Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ ఆగష్టు 2022 | పోటీపరీక్షల ప్రత్యేకం
Magazine 2022

తెలుగులో కరెంట్ అఫైర్స్ ఆగష్టు 2022 | పోటీపరీక్షల ప్రత్యేకం

ఆగష్టు 2022 కరెంటు అఫైర్స్ తెలుగులో ఉచితంగా పొందండి. అన్ని రకాల పోటీపరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ & టెక్నాలజీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, దినోత్సవాలు, క్రీడా ముఖ్యాంశాలు ఇలా వివిధ కేటగిరిల వారీగా తాజా కరెంటు అఫైర్స్ పొందండి.

ఇండియన్ అఫైర్స్

వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ సవరణ బిల్లు ఆమోదం

ది వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మరియు వాటి డెలివరీ సిస్టమ్స్ (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిషేధం) సవరణ బిల్లు 2022ను భారత పార్లమెంటు ఆమోదించింది. ఈ సామూహిక విధ్వంసాలకు ఉపాయోగించే జీవ, రసాయన లేదా అణ్వాయుధాలు తయారీ, రవాణా వంటి నిషేధిత కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుంది.

దేశవ్యాప్తంగా పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

భారత జాతీయ పతక డిజైనర్ మరియు స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య 1921 ఏప్రిల్ 1న విజయవాడ నగరానికి వచ్చిన మహాత్మాగాంధీకి జాతీయ పతాకాన్ని రూపొందించి బహుకరించారు.

ఇదే జెండాను కొద్దిపాటి మార్పులతో 1947 జూలై 22 న జరిగిన భారత మొదటి రాజ్యాంగ సభ సమావేశంలో భారత జాతీయ పతాకంగా ఆమోదించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఆయన సేవలను పురస్కరించుకుని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 'తిరంగ ఉత్సవ్'ను నిర్వహిస్తోంది.

దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి జాతీయ పతకాన్ని అందించి ఆగష్టు 13 నుండి 15 తేదీ వరకు మూడు రోజుల పాటు దేశ వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరవేసే ఏర్పాటు చేస్తుంది.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2022 ఆమోదం

కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు 2022ను రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. రాష్ట్రాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలు కల్పించే కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009ని సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సవరణ ద్వారా వడోదరలోని నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్‌ని కేంద్రీయ గతి శక్తి విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు.

నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్‌ని డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించారు. రవాణా, సాంకేతికత మరియు నిర్వహణకు సంబంధించిన విభాగాల్లో నాణ్యమైన బోధన, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు గతి శక్తి విశ్వవిద్యాలయ సహాపడుతుందని వెల్లడించారు. ఇది ప్రస్తుతం గుజరాత్ యూనివర్సిటీగా కాకుండా జాతీయ విశ్వవిద్యాలయంగా సేవలు అందించనుంది.

బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం

జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు నితీష్ కుమార్ 8వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. రాజకీయ కారణాలతో బిజెపితో జెడి(యు) పొత్తును ఉపసంహరించుకున్నా నితీష్ కుమార్, సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష మహాకూటమి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు. నూతన ప్రభుత్వంలో ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.

భారత్ రంగ్ మహోత్సవ్ 2022

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోశ్యారి ముంబైలోని రవీంద్ర నాట్య మందిర్‌లో 22వ ' భారత్ రంగ్ మహోత్సవ్'ను ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వహిస్తున్న ఈ 5 రోజుల థియేటర్ ఫెస్టివల్ ద్వారా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించనున్నారు. ఈ ఉత్సవాలు ఆగష్టు 09 నుండి ఆగష్టు 13 వరకు జరగనున్నాయి.

తమిళనాడులో 5వ ఏనుగుల సంరక్షణ కేంద్రం ప్రారంభం

ఆగష్టు 12, ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా అగస్త్యమలైలో మరో ఏనుగు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వ్ దేశంలో 32వ ఏనుగు రిజర్వ్ కాగా తమిళనాడులో ఐదవది. ఇప్పటికే తమిళనాడులో నీలగిరి ఎలిఫెంట్ రిజర్వ్, కోయంబత్తూర్ ఎలిఫెంట్ రిజర్వ్, అనమలై ఎలిఫెంట్ రిజర్వ్, శ్రీవిల్లిపుత్తూరు ఎలిఫెంట్ రిజర్వ్'లు ఉన్నాయి.

ఇండియా మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతరు 'రోషిణి' ప్రారంభం

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి సెలైన్ వాటర్ లాంతరు 'రోష్ని'ని ప్రారంభించారు. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) నిర్వహిస్తున్న తీర పరిశోధన నౌక సాగర్ అన్వేషికను సందర్శించిన సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. సెలైన్ వాటర్ లాంతర్లు ఎల్ఈడీ ల్యాంప్‌లకు శక్తినివ్వడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రోడ్‌ల మధ్య సముద్రపు నీటిని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తాయి.

భారతదేశంలోని 7,500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ వెంబడి నివసిస్తున్న పేదలు మరియు నిరుపేదలకు, ముఖ్యంగా మత్స్యకార సమాజానికి 'ఈజ్ ఆఫ్ లివింగ్' అందించడానికి ఈ సాంకేతికత సహాయపడుతుంది.

ఇండియా రామ్‌సర్ జాబితాలో మరో 11 చిత్తడి నేలలు

భారత 75 స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని, భారత ప్రభుత్వం మరో 11 చిత్తడి నేలలను రామ్‌సర్ జాబితాలో చేర్చింది. దీనితో భారతదేశంలో రామ్‌సర్ సైట్‌ల సంఖ్యా 75కి చేరుకుంది. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 14 రామ్‌సర్ సైట్‌లు ఉండగా, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 10 రామ్‌సర్ సైట్‌లు కలిగిఉంది.

కొత్తగా నోటిఫై చేసిన రామ్‌సర్ సైట్‌లలో ఒడిశాలో తంపర సరస్సు, హిరాకుడ్ రిజర్వాయర్, అంసుప సరస్సు ఉండగా, తమిళనాడు రాష్ట్రంలో చిత్రంగుడి పక్షుల అభయారణ్యం, సుచింద్రం తేరూర్ వెట్‌ల్యాండ్ కాంప్లెక్స్, వడువూరు పక్షుల అభయారణ్యం, కంజిరంకులం పక్షుల అభయారణ్యలను నోటిఫై చేశారు.

అలానే జమ్మూ కాశ్మీర్ యందు హైగమ్ వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, షాల్‌బగ్ వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, మహారాష్ట్ర యందు థానే క్రీక్, మధ్యప్రదేశ్ యందు యశ్వంత్ సాగర్ ప్రాంతాలను ఈ జాబితాలో చేర్చారు.

మెరుగైన భారతదేశం కోసం 'పంచ్ ప్రాణ్' ప్రతిజ్ఞ

భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, వచ్చే 25 ఏళ్ళ మెరుగైన భారతదేశం కోసం 'పంచ్ ప్రాణ్' ప్రతిజ్ఞను ప్రతిపాదించారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యం జరుపుకునే 2047 నాటికి ఆ పంచప్రాన్‌ ప్రతిజ్ఞను స్వీకరించడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల కలలన్నింటినీ నెరవేర్చే బాధ్యతను పౌరులు తీసుకోవాలని కోరారు.

