Advertisement
10th తర్వాత ఉత్తమ కోర్సులు మరియు కెరీర్ అవకాశాలు
Career Guidance Career Options

10th తర్వాత ఉత్తమ కోర్సులు మరియు కెరీర్ అవకాశాలు

టెన్త్ క్లాస్ తర్వాత కోర్సులు మరియు ఉద్యోగ అవకాశాల వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. పాఠశాల విద్యకు టాటా చెప్పి, రంగురంగుల కాలేజీ జీవితానికి హాయ్ చెప్పే ఈ సమయంలో తల్లిందండ్రులు మరియు విద్యార్థుల మదిలో మెదిలే మొదటి ఆలోచన తర్వాత ఏంటి ?.

ఈ ఆలోచన ప్రవాహం ఈ ఒక్క ప్రశ్నతో ఆగేది కాదు. ఇంకో డజన్ ప్రశ్నలను క్యూలో పెడుతుంది. 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో తీసుకొవాలి, ఏ కాలేజీలో చేరాలి, ఏ స్ట్రీమ్‌కు భ్యవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది, ఏ గ్రూపులో చేరితే జీవితంలో త్వరగా స్థిరపడొచ్చు.. అసలూ ఉన్నత విద్యలో చేరాలా, లేక ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాలా ? ఇలా ఈ ప్రశ్నల ప్రవాహానికి అడ్డూఅదుపు ఉండదు.

ఇవి సరిపోవన్నట్లు పక్కంటి వారి సలహాలు, దారినపోయే దానయ్య సలహాలు, బంధువుల సలహాలతో బుర్ర మరికొంచెం వేడెక్కి  మిమ్మల్ని మరింత గందగోళం చేస్తాయి. మొదట ఈ గందగోళం పక్కనపెట్టి, మీకు సరిపడ కెరీర్ మార్గాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో, ఈ సమయంలో తల్లిదండ్రులు  పిల్లల్ని ఎలా  మార్గనిర్దేశం చెయ్యాలో పూర్తి వివరాలు ఇందులో తెల్సుకుందాం.

10వ తరగతి తర్వాత కెరీర్ ప్రణాళిక

10వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రధానంగా రెండు కెరీర్ దారులున్నాయి. మొదటిది ఆసక్తి  ఉన్న కోర్సును ఎంపిక చేసుకుని, ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగంలో లేదా వ్యాపారంలో స్థిరపడటం. ఇక రెండవది ఉద్యోగ ప్రయత్నం.

కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అందరికీ ఉన్నత చదువులు చదివే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి 10వ తరగతి తర్వాత ఉద్యోగం అనివార్యం కావొచ్చు. వీరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. ఇలాంటి వారు నెలల్లో పూర్తిఅయ్యే స్వయం ఉపాది కోర్సులు నేర్చుకుని అటువైపుగా కెరీర్ నిర్మించుకోవచ్చు.

After 10th class career options and streams

ఇలాంటి విద్యార్థులు కుటుంబానికి భారంకాకుండా ఓపెన్ స్కూలింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అంతే కాకుండా 10వ తరగతి తర్వాత గౌరవపరమైన కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం ఉంటుంది. 10వ తరగతి తర్వాత ఉన్నత చదువుల్లో చేరాలనుకునే ఆసక్తి, అభిరుచిని అనుచరించి ప్రధానంగా ఐదు కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి

  1. ఇంటర్మీడియట్
  2. పాలిటెక్నిక్
  3. ఐటీఐ
  4. పారామెడికల్
  5. ఒకేషనల్ కోర్సులు

10th తర్వాత ఉత్తమ కోర్సులు

10th తర్వాత ఇంటర్మీడియట్ గ్రూపులు

10వ తరగతి తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చూసే మెజారిటీ విద్యార్థులు ఇంటర్మీడియట్ కోర్సులను ఎంపిక చేసుకుంటారు. ఎవరైతే చిన్ననాటి నుండి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలు కంటారో, ఎవరైతే సైన్సు, హ్యుమానిటీస్, కామర్స్ సబ్జెక్టులలో ఉన్నత డిగ్రీలు పొందాలని తపన పడతారో, ఎవరికైతే శాస్త్రసాంకేతిక, వ్యవసాయ రంగాలలో పరిశోదనాత్మక ఆసక్తి ఉంటుందో వారందరూ ఇంటర్మీడియట్ కోర్సులలో చేరాల్సి ఉంటుంది.

