Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022 | పోటీపరీక్షల ప్రత్యేకం
Magazine 2022

తెలుగులో కరెంట్ అఫైర్స్ నవంబర్ 2022 | పోటీపరీక్షల ప్రత్యేకం

నవంబర్ 2022 కరెంట్ అఫైర్స్ తెలుగులో ఉచితంగా పొందండి.  పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థుల కోసం నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్ అంశాలకు చెందిన పూర్తిస్థాయి తాజా వర్తమాన అంశాలను మీ కోసం అందుబాటులో ఉంచుతున్నాం.

ఇండియన్ అఫైర్స్

కోల్‌కతాలో 4వ బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్ట్ ప్రారంభం

కోల్‌కతాలో బంగ్లాదేశ్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క నాల్గవ ఎడిషన్ అక్టోబర్ 29 న ఘనంగా ప్రారంభం అయ్యంది. అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 మధ్య ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో నాలుగు డాక్యుమెంటరీ చిత్రాలు, ఎనిమిది షార్ట్ ఫిల్మ్‌ చిత్రాలతో సహా 37 ప్రముఖ బంగ్లాదేశ్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్‌ సమాచార, ప్రసార శాఖ మంత్రి డాక్టర్‌ హసన్‌ మహమూద్‌ ప్రారంభించారు.

సివిల్ సొసైటీ ఆఫ్ G20 సమ్మిట్‌ అధ్యక్షరాలుగా అమృతానందమయి

భారత ప్రభుత్వం G20 అధికారిక ఎంగేజ్‌మెంట్ గ్రూప్ అయిన సివిల్ 20 (C20) చైర్మనుగా మాతా అమృతానందమయిని నియమించింది. సివిల్ సొసైటీ ఆఫ్ జి20 అనేది G20 నాయకులకు ప్రభుత్వేతర మరియు వ్యాపారేతర అభిప్రాయాలను వ్యక్తపర్చేందుకు ఏర్పాటు చేసిన సివిల్ సొసైటీ ఆర్గనైజషన్. భారతదేశం ఈ ఏడాది డిసెంబర్ 1, 2022 నుండి వచ్చే ఏడాది నవంబర్ 30, 2023 వరకు G20 అధ్యక్ష పదవిని స్వీకరించనుంది. దీనికి సంబంధించి G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం త్వరలో న్యూఢిల్లీలో జరుగుతుంది.

సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కేసులను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. ఇదే విషయాన్ని ఇదివరకే గత సెప్టెంబరులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసిన సందర్భంలో కెసిఆర్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంతులకు కూడా దీనిపై ఆలోచించమని సలహా ఇచ్చారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటుగా మేఘాలయ, మహారాష్ట్ర, కేరళ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్ మరియు పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి.

జాతీయ స్మారక చిహ్నంగా రాజస్థాన్ మంగర్ ధామ్‌

రాజస్థాన్‌లోని ఆదివాసీల తిరుగుబాటుకు స్మారక చిహ్నం అయినా మాన్‌గర్ ధామ్‌ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌లతో ప్రధాని మోదీ వేదికను పంచుకున్నారు.

మాన్‌గర్ ధామ్‌ అనేది 1913లో బ్రిటీష్ సైన్యం చేత ఊచకోత కోయబడిన సుమారు 1,500 మంది గిరిజనుల స్మారకం. ఇది గుజరాత్-రాజస్థాన్ సరిహద్దులో ఉంది. అత్యధిక గిరిజన జనాభా కలిగిన ఈ ప్రాంతం 1913 లో బ్రిటీష్ రాజ్‌కు వ్యతిరేకంగా మాన్‌ఘర్‌లో సమావేశం నిర్వహించారు. గిరిజనులు మరియు అటవీ నివాసులతో కూడిన ఈ సమావేశానికి సంఘ సంస్కర్త గోవింద్ గురు నాయకత్వం వహించారు.

ఇటానగర్ విమానాశ్రయానికి దోనీ పోలోగా పేరు మార్పు

అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగిలో ఉన్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి డోనీ పోలో విమానాశ్రయంగా పేరు మార్చడానికి కేంద్ర మంత్రివర్గం నవంబర్ 2న ఆమోదం తెలిపింది.  ఇటానగర్‌కు 15 కి.మీ దూరంలో ఉన్న హోలోంగిలో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు మార్చి 3, 2022న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సహాయంతో నిర్మించారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీని పెంపొందించనుంది.

గంగా ఉత్సవ్ ఆరవ ఎడిషన్‌ ప్రారంభం

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యొక్క గంగా ఉత్సవ్ ఆరవ ఎడిషన్‌ ఘనంగా న్యూఢిల్లీలో ప్రారంభమైంది. గంగా ఉత్సవ్ 2022 భారత స్వాతంత్ర్యం యొక్క 75 సంవత్సరాల జ్ఞాపకార్థం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు అంకితం చేయబడింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర జలశక్తి మరియు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ ప్రారంభించగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక & డోనర్ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంగా ఉత్సవ్ అనేది నదులతో మనిషిని అనుసందించే ఒక రకమైన కార్యక్రమం.

యూపీలో నాల్గవ టైగర్ రిజర్వ్ ఏర్పాటు

యూపీలోని రాణిపూర్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోని 53వ టైగర్ రిజర్వ్‌గా అవతరించినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. యూపీలోని చిత్రకూట్ జిల్లా పరిధిలో 529.36 చ.కి.మీ.లో విస్తరణలో ఉన్న రాణిపూర్ టైగర్ రిజర్వ్, దుధ్వా, పిలిభిత్ మరియు అమన్‌ఘర్ టైగర్ రిజర్వ్‌ తర్వాత రాష్ట్రంలో నాల్గవ టైగర్ రిజర్వ్‌గా ఏర్పటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మేఘాలయలో రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్-2022

రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్ -2022 మేఘాలయలో ఘనంగా నిర్వహించారు. నవంబర్ 3 నుండి నవంబర్ 5 మధ్య జరిగిన ఈ వాటర్ స్పోర్ట్స్ పోటీలను అస్సాం మరియు మేఘాలయ ప్రభుత్వాలతో భారత సైన్యం యొక్క తూర్పు కమాండ్ ఉమ్మడిగా నిర్వహించాయి. రైజింగ్ సన్ వాటర్ ఫెస్ట్-2022 నవంబర్ 5న మేఘాలయలోని ఉమియం సరస్సు వద్ద గ్రాండ్ ముగింపు వేడుకతో ముగిసింది. రోయింగ్ మరియు సెయిలింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌తో మొదటిసారి వేడుకను నిర్వహించారు.

ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న జగదీప్ ధన్‌ఖర్

కంబోడియాలో నిర్వహించిన ఆసియాన్-ఇండియా స్మారక శిఖరాగ్ర సదస్సు మరియు 17వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ పాల్గొన్నారు. నవంబర్ 11-13 తేదీలలో కంబోడియాలోని నమ్ పెన్‌లో జరిగే ఈ సమావేశాలకు ఉపరాష్ట్రపతితో పాటుగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా హాజరయ్యారు.

ఈ పర్యటనలో కంబోడియాన్ వారసత్వ ప్రదేశాలలో భారతదేశం చేపడుతున్న సంరక్షణ మరియు పునరుద్ధరణ పనులను సమీక్షించడానికి అతను సీమ్ రీప్‌ను కూడా సందర్శించారు. ఇదే సమయంలో ఈ సమావేశాలకు హాజరైన ఇతర ఆసియా దేశాల నాయకులతో ద్వైపాక్షిక సమావేశం అయ్యారు.

పర్పుల్ ఫెస్ట్ లోగోను ఆవిష్కరించిన గోవా సీఎం

నవంబర్ 1న సంజయ్ సెంటర్‌లోని మనోహర్ పారికర్ మెమోరియల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పర్పుల్ ఫెస్ట్ లోగోను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 6 నుండి 8 తేదీలలో గోవా రాజధాని పనాజీలో జరగనుంది.

నాగాలాండులో తోఖు ఎమోంగ్ బర్డ్ కౌంట్

నాగాలాండ్ 'తోఖు ఎమోంగ్ బర్డ్ కౌంట్' (TEBC) పేరుతొ మొదటి బర్డ్ డాక్యుమెంటేషన్ ఈవెంట్‌ను నిర్వహించింది. నవంబర్ 4 నుండి 7 మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా నాగాలాండ్ యొక్క పక్షుల వైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేయడంతో పాటుగా స్థానిక యువత మరియు స్థానిక సంఘాలకు పక్షుల సంరక్షణ యందు ప్రత్యేక చొరవ చూపేలా ప్రోత్సహించనున్నారు. తోఖు ఎమోంగ్ బర్డ్ కౌంట్ మొదటి ఎడిషన్‌లో దిమాపూర్, కోహిమా, పెరెన్ మరియు వోఖా ప్రాంతాలలో 178 రకాల పక్షుల రికార్డును డాక్యుమెంట్ చేశారు.

మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ కూటమిలో భారత్

ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP27) యొక్క 27వ సెషన్‌లో మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్‌లో చేరుతున్నట్లు భారత్ ప్రకటించింది. ఆస్ట్రేలియా, జపాన్, స్పెయిన్ మరియు శ్రీలంకతో సహా మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ కూటమిలో చేరిన మొదటి ఐదు దేశాలలో భారతదేశం ఒకటి. ఈ కూటమి ప్రకృతి ఆధారిత వాతావరణ మార్పుల పరిష్కారంగా మడ అడవుల పాత్ర గురించి ప్రపంచ అవగాహనను పెంచుతుంది. ఇది ప్రపంచ స్థాయిలో మడ అడవుల పునరుద్ధరణకు హామీ ఇస్తుంది.

దక్షిణాసియాలోని మొత్తం మడ అడవులలో దాదాపు సగానికి సగం భారతదేశం పరిధిలో ఉన్నాయి. భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉన్న సుందర్‌బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులుగా పేరుగాంచాయి. గుజరాత్, అండమాన్, మరియు నికోబార్ దీవులు, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా మరియు కేరళలో కూడా మడ అడవులు పుష్కలంగా ఉన్నాయి.

మాంగ్రోవ్ ప్లాంట్స్ భూమి-ఆధారిత ఉష్ణమండల వర్షారణ్యాల కంటే 400 శాతం వరకు వేగంగా కార్బన్‌ను నిల్వ చేయగలవు. అలానే సముద్ర మట్టాలు పెరగడం, కోత మరియు తుఫానుల నుండి తీర ప్రాంతాలను రక్షిస్తున్నాయి. సముద్ర జీవవైవిధ్యానికి, సంతానోత్పత్తి ఆవాసాన్ని కల్పిస్తున్నాయి. ప్రపంచ చేపల జనాభాలో 80 శాతం చేపలు తమ మనుగడ కోసం ఈ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాయి.

రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఫర్టిలైజర్ ప్లాంట్‌ (ఆర్‌ఎఫ్‌సిఎల్) ను నవంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసారు. ఇదే వేదిక ద్వారా భద్రాచలం రోడ్-సత్తుపల్లి రైల్వే లైన్ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేశారు.

108 అడుగుల కెంపేగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

బెంగళూరు నగర స్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ గౌరవార్థం 108 అడుగుల ఎత్తు ఉన్న కాంస్య విగ్రహాన్ని నవంబర్ 11 న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన 16వ శతాబ్దపు అధిపతి అయిన నాడప్రభు కెంపేగౌడ బెంగళూరు స్థాపకుడిగా ఘనత పొందారు. ఈ విగ్రహం నిర్మాణానికి 98 టన్నుల కాంస్యం, 120 టన్నుల స్టీల్ ఉపయోగించినట్లు వెల్లడించారు.