'పంచ్ ప్రాణ్' ప్రతిజ్ఞలో మొదటిది 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన-దేశ హోదాను పొందాలి. రెండవది వలసవాద మనస్తత్వం నుండి స్వేచ్ఛ పొందాలి. మూడవది అత్యంత శక్తివంతమైన భారతీయ సాంస్కృతిని పెంపొందించడం, నాల్గవది సంకుచిత ప్రయోజనాల కోసం కాకుండా జాతీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ఇక చివరిది దేశ పౌరులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఉత్తమ నాయకులను ఎన్నుకోవడం.

బీహార్ మిథిలా మఖానాకు జీఐ ట్యాగ్

బీహార్ మిథిలా మఖానాకు కేంద్ర ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్‌ని ప్రదానం చేసింది. మిథిలా మఖానా లేదా మఖన్ అనేది బీహార్ మరియు నేపాల్‌లోని మిథిలా ప్రాంతంలో సాగు చేయబడిన ఒక ప్రత్యేక రకం జలచర గింజ మొక్క. దీని బొటానికల్  పేరు యూరియాల్ ఫెరోక్స్ సాలిస్బ్. ఈ మొక్క గింజలను పాప్ కార్న్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.

యునెస్కో వారసత్వ జాబితాలో చోటు కోసం గార్బా నామినేట్

యునెస్కో యొక్క సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి 2022 ఏడాదికి గాను భారతదేశం నుండి గుజరాత్‌కు చెందిన గార్బా యొక్క సాంప్రదాయ నృత్య రూపం నామినేట్ చేయబడింది. దీనికి సంబంధించిన సమావేశాలు నవంబర్ నెలలో జరగనున్నాయి. ఇది వరకు 2021 లో పారిస్‌లో జరిగిన కమిటీ 16వ సెషన్‌లో కలకత్తా దుర్గాపూజను యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ యొక్క ప్రతినిధి జాబితాలో చోటు కల్పించింది.

ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2022

ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ (ICAS) యొక్క నాల్గవ ఎడిషన్ ఆగష్టు 23 న బెంగళూరులో ప్రారంభమైంది. ఈ సమావేశాల ద్వారా వాయు కాలుష్యం మరియు వాతావరణ మార్పులకు సబంధించి ప్రపంచ నిపుణుల సహాయంతో సమగ్ర విధానాన్ని రూపొందించనున్నారు. నాలుగు రోజులు పాటు సాగే ఈ సమావేశాలు ఆగష్టు 23 నుండి 26 వరకు కొనసాగనున్నాయి.

సమ్మిట్‌ను సెంటర్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ స్టడీస్ (CAPS) మరియు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ మరియు పాలసీ (CSTEP) కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశాల్లో కాలుష్య నివారణ విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గుననున్నారు. ఈ సమావేశాలు 'ది రైట్ టూ లైఫ్' థీమ్'తో జరుగుతున్నాయి.

న్యూ ఇండియా పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

మాజీ కేంద్ర మంత్రి, పద్మవిభూషణ్‌ అరుణ్‌జైట్లీ వర్ధంతి సందర్భంగా ఎంపిక చేసిన కథనాల సంకలనం న్యూ ఇండియా అనే పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన, సుస్థిరమైన, సుసంపన్నమైన, శాంతియుతమైన, పట్టణ-గ్రామీణ విభజన లేని, లింగ, సామాజిక వివక్ష లేని ప్రగతిశీల ఆధునిక భారత దేశం కోసం జైట్లీ కలలు కన్నారని వెల్లడించారు.

'ఆజాదీ క్వెస్ట్' ఆన్‌లైన్ గేమ్‌లను ప్రారంభించిన అనురాగ్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత స్వాతంత్ర్య పోరాటల ఆధారంగా రూపొందించిన ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ గేమ్‌ల శ్రేణి “ ఆజాదీ క్వెస్ట్ ” ను ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత స్వాతంత్ర్య పోరాటాలను విద్యార్థులకు దగ్గర చేయాలనే నిర్చయంతో జింగా ఇండియా సహకారంతో వీటిని రూపొందించారు.

ఇంటర్నేషనల్ అఫైర్స్

కొలంబియా మొదటి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో

కొలంబియా మొదటి వామపక్ష అధ్యక్షుడిగా గుస్తావో పెట్రో ప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏళ్ల గుస్తావో పెట్రో గతంలో కొలంబియా యొక్క M-19 గెరిల్లా సభ్యుడుగా పనిచేశారు. దక్షిణ అమెరికాలో ఒకానొక దేశమైన కొలంబియాలో దాదాపు 40 శాతం మంది పేదరికంలో జీవిస్తున్నారు, 11.7 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.

మంకీపాక్స్ వైరస్ వేరియంట్‌లకు కొత్త పేర్లు

వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్'కు చెందిన ప్రపంచ నిపుణుల బృందం మంకీపాక్స్ వైరస్ వేరియంట్‌ల కోసం కొత్త పేర్లను అంగీకరించింది. దీని ప్రకారం మంకీపాక్స్ వేరియంట్‌లకు క్లాడ్స్ I, IIa మరియు IIb అని పేరు పెట్టింది. ఇది ఇలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గత నెలలో మంకీపాక్స్'ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.

ఓమిక్రాన్ వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశంగా యూకే

ఓమిక్రాన్ వేరియంట్ సంబంధించి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆమోదించిన ప్రపంచంలోనే మొదటి దేశంగా యూకే అవతరించింది. యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ అథారిటీ - ఒరిజినల్ కోవిడ్-19 జబ్‌ను ఆమోదించిన ప్రపంచంలోనే మొట్టమొదటిది వ్యాక్సిన్‌ ఇది. ఇది వైరస్ యొక్క ఒరిజినల్ మరియు ఒమిక్రాన్ BA.1 రెండింటినీ లక్ష్యంగా నివారించనుంది.

కెన్యా అధ్యక్షుడుగా విలియం రూటో

కెన్యా డిప్యూటీ ప్రెసిడెంట్ విలియం రూటో ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచారు. ఆగస్ట్ 9న జరిగిన అధ్యక్ష్య ఎన్నికలలో విలియం రూటో 50.5% ఓట్లు పొందగా, అతని ప్రధాన ప్రత్యర్థి ఒడింగా 48.9% శాతం ఓట్లు దక్కించుకున్నారు.

నెతన్యాహు ఆత్మకథ 'బీబీ: మై స్టోరీ' విడుదలకు సిద్ధం

ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు యొక్క ఆటోబయోగ్రఫీ 'బీబీ - మై స్టోరీ' ఈ ఏడాది నవంబర్ నెలలలో మార్కెట్లోకి రానుంది. ఈ పుస్తకం 1949లో జన్మించిన బెంజమిన్ నెతన్యాహు, ఉదారవాద, సెక్యులర్ జియోనిస్టుల ఆధిపత్యం ఉన్న దేశంలో దేశంలో అంచెలంచేలుగా ఎలా ఎదిగారు అనే అంశాన్ని వివరించనుంది.

పరాగ్వేలో భారత రాయబార కార్యాలయం ప్రారంభం

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పరాగ్వేలో కొత్త ఏర్పాటు చేసిన భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. దక్షిణ అమెరికాకు మొట్టమొదటి సారి అధికారిక పర్యటనకు వెళ్లిన జైశంకర్, పరాగ్వేను సందర్శించిన మొదటి భారతీయ విదేశాంగ మంత్రిగా కూడా నిలిచారు.

