తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 10 ఏప్రిల్ 2023 ఉచితంగా పొందండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, బ్యాంకింగ్ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఔత్సాహికుల కోసం తాజాగా చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను పోటీ పరీక్షల దృక్కోణంలో అందిస్తున్నాం.
సుఖోయ్‌లో ప్రయాణించిన 3వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి మరియు సాయుధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము, ఏప్రిల్ 8న అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో భారత వైమానిక దళం యొక్క సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించి అరుదైన గుర్తింపును పొందారు. దీనితో ఈ ఘనత దక్కించుకున్న మూడవ భారత రాష్ట్రపతిగా మరియు రెండవ మహిళా అధ్యక్షురాలుగా అవతరించారు. 30 నిముషాల ఈ ప్రయాణంలో ఆమె హిమాలయాలు, బ్రహ్మపుత్ర మరియు తేజ్‌పూర్ లోయలను వీక్షించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
2006లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సుఖోయ్‌లో ప్రయాణించిన మొదటి భారత రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. 2009లో భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి మహిళా అధ్యక్షరాలుగా నిలిచారు. అలానే సుఖోయ్ యుద్ధ విమానాన్ని నడిపిన భారతదేశపు తొలి మహిళా పైలట్ ఘనతను అవనీ చతుర్వేది దక్కించుకున్నారు.
సుఖోయ్-30ఎంకేఐ అనేది భారత వైమానిక దళం కోసం రష్యాకి చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బహుళ పోరాట యుద్ధ విమానం. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో ఉపయోగించేందుకు అనువుగా ఉంటుంది. 18,400 కిలోల బరువు ఉండే ఈ యుద్ధ విమానం 3,000 కి.మీ పరిధిలో గంటకు 2,120 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. 1997లో మొదటి సుఖోయ్-30ఎంకేఐ విమానం భారత వైమానికదళంలో చేరింది.
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8 న హైదరాబాద్‌లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇదివరకే గడిసిన జనవరి 15న, సికింద్రాబాద్ మరియు విశాఖపట్నం మధ్య మొదటి వందే భారత్ రైలు సర్వీస్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇది మొత్తంగా దేశంలో 12వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
ఇదే రోజున చెన్నై - కోయంబత్తూరు వందే భారత్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది తమిళనాడుకు 2వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అలానే మొత్తంగా దేశంలో 13వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇండియన్ రైల్వే మొత్తం 478 వందే భారత్ రైళ్లు నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ - వారణాసి మధ్య ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వే నడుపుతున్న ప్రతిష్టాత్మక ఆధునిక సెమీ-హై స్పీడ్ రైలుగా పరిగణించ బడుతుంది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇవి గరిష్టంగా గంటకు 160 కిమీ వేగంతో నడుస్తాయి. ఇవి భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రూట్ | దూరం & సమయం | ప్రారంభ తేదీ | |
---|---|---|---|
1 | న్యూఢిల్లీ - వారణాసి | 759 కిమీ & 8 గం | 15 ఫిబ్రవరి 2019 |
2 | న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా | 655 కిమీ & 8 గం | 3 అక్టోబర్ 2019 |
3 | ముంబై సెంట్రల్ - గాంధీనగర్ | 522 కిమీ & 6.25 గం | 30 సెప్టెంబర్ 2022 |
4 | న్యూఢిల్లీ - అంబ్ అందౌర | 412 కిమీ & 5.15 గం | 13 అక్టోబర్ 2022 |
5 | చెన్నై సెంట్రల్ - మైసూరు | 496 కిమీ & 6.30 గం | 11 నవంబర్ 2022 |
6 | బిలాస్‌పూర్ - నాగ్‌పూర్ | 412 కిమీ & 5.30 గం | 11 డిసెంబర్ 2022 |
7 | హౌరా - న్యూ జల్పైగురి | 565 కిమీ & 7.30 గం | 30 డిసెంబర్ 2022 |
8 | విశాఖపట్నం - సికింద్రాబాద్ | 698 కిమీ & 8.30 గం | 15 జనవరి 2023 |
9 | ముంబై సెంట్రల్ - షోలాపూర్ | 452 కిమీ & 6.30 గం | 10 ఫిబ్రవరి 2023 |
10 | ముంబై సెంట్రల్ - సాయినగర్ షిర్డీ | 339 కిమీ & 5.20 గం | 10 ఫిబ్రవరి 2023 |
11 | రాణి కమలాపతి - ఢిల్లీ | 702 కిమీ & 7.30 గం | 1 ఏప్రిల్ 2023 |
12 | సికింద్రాబాద్ - తిరుపతి | 661 కిమీ & 8.30 గం | 8 ఏప్రిల్ 2023 |
13 | చెన్నై - కోయంబత్తూరు | 411 కిమీ & 6.15 గం | 8 ఏప్రిల్ 2023 |
14 | ఢిల్లీ కంటోన్మెంట్ - అజ్మీర్ | 428 కిమీ & 5.15 గం | 12 ఏప్రిల్ 2023 |
15 | తిరువనంతపురం - కాసరగోడ్ | 587 కిమీ & 8.05 గం | 25 ఏప్రిల్ 2023 |
భారత్‌కు అగ్రశ్రేణి ముడి చమురు సరఫరాదారునిగా కొనసాగుతున్న రష్యా
గత ఆరు నెలలుగా భారత్‌కు ముడి చమురు సరఫరాలో రష్యా అగ్రస్థానంలో కొనసాగుతుంది. రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు మార్చిలో రోజుకు 1.64 మిలియన్ బ్యారెళ్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 2022లో రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభంకు ముందు సౌదీ అరేబియా, ఇరాక్ వంటి సాంప్రదాయ పెట్రోలియం దేశాల నుండి భారత్ అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునేది.
అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దాదాపు గత డిసెంబర్ నుండి అన్నీ యూరోపియన్ దేశాలు రష్యా ముడి చమురు దిగుమతిపై నిషేధం విధించాయి. దీనితో రష్యా, తన ఇంధన ఎగుమతులలో అంతరాన్ని పూడ్చేందు డిస్కౌంట్ రేటులో ముడి చమురును సరఫరా చేసేందుకు మిత్ర దేశమైన ఇండియాకు ఆఫర్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న భారత ప్రభుత్వం, సాంప్రదాయ సరఫరాదారులను పక్కన పెట్టి రష్యా నుండి రికార్డు స్థాయిలో దిగుమతి చేసుకుంటుంది.
ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా నివేదిక ప్రకారం గడిసిన ఆరు నెలలో భారతదేశం దిగుమతి చేసుకున్న మొత్తం చమురులో మూడింట ఒక వంతు రష్యా నుండి తీసుకోబడింది. రష్యా తర్వాత రెండవ అత్యధిక సరఫరాదారునిగా సౌదీ అరేబియా కొనసాగుతుంది. మూడవ స్థానంలో ఇరాక్ ఉంది.
ఆన్‌లైన్ గేమింగ్ కోసం కొత్త నిబంధనలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి ఏప్రిల్ 7న కొత్త నిబంధనలను విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పందెం లేదా బెట్టింగ్‌తో కూడిన రియల్ మనీ గేమింగ్ వేదికలను నిషేధిస్తుంది. ఈ కొత్త నిబంధనలు అనుమతించదగిన ఆన్‌లైన్ గేమ్‌లను, పందెం వేయని, హానికరమైన కంటెంట్‌ను ఉపయోగించని మరియు యువ వినియోగదారులకు ఎలాంటి వ్యసనపరుడైన పరిణామాలను సృష్టించని ఆటలను మాత్రమే అనుమతిస్తుంది.
అయితే డబ్బును సేకరించే కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల కోసం బహుళ స్వీయ-నియంత్రణ సంస్థల (ఎస్‌ఆర్‌ఓ) ఫ్రేమ్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం సంబంధిత సంస్థలు, వినియోగదారులు కెవైసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రంగానికి స్వీయ నియంత్రణ నమూనాను ఎంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల పరిశ్రమలోని ఆటగాళ్లు, గేమర్‌లు, విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు మరియు పిల్లల హక్కులను పరిరక్షించడం కోసం ఈ ఫ్రేమ్‌వర్క్ పనిచేయనుంది.
వాయు కాలుష్యా పర్యవేక్షణ కోసం టెంపో అనే పరికరాన్ని ప్రయోగించిన నాసా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, వాయు కాలుష్యాన్ని ట్రాక్ చేయడానికి టెంపో అనే శక్తివంతమైన పరికరాన్ని ఏప్రిల్ 7న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. టెంపో (TEMPO) అనగా ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్: మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ అని అర్ధం. ఈ పరికరం ఉత్తర అమెరికా మీదుగా పగటిపూట అంతరిక్షం నుండి గాలి నాణ్యతను విశ్లేషించి రోజువారీ నివేదికను అందిస్తుంది. ఇది వాయు కాలుష్య స్థాయిలను కొలవగల మొదటి అంతరిక్ష పరికరం అని నాసా పేర్కొంది.
