిన ఐదు కీలక ప్రదేశాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేక పర్యాటక సర్క్యూట్‌ను ప్రకటించింది. ఇందులో ఆయన జన్మభూమి అయినా డాక్టర్ అంబేద్కర్ నగర్ (మోవ్), ఢిల్లీలోని మహాపరినిర్వాన్ భూమి, ముంబైలోని చైత్య-భూమి (దాదర్), నాగ్‌పూర్‌లో దీక్ష-భూమి అలానే లండన్‌లో ఉన్న శిక్షా భూమి ఉన్నాయి. ఇండియన్ రైల్వే కూడా అంబేద్కర్ సర్క్యూట్ సందర్శన కోసం ఏప్రిల్ 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించింది.
హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు వద్ద 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన బీఆర్ అంబేద్కర్ విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహాన్ని 146.50 కోట్లతో 360 టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు 114 టన్నుల కాంస్యం ఉపయోగించి నిర్మించారు.
హుస్సేన్ సాగర్ సరస్సుకు దగ్గరలో, రాష్ట్ర సచివాలయం పక్కన, బుద్ధ విగ్రహానికి ఎదురుగా మరియు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంకు దరిదాపులో స్థాపించిన ఈ విగ్రహం రాబోయే కాలంలో ప్రముఖ పర్యాటక స్టలంగా మారనుంది. ఇకపోతే బీఆర్ అంబేద్కర్ పేరున కొత్తగా అవార్డును ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ అవార్డును ఏటా ఏప్రిల్ 14న, ఆయన జయంతి రోజున దళితులకు కోసం అత్యుత్తమ సేవలు అందించే వ్యక్తులకు అందివ్వనున్నారు.
శ్రీలంక రుణ పునర్నిర్మాణ పరిష్కారం కోసం ఉమ్మడి వేదిక
జపాన్, భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాలు, శ్రీలంక యొక్క రుణాల పునర్నిర్మాణాన్ని సమన్వయం చేయడానికి ద్వైపాక్షిక రుణదాతల మధ్య చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను ప్రకటించాయి. శ్రీలంక, పాకిస్తాన్ వంటి మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థల రుణ కష్టాలను పరిష్కరించడానికి ఈ చొరవ ఒక నమూనాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ ఉమ్మడి ప్లాట్‌ఫారమ్ చైనాతో సహా శ్రీలంక యొక్క ద్వైపాక్షిక రుణదాతలందరికీ గ్రూప్ ఆహ్వానం పంపిందని, వీలైనంత త్వరగా మొదటి రౌండ్ చర్చలు జరిపి సంబంధిత పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నారు. 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంక, గత నెలలో తన భారీ రుణ భారాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి 2.9 బిలియన్ డాలర్ల రుణ సాయాన్ని పొందింది.
అయితే మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థ రుణ సమస్య పరిస్కారం కోసం జి20 యొక్క సాధారణ ఫ్రేమ్‌వర్క్ కింద ఉపశమనం పొందే అవకాశం ఉన్నా, దీని కోసం శ్రీలంక దరఖాస్తు చేసుకోలేదు. దీనితో ప్రస్తుతం జి20, జి7 అధ్యక్షతలో ఉన్న భారత్. జపాన్ దేశాలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాయి.
శ్రీలంక ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం, శ్రీలంక ద్వైపాక్షిక రుణదాతలకు మొత్తం 7.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో చైనాకు 3 బిలియన్ డాలర్లు, పారిస్ క్లబ్‌కు 2.4 బిలియన్ డాలర్లు మరియు భారతదేశానికి 1.6 బిలియన్ డాలర్లు బకాయిపడి ఉంది.
మొజాంబిక్‌లో బుజి వంతెనను ప్రారంభించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, మొజాంబిక్‌లోని132 కిమీ టికా-బుజి-నోవా-సోఫాలా రోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన బుజి వంతెనను ప్రారంభించారు. ఈ వంతెనను భారతదేశం స్నేహాత్మక దృక్పథంతో నిర్మించింది. డాక్టర్ జైశంకర్ ఈ పర్యటనలో మొజాంబిక్ విదేశాంగ మంత్రి మగాలాతో కలిసి మాపుటో నుండి మచావా వరకు మేడ్ ఇన్ ఇండియా రైలులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ రైట్స్ సీఎండీ రాహుల్ మిథాల్ వారితో కూడా పాల్గొన్నారు.
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం
కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2023లో అమన్ సెహ్రావత్ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెహ్రావత్, కిర్గిజిస్తాన్‌కు చెందిన అల్మాజ్ స్మాన్‌బెకోవ్‌ను 9-4తో ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అలానే సెహ్రావత్ గతేడాది స్పెయిన్‌లో జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా నిలిచాడు.
యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌తో భారత్ అవగాహన ఒప్పందం
ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం 10,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపడానికి మార్గం సుగమం చేస్తూ యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌తో భారతదేశం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అధికారుల మధ్య ముంబైలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఆఫ్ఘన్ జనాభాలోని అత్యంత బలహీన వర్గాలకు గోధుమలను త్వరితగతిన అందజేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కల్పిస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధంతో భారత్ ఈ మానవతా సహాయం అందిస్తుంది.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలలుగా రబడ
దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ పేసర్ కగిసో రబడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రబడ, ఏప్రిల్ 13న బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించాడు. ఈ ఘనత గతంలో70 మ్యాచులతో లలిత్ మలింగ పేరట ఉండగా, రబడ తన 64వ మ్యాచులోనే ఈ రికార్డు నమోదు చేశాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా
- కగిసో రబడ - 64 మ్యాచుల్లో 100 వికెట్లు
- లసిత్ మలింగ - 70 మ్యాచుల్లో 100 వికెట్లు
- భువనేశ్వర్ కుమార్ - 81 మ్యాచుల్లో 100 వికెట్లు
- అమిత్ మిశ్రా - 83 మ్యాచుల్లో 100 వికెట్లు
- ఆశిష్ నెహ్రా - 83 మ్యాచుల్లో 100 వికెట్లు
- యుజ్వేంద్ర చాహల్ - 84 మ్యాచుల్లో 100 వికెట్లు
ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశంగా ఘనా
యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కొత్తగా అభివృద్ధి చేయబడిన అత్యంత ప్రభావవంతమైన మలేరియా వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశంగా ఘనా అవతరించింది. దేశీయంగా మలేరియాతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉన్న 5 నెలల నుండి 36 నెలల వయస్సు గల పిల్లలకు ఈ టీకాను ఆమోదించింది. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ప్రతి సంవత్సరం 600,000 కంటే ఎక్కువ మంది పిల్లల మరణానికి కారణమౌతుంది. ఇందులో అత్యధిక మరణాలు ఆఫ్రికా దేశాలలో నమోదు అవుతున్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఏటా 200 మిలియన్ డోస్‌ల వరకు ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌కు R21 అని పేరు పెట్టారు. చివరి ట్రయిల్స్ దశలో ఉన్న ఈ వాక్సిన్ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఇంకా ట్రయల్స్ కూడా పూర్తిచేయండి ఒక టీకాను ధనిక దేశాల కంటే ముందుగా ఒక ఆఫ్రికన్ దేశం పెద్ద మొత్తంలో ఆమోదించబడటం ఇదే మొదటిసారి.