దక్షిణ కొరియాలో ప్రపంచ అత్యల్ప సంతానోత్పత్తి రేటు

దక్షిణ కొరియా ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటును నమోదు చేసింది. తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం  2021 సంబంధించి దక్షిణ కొరియా సంతానోత్పత్తి రేటు 0.81 గా నమోదు అయ్యింది. గతంలో వీరి పేరట ఉన్న 0.84 రికార్డును అదిగిమించింది. 2021 జనాభా లెక్కల ప్రకారం దక్షిణ కొరియాలో 260,600 మంది పిల్లలు జన్మించారు. ఈ జననాల సంఖ్యా వారి దేశ జనాభాలో 0.5 శాతంకు సమానం.

వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీకి 2022 లిబర్టీ మెడల్

ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీకి 2022 ఏడాదికి గాను లిబర్టీ మెడల్ అందించారు. లిబర్టీ మెడల్ అవార్డు గ్రహీతలకు $100,000 నగదు బహుమతి అందించబడుతుంది. లిబర్టీ మెడల్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ (NCC) ద్వారా నిర్వహించబడే వార్షిక అవార్డు. దీనిని 1988 లో ప్రారంభించారు. ఇది అత్యుత్తమ నాయకత్వాన్ని గాను అందిస్తారు.

ఏంజెలా మెర్కెల్‌కు యునెస్కో శాంతి బహుమతి

జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు 2022 యునెస్కో శాంతి బహుమతి లభించింది. వివిధ దేశాలకు చెందిన శరణార్థులకు ఆశ్రయం కల్పించినందుకు గాను ఈ అవార్డు అందించారు. ఏంజెలా మెర్కెల్‌ 2015 లో దాదాపు 1.2 మిలియన్ల శరణార్థులకు జర్మనీలో ఆశ్రయం కల్పించారు.

యునెస్కో శాంతి బహుమతి అనేది అధికారికంగా Félix Houphouët-Boigny UNESCO శాంతి బహుమతిగా పిలువబడుతుంది. ఈ గౌరవం ఐవరీ కోస్ట్ యొక్క మొదటి అధ్యక్షుడి పేరు మీద 1989 లో పెట్టబడింది. దీనిని ప్రపంచ శాంతి కోసం కృషి చేసే పౌరులకు అందిస్తారు.

ప్రపంచాన్ని చుట్టిన అతి పిన్న వయస్కుడుగా మాక్ రూథర్‌ఫోర్డ్

మాక్ రూథర్‌ఫోర్డ్ అనే 17 ఏళ్ల బెల్జియన్-బ్రిటీష్ పైలట్ ప్రపంచాన్ని ఒంటరిగా ప్రయాణించిన అతి పిన్న వయస్కుడిగా అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. 23 మార్చి 2022 ప్రారంభించిన ఈ ప్రయాణం దాదాపు 52 దేశాలలో ఐదు నెలల నిడివితో, 26 ఆగష్టు 2022 న బల్గేరియాలోని సోఫియాలో ముగిసినట్లు తెలుస్తుంది.

వార్తల్లో వ్యక్తులు

పీఎంఓ డైరెక్టర్‌గా ఐఎఫ్‌ఎస్ అధికారిణి శ్వేతా సింగ్‌

ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిణి శ్వేతా సింగ్ ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2008 ఐఎఫ్ఎస్ బ్యాచుకు చెందిన శ్వేతా సింగ్ వచ్చే మూడేళ్ళ కాలానికి ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సంజయ్ అరోరా

తమిళనాడు కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ అరోరా ఢిల్లీ నూతన పోలీస్ కమిషనర్‌గా నియమింపబడ్డారు. రాకేశ్ అస్థానా స్థానంలో త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. సంజయ్ అరోరా ఇది వరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కూడా పనిచేశారు.

పీఐబీ ప్రిన్సిపల్ డీజీగా సత్యేంద్ర ప్రకాశ్

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి సత్యేంద్ర ప్రకాష్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ యందు విధులు నిర్వర్తించారు.

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన తర్వాత ఆగస్టు 27న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ హోదాలో ఆయన పదవీ విరమణ తేదీ నవంబర్ 8 వరకు 74 రోజులు పాటు ఉండనున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, క్లాజ్ (2) ప్రకారం రాష్ట్రపతిచే నియమింపబడతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో మోస్ట్ సీనియర్ న్యాయమూర్తులకు ఈ అవకాశం లభిస్తుంది.

భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధంఖర్

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధంకర్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆగష్టు 6న జరిగిన ఎన్నికలలో ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాను ఓడించి, ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధంఖర్‌తో ఆగష్టు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

సీఎస్ఐఆర్ మొదటి మహిళా డైరెక్టర్‌గా నల్లతంబి కలైసెల్వి

సీనియర్ ఎలక్ట్రో కెమికల్ సైంటిస్ట్ నల్లతంబి కలైసెల్వి, దేశవ్యాప్తంగా ఉన్న 38 ప్రభుత్వ పరిశోధనా సంస్థల కన్సార్టియం అయినా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. నల్లతంబి కలైసెల్వి గతంలో తమిళనాడు లోని సీఎస్ఐఆర్ ఎలెక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ యందు డైరెక్టరుగా పనిచేశారు.

ఎఫ్ఐడిఈ డిప్యూటీ ప్రెసిడెంట్‌గా విశ్వనాథన్ ఆనంద్

లెజెండరీ ఇండియన్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) డిప్యూటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలానే ప్రస్తుత ఎఫ్ఐడిఈ అధ్యక్షుడు ఆర్కాడీ డ్వోర్కోవిచ్ రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు.

విశ్వనాథన్ ఆనంద్ ఇండియా మొదటి గ్రాండ్‌మాస్టరుగా ప్రసిద్ధి. 1988లో కెరీర్ ప్రారంభించిన ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. 2800 ఎ రేటింగ్‌ను అధిగమించిన అతికొద్ది మంది ఆటగాళ్ళలో ఆనంద్ ఒకడు.

దలైలామాకు లడఖ్ అత్యున్నత పౌర పురస్కారం

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా, లడఖ్ అత్యున్నత పౌర పురస్కారం dPal rNgam Duston అందుకున్నారు. ఈ అవార్డును లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (LAHDC), లేహ్ ప్రదానం చేసింది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మృతి

భారతదేశపు వారెన్ బఫెట్ అని పిలవబడే ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా 62 ఏళ్ల వయసులో ముంబైలో 14 ఆగష్టు 2022 న కన్నుమూశారు. జున్‌జున్‌వాలా 1985లో 5,000 రూపాయలతో ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించగా, అతను మరణించే సమయానికి సుమారు $5.8 బిలియన్ల సంపదను సృష్టించారు. అతన్ని ప్రేమగా దలాల్ స్ట్రీట్‌ ఆఫ్ 'బిగ్ బుల్' అని పిలుచుకుంటారు.

ఎన్ఐఐ డైరెక్టరుగా దేబాసిసా మొహంతి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎన్‌ఐఐ) డైరెక్టర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త దేబాసిసా మొహంతీ నియమితులయ్యారు. దేబాసిసా మొహంతీ ప్రస్తుతం ఇనేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో స్టాఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అనేది ఇమ్యునాలజీలో పరిశోధనల  కోసం బయోటెక్నాలజీ విభాగం కింద న్యూ ఢిల్లీలో ఉన్న స్వయంప్రతిపత్త పరిశోధనా సంస్థ. దీనిని 1981న స్థాపించారు. దీని పాలకమండలి ఛైర్మన్‌గా ప్రస్తుతం ప్రొఫెసర్. ఎంజీకే మీనన్ ఉన్నారు.