లైసెన్సింగ్ కోసం ఆర్‌బిఐ కేంద్రీకృత పోర్టల్ 'ప్రవాహ్' ప్రారంభం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నియంత్రిత సంస్థలకు వ్యాపార అనుమతి సులభతరం చేయడం కోసం 'ప్రవాహ్' పేరుతో సురక్షితమైన వెబ్ ఆధారిత కేంద్రీకృత పోర్టల్‌ను ప్రారంభించింది. ఆర్‌బిఐ దేశంలోని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మరియు ఫిన్‌టెక్ కంపెనీలతో కూడిన ఆర్థిక రంగాన్ని నియంత్రిస్తుంది. ఈ సంస్థలు దేశంలో ఆర్థిక వ్యాపారాలు నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సంబంధిత లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది.
ఈ లైసెన్స్‌లు పొందాలంటే వాణిజ్య సంస్థలు తప్పనిసరిగా కొన్ని ప్రమాణాలను పూర్తి చేయాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ చట్టాలు/నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ నుండి లైసెన్స్/అధీకృతం లేదా రెగ్యులేటరీ అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేయడానికి ఆన్‌లైన్ మరియు ఆఫ్-లైన్ మోడ్‌లలో అవకాశం ఉంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం మరియు సెక్యూర్ చేసేందుకు 'ప్రవాహ్' పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రవాహ్ (PRAVAAH) అనగా ప్లాట్‌ఫారమ్ ఫర్ రేగులటరీ అప్లికేషన్, వాలిడేషన్ అండ్ అథారైజేషన్ అన్ని అర్ధం.
ముద్రా పథకం కింద 23 లక్షల కోట్ల రుణాలు మంజూరు
ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద గడిసిన ఎనిమిదేళ్లలో రూ. 23.2 లక్షల కోట్ల రుణాలను 40.82 కోట్ల రుణ ఖాతాలలో మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకాన్ని 8 ఏప్రిల్ 2015న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న మరియు సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు, బ్యాంకుల ద్వారా 10 లక్షల వరకు రుణాలను సులువుగా అనుషంగిక రహిత మైక్రో-క్రెడిట్ విధానంలో అందిస్తారు. ఈ పథకం దేశంలోని వర్ధమాన పారిశ్రామికవేత్తలకు సులభంగా క్రెడిట్ లభ్యతను కల్పిస్తుంది.
ముంబైలో ఇండియన్ నేవీ ఆఫ్‌షోర్ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్ 'ప్రస్థాన్'
చమురు ఉత్పత్తి ప్లాట్‌ఫారమ్‌లలో సంభవించే ఆకస్మిక పరిస్థితులను నియంత్రించడానికి భారత నౌకాదళం ఆఫ్‌షోర్ భద్రతా వ్యాయామం ప్రస్థాన్‌ను ఏప్రిల్ 6న మహారాష్ట్రలోని ముంబైలోని ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ఏరియాలో నిర్వహించారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో సంవత్సరానికి రెండుసార్లు ఈ ప్రస్థాన్ ఎక్సర్‌సైజ్ నిర్వహిస్తారు. ఇందులో భారత నౌకాదళంలో పాటుగా రాష్ట్ర మరియు ఇతర పౌర సంస్థల రక్షణ వర్గాలు పాల్గొంటాయి.
కుమరకోమ్‌లో జీ20 డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశం
జీ20 డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ రెండవ సమావేశం ఏప్రిల్ 7న కేరళలోని కుమరకోమ్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక అభివృద్ధిలో డిజిటల్ టెక్నాలజీ ఆవశ్యకతపై అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ మరియు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థల నిపుణులు సంబంధిత ప్రణాలికను ప్రదర్శించారు. కాగా భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీలో మొదటి డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశను 13 డిసెంబర్ 2022న ముంబై నగరంలో నిర్వహించారు.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాళికేష్ నారాయణ్ సింగ్
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) నూతన అధ్యక్షుడిగా కాళికేష్ నారాయణ్ సింగ్ డియో ఏప్రిల్ 6న బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఈ హోదాలో ఉన్న రణిందర్ సింగ్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిన నేపథ్యంలో ఆయన స్థానంలో కాళికేష్ నారాయణ్ సింగ్ నియమితులయ్యారు.
నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను దేశంలో షూటింగ్ క్రీడలను ప్రోత్సహించడం మరియు ప్రాచుర్యం కల్పించడం కోసం 1951లో స్థాపించారు. లోక్‌సభ తొలి స్పీకర్ జివి మావ్లాంకర్ దీని వ్యవస్థాపక అధ్యక్షుడుగా వ్యవహరించారు.
అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల క్లబ్‌లో ఢిల్లీ
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) 2022 నివేదిక ప్రకారం, ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల క్లబ్‌లో చేరింది. ఈ జాబితాలో ఢిల్లీ విమానాశ్రయం 9వ స్థానంలో నిలవగా, అట్లాంటాలోని హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా రెండవ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాలు
- హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం
- డల్లాస్/ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం
- డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం
- చికాగో ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం
- దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఇస్తాంబుల్ విమానాశ్రయం
- హీత్రూ విమానాశ్రయం
- ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- పారిస్ చార్లెస్ డి గల్లె విమానాశ్రయం
గౌహతి హెచ్‌సి ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్మూ
గౌహతి హైకోర్టు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఏప్రిల్ 8న జరిగిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హాజరయ్యారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ఆమోదించబడిన తర్వాత 1 మార్చి 1948న గౌహతి హైకోర్టును అప్పటి భారత గవర్నర్ జనరల్ ప్రకటించారు. గౌహతి హైకోర్టు, అస్సాం రాష్ట్రంతో పాటుగా నాగాలాండ్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో సేవలు అందిస్తుంది. దేశంలో గోవా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం మరియు నాగాలాండ్‌లకు సొంత హైకోర్టు అందుబాటులో లేదు.
ఇదే వేదిక ద్వారా అస్సాం మహిళలు మరియు వృద్ధుల భద్రత కోసం రూపొందించిన మొబైల్ యాప్ 'భోరోక్సా'ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు. అలానే గౌహతిలో మౌంట్ కాంచన్‌జంగా యాత్రను, కజిరంగా నేషనల్ పార్క్‌లో గజ్ ఉత్సవ్-2023ను కూడా రాష్ట్రపతి ఫ్లాగ్ చేశారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తయిన ఈ కార్యక్రమాన్ని కాజిరంగాలో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా హాజరయ్యారు
2023 టైమ్100 రీడర్ పోల్‌లో షారుక్ ఖాన్‌కు అగ్రస్థానం
టైమ్ మ్యాగజైన్ వార్షిక టైమ్ 100 రీడర్ పోల్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టైమ్ యొక్క అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులకు సంబంధించిన రీడర్స్ పోల్ యందు షారుఖ్ ఖాన్ మొదటిస్థానం దక్కించుకోగా, ఇరాన్ మహిళల హక్కుల కోసం పోరాడిన మహ్సా అమినీ రెండవ స్థానంలో నిలిచారు.
మూడు మరియు నాల్గవ స్థానాలలో ప్రిన్స్ హ్యారీ మరియు మేఘన్ మార్క్లేలు ఉండగా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్కార్ విజేత మిచెల్ యోహ్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ , మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరియు బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా వంటివారు కూడా చోటు దక్కించుకున్నారు. అలానే తెలుగు దర్శుకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
క్రెడిట్ కార్డ్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలకు అనుమతి
క్రెడిట్ కార్డ్‌ల ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) చెల్లింపులు జరిపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అనుమతిని మంజూరు చేసింది. దీనితో బ్యాంకుల నుండి ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ పరిమితి ఉన్న వ్యక్తులు త్వరలో యుపిఐ లావాదేవీలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం ప్రస్తుతం యుపిఐ చెల్లింపులు డిపాజిట్ ఖాతాల డెబిట్ కార్డులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డు వినియోగదారులకు జూన్ 2022 నుండి ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
ఇండియన్ స్పేస్ పాలసీ 2023కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
దేశ అంతరిక్ష రంగంలో స్పేస్‌టెక్ స్టార్టప్‌లు మరియు ప్రైవేట్ సంస్థల పాత్రను పెంపొందించే లక్ష్యంతో ఇండియన్ స్పేస్ పాలసీ 2023కి భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 భారతదేశంలో స్పేస్‌టెక్ స్టార్టప్‌ల వృద్ధిని మరింత పెంపొందించడంతో పాటుగా అంతరిక్షరంగంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరియు ఇతర ప్రైవేట్ ఎంటిటీల పాత్రను మరియు బాధ్యతలను గుర్తుచేస్తుంది.
అంతరిక్ష పరిశ్రమలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా 2020లో సింగిల్ విండో నోడల్ ఏజెన్సీగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce)ను ప్రారంభించింది. 2019లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను సులభతరం చేయడానికి న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)ని స్థాపించింది. ఈ కార్యక్రమాలు రాకెట్-బిల్డింగ్, శాటిలైట్ మ్యాపింగ్ వంటి వివిధ స్పేస్‌టెక్ ఉప-విభాగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించాయి.