ఆఫ్రికా వంటి అత్యంత పేద దేశాలలో బాల్య వ్యాక్సిన్‌లు సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే గావి వాక్సిన్ అలయన్స్ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థల ద్వారా అందించబడతాయి. అయితే ఘానా ప్రస్తుతం ఆర్థికంగా మెరుగుపడటంతో తమ స్వంత నిధులలో కొనుగోలు చేసే దిశగా కదులుతోంది. ఇదే మార్గంలో నైజిరియా వంటి దేశాలు ఉన్నాయి.
గౌహతిలోని ఎయిమ్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏప్రిల్ 14న గౌహతిలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ఈశాన్య ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో మే 2017లో శంకుస్థాపన చేశారు. ఇది ఈశాన్య రాష్ట్రాలలో నిర్మించబడ్డ మొదటి ఎయిమ్స్ ఆసుపత్రిగా అవతరించింది.
ఇదే వేదిక ద్వారా నల్బారి, నాగోన్ మరియు కోక్రాఝర్‌లలో మూడు వైద్య కళాశాలలను కూడా ప్రారంభించారు. అలానే 5 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ వైద్య చికిత్స ప్రయోజనాలను పొందగలిగే లబ్ధిదారులకు 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. వీటితో పాటుగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మరియు ఐఐటీ గౌహతి సంయుక్త చొరవతో నిర్మించబోతున్న అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్ (AAHII) కి శంకుస్థాపన చేశారు.
ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియాతో హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ ఒప్పందం
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయినా హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు, 300 మిలియన్ డాలర్ల క్రెడిట్ కోసం ఎక్స్‌పోర్ట్ - ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ కొరియాతో మాస్టర్ ఇంటర్‌బ్యాంక్ క్రెడిట్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ క్రెడిట్ ఒప్పందం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విదేశీ కరెన్సీ నిధులను సమీకరించుకోనుంది.
ఈ క్రెడిట్ లైన్‌ను కొరియన్ కంపెనీలు ఈక్విటీ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న కంపెనీలకు అలాగే కొరియన్ కంపెనీలతో వ్యాపార సంబంధాలను కలిగి ఉన్న కంపెనీలకు నిధుల అవసరాల కోసం ఉపయోగించనున్నట్లు తెలిపింది. అలానే కొరియా సంబంధిత కంపెనీల కార్ల కొనుగోలు చేసే వినియోగదారుల యొక్క నిధుల అవసరాలను తీర్చేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
ఇండియా నుండి దిగుమతి చేసుకునే చిత్రాలకు బంగ్లాదేశ్ మార్గదర్శకాలు
బంగ్లాదేశ్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిమిత స్థాయిలో భారత ఉపఖండంలో నిర్మించిన చిత్రాలను దిగుమతి చేసుకోవడానికి 5-పాయింట్ల మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా సినిమా హాళ్లలో ప్రదర్శించే ముందు బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేట్ పొందాలి నిర్దేశించింది. అలానే దిగుమతి చేసుకున్న చిత్రాలను ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అజా మరియు దుర్గాపూజల సమయంలో ప్రదర్శన ఆంక్షలు విధించింది. అలానే భారత ఉపఖండంలోని వివిధ భాషల్లో నిర్మించబడే చిత్రాలను చట్టబద్ధమైన చిత్ర నిర్మాతలు మరియు పంపిణీదారులకు మాత్రమే దిగుమతి చేసుకునే హక్కు కల్పించింది.
ఎల్‌ఐసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా రత్నాకర్ పట్నాయక్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కొత్త చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా రత్నాకర్ పట్నాయక్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. పట్నాయక్ సెప్టెంబరు 1990లో ఎల్‌ఐసీలో డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్‌గా చేరారు. గత ముప్పై రెండు సంవత్సరాలలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు. సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా ఇండోర్ మరియు జంషెడ్‌పూర్ డివిజన్‌లకు నాయకత్వం వహించాడు. 2021లో సెంట్రల్ ఆఫీస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ - ఫ్రంట్ ఆఫీసరుగా ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం చీఫ్ రిస్క్ ఆఫీసర్ హోదాలో ఉన్నారు.
ముంబైలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ముంబై తాజ్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ యొక్క నాల్గవ మరియు చివరి ఈవెంట్‌ను నిర్వహించింది. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం జ్ఞాపకార్థం, ఈ చివరి వేడుకను 7రోజుల నిడివితో ఘనంగా నిర్వహించారు. భారత్ చొరవతో ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించిన కారణంగా ప్రభుత్వం ఈ ప్రచార ఈవెంటులను దేశవ్యాప్తంగా నిర్వహించింది.
ఈ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్‌ను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ప్రారంభించారు. ఏప్రిల్ 19 వరకు హోటల్‌లోని షామియానా రెస్టారెంట్‌లో లంచ్ మరియు డిన్నర్ కోసం కజకిస్తాన్, కిర్గిజేస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా మరియు భారతదేశానికి చెందిన చెఫ్‌లు తయారుచేసిన విభిన్న మిల్లెట్‌ల వంటకాలను సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు.
ప్రధాని మోడీ ప్రభుత్వ విజయాలపై దూరదర్శన్ ప్రచార డాక్యుమెంటరీ
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలకు సంబంధించి 'ధరోహర్ భారత్ కీ - పునృతాన్ కి కహానీ' అనే డాక్యుమెంటరీని, ఏప్రిల్ 14. 15 తేదీల్లో రెండు భాగాలుగా భారతదేశ ప్రభుత్వ టి.వి. ఛానెల్ దూరదర్శన్ ప్రచారం చేసింది. ప్రధాని దార్శనికతలో గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం సాధించిన సాంస్కృతిక ఐక్యత, గొప్పతనం మరియు పునరుజ్జీవనం సంబంధించిన పురోగతిని ఇది ప్రదర్శించింది. ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ డిజిటల్ మీడియా ప్రెజెంటర్ కమియా జానీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
జలియన్ వాలా బాగ్, కర్తార్‌పూర్ సాహిబ్, రామజన్మభూమి, కాశీ విశ్వనాథ్ ధామ్, సోమనాథ్ ధామ్, కేదార్‌నాథ్ ధామ్, సెల్యులార్ జైలు, ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం, వార్ మెమోరియల్, సబర్మతీ ఆశ్రమం, పంచతీర్థం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ మరియు ఇతర స్మారక చిహ్నాలు వంటి చారిత్రాత్మక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల ప్రవిత్రత, భద్రత, సుందరీకరణ మరియు నిర్మాణం వెనుక ఉన్న ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, కారణాన్ని ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది.
ఈ డాక్యుమెంటరీ ప్రధాని మోడీ, భారత సైనికుల యొక్క త్యాగాన్ని, గొప్పతనాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాటలతో ప్రారంభమవుతుంది. అలానే ప్రాచీన, ఉదాత్తమైన మరియు అసమానమైన భారత వారసత్వంను భావితరాలకు అందించేందుకు, ప్రతి భారతీయుని యొక్క ఆసక్తి, భాగస్వామ్యం ఉండాలని కోరుతుంది. ఈ చొరవ ప్రతి భారతీయ హృదయానికి ఆనందం మరియు గర్వాన్ని తెస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ - కృషి విజ్ఞాన కేంద్రలతో అనుసంధానం
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ATL)ని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) మరియు అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ATMA)తో అనుసంధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంకు అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM), నీతి ఆయోగ్ మరియు వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపాయి. ఈ చొరవ భారతదేశం అంతటా పాఠశాల విద్యార్థులలో వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉపయోగపడనుంది.