యూకే తదుపరి భారత హైకమిషనర్‌గా విక్రమ్ దొరైస్వామి

ఇండియన్ సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ కె. దొరైస్వామి, యునైటెడ్ కింగ్‌డమ్‌లో భారతదేశం యొక్క తదుపరి హైకమీషనర్‌గా నియమితులయ్యారు. విక్రమ్ కె దొరైస్వామి ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనరుగా ఉన్నారు. దొరైస్వామి 1992 ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కి చెందిన అధికారి.

డీఆర్డీవో ఛైర్మన్‌గా భారతీయ శాస్త్రవేత్త సమీర్ వి కామత్

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఛైర్మన్‌గా ప్రముఖ సీనియర్ భారతీయ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ నియమితులయ్యారు. కామత్ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉండనున్నారు.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అనేది భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కింద ఉన్న ప్రధాన ఏజెన్సీ, ఇది భారతదేశంలోని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా మిలిటరీ పరిశోధన మరియు అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. దీనిని 1958 లో స్థాపించారు.

ప్రపంచ మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ

భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ $137 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ యందు టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్న మొదటి ఆసియా సంపన్నుడుగా గౌతమ్ అదానీ రికార్డు నెలకొల్పారు. ఈ జాబితాలో అదానీ కంటే ముందు ఎలోన్ మాస్క్ $251 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, జెఫ్ బెజోస్ $153 బిలియన్ డాలర్ల సంపదతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.

థాయ్‌లాండ్‌లో భారత రాయబారిగా నగేష్ సింగ్

1995 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి, నగేష్ సింగ్ థాయ్‌లాండ్‌లో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న నగేష్ సింగ్ త్వరలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రభుత్వ పథకాలు & పాలసీలు

మహారాష్ట్రలో మొట్టమొదటి డిజిటల్ లోక్ అదాలత్

భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ లోక్ అదాలత్ ఆగస్టు 13 న నిర్వహించబడింది. ఈ మొట్టమొదటి ఎండ్-టు-ఎండ్ డిజిటల్ లోక్ అదాలత్‌ను రాజస్థాన్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (RSLSA) మరియు మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (MSLSA) నిర్వహించాయి. డిజిటల్ లోక్ అదాలత్ అనేది సామాన్యుడికి ఇంటినుండే న్యాయసేవలు పొందేందుకు సహకరిస్తుంది.

దీనిని రాజస్థాన్‌లో గత జులైలో జరిగిన 18వ ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీస్' సమ్మిట్ సందర్భంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మరియు బ్లాక్‌చెయిన్ ద్వారా నడిచే డిజిటల్ లోక్ అదాలత్‌ను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రారంభించారు.

రాజస్థాన్‌లోని డిజిటల్ లోక్ అదాలత్‌లో 568 బెంచ్‌లు ఉన్నాయి. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే మొత్తం 5,62,295 కేసులు నమోదయ్యాయి, వీటిలో 2,28,863 ప్రీ-లిటిగేషన్ కేసులు మరియు 3,33,432 వివిధ రాష్ట్ర కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో, డిజిటల్ లోక్ అదాలత్‌లో మొత్తం 63,99,983 ట్రాఫిక్ చలాన్ కేసులు నమోదయ్యాయి.

నీతి ఆయోగ్ 7వ పాలక మండలి సమావేశం

నీతి ఆయోగ్ యొక్క ఏడవ పాలక మండలి సమావేశం 7 ఆగస్టు 2022న నిర్వహించబడింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటున్న తరుణంలో, రాష్ట్రాలు చురుగ్గా, మరింత దృఢంగా స్వావలంబనతో, సహకార సమాఖ్య స్ఫూర్తితో 'ఆత్మ నిర్భర్ భారత్' వైపు వెళ్లవలసిన ఆవశ్యకత గురించి చేర్చించారు.

అలానే ఈ సమావేశాల ప్రధాన ఎజెండాగా పంటల వైవిధ్యం, నూనెగింజలు, పప్పుధాన్యాలు మరియు వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించడం, జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య & ఉన్నత విద్య అమలు, పట్టణ పాలన వంటి మొదలగు అంశాలు ఉన్నాయి.

నీతి ఆయోగ్ భారత ప్రభుత్వం యొక్క అపెక్స్ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్‌గా పనిచేస్తుంది. ఇది దేశ ఆర్థిక అభివృద్ధిని మెరుగుపర్చేందుకు మార్గనిర్దేశం చేస్తుంది. దీని ప్రధాన అధ్యక్షులుగా ప్రధానిమంత్రి ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు భాగస్వామ్య సభ్యులుగా ఉంటారు, ప్రస్తుత నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

భారత కేంద్ర ప్రభుత్వం 1 జనవరి 2015న నీతి ఆయోగ్ ఏర్పాటును ప్రకటించింది. నీతి ఆయోగ్ గతంలో ఉన్న ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసారు. నీతి ఆయోగ్ అనగా నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా అని అర్ధం.

తెలంగాణలో నేతన్న బీమా పథకం ప్రారంభం

ఆగష్టు 7 జాతీయ చేనేత దినోత్సవంను పురష్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రమాదశాత్తు మరణించిన చేనేత కుటుంబ సభ్యులకు 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ పథకం అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియాతో చేతులు కల్పింది.

ఢిల్లీలో 'మేక్ ఇండియా నంబర్ 1 మిషన్ ' ప్రారంభం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారతదేశాన్ని నంబర్ వన్‌గా మార్చడానికి  'మేక్ ఇండియా నంబర్ 1' అనే జాతీయ మిషన్‌ను ప్రారంభించారు. అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా మార్చాలంటే విద్య, వైద్యం, మరియు వ్యవసాయ రంగాలపై దృష్టి పెట్టాలని కోరారు.

పౌరులకు ఉచిత విద్య మరియు వైద్యం అందించడం, యువతకు ఉపాధి, మహిళలకు సమాన హక్కులు మరియు గౌరవం, రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం వంటి అంశాల కోసం మాట్లాడారు. భారతదేశాన్ని "సూపర్ రిచ్" మరియు "ప్రపంచంలోని అత్యుత్తమ దేశంగా మార్చే " ఈ మిషన్‌లో బిజెపి మరియు కాంగ్రెస్‌లను చేరాలని అరవింద్ కేజ్రీవాల్  కోరారు.

భారతీయ రైల్వే యొక్క ఆపరేషన్ యాత్రి సురక్ష ప్రారంభం

ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఆపరేషన్ యాత్రి సురక్ష అని పిలువబడే పాన్-ఇండియా ఆపరేషన్‌ను ప్రారంభించింది. గత జూలై 2022లో దీనికి సంబంధించిఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నెల రోజుల పాటు పాన్-ఇండియా డ్రైవ్‌ను ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో దాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయనుంది.

ఆపరేషన్ యాత్రి సురక్ష అనేది రైలు ప్రయాణీకుల వస్తువులను దొంగిలించడం, దోపిడీ, మత్తుపదార్థాలు, గొలుసు వంటి నేరాలకు పాల్పడే నేరస్థులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. భారతీయ రైల్వే ద్వారా ప్రయాణించే ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ దీని రూపొందించింది.

'దహీ హండీ'ని అధికారిక క్రీడగా ప్రకటించిన మహారాష్ట్ర

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం, దహీ హండీ క్రీడను మహారాష్ట్రలో అధికారిక క్రీడగా ప్రకటించింది. 'దహీ హండీ' అనేది మహారాష్ట్రలో హిందూ పండుగ జన్మాష్టమికి సంబంధించినది. దేశవ్యాప్తంగా బాలీవుడ్ చిత్రాల ద్వారా ప్రసిద్ధి చెందిన ఈవెంట్, ఇప్పుడు మహారాష్ట్రలో అధికారిక క్రీడ హోదాను పొందింది.

చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు

పంజాబ్ మరియు హర్యానా ప్రభుత్వాలు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర్య పోరాట దిగ్గజం షహీద్ భగత్ సింగ్ పేరు మార్చడానికి అంగీకరించాయి. దీనితో దశబ్దాల నాటిగ కొనసాగుతున్న దీనికి సంబంధించిన వివాదం కొలిక్కిరానుంది. మొహాలిలో ఉన్న ఈ షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంను హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

అస్సాంలో 'స్కూల్ ఆన్ వీల్స్' ప్రాజెక్ట్‌' ప్రారంభం

అస్సాం ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను సాంప్రదాయ విద్యా విధానం పరిధిలోకి తీసుకురావడానికి స్కూల్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. విద్యా రథ్ - స్కూల్ ఆన్ వీల్స్ అనే ఈ ప్రాజెక్ట్ నిరుపేద పిల్లలకు 10 నెలల నిడివితో ప్రాథమిక విద్యను అందించనుంది.

10 నెలల తర్వాత, పిల్లలు సంప్రదాయ విద్యా విధానంలో చేర్చబడతారు. ప్రాజెక్ట్ కింద పిల్లలకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు మరియు ఉచిత మధ్యాహ్న భోజనం కూడా అందించబడుతుంది. ఈ పథకాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఏం ఛాయా చేతులు మీదగా ప్రారంభించారు.

కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం నూతనంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ను ప్రారంభించింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీల అవార్డులను ఒకే వేదికపైకి తీసుకురావడంలో భాగంగా దీనిని రూపొందించారు.

ఈ ఉమ్మడి పోర్టల్ ప్రభుత్వం అందించే వివిధ అవార్డులకు వ్యక్తులు లేదా సంస్థలను నామినేట్ చేయడానికి ప్రతి భారతీయ పౌరుడు లేదా సంస్థలకు వీలు కల్పిస్తుంది. ఈ ప్రయత్నం అవార్డుల నామినేషన్లు లేదా సిఫార్సుల యందు పారదర్శకత మరియు ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే అవకాశం ఇవ్వనుంది.

మొహాలీలో కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

మొహాలిలోని ముల్లన్‌పూర్‌లో 300 పడకల హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 24 ఆగష్టు 2022 న ప్రారంభించారు. ఈ హాస్పిటల్ సుమారు 660 కోట్ల వ్యయంతో టాటా మెమోరియల్ సెంటర్ రూపొందించింది.

ఉత్తమ ఆస్పిరేషనల్ జిల్లాగా హరిద్వార్

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర నగరమైన హరిద్వార్‌ను ఐదు పారామితులపై ఉత్తమ ఆకాంక్షాత్మక జిల్లాగా నీతిఆయోగ్ ప్రకటించింది. బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం 2018 లో ప్రారంభించబడింది. దీనిద్వారా దేశంలో అభివృద్ధికి నోచుకోని 112 జిల్లాలను అదనపు ఆర్థిక వ్యయంతో డెవలప్ చేయనున్నారు.

నాగాలాండ్ రెండువ రైల్వే స్టేషన్‌ ఎర్పాటు

100 సంవత్సరాల తర్వాత నాగాలాండ్ రాష్ట్రంలో 2వ రైల్వే స్టేషన్‌ ఎర్పాటు చేయబడింది. 1903 సంవత్సరంలో ఏర్పాటు చేసిన దిమాపూర్ రైల్వే స్టేషన్ తర్వాత ఆ రాష్ట్రంలో మరో రైల్వే స్టేషన్ ఏర్పాటు జరగలేదు. తాజాగా ఏర్పాటు చేసిన శోఖువి రైల్వే స్టేషన్ నుండి డోనీ పోలో ఎక్స్‌ప్రెస్‌ను ముఖ్యమంత్రి నైఫియు రియో ​​జెండా ఊపి ప్రారంభించారు. అస్సాంలోని గౌహతి మరియు అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లాగన్ మధ్య ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది.

'సీఎం ఉద్యమన్ ఖిలాడీ ఉన్నయన్ ' పథకం ప్రారంభం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా 29 ఆగష్టు 2022 న 'సీఎం ఉద్యమన్ ఖిలాడీ ఉన్నయన్ ' పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 8 నుండి 14 ఏళ్ళ క్రీడాకారులకు నెలకు 1,500 రూపాయలు చెప్పున స్కాలర్షిప్ అందివ్వనున్నారు.

దేశంలో మొదటి వర్చువల్ స్కూల్ ప్రారంభం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ స్కూల్ ప్రారంభించారు. 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు వర్చువల్ ఎడ్యుకేషన్ అందించబోతున్న ఈ స్కూల్, ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్ (DMVS) కు అనుబంధంగా పనిచేస్తుంది.

ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ వర్చువల్ స్కూల్ వివిధ కారణాల వల్ల భౌతికంగా పాఠశాలకు హాజరు కాలేని విద్యార్థులకు ఉపయోగపడనుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇందులో అడ్మిషన్ పొందొచ్చు.

బిజినెస్ & ఎకానమీ అఫైర్స్

యూనిటీ బ్యాంక్ ఎండీ & సీఈఓగా ఇందర్‌జిత్ కామోత్రా

ముంబైకి చెందిన యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సీనియర్ బ్యాంకర్ ఇందర్‌జిత్ కామోత్రాను మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందించే యూనిటీ బ్యాంకు, ఇటీవలే ఆర్బీఐ ద్వారా షెడ్యూల్ బ్యాంకు హోదాను దక్కించుకుంది.

గ్రామీణ సహకార బ్యాంకుల జాతీయ సదస్సు 2022

సహకార మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ (NAFSCOB) సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ సహకార బ్యాంకుల జాతీయ సదస్సును ఆగష్టు 12న కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎంపిక చేసిన రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు పనితీరు ఆధారంగా అవార్డులను అందించారు.

అరుణాచల్‌లోని కొత్త విమానాశ్రయానికి డోనీ పోలోగా నామకరణం

ఆగస్ట్ 15 నుండి కార్యకలాపాలు ప్రారంభించనున్న ఇటానగర్ సమీపంలోని హోలోంగిలో ఉన్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి డోనీ పోలో విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఇది అరుణాచల్‌లోని నిర్మించిన మూడవ విమానాశ్రయంగా సేవలు అందించనుంది.

యునెస్కోతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భాగస్వామ్యం

'ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా'ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రముఖ భారతీయ బహుళజాతి మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, యునెస్కోతో బాగస్వామ్యమయ్యింది. ఇందులో భాగంగా ఆగస్ట్ 22 నుండి న్యూ ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో నాలుగు రోజుల పాటు 'జర్నీయింగ్ అక్రాస్ ది హిమాలయాస్' అనే సాంస్కృతిక వారసత్వ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మెర్సిడెస్-బెంజ్ ఇండియా సీఈఓగా సంతోష్ అయ్యర్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, ఆ సంస్థ భారతీయ కార్యకలాపాలకు మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా సంతోష్ అయ్యర్‌ను నియమించింది. 46 ఏళ్ళ సంతోష్ అయ్యర్ ప్రస్తుతం ఇదే సంస్థలో సేల్స్ & మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. సంతోష్ అయ్యర్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా కార్యకలాపాలకు నాయకత్వం వహించే మొదటి భారతీయుడుగా నిలిచాడు.

డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్

భారత్-ఒమన్ మిలిటరీ ఎక్సర్సైజ్ 'అల్ నజా-IV' ప్రారంభం

4వ భారత్-ఒమన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 'అల్ నజా-IV' ప్రారంభమైంది. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 01 ఆగస్టు నుండి 13 వరకు మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (రాజస్థాన్) ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో జరగనుంది. దీనికి సంబంధించి సుల్తాన్ ఆఫ్ ఒమన్ పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన 60 మంది రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ బృందం ఇండియాకు చేరుకుంది.

భారత సైన్యం నుండి 18 మెకానైజ్డ్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌ దళాలు ప్రాతినిథ్యం వహించనున్నాయి. భారత సైన్యం మరియు ఒమన్ రాయల్ ఆర్మీ నిర్వహిస్తున్న ఈ ఉమ్మడి సైనిక వ్యాయామం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరియు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగు పరుచుకోవడం కోసం నిర్వహిస్తున్నారు.

కార్గిల్ సెక్టార్‌లోని పాయింట్ 5140కి 'గన్ హిల్' గా నామకరణం

కార్గిల్ సెక్టార్‌లోని ద్రాస్‌ హిల్ ఫీచర్ పాయింట్ 5140 కి ' గన్ హిల్ ' అని నామకరణం చేశారు. 1999 కార్గిల్ యుద్ధంకు సంబందించిన ఆపరేషన్ విజయ్ యందు గన్నర్ల అత్యున్నత త్యాగానికి గుర్తుగా ఈ పేరు పెట్టారు.

ఇండియన్ నేవీ ఆల్-ఉమెన్ ఎయిర్‌క్రూ చారిత్రాత్మక రికార్డు

భారత నావికాదళ మహిళా ఏవియేటర్లు అరేబియా సముద్రం మీదుగా మొట్టమొదటిసారిగా మహిళా మారిటైమ్ పరివేక్షణ & నిఘా మిషన్‌ను నిర్వహించి చరిత్ర సృష్టించారు. పోర్‌బందర్‌లోని 'ఐఎన్‌ఎఎస్ 314' ఫ్రంట్‌లైన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్‌లోని మహిళా అధికారులు చేపట్టిన మిషన్‌కు లెఫ్టినెంట్ కమాండర్ ఆంచల్ శర్మ కెప్టెన్‌గా ఉన్నారు.

INAS 314 అనేది గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఉన్న ఫ్రంట్‌లైన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్. ఇది అత్యాధునిక డోర్నియర్ 228 సముద్ర నిఘా విమానాన్ని నిర్వహిస్తుంది.

ఆర్మీ మచిల్ ఉమెన్స్ క్రికెట్ లీగ్‌ ప్రారంభం

భారత సైన్యం, ఉత్తర కాశ్మీర్‌లో స్థానిక అధికారులతో కలిసి మొట్టమొదటి మచల్ మహిళల క్రికెట్ లీగ్‌ను నిర్వహించింది. ఈ క్రికెట్టు లీగ్ యందు మచ్చల్, పుశ్వరి, దూది గ్రామాలకు చెందిన బాలికలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల్లో మాచల్ గ్రామానికి చెందిన బాలికలు విజేతలుగా నిలిచారు. ఈ మ్యాచ్‌లను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక గ్రామస్తులు తరలివచ్చి, భారత సైన్యం చేపట్టిన ఈ కొత్త చొరవకు సంతోషం వ్యక్తం చేశారు.

ఇండో - యుఎస్ జాయింట్ ఎక్సర్సైజ్ “ఎక్స్ వజ్ర ప్రహార్ 2022

ఇండో-యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్‌సైజ్ “ఎక్స్ వజ్ర ప్రహార్ 2022” యొక్క 13వ ఎడిషన్ ఆగష్టు 9న  హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లోహ్‌లోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్‌లో ప్రారంభమైంది.

ఈ వార్షిక వ్యాయామం భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉమ్మడి మిషన్ ప్లానింగ్, కార్యాచరణ వ్యూహాలు, ఉత్తమ అభ్యాసాలు మరియు అనుభవాలను పంచుకోవడం అలానే ప్రత్యేక దళాల మధ్య ఇంటర్-ఆపరేబిలిటీని మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహిస్తారు.

ఇరు దేశాల ప్రత్యేక బలగాల మధ్య సంప్రదాయ స్నేహ బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మెరుగుపరచడంలో ఈ ఉమ్మడి వ్యాయామం ఉపయోగపడుతుంది.

ఇండియన్ ఆర్మీ హిమ్ డ్రోన్-ఎ-థాన్ ప్రోగ్రామ్ ప్రారంభం

డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో భారత సైన్యం 'హిమ్ డ్రోన్-ఎ-థాన్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్” చొరవతో భారత డ్రోన్ పర్యావరణ వ్యవస్థను ఉత్ప్రేరకపరచడం మరియు కేంద్రీకృత అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

దీని ద్వారా ఫ్రంట్‌లైన్ రక్షణ దళాల అవసరాలను తీర్చడానికి పాత్-బ్రేకింగ్ డ్రోన్ సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఎత్తైన ప్రదేశాలలో లాజిస్టిక్స్ అవసరాలు తీర్చే డ్రోన్స్, స్వయంప్రతిపత్త నిఘా/ శోధన & రెస్క్యూ డ్రోన్లు, బిల్ట్ అప్ ఏరియాల్లో ఫైటింగ్ కోసం మైక్రో/నానో డ్రోన్లు అభివృద్ధి చేయనున్నారు.

ఇస్రో వర్చువల్ మ్యూజియం స్పార్క్ ప్రారంభం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ISRO ) స్పార్క్ అనే 3D వర్చువల్ స్పేస్ టెక్ పార్క్‌ను ప్రారంభించింది. ఈ వర్చువల్ మ్యూజియంలో ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాలు, శాస్త్రీయ మిషన్లు మరియు భారతదేశ అంతరిక్ష రంగాల మార్గదర్శకులకు సంబంధించిన అనేక పత్రాలు, చిత్రాలు, వీడియోలు పొందుపర్చారు.

భారత్ & మలేసియా మధ్య ఉదారశక్తి ద్వైపాక్షిక వ్యాయామం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య నిర్వహించే మొదటి ఉదారశక్తి ద్వైపాక్షిక వ్యాయామంలో భారత వైమానికదళం పాల్గొంది. ఈ వ్యాయామంలో  భారత వైమానిక దళం నుండి Su-30 MKI మరియు C-17 విమానాలు పాల్గొంటుండగా, మలేషియన్ ఎయిర్ ఫోర్స్ నుండి Su 30 MKM విమానాలు పాల్గున్నాయి.

నాలుగు రోజుల పాటు జరిగే ఈ కసరత్తులో రెండు వైమానిక దళాల మధ్య వివిధ వైమానిక పోరాట కసరత్తులు జరిగాయి. తద్వారా ఇరుదేశాల వైమానిక దళాల మధ్య దీర్ఘకాల స్నేహ బంధాన్ని పెంపొందించడంతో పాటుగా రక్షణ సహకార మార్గాలను సహాయం అందించుకోనున్నారు.

రిపోర్టులు & ర్యాంకులు

డిజిటల్ కరెన్సీ ఓనర్షిప్ రిపోర్టులో ఇండియాకు ఏడవ స్థానం

డిజిటల్ కరెన్సీ యాజమాన్యం పరంగా టాప్ 20 దేశాలలో భారత్ ఏడువ స్థానంలో నిలిచింది. గడిసిన 2021 ఏడాదిలో భారతీయ జనాభాలో దాదాపు 7.3 శాతం మంది డిజిటల్ కరెన్సీని (క్రిప్టోకరెన్సీల రూపంలో) కలిగి ఉన్నారని UNCTAD నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో 12.7 శాతం వాటాతో ఉక్రెయిన్ అగ్రస్థానంలో ఉంది.