తమిళనాడులో 17వ అభయారణ్యం

తమిళనాడు ప్రభుత్వం కృష్ణగిరి మరియు ధర్మపురి రిజర్వ్ ఫారెస్ట్‌లలోని 68,640 హెక్టార్ల కావేరి దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని రాష్ట్ర 17వ వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించింది. ఈ కొత్త అభయారణ్యంలో 15 రిజర్వ్ ఫారెస్ట్‌లు ఉన్నాయి. ఇందులో 35 రకాల క్షిరదాలు, 238 రకాల పక్షులు ఆవాసం పొందుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

మేఘాలయ వంగల ఫెస్టివల్ 2022

మేఘాలయాలో ఏటా నిర్వహించే 46వ ఎడిషన్ వంగల ఫెస్టివల్ 10 నవంబర్ 2022 న ఘనంగా ప్రారంభమైంది. వంగల పండుగను '100 డ్రమ్స్ ఫెస్టివల్' అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయలోని 'గారో తెగలు' జరుపుకునే వ్యవసాయ పండుగ. ఈ పండుగ సమయంలో ప్రజలు సంతానోత్పత్తికి సంబంధించి సాన్ల్‌జోంగ్ లేదా సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. ఆఖరి రోజు ఉత్సవంలో రికార్డు స్థాయిలో వంద మంది డప్పుల వంగళ ఉత్సవం నిర్వహిస్తారు.

బెంగళూరు టెక్ సమ్మిట్‌ను ప్రారంభించిన మోదీ

బెంగళూరు టెక్ సమ్మిట్ యొక్క రజతోత్సవ ఎడిషన్‌ను నవంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2015లో 81వ ర్యాంక్‌లో ఉన్న భారతదేశం ఈ ఏడాది 40వ ర్యాంక్‌కు చేరుకుందని ప్రధాన మంత్రి తెలియజేశారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవర్జ్ బొమ్మై కూడా పాల్గొన్నారు.

గత 25 ఏళ్లుగా ఏటా నిర్వహిస్తున్న బెంగుళూరు టెక్ సమ్మిట్ ఆసియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్నాలజీ సమ్మిట్'గా పరిగణించబడుతుంది. ఈ ఎడిషన్‌లో దాదాపు 575 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. 16 రాష్ట్రాల నుంచి 1,000 కి పైగా స్టార్టప్‌లు తొలిసారిగా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాయి.

హైదరాబాద్‌లో జియో స్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్‌

హైదరాబాద్‌లో నిర్వహించిన జియో స్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్‌ 22వ ఎడిషన్‌'ను నవంబర్ 15న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ సమావేశాలను ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ మరియు ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమాటిక్స్ ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి.

ఈ సమావేశాల్లో సుమారు 500 ప్రభుత్వ, ప్రైవేట్, సంస్థల నుండి దాదాపు 2500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జియోస్పేషియల్ సమాచారం ద్వారా పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, వ్యాపార, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వంటి మొదలగు అంశాలను చర్చించారు.

భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-సబార్బిటల్ (VKS) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నవంబర్ 18న ఉదయం 11:30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ ప్రయోగించబడింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు దివంగత విక్రమ్ సారాభాయ్‌కు నివాళిగా ఈ ప్రయోగ వాహనానికి విక్రమ్-సబార్బిటల్ (VKS) అని పేరు పెట్టారు.

మిషన్ 'ప్రారంభ్' పేరుతొ ఇండియన్ స్పేస్-టెక్ స్టార్టప్‌ అయినా స్కైరూట్ ఏరోస్పేస్ ఈ మొదటి ప్రైవేట్ రాకెట్ రూపొందించింది. ప్రధాని మోదీ 2020 లో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యంకు ఆహ్వానం పలికిన తర్వాత రూపొందిన మొదటి ప్రైవేట్ రాకెట్ ఇదే.

'నో మనీ ఫర్ టెర్రర్' గ్లోబల్ మీట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్‌పై జరిగిన మూడవ ' నో మనీ ఫర్ టెర్రర్ ' (NMFT) గ్లోబల్ మీట్‌ను నవంబర్ 18న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, హోం సెక్రటరీ శ్రీ అజయ్ కుమార్ భల్లా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ శ్రీ దినకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఇటీవల చేసిన ప్రయత్నాల గురించి ఈ సంధర్బంగా ప్రధాని తెలియజేసారు. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుండి 450 కిపైగా ప్రభుత్వ డెలిగేట్లు హాజరయ్యారు.

ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయం ప్రారంభం

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 19న ప్రారంభించారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం. డోనీ పోలో విమానాశ్రయం అరుణాచల్ ప్రదేశ్‌తో వాణిజ్యం మరియు పర్యాటక కనెక్టివిటీని పెంపొందించనుంది.

గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 53 వ ఎడిషన్ నవంబర్ 20న గోవాలోని పనాజీలోని డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా వేడుకలో దాదాపు 79 దేశాల నుండి 280 కి పైగా సినిమాలు ప్రదర్శించబడ్డయి. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా సంయుక్తంగా నిర్వహించారు.

ఈ ఏడాది సత్యజిత్‌రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రముఖ స్పానిష్ చిత్ర నిర్మాత కార్లోస్ సౌరాకు అందించారు. అలానే తెలుగు నటుడు చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రదానం చేసారు. ఇదే వేదిక ద్వారా మణిపురి సినిమా 50వ వార్షికోత్సవం జరుపుకుంది.

తమిళనాడులో ఎలిఫెంట్ డెత్ ఆడిట్ ఫ్రేమ్‌వర్క్‌

తమిళనాడు ప్రభుత్వం దేశంలో మొదటిసారి ఎలిఫెంట్ డెత్ ఆడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏనుగుల మరణాలకు గల కారణాలను డాక్యుమెంట్ చేయనున్నారు. దీని ద్వారా ఏనుగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.

ఎన్ఎఫ్డీసీతో యూనిసెఫ్ ఉమ్మడి కార్యాచరణ

గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో బాలల హక్కులపై చిత్రాలను ప్రమోట్ చేయడానికి నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) మరియు యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) చేతులు కలిపాయి.

పిల్లల మరియు యుక్తవయస్సులోని వారి సమస్యలు మరియు హక్కులను హైలైట్ చేసే చిత్రాల కోసం ఒక ప్రత్యేక విభాగం మొదటిసారిగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ధనక్, నాని తేరే మోర్నీ, సుమీ, టు ఫ్రెండ్స్, ఉద్ద్ జా నాన్హే దిల్ వంటి స్ఫూర్తిదాయక బాలల చిత్రాలు ప్రదర్శించారు.

9వ ఇండియా-ఈయూ ఫారిన్ పాలసీ సెక్యూరిటీ సంప్రదింపులు

9వ ఇండియా-యూరోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ సెక్యూరిటీ సంప్రదింపులు నవంబర్ 22న న్యూఢిల్లీలో జరిగాయి. ఈ సందర్బంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రకటించిన ఇండియా-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్‌తో సహా కీలక ద్వైపాక్షిక పరిణామాలను సమీక్షించారు.

అలానే సైబర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం మరియు మారిటైమ్ సెక్యూరిటీతో సహా భారతదేశం మరియు EU మధ్య వివిధ సంస్థాగత యంత్రాంగాల పనితీరును కూడా ఇరుపక్షాలు సమీక్షించాయి. ఈ సంప్రదింపులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ మరియు యూరోపియన్ ఎక్స్‌టర్నల్ యాక్షన్ సర్వీస్ ఎన్రిక్ మోరా సహ అధ్యక్షత వహించారు.

మొదటి G20 షెర్పా మీటింగుకు ఉదయపూర్ ఆతిథ్యం

భారతదేశంలో మొదటి జీ20 షెర్పా సమావేశానికి ఉదయపూర్ ఆతిధ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 1న భారత్ G20 అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత నిర్వహించే మొదటి జీ20 షెర్పా సమావేశం ఉదయపూర్ సిటీ ప్యాలెస్‌లోని దర్బార్ హాల్‌లో డిసెంబర్ 4 నుండి 7 వరకు జరగనుంది. షెర్పా సమావేశం అనేది ప్రధాన జీ20 సమ్మిట్‌కు ముందు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గునే ప్రాథమిక సమావేశం.

షెర్పా సమావేశలలో ప్రతినిధులు రూపొందించిన ఒప్పందాలపై, ప్రధాన జీ20 సదస్సులో తుది నిర్ణయాలు తీసుకుంటారు. జీ20 షెర్పా సమావేశానికి నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అధ్యక్షత వ్యాహిస్తారు.

అలానే G20 మొదటి టూరిజం ట్రాక్ సమావేశంకు రాన్ ఆఫ్ కచ్‌ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ సమావేశం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఇదే నెలలో బెంగుళూరులో జీ20 ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశం కూడా నిర్వహించనున్నారు.

ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ సమావేశం

ప్రసార భారతి, భారతదేశ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ యొక్క 59వ ఆసియా పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ (ABU) జనరల్ అసెంబ్లీ 2022ని నవంబర్ 25 నుండి మధ్య న్యూఢిల్లీలో నిర్వహించింది. “ప్రజలకు సేవ చేయడం" అనే థీమ్ తో సంక్షోభ సమయాల్లో మీడియా పాత్రపై చర్చలు నిర్వహించారు. ఈ సమావేశాలకు దాదాపు 40 దేశాల నుండి 200 లకు పైగా మీడియా డెలిగేట్లు హాజరయ్యారు.

గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2022

జియోటెక్నాలజీపై భారతదేశం యొక్క వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ 'గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్' యొక్క ఏడవ ఎడిషన్ కార్యక్రమాన్ని నవంబర్ 29న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలను ఈ సంవత్సరం జియోపాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ థీమ్'తో నిర్వహిస్తున్నారు.

ఇంటర్నేషనల్ అఫైర్స్

బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తిరిగి రెండవ సారి ఆ దేశ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 2003 నుండి 2011 మధ్య బ్రెజిల్ అధ్యక్షుడుగా పనిచేసిన లులా డా సిల్వా తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 50.83 శాతం ఓట్లు పొందటం ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్ కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

ఆఫ్రికన్‌తో తొలిసారి త్రైపాక్షిక నేవీ ఎక్సర్‌సైజ్‌

తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా మరియు మొజాంబిక్‌లతో భారతదేశం తన మొట్టమొదటి త్రైపాక్షిక నావికా విన్యాసాన్ని నిర్వహించింది. ఇటీవలే డిఫెక్స్‌పో 2022 సందర్భంగా గాంధీనగర్‌లో జరిగిన భారత్-ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ తర్వాత, అక్టోబర్ 27 -29 తేదీల మధ్య టాంజానియాలోని దార్ ఎస్ సలామ్‌లో ఈ నేవీ ఎక్సర్‌సైజ్‌ నిర్వహించారు.

ఇందులో భారత నౌకాదళం గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ద్వారా ప్రాతినిధ్యం వహించింది, ఐఎన్ఎస్ తార్కాష్, చేతక్ హెలికాప్టర్ మరియు మార్కోస్ (ప్రత్యేక దళాలు) కూడా పాల్గొన్నాయి. ఈ విన్యాసాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను మరియు పొరుగు దేశాలతో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడ్డాయి.

ఫ్రెంచ్ రచయిత రెనే నాబా కొత్త పుస్తకం విడుదల

ఫ్రెంచ్ రచయిత రెనే నాబా తన తాజా పుస్తకం “న్యూక్లియరైజేషన్ ఆఫ్ ఆసియా” ను అక్టోబర్ 30న జెనీవా ప్రెస్ క్లబ్‌లో విడుదల చేసారు. ఈ పుస్తకం ప్రధానంగా అణు అత్యవసర పరిస్థితి మరియు దాని ముప్పు గురించి చర్చిస్తుంది. ఇందులో దక్షిణాసియాలో పాకిస్తాన్ మరియు చైనాల అనుబంధం వల్ల ఎదురయ్యే ముప్పు కోసం తన ఆలోచనలు పంచుకున్నారు.

కాలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ఇయర్'గా 'పెర్మాక్రిసిస్'

కాలిన్స్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పెర్మాక్రిసిస్ (Permacrisis) ఎంపిక చేయబడింది. ఈ పదానికి అస్థిరత మరియు అభద్రత అని అర్ధం. యుద్ధం, ద్రవ్యోల్బణం మరియు రాజకీయ అస్థిరతతో జీవించే అనుభూతిని వివరించే ఈ పదం, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 2022 ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించిన 10 పదాలలో ఇది అగ్రస్థానంలో నిలిచింది. కాలిన్స్ ఇంగ్లీష్ డిక్షనరీ అనేది ఇంగ్లీష్ భాష యొక్క ముద్రిత మరియు ఆన్‌లైన్ నిఘంటువు. దీనిని 1979 లో గ్లాస్గోలో హార్పర్‌కాలిన్స్ ప్రచురించారు.

ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు తిరిగి ఎన్నిక

ఇజ్రాయెల్ ప్రధానిగా మరోమారు బెంజమిన్ నెతన్యాహుఎన్నికయ్యారు. నెతన్యాహు మరియు అతని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ పార్లమెంటులో మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సీట్లు గెలుచుకున్నాయి. 120 పార్లమెంట్ సీట్లకు జరిగిన తాజా ఎన్నికలలో బెంజమిన్ నెతన్యాహు పార్టీ 64 సీట్లు దక్కించుకోగా ప్రస్తుత ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ 51 సీట్లు గెలుపొందారు.

బెంజమిన్ నెతన్యాహు గతంలో 1996 నుండి 1999 మధ్య మరియు 2009 నుండి 2021 మధ్య ఇజ్రాయెల్ ప్రధానిగా పనిచేసారు. 2021 లో ప్రధాని పదవికి రాజీనామా చేసి, అవినీతి ఆరోపణలపై విచారణలో ఉన్న నెతన్యాహు, ప్రధాన మంత్రి కార్యాలయానికి తిరిగి రావడానికి మరోమారు సిద్ధంగా ఉన్నారు.

స్విట్జర్లాండులో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు

స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును ప్రారంభించి రికార్డు సృష్టించింది. స్విట్జర్లాండ్‌లో మొదటి రైలు వ్యవస్థ యొక్క 175వ వార్షికోత్సవం సందర్భంగా 1.2 మైళ్ల పొడవైన లోకోమోటివ్ ట్రైనును అందుబాటులోకి తీసుకొచ్చింది. 15 మైళ్లు మాత్రమే విస్తరించిన గ్రాబుండెన్‌లోని ప్రసిద్ధ అల్బులా లైన్‌లో ప్రారంభించిన ఈ రైలు, 1910 మీటర్ల పొడవుతో100 కోచ్‌లను, 4,550 సీట్లు కలిగి ఉంది.

జిన్‌జియాంగ్ రహదారి వంతెనలకు చైనా సైనికుల పేర్లు

2020 లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీలో భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన చైనా సైనికుల పేర్లను టిబెట్‌-జిన్‌జియాంగ్‌ హైవేపై ఉన్న 11 వంతెనలకు పెడుతున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన సైనికలలో చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్‌రోంగ్, జియావో సియువాన్ మరియు వాంగ్ జురాన్ అనే నలుగురు సైనికుల పేర్లను మాత్రమే ప్రకటించింది. నాలుగు దశాబ్దాల ఇండియా-చైనా సరిహద్దు ఘర్షణ ఇది అతి ఘోరమైందిగా చెప్పొచ్చు.

మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నరుగా అరుణా మిల్లర్

భారతీయ అమెరికన్ అరుణా మిల్లర్, మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్ గవర్నరుగా గెలిచిన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌గా అవతరించారు. హైదరాబాద్ సిటీలో జన్మించిన ఈమె ఇటీవలే జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికలలో మేరీల్యాండ్‌ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నరుగా ఎన్నికయ్యారు.

యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2022

27వ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, నవంబర్ 6 నుండి 18 నవంబర్ 2022 వరకు ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్‌లో నిర్వహించారు. 27వ సమావేశం కావున దీనిని సాధారణంగా COP27 అని పిలుస్తారు. COP27 సమావేశాలు ఈ ఏడాది ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేహ్ షౌక్రీ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాలకు 90 దేశాలకు చెందిన దేశాధినేతలు మరియు 190 దేశాల నుండి 35,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారని అంచనా.

2016 తర్వాత ఆఫ్రికాలో జరిగిన మొదటి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇది. 1992 లో మొదటి ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందం నుండి ఏటా ఈ సమావేశం నిర్వహించబడుతుంది . ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను పరిమితం చేయడానికి మరియు వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న ప్రభావాలకు అనుగుణంగా విధానాలను అంగీకరించడానికి ప్రభుత్వాలు దీనిని ఉపయోగించుకుంటాయి.

2021లో జరిగిన మునుపటి ఈవెంట్ గ్లాస్గో నగరంలో జరిగింది. 2023 తదుపరి ఈవెంట్ దుబాయ్ నగరంలో జరగనుంది. ఈ సమావేశాలకు హాజరుకాని ప్రముఖ దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలలో చైనా నాయకుడు జి జిన్‌పింగ్ మరియు అతని ప్రధాన మంత్రి లీ కెకియాంగ్, అలాగే రష్యాకు చెందిన వ్లాదిమిర్ పుతిన్ మరియు అతని ప్రధాన మంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ ఉన్నారు.

ఆగ్నేయాసియా దేశాల సమైఖ్యలో తూర్పు తైమూర్‌

అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN), తూర్పు తైమూర్‌ను గ్రూప్‌లో 11వ సభ్యునిగా చేర్చుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ప్రకటించింది. ఇటీవలే కంబోడియా రాజధాని నమ్ పెన్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తూర్పు తైమూర్‌కు పూర్తి సభ్యత్వ హోదాను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు తైమూర్‌ 2022లో ఇండోనేషియా నుండి స్వాతంత్ర దేశంగా ఏర్పాటు అయ్యింది. దీని రాజధాని నగరం దిలి.

అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది 10 ఆగ్నేయ ఆసియా దేశాల రాజకీయ మరియు ఆర్థిక సమైఖ్య. దీనిని 8 ఆగస్టు 1967న స్థాపించారు. ఇందులో బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ మరియు వియత్నాం సభ్య దేశాలుగా ఉన్నాయి.

ఇండోనేషియాలో 17వ G20 సమావేశం

ఇండోనేషియాలోని బాలిలో 17వ G20 సమ్మిట్ నవంబర్ 15న ప్రారంభం అయ్యింది. ఈ సమావేశాలు ' కోవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్' అనే థీమ్‌తో నిర్వహిస్తుంది. నవంబర్ 15 మరియు 16 వ తేదీల్లో రెండు రోజులు పాటు జరిగే ఈ సమావేశాలకు ఇండోనేషియా అధ్యక్షత వహిస్తుంది. సమ్మిట్ ముగింపు సెషన్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు, ప్రధాని మోదీకి జి20 అధ్యక్ష పదవిని అప్పగిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి భారత్ అధికారికంగా జి20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది.

ఈ సమావేశాలలో జీ20 అధినేతలు మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ కూటమికి సంబధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్ మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ఏడాది యూరోపియన్ యూనియన్'కి ప్రాతినిధ్యం వహించారు. జీ20 సభ్య దేశాలు ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతానికి పైగా మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

G20 సభ్యు దేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, ది యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్.

COP27 లో స్వీడన్‌తో భారతదేశం లీడ్ఐటీ సమ్మిట్‌

భారతదేశం మరియు స్వీడన్ దేశాలు ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్‌లో జరుగుతున్న COP27 సందర్భంగా లీడ్‌ఐటి సమ్మిట్‌ను నిర్వహించాయి. లీడ్‌ఐటి అనగా లీడర్‌షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అని అర్ధం. ఈ సమ్మిట్ యందు హాజరయ్యే భారత ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నాయకత్వం వహించారు.

ఈ సదస్సులో ప్రసంగించిన మంత్రి భూపేందర్ యాదవ్, ఇండియాలో సిమెంట్ మరియు ఉక్కు రంగానికి సంబంధించి రోడ్‌మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి లీడ్‌ఐటీ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలిపారు.

కేంబ్రిడ్జ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022 గా "హోమర్"

కేంబ్రిడ్జ్ డిక్షనరీ యొక్క వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2022గా "హోమర్" అనే పదం ఎంపికయింది. ఇది గ్లోబల్ వర్డ్ గేమ్ నుండి ప్రేరణపొందిన ఈ పదం, 2022లో కేంబ్రిడ్జ్ డిక్షనరీలో అత్యధికంగా శోధించిన పదంగా నిలిచింది. హోమర్ అనే పదం ఈ సంవత్సరం 79,000 కంటే ఎక్కువ సార్లు శోధించబడినట్లు వెల్లడించింది.

భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదించింది. ఆస్ట్రేలియా-ఇండియా ఆర్థిక సహకారం మరియు వాణిజ్య ఒప్పందం (ECTA)పై 2 ఏప్రిల్ 2022 న మొదటిసారి ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై అప్పటి ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక మంత్రి డాన్ టెహన్ మరియు భారతదేశ వాణిజ్యం మరియు పరిశ్రమలు మరియు జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలతో సహా 6,000కు పైగా విస్తృత రంగాలకు చెందిన భారతీయ ఎగుమతిదారులకు సుంకం రహిత ప్రాప్యత లభిస్తుంది.

కజకిస్తాన్ అధ్యక్షుడిగా కాసిమ్-జోమార్ట్ టోకయేవ్

కజకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ మరోమారు ఆదేశ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారు. ఇటీవలే జరిగిన ముందస్తు అధ్యక్ష ఎన్నికల్లో 81.3% ఓట్లు పొందడం ద్వారా విజేతగా నిలిచాడు. కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ 2019 నుండి కజకిస్తాన్ అధ్యక్షుడుగా ఉన్నారు.

రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ మధ్య ఆసియాలో రష్యాకు దక్షిణంగా, తూర్పు కాస్పియన్ సముద్రం నుండి ఆల్టై పర్వతాలు మరియు పశ్చిమాన చైనా వరకు విస్తరించి ఉంది. దీని రాజధాని నగరం అస్తానా. ప్రస్తుత ఈ దేశ ప్రధానిగా అలీఖాన్ స్మైలోవ్ ఉన్నారు. రష్యాకు కజకిస్తాన్ మిత్రదేశం అయినా ఉక్రెయిన్‌పై దాడి చేయడంపై కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ బహిరంగంగా ధిక్కరించారు.

పుతిన్ యాక్సిడెంటల్ జార్ పుస్తకం విడుదల

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క యాక్సిడెంటల్ జార్: ది లైఫ్ అండ్ లైస్ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్ పుస్తకం విడుదలయ్యింది. ఈ పుస్తకం మధ్య స్థాయి కేజీబీ అధికారి స్థాయి నుండి రష్యా యొక్క నిరంకుశ నాయకుడిగా పుతిన్ ఎదిగే క్రమాన్ని వివరిస్తుంది. ఈ పుస్తకాన్ని న్యూయార్క్ రోయరింగ్ బుక్ ప్రెస్ పబ్లిష్ చేసింది. ఈ పుస్తకాన్ని రష్యన్ అనలిస్ట్ అంఫ్ మాజీ వైట్ హౌస్ అడ్వైజర్ ఆండ్రూ వెయిస్ రచించారు.

మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం ప్రమాణ స్వీకారం

మలేషియా ప్రతిపక్ష నాయకుడు అన్వర్ ఇబ్రహీం ఆ దేశ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 75 ఏళ్ల ఇబ్రహీం ఇటీవలే జరిగిన ఆ దేశ 15వ సాధారణ ఎన్నికలలో మెజారిటీ సాధించడంతో మలేషియా రాజు సుల్తాన్ అబ్దుల్లా రియాతుద్దీన్ అల్-ముస్తఫా బిల్లా షా చేత ఆ 10వ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు.

ప్రపంచ మొదటి "పారాస్ట్రోనాట్"గా జాన్ మెక్‌ఫాల్

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలో మొట్టమొదటి "పారాస్ట్రోనాట్"ను వ్యోమగామి శిక్షణ కోసం ఎంపిక చేసిన స్పేస్ ఏజెన్సీగా నిలిచింది. బ్రిటీష్ పారాలింపిక్ స్ప్రింటర్ జాన్ మెక్‌ఫాల్ ఈ అదృష్టాన్ని దక్కించుకున్న మొదటి వికలాంగ వ్యోమగామిగా నిలిచాడు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తన 2022-23 విద్యా ఏడాదికి సంబంధించి వ్యోమగామి శిక్షణ ప్రవేశకుల కోసం దరఖాస్తు కోరగా, దాదాపు 22,500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 17 మందిని వ్యోమగామి శిక్షణ కోసం ఎంపిక చేసింది. అందులో పారాలింపిక్ స్ప్రింటర్ జాన్ మెక్‌ఫాల్  ఒకరు.