135.95 లక్షలు దాటిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ చందాదారులు
2022-23 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) మరియు అటల్ పెన్షన్ యోజన (APY) పథకాల కింద మొత్తం చందాదారుల సంఖ్య 1.35 కోట్ల మార్క్‌ను దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీవై కింద చందాదారుల సంఖ్య కోటి 19 లక్షలకు పైగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది భారతదేశంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీచే నియంత్రించబడే కంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార పరిధిలో ఉంది. 2004 తరువాత చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంప్రదాయ పించను పద్ధతిని రద్దు చేసి కొత్త పించను పతాకాన్ని ప్రవేశ పెట్టారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టం లేదా ఎన్.పి.ఎస్ ను తప్పనిసరి చేశాయి.
అటల్ పెన్షన్ యోజనను గతంలో స్వావలంబన్ యోజన అని పిలిచేవారు. ఇది కూడా భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార పరిధిలోనే ఉంది. ఇది ప్రధానంగా అసంఘటిత రంగాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. 2015లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో దీనిని ప్రస్తావించారు. దీనిని 9 మే 2015న కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అటల్ పెన్షన్ యోజన పదవీ విరమణ తర్వాత గ్యారెంటీ పెన్షన్ హామీ ఇస్తుంది.
2022లో భారతదేశం 6.19 మిలియన్ల విదేశీ పర్యాటకులకు ఆతిథ్యం
2022లో భారతదేశం 6.19 మిలియన్ల విదేశీ పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చినట్లు భారత పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2019 ప్రీ-పాండమిక్ ముందు భారతదేశంకు ఏటా 10.93 మిలియన్ల వరకు విదేశీ పర్యాటకులు సందర్శించే వారని, అయితే కోవిడ్ తర్వాత గత రెండేళ్లలో ఈ సంఖ్య 1 నుండి 1.52 మిలియన్లకు పడిపోయిందని వెల్లడించింది.
భారత ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన స్వదేశ్ దర్శన్, ప్రసాద్ మరియు కేంద్ర ఏజెన్సీలకు సహాయం వంటి పథకాల ద్వారా గత ఏడాది విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు తొలగిపోవడం కూడా దీనికి దోహదం చేసిందని తెలిపింది. అలానే దేశ వ్యాప్తంగా పర్యాటక సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/కేంద్ర ఏజెన్సీలకు కేంద్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని వెల్లడించింది.
భారత పర్యాటక మంత్రిత్వ శాఖ, విదేశీ పర్యాటకుల సౌలభ్యం కోసం జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, చైనీస్, సహా 12 అంతర్జాతీయ భాషల్లో టోల్ ఫ్రీ నంబర్ 1800111363 అందుబాటులో ఉంచింది. దాదాపు 166 దేశాల జాతీయులకు ఇ-టూరిస్ట్ వీసా, ఇ-బిజినెస్ వీసా, ఇ-మెడికల్ వీసా, ఇ-మెడికల్ అటెండెంట్ వీసా మరియు ఇ-కాన్ఫరెన్స్ వీసా వంటి 5 రకాల ఇ-వీసాలను పొందే సౌకర్యం కల్పిస్తుంది. అదే సమయంలో ఇ-వీసా ప్రక్రియను సులభతరం చేయడంతో పాటుగా, వాటి రుసుములను కూడా భారీగా తగ్గించింది.
7,500/- లోపు చార్జీలు ఉంటే హోటళ్లలో జీఎస్టీని 18 నుండి 12 శాతానికి తగ్గించింది. ఉడాన్ పథకం కింద పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గుర్తించిన విమానయాన సంస్థలకు 59 పర్యాటక మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యల ద్వారా 2022 ఏడాదిలో విదేశీ పర్యాటకుల ద్వారా రూ. 1,34,543 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించినట్లు ఈశాన్య ప్రాంత సాంస్కృతిక, పర్యాటక, అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు.
డిబ్రూఘర్‌లో అంతర్జాతీయ యోగా మహోత్సవ్ 2023 ప్రారంభం
కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ డిబ్రూఘర్ యూనివర్సిటీ ప్లేగ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా మహోత్సవాన్ని ఏప్రిల్ 6న జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ మరియు అస్సాం, మేఘాలయ, మణిపూర్‌ల ఆరోగ్య మంత్రులు హాజరయ్యారు. ఈ వేడుకను ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 75 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమంగా జరుపుకుంటారు. ఈ 75 రోజుల్లో యోగా సాధన వల్ల కలిగే ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాల కోసం అవగాహన కల్పిస్తారు.
ఇ-ప్రొక్యూర్‌మెంట్‌లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఈశాన్య రాష్ట్రంగా త్రిపుర
ఇ-ప్రొక్యూర్‌మెంట్ అమలులో ఈశాన్య రాష్ట్రాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా త్రిపుర అవార్డు దక్కించుకుంది. సౌభాగ్య యోజన, ఎంపవర్మెంట్ ఆఫ్ పంచాయత్స్ వంటి వివిధ సెక్టర్లలో ప్రభుత్వం చూపిన పనితీరు ఆధారంగా ఈ అవార్డు గెలుచుకుంది. త్రిపుర ప్రభుత్వం రూ. 25000/- దాటి చేసే అన్ని రకాల ప్రభుత్వ కొనుగోళ్లకు ఇ-ప్రొక్యూర్‌మెంట్ తప్పనిసరి చేసింది.
ఇ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ చిన్న మరియు మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ టెండర్లను దక్కించుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వ వస్తువులు మరియు సేవల విక్రేతలకు పన్ను ఎగవేతకు అవకాశంలేకుండా చేస్తుంది. అలానే దేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా విక్రేతలు ఇ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది.
ఇ-ప్రొక్యూర్‌మెంట్ అనేది డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రభుత్వ లేదా కంపెనీల నుండి ఉత్పత్తులు మరియు సేవల ఎలక్ట్రానిక్ కొనుగోలుకు అనుమతిస్తుంది. ఇది కొనుగోలుదారుడు మరియు విక్రేతల మధ్య ఆన్‌లైన్ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది. అలానే ఇ-ప్రొక్యూర్‌మెంట్ సాధనాలు కొనుగోలుదారుల గత కొనుగోళ్ల చరిత్రను మరియు విక్రేత పనితీరు సంబంధిత డేటాను సేకరించి నిర్వహించడానికి అనుమతిస్తాయి.
ఫిఫా ర్యాంకింగ్‌లో అర్జెంటీనా అగ్రస్థానం
తాజా 2022 ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా ఆరేళ్లలో మొదటిసారి ఫిఫా ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా ఏప్రిల్ 6న విడుదల చేసిన ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగులో అర్జెంటీనా నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ జట్టు 2వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో, బెల్జిజం 4వ స్థానంలో మరియు ఇంగ్లాండ్ 5వ స్థానంను దక్కించుకున్నాయి. తర్వాత ఫిఫా ర్యాంకింగ్ ఈ ఏడాది జులైలో విడుదల చేయబడుతుంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడా యజమానిగా ముకేశ్ అంబానీ
ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితాలో స్టీవ్ బాల్మర్‌ను ఓడించి ప్రపంచ అత్యంత ధనిక క్రీడా యజమానిగా ముఖేష్ అంబానీ అవతరించారు. ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ గ్రూపు యాజమాన్యంలో ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టుతో పాటుగా, ఇటీవలే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అలానే దక్షిణాఫ్రికా మరియు యూఏఈలలో క్రికెట్ జట్లను కలిగి ఉంది.
టాప్ 5 ధనిక క్రీడా జట్టు యజమానులు
క్రీడా యజమాని | జాతీయత | క్రీడా జట్టు | నికర విలువ |
---|---|---|---|
ముఖేష్ అంబానీ | భారతదేశం | ముంబై ఇండియన్స్ | $83.4 బిలియన్లు |
స్టీవ్ బాల్మెర్ | అమెరికా | లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ | $80 బిలియన్లు |
రాబ్ వాల్టన్ | అమెరికా | డెన్వర్ బ్రోంకోస్ | $57.6 బిలియన్లు |
ఫ్రాంకోయిస్ పినాల్ట్ | ఫ్రాన్స్ | స్టేడ్ రెన్నైస్ ఎఫ్సీ | $40.1 బిలియన్లు |
మార్క్ మాటెస్చిట్జ్ | ఆస్ట్రియా | న్యూయార్క్ రెడ్ బుల్స్ | $34,7 బిలియన్లు |
భారత వెయిట్‌లిఫ్టర్ సంజితా చానుపై నాలుగేళ్ల నిషేధం
రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన భారత వెయిట్ లిఫ్టర్ సంజితా చానుపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాలుగు సంవత్సరాల నిషేధం విధించింది. సంజితా చాను నిషేధిత డ్రగ్స్‌కు పాజిటీవ్ అయినందున ఈ నిషేదానికి గురయ్యింది. సంజితా చాను గత దశాబ్దంలో భారతదేశపు అత్యంత విజయవంతమైన వెయిట్ లిఫ్టర్లలో ఒకరు. ఈమె 2014 మరియు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాలను గెలుపొందింది. 2011 ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో గుజరాత్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ సమయంలో చేసిన డ్రోపింగ్ పరీక్షలలో ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా)చే నిషేధించబడిన అనాబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్ డ్రోస్టానోలోన్ పాజిటివ్ వచ్చినట్లు నాడా వెల్లడించింది. డ్రోస్టానోలోన్ డ్రగ్‌ను సాధారణంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే అథ్లెట్లు ఈ స్టెరాయిడ్‌ను తమ పనితీరును మెరుగుపర్చేందుకు దుర్వినియోగం చేస్తున్నారు.