కృషి విజ్ఞాన కేంద్రలు అనేవి సింగిల్ విండో అగ్రికల్చరల్ నాలెడ్జ్ రిసోర్స్ మరియు కెపాసిటీ డెవలప్‌మెంట్ సెంటర్లుగా పనిచేస్తాయి. ఇవి రైతులకు, పాఠశాల డ్రాపౌట్‌లకు మరియు క్షేత్ర స్థాయి వ్యవసాయ కార్యకర్తలకు వ్యవసాయ వృత్తి శిక్షణను మరియు ఇన్‌పుట్‌లను అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికెలు) ఉన్నాయి. వీటిని 973లో ఐసిఏఆర్ అధ్యక్షుడు మోహన్ సింగ్ మెహతా ప్రతిపాదించారు.1974లో తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా నియంత్రణలో మనుగడలోకి వచ్చాయి.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేశంలో ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి 2016లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. దీనిని విశ్వవిద్యాలయాలు, సంస్థలు మరియు కార్పొరేట్ సంస్థలలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా అమలు చేస్తుంది.
అటల్ టింకరింగ్ లాబొరేటరీలను భారతదేశంలో ఒక మిలియన్ పాఠశాల విద్యార్థులను నియోటెరిక్ ఇన్నోవేటర్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పాఠశాల విద్యార్థులలో వ్యవసాయ రంగపు ఆవిష్కరణలకు ప్రోత్సహం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 10వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి, 75 లక్షల విద్యార్థులు వీటి యందు నిమగ్నమై ఉన్నారు. వీరు 12 లక్షల ఇన్నోవేషన్ ప్రాజెక్టులు సృష్టించారు.
అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ATMA) అనేది కేంద్ర ప్రాయోజిత వ్యవసాయ పథకం. ఇది రైతులకు ఫలవంతమైన ఫలితాలు మరియు మెరుగైన ప్రతి యూనిట్ ఆదాయాన్ని పొందడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇవి రాష్ట్రాల పరిధిలో రిజిస్టర్డ్ సొసైటీగా వ్యవహరిస్థాయి. రైతులు, రైతు సంఘాలు, పంచాయత్ రాజ్ సంస్థలు, ఎన్జీఓలు, కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు జిల్లా, గ్రామ స్థాయిలలోని ఇతర వాటాదారులను భాగస్వామ్యం చేస్తాయి.
ఉత్తరాఖండ్‌లో A - హెల్ప్ పేరుతొ జంతు సంరక్షణ కార్యక్రమం ప్రారంభం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం A - హెల్ప్ పేరుతొ జంతు సంరక్షణ కార్యక్రమంను ప్రారంభించింది. A-HELP అనగా ఆక్రెడిటేడ్ ఏజెంట్ ఫర్ హెల్త్ అండ్ ఎక్సటెన్షన్ ఆఫ్ లైవ్‌స్టాక్ పప్రొడక్షన్ అని అర్ధం. ఈ కార్యక్రమం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంబంధిత ఆరోగ్యం, ఉత్త్పత్తి కార్యకలాపాలను బలోపేతం చేస్తారు.
ఏ - హెల్ప్ కార్యక్రమం కింద శిక్షణ పొందిన కార్యకర్తలు, జంతువులకు సంబంధించిన వివిధ అంటు వ్యాధులను నివారించడంలో పాటుగా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ (RGM) కింద కృత్రిమ గర్భధారణ పద్దతులను అమలు చేయడం, జంతువులను ట్యాగింగ్ చేయడం మరియు వాటికీ బీమా కల్పించడం వంటి సేవలు అందిస్తారు.
447 బిలియన్ డాలర్లకు చేరుకున్న భారతదేశ ఎగుమతులు
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అదే సమయంలో ఎగుమతులు 6 % పెరిగి 447 బిలియన్ డాలర్ల గరిష్ట మార్కును నమోదు చేశాయి. గత ఆర్థిక ఏడాదిలో భారత దిగుమతులు 613 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా, ఎగుమతులు 442 బిలియన్ డాలర్లుగా నమోదు కబడ్డాయి.
పెట్రోలియం, ఫార్మా, కెమికల్స్ మరియు మెరైన్ వంటి రంగాల అవుట్‌బౌండ్ ఎగుమతులలో ఆరోగ్యకరమైన వృద్ధి కారణంగా 2022-23లో దేశ ఎగుమతులు దాదాపు 6 శాతం పెరిగినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అదే సమయంలో భారతదేశం యొక్క సేవల ఎగుమతులు కూడా 2021-22లో 254 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2022-23లో 323 బిలియన్ డాలర్లతో 27.16 శాతం పెరుగుదల నమోదు కాబడినట్లు తెలిపారు.
భారతదేశంలోకి అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో క్రూడ్ పెట్రోలియం ఉండగా, అత్యధికంగా ఎగుమతి చేస్తున్న వస్తువుల జాబితాలో రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. భారతదేశం యొక్క దిగుమతులలో అత్యధిక వాటా చైనా, యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా దేశాల నుండి ఉంది. అలానే ప్రపంచంలో అత్యధికంగా వస్తువులను దిగుమతి చేసుకునే దేశల జాబితాలో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో చైనా మరియు జర్మనీలు ఉన్నాయి. ప్రపంచ అతిపెద్ద ఎగుమతిదారుల జాబితాలో యూరోపియన్ యూనియన్‌ను పక్కన పెడితే, చైనా అగ్రస్థానంలో ఉంది.
రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ఎస్‌బిఐతో ఫసల్ ఒప్పందం
రైతులకు సులభంగా మూలధనాన్ని అందించే లక్ష్యంతో ప్రముఖ అగ్రి-టెక్ కంపెనీ ఫసల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం, రైతులకు త్వరితగతిన, సులభమైన మరియు అనుషంగిక రహిత రుణాలను తక్కువ వడ్డీ రేట్లతో అందించడం ద్వారా కీలక వ్యవసాయ సాగు సమయంలో నగదు ప్రవాహ పరిమితులను పరిష్కరించనుంది. ఈ ఫైనాన్సింగ్ సొల్యూషన్ ద్వారా, రైతులు మూడు లక్షల వరకు పూచీకత్తు రహిత రుణాలను పొందవచ్చు. రైతులకు సమర్థవంతంగా నిధులు సమకూర్చడమే దీని ప్రధాన లక్ష్యం.
2023 బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11% నుండి ?20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫసల్ యొక్క తాజా ఫైనాన్సింగ్ సొల్యూషన్ ప్రారంభం దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలుగా పరిగణించవచ్చు. ఈ రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద పంపిణీ చేయబడతాయి.