గోల్డెన్ జాయింట్ ఆఫ్ వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం

చీనాబ్ వంతెనపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన గోల్డెన్ జాయింట్ ప్రారంభమైంది. నదీ గర్భం నుండి 359 మీ (1,178 అడుగులు) ఎత్తులో నిర్మించిన ఈ రైల్వే వంతెన, ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన జమ్మూ మరియు కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో బక్కల్ మరియు కౌరీ ప్రాంతలను కనెక్ట్ చేస్తుంది.

మొదటి హర్ ఘర్ జల్ సర్టిఫైడ్ రాష్ట్రంగా గోవా

గోవా మరియు దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూలు దేశంలోనే మొదటి ' హర్ ఘర్ జల్ ' సర్టిఫికేట్ పొందిన రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా నిలిచాయి. 2024 నాటికి దేశంలో అన్ని గృహాలకు త్రాగునీటి కుళాయి అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ హర్ ఘర్ జల్ పథకంను కంద్రప్రభుత్వం ఆగష్టు 2019 లో ప్రారంభించి.

ముంబైలో మొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ప్రారంభం

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్‌ను ఆవిష్కరించారు. స్విచ్ EiV 22 అని పిలువబడే డబుల్ డెక్కర్ బస్సు సెప్టెంబర్ నుండి బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ బస్సును స్విచ్ మొబిలిటీ లిమిటెడ్ భారతదేశంలో డిజైన్ చేసి తయారు చేసింది.

విత్తన పంపిణీకి బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించిన జార్ఖండ్

రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. సెటిల్‌మింట్ అనే టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా జార్ఖండ్ 30,000 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీ ధరకు రైతులకు పంపిణీ చేసింది. దొంగతనం & దోపిడీని తగ్గించే లక్ష్యంతో ఈ సాంకేతికను ఉపయోగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పుణేలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సు ప్రారంభం

భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పుణేలో ప్రారంభించారు. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మరియు ప్రైవేట్ సంస్థ KPIT లిమిటెడ్ అభివృద్ధి చేసాయి. ఆత్మనిర్భర్ భారత్ మిషన్ మరియు దాని వాతావరణ మార్పు లక్ష్యాలకు పెద్ద ఊతమివ్వడంలో భాగంగా వీటిని రూపొందిస్తున్నారు.

హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించిన మొదటి దేశంగా జర్మనీ

హైడ్రోజన్ ఇంధన ఘటం ద్వారా నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైళ్లను జర్మనీ ప్రారంభించింది. జర్మన్ రాష్ట్రంలోని లోయర్ సాక్సోనీలో ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్‌తో నడిచే 14 హైడ్రోజన్ రైళ్ల సముదాయంను తాజాగా ప్రారంభించారు. ఇవి ఫ్రెంచ్ కంపెనీ ఆల్‌స్టోమ్‌చే ఉత్పత్తి చేయబడ్డాయి. వీటిని డీజిల్ రైళ్ల స్థానంలో భర్తీ చేయనున్నారు.

అవార్డులు & గౌరవాలు

మెరీనా తబస్సుమ్'కు లిస్బన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

ప్రఖ్యాత బంగ్లాదేశీ ఆర్కిటెక్ట్, పరిశోధకురాలు మరియు విద్యావేత్త మెరీనా తబస్సుమ్, ప్రతిష్టాత్మక లిస్బన్ ట్రియెన్నాల్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి దక్షిణాసియా వ్యక్తిగా నిలిచింది. ఈ అవార్డును ఆమె సెప్టెంబరు 29న పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ప్రారంభమయ్యే లిస్బన్ ట్రైనాలే సందర్భంగా అందుకుంటుంది.

శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్ డి లా లెజియన్ డి హాన్నూర్‌ (లెజియన్ ఆఫ్ హానర్) అందుకున్నారు. ఏ అవార్డు థరూర్ రచనలకు & ప్రచాంగాలకు గుర్తింపుగా అందిస్తున్నారు. ఈ అవార్డును 1802లో నెపోలియన్ బోనపార్టే ప్రారంభించారు, ఆయన తదనంతరం ఫ్రెంచ్ ప్రభుత్వాలు దీని కొనసాగిస్తున్నాయి. దీని అత్యుత్తమ సేవలు అందించే పౌరులకు & సైనికులకు అందజేస్తారు.

రాష్ట్రపతి తత్రరక్షక్ మెడల్ & తత్రక్షక్ మెడల్ 2022

భారతీయ తీర రక్షక దళ సిబ్బందికి అందించే రాష్ట్రపతి తత్రరక్షక్ పతకం (PTM) మరియు తత్రక్షక్ పతకాన్ని (TM) రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాష్ట్రపతి తత్రక్షక్ పతకం (విశిష్ట సేవ) ఐజీ  శ్రీ దినేష్ రాజపుత్రన్ అందుకోగా కమాండెంట్ కునాల్ చంద్రకాంత్ నాయక్ తత్రక్షక్ పతకంను దక్కించుకున్నారు. తత్రక్షక్ పతకం (మెరిటోరియస్ సర్వీస్) శ్రీ ప్రశాంత్ కుమార్ శర్మ, డిఐజి శ్రీ పంకజ్ వర్మ మరియు శ్రీ ప్రకాష్  లకు లభించింది.

ఫహ్మిదా అజీమ్'కు 2022 పులిట్జర్ ప్రైజ్

బంగ్లాదేశ్‌ రచయిత్రి ఫహ్మిదా అజీమ్ “ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ” విభాగంలో 2022 పులిట్జర్ బహుమతి అందుకున్నారు. ఆమె ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ యొక్క ఇన్‌సైడర్ ఆన్‌లైన్ మ్యాగజైన్‌లో పని చేస్తున్నరు.

న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్‌వి సుందరా చారికి ఎఫ్ఏఏఎన్ ఫెలో

సీనియర్ న్యూరాలజిస్ట్, ఎన్వీ సుందరా చారీ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (FAAN) యొక్క ఫెలోగా ఎన్నికయ్యారు. ఇది న్యూరాలజీ మరియు మెడిసిన్ రంగంలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవంగా పరిగణించబడుతుంది.

న్యూరాలజీ విభాగంలో చేసిన విలువైన కృషికి గాను సుందరాచారికి ఈ గౌరవం దక్కింది. ఎన్‌వి సుందరా చారి ప్రస్తుతం విజయవాడలోని సిద్దార్ధ మెడికల్ కాలేజీలో సీనియర్ ప్రొఫిసరుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

స్పోర్ట్స్ అఫైర్స్

కామన్వెల్త్ గేమ్స్‌ 2022 భారత విజేతలు

కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుకలకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మరియు హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లు భారతదేశ పతాకధారులుగా ఎంపికయ్యారు. జూలై 28 నుండి 8 ఆగస్టు 2022 మధ్య జరుగనున్న ఈ క్రీడలలో భారత్ నుండి 215 మంది క్రీడాకారులు వివిధ పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కామన్వెల్త్ గేమ్స్ 2022 ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జూలై 28 నుండి 8 ఆగస్టు 2022 మధ్య నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో గతంలో బ్రిటిష్ పాలనలో ఉన్న దాదాపు 54 కామన్వెల్త్ దేశాల క్రేడాకారులు పాల్గొంటారు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొదటిసారిగా మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అలానే కామన్వెల్త్ గేమ్స్ 2022 గేమ్స్ ఫర్ ఎవరీవన్ మోటో తో నిర్వహిస్తున్నారు.