సంజితా చాను డోపింగ్ నెట్‌లో పడటం ఇదే మొదటిసారి కాదు. 2017లో యునైటెడ్ స్టేట్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలో అనాబాలిక్ స్టెరాయిడ్ టెస్టోస్టెరాన్‌కు పాజిటివ్‌గా తేలడంతో 2018లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWF) సంజితా చానుపై నిషేధం విధించింది. అయితే ఈ ఆరోపణలను 2020లో అనుకూల రిపోర్టులు రావడంతో తొలగించబడింది.
డిజిలాకర్‌తో ఖేలో ఇండియా గేమ్స్ సర్టిఫికేట్లు అనుసంధానం
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటిసారిగా డిజిలాకర్‌తో ఖేలో ఇండియా గేమ్స్ సర్టిఫికేట్‌లను అనుసంధానం చేసింది. దీనితో ఖేలో ఇండియా గేమ్స్‌లో పాల్గొనే అథ్లెట్లు మరియు ఇతర వాటాదారులు తమ మెరిట్ మరియు భాగస్వామ్య ధృవీకరణ పత్రాలను డిజిలాకర్ ద్వారా యాక్సెస్ పొందొచ్చు. ఈ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నుండి అందుబాటులో ఉంటాయి.
డిజిలాకర్ అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్. దీనిని 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది పేపర్‌లెస్ గవర్నెన్స్ ఆలోచన చొరవతో రూపొందించబడింది. ఇది డిజిటల్ పద్ధతిలో డాక్యుమెంట్‌లు & సర్టిఫికెట్‌ల జారీ మరియు ధృవీకరణ కోసం వేదికను అందిస్తుంది. డిజిలాకర్ ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
54 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా
ఏప్రిల్ 6న హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో 54 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఇదే ఆలయంలో దాదాపు 4 వేల మంది యాత్రికులకు ఒకేసారి సేవలందించగల కొత్త కమ్యూనిటీ కిచెన్‌ను కూడా ప్రారంభించారు.
హోండా కొత్త అధ్యక్షుడిగా సుట్సుము ఒటాని
హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా కొత్త ప్రెసిడెంట్, సీఈఓ మరియు ఎండీగా సుట్సుము ఒటాని నియమితులయ్యారు. 1997లో హోండా జపాన్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఒటానీ, ఆ కంపెనీ గ్లోబల్ బిజినెస్‌లో వివిధ నాయకత్వ స్థానాలలో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జపాన్‌లోని హోండా మోటార్ యొక్క వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుత హోండా మోటార్‌సైకిల్ అధ్యక్షుడుగా ఉన్న అట్సుషి ఒగాటా, చైనాలోని షాంఘైకి ఎగ్జిక్యూటివ్ జనరల్‌గా వెళ్లడంతో ఆయన వారసుడిగా త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
10 అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
దేశంలో పది అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2017లో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద లక్షా ఐదు వేల కోట్ల రూపాయలతో 10 స్వదేశీ బల్క్ అణు రియాక్టర్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు 2031 నాటికీ పూర్తి కానున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలతో ఎన్‌పిసిఐఎల్ జాయింట్ వెంచర్లు (ప్రైవేట్ సంస్థలు) అణు విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని సవరించినట్లు తెలిపారు. 2013-14 సంవత్సరంలో వార్షిక అణు విద్యుత్ ఉత్పత్తి 35,333 మిలియన్ యూనిట్లు ఉండగా, తాజా 2021-22లో అది 47,112 మిలియన్ యూనిట్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. అలానే మరో ప్రశ్నకు సమాధానం చెప్తూ యురేనియం-233ని ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి థోరియం ఆధారిత న్యూక్లియర్ ప్లాంట్ “భవ్నీ” ని తమిళనాడులోని కల్పక్కంలో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
పురుషుల టీ20 క్రికెట్టులొ తొలి మహిళా ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా కిమ్ కాటన్
న్యూజిలాండ్‌కు చెందిన కిమ్ కాటన్, పురుషుల టీ20 క్రికెట్టులొ తొలి మహిళా ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా అవతరించారు. ఏప్రిల్ 5న డునెడిన్‌లో న్యూజిలాండ్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండవ టీ20ఐ పురుషుల అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించి ఈ ఘనతను దక్కించుకున్నారు. అలానే ఈమె 2020లో భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు టీవీ అంపైర్‌గా వ్యవహరించిన ఘనత కూడా కలిగిఉన్నారు.
- క్లైర్ పోలోసాక్, 2019లో పురుషుల ఒన్డే క్రికెట్ మ్యాచుకు అంపైర్‌గా వ్యవహరించిన మొదటి మహిళగా ఉన్నారు. ఐసీసీ అసోసియేట్ దేశాలు అయినా ఒమన్ మరియు నమీబియా మధ్య జరిగిన ఒన్డే మ్యాచులో ఈ బాధ్యతలు నిర్వర్తించారు.
- పొలోసాక్ 2022లో సిడ్నీలో జరిగిన భారత్ మరియు ఆస్ట్రేలియా టెస్టుకు నాల్గవ అంపైర్‌గా వ్యవహరించిన మొదటి మహిళాగా నిలిచారు.
8 ఏళ్ల తర్వాత తొలిసారిగా యూఏఈకి ఇరాన్ రాయబారి
2016 తర్వాత ఇరాన్ మొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తమ రాయబారిని నియమించింది. రెజా అమెరి ఈ బాధ్యతలు త్వరలో స్వీకరించనున్నారు. ఈయన గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఇరాన్ ప్రవాస కార్యాలయానికి డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. యూఏఈ మరియు ఇరాన్ రక్షణ మంత్రులు ఇటీవలే చైనాలో స్నేహపూర్వక భేటీ అయ్యారు. గల్ఫ్ దేశాలు మరియు ఇరాన్ మధ్య సంబంధాల పునర్వ్యవస్థీకరణలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుంది.
2016లో ప్రముఖ షియా మత గురువును రియాద్ ఉరితీసిన తరువాత ఇరాన్ నిరసనకారులు టెహ్రాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని ముట్టడించిన కారణంతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు నిలిచిపోయాయి. ఈ రెండు దేశాల రాజకీయ కలహాలం యితర గల్ఫ్ దేశాల స్థిరత్వం మరియు భద్రతకు ముప్పు తెచ్చిపెట్టింది. ఇది యెమెన్ నుండి సిరియా వివాదాలకు ఆజ్యం పోసింది. ఈ వివాదం కారణంగా ఇరు దేశాలకు రాజకీయ, భద్రతా పరమైన నష్టం జరుగుతుండటంతో ఇరుదేశాలు దౌత్యనికి ముందుకొచ్చాయి.
- ఇరాన్, పశ్చిమ ఆసియాలో రెండవ అతి పెద్ద దేశం. దీని రాజధాని నగరం టెహ్రాన్, ఇరాన్ ప్రస్తుత అధ్యక్షుడుగా ఇబ్రహీం రైసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది పశ్చిమ ఆసియాలోని ఒక దేశం. ఇది సౌదీ అరేబియా మరియు ఇరాన్ తర్వాత గల్ఫ్‌లో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారునిగా ఉంది. దీని రాజధాని నగరం అబుదాబి. యూఏఈ రాచరిక ప్రభుత్వానికి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధిపతిగా ఉన్నారు.
బసోలి పెయింటింగ్, లడఖ్ వుడ్ కార్వింగ్‌లకు జిఐ ట్యాగ్
జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బసోహ్లీ పెయింటింగ్‌లకు మరియు లడఖ్ ప్రాంతానికి చెందిన లడఖ్ వుడ్ కార్వింగ్‌లకు భౌగోళిక సూచిక (జిఐ) ట్యాగ్ అందించబడింది. బసోహ్లీ పెయింటింగ్ 17వ మరియు 18వ శతాబ్దాల చివరలో భారతీయ పర్వత రాష్ట్రాలలో అభివృద్ధి చెందింది. ఇది ఆకర్షణీయమైన రంగులతో కూడిన సూక్ష్మ జానపద కళా శైలికి ప్రసిద్ధి చెందింది.
లడఖ్ వుడ్ కార్వింగ్ హస్తకళను తరతరాలుగా ఈ ప్రాంతంకు అమూల్యమైన సాంస్కృతిక వారసత్వ సాధనంగా అందించబడుతుంది. షింకోస్ అని పిలువబడే ఈ వుడ్ కార్వింగ్ కళను భవనాల వాస్తుశిల్పం నుండి మఠాలు, మసీదులు మరియు చర్చిల వంటి ప్రార్థనా స్థలాల సౌందర్య విలువను పెంపొందించడం కోసం ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బుద్ధిస్ట్ స్టడీస్ హిమాలయన్ వుడ్‌కార్వింగ్‌లో నాలుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా అందిస్తుంది.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) ప్రత్యేక చొరవతో జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్‌లోని తొమ్మిది ఉత్పత్తులకు జిఐ నమోదు కోసం ఒక ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. ఈ జాబితాలో బసోలి పెయింటింగ్స్ (కతువా), బషోలీ పష్మినా ఉన్ని ఉత్పత్తులు (కతువా), చిక్రి వుడ్ క్రాఫ్ట్ (రాజౌరీ), భదర్వా రాజ్మా (దోడా), ముష్క్‌బుడ్జి రైస్ (అనంతనాగ్), కలాడి (ఉధంపూర్), సులై హనీ (రాంబన్), అనర్దన (రాంబన్), లడఖ్ వుడ్ కార్వింగ్ (లడఖ్) వంటివి ఉన్నాయి. వీటిలో ఇప్పటికే రెండింటికి జిఐ గుర్తింపు లభించింది.