2010లో వ్యవసాయ మార్గదర్శకుడు ఆనంద వర్మ స్థాపించిన ఈ ఏఐ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫారమ్ ఫసల్, వ్యవసాయ సాగు ఖర్చులను ఆప్టిమైజ్ చేస్తూ, దిగుబడి నాణ్యతను పెంచడానికి పంట నిర్దిష్ట మరియు పంట దశ నిర్దిష్ట కార్యాచరణ మేధస్సును అందిస్తుంది. ఫసల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలోని బెంగళూరులో ఉంది.
ఇకపోతే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ప్రభుత్వ ప్రాయోజిత పంటల బీమా పథకం. ఇది పంట వైఫల్యానికి వ్యతిరేకంగా సమగ్ర బీమా రక్షణను అందజేస్తుంది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 18, ఫిబ్రవరి 2016 న ప్రారంభించారు. నోటిఫైడ్ ఏరియాలో నోటిఫైడ్ పంటలు సాగుచేస్తున్న రైతులందరూ ఈ బీమా చేయించుకోవడానికి అర్హులు. ఈ ఎన్‌రోల్‌మెంట్ 100% స్వచ్ఛందంగా చేయబడుతుంది.
నమామి గంగే, 49 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా 49 విశ్వవిద్యాలయాలతో నీటి సంరక్షణ మరియు నదుల పునరుజ్జీవనం పట్ల యువతను ప్రేరేపించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏప్రిల్ 12న నమామి గంగే : యూనివర్శిటీలు కనెక్ట్ అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ ఒప్పంద ప్రతిపాదనపై సంతకం చేశారు. దేశీయ నదులలో స్థిరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం కోసం జరుగుతున్నా సామూహిక ఉద్యమంలో విద్యార్థి సంఘాన్ని భాగస్వామ్యం చేయడమే ఈ ఎమ్ఒయు లక్ష్యం.
నమామి గంగే : యూనివర్శిటీలు కనెక్ట్ కార్యక్రమం చొరవ ద్వారా, అనేక ఉన్నత విద్యా సంస్థలు నదుల పునరుజ్జీవనం మరియు నీటి సంరక్షణ కోసం తమ మద్దతును ప్రతిజ్ఞ చేశాయి. ఈ కార్యక్రమాన్ని 'ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్, రిజువనేటింగ్ రివర్స్' అనే థీమ్‌తో నిర్వహించారు. నమామి గంగే, విద్యాసంస్థల మధ్య సహకారం నేపథ్యంలో జన్ భగీదారి మాదిరిగానే నేడు ‘జ్ఞాన్ భగీదారి’ దిశగా ముందుకు సాగుతున్నామని గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. నమామి గంగే కార్యక్రమం ప్రపంచ పునరుద్ధరణ యొక్క మొదటి పది ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా ఐక్యరాజ్యసమితిచే గుర్తించబడింది.
యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ కార్యక్రమం ప్రారంభం
కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ మంత్రి పర్షోత్తం రూపాలా ఏప్రిల్ 14న రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా నేషనల్ వన్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో యానిమల్ జూనోటిక్ వ్యాధులు మరియు జంతు అంటువ్యాధుల పట్ల భారతదేశం యొక్క సంసిద్ధతను మరియు ప్రతిస్పందనను మెరుగుపరచడానికి యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇనిషియేటివ్ (APPI) అనే ప్రత్యేక ఒక కార్యక్రమం ప్రారంభించారు.
అలానే ప్రపంచ బ్యాంకు నిధులతో పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ విభాగంలో మెరుగైన జంతు ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ కోసం యానిమల్ హెల్త్ సిస్టం సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ (AHSSOH) అనే మరో కార్యక్రమం కూడా ఆరంభించారు. ఈ రెండు ప్రాజెకట్లను ఐదు భాగస్వామ్య రాష్ట్రాల్లోని 151 జిల్లాల పరిధిలో అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా 75 జిల్లాలలో ప్రాంతీయ ప్రయోగశాలల అప్‌గ్రేడేషన్, మూడు వందల వెటర్నరీ హాస్పిటల్స్ మరియు డిస్పెన్సరీలను అప్‌గ్రేడేషన్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో తొమ్మిది వేల మంది పారా-వెటర్నరీ వైద్యులు మరియు రోగనిర్ధారణ నిపుణులు మరియు 5,500 మంది పశువైద్య నిపుణులకు శిక్షణ కూడా అందివ్వనున్నారు.
ఎఐ ఆధారిత పెట్టుబడుల్లో భారతదేశంకు 5వ స్థానం
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ వార్షిక ఏఐ ఇండెక్స్ నివేదిక ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తున్న స్టార్టప్‌ల ద్వారా వచ్చిన పెట్టుబడుల పరంగా భారతదేశం గత సంవత్సరం ఐదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారతదేశంలోని ఎఐ స్టార్టప్‌లకు దాదాపు 3.24 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల కంటే భారత్ ముంది వరుసలలో ఉంది. ఈ జాబితాలో అమెరికా, చైనా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు భారత్ కంటే ముందున ఉన్నాయి.
అత్యంత నేరపూరిత దేశాలలో ఇండియాకు 77వ ర్యాంక్
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోని "అత్యంత నేరపూరిత దేశాల" ర్యాంకింగులో భారతదేశం 77వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో వెనిజులా అగ్రస్థానంలో ఉండగా, పపువా న్యూ గినియా (2), ఆఫ్ఘనిస్థాన్ (3), దక్షిణాఫ్రికా (4), హోండురాస్ (5), ట్రినిడాడ్ (6), గయానా (7), సిరియా (8) సోమాలియా (9) మరియు జమైకాలు (10) వరుసగా టాప్ 10లో ఉన్నాయి.
ఈ నేరాల ర్యాంకింగ్‌లో భారత్ కంటే అమెరికా (55), బ్రిటన్‌లు (65) ముందంజలో ఉండగా, 135 ర్యాంక్‌లలో ఉన్న జపాన్, అతి తక్కువ నేరపూరిత దేశంగా నిలిచింది. అధిక నిరుద్యోగిత రేటు ఉన్న దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ర్యాంకులను దేశంలో నివేదించబడిన మొత్తం నేరాల సంఖ్యను ఆ దేశ మొత్తం జనాభాతో భాగించి, తర్వాత 100,000తో గుణించడం ద్వారా వచ్చిన స్కోరు ఆధారంగా అందిస్తారు. ఈ స్కోరు మొత్తం నేరాల రేటును తెలియజేస్తుంది. నేరాల రేటు సాధారణంగా ప్రతి 100,000 మందికి లెక్కించబడుతుంది.
తులసి ఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్టు ప్రారంభం
వారణాసి యొక్క తులసి ఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌ను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏప్రిల్ 10న ప్రారంభించారు. ఉగాండాలోని కంపాలా పర్యటనలో ఉన్న ఆయన. అదే ప్రాంతంలో నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తులసి ఘాట్ వారణాసిలోని ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇదే ప్రదేశంలో ప్రముఖ కవి తులసీదాస్, రామచరితమానస్ మరియు హనుమాన్ చాలీసాలను రచించారు అని ప్రజల నమ్మకం. పూర్వం తులసి ఘాట్‌ను లోలార్క్ ఘాట్ అని పిలిచేవారు. 1941లో పారిశ్రామికవేత్త బల్దియో దాస్ బిర్లా తులసి ఘాట్‌ను పక్కాగా నిర్మించారు.
