తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 01 ఫిబ్రవరి 2023
Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 01 ఫిబ్రవరి 2023

డైలీ ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్ తెలుగులో ఉచితంగా పొందండి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల సౌలభ్యం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న తాజా సమకాలిన అంశాలను మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ సమాచారం మీ పోటీపరీక్షల సన్నద్ధతను మరింత మెరుగుపరుచుస్తుంది భావిస్తున్నాం.

Advertisement

తెలుగులో ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్

అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ విజేతగా భారత్

దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్ జట్టుకు షఫాలీ వర్మ నేతృత్వం వహించారు. భారత మహిళల క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కు ఇదే తొలి ఐసీసీ ప్రపంచ టైటిల్.

ఈ టోర్నమెంటులో మొత్తం పదహారు జట్లు పోటీ పడ్డాయి. ఇందులో రెగ్యులర్ దేశాలతో పాటుగా ఐర్లాండ్, రువాండా, యూఏఈ, యూఎస్ఏ, జింబాబ్వే, ఇండోనేషియా, స్కాట్లాండ్ వంటి దేశాలు కూడా పాల్గొన్నాయి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులను భారత క్రికెటర్ శ్వేతా సెహ్రావత్ (297) నమోదు చేయగా, అత్యధిక వికెట్లను మ్యాగీ క్లార్క్ (12) నమోదు చేసింది.

ఐసీసీ అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రపంచ కప్పుకు దక్షిణాఫ్రికా ఆతిధ్యం ఇచ్చింది. నిజానికి ఈ టోర్నమెంటు 2021లో బంగ్లాదేశ్ యందు నిర్వహించాల్సి ఉంది, అయితే కోవిడ్ కారణాలతో చివరిగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఇక మీదట ప్రతి రెండేళ్లకు ఒకసారి దీన్ని ఐసీసీ నిర్వహిస్తుంది. తదుపరి 2025 ప్రపంచ కప్‌కు మలేషియా మరియు థాయ్‌లాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2020-21

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE), 2020-2021 డేటాను విడుదల చేసింది. ఈ సర్వే విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల డేటా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు మొదలగు ప్రమాణాల ఆధారంగా రూపొందించడబడింది.

తాజా నివేదిక ప్రకారం 2019-20 మధ్య దేశంలో 3.85 కోట్ల మంది ఉన్నత విద్య కోసం నమోదు చేసుకోగా, ఆ సంఖ్యా 2020-21లో దాదాపు 4.14 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఇందులో మహిళలు 2019-20 మధ్య 1.88 కోట్ల మంది ఉండగా 2020-21 నాటికీ 2.01 కోట్లకు చేరుకుంది. మహిళా నమోదులో 2014-15 నుండి దాదాపు 44 లక్షల (28%) పెరుగుదల కనిపించినట్లు తెలిపింది.

మొత్తం మహిళల చేరికలలో పురుషులతో పోల్చుకుంటే 2014-15 లో 45% ఉండగా 2020-21 నాటికి అది పెరిగి 49% కి చేరుకున్నట్లు నివేదించింది. అలానే 2019-20 నుండి 2020-21 మధ్య ఉన్నత విద్య కోసం నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గిరిజన విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలలో 2014-15 మధ్య చేరికలు 9.36 లక్షలు కాగా 2020-21 లో అది 12.06 లక్షలకు పెరిగినట్లు తెలిపింది.

ఉన్నత విద్య కోసం నమోదు చేసుకుంటున్న అత్యధిక మంది విద్యార్థుల జాబితాలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు మొదటి ఆరు స్థానాల్లో ఉన్నట్లు నివేదించింది. ఈ సర్వే ప్రకారం ఉన్నత విద్య కోసం నమోదు చేసుకున్న విద్యార్థులలో దాదాపు 79.06% మంది డిగ్రీ స్థాయి కోర్సులలో చేరగా, 11.5 % మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సుల్లో చేరారు.

డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఎక్కువ మంది ఆర్ట్స్ కోర్సులలో 20.56% మంది చేరగా, ఆ తరువాత సైన్స్ కోర్సుల్లో 15.5%, కామర్స్ కోర్సుల్లో 13.9%, ఇంజనీరింగ్ కోర్సులలో 11.9% చేరారు. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అత్యధికంగా హ్యుమానిటీస్ కోర్సులలో 20.56% మంది, ఆ తరువాత సైన్స్ కోర్సులలో 14.83% మంది చేరినట్లు తెలిపింది.

ఉన్నత విద్యలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వాటా 59% కాగా చేరికల వాటా 73.1%గా నమోదైంది. అలానే ప్రభుత్వ కళాశాలల వాటా 21.4% కాగా చేరికల వాటా 34.5%గా నమోదైంది. ఉన్నత విద్యా సంస్థలలో 2020-21 లో వివిధ మౌలిక సదుపాయాల విషయానికి వస్తే గ్రంధాలయాలు (97%), ప్రయోగశాలలు (88), కంప్యూటర్ కేంద్రాలు (91%), నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (61%), నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనుసంధానత (56%) కళాశాలు ఉన్నట్లు తెలిపింది.

దేశంలో ప్రస్తుతం 1,113 విద్యాలయాలు ఉండగా 43,796 కళాశాలలు, 11,296 స్వయంప్రతిపత్తి ఉన్న ప్రత్యేక సంస్థలు ఉన్నట్లు నివేదించింది. 2020-21లో విశ్వవిద్యాలయాల సంఖ్య 70 కి పెరిగినట్లు, కళాశాల సంఖ్య 1,453 పెరిగినట్లు తెలిపింది. విశ్వవిద్యాలయాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ (92), ఉత్తరప్రదేశ్ (84), గుజరాత్ (83) మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి.

అత్యధిక సంఖ్యలో కళాశాలలున్న రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ముందు వరసలో ఉండగా అత్యధిక కళాశాల సాంద్రత ఉన్న రాష్ట్రాలుగా కర్ణాటక(62), తెలంగాణ(53), కేరళ (50), హిమాచల్ ప్రదేశ్ (50), ఆంధ్రప్రదేశ్ (49), ఉత్తరాఖండ్ (40), రాజస్థాన్(40), తమిళనాడు (40) లు టాప్ జాబితాలో ఉన్నాయి.

దేశంలో అత్యధిక కళాశాలలున్న జిల్లాలుగా బెంగళూరు అర్బన్ (1058), జైపూర్ (671), హైదరాబాద్ (488), పూణే(466), ప్రయాగ రాజ్ (374), రంగారెడ్డి (345), భోపాల్ (327), నాగపూర్ (318) ముందు వరుసలో ఉన్నాయి.

ఐదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ప్రారంభం

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 ఐదవ ఎడిషన్ జనవరి 30న మధ్యప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. కేంద్ర క్రీడల మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లు భోపాల్‌లోని టిటి నగర్ స్టేడియంలో ఈ క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, జబల్‌పూర్, గ్వాలియర్, మాండ్లా, బాలాఘాట్ మరియు మహేశ్వర్‌ వంటి ఎనిమిది నగరాల్లో ఫిబ్రవరి 11 వరకు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. మొత్తం 27 క్రీడా ఈవెంట్‌లలో 250 కంటే ఎక్కువ బంగారు పతకాల కోసం పోటీపడనున్నారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను పాఠశాల స్థాయి విద్యార్థులలో క్రీడల యందు ఆసక్తిని పెంపొందించేందుకు, వారిని జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దె లక్ష్యంతో 2018 లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీటిని మొదటిలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పేరుతొ నిర్వహించే వారు.

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరు మార్పు

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్ పేరును "అమృత్ ఉద్యాన్" గా మార్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్' థీమ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మార్పుపై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 29న దీనిని పునఃప్రారంభించారు. వచ్చే రెండు నెలల పాటు ప్రజల సందర్శనార్థం తెరవబడి ఉంటుంది.