జిఐ ట్యాగ్ అనేది భారతదేశంలోని నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంకు చెందిన సహజ లేదా వాస్తవ ఉత్పత్తులకు వాణిజ్యపరమైన గుర్తింపును మరియు చట్టపరమైన రక్షణను అందిస్తుంది. ఈ గుర్తింపు సంబంధిత ఉత్పత్తికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్‌ను కల్పిస్తుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందటంతో పాటుగా పర్యాటక రంగంకు ప్రోత్సహం లభిస్తుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దీనిని 1999లో స్థాపించారు.
నాటోలో 31వ మిత్రదేశంగా ఫిన్లాండ్
ఫిన్లాండ్ అధికారికంగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) యొక్క 31వ సభ్య దేశంగా మారింది. గత ఏడాది జూలైలోనే నాటో మిత్రదేశాలు ఫిన్‌లాండ్ ప్రవేశ ప్రోటోకాల్‌పై సంతకం చేశాయి. తాజాగా ఫిన్‌లాండ్ యొక్క నాటో సభ్యత్వాన్ని ఆమోదించడానికి మొత్తం 30 నాటో జాతీయ పార్లమెంటులు ఓటు వేసాయి. 4 ఏప్రిల్ 2023న బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక వేడుకలో, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, కూటమిలోని 30 ఇతర దేశాలతో పాటు ఫిన్‌లాండ్ జెండాను ఎగరవేయడం ద్వారా ఈ చేరికను అధికారికంగా పూర్తిచేశారు.
ఫిన్లాండ్, నాటో సభ్య దేశంగా మారడంతో రష్యాతో నాటో దేశాల సరిహద్దు మరింత పెరిగింది. ఫిన్లాండ్, రష్యాతో దాదాపు 1,340 కిమీ సరిహద్దును కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న సరిహద్దుకు రెట్టింపు. రష్యాకు 14 దేశాలతో భూ సరిహద్దులు ఉండగా అందులో కేవలం 6% భూభాగం (5 దేశాలు) మాత్రమే నాటో దేశాలను తాకుతుంది.
ప్రస్తుతం స్వీడెన్, ఉక్రెయిన్, బెలారస్, జార్జియా మరియు అజర్‌బైజాన్ మాత్రమే ఈ రెండు కూటమీల మధ్య ఒంటరి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. అయితే ఇందులో స్వీడెన్ త్వరలో నాటోలో చేరనుండగా, బెలారస్ రష్యాకు అనుకూలంగా ఉంది. ఇక ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. ఈ అంశమే ప్రస్తుత రష్యా, ఉక్రెయిన్ యుద్దానికి దారితీసింది. ఇక మిగతా దేశాలు తటస్తంగా ఉన్నాయి.
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది 31 సభ్య దేశాలతో కూడిన అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి. దీన్ని నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా అంటారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949 ఏప్రిల్ 4న ఏర్పాటు చేయబడింది. దీనిని ఉత్తర అమెరికా, యూరోప్ దేశాల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమిలో ప్రస్తుతం 29 యూరోపియన్ దేశాలు, 2 ఉత్తర అమెరికా దేశాలు ఉన్నాయి.
- మొత్తం నాటో సభ్య దేశాలు - 31
- నాటోలో యూరోపియన్ దేశాలు - 29
- నాటోలో ఉత్తర అమెరికా దేశాలు - 2 (యూఎస్ & కెనడా)
- నాటో ప్రధాన కార్యాలయం - బ్రస్సెల్స్ (బెల్జియం)
- నాటో ప్రస్తుత అధ్యక్షుడు - జెన్స్ స్టోల్టెన్‌బర్గ్
- నాటోలో అతిచిన్న దేశం - లక్సెంబర్గ్
- నాటో అతిపెద్ద మరియు శక్తివంతమైన దేశం - అమెరికా
- రష్యాతో సరిహద్దు పంచుకుంటున్న నాటో దేశాలు : ఫిన్లాండ్, నార్వే, లాట్వియా, ఎస్టోనియా, లిథువేనియా & పోలాండ్
- నాటో సభ్యదేశాలు కానీ ప్రధాన యూరోపియన్ దేశాలు : అండోరా, ఆర్మేనియా, ఆస్ట్రియా, అజర్‌బైజాన్, బెలారస్, బోస్నియా, హెర్జెగోవినా, సైప్రస్, జార్జియా, ఐర్లాండ్, కొసావో, లిచెన్‌స్టెయిన్, మాల్టా, మోల్డోవా, మొనాకో, రష్యా, శాన్ మారినో, సెర్బియా, స్వీడన్, స్విట్జర్లాండ్, ఉక్రెయిన్ మరియు వాటికన్ నగరం
భారతదేశం & భూటాన్‌ల మధ్య ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రణాళిక
భారతదేశం & భూటాన్ మధ్య మొదటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. ఇటీవలే ఏప్రిల్ 5న న్యూ ఢిల్లీలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌ల ద్వైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలానే ఇరుదేశల మధ్య ప్రతిపాదిత కోక్రాజార్-గెలెఫు రైలు లింక్ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయాలనీ నిర్ణయించారు. ఇది భారతదేశం మరియు భూటాన్ మధ్య మొట్టమొదటి రైలు మార్గం కానుంది.
మూడు రోజుల భారత పర్యటన కోసం విచ్చేసిన ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశం అయ్యారు. ఈ పర్యటనలో భూటాన్ రాజుతో పాటుగా భూటాన్ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ టాండి డోర్జీ మరియు భూటాన్ ప్రభుత్వంలోని పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. భూటాన్ అనేది దక్షిణాసియాలోని ఇండియా మరియు చైనా మధ్య ఉన్న చిన్న భూపర్యవేష్టిత దేశం. దీని రాజధాని నగరం థింపూ.
నాగాలాండ్‌లో నాల్గవ B20 సదస్సు
నాగాలాండ్ రాజధాని కోహిమ, జి20 అధ్యక్షతన నాల్గవ B20 సదస్సుకు ఆతిధ్యం ఇచ్చింది. ఏప్రిల్ 4 నుండి 6 మధ్య జరిగిన ఈ సదస్సును భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబడింది. B20 అనేది గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించే అధికారిక G20 డైలాగ్ ఫోరమ్. ఇది కంపెనీలు మరియు వ్యాపార సంస్థలు పాల్గొనే G20లో అత్యంత ప్రముఖమైన ఎంగేజ్‌మెంట్ గ్రూపులలో ఒకటి.
ఇది వరకు నిర్వహించిన మూడు B20 సదస్సులు కూడా ఈశాన్య రాష్ట్రాలలోనే నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలను ఇంఫాల్, ఐజ్వాల్ మరియు గ్యాంగ్‌టక్‌లలో జరిగాయి. ఈ సదస్సులు వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బహుపాక్షిక వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనున్నాయి. ఈ సదస్సులు ఈశాన్య ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల అభివృద్ధికి సహాయపడతాయి మరియు ఆర్థిక వృద్ధిని సులభతరం చేయనున్నాయి.
ఈ సదస్సులో క్యూబా, ఐస్‌లాండ్, జమైకా, పరాగ్వే నుండి ఐదుగురు రాయబారులు, ఎస్టోనియా నుండి ఒక డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్స్ మరియు కోస్టారికా మరియు జర్మనీ నుండి ఇద్దరు కౌన్సిల్ జనరల్‌లతో సహా 27 దేశాల నుండి 60 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 : 18 పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక అగ్రస్థానం
ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 ప్రకారం 18 పెద్ద రాష్ట్రాలలో కర్నాటక అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తమిళనాడు రెండవ స్తానంలో, తెలంగాణ 3వ స్థానం దక్కించుకున్నాయి. దేశంలోని 10 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 18 పెద్ద రాష్ట్రాలకు సంబంధించి న్యాయ వ్యవస్థ పనితీరును ఈ రిపోర్టు నివేదిస్తుంది. న్యాయవ్యవస్థలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, బడ్జెట్‌లు, పనిభారం, పోలీసు, జైళ్ల పనితీరు సామర్ధ్యాన్ని ఇది అంచనా వేస్తుంది.