రాంబన్ వద్ద పీరా-కున్ఫెర్ టన్నెల్‌ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఏప్రిల్ 11న, రాంబన్ వద్ద పీరా-కున్ఫర్ టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ పీడా-కున్ఫెర్ టన్నెల్ 924 మీటర్ల పొడవుతో నిర్మించారు. ఇది 12.9 కి.మీ ప్రమాదకరమైన నష్రీ మరియు రాంబన్ ప్రాంతాన్ని దాటవేస్తుంది. ఈ టన్నెల్ జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిలో ఉధంపూర్ మరియు రాంబన్ మధ్య నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చేపడుతున్న నాలుగు-లేన్ ప్రాజెక్ట్‌లో ఒక భాగం. రాంబన్-బనిహాల్ స్ట్రెచ్‌లో మరో నాలుగు సొరంగాలు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయనున్నారు.
రాపిడ్‌ఎక్స్ పేరుతొ భారతదేశపు మొదటి సెమీ హై-స్పీడ్ రైలు
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్వహించబోతున్న భారతదేశపు మొదటి సెమీ-హై-స్పీడ్ రైలుకు రాపిడ్‌ఎక్స్ (RAPIDX) గా నామకరణం చేశారు. ఈ రైళ్లు రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్‌లలో సేవలు అందించనున్నాయి. మొదటి విడతలో భాగంగా ఈ సేవలు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీలో అందుబాటులోకి రానున్నాయి. మొదటి రైలును ఢిల్లీ-మీరట్ మార్గంలో నడపనున్నారు. ఈ రైళ్లు ప్రీమియం కోచ్‌లతో ప్రయాణికులకు ఆన్-బోర్డు సౌకర్యాలతో పాటుగా సురక్షితమైన మరియు సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి.
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యంగ్ ఆథర్స్ కాన్ఫరెన్స్ 2023
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క యువ రచయితల సదస్సు (YAC) 2023 కి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుతం షాంఘై సహకార సంస్థ యొక్క అధ్యక్ష్య హోదాలో ఉన్న భారత్, వార్షిక ఈవెంట్‌ల క్యాలెండర్‌లో భాగంగా ఈ కార్యాక్రమంను ఢిల్లీలో నిర్వహించింది. ఏప్రిల్ 12, 13 తేదీలలో జరిగిన ఈ ఈవెంటుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ బుక్ ట్రస్ట్ కలిసి నాయకత్వం వహించాయి.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సభ్య దేశాల యువ రచయితలకు ప్రోత్సహం కల్పించేందుకు 2012లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 15 జూన్ 2001న షాంఘైలో స్థాపించబడిన ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం ఇందులో ఎనిమిది సభ్య దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఇండియాతో పాటుగా కజకిస్తాన్, చైనా, కిర్గిజిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంది.
అగ్రి డ్రోన్ సబ్సిడీని అందుకున్న మొదటి డ్రోన్ కంపెనీగా గరుడ ఏరోస్పేస్
చెన్నైకి చెందిన భారతీయ డ్రోన్ స్టార్టప్ గరుడ ఏరోస్పేస్, అగ్రి డ్రోన్ సబ్సిడీని అందుకున్న మొదటి డ్రోన్ కంపెనీగా అవతరించింది. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి గాను వ్యవసాయ ఆధారిత డ్రోన్ ఉత్పత్తులకు భారత ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. డీజీసిఏ ఆమోదించిన సర్టిఫైడ్ కిసాన్ డ్రోన్‌ను కొనుగోలు చేసే రైతులకు మాత్రమే అగ్రి డ్రోన్ సబ్సిడీ వర్తిస్తుంది.
ఈ పథకం కింద కిసాన్ డ్రోన్లను కొనే రైతులకు దాదాపు 75 శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. చెన్నైకి చెందిన అగ్నిశ్వర్ జయప్రకాష్ ఈ గరుడ ఏరోస్పేస్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మధ్యప్రదేశ్ గోండ్ పెయింటింగ్‌కు జిఐ ట్యాగ్ కేటాయింపు
మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ గోండ్ పెయింటింగ్‌కు భౌగోళిక సూచిక ( జిఐ) ట్యాగ్ మంజూరు చేయబడింది. గోండ్ పెయింటింగ్ అనేది మధ్యప్రదేశ్‌కు చెందిన పురాతన గోండు తెగ యొక్క సంప్రదాయ కళ. ఈ రాష్ట్రంలోని దిండోరి జిల్లాలోని పతంగర్ గ్రామం ఈ గోండు చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక గోండ్ కళాకారుడు ఉంటాడు. ఈ కళాకారులు పసుపు, ఎరుపు, తెలుపు మరియు నీలం వంటి ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించి చెట్లు, మొక్కలు, జంతువులు, చంద్రుడు, సూర్యుడు, నది, కాలువలు, దేవుడు మరియు దేవతలతో సహా ప్రకృతి అందాలను చిత్రీకరిస్తారు.
బెంగళూరులో భారతదేశపు మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్
3డి ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మితమౌతున్న భారతదేశపు మొట్టమొదటి పోస్టు ఆఫీస్, త్వరలో బెంగళూరులో అందుబాటులోకి రానుంది. దీనిని ఉల్సూర్‌లోని కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో 1,000 చదరపు అడుగుల సౌకర్యంతో ప్రముఖ నిర్మాణసంస్థ లార్సెన్ & టూబ్రో (L&T) కనస్ట్రక్షన్ నిర్మిస్తుంది. దీనిని కేవలం 23 లక్షలతో వ్యయంతో, 45 రోజులలో పూర్తి చేయనుంది. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి 3డి-ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ కానుంది.
3డి ప్రింటింగ్ కనస్ట్రక్షన్ అనేది ఒక రకమైన అధునాతన తయారీ సాంకేతికత. 3డి-ప్రింటెడ్ ఇళ్ళు అనేవి సిమెంట్ మిశ్రమం లేదా ప్రత్యేక పాలిమర్‌లు లేదా రీసైకిల్ చేయబడిన ప్లాస్టికుతో తయారు చేయబడిన ఫ్రీ-ఫారమ్, కర్విలినియర్ ఆకారాలు. వీటిని ప్రత్యేక మిషనరీ సహాయంతో క్రమపద్ధతిలో నిర్మాణ ప్రదేశంలో అమర్చడం ద్వారా నిర్మాణం పూర్తివుతుంది. ఈ సాంకేతిక సంప్రదాయ మౌల్డింగ్ పద్దతిని నుండి ఉపసమనం కల్పిస్తుంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నిర్మాణాలు పూర్తికాబడతాయి.
జైపూర్‌లో 2వ మహిళా 20 అంతర్జాతీయ సమావేశం
భారత్ జి20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 2వ మహిళా 20 అంతర్జాతీయ సమావేశంను ఏప్రిల్ 13-14 వ తేదీల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర, సాంస్కృతిక శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జి20 సభ్య దేశాల నుండి 120 మంది మహిళా నాయకులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం "జన్ భాగీదారి" మహిళా సాధికారత యాత్రతో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లింగ అసమానత సమస్యలపై మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి సంబందించిన "ఉమెన్స్ అన్‌టాప్డ్ పొటెన్షియల్" అనే అంశంపై చర్చలు నిర్వహించారు. వీటితో పాటుగా మహిళా వ్యవస్థాపకత, మహిళల నాయకత్వం, డిజిటల్ లింగ అసమానత, విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి మరియు వాతావరణ మార్పులు వంటి ఎజెండాలు ఉన్నాయి.