స్క్వాష్ ఆటగాడు అనాహత్ సింగ్ కేవలం 14 సంవత్సరాల వయస్సులో కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన భారతీయ అథ్లెట్ గా నిలిచాడు. అలానే లాన్ బౌల్స్ క్రీడకు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ళ సునీల్ బహదూర్ అతి పెద్ద వయస్కుడుగా నిలిచాడు.

కామన్వెల్త్ గేమ్స్ 2022 లో 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు చెందిన మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. అదేవిధంగా 73 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు చెందిన అచింత షెయులీ స్వర్ణ పతకం సాధించాడు. అలానే 67 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మిజోరాంకు చెందిన జెరెమీ లాల్‌‌‌‌రినుంగా ఇండియాకు స్వర్ణ పతకం అందించాడు.

55 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో భారత్‌కు చెందిన సంకేత్ సర్గర్ రజతం గెలుచుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం పతకం దక్కించుకుంది. అలానే మరో భారతీయ వెయిట్‌లిఫ్టర్ గురురాజా పూజారి పురుషుల 61 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

జూడో క్రీడలో మహిళల 78 కిలోల విభాగంలో తులిక మాన్, 40 కిలోల విభాగంలో శుశీల లిక్మాబామ్ సిల్వర్ మెడల్స్ సాధించగా, పురుషుల 60 కిలోల విభాగంలో విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

బ్యాడ్మింటన్ క్రీడలో శ్రీకాంత్ కిదాంబి, సాత్విక్‌, సుమీత్ రెడ్డి, లక్ష్య సేన్, చిరాగ్ శెట్టి, గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ, ఆకర్షి కశ్యప్, అశ్విని పొన్నప్ప, పివి సింధుతో కూడిన భారత జట్టు సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.

టేబుల్ టెన్నిస్ విభాగంలో హర్మీత్ దేశాయ్, సనిల్ శెట్టి, శరత్ ఆచంట, సత్యన్ జ్ఞానశేఖరన్ లతో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని సాధించింది. అలానే లాన్ బౌల్స్ విభాగంలో రూపా రాణి టిర్కీ, నయన్మోని సైకియా, లవ్లీ చౌబే, పింకీ సింగ్ లతో కూడిన జట్టు మొదటి అంతర్జాతీయ గోల్డ్ మెడల్ దక్కించుకుంది.

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో పివి సింధు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అలానే భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతాకాన్ని దక్కించుకున్నాడు. అదే విధంగా చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డిలు పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతాకాన్ని సాధించారు.

భారత మహిళల క్రికెట్ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ పతాకాన్ని దక్కించుకుంది. అలానే భారత పురుషుల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ పతాకం సొంతం చేసుకుంది. భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతాకాన్ని సాధించింది. భారతదేశ బ్యాడ్మింటన్ మిక్సిడ్ టీం సిల్వర్ పతాకాన్ని దక్కించుకుంది.

మహిళల యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఇంగ్లాండ్ కైవసం

యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (UEFA) ఉమెన్స్ యూరో 2022 ఫైనల్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్ 2-1తో ప్రత్యర్థి జర్మనీని ఓడించి మొదటి ప్రధాన మహిళల సాకర్ టైటిల్‌ను గెలుచుకుంది. 1966 తర్వాత ఇంగ్లాండ్ గెలుచుకున్న మొదటి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ట్రోఫీ ఇది మాత్రమే.

నార్త్ ఈస్ట్ ఒలింపిక్స్ 2వ ఎడిషన్‌కు మేఘాలయ ఆతిథ్యం

అక్టోబర్ 30 నుండి నవంబర్ 6, 2022 వరకు జరగనున్న 2వ నార్త్ ఈస్ట్ ఒలింపిక్ గేమ్స్ 2022కి మేఘాలయ ఆతిథ్యం ఇవ్వనుంది. 2018 లో మణిపూర్‌లో జరిగిన మొదటి ఎడిషన్ గేమ్స్ 12 విభాగాలతో నిర్వహించారు. ఈసారి 18 క్రీడా విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ ఆటలకు 8 ఈశాన్య రాష్ట్రాల నుండి సుమారు నాలుగు వేల మంది క్రీడాకారులు పాల్గుననున్నారు.

ఇందులో విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జూడో, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నిస్, వుషు, సైక్లింగ్ (మౌంటైన్ బైక్), గోల్ఫ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు రెజ్లింగ్ వంటి క్రీడా విభాగాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేవి భారత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి 2018 లో ప్రారంభించారు.

600 టీ20 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా డ్వేన్ బ్రావో

వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో గురువారం టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు నమోదు చేసాడు. ఈ రికార్డును బ్రావో 545 మ్యాచ్‌లలో 24.12 సగటుతో మరియు 8.21 ఎకానమీ రేటుతో సాధించాడు. ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 466 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు.

అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యను సస్పెండ్ చేసిన ఫిఫా

గ్లోబల్ ఫుట్‌బాల్ బాడీ అయినా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ (ఫిఫా), ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్'ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యలో మూడవ పక్షం యొక్క జోక్యం మితిమీరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ 1935 లో ఏర్పాటు చేసారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

AIFF యొక్క రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను పొందిన తర్వాత ఈ సస్పెన్షన్ ఎత్తివేయబడుతుంది. భారతదేశంలో అక్టోబరు 11-30 వరకు ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ 2022 జరగాల్సి ఉంది. ఈ సస్పెన్షన్ కారణంగా ఈ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

కెవిన్ ఓ'బ్రియన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఐర్లాండ్ ఆల్-రౌండర్ కెవిన్ ఓ'బ్రియన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు 16 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీరులో 153 వన్డేలు, 110 టీ20లలో ఐర్లాండుకు ప్రాతినిధ్యం వహించాడు. కెవిన్ ఓ'బ్రియన్ 2011 ఐసీసీ వరల్డ్ కప్పులో ప్రత్యర్థి ఇంగ్లాండుపై 63 బంతుల్లో 113 పరుగులు చేసి పాపులర్ అయ్యాడు.

UEFAలో ఆడిన తొలి భారతీయురాలుగా మనీషా కళ్యాణ్

హర్యానాకు చెందిన యువ స్ట్రైకర్ మనీషా కళ్యాణ్ UEFA ఉమెన్స్ ఛాంపియన్స్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది. ఆమె అపోలోన్ లేడీస్ ఎఫ్‌సికి ప్రాతినిధ్యం వహించనుంది. UEFA అనగా యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్స్ యూనియన్ అని అర్ధం.

అన్ని ఫార్మాట్‌లలో 100 మ్యాచ్‌లు ఆడిన మొదటి క్రికెటరుగా కోహ్లీ

మూడు క్రికెట్ ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన మొదటి భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఈ రికార్డు అంతర్జాతీయంగా న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ పేరిట ఉంది.

950 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ ఆండర్సన్

అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పేస్ బౌలర్‌గా జేమ్స్ ఆండర్సన్ రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన 40 ఏళ్ల జేమ్స్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 950 వికెట్లు పూర్తి చేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ మొత్తంగా చూసుకుంటే అత్యధిక వికెట్లు తీసిన ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 1,347 వికెట్లు, షేన్ వార్న్ 1,001 వికెట్లు, అనిల్ కుంబ్లే 956 వికెట్లతో మొదటి మూడు స్థానాలలో ఉన్నారు.

Post Comment