వార్తల్లో వ్యక్తులు

జంషెడ్ జె ఇరానీ 86వ ఏటా కన్నుమూత

స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే టాటా స్టీల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ, 31 అక్టోబర్ 2022 న జంషెడ్‌పూర్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. 86. ఇరానీ టాటా స్టీల్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం కలిగి ఉన్నారు, R&D ఇన్‌చార్జ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా ప్రారంభించిన ఇరానీ, అదే సంస్థలో మేనేజింగ్ డైరెక్టరుగా రిటైర్ అయ్యారు.

ఇరానీకి 1997లో క్వీన్ ఎలిజబెత్ II నుండి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (నైట్‌హుడ్ - KBE)  గౌరవం అందుకున్నారు. భారత ప్రభుత్వం నుండి 2007 లో పద్మ భూషణ్ అందుకున్నారు.

భారతదేశపు తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి మృతి

స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు శ్యామ్ శరణ్ నేగి 106 సంవత్సరాల వయసులో నవంబర్ 5న హిమాచల్ ప్రదేశ్‌లో కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నేగి నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా త్వరలో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఓటు వేశారు. శ్యామ్ శరణ్ నేగికి ప్రజాస్వామ్యం పైన ఉన్న నమ్మకంకు గాను ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

శ్యామ్ శరణ్ నేగి మొత్తం తన జీవితంలో 34 సార్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్టోబరు 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న వందేళ్ల వయస్సు గల ఓటర్లందరికీ ఎన్నికల సంఘం కృతజ్ఞతా పత్రం అందజేసింది. అందులో శ్యామ్ శరణ్ నేగి ఉన్నారు.

ఎఫ్ఐసిసిఐ తదుపరి అధ్యక్షుడిగా సుభ్రకాంత్ పాండా

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) తన తదుపరి అధ్యక్షుడిగా సుభ్రకాంత్ పాండాను నియమించింది. ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ (IMFA) మేనేజింగ్ డైరెక్టర్ అయినా సుభ్రకాంత్ పాండా ప్రస్తుతం ఎఫ్ఐసిసిఐ యందు సీనియర్ వైస్ ప్రెసిడెంటుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అనేది భారతదేశంలోని ప్రభుత్వేతర వాణిజ్య మరియు న్యాయవాద సమూహం. 1927లో స్థాపించిన ఈ సంస్థ న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పని చేస్తుంది.

నేషనల్ మాన్యుమెంట్స్ చైర్మన్‌గా కిశోర్ కె బాసా

నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ (ఎన్‌ఎంఏ) నూతన చైర్మన్‌గా ఒడిశాకు చెందిన మహారాజా శ్రీరామ చంద్ర భంజ డియో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కిశోర్ కుమార్ బాసా నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయన వచ్చే మూడేళ్ళ కాలానికి సేవలు అందించనున్నారు.

నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనేది పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం, 2010 యొక్క నిబంధనల ప్రకారం ఏర్పడిన చట్టబద్ధమైన సంస్థ. ఇది దేశంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల రక్షణ, పరిరక్షణ మరియు నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తుంది.

లా కమిషన్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రితురాజ్ అవస్థీ

కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థీ, 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ రితురాజ్ అవస్థి అక్టోబర్ 11, 2021 నుండి జూలై 2, 2022 వరకు కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 24 ఫిబ్రవరి 2020న లా కమిషన్ నోటిఫై చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఈ నియామకం జరిగింది. ఈ లా కమిషన్ వచ్చే మూడేళ్ల కాలానికి పని చేయనుంది.

లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా స్థాపించబడే ఒక కార్యనిర్వాహక సంస్థ. ఇది న్యాయ సంస్కరణలపై పరిశోధన చేయడంతో పాటుగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు చేసిన సూచనలపై వివిధ అంశాలను స్వీకరించి ప్రభుత్వనికి న్యాయ సలహాలు అందిస్తుంది.

స్విట్జర్లాండ్ ఫ్రెండ్‌షిప్ అంబాసిడరుగా నీరజ్ చోప్రా

స్విట్జర్లాండ్ టూరిజం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను ' ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్'గా నియమించింది. స్విట్జర్లాండ్ సందర్శించే భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు ఈ నియామకం చేపట్టింది.

ప్రసార భారతి సీఈఓగా గౌరవ్ ద్వివేది

సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి గౌరవ్ ద్వివేది, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు గౌరవ్ ద్వివేది గతంలో మైగొవ్ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేసారు. ఈయన గతంలో అడ్మినిస్ట్రేషన్ యందు పీఎం అవార్డు ఫర్ ఎక్సలెన్స్ అందుకున్నారు.

ప్రముఖ తెలుగు నటుడు 'సూపర్ స్టార్' కృష్ణ కన్నుమూశారు

ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ (80) గుండెపోటుతో నవంబర్ 15న కన్నుమూశారు. ఆయన 1943 మే 31 న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన అతని కెరీర్‌లో అతను 350 కంటే ఎక్కువ చిత్రాలలో నటించాడు.

1989లో ఏలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. దివంగత రాజీవ్ గాంధీ ప్రభావంతో ఆయన ఆహ్వానం మేరకు పార్టీలో చేరారు. 2009లో భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.

కొమొరోస్‌కు భారత రాయబారిగా బండారు విల్సన్‌బాబు

కొమొరోస్‌కి తదుపరి రాయబారిగా బండారు విల్సన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్‌లో భారత రాయబారిగా ఉన్న  బండారు విల్సన్‌బాబు ఏకకాలంలో ఈ రెండు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కొమొరోస్ అధికారికంగా యూనియన్ ఆఫ్ కొమొరోస్'గా పిలవబడుతుంది. ఇది ఆగ్నేయ ఆఫ్రికాలోని మూడు ద్వీపాలతో రూపొందించబడిన ఒక స్వతంత్ర దేశం. దీని రాజధాని నగరం మొరోని.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా సివి ఆనంద బోస్

పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌గా సివి ఆనంద బోస్‌ నియమితులయ్యారు. ఈ జులైలో పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయిన తర్వాత, మణిపూర్ గవర్నర్ లా గణేశన్ ఇప్పటివరకు బెంగాల్ తాత్కాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి వైస్ ప్రెసిడెంట్ ధంఖర్ హాజరు

ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఎమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఖతార్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చే ఏడాది 2023 నాటికీ భారత్, ఖతార్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 ఏళ్ళ పూర్తి కానుంది.

కెవిఐసి సిఇఒగా వినిత్ కుమార్

మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ (KVlC) సీఈఓగా వినిత్ కుమార్‌ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ఈఈఈ అధికారి అయిన  వినీత్ కుమార్, ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందు కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ (పూర్వపు శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతా) ఛైర్మన్‌గా పనిచేశారు.

ప్ర‌పంచ అత్యంత ప్రజాదరణ ఉన్న నేత‌గా ప్ర‌ధాని మోదీ

యుఎస్ ఆధారిత కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 77 శాతం ప్రజా ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా కొనసాగుతున్నారు.

ఈ జాబితాలో రెండవ స్థానాన్ని మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ అలానే ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పంచుకున్నారు. 22 మంది ప్రపంచ అగ్రగామి నాయకులలో యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ 9 వ స్థానంలో ఉన్నారు, ఆ తరువాత స్థానంలో యుకె ప్రధాన మంత్రి రిషి సునక్ ఉన్నారు.

ఏఐసీటీఈ నూతన చైర్మన్‌గా టీజీ సీతారామ్

ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) కొత్త ఛైర్మన్‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) గౌహతి డైరెక్టర్ టీజీ సీతారామ్ నియమితులయ్యారు. ఈ హోదాలో వచ్చే 3ఏళ్ళ కాలానికి ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఉన్నత విద్యా శాఖ పరిధిలో స్థాపించిన ఒక చట్టబద్ధమైన సంస్థ, ఇది దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా వ్యవస్థ యొక్క అకాడమిక్ ప్రణాళికను సమన్వయ పరుస్తుంది. అలానే దేశంలో సాంకేతిక విద్యకు సంబంధించి ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

ప్రభుత్వ పథకాలు & పాలసీలు

ఏపీ పాఠ్యపుస్తకాల్లో ఫాతిమా షేక్ పాఠ్యఅంశం

ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో తరగతి పుస్తకంలో భారతదేశపు మొదటి మహిళా ముస్లిం టీచర్ ఫాతిమా షేక్ జీవిత విశేషాలను ఒక పాఠంగా పొందుపర్చారు. 9 జనవరి 1831 లో పూణేలో జన్మించిన ఫాతిమా షేక్, భారతీయ విద్యావేత్తగా మరియు సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందారు. ఈమె సాంఘిక సంస్కర్తలు జ్యోతిరావ్ ఫూలే మరియు సావిత్రీబాయి ఫూలేల సహోద్యోగిగా దేశానికి సేవలు అందించారు.

కర్ణాటక పాఠశాలలో 10 నిమిషాల యోగా తప్పనిసరి

కర్ణాటక ప్రభుత్వం నవంబర్ 3 నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల యాజమాన్యాలను తప్పనిసరి 10 నిముషాల యోగ సెషన్‌లను నిర్వహించాలని ఆదేశించింది. విద్యార్థులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, చదువుపై దృష్టిసారించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేస్తున్నారు.

ఉత్తరాఖండ్'లో 'లఖపతి దీదీ యోజన' ప్రారంభం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ 4 నవంబర్ 2022న 'లఖపతి దీదీ' యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 1.25 లక్షల స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళను 2025 నాటికీ లక్షాధికారులను చేయనున్నారు. ఈ పథకాన్ని ఉత్తరాఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంటు ద్వారా అమలు చేయనున్నారు.

10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు సమర్ధన

ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా (ఈడబ్ల్యూఎస్) ని కల్పిస్తూ కేంద్రం ప్రభుత్వం చేసిన రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు తన చారిత్రక తీర్పుతో సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్లు కేటాయించడం సమంజసమేనంటూ తీర్పు ప్రకటించింది.

10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రతిపాదన రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించడం లేదని వెల్లడించింది. అయితే ఐదింట మూడొంతుల మెజారిటీతో ఈ తీర్పు వెలువడింది. అంటే ముగ్గురు న్యాయమూర్తులు సమర్థించగా, ఇద్దరు దీనిని వ్యతిరేకించారు. సమర్ధించిన న్యాయమూర్తుల్లో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేబీ పార్దీవాలు ఉన్నారు.

ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019 జనవరిలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రకటన చేసింది. విద్యా సంస్థల్లో 10 శాతం సీట్లను, నియామకాల్లో 10 శాతం పోస్టులను ఈడబ్ల్యూఎస్‌ కోటాగా పక్కకు పెట్టాలని నిర్ణయించింది. ముఖ్యంగా అగ్రకులాల్లో పేద వర్ణాలకు ఈ వాటా దక్కుతుంది.

హర్యానాలో “ట్రీస్ ఔట్‌సైడ్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా" ప్రోగ్రాం

హర్యానా అటవీ శాఖ మరియు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) ఉమ్మడిగా “ట్రీస్ ఔట్‌సైడ్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా (TOFI)” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఈ కార్యక్రమం ద్వారా రైతులను, కంపెనీలను మరియు ఇతర ప్రైవేట్ సంస్థలను ఒకే గొడుగు కిందకి చేర్చి రాష్ట్రంలో మొక్కల పెంపకంను పెంపొందించనున్నారు.

గోవాలో ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యాత్ర యోజన ప్రారంభం

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ముఖ్యమంత్రి దేవదర్శన్ యాత్రా యోజన పేరుతొ కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 50 ఏళ్ళు దాటిన వృద్దులకు తమిళనాడు, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఉచిత తీర్థయాత్రా చేసే అవకాశం కల్పించనున్నారు.

దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ రైలు ప్రారంభం

మైసూరు మరియు చెన్నై మధ్య దక్షిణ భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నవంబర్ 11 న ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ఐదవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వలన దేశంలో అత్యధిక వేగంతో నడిచే రైలుగా గుర్తింపు పొందింది. 2023 చివరి నాటికీ దేశ వ్యాప్తంగా 75 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదే వేదికలో 'భారత్ గౌరవ్ కాశీ దర్శన్' రైలును కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. 'భారత్ గౌరవ్ పథకం' ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈ రైలు కర్ణాటక నుండి కాశీకి ప్రయాణించే యాత్రికులను ఉపయోగపడనుంది. ఇది యాత్రికులు కాశీ, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లను సందర్శించడానికి సౌకర్యవంతమైన బస మరియు మార్గదర్శకత్వం అందించబడుతుంది.

బీహారులో హర్ ఘర్ గంగాజల్ ప్రాజెక్టు ప్రారంభం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నవంబర్ 27న రాజ్‌గిర్‌లో హర్ ఘర్ గంగాజల్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ పథకం యొక్క మొదటి దశలో భాగంగా రాజ్‌గిర్, బోధ్ గయా మరియు గయా పట్టణాలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరాను అందించనున్నారు. ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం యొక్క జల్ జీవన్ మరియు హరియాలి పథకం పరిధిలో నిర్వహించనున్నారు.

బిజినెస్ మరియు ఎకానమీ

ఆర్‌బిఐ టోకు విభాగంలో డిజిటల్ రూపాయి ప్రారంభం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిటైల్ విభాగంలో డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రపంచంలోని మొదటి కేంద్ర బ్యాంకులలో ఒకటిగా అవతరించింది. నవంబర్ 1 నుండి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) లేదా డిజిటల్ రూపాయిను, ప్రభుత్వ సెక్యూరిటీలలో సెకండరీ మార్కెట్ లావాదేవీల పరిష్కారానికి ఉపయోగించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఇ-రూపాయిని ఉపయోగించడం వల్ల ఇంటర్-బ్యాంకు మార్కెట్ మరింత సమర్థవంతంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ రూపాయిలో సెటిల్‌మెంట్ లావాదేవీల ఖర్చులను తగ్గిస్తుందని ఆర్‌బిఐ పేర్కొంది. డిజిటల్ రూపాయి యొక్క హోల్‌సేల్ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కోసం ఆర్‌బిఐ తొమ్మిది బ్యాంకులను గుర్తించింది.

ఈ జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మరియు హెచ్‌ఎస్‌బిసి బ్యాంకులు ఉన్నాయి.

పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్పు

భారతదేశ జాతీయ గ్రిడ్ ఆపరేటర్ అయినా పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (POSOCO) కొత్తగా గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గ్రిడ్-ఇండియా) గా పేరు మార్చుకుంది. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ అనేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ విభాగం, ఇది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో సేవలు అందిస్తుంది.

మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్‌

ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ అయినా మెటా ఇండియా హెడ్ మరియు వైస్ ప్రెసిడెంట్‌గా సంధ్యా దేవనాథన్ నియమితులయ్యారు. మెటా ఇండియా మాజీ హెడ్ అజిత్ మోహన్ రాజీనామా చేసిన రెండు వారాల తర్వాత ఈ నియామక వార్త వెలువడింది. ఈమె 1 జనవరి 2023 నుండి తన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఓఎన్‌జీసీ తదుపరి చైర్మనుగా అరుణ్ కుమార్ సింగ్

చమురు శుద్ధి మరియు మార్కెటింగ్ కంపెనీ బిపిసిఎల్ రిటైర్డ్ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్  (ఓఎన్‌జిసి) యొక్క తదుపరి చైర్మన్‌గా నియమితులయ్యారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో 60 ఏళ్ళు మించిన వ్యక్తికీ బాధ్యతలు అప్పగించడం ఇదే మొదటిసారి.

కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు

కెనరా బ్యాంక్ యొక్క అనుబంధ బ్యాంకు అయినా కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ (KVGB), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ నుండి అటల్ పెన్షన్ యోజన పరిధిలో 'బిగ్ బిలీవర్స్' మరియు 'లీడర్‌షిప్ క్యాపిటల్' రెండు బెస్ట్ పెరఫార్మెర్ అవార్డులను అందుకుంది. అటల్ ఎన్‌రోల్‌మెంట్ కింద అత్యుత్తమ విజయాలు సాధించినందుకు గాను ఈ అవార్డులు అందించారు.

డిఫెన్స్ మరియు సెక్యూరిటీ

కొత్త రక్షణ కార్యదర్శిగా గిరిధర్ అరమనే బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి గిరిధర్ అరమనే రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఎంఏ (ఎకనామిక్స్‌) పూర్తిచేసిన గిరిధర్, ఐఏఎస్ అధికారిగా తన 32 ఏళ్ల కెరీర్‌లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ పలు కీలక పదవులు నిర్వహించారు. గతంలో కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.

మహిళా సీఆర్పీఎఫ్ అధికారులకు తొలిసారి ఐజీ ర్యాంక్‌ పదోన్నతి

దేశంలో తొలిసారిగా ఇద్దరు మహిళా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) అధికారులు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజి) స్థాయికి పదోన్నతి పొందారు. 1987లో ఫోర్స్‌లో చేరిన సీమా ధుండియా మరియు అన్నీ అబ్రహంలకు ఈ అవకాశం దక్కింది.

అన్నీ అబ్రహం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఐజిగా నియమితులయ్యారు, సీమా ధుండియా బీహార్ సెక్టార్ ఐజిగా పదోన్నతి పొందారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 1986 లో మొదటిసారి మహిళను రిక్రూట్మెంట్ చేసిన సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సుగా నిలిచింది.

70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత్ నౌకలు

జపాన్‌లోని యోకోసుకాలో జరిగిన 70వ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారతీయ నౌకాదళం పాల్గొంది. ఈ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవల్ షిప్‌లు శివాలిక్ మరియు కమోర్టాలు ఇండియన్ నేవీకి ప్రాతినిధ్యం వహించాయి. జపాన్ మారిటైమ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో జపానుతో సహా మరో 12 దేశాలకు చెందిన 40 షిప్‌లు మరియు జలాంతర్గామిలు పాల్గొన్నాయి.

మలబార్ నేవల్ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్న ఇండియన్ నేవీ

జపాన్‌లోని యోకోసుకాలో జరిగిన 26వ అంతర్జాతీయ మలబార్ నావికాదళ వ్యాయామంలో భారత్ నౌకాదళం పాల్గొంది. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్న ఇండియన్ నేవల్ షిప్‌లు శివాలిక్ మరియు కమోర్టాలే ఇందులో కూడా పాల్గొన్నాయి. మలబార్ ఎక్సర్‌సైజ్ 1992లో భారతదేశం మరియు యుఎస్ నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఎక్సర్‌సైజ్ యందు జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళాలు కూడా పాల్గొన్నాయి.

కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్ సైజ్ 'సీ విజిల్ -2022

పాన్-ఇండియా కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ సీ విజిల్-22 యొక్క మూడవ ఎడిషన్ నవంబర్ 15వ తేదీన ప్రారంభమైంది. దేశం యొక్క మొత్తం ఏడు వేల 516 కిలోమీటర్ల తీరప్రాంతం మరియు భారతదేశంలోని ప్రత్యేక ఆర్థిక మండలిలలో ఈ వ్యాయామం చేపట్టనున్నారు.

6/11 ఉగ్రదాడి తర్వాత సముద్ర భద్రతను పెంపొందించడానికి ఏర్పాటు చేసిన చర్యలలో భాగంగా 2018 లో దీనిని మొదటిసారి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగే ఈ విన్యాసాన్ని భారత నౌకాదళం కోస్ట్ గార్డ్ మరియు ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నారు.

భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసం 'యుద్ అభ్యాస్' ప్రారంభం

18వ ఎడిషన్ ఇండో - యుఎస్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్ సైజ్ “యుధ్ అభ్యాస్” ఉత్తరాఖండ్‌లో నవంబర్ 15 న ప్రారంభం అయ్యింది. మెగా ఎక్సర్‌సైజ్‌లో అస్సాం రెజిమెంట్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ సైనికులు పాల్గొంటారు, యూఎస్ ఆర్మీకి 11వ వైమానిక విభాగానికి చెందిన 2వ బ్రిగేడ్ సైనికులు ప్రాతినిధ్యం వహిస్తారు.

ఈ వార్షిక ద్వైపాక్షిక కసరత్తు నవంబర్ 15 నుండి డిసెంబర్ 2వరకు జరగనుంది. ఈ ఉమ్మడి వ్యాయామం మానవతా సహాయం మరియు విపత్తు సహాయ (HADR) కార్యకలాపాలపై కూడా దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు రెండు దేశాలకు చెందిన దళాలు వేగంగా & సమన్వయంతో సహాయక చర్యలను అందించేలా శిక్షణ అందిస్తారు.

అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని -3 యొక్క శిక్షణా ప్రయోగాన్ని డిసెంబర్ 23న భారతదేశం విజయవంతంగా నిర్వహించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చే అభివృద్ధి చేయబడిన ఇది 16 మీటర్ల పొడవుతో, 48 టన్నుల బరువు కలిగి ఉంటుంది, అగ్ని -3 దాదాపు 3000 కిలోమీటర్ల పరిధిని కవర్ చేయగలదు మరియు 1.5 టన్నులకు పైగా పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.

భారత్-ఇండోనేషియా జాయింట్ మిలిటరీ ఎక్సరసైజ్

భారతదేశం-ఇండోనేషియా ద్వైపాక్షిక ఉమ్మడి శిక్షణా వ్యాయామం 'గరుడ శక్తి' యొక్క ఎనిమిదవ ఎడిషన్ పశ్చిమ జావాలోని సంగ బువానా శిక్షణా ప్రదేశంలో నవంబర్ 21న ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ ఉమ్మడి సైనిక వ్యాయామంలో ఇండియన్ మరియు ఇండోనేషియన్ స్పెషల్ ఫోర్సెస్ దళాలలు పాల్గొన్నాయి. దీనిని ఇరు దేశాల మధ్య పరస్పర సైనిక అవగాహనా మరియు సహకారం నిమిత్తం నిర్వహిస్తారు.

నసీమ్ అల్ బహర్ ఎక్సరసైజ్ 2022

ఒమన్ తీరంలో నిర్వహించిన ఇండియా-ఒమాన్ ఉమ్మడి నావెల్ ఎక్సరసైజ్ అయినా నసీమ్ అల్ బహర్ యొక్క 13వ ఎడిషన్ యందు ఇండియన్ నేవీకి చెందిన మిస్సైల్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ త్రికాండ్, ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర మరియు సముద్ర గస్తీ విమానం (MPA) డోర్నియర్ పాల్గొన్నాయి.

నవంబర్ 19 నుండి 24 వరకు నిర్వహించిన ఈ వ్యాయామంను హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ మరియు డెబ్రీఫ్ పేజ్ పేర్లలతో మూడు దశలలో నిర్వహిస్తారు. ఈ ఉమ్మడి వ్యాయామం 1993 నుండి ఇరు దేశాలు నిర్వహిస్తున్నాయి. నిని ఇరు దేశాల మధ్య పరస్పర సైనిక అవగాహనా మరియు సహకారం నిమిత్తం నిర్వహిస్తారు.

ఆస్ట్రా హింద్-22 మిలిటరీ ఎక్సరసైజ్

భారత్ - ఆస్ట్రేలియాల వార్షిక ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సరసైజ్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 11 మధ్య రాజస్థానులోని మహారాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ యందు నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల సైనికుల మధ్య సానుకూల సైనిక సంబంధాలను మెరుగు పర్చేందుకు ఏటా ఈ మిలిటరీ వ్యాయామాన్ని నిర్వహిస్తారు.

భారత నౌకాదళం యొక్క కొత్త సర్వే నౌక 'ఇక్షక్' ప్రారంభం

భారత నౌకాదళం యొక్క మూడవ సర్వే వెస్సెల్స్ - లార్జ్ (SVL) నవంబర్ 26న చెన్నైలోని కట్టుపల్లిలో ప్రారంభించబడింది. ఈ సర్వే నౌకకు 'ఇక్షక్' అని పేరు పెట్టారు. ఈ ఇక్షక్ అంటే మార్గదర్శి అని అర్థం. ఎస్విఎల్ నౌకలు సముద్ర శాస్త్ర అధ్యయనానికి మరియు జియోఫిజికల్ డేటాను సేకరించడంలో సహాయపడతాయి. 110మీ-పొడవు మరియు 16మీ-వెడల్పు ఉన్న ఈ నౌకలో గరిష్టంగా 231 మంది సిబ్బంది విధులు నిర్వర్తించగలరు.