భారత్ జి20 ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో మొదటి మహిళా 20 అంతర్జాతీయ సమావేశంను మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీనగర్‌లో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో నిర్వహించారు. ఈ సమావేశంకు కేంద్ర మహిళా & శిశు అభివృద్ధి మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షత వహించారు.
గ్లోబల్ వాచ్‌డాగ్ ఫ్రీడమ్ హౌస్ యొక్క ఫ్రీడం ఇన్ ది వరల్డ్ 2023 రిపోర్ట్
గ్లోబల్ వాచ్‌డాగ్ ఫ్రీడమ్ హౌస్ విడుదల చేసిన 2023 వార్షిక 'ఫ్రీడం ఇన్ ది వరల్డ్ రిపోర్ట్' లో దక్షిణ సూడాన్ మరియు సిరియాలతో పాటు టిబెట్‌ను ప్రపంచంలోనే అతి తక్కువ స్వేచ్ఛాయుత దేశంగా పేర్కొంది. ఇందులో భారత్ 66/100 స్కోరుతో పాక్షిక స్వేచ్ఛాయుత దేశంగా నిలిచింది. ఈ జాబితాలో నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు 100/100 స్కోరుతో అత్యంత స్వేచ్చాయుత దేశాలుగా నిలవగా, న్యూజిలాండ్ (99), నెదర్లాండ్స్ (97) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ఫ్రీడమ్ హౌస్ తన వార్షిక ఫ్రీడమ్ ఇన్ ది వరల్డ్ నివేదికలో 210 దేశాలు మరియు భూభాగాలకు సంబంధించి ప్రజల రాజకీయ మరియు పౌర హక్కుల ప్రాప్యతను అంచనా వేస్తుంది. ఇందులో ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ, ఓటు హక్కు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు చట్టం ముందు సమానత్వం వంటి వివిధ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా మంజూరు
భారత ఎన్నికల సంఘం 10 ఏప్రిల్ 2023న జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల జాబితాను సవరించింది. తాజా సవరణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను మంజూరు చేసింది. అదే సమయంలో ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) పార్టీల ప్రస్తుత జాతీయ హోదాను రద్దు చేసింది. దీనితో జాతీయ పార్టీల సంఖ్యా 8 నుండి 6 కి పడిపోయింది.
భారత ఎన్నికల సంఘం జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు కొన్ని ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా గుర్తింపునిస్తుంది. ఒక రాజకీయ పార్టీ జాతీయ హోదాను పొందాలంటే ఆ పార్టీ కనీసం మూడు వేర్వేరు రాష్ట్రాల నుండి 2 శాతం లోక్‌సభ సీట్లు పొంది ఉండాలి. లేదా కనీసం నాలుగు రాష్ట్రాలలో లోక్‌సభ / శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికలలో 6% ఓట్లను పొంది ఉండాలి. లేదా సదురు పార్టీకి నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు కలిగి ఉండాలి.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అదే సమయంలో గోవా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీ హోదాను కలిగి ఉంది. ఈ కారణంగా జాతీయ హోదాను దక్కించుకుంది. 2016 నుండి భారత ఎన్నికల సంఘం రెండేళ్లకోసారి పార్టీల హోదాను సవరిస్తుంది. తద్వారా తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైయ్యే పార్టీల హోదాను రద్దు చేస్తుంది. ప్రస్తుతం జాతీయ హోదా కలిగిన పార్టీలు.
- ఆమ్ ఆద్మీ పార్టీ
- బహుజన్ సమాజ్ పార్టీ
- భారతీయ జనతా పార్టీ
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం)
- భారత జాతీయ కాంగ్రెస్
- నేషనల్ పీపుల్స్ పార్టీ
స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ 2021-22 విడుదల
2021-22 ఏడాదికి సంబంధించిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్‌లో (SEEI) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రలు ఫ్రంట్ రన్నర్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. అలానే అచీవర్ విభాగంలో అస్సాం, హర్యానా, మహారాష్ట్ర మరియు పంజాబ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాం మరియు చండీగఢ్‌లు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలుగా నిలిచాయి. గత ఇండెక్స్ కంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అత్యధికంగా అభివృద్ధిని కనబరిచాయి.
ఈ నివేదికను ఏప్రిల్ 10న కేంద్ర విద్యుత్ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ అనేది జాతీయ ప్రాధాన్యతలతో సమలేఖనం చేయబడిన 50 సూచికల యొక్క నవీకరించబడిన ఫ్రేమ్‌వర్క్ ద్వారా రాష్ట్ర-స్థాయి ఇంధన సామర్థ్య కార్యక్రమాల ఫలితాలు మరియు ప్రభావాలను ట్రాక్ చేసే నివేదిక.
ఈ నివేదికను అలయన్స్ ఫర్ ఆన్ ఎనర్జీ ఎఫీషియంట్ ఎకానమీ కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) రూపొందిస్తుంది. దీనిని 2002లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రమాణాల ప్రకారం ఇంధన పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో కర్బన ఇంధనల అవసరాన్ని తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.
రాజస్థాన్‌లో తొలి వందే భారత్‌ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
రాజస్థాన్ యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏప్రిల్ 12న, ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీ-జైపూర్-అజ్మీర్ మధ్య సేవలు అందించనుంది. 428 కిలోమీటర్ల ఈ రూటులో కేవలం 5 గంటల 15 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేర్చుతుంది.
ఈ మార్గంలో ఇదే అత్యంత వేగవంతమైన రైలు. రాజస్థాన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ టెరిటరీలో ప్రపంచంలోనే మొదటి సెమీ-హై-స్పీడ్ ప్యాసింజర్ రైలుగా నిలవనుంది. ఇది దేశంలో 14వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
లక్నోలో రెండు రోజుల జాతీయ వాతావరణ సదస్సు -2023
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఏప్రిల్ 10న లక్నోలో రెండు రోజుల జాతీయ వాతావరణ సదస్సు 2023ను ప్రారంభించారు. ఈ రెండు రోజుల జాతీయ వాతావరణ సమావేశంలో వాతావరణ మార్పులు, అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ సంబంధించిన అంశాలపై చర్చలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్‌లో భారత్ బయోటెక్‌కు అవార్డు
వాషింగ్టన్‌లో జరిగిన ప్రపంచ వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ (ViE) అవార్డుల కార్యక్రమంలో భారత్ బయోటెక్ ' బెస్ట్ ప్రొడక్షన్ /ప్రాసెస్ డెవలప్మెంట్ ' అవార్డును గెలుచుకుంది. ఈ కార్యక్రమం అమెరికాలోని వాషింగ్టన్‌లో ఏప్రిల్ 3-6 మధ్య జరిగింది. ప్రపంచ వ్యాక్సిన్ కాంగ్రెస్ అనేది వ్యాక్సిన్‌లకు అంకితమైన అతిపెద్ద ప్రపంచ సమావేశం. ఇది టీకాల పరిశోధన నుండి వాణిజ్య తయారీ వరకు పూర్తి ప్రక్రియను పరిశీలిస్తుంది.