చెక్ రిపబ్లిక్ నూతన అధ్యక్షుడిగా పీటర్ పావెల్

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ జనరల్ పీటర్ పావెల్, చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అధ్యక్షపదవి కోసం జరిగిన ఎన్నికలలో బిలియనీర్ ఆండ్రెజ్ బాబిస్‌ను ఓడించడం ద్వారా విజేతగా నిలిచాడు.

ఈ ఎన్నికలో పావెల్ 58.2 శాతం ఓటింగు పొందగా, ఆండ్రెజ్ బాబిస్‌ 42.8 శాతం ఓటింగు మాత్రమే దక్కించుకున్నారు. పీటర్ పావెల్ త్వరలో వివాదాస్పద అధ్యక్షుడు మిలోస్ జెమాన్ స్థానంలో అధ్యక్ష బాధ్యతలు  స్వీకరించనున్నారు.

ఎకనామిక్ సర్వే 2023-24 ముఖ్యాంశాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2022-23 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే అనేది దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క వార్షిక నివేదిక కార్డు, మొదటి ఆర్థిక సర్వే ను 1950-51 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఇది బడ్జెట్ పత్రాలలో భాగంగా ఉండేది.

1960వ దశాబ్దంలో దీనిని బడ్జెట్ డాక్యుమెంట్ల నుంచి వేరు చేసి కేంద్ర బడ్జెట్‌కు ముందు రోజు విడుదల చేస్తున్నారు. ఆర్థిక సర్వే దేశ ఆర్థిక అంశాలకు యొక్క పనితీరును, భవిష్యత్ వృద్ధిని అంచనా వేస్తుంది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందిస్తుంది. ఈ ఏడాది సీఈఏ ముఖ్య ఆర్థిక సలహాదారుడు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ అధ్యక్షతన ఇది రూపొందించబడింది.

  1. ఆర్థిక సర్వే 2023 భారతదేశ వృద్ధి దృక్పథం మహమ్మారి ముందు సంవత్సరాల కంటే మెరుగ్గా ఉందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 7శాతం నమోదు కాగా, 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఈ అంచనా 6 నుండి 6.8 శాతం మధ్య ఉండనున్నట్లు తెలిపింది.
  2. అయితే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ అప్‌డేట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి అంచనాను 6.8 శాతంగా మరియు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
  3. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ఈ ఏడాది మార్చి నాటికీ భారతదేశ నామ మాత్రపు జీడీపీ 3.5 ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. వినియోగదారుల ధరల పెరుగుదల గణనీయంగా తగ్గిందని సర్వే పేర్కొంది.
  4. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పూర్తయిందని, నాన్ బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ రంగాలు ఇప్పుడు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్‌లను కలిగి ఉన్నాయని నివేదించింది. మహమ్మారి రికవరీ గురించి ఇకపై మాట్లాడాల్సిన అవసరం లేదని, తదుపరి దశ కోసం మనం ఎదురుచూడాలని పేర్కొంది.
  5. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మద్దతుతో 2022 జనవరి-నవంబర్ మధ్య కాలంలో మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) సెక్టార్‌కి క్రెడిట్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉన్నట్లు, ఇది సగటున 30.6 శాతానికి పైగా ఉందని పేర్కొంది.
  6. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పిస్తోందని తెలిపింది. పూర్తిస్థాయి కోవిడ్ కార్యక్రమం ద్వారా వలస కార్మికులు నగరాలకు తిరిగి చేరుకున్నారని, తద్వారా నిర్మాణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయని వెల్లడించింది.
  7. పీఎం -కిసాన్ మరియు పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలు దేశంలో ఆహార భద్రతను పటిష్టం చేశాయని, వీటి ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) కూడా ఆమోదించిందని పేర్కొంది.
  8. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం, మూలధన నిర్మాణం ఉపాధి కల్పనకు దోహదం చేశాయని, పట్టణ ఉపాధి రేటు తగ్గగా, ఉద్యోగ భవిష్య నిధి నమోదుల సంఖ్య మాత్రం పెరిగిందని పేర్కొంది.
  9. ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లో 7.8 శాతానికి పెరిగిందని, ఇది ఆర్‌బీఐ గరిష్ట పరిమితి 6 శాతానికంటే ఎక్కువ అయినప్పటికీ ప్రపంచంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొంది.
  10. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం మద్దతుతో పెరుగుతున్న పెట్టుబడులు, ప్రైవేటు కన్జమ్షన్​ అని ఎకనామిక్​ సర్వే 2023 వెల్లడించింది. అదే సమయంలో.. ప్రైవేటు రంగాల్లోను పెట్టుబడుల ప్రవాహం పెరగాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. ఉద్యోగాలను సృష్టించే ప్రక్రియ మరింత వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.



యూనిలీవర్ నూతన సీఈఓగా హెయిన్ షూమేకర్‌

బ్రిటీష్ కన్జ్యూమర్ కంపెనీ యూనిలీవర్ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా హెయిన్ షూమేకర్‌ను నియమించినట్లు ప్రకటించింది. 51 ఏళ్ల షూమేకర్ గత ఏడాది అక్టోబర్‌లో యూనిలీవర్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ప్రస్తుత యూనిలీవర్ సీఈఓ అలన్ జోప్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్థానంలో హెయిన్ షూమేకర్‌ నియమించబడ్డారు.

ఉస్మాన్ ఖవాజాకు షేన్ వార్న్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు

ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తోలి షేన్ వార్న్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును గతేడాది మార్చిలో మరణించిన దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ గౌరవార్థం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రారంభించింది. దీనిని ఏడాదిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టెస్ట్ ప్లేయరుకు అందిస్తారు.

హాకీ ప్రపంచ కప్ 2023 విజేతగా జర్మనీ

హాకీ ప్రపంచ కప్ 2023 ను జర్మనీ సొంతం చేసుకుంది. దీనితో ప్రపంచ హాకీలో గత ఐదేళ్లుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న బెల్జియంకు చెక్ పెట్టింది. జనవరి 29న భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన ఫైనల్లో జర్మనీ షూటౌట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియంను 5-4తో ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది. జర్మనీకి ఇది మూడవ ప్రపంచ కప్ విజయం. అత్యధికంగా పాకిస్తాన్ 4 సార్లు విజేతగా నిలిచింది.

అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క హాకీ ప్రపంచ కప్ 2023 కు ఇండియాలోని ఒడిశా రాష్ట్రం ఆతిధ్యం ఇచ్చింది. జనవరి 13 నుండి జనవరి 29 మధ్య జరిగిన ఈ టోర్నమెంట్ మ్యాచులను ఓడిశాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటుగా, కళింగ స్టేడియంలో నిర్వహించారు. 2026 లో జరిగే తదుపరి హాకీ ప్రపంచ కప్, బెల్జియం & నెదర్లాండ్స్ దేశాలలో జరగనుంది.

యూనియన్ బడ్జెట్ 2023

కేంద్ర బడ్జెట్‌ 2023 ను భారత ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 01, 2023న పార్లమెంటులో సమర్పించారు. ఆమె ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ఇది. అలానే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ 2 ప్రభుత్వం యొక్క చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుందున, 2024లో ఈ ప్రభుత్వానికి తాత్కాలిక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.

సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో ఐదు వరుస బడ్జెట్‌లను సమర్పించిన ఆరవ ఆర్థిక మంత్రిగా నిలిచారు. 2019 నుండి ఆమె వరుసగా ప్రవేశపెట్టిన ఐదవ బడ్జెట్ ఇది. దీనితో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ మరియు పి చిదంబరం వంటి లెజెండ్‌ల సరసన ఆమె చేరారు. అలానే ఆమె 2021లో భారతదేశ మొదటి డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను కూడా దక్కించుకున్నారు.

తెలుగులో ఫిబ్రవరి 2023 కరెంట్ అఫైర్స్

Advertisement

Post Comment