అదే సమయంలో యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా చదవాలనుకునే వారందరికి ఇంటర్మీడియట్ గొప్ప ఎంపిక అవుతుంది. ఇంటర్మీడియట్ యందు విద్యార్థి తీసుకునే స్ట్రీమ్ ఎంపిక, తర్వాత రోజులలో వారి బంగారు కలలు నిజం చేసే గేటు పాసుల పనిచేస్తుంది.

ఇంటర్మీడియట్ విద్య రెండేళ్ల నిడివితో ఉంటుంది. తెలుగు రాష్ట్రలలో ఇంటర్ విద్య ప్రధానంగా ఐదు గ్రూపులుగా అందుబాటులో ఉంటుంది. ఇవి సైన్స్, ఆర్ట్స్ మరియు కామర్స్ విభాగాలకు సంబంధించినవై ఉంటాయి. విద్యార్థులు తమ భవిష్యత్ ఉన్నతవిద్య ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

  1. MPC : మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ
  2. BiPC : బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ
  3. CEC : కామర్స్, ఎకనామిక్స్ & సివిక్స్
  4. MEC : మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ & కామర్స్
  5. HEC : హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్

ప్రతి ఇంటర్మీడియట్ గ్రూపులో ఎంపిక చేసుకున్న స్ట్రీమ్ అనుచరించి నాలుగు ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. వీటితో పాటుగా ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ మరియు సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు/సంస్కృతం/ఉర్దూ లలో ఏదో ఒకదాన్ని ఆప్షనల్ సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుంది.

వీటితో పాటు రెండు కామన్ ఐచ్చికాలు కూడా ఉంటాయి. ఇక రెండో ఏడాదిలో సైన్స్ గ్రూపుల వారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవాలాజీ వంటి సబ్జెక్టులకు సంబంధించి ప్రయోగ పరీక్షలకు కూడా హాజరుఅవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ యందు సాధించిన మార్కుల ప్రభావం, భవిష్యత్తులో చేయబోయే ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలపై ఉంటుంది కాబట్టి, ఈ రెండేళ్లు కస్టపడి చదివితే ఆతర్వాత దశలో కెరీర్ గొప్పగా ఉంటుంది.

10th తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు

10వ తరగతి తర్వాత నేరుగా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి, సంబంధిత రంగంలో ఉద్యోగం పొందాలి అనుకునే వారికీ పాలిటెక్నిక్ కోర్సులు మంచి ప్రత్నామ్నాయం. పది తరువాత పాలీసెట్ ప్రవేశపరీక్ష ద్వారా ఈ డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు.

పాలిటెక్నిక్ కోర్సులలో చేరడం ద్వారా మీకు విలువైన సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఈ మూడేళ్ళ సాంకేతిక డిప్లొమా పట్టాతో స్వయంఉపాధి లేదా ఉద్యోగంలో స్థిరపడొచ్చు. లేదా ఉన్నత చదువుల్లో కూడా చేరొచ్చు.

పాలిటెక్నిక్ కోర్సులు సాధారణంగా గ్రామీణప్రాంత విద్యార్థులకు, ఉన్నత విద్య చదివేందుకు అవకాశం లేని మధ్యతరగతి విద్యార్థులకు మంచి ఎంపిక. మూడేళ్ళ డిప్లొమా పూర్తియ్యాక, మీకు ఒకవేళ ఉన్నతి స్థాయి ఇంజనీరింగ్ డిగ్రీ కావాలనుకుంటే ఈసెట్ ప్రెవేశ పరీక్ష ద్వారా నేరుగా ఇంజనీరింగ్ రెండవ ఏడాదిలో చేరే అవకాశం ఉంటుంది.

పాలీసెట్ ద్వారా ప్రవేశం పొందే కోర్సులు

  • డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • డిప్లొమా ఇన్ గర్మేంట్ టెక్నాలజీ
  • డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్

10th తర్వాత ఐటీఐ కోర్సులు

10వ తరగతి తర్వాత స్వయం ఉపాధి కోసం ఆలోచించే విద్యార్థులకు ఐటీఐ కోర్సులు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ కేటగిరీలలో ఉండే ఈ ఐటీఐ ట్రేడ్స్ మద్యతరగతి విద్యార్థులకు, గ్రామీణ నిరుపేద విద్యార్థులకు చక్కని ప్రత్నామ్నాయం.

10వ తరగతి కనీస అర్హుతతో కొన్ని నెలలో వ్యవధిలో జీవితంలో స్థిరపడే ఉద్యోగాన్ని లేదా స్వయంఉపాది కల్పించుకునే ధైర్యాన్ని మీకు ఈ కోర్సులు అందిస్తాయి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ట్రేడ్ ఎంపిక చేసుకోవాలి.

ఇండస్ట్రీకి అవసరమైన మానవ వనరుల అభివృద్ధి ప్రధమ లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీం ద్వారా 1950 లో ఐటీఐలను ప్రభుత్వం స్థాపించింది. నిరుద్యోగాన్ని తగ్గిస్తూ, మానవ వనరుల నైపుణ్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో అన్ని ప్రభుత్వాలు పనిచేయటంతో వీటికి గిరాకీ పెరిగింది.

ట్రేడ్స్‌గా పిలుచుకునే ఈ ఐటీఐ ట్రైనింగ్ కోర్సులు కనీస కాలవ్యవధి ఆరు నెలలనుండి రెండేళ్ల మధ్య ఉంటుంది. ట్రేడ్స్ కేటగిరి అనుచరించి కనీస విద్యా అర్హుత 8వ తరగతి నుండి ఇంటర్ మధ్య ఉంటుంది. ఇండస్ట్రీ అవసరాల దృష్ట్యా దాదాపు 130+ ట్రేడ్స్ మన తెలుగు రాష్ట్రాలలో  అందుబాటులో ఉన్నాయి. (వివిధ రకాల ఐటీఐ కోర్సులు, కాలవ్యవధి, సీట్స్ లభ్యత.)

టైనింగ్ పూర్తిచేసుకున్న ట్రైనీలకు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) నిర్వహించి, ఉత్తీర్ణతలకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) ని అందజేస్తారు. సర్టిఫికెట్ పొందక ఒక ఏడాది వివిధ ఇండస్ట్రీలలో  అప్రెంటిస్‌గా చెయ్యాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రతి నెల స్టైపండ్ కూడా అందజేజేస్తారు.

10th తర్వాత పారామెడికల్ కోర్సులు

10వ తరగతి తర్వాత పారామెడికల్ పూర్తిచేసిన వారికీ హాస్పిటల్స్ అత్యవసర విభాగాలలో ప్రధాన డాక్టర్లకు సహాయ సిబ్బందిగా పనిచేసే అవకాశం దొరుకుతుంది. అదే విధంగా అంబులన్స్ యందు ప్రధమ చికిత్స చేసేవారిగా, క్లినికల్ లాబ్స్ యందు వ్యాధి నిర్దారక పరీక్షలు చేసే ల్యాబ్ టెక్నిషియన్లుగా విధులు నిర్వర్తించవచ్చు.

హాస్పిటల్ బయట డాక్టర్ పర్యవేక్షణలో రోగికి క్లినికల్ సేవలు అందించే సిబ్బంది కూడా పారామెడికల్ విభాగానికి చెందుతారు. పారామెడికల్ కోర్సులు రెండేళ్ల నిడివితో అందుబాటులో ఉంటాయి. వీటిలో డిమాండ్ ఉండే కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా గౌరవప్రధంగా జీవితంలో స్థిరపడే అవకాశం లభిస్తుంది.

  • DMLT (డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ)
  • DHFM (డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ ఫుడ్ టెక్నాలజీ  మేనేజిమెంట్)
  • DOT (డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్)
  • ఫీజియోథెరఫీ

10th తర్వాత ఒకేషనల్ ఎడ్యుకేషన్

10వ తరగతి తర్వాత స్వయంఉపాధిని అందించే వృత్తివిద్యా కోర్సులు అన్నీ ఈ ఒకేషనల్ కేటగిరీ కిందకి వస్తాయి. రెండేళ్ల కాలవ్యవధి గల ఈ  కోర్సులు పూర్తి చేసాక మీకు మీరుగా స్వయంఉపాధిని పొందటమే కాకుండా, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో, బ్యాంకింగ్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, పర్యాటక రంగాలలో ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. పది తర్వాత అందుబాటులో ఉన్న నాన్ టెక్నికల్ ఒకేషనల్ కోర్సులు..

  • బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ కోర్సులు
  • అగ్రికల్చర్ మరియు వెటర్నరీ సైన్స్ కోర్సులు
  • డిప్లొమా ఇన్ ఇన్సూరెన్సు మరియు మార్కెటింగ్
  • ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్
  • వెబ్ డిజైనింగ్ మరియు మల్టీమీడియా
  • హోటల్ ఆపరేటింగ్ కోర్సులు
  • డెంటల్ టెక్నిషియన్
  • టూరిజం మరియు ట్రావెల్ గైడ్స్  ఇలా 30 వరకు సర్టిఫికెట్ కోర్సులున్నాయి.

10th తర్వాత ఉద్యోగ అవకాశాలు

10వ తరగతి తర్వాత కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులందరికీ ఉన్నత చదువులు చదివే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటి వారికీ 10వ తరగతి తర్వాత ఉద్యోగం అనివార్యం కావొచ్చు. ఇలాంటి వారు 10వ తరగతి తర్వాత అర్హుతతో గౌరవపరమైన కేంద్రప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం ఉంది.

టెన్త్ తర్వాత డిఫన్స్ ఉద్యోగాలు

త్రివిధ దళాలు:కేంద్ర రక్షణశాఖ పరిధిలో  ఉండే త్రివిధ దళాలు పది అర్హుతలో కూడిన వివిధరకాల ఉద్యోగుల భర్తీ నిమిత్తం ప్రకటనలుజారీ చేస్తూ ఉంటాయి. కొన్ని సమయాలలో జిల్లా, పట్టణ ప్రధానకేంద్రాలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కూడా భర్తీ చేస్తుంటాయి.

10వ తరగతి తర్వాత ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు

  • ఇండియన్ ఆర్మీ సోల్జర్ క్లార్క్స్  ఎగ్జామినేషన్
  • ఇండియన్ ఆర్మీ సోల్జర్ జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్ (NER)
  • ఇండియన్ ఆర్మీ సోల్జర్ టెక్నికల్ ఎగ్జామినేషన్ (MER)
  • ఇండియన్ ఆర్మీ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ (MER)
  • ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఉద్యోగాలు

10వ తరగతి తర్వాత ఇండియన్ నేవీ ఉద్యోగాలు

  • ఇండియన్ నేవీ డాక్ యార్డ్ అప్రెంటిస్ ఎగ్జామినేషన్
  • ఇండియన్ నేవీ సైలెర్స్ మెట్రిక్ ఎంట్రీ రెక్యూప్మెంట్ ఎగ్జామినేషన్
  • ఇండియన్ నేవీ ఆర్టిఫీసర్ అప్రెంటిస్ ఎగ్జామినేషన్
  • ఇండియన్ నేవీ అగ్నివీర్ ఉద్యోగాలు

10వ తరగతి తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు

  • IAF ఎయిర్ మ్యాన్ నాన్-టెక్నికల్ ట్రేడ్స్ ఎగ్జామినేషన్
  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఉద్యోగాలు

10వ తరగతి తర్వాత ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్స్
  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF ) కానిస్టేబుల్ రెక్యూప్మెంట్
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్: మల్టీ టాస్క్ స్టాఫ్ రెక్యూప్మెంట్ - వెబ్సైటు
  • అటవీ శాఖ : ఫారెస్ట్ బీట్ గార్డ్స్ వెబ్సైటు: APPSC
  • RRB కానిస్టేబుల్ రెక్యూప్మెంట్ -వెబ్సైట్: ఇండియన్ రైల్వే సికింద్రాబాద్
  • గ్రూపు 4 ఉద్యోగాలు వెబ్సైటు: APPSC , TSPSC

Post Comment