సిఆర్ రావుకు ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ అవార్డు
భారతీయ సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు సీఆర్ రావుకు నోబెల్ బహుమతితో సమానమైన అంతర్జాతీయ గణాంకాల బహుమతి అందుకున్నారు. కర్ణాటకలో జన్మించిన 102 ఏళ్ల సీఆర్ రావు 1943లో కలకత్తా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఇదే రంగంలో డాక్టరేట్ అందుకున్నారు. గత 75 ఏళ్లకు పైగా స్టాటిస్టిక్స్ రంగానికి విశేష సేవలందిస్తున్న సీఆర్ రావు గౌరవార్థం ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఈ అవార్డును అందించింది.
ఐదు ప్రముఖ అంతర్జాతీయ గణాంక సంస్థల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డును ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అందిస్తుంది. అవార్డు గ్రహీతకు 80,000 డాలర్ల నగదు పురస్కారం అందిస్తారు. వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్ సందర్భంగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ అవార్డును 2017 నుండి అందిస్తున్నారు.
3,000 లకు చేరుకున్న భారతదేశపు పులుల జనాభా
తాజా టైగర్ సెన్సస్ డేటా ప్రకారం భారతదేశంలో పులుల జనాభా 3,167 కి చేరుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. 2019లో ప్రచురించబడిన 2018 టైగర్ సెన్సస్ ప్రకారం భారతదేశంలో 2,967 పులులు సంఖ్య నమోదు అయ్యింది. గత ఐదు టైగర్ సెన్సస్ డేటా ప్రకారం, పులుల జనాభా 2006లో 1,411 , 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967 మరియు 2022లో 3,167గా రికార్డు చేయబడింది. ఇది ప్రపంచ పులుల జనాభాలో 75% కంటే ఎక్కువ.
దేశంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రచారానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 9న జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నివేదికను విడుదల చేశారు. ప్రాజెక్ట్ టైగర్ అనేది పులుల సంరక్షణ కోసం ఏప్రిల్ 1,1973న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. దేశం అంతటా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన టైగర్ రిజర్వ్‌లలో పులుల జనాభా మనుగడ మరియు నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం.
భారతదేశంలో అత్యధిక పులుల జనాభా ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్, తర్వాత కర్ణాటక మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. 2022లో సెంట్రల్ ఇండియన్ హైలాండ్స్ మరియు తూర్పు కనుమలలో అత్యధిక సంఖ్యలో (1,161) పులులు బౌతికంగా రికార్డు చేయబడ్డయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం ఆరు పులుల సంరక్షణ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో 526 పులులు సంరక్షించబడుతున్నాయి.
కేరళలో తొలి సౌరశక్తితో నడిచే పర్యాటక నౌక
కేరళ స్టేట్ ఇన్‌ల్యాండ్ నావిగేషన్ కార్పొరేషన్ (KSINC) సూర్యాంశు అనే పేరుతొ దేశంలో సౌరశక్తితో నడిచే తోలి పర్యాటక పడవను ప్రారంభించింది. ఈ బోటు యందు అమర్చిన సోలార్ పానెల్స్ 27 KW విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇది బోటు విద్యుత్తు అవసరాలలో 75 శాతం వరకు భర్తీ చేయనుంది.
అయితే భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ ఫెర్రీ మరియు అతిపెద్ద సోలార్ బోటును ఆదిత్య పేరుతొ జనవరి 12, 2017న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ నౌకను భారతదేశంలోని కొచ్చిలోని నావాల్ట్ సోలార్ మరియు ఎలక్ట్రిక్ బోట్స్ సంస్థలు రూపొందించాయి. ఈ సోలార్ ఫెర్రీ 2020లో ప్రపంచ ఉత్తమ ఎలక్ట్రిక్ ఫెర్రీగా మొదటి గుస్సీస్ అవార్డు అందుకుంది.
200 ఏళ్ల అస్సాం “టీ” వేడుకలు
అస్సాం టీ పరిశ్రమ ఉనికిలోకి వచ్చి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా, ఈ ఏడాది పొడుగునా దీనికి సంబందించిన వేడుకలను నిర్వహించాలని గౌహతి టీ ఆక్షన్ సెంటర్ (GTAC) నిర్ణయించింది. గౌహతి టీ వేలం కేంద్రం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టీ ట్రేడింగ్ కేంద్రాలలో ఒకటి. దీనిని 1970లో అస్సాం ప్రభుత్వం స్థాపించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రష్, టియర్, కర్ల్ (CTC) టీ వేలాన్ని నిర్వహించిన ట్రేడింగ్ సెంటరుగా గుర్తింపు పొందిఉంది
- అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాలో ఉన్న మొనాబరీ టీ ఎస్టేట్ ఆసియాలో అతిపెద్ద టీ ఎస్టేట్.
- అస్సాం యొక్క గోల్డెన్ పెర్ల్ భారతదేశపు అత్యంత ఖరీదైన టీగా గుర్తింపు పొందింది. ఇది 1 కిలో 1.51 లక్షల వరకు విక్రయించబడుతుంది.
- అస్సాంలోని డిబ్రూఘర్ ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో టీ సాగు చేయబడుతుంది. దీనిని టీ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
భారత రాజ్యాంగం యొక్క డోగ్రీ వెర్షన్, మొదటి ఎడిషన్ విడుదల
కేంద్ర న్యాయ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఏప్రిల్ 9న జమ్మూ విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగం యొక్క డోగ్రీ వెర్షన్ యొక్క మొదటి ఎడిషన్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోటీశ్వర్ సింగ్ మరియు జమ్మూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఉమేష్ రాయ్ పాల్గొన్నారు.
భారత రాజ్యాంగాన్ని డోగ్రీ భాషలోకి అనువదించడం జమ్మూ మరియు కాశ్మీర్ ప్రజల చిరకాల డిమాండ్. ఇది డోగ్రీ భాష మాట్లాడే వ్యక్తులు పౌరుల ప్రాథమిక హక్కులు మరియు విధులను, ప్రభుత్వ పనితీరును మరియు దేశంలోని వివిధ సంస్థల పాత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ మరియు డోగ్రీ మాట్లాడే దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలలో రాజ్యాంగంపై అవగాహన మరియు అవగాహనను ప్రోత్సహిస్తుంది.
డోగ్రీ అనేది భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క అధికారిక భాషలలో ఒకటి. ఇది రాజ్యాంగ హోదా కలిగిన 22 భారతీయ భాషల్లో ఒకటి. దీనిని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో చేర్చారు. ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా మైథిలి మరియు సంతాలి భాషలకు కూడా రాజ్యాంగ హోదా కల్పించారు.
ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్‌ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 9న కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ టైగర్ యొక్క 50 సంవత్సరాల స్మారక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా కొత్తగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐబీసీఏ)ని కూడా ప్రధాని ప్రారంభించారు. అదే సమయంలో టైగర్ రిజర్వ్‌ల నిర్వహణ సమర్థత మూల్యాంకనం యొక్క 5వ నివేదిక 'అమృత్ కల్ కా విజన్ ఫర్ టైగర్ కన్జర్వేషన్' అనే ప్రచురణలను కూడా విడుదల చేశారు.
అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ అనేది పులి, సింహం, లెపర్డ్, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ మరియు చిరుత జాతులకు ఆశ్రయం మరియు సంరక్షించే దేశాల కూటమి.దాదాపు 97 దేశాలను ఈ కూటమిలో చేర్చేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. ఈ కూటమి బిగ్ క్యాట్ రేంజ్ దేశాల పరిధిలో పెద్ద పిల్లుల సంరక్షణ ఆలోచనలు, పద్దతులను పంచుకునే వేదిక కానుంది.
ఈ పర్యటనలో ప్రధాని కర్ణాటక మరియు తమిళనాడులోని బందీపూర్ మరియు ముదుమలై టైగర్ రిజర్వ్‌లను సందర్శించారు. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా సందర్శించారు. ఇది ఇటీవలే ఆస్కార్-విజేత డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' సంబంధించిన ఏనుగుల శిబరం. ఈ పర్యటనలోనే 'టైగర్ ప్రాజెక్ట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజా పులుల గణన డేటాను విడుదల చేశారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 3,167 పులుల జనాభా ఉన్నట్లు ప్రకటించారు.
ప్రముఖ రంగస్థల నటి జలబాల వైద్య కన్నుమూశారు
ప్రఖ్యాత థియేటర్ ఆర్టిస్ట్ మరియు ఢిల్లీలోని అక్షర థియేటర్ సహ వ్యవస్థాపకురాలు జలబాల వైద్య, 86 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈమె ది రామాయణ డ్రామా ద్వారా విశేష ప్రాచుర్యం పొందారు. దీనిని ఈమె ప్రపంచవ్యాప్తంగా 2000 కంటే ఎక్కువ సార్లు ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని బ్రాడ్‌వేలో సహా వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూషన్, లండన్‌లోని బ్రిటన్ జాతీయ థియేటర్లలో ఒకటైన సాడ్లర్స్ వెల్స్, కెనడా మరియు ఫిన్లాండ్ జాతీయ థియేటర్లలో మరియు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వంటి అనేక ఇతర ప్రతిష్టాత్మక వేదికలలో ప్రదర్శించారు.
పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ యందు జలబాల వైద్య చేసిన కృషికి గాను సంగీత నాటక అకాడమీ యొక్క ఠాగూర్ అవార్డును, హోమీ భాభా ఫెలోషిప్ అవార్డును, ఢిల్లీ నాట్య సంఘ్ అవార్డును, ఆంధ్రప్రదేశ్ నాట్య అకాడమీ గౌరవం వంటి వివిధ అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు.
కోల్‌కతాలో ప్లాంట్ ఫంగస్ సంక్రమణ కేసు
కోల్‌కతాకు చెందిన 61 ఏళ్ల ప్లాంట్ మైకాలజిస్ట్, మొక్కల శిలీంధ్ర వ్యాధితో బాధపడుతున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా అవతరించాడు. సదరు వ్యక్తి గత కొద్దీ కాలంగా గొంతు బొంగురు, దగ్గు, అలసట వంటి వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నాడు. ఎన్ని వైద్య పరీక్షలలు నిర్వహించిన వ్యాధి నిర్దారణ కాకపోవడంతో ఈ రిపోర్టులు ఇండియాలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కోలాబరేటింగ్ సెంటర్ ఫర్ రిఫరెన్స్ & రీసెర్చ్ ఆన్ మెడికల్ ఇంపార్టెన్స్‌కి పంపించారు. వారు చేసిన డీఎన్ఎ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా ఇది కొండ్రోస్టెరియం పర్పురియం ద్వారా వచ్చిన ఫంగస్ ఇన్ఫెక్షన్‌గా నిర్దారించారు.
క్రోండ్రోస్టెరియం పర్పురియం అనేది కార్టిసియాసి కుటుంబానికి చెందిన ఫంగస్ జాతి. దీనిని సాధారణంగా "వైలెట్ ఫంగస్" అని పిలుస్తారు. ఇది అరుదుగా మానవులలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నట్లు నిర్దారించారు. శిలీంధ్రాలు సాధారణంగా మొక్కలకు వ్యాధులు కల్గిస్తాయి. పర్యావరణంలో ఉన్న మిలియన్ల శిలీంధ్రాలలో కొన్ని వందల శిలీంధ్రాలు మాత్రమే మానవులకు మరియు జంతువులకు సోకగలవు. అది కూడా వాటికీ దగ్గరగా పనిచేసే వ్యక్తులలో మాత్రమే ఇది సాధ్యమౌతుంది.
గాంధీనగర్‌లో రెండవ ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో రెండవ ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ (ETWG) ను గాంధీనగర్‌లో ఏప్రిల్ 3, 4వ తేదీలలో నిర్వహించారు. ఈ రెండు రోజుల సమావేశంలో జీ20 సభ్య దేశాలు, 10 ప్రత్యేక ఆహ్వానిత దేశాలు మరియు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ అధ్యక్షత వహించారు. దీనిని ఫిబ్రవరి 5-7 తేదీల్లో బెంగుళూరులో నిర్వహించబడిన మొదటి ఎనర్జీ ట్రాన్సిషన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి కొనసాగింపుగా నిర్వహించారు. ఈ సమావేశం క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌లో గ్లోబల్ సహకారం కోసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతదేశపు మొట్టమొదటి H2 ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) ట్రక్కును కూడా ప్రదర్శించారు.
గ్రీస్‌లో భారత తదుపరి రాయబారిగా రుద్రేంద్ర టాండన్
ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రుద్రేంద్ర టాండన్, గ్రీస్‌కు తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారు. టాండన్ 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో ఆ దేశ భారత రాయబారిగా ఉన్నారు. ఈయన 1994 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.
సీసీటీఎన్ఎస్ ప్రగతి ర్యాంకింగ్‌లో హర్యానా పోలీసులకు మొదటి స్థానం
అఖిల భారత స్థాయిలో తాజాగా విడుదల చేసిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ అండ్ నెట్‌వర్క్ సిస్టమ్ (CCTNS) ప్రగతి ర్యాంకింగ్‌లో హర్యానా పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. ఆ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీఎన్ఎస్ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం ద్వారా ఈ ఘనత దక్కించుకున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌పై హుష్ మనీ అభియోగాలు
అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించినట్లు ఆరోపించబడిన ఆరేళ్ల తర్వాత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్టోర్మీ డేనియల్స్‌తో తన కున్న లైంగిక సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు లేదా ఆమె ఆ రహస్యాన్ని దాచిపెట్టి ఉంచేందుకు దాదాపు 130,000 డాలర్లలు చెల్లించినట్లు ఈ చార్జిషీట్ పేర్కొంది. దీనితో నేరారోపణలను ఎదుర్కొన్న మొదటి అమెరికా అధ్యక్షుడుగా లేదా మొదటి మాజీ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రకెక్కారు.
తమిళనాడులో మోరే ఈల్ యొక్క కొత్త జాతి
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) శాస్త్రవేత్తల బృందం తమిళనాడు కడలూరు తీరంలోని ముడసలోడై ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌లో కొత్త మోరే ఈల్ జాతిని కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ జాతికి జిమ్నోథొరాక్స్ తమిళ్‌నాడుయెన్సిస్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అలానే తమిళనాడు బ్రౌన్ మోరే ఈల్" అనే సాధారణ పేరును కూడా ప్రతిపాదించారు.