30 అక్టోబర్ 2018న కోల్‌కతాలోని మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ మరియు గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ (GRSE) మధ్య నాలుగు సర్వే వెస్సెల్స్ - లార్జ్ షిప్‌ల నిర్మాణానికి 2,435 కోట్లతో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 2021 డిసెంబరు 5న మొదటి సర్వే 'నౌక సంధాయక్' ప్రారంభించారు. అలానే రెండవ నౌకను ఈ ఏడాది మే 26న నిర్దేశక్ పేరుతొ అందుబాటులోకి తీసుకొచ్చారు.

భారత్-మలేషియా సైనిక వ్యాయామం హరిమౌ శక్తి ప్రారంభం

భారతదేశం-మలేషియా సంయుక్త సైనిక వ్యాయామం "హరిమౌ శక్తి 2022" 28 నవంబర్ 2022 న మలేషియాలోని క్లూయాంగ్‌లోని పులాయ్‌లో ప్రారంభమైంది. భారతదేశం మరియు మలేషియా సైన్యం మధ్య జరిగే ఈ వార్షిక శిక్షణా వ్యాయామం 12 డిసెంబర్ 2022న ముగుస్తుంది. తదుపరి రెండు వారాల పాటు మలేషియాలో సైనిక వ్యాయామం నిర్వహించబడుతుంది.

ఈ సైనిక వ్యాయామం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటుగా మధ్య పరస్పర సహకారం మెరుగుపరచడంపై దృష్టి పెట్టబడుతుంది. ఇందులో భారత సైన్యానికి చెందిన గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ మరియు మలేషియా సైన్యానికి చెందిన రాయల్ మలయ్ రెజిమెంట్‌కు చెందిన పోరాట దళాలు పాల్గున్నాయి.

రిపోర్టులు మరియు ర్యాంకులు

పెర్ఫార్మింగ్ గ్రేడింగ్ ఇండెక్స్ 2020-21

జిల్లా స్థాయిలో పాఠశాల విద్యను అంచనా వేసే 2020-21 పెర్ఫార్మింగ్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో కేరళ, పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లెవెల్ -2 పరిధిలో అగ్రస్థానంలో నిలిచాయి. పెర్ఫార్మింగ్ గ్రేడింగ్ ఇండెక్స్‌ అనేది పాఠశాలలో లెర్నింగ్, యాక్సెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సౌకర్యాలు వంటి  దాదాపు 70 అంశాలకు సంబంధించి ఈ ర్యాంకింగ్ అందిస్తుంది.

పాఠశాలల ర్యాంకింగులో 1000 పాయింట్లలో 950 కంటే ఎక్కువ స్కోర్‌ సాధించిన  పాఠశాలలను లెవెల్ 1 పరిధిలో, 551 కంటే తక్కువ స్కోర్‌ సాధించిన పాఠశాలలకు అత్యల్ప గ్రేడ్ లెవల్ 10గా నిర్ణయిస్తారు. ఈ జాబితాలో  అరుణాచల్ ప్రదేశ్ లెవెల్ 7 పరిధిలో అత్యల్ప పనితీరును కనబరిచింది.

ఏకరీతి బంగారం ధరను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కేరళ

భారతదేశంలో బ్యాంక్ రేటు ఆధారంగా బంగారం యొక్క ఏకరీతి ధర ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది. మెజారిటీ రాష్ట్రలో బంగారం ధర బ్యాంక్ రేటు కంటే 150/- నుండి 300/-  రూపాయలు అధనంగా అమ్ముతారు. భారతదేశంలో 80% బంగారాన్ని కర్ణాటక ఉత్పత్తి చేస్తోంది. దీనిని 'బంగారు భూమి' అని పిలుస్తారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) దేశంలోనే అతిపెద్ద బంగారు గని, ఇది కోలార్‌లో ఉంది.

దక్షిణాసియాలో అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ బాంబే

ఇటీవల విడుదల చేసిన క్విఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి దక్షిణాసియాలో అగ్రశ్రేణి విద్యా సంస్థగా నిలిచింది. అయితే మొత్తం ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగులో 46వ ర్యాంకు దక్కించుకుంది. ఇదే జాబితాలో ఐఐటీ ఢిల్లీ 46వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2023 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా ఏడవ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది.

క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో ఇండియాకు 8వ స్థానం

క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 (CCPI)లో 63 దేశాల జాబితాలో భారతదేశం రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో డెన్మార్క్ మరియు స్వీడన్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల విడుదల ఆధారంగా ఈ ర్యాంకు ఇవ్వబడుతుంది. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2005 లో మొదటిసారి స్థాపించబడింది.

2023 నాటికీ ప్రపంచ అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌

ఐక్యరాజ్యసమితి 2022 నివేదిక ప్రకారం, 2023 నాటికి భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమిస్తుందని అంచనా వేయబడింది. ప్రస్తుత భారతదేశ జనాభా 1,425,775,850గా అంచనా వేయబడింది. అలానే ప్రపంచ జనాభా ఈ ఏడాది నవంబర్ 15 నాటికి 8 బిలియన్లకు చేరుకుంటుందని మరియు 2030 నాటికి 8.5 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది.

క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో ఇండియాకు 8వ ర్యాంకు

జర్మనీకి చెందిన జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్‌స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ ప్రచురించిన క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (CCPI, 2023) ప్రకారం భారతదేశం రెండు స్థానాలు ఎగబాకి, 8వ స్థానంలో నిలిచింది. తాజా నివేదికలో డెన్మార్క్, స్వీడన్, చిలీ మరియు మొరాకోలను వరుసగా 4, 5, 6 మరియు 7వ స్థానాల్లో నిలిచాయి. మొదటి, రెండవ మరియు మూడవ ర్యాంకులు ఏ దేశానికి ఇవ్వబడలేదు. ఫలితంగా, అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం యొక్క ర్యాంక్ అత్యుత్తమమైనదిగా నిలిచింది.

తమిళనాడులో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌

తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 22న అరిట్టపట్టి గ్రామాన్ని బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ప్రకారం ఆ రాష్ట్రంలోని మొదటి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సైట్ మదురై జిల్లాలోని అరిట్టపట్టి మరియు మీనాక్షిపురం గ్రామాలలో 193.215 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

అరిట్టపట్టి గ్రామం సుసంపన్నమైన జీవ మరియు చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో 3 ఫ్లాగ్‌షిప్ రాప్టర్ జాతులు, లగ్గర్ ఫాల్కన్, షాహీన్ ఫాల్కన్, బోనెల్లిస్ ఈగిల్ మరియు పాంగోలిన్, పైథాన్ మరియు స్లెండర్ లోరిస్ వంటి వన్యప్రాణులతో సహా దాదాపు 250 పక్షి జాతులు ప్రమాదంలో ఉన్నాయి.

బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌ హోదా అనేది జీవవైవిధ్య పరిరక్షణను బలోపేతం చేస్తుంది మరియు జీవవైవిధ్యం వేగంగా నష్టపోకుండా కాపాడుతుంది. భారత దేశంలో ప్రస్తుతం 35 బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో 159 మొక్కలు మరియు 175 జంతువులు అంతరించిపోతున్న జాతులుగా నోటిఫై చేయబడ్డాయి.

భారతదేశంను ప్రధానంగా నాలుగు బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లుగా పరిగణిస్తారు. ఈ నాలుగు బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌లు అయినా హిమాలయాలు, ఇండో-బర్మా, సుందర్‌బన్స్‌ మరియు పశ్చిమ కనుమలు అత్యధిక జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలను కలిగి ఉన్నాయి.

సీడీపీ క్లైమేట్ యాక్షన్ లిస్ట్‌లో ముంబై అగ్రస్థానం

ముంబై దక్షిణాసియా యొక్క సీడీపీ క్లైమేట్ యాక్షన్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి నగరంగా అవతరించింది. ఇటీవలే సీడీపీ ప్రచురించిన 5వ వార్షిక నగరాల నివేదికలో A-జాబితాకు జోడించబడిన మొదటి భారతీయ నగరంగా ముంబై నిలిచింది. ఏ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 122 నగరాలు అగ్రగామిగా నిలిచాయి.

అవార్డులు మరియు గౌరవాలు

పశ్చిమ బెంగాల్ లక్ష్మీర్ భండార్ పథకంకు స్కోచ్ అవార్డు

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క లక్ష్మీర్ భండార్ పథకం, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కేటగిరిలో 2022 స్కోచ్ అవార్డును అందుకుంది. 2021 లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 25-60 సంవత్సరాల వయస్సు గల జనరల్ మహిళలకు రూ.500, ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళకు నెలకు రూ.1,000 అందజేస్తున్నారు.

2003లో స్థాపించబడిన స్కోచ్ అవార్డు దేశంలో అసాధారణ విజయాలు, సేవలు అందిస్తున్న  ప్రభుత్వాలకు, వ్యక్తులకు, ప్రాజెక్ట్‌లకు మరియు సంస్థలకు గుర్తించి గౌరవిస్తుంది.

అరుణా సాయిరామ్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వ చెవాలియర్ అవార్డు

కర్నాటక గాయని, స్వరకర్త, మానవతావాది అయినా అరుణ సాయిరామ్ ఫ్రెంచ్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం చెవాలియర్ డి ఎల్ ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ (de l'Ordre des Arts et des) అవార్డు అందుకున్నారు. 1957లో స్థాపించిన ఈ ఆర్డర్ కళాత్మక లేదా సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలకు గాను అందిస్తారు.

అరుణ సాయిరామ్ ఇదివరకే భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు, సంగీత అకాడమీ నుండి కళానిధి అవార్డు అందుకున్నారు. ఈమె భారత్ సంగీత్ నాటక్ అకాడమీ యొక్క వైస్ చైర్మనుగా కూడా పనిచేసారు.

కేఎస్‌ఆర్‌టీసీకి కేంద్ర ప్రభుత్వ అవార్డు

కేరళ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ దేశంలోనే అత్యుత్తమ ప్రజారవాణా సేవల విభాగంలో కేంద్ర ప్రభుత్వ అవార్డును కైవసం చేసుకుంది. కేరళ రోడ్ రవాణా సంస్థ చేపట్టిన 'సిటీ సర్క్యులర్ సర్వీస్' మరియు గ్రామ వండి ప్రాజెక్టులకు గాను ఈ అవార్డు అందించబడింది. ఈ రెండు ప్రోజెక్టుల ద్వారా కేఎస్‌ఆర్‌టీసీ చిన్న మరియు మధ్యస్థ పట్టణాలు మరియు నగరాల్లో అంతరాయం లేని ప్రజారవాణా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్‌ అవార్డులు ప్రధానం

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము 2021 సంవత్సరానికి గానూ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను నర్సింగ్ నిపుణులకు అందించారు. నవంబర్ 7న జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఉత్తరాఖండ్‌లోని కుమావోన్‌కు చెందిన ఇద్దరు నర్సులు శశికళ పాండే మరియు గంగా జోషిలు ఈ అవార్డులు అందుకున్నారు. 1973 లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫామిలీ వెల్ఫేర్ స్థాపించిన ఈ అవార్డును అత్యుత్తమ నర్సింగ్ సేవలు అందించిన వ్యక్తులకు అందిస్తారు.

వైకెసి వడియార్‌కు అంతర్జాతీయ కన్నడిగ అవార్డు

ప్రాచీన రాజ కుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణరాజ చామరాజాకు వైకెసి వడియార్ అంతర్జాతీయ కన్నడ రత్న అవార్డుకు ఎంపికయ్యారు. కన్నడ రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని దుబాయ్ కన్నడిగులు ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందిస్తారు.