2019లో 6వ స్థానంలో మరియు 2020లో 14వ స్థానంలో ఉన్న కర్ణాటక, ఏకంగా 13 స్థానాలు ఎగబాకి 2022లో అగ్రస్థానానికి చేరుకుంది. అలానే తాజా ర్యాంకింగులో మధ్యప్రదేశ్ 16వ స్థానం నుంచి 8వ స్థానానికి, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకాయి. ఉత్తరప్రదేశ్ 3.78 స్కోరుతో వరుసగా మూడోసారి కూడా పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. 2019 మరియు 2020 రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలిచినా మహారాష్ట్ర 2022లో 11వ స్థానానికి దిగజారింది.
బీహార్ మిర్చా రైస్‌కు జిఐ ట్యాగ్
బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందిన మిర్చా బియ్యంకు భౌగోళిక సూచిక (జిఐ) గుర్తింపు లభించింది. పరిమాణం మరియు ఆకారం పరంగా నల్ల మిరియాలు లాగా కనిపించే ఈ ధాన్యంను మిర్చా లేదా మార్చా రైస్ అని పిలుస్తారు. ఈ బియ్యం యొక్క గింజలు మరియు రేకులు ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. ఈ దేశీయ వరి రకం బీహార్‌లోని పశ్చిమ చంపారన్ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది.
బనారసి పాన్, లాంగ్డా మామిడికి జిఐ ట్యాగ్
బనారసి పాన్‌తో పాటు, మరో మూడు వారణాసి ఆధారిత ఉత్పత్తులు అయినా బనారసి లాంగ్డా మామిడి, రాంనగర్ భాంటా (బ్రింజాల్), మరియు ఆడమ్చిని రైస్ ఉత్పత్తులకు కొత్తగా జిఐ ట్యాగ్ అందించబడింది.
నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) సహాయంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 20 రాష్ట్ర ఆధారిత ఉత్పత్తుల కోసం జిఐ దరఖాస్తులను సమర్పించింది. ఇప్పటికే ఇందులో 11 ఉత్పత్తులకు జిఐ హోదా మంజూరు చేయబడింది. ఇంకా జిఐ హోదా పొందల్సిన వస్తువుల జాబితాలో బనారస్ లాల్ పెడా, బనారసి తాండై, తిరంగి బర్ఫీ, బనారస్ లాల్ భర్వా మిర్చ్ మరియు బనారస్ లాల్ పెడా వంటివి ఉన్నాయి.
పోన్‌పే యొక్క 'పిన్‌కోడ్' ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పోన్‌పే కొత్తగా పిన్‌కోడ్ పేరుతొ ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది. కిరాణా, ఆహారం, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, గృహాలంకరణ మరియు ఫ్యాషన్‌తో సహా ఆరు ప్రధాన విభాగాలలో పిన్‌కోడ్ సేవలు అందించనుంది. ఈ సేవలు ప్రస్తుతం ఈ సేవలను బెంగుళూరు నగరానికి మాత్రమే పరిమితం చేసింది. ఈ సేవలు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఫ్రేమ్‌వర్క్ ద్వారా అందించనున్నట్లు వెల్లడించింది.
తిరువనంతపురంలో రెండవ జి20 ఎంపవర్ సమావేశం
భారతదేశం యొక్క జి20 ప్రెసిడెన్సీ క్రింద రెండవ 20 ఎంపవర్ సమావేశంను ఏప్రిల్ 4-6 తేదీల మధ్య కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా జరపబడిన ఈ సమావేశంకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నాయకత్వం వహించింది. దీనికి సంబంధించి మొదటి జి20 ఎంపవర్ సమావేశం ఫిబ్రవరి 11-12 తేదీలలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరపబడింది.
ఎంపవర్ అనగా ఎంపవర్‌మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఉమెన్స్ ఎకనామిక్ రిప్రజెంటేషన్ అని అర్ధం. ఇది ప్రైవేట్ రంగంలో మహిళల నాయకత్వం మరియు సాధికారతను వేగవంతం చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ సేమావేశాలను “Women’s Empowerment: A Win-Win for Equity and Economy" అనే థీమ్‌తో నిర్వహించారు
పెట్టుబడులను ఆకర్షించడానికి గోల్డెన్ లైసెన్స్‌ను ప్రారంభించిన బహ్రెయిన్
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి బహ్రెయిన్ కొత్తగా 'గోల్డెన్ లైసెన్స్'ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఈ గోల్డెన్ లైసెన్స్ బహ్రెయిన్‌లో భారీ-స్థాయి పెట్టుబడి ప్రాజెక్టులతో స్థానిక మరియు విదేశీ వ్యాపారాలకు క్రమబద్ధమైన సేవలు మరియు ప్రయోజనాలను అందించడానికి రూపొందించబడింది. ఈ చొరవ పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటుగా తమ దేశ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు భావిస్తున్నారు.
50 మిలియన్ల యూఎస్ డాలర్లకు మించిన పెట్టుబడులు, 500 కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే కంపెనీలు ఈ లైసెన్స్‌కు అర్హులు. ఈ లైసెన్స్ పొందిన కంపెనీలకు తక్షణ భూకేటాయింపు, మౌలిక సదుపాయాల సేవలు, యుటిలిటీలు, వ్యాపార లైసెన్సింగ్ మరియు బిల్డింగ్ పర్మిట్ వంటి సౌలభ్యలతో పాటుగా బహ్రెయిన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ద్వారా సహాయం అందించనున్నారు.
బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన బహ్రెయిన్ క్యాబినెట్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది మరియు బహ్రెయిన్ ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి స్థానిక మరియు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. బహ్రయిన్ మిడిల్ ఈస్ట్ లోని 50 సహజ ద్వీపాలతో కూడిన చిన్న ద్వీపసమూహం. ఇది పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. దీని రాజధాని నగరం మనామా.
అరుణాచల్‌లోని 11 ప్రాంతాల పేర్లను మార్చిన చైనా
చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతలకు ప్రామాణిక పేర్ల జాబితాను ప్రచురించింది. అరుణాచల్ ప్రదేశ్‌పై తన హక్కును నొక్కిచెప్పే ప్రయత్నంలో భాగంగా టిబెటన్ అటానమస్ రీజియన్‌కు దక్షిణాన జాంగ్నాన్ ప్రాంతాన్ని తమదిగా భావిస్తుంది. ఈ ప్రాంతాన్ని చైనా జిజాంగ్ అని పిలుస్తుంది. ఇందులో ఐదు పర్వత శిఖరాలు, రెండు జనావాస ప్రాంతాలు, రెండు భూభాగాలు మరియు రెండు నదులు ఉన్నాయి.
గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రామాణిక భౌగోళిక పేర్లు మార్చుతూ చైనా విడుదల చేసిన మూడవ జాబితా ఇది. 2017లో చైనీస్ మినిస్ట్రీ ఆఫ్ సివిలియన్ అఫైర్స్ ఇదే విధమైన ఆరు స్థలాల జాబితాను విడుదల చేసింది. అలానే డిసెంబర్ 2021లో మరో 15 స్థలాల జాబితాను కూడా విడుదల చేసింది. అయితే భారత ప్రభుత్వ వర్గాలు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని మరియు ఎల్లప్పుడూ ఉంటుందని నొక్కి చెప్పాయి.
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అంజలి శర్మ
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన అంజలి శర్మ , తమ రాష్ట్ర సంప్రదాయ లూనాచారి దుస్తులలో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఈ రికార్డు హిమాచల్ ప్రదేశ్ మరియు భారత సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించేలా ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభివర్ణయించారు.
మౌంట్ కిలిమంజారో అనేది టాంజానియాలోని కిలిమంజారో ప్రాంతంలో ఉన్న ఒక ఎత్తుయైన మంచుతో కప్పబడిన అగ్నిపర్వతం. ఇది ఏడు పర్వతాల సమూహం. దీని గరిష్ట ఎత్తు 5,895 మీటర్లు. ఇది ఆఫ్రికాలో ఎత్తైన పర్వతంగా ఉంది.
5వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రా
ఏప్రిల్ 4న ఢిల్లీలో జరిగిన 5వ అంతర్జాతీయ విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల 2023 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో ప్రసంగించారు. విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడంలో స్థానిక పరిజ్ఞానాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలని ఈ సంధర్బంగా నొక్కి చెప్పారు.
విపత్తు పునరుద్ధరణ కార్యక్రమాల విజయానికి ఆర్థిక వనరుల నిబద్ధత కీలకమని, గత ఏడాది ప్రకటించిన 50 మిలియన్ డాలర్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెసిలెన్స్ యాక్సిలరేటర్ ఫండ్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపారమైన ఆసక్తిని సృష్టించిందని వెల్లడించారు. ఈ ఏడాది ఈ సమావేశంను డెలివెరింగ్ రెసిలియంట్ అండ్ ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్‌తో నిర్వహించారు.
కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (CDRI) అనేది దేశాలు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు, బ్యాంకులు, ప్రైవేట్ రంగం మరియు విద్యా సంస్థలతో కూడిన అంతర్జాతీయ కూటమి. ఇది విపత్తు-తట్టుకునే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో 2019లో ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం దీనిలో 31 ప్రభుత్వాలు మరియు 8 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీనికి భారత ప్రభుత్వం ఇండిపెండెంట్ మరియు ఇంటర్నేషనల్ లీగల్ ఎంటిటీ హోదా కల్పించింది.
తెలంగాణలో 'కూల్ రూఫ్' పాలసీ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి కూల్ రూఫ్ స్ట్రాటజీతో 'కూల్ రూఫ్ పాలసీ' ని ఏప్రిల్ 3న ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన ఈ ఐదేళ్ల పాలసీ, మార్చి 31, 2028 వరకు అమలులో ఉండనుంది. మొదటి సంవత్సరంలో హైదరాబాద్‌లోని 5 చదరపు కిలోమీటర్లతో సహా 7.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 'కూల్ రూఫ్ పాలసీ' అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్‌ను ఎదుర్కోవడానికి రూపొందించింది.
ఇందులో భాగంగా ప్రస్తుతం డిజైన్ దశలో 600 చదరపు గజాలు దాటిన అన్ని నిర్మాణాలకు కూల్ రూఫ్‌ను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తుంది. సూర్యరశ్మిని తిరిగి ప్రతిబింబించేలా పెయింట్స్, టైల్స్ లేదా ఇతర పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ కూల్ రూఫింగ్‌ను అమలు చేయనున్నారు. ఈ ఏర్పాటు సూర్యుని యొక్క ఇన్‌కమింగ్ రేడియేషన్‌లో కొంత భాగాన్ని తిరిగి వాతావరణంలోకి ప్రతిబించడం ద్వారా కొంత వేడిని తగ్గించి ఇండోర్ ఖాళీలను చల్లబరుస్తుంది. 2030 నాటికి రాష్ట్రంలో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కూల్ రూఫ్ పాలసీని చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ - శ్రీలంక ద్వైపాక్షిక మారిటైమ్ వ్యాయామం ఎస్ఎల్ఇన్ఎక్స్ ప్రారంభం
భారత్ - శ్రీలంక ద్వైపాక్షిక మారిటైమ్ వ్యాయామం ఎస్ఎల్ఇన్ఎక్స్ (SLINEX) శ్రీలంకలోని కొలంబోలో ఏప్రిల్ 4న ప్రారంభమైంది. రెండు దశలలో మూడు రోజుల నిడివితో జరిగిన ఈ వ్యాయామం హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ పేరుతొ నిర్వహించారు. ఈ వ్యాయామంలో భారత నౌకాదళానికి ఐఎన్ఎస్ కిల్తాన్ మరియు ఐఎన్ఎస్ సావిత్రి ప్రాతినిధ్యం వహించగా, శ్రీలంక నౌకాదళంలో ఎస్ఎల్ఎన్ఎస్ విజయబాహు మరియు ఎస్ఎల్ఎన్ఎస్ సముద్రాలు పాల్గున్నాయి. ఈ వార్షిక సముద్ర వ్యాయామంను సముద్ర ప్రాంతంలో ఇరుదేశల సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు నిర్వహిస్తారు.
హిందూఫోబియాను ఖండిస్తూ జార్జియా రాష్ట్రంలో తీర్మానం
హిందూఫోబియాను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి అమెరికన్ రాష్ట్రంగా జార్జియా అవతరించింది. హిందూఫోబియా మరియు హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ, 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న హిందూ మతం ప్రపంచంలోని అతిపెద్ద మరియు పురాతన మతాలలో ఒకటి అని ఈ తీర్మానం పేర్కొంది.
జార్జియాలోని అతిపెద్ద హిందూ మరియు భారతీయ-అమెరికన్ డయాస్పోరా కమ్యూనిటీలలో ఒకటైన అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్ మరియు టాడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వైద్యం, సైన్స్ మరియు ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం మరియు రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని ఈ తీర్మానం నివేదించింది.
అమెరికా అనేక ప్రాంతాల్లో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదు చేయబడిన సందర్భాలు ఉన్నాయని తీర్మానం పేర్కొంది. హిందూ మతాన్ని ద్వేషించే కొన్ని అమెరికన్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కుంటున్నారని, దీనిని రూపుమాపేందుకు ఈ తీర్మానంను ప్రవేశపెట్టారు.
భారత్ - నెదర్లాండ్స్ మధ్య మొదటి జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
భారతదేశం మరియు నెదర్లాండ్స్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మొదటి మంత్రుల స్థాయి సమావేశాన్ని ఏప్రిల్ 3న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, నెదర్లాండ్స్ మినిస్టర్ మార్క్ హార్బర్స్ పాల్గొన్నారు. 2022లో ఇరు దేశల మధ్య జరిగిన వ్యూహాత్మక నీటి భాగస్వామ్యం ఒప్పందంతో ద్విపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయి.
2021లో భారతదేశం మరియు నెదర్లాండ్స్ ప్రధాన మంత్రుల మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో 'వ్యూహాత్మక నీటి భాగస్వామ్యం' ప్రారంభించబడింది. 29 మార్చి 2022న ఈ 'వ్యూహాత్మక నీటి భాగస్వామ్యం'పై ఇరు దేశాల జల నిర్వహణ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ మరియు మార్క్ హార్బర్స్ సంతకం చేశారు. భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసం నీటి భద్రత, నీటి లభ్యత మరియు నీటి నాణ్యత యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత మరియు నెదర్లాండ్స్ ప్రభుత్వాల ఉమ్మడి ప్రయత్నంను అమలు చేస్తున్నాయి.
ఇందులో భాగంగా నెదర్లాండ్స్ దేశంలోని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాలు మరియు మునిసిపాలిటీలలో వివిధ నీటి వనరుల ప్రాజెక్టులను నిర్వహిస్తుంది.
భారతదేశం-మధ్య ఆసియా సాంస్కృతిక మంత్రుల సమావేశం 2023
భారతదేశం-మధ్య ఆసియా సాంస్కృతిక మంత్రుల సమావేశంను ఏప్రిల్ 3న వర్చువల్ పద్దతిలో నిర్వహించారు. ఈ సాంస్కృతిక మంత్రుల మొదటి సమావేశానికి కిషన్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్థాన్ సాంస్కృతిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సీబీఐ డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
ఏప్రిల్ 2న న్యూ ఢిల్లీలో జరిగిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 2014 తర్వాత తమ ప్రభుత్వం వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడం పని చేస్తుందని పేర్కొన్నారు. సిబిఐ పాత్రను ప్రశంసిస్తూ, సిబిఐ తన పనితీరు, సమర్థత మరియు సామర్థ్యాల ద్వారా ప్రజల్లో లోతైన విశ్వాసాన్ని నింపిందని వెల్లడించారు.
గత ఆరు దశాబ్దాల్లో సిబిఐ 'మల్టీ డైమెన్షనల్' మరియు 'మల్టీ డిసిప్లినరీ' ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది భారతదేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ. దీనిని 1 ఏప్రిల్ 1963న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
ఎరవికులం నేషనల్ పార్క్‌లో ఫెర్నారియం ఏర్పాటు
నీలగిరి తహర్‌కు నిలయంగా ఉన్న కేరళలోని ఎరవికులం నేషనల్ పార్క్‌లో కొత్తగా ఫెర్నారియం ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. వీరి సమాచారం ప్రకారం హిల్ స్టేషన్‌లో ఇటువంటి ఫెర్న్ సేకరణను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ కొత్త ఫెర్నారియంలో ఇప్పటికే 52 రకాల ఫెర్న్‌లను నాటినట్లు ఈఎన్‌పీ అసిస్టెంట్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ జాబ్ జె.నెరియంపరంపిల్ తెలియజేసారు. ఈ కొత్త ఆకర్షణ ఏప్రిల్ 20 నుండి ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ఫెర్నారియం అనేది ఒక ప్రత్యేకమైన బొటానికల్ గార్డెన్. వివిధ రకాల ఫెర్న్ జాతులను పెంచడం మరియు ప్రదర్శించడంను ఫెర్నారియం అంటారు.
ఎరవికులం నేషనల్ పార్క్, మున్నార్‌లోని నీలగిరి తహర్ (నీలగిరిట్రాగస్ హైలోక్రియస్) యొక్క సహజ ఆవాసంగా ప్రసిది చెందింది. ఇది అత్యంత ప్రమాదంలో ఉన్న పర్వత మేక. వీటి జనాభాను రక్షించే ఉద్దేశ్యంతో దీనిని 1975లో అభయారణ్యంగా ప్రకటించారు. ఎరవికులం నేషనల్ పార్క్ పశ్చిమ కనుమలలో అత్యంత సంపన్నమైన జాతీయ ఉద్యానవనాలలో ఒకటిగా ఉంది.
ఆర్‌బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నీరజ్ నిగమ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నీరజ్ నిగమ్ నియమితులయ్యారు. నీరజ్ నిగమ్ గత 30 సంవత్సరాలగా ఆర్‌బిఐ కేంద్ర కార్యాలయం మరియు ప్రాంతీయ కార్యాలయాలు రెండింటిలోనూ పనిచేసిన అనుభవం కలిగివున్నారు. ఈ పదోన్నతి పొందక ముందు, భోపాల్ ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయానికి అధిపతిగా పనిచేశాడు.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్‌గా అర్చన ఖోస్లా బర్మన్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ) యొక్క లేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్‌గా అర్చన ఖోస్లా బర్మన్ నియమితులయ్యారు. వెర్టిసెస్ పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకురాలు అయినా అర్చన ఖోస్లా బర్మన్ ఇండియన్ ఉమెన్స్ కన్వెన్షన్ ద్వారా 2019 సంవత్సరానికి గాను ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ అనేది భారతదేశంలోని ప్రభుత్వేతర వాణిజ్య సంఘం మరియు న్యాయవాద సమూహం. దీనిని 1927లో స్థాపించారు. ఫిక్కీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడుగా సంజీవ్ మెహతా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2023 న పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా మరియు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) మినహా మిగతా అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును 2శాతం పెంచింది. ఈ వడ్డీ రేటు 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి, అంటే ఏప్రిల్-జూన్ 2023కి చెల్లుబాటు అవుతుంది. ఈ సవరించిన రేట్ల ప్రకారం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీలు 8% నుండి 8.2 % కి పెంచబడ్డాయి. అలానే కిసాన్ వికాస్ పాత్ర వడ్డీలు 7% నుండి 7.2 % కి పెంచబడ్డాయి.
ఇస్రో అటానమస్ ల్యాండింగ్ మిషన్ ప్రయోగం విజయవంతం
ఇస్రో యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ ప్రయోగంను ఏప్రిల్ 2న విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగం కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి నిర్వహించబడింది. దీనితో అంతరిక్ష వాహనం యొక్క స్వయంప్రతిపత్త ల్యాండింగ్‌ను ఇస్రో విజయవంతంగా సాధించినట్లు పేర్కొంది. ఇది పూర్తిగా తిరిగి ఉపయోగించగల ప్రయోగ వాహనం కోసం మార్గం సుగమం చేస్తుంది.
రీయూజబుల్ లాంచ్ వెహికల్ - టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ (RLV-TD) అనేది తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించేందుకు రూపొందించిన సాటిలైట్ వాహనం. దీని కాన్ఫిగరేషన్, రెక్కలు కలిగిన విమానం మాదిరిగానే ఉంటుంది మరియు లాంచ్ వెహికల్స్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ రెండింటి సంక్లిష్టతను మిళితం చేస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ మేనేజ్‌మెంట్ సాంకేతికతో నిర్వహించబడుతుంది.
ఆర్ఎల్‌వీ హైపర్‌సోనిక్ వేగంతో అనగా ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగం (6174 కిమీ/గం)తో ఎగురుతుంది. సంబంధిత ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి, తిరిగి భూమికి చేరుతుంది. ఇది హైపర్సోనిక్ ఏరో థర్మోడైనమిక్ క్యారెక్టరైజేషన్ కలిగి ఉంటుంది. దీని కింద భాగం 600 వేడి-నిరోధక టైల్స్ ద్వారా కప్పబడి ఉంటుంది. ఈ థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, వాహనం భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు ఎదురయ్యే అధిక ఉష్ణోగ్రతల నుండి రక్షిస్తుంది. తద్వారా ఆ వెహికల్ పునర్వినియోగానికి ఉపయోగపడుతుంది.
ఎఆర్‌టి & సరోగసీ బోర్డ్‌లో ఎక్సపెర్ట్ సభ్యునిగా డాక్టర్ ఆర్‌జి పటేల్
ప్రముఖ గైనకాలజిస్టు డా. ఆర్‌జి పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ కింద పనిచేసే నేషనల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీ బోర్డ్‌కి ఎక్సపెర్ట్ సభ్యునిగా నియమితులయ్యారు. ఆర్‌జి పటేల్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని సన్‌ఫ్లవర్ హాస్పిటల్ యొక్క డైరెక్టరుగా ఉన్నారు.
ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ నేషనల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీ బోర్డు, సహాయ పునరుత్పత్తి సాంకేతికత (నియంత్రణ) చట్టం, 2021 మరియు సరోగసీ (నియంత్రణ) ప్రయోజనాల యొక్క చట్టం 2021 అమలును పరిరక్షిస్తుంది. దేశంలో కృత్రిమ పునరుత్పత్తి సాంకేతికత భవిష్యత్తును రూపొందించడంలో సహాయక పునరుత్పత్తి సాంకేతిక చట్టం కీలకమైనది.
పిటిసి ఇండియా సిఎండిగా రాజీబ్ కె మిశ్రా
పవర్ ట్రేడింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ అయినా పిటిసి ఇండియా లిమిటెడ్ కొత్త ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీబ్ కె మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. సంబంధిత రంగంలో 38 సంవత్సరాలకు పైగా వృత్తిపరమైన అనుభవం ఉన్న డాక్టర్ రాజీబ్ కుమార్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పీటీసీలో కెరీర్ ప్రారంభించారు. భారతదేశంలో పవర్ ట్రేడింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న పిటీసీ ఇండియాను 1999లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నాసా యొక్క 'మూన్ టు మార్స్' మిషన్ హెడ్‌గా ఇండో అమెరికన్
నాసా కొత్తగా స్థాపించిన 'మూన్ టు మార్స్' కార్యక్రమానికి మొదటి అధిపతిగా భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ మరియు రోబోటిక్స్ ఇంజనీర్ అమిత్ క్షత్రియ నియమితులయ్యారు. నాసా మూన్ టు మార్స్ కార్యక్రమాన్ని వ్యోమగాములను రెడ్ ప్లానెట్‌లోకి పంపేందుకు రూపొందించింది. దీని కోసం చంద్రుడిని శిక్షణా స్థలంగా ఉపయోగిస్తోంది. చంద్రుడు మరియు అంగారక గ్రహం చుట్టూ నాసా సిబ్బంది కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది.
నేవీ వైస్ చీఫ్‌గా అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్
భారత నౌకాదళం యొక్క వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ 1986లో భారత నావికాదళంలోని కార్యనిర్వాహక శాఖలో నియమితులయ్యారు. 37 సంవత్సరాల తన కెరీర్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, వెస్ట్రన్ ఫ్లీట్ యొక్క ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌తో సహా అనేక రకాల విధులు నిర్వర్తించారు.
గౌహతిలో 2వ జి20 ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం
భారతదేశం యొక్క జి20 ప్రెసిడెన్సీలో రెండవ ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ (EWG) సమావేశంను అస్సాంలోని గౌహతి నగరంలో ఏప్రిల్ 3న నిర్వహించారు. ఫిబ్రవరిలో జోధ్‌పూర్‌లో జరిగిన 1వ ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి కొనసాగింపుగా దీనిని నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జి20 సభ్య దేశాలు, అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుండి మొత్తం 74 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్మిక మరియు ఉపాధి సమస్యలపై చర్చించారు.
టిఇ రాజస్థాన్ తొలి మహిళా అధ్యక్షురాలు శీను ఝవార్
ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TiE) రాజస్థాన్ యొక్క తొలి మహిళా అధ్యక్షురాలుగా శీను ఝవార్ నియమితులయ్యారు. దీనితో టిఇ రాజస్థాన్ 21 ఏళ్ల చరిత్రలో ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె అవతరించారు. 2021 నుండి ఈ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న డాక్టర్ రవి మోదానీ నుండి డాక్టర్ ఝవార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ హోదాలో వచ్చే రెండేళ్ల కాలానికి ఆమె సేవలు అందించనున్నారు.
1992లో సిలికాన్ వ్యాలీలో స్థాపించబడిన ఈ ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TiE), ప్రస్తుతం 14 దేశాలలో 58 అధ్యాయాలతో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని సంస్థగా ఉంది. మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్, విద్య, ఇంక్యుబేషన్ మరియు నిధుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తదుపరి తరం వ్యవస్థాపకులను ప్రోత్సహిస్తుంది.
ఇటలీలో విదేశీ భాషల వాడకంపై ఆంక్షలు
ఇటాలియన్ ప్రభుత్వం అధికారిక కమ్యూనికేషన్‌లో ఇంగ్లీష్ మరియు ఇతర విదేశీ భాషలను నిషేధిస్తూ చట్టం చేసింది. ప్రధాన మంత్రి జార్జియా మెలోని యొక్క బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ ప్రవేశపెట్టిన కొత్త చట్టం ప్రకారం అధికారిక సమాచార మార్పిడిలో ఇంగ్లీష్ మరియు ఇతర విదేశీ పదాలను ఉపయోగించే ఇటాలియన్లు గరిష్టంగా 100,000 పౌండ్లు లేదా 108,705 డాలర్లు జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుందని నివేస్తుంది.
ఈ చట్టాన్ని ఇటలీ దిగువ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సభ్యుడు ఫాబియో రాంపెల్లి ప్రవేశపెట్టగా, ప్రధానమంత్రి జార్జియా మెలోని మద్దతు ఇచ్చారు. ఈ చట్టంలో అన్ని విదేశీ భాషలను పొందుపర్చినప్పటికీ ఉన్నప్పటికీ, ఇది ప్రత్యేకంగా ఇంగ్లీష్ భాష వినియోగానికి ఉద్దేశించబడి రూపొందించబడింది. ఇంకా పార్లమెంటరీలో ఆమోదం పొందని ఈ బిల్లు, దేశంలో పనిచేస్తున్న కంపెనీలలో ఉద్యోగ పాత్రల ఎక్రోనింస్ మరియు పేర్లలో కూడా అధికారిక డాక్యుమెంటేషన్‌లో ఆంగ్లాన్ని ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది.