ఇంటర్ తర్వాత ఉత్తమ కోర్సులు | ఇంటర్ తర్వాత ఉన్నత విద్య ఎంపికలు
Career Guidance Career Options

ఇంటర్ తర్వాత ఉత్తమ కోర్సులు | ఇంటర్ తర్వాత ఉన్నత విద్య ఎంపికలు

ఇంటర్ తర్వాత ఉన్నత విద్య కోర్సుల ఎంపిక కోసం పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇంటర్మీడిట్ విద్యార్థి కెరీర్‌ను పూర్తి స్థాయిలో నిర్దేశించే తోలి మలుపు. ఎన్నో ఆశలు, ఆశయాలు, సందేహాల నడుమ ఈ కూడలిని దాటే ప్రక్రియ విద్యార్థిని, వారి తల్లిదండ్రులను ఒకింత కంగారుపెడుతుంది.

Advertisement

అభిరుచుల ప్రకారం నిర్ణయం తీసుకోవాలా, అవకాశాలకు అనుగుణంగా వెళ్లాలా, అందరూ నడిచే దారిలో ప్రయాణమా? అరుదైన కోర్సులతో భిన్నమైన మార్గమా? అర్హతలకు తగిన ఉద్యోగం దొరికితే చేరిపోదామా? వంటి మొదలగు ప్రశ్నలు విద్యార్థిని వేధిస్తాయి.

ఇలాంటి  ప్రశ్నల నడుమ మీరు ఇబ్బందిపడుతున్నప్పుడు ఈ  ఆర్టికల్ మీకు చక్కని మార్గనిర్దేశం చేస్తుంది. ఇంటర్ తర్వాత అందుబాటులో ఉన్న అన్ని రకాల కోర్సుల వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకుని మీరు కోరుకున్న బంగారు భవిష్యత్తు కోసం తగిన నిర్ణయాన్ని తీసుకోండి.

ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులు

కెరీర్ పరంగా అత్యధిక డిమాండ్ ఉండి, అత్యధిక జీతభత్యాలు అందించే రంగం ఇంజనీరింగ్. మానవాళి అభివృద్ధి కోసం నిర్మాణాలు, సాధనాలు మరియు సాంకేతికతను అభివృద్దిపర్చే ఈ రంగం ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. నాణ్యమైన ఇంజినీర్లకు భవిష్యత్ కెరీర్ పరంగా ఎటువంటి డోకా ఉండదు.

ఈ రంగంలో కెరీర్ పరంగా, కోర్సుల పరంగా విస్తృతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ వంటి ఇంజనీరింగ్ గ్రూపులలో చేరడం ద్వారా ఆయా ఇంజినీరింగ్ రంగాలలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఇంటర్మీడియేట్ యందు గణితం ఒక సబ్జెక్టుగా చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఇంజనీరింగ్ కోర్సులలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత పొందేకా ఇంజనీరింగ్ కోర్సులలో చేరేందుకు ఏదైనా ఒక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.

ప్రవేశపరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా అందుబాటులో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ లభిస్తుంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కెరీర్'లో కొత్త విషయాలు నేర్చుకునేందుకు విద్యార్థులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. మీ భవిష్యత్ ఉత్తమంగా ఉండాలంటే ఈ నాలుగేళ్ళ సమయాన్ని అన్ని విధాలుగా సద్వినియోగ పరచుకోవాలి.

బీటెక్ పూర్తికాగానే అనేక ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడే ఉద్యోగం ఎందుకు అనుకునే వారికి ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్య కోర్సులలో చేరొచ్చు. ఎంటెక్, ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లొచ్చు. అలానే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడే అందుకు ప్రయత్నించవచ్చు.

మీ లక్యం ఉద్యోగం కాకుంటే నూతన ఆలోచనలతో వ్యవస్థాపకులుగా మారి కొత్త వ్యాపార సంస్థలను ప్రారంభించవచ్చు. ఇలా వైపు చూసినా ఇంజనీరింగ్ విద్యార్థులకు కెరీర్ కనిపిస్తుంది. అంకితభావంతో ఇష్టపడి ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఏ విద్యార్థి కేరీరులో విఫలమయ్యే అవకాశం లేదు..ఉండదు.

ఇంటర్ తర్వాత మెడిసిన్ కోర్సులు

వృత్తి జీవితంలో వైద్యులుగా లేదా దాని అనుబంధ వృత్తులలో స్థిరపడే ఆలోచన ఉన్నవారు మెడికల్ కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఇంటర్మీడియట్ యందు బోటనీ, జూవాలాజీ (బైపీసీ) ఒక గ్రూపుగా చదువుకున్న విద్యార్థులు మాత్రమే మెడికల్ కోర్సులలో చేరేందుకు అర్హులు.

ఇంజనీరింగ్ కోర్సులకు ఉండే పోటీ, కెరీర్ అవకాశాలు మెడికల్ విద్యార్థులకు ఉండకపోయినా, సమాజంలో గౌరపరమైన హోదాను, వృత్తి జీవితాన్ని పొందే అవకాశం వీరికి ఉంటుంది. వైద్య రంగంలో ఏటా వచ్చే కొత్త పోకడలు వైద్య విద్యార్థులకు కొత్త కెరీర్ అవకాశాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

మెడిసిన్ చేసిన తరువాత ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ యందు జూనియర్ డాక్టర్లుగా చేరేందుకు అవకాశం ఉంటుంది. లేదా ఉన్నత విద్యలో రాణించాలంటే ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం., పీజీ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్, ఏరోస్పేస్ మెడిసిన్, ఏవియేషన్ మెడిసిన్, సైకియాట్రి, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్య పూర్తిచేసాకా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించవచ్చు లేదా హాస్పిటల్స్ యందు వైద్య వృత్తిని ప్రారంభించవచ్చు.

బైపీసీ విద్యార్థులకు మెడికల్ కోర్సులు అంటే ఎంబీబీఎస్ మాత్రమే కాదు, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS), డిప్లొమా ఇన్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT), బి.వి.ఎస్‌సి (వెటర్నరీ) వంటి కోర్సులలో చేరొచ్చు.

అలానే బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్, బి.ఎస్‌సి (ఫిషరీస్), బి.ఎస్‌సి (ఫారెస్ట్రీ), బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