డాక్టర్ సుభాష్ బాబుకు బెయిలీ కె అవార్డు

ప్రముఖ భారతీయ వైద్యుడు మరియు శాస్త్రవేత్త డాక్టర్ సుభాష్ బాబుకు ప్రతిష్టాత్మకమైన 2022 బెయిలీ కె. యాష్‌ఫోర్డ్ మెడల్ మరియు 2022 ఫెలో ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ (FASTMH) అవార్డులు అందుకున్నారు. బెయిలీ కె. యాష్‌ఫోర్డ్ మెడల్ భారతీయుడు దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ట్రాపికల్ మెడిసిన్‌లో తన విశేషమైన పరిశోధన మరియు సహకారానికి గాను ఈ అవార్డును దక్కించుకున్నారు.

గూగుల్ డూడుల్‌ పోటీ విజేతగా శ్లోక్ ముఖర్జీ

సైన్స్ ప్రపంచానికి భారతదేశం యొక్క స్పూర్తిదాయకమైన ఆలోచనను పంచుకోవడం ద్వారా పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్లోక్ ముఖర్జీ గూగుల్ డూడుల్‌ 2022 పోటీ విజేతగా నిలిచాడు. నవంబర్ 14న ' ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ ' పేరుతో శ్లోక్ ముఖర్జీ గీచిన స్ఫూర్తిదాయకమైన డూడుల్‌ను గూగుల్ డూడుల్‌ ఇండియా విజేతగా ప్రకటించింది.

కేరళ టూరిజంకు రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డు

లండన్‌లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్‌లో కేరళ టూరిజం ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డు 2022 ను గెలుచుకుంది. ప్లాస్టిక్-వ్యర్థాల నిర్మూలన, నీటి సంరక్షణ (వాటర్ స్ట్రీట్ ప్రాజెక్ట్ ) పర్యాటక రంగంలో వైవిధ్యం మరియు కోవిడ్ అనంతర పర్యాటక పునరుద్ధరణ సంబంధించి ఈ అవార్డు గెలుచుకుంది.

భోపాల్ రైల్వే స్టేషనుకు 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్‌

భోపాల్ రైల్వే స్టేషన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి 4 - స్టార్ "ఈట్ రైట్ స్టేషన్" సర్టిఫికేషన్ పొందింది. ప్రయాణికులకు హై క్వాలిటీ పోషకాలతో కూడిన ఆహారం సరఫరా చేస్తున్నందుకు ఈ సర్టిఫికేషన్ అందించింది.

భారతీయులకు సురక్షితమైన క్వాలిటీ ఆహారం అందించే ప్రయత్నంలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఈట్ రైట్ ఇండియా అనే ఉద్యమాన్ని ప్రారంభిచింది. అందులో భాగంగా ఈ స్టార్ రేటింగ్ మరియు సర్టిఫికేషన్ అందిస్తుంది.

జాతీయ క్రీడా అవార్డులు 2022

యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2022 విజేతల జాబితాను ప్రకటించింది. అవార్డు గ్రహీతలు ఈ నెల 30న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటారు.

ఈ ఏడాది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు తమిళనాడుకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ ఆచంట గెలుచుకున్నాడు. శరత్ కమల్ 2006లో మెల్‌బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. అదే ఏడాది 22 ఏళ్లకే అర్జున అవార్డు గ్రహీతగా నిలిచాడు. ఆయన పేరిట తొమ్మిది సార్లు సీనియర్ నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ రికార్డు ఉంది.

ఇకపోతే ఇటీవలే కాలంలో అత్యుత్తమ క్రీడా విజయాలు సాధించిన సీమా పునియా, లక్ష్య సేన్, నిఖత్ జరీన్, ఆర్ ప్రజ్ఞానానంద, దీప్ గ్రేస్ ఎక్కా, సుశీలా దేవి, సాగర్ కైలాస్ ఓవల్కర్, ఓంప్రకాష్ మిథర్వాల్, వికాస్ ఠాకూర్, మానసి గిరీశ్చంద్ర జోషి సహా 25 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు అందిస్తున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి నిఖత్ జరీన్ (బాక్సింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్) ఉన్నారు.

రెగ్యులర్ విభాగంలో ఐదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో జీవన్‌జోత్ సింగ్ తేజ (విలువిద్య), మహమ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమ సిద్ధార్థ్ శిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్) లు ఉన్నారు.

లైఫ్‌టైమ్ విభాగంలో ముగ్గురు కోచ్‌లను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు. ఈ జాబితాలో దినేష్ జవహర్ లాడ్ (క్రికెట్), బిమల్ ప్రఫుల్ల ఘోష్ (ఫుట్బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) లు ఉన్నారు. అలానే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2022 అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి ఇవ్వబడుతుంది. అవార్డుల పూర్తి జాబితా

కార్లోస్ సౌరాకు సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

నవంబర్ 20 నుంచి గోవాలో ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) 53వ ఎడిషన్‌లో స్పానిష్ చలనచిత్ర దర్శకుడు కార్లోస్ సౌరాకు సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) 53వ ఎడిషన్‌ నవంబర్ 20 నుండి 28 మధ్య గోవాలో జరగనుంది.

దలైలామాకు గాంధీ మండేలా అవార్డు

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 2022 గాంధీ మండేలా అవార్డును హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రదానం చేశారు. ప్రపంచ శాంతి మరియు స్వేచ్ఛ కోసం మహాత్మా గాంధీ మరియు నెల్సన్ మండేలాల ఆశయాలను ప్రచారం చేసినందుకు ఈ అవార్డు ఇవ్వబడింది. ఏ అవార్డును ఏటా గాంధీ మండేలా ఫౌండేషన్ అందిస్తుంది.

రవికుమార్‌ సాగర్‌కు అబ్దుల్ కలాం సేవా పురస్కారం

ఆర్కేఎస్ ఇన్నో గ్రూప్ యొక్క యంగెస్ట్ ఫౌండర్ మరియు సీఈఓ అయిన రవి కుమార్ సాగర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన డా. అబ్దుల్ కలాం సేవా పురస్కారం లభించింది. సమాజానికి ఆయన చేసిన నిరంతర సేవలకుగానూ ఈ అవార్డును అందించారు. ఈ అవార్డును ఏటా వందే భారత్ ఫౌండేషన్ కలాం పుట్టిన రోజున అందిస్తుంది.

టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ 2021

భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి సంబంధించి టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డులను ప్రకటించింది. భారత రాష్ట్రపతి 30 నవంబర్ 2022న అవార్డులను ప్రదానం చేస్తారు. ల్యాండ్ అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్ మరియు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అనే నాలుగు విభాగాల్లో ఏటా ఈ అవార్డును అందజేస్తారు.

అవార్డు గ్రహీతకు జ్ఞాపిక, సర్టిఫికెట్ మరియు 15 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో శ్రీమతి నైనా ధాకడ్'కు, వాటర్ అడ్వెంచర్ విభాగంలో శుభం ధనంజయ్ వనమాలికి, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సంబంధించి కెప్టెన్ కున్వర్ భవాని సింగ్ సమ్యాల్'కు ఈ అవార్డులు అందించారు.

ప్రశాంత్ వాఘ్'కు 'ఏషియాస్ ఇన్‌స్పిరేషనల్ లీడర్ 2022' అవార్డు

లండన్‌లో జరిగిన 'గ్లోబల్ బిజినెస్ కాన్క్లేవ్ 2022'లో అక్యూరాకు చెందిన ప్రశాంత్ వాఘ్ 'ఏషియాస్ ఇన్‌స్పిరేషనల్ లీడర్ 2022' అవార్డును ప్రదానం చేశారు. 1995లో స్థాపించబడిన ఆయన ఆక్వారా కంపెనీ ఆసియా మోస్ట్ అడ్మిరెడ్ బ్రాండుగా నిలిచింది.

పూర్ణిమా దేవికి ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు

భారతీయ వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమా దేవి బర్మాన్ ఇటీవలే ఐక్యరాజ్యసమితి యొక్క అత్యున్నత పర్యావరణ గౌరవం అయినా ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును అందుకున్నారు. గ్రేటర్ అడ్జటెంట్ కొంగను సంరక్షించడానికి స్థానిక కమ్యూనిటీలతో కలిసి పనిచేసినందుకు గాను బార్మాన్ 'ఎంట్రప్రెన్యూరియల్ విజన్' విభాగంలో ఈ అవార్డును గెలుచుకుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన బర్మాన్, హర్గిలా ఆర్మీ వ్యవస్థాపకురాలుగా ప్రసిద్ధి.

స్పోర్ట్స్ అఫైర్స్

సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌ విజేతగా భారత్

అక్టోబర్ 29న మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలిచింది. ఇది భారతదేశం యొక్క మూడవ సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌. తుదిపోరులో నిర్ణీత సమయం ముగిసే సమయానికి గేమ్ 1-1తో టై అయిన తర్వాత, ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టును షూటౌట్ (5-4) ద్వారా ఓడించింది.

2013-14 తర్వాత ఈ టైటిల్ భారత్ సాధించడం ఇదే మొదటిసారి. ఈ జూనియర్ హాకీ టొర్నమెంటులో ఇండియా, ఆస్ట్రేలియాతో పాటుగా గ్రేట్ బ్రిటన్, మలేషియా, జపాన్, దక్షిణ ఆఫ్రికా జట్టులు పాల్గొన్నాయి. సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ అనేది మలేషియాలో నిర్వహించే అంతర్జాతీయ పురుషుల అండర్-21 ఫీల్డ్ హాకీ టోర్నమెంట్.

ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ స్పెయిన్ సొంతం

అక్టోబర్ 30న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ 2022లో స్పెయిన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో స్పెయిన్ 1-0తో కొలంబియాను ఓడించడం ద్వారా వరుసగా రెండవసారి ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. ఫిఫా అండర్ 17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నమెంటుకు ఇండియా ఆతిధ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.

ట్రాక్ ఆసియా కప్ 2022 కు కేరళ ఆతిధ్యం

అతిపెద్ద సైక్లింగ్ ఈవెంట్లలో ఒకటైన ట్రాక్ ఆసియా కప్-2022 సైక్లింగ్ టోర్నమెంట్‌కు కేరళ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ క్రీడా ఈవెంటును నవంబర్ 25 నుండి 28 వరకు సమీపంలోని ఎల్‌ఎన్‌సిపిఇ అవుట్‌డోర్ వెలోడ్రోమ్‌లో నిర్వహించేందుకు కేరళ సిద్ధంగా ఉంది. ఈ పోటీలో దాదాపు 25 దేశాల నుండి 200 లకు పైగా సైక్లిస్టులు పోటీపడనున్నారు.

బాజీ రౌట్ జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంటు ప్రారంభం

అమే ఒడియా ఫౌండేషన్ నిర్వహించే బాజీ రౌట్ నేషనల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 2022 ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నవంబర్ 3న ఓడిశాలోని దెంకనల్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 3 నుండి నవంబర్ 8 వరకు దెంకనల్, అంగుల్ మరియు తాల్చేర్‌లలో జరగనుంది.

బాజీ రౌత్ పన్నెండేళ్ల వయసులో చంపబడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు అమరవీరుడుగా గుర్తింపు పొందాడు.1938లో బ్రిటీష్ సేనలను తన గ్రామంలోని నదిని దాటడానికి శాంతియుతంగా ప్రతిఘటిస్తూ, వారికి ఫెర్రీబోట్‌ను నిరాకరించి అమరుడు అయ్యాడు.

ఎఫ్‌ఐహెచ్ కొత్త అధ్యక్షుడిగా తయ్యబ్ ఇక్రమ్

మకావుకు చెందిన ప్రస్తుత ఆసియా హాకీ సమాఖ్య సీఈఓ మొహమ్మద్ తయ్యబ్ ఇక్రమ్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవలే జరిగిన 48వ ఎఫ్‌ఐహెచ్ కాంగ్రెస్‌లో ఇక్రమ్ 79-47 ఓట్లతో బెల్జియంకు చెందిన మార్క్ కౌడ్రాన్‌ పై గెలుపొందారు. తయ్యబ్ ఇక్రమ్ వచ్చే రెండేళ్ల కాలానికి ఈ హోదాలో ఉండనున్నారు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చందర్‌పాల్ & ఖాదిర్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్‌ 2022 జాబితాలో వెస్టిండీస్ స్టార్ బ్యాట్సమన్ శివనారాయణ్ చందర్‌పాల్, దిగవంత పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ మరియు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ షార్లెట్ ఎడ్వర్డ్స్ కి చోటు కల్పించారు.

ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌ అనేది క్రికెట్టుకు అత్యుత్తమ సేవలు అందించిన రిటైర్ ఆటగాళ్లకు అందించే ప్రత్యేక గౌరవం. ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటి వరకు 109 మందికి చోటు కల్పించారు. అందులో 82 మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్‌కు చెందినవారు కాగా, మిగిలిన 27 మంది టెస్టు ఆడే దేశాలు, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక మరియు జింబాబ్వేలకు చెందినవారు ఉన్నారు.

భారత్ నుంచి ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) ఉన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించేందుకు సదురు క్రికెటర్ రిటైర్మెంట్ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తియ్యి ఉండాలి. కనీసం 8 వేల పరుగులు చేసి ఉండాలి.

షేన్ వాట్సన్ రాసిన "విన్నింగ్ ది ఇన్నర్ బాటిల్" పుస్తకం విడుదల

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ రచించిన “ విన్నింగ్ ది ఇన్నర్ బ్యాటిల్ బ్రింగింగ్ ది బెస్ట్ ఆఫ్ యు టు క్రికెట్” అనే కొత్త పుస్తకం మార్కెట్లోకి విడుదల అయ్యింది. 2015 పదవీ విరమణ తర్వాత తిరిగి తన కెరీర్‌ను పునరుజ్జీవింపజేసేందుకు తన స్వంత అనుభవాల కలిగిన మానసిక ఆలోచనలను ఈ బుక్ యందు పంచుకున్నారు.

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022 విజేతలు

జోర్డాన్‌లోని అమ్మన్‌లో జరుగుతున్నా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు లోవ్లినా బోర్గోహైన్, పర్వీన్ హుడా, సావీటీ మరియు అల్ఫియా పఠాన్ బంగారు పతకాలను సాధించారు. టోక్యో 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న లోవ్లినా బోర్గోహైన్, మహిళల 75 కిలోల ఫైనల్లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రుజ్మెటోవా సోఖిబాను 5-0తో ఓడించి తన తొలి ఆసియా ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క ఇండిపెండెంట్ చైర్మనుగా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లేరెండేళ్ల కాలానికి ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. గ్రెగ్ బార్క్లే నవంబర్ 2020 నుండి ఐసీసీ ఉన్నారు. గ్రెగ్ బార్క్లే గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షులుగా కూడా పనిచేసి ఉన్నారు.

టీ20 ప్రపంచకప్‌ 2022 ఛాంపియన్‌గా ఇంగ్లండ్‌

2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్పును ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండులో జరిగిన ఫైనల్‌లో ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా పురుషుల టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. సామ్ కుర్రాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడు.

ఇంగ్లాండుకు ఇది రెండవ టీ20 ప్రపంచ కప్పు. దీనితో వెస్టిండీస్‌ తర్వాత 2 ప్రపంచ టీ20 టైటిల్స్‌ గెలిచిన రెండో జట్టుగా నిలిచింది. అలానే చివరిగా జరిగిన పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లను (టీ20 మరియు 50 ఓవర్లు) ఏకకాలంలో గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది. 2019 లో జరిగిన వన్డే ప్రపంచ కప్పులో ఇంగ్లాండ్ తన మొదటి ఒన్డే ప్రపంచ కప్ గెలుచుకుంది.

16 అక్టోబర్ నుండి 13 నవంబర్ 2022 మధ్య జరిగిన 2022 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్పుకు ఆస్ట్రేలియా ఆతిధ్యం ఇచ్చింది. ఇది మొత్తంగా 8 వ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్పు. 2007 లో ప్రారంభమైన ఈ టీ20 ప్రపంచ కప్పును మొదటిసారి భారత్ జట్టు గెలుచుకుంది. 2024 లో జరిగే టీ20 ప్రపంచ కప్పుకు వెస్ట్ ఇండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆతిధ్యం ఇవ్వనున్నాయి.

ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌ విజేతలు

దక్షిణ కొరియాలోని డేగులో జరుగుతున్నా ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్ 2022లో10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన అర్జున్ బాబుటా మరియు మెహులీ ఘోష్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అలానే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ యూత్ మహిళల ఈవెంట్‌లో కనిష్క డాగర్ కాంస్యం గెలుచుకున్నారు. అలానే పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో శివ నర్వాల్‌ బంగార పతకం గెలుచుకోగా, జూనియర్‌ పురుషుల విభాగంలో సాగర్‌ డాంగి స్వర్ణం సాధించాడు.

నవంబర్ 9 నుండి 19 మధ్య నిర్వహిస్తున్న 15 వ ఆసియా ఎయిర్‌గన్ ఛాంపియన్‌షిప్‌ 2022,  దక్షిణ కొరియాలోని డేగు ఇంటర్నేషనల్ షూటింగ్ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు.

బిల్లీ జీన్ కింగ్ కప్ 2022 స్విట్జర్లాండ్ సొంతం

గ్లాస్గోలో జరిగిన బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ మహిళల జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో బెలిండా బెన్సిక్ ఆస్ట్రేలియాకు చెందిన అల్జా టామ్‌లానోవిక్‌ను వరుస సెట్‌లలో 6-2 6-1తో ఓడించడం ద్వారా స్విట్జర్లాండ్ తొలిసారిగా బిల్లీ జీన్ కింగ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

బిల్లీ జీన్ కింగ్ కప్ అనేది ఇంటెర్నేషన్ విమెన్ టెన్నిస్ టోర్నమెంటు. ఇది 1963లో ఫెడరేషన్ కప్‌గా ప్రారంభించబడింది. ఆ తర్వాత దీనికి వరల్డ్ నెంబర్ 1 అమెరికా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ పేరుతొ నిర్వహిస్తున్నారు. ఈమె 1996లో ఒలింపిక్ బంగారు పతకం సాధించింది.

ఐటీటీఎఫ్'కు ఎన్నికైన తొలి భారతీయుడుగా శరత్ కమల్

ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITTF) అథ్లెట్స్ కమిషన్‌లో ఎన్నికైన మొదటి భారతీయ ఆటగాడిగా శరత్ కమల్ నిలిచాడు. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ మరియు ఓషియానియా నుండి అథ్లెట్ల కమిషన్‌కు నలుగురు పురుషులు మరియు నలుగురు మహిళలు సహా ఎనిమిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. వారు 2022 నుండి 2026 వరకు నాలుగు సంవత్సరాల పాటు సేవలందిస్తారు.

ఈ ఏడాది అందించిన జాతీయ క్రీడా అవార్డులలో దేశ అత్యున్నత క్రీడా గుర్తింపు అయిన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు శరత్ ఇప్పటికే ఎంపికయ్యాడు. ఈ నెలాఖరున ఆయన ఈ సన్మానాన్ని అందుకోనున్నారు.

నొవాక్ జకోవిచ్ ఖాతాలో 6వ ఏటీపీ టైటిల్

సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ తన కెరీరులో 6వ ఏటీపీ టైటిల్ సొంతం చేసుకున్నారు. నవంబర్ 20 న ఇటలీలోని పాలా ఆల్పిటూర్‌లో జరిగిన నిట్టో ఏటీపీ ఫైనల్స్‌లో నార్వేకి చెందిన కాస్పర్ రూడ్‌తో 7-5, 6-3తో విజయం సాధించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.

2015 తర్వాత జొకోవిచ్ ఏటీపీ టైటిల్ గెలవడం ఇదే మొదటి సారి. అలానే 35 ఏళ్ల వయసులో ఏటీపీ టైటిల్ గెలిచిన వ్యక్తిగా కూడా జొకోవిచ్ నిలిచాడు. ఈ విజయంతో రోజర్ ఫెదరర్ రికార్డును కూడా సమమం చేసాడు. ఏటీపీ టోర్నమెంట్ అనేది టెన్నిస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహించబడే పురుషుల టాప్-టైర్ టెన్నిస్ టూర్.

దోహాలో ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభం

ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయినా  ఫిఫా వరల్డ్ కప్ 2022 ఖతార్‌లోని అల్ బైట్ స్టేడియంలో నవంబర్ 20న గ్రాండ్ ఓపెనింగ్ వేడుకతో ప్రారంభమైంది. ఈ టోర్నమెంటు నవంబర్ 21 నుండి డిసెంబర్ 18 వరకు జరగనుంది. ఇందులో 32 టీంలు పోటీపడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఖతార్, ఈక్వెడార్‌తో తలపడింది.

ఇది అరబ్ దేశాలలో నిర్వహిస్తున్న మొదటి ప్రపంచ కప్ అలానే 2002 దక్షిణ కొరియా మరియు జపాన్‌లలో జరిగిన టోర్నమెంట్ తర్వాత పూర్తిగా ఆసియాలో జరుగుతున్నా రెండవ ప్రపంచ కప్.

ఖతార్‌ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన రికార్డులు, మహిళల పట్ల కఠిన నిబంధనలు, ఆల్కహాల్ నిషేధం, తీవ్రమైన వాతావరణం, బలమైన ఫుట్‌బాల్ సంస్కృతి లేకపోవడం మరియు ప్రపంచ కప్ సన్నాహాల్లో పాల్గొన్న విదేశీ కార్మికుల పట్ల ప్రవర్తించిన తీరు వంటివి ఖతార్‌ దేశానికి హోస్టింగ్ ఇవ్వడంపై తీవ్రమైన విమర్శలు వెలువడ్డాయి.

యంగెస్ట్ వరల్డ్  నెంబర్ 1 ఏటీపీ ప్లేయరుగా కార్లోస్ అల్కరాజ్

స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ పురుషుల ఏటీపీ టెన్నిస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన వరల్డ్ నంబర్ 1గా అవతరించాడు. 19 సంవత్సరాల 214 రోజుల వయస్సులో కార్లోస్ అల్కరాజ్  ఈ రికార్డు నమోదు చేసాడు. 2001లో 20 సంవత్సరాల 275 రోజుల వయస్సులో ప్రపంచ నెంబర్ 1గా లిలేటన్ హెవిట్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ రికార్డుతో పాటుగా కార్లోస్ అల్కరాజ్ తన మొదటి ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ సొంతం చేసుకున్నాడు.

కరాటేలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడుగా ప్రణయ్ శర్మ

భారత కరాటే స్టార్ ప్రణయ్ శర్మ, ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన కరాటే 1 సిరీస్ A లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. ప్రపంచ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో భారతీయుడు సాధించిన తొలి పతకం ఇదే. పురుషుల 67 కేజీల కుమిటే ఈవెంట్‌లో ఉక్రెయిన్‌కు చెందిన డేవిడ్ యానోవ్స్కీని ప్రణయ్ ఓడించడం ద్వారా ఈ అరుదైన ఘనతను సాధించారు.

ఆసియా కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మణికా బాత్రా

బ్యాంకాక్‌లోని హువామార్క్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌ 2022 లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మనిక బాత్రా జపాన్‌కు చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ హినా హయతాను ఓడించడం ద్వారా ఈ పతాకాన్ని దక్కించుకుంది. దీనితో ఆసియా కప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మణికా బాత్రా చరిత్ర సృష్టించింది.

5 ఫిఫా ప్రపంచకప్‌లలో గోల్ చేసిన మొదటి వ్యక్తిగా క్రిస్టియానో ​​రొనాల్డో

పోర్చుగీస్ స్ట్రైకర్ క్రిస్టియానో ​​రొనాల్డో ఐదు ఫిఫా ప్రపంచ కప్‌లలో స్కోర్ చేసిన మొదటి పురుష ఆటగాడిగా నిలిచాడు. 37 ఏళ్ళ రోనాల్డో పురుషుల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్ స్కోరరుగా ఉన్నాడు. అలానే ఫిఫా ప్రపంచ కప్‌లో పోర్చుగల్ తరపున రికార్డు స్థాయిలో 18 మ్యాచ్‌లు ఆడిన రికార్డు కలిగి ఉన్నాడు. తాజాగా ఫిఫా ప్రపంచ కప్‌లలో ఘనతో జరిగిన మ్యాచులో చేసిన గోల్, తన కెరీరులో 118వది.

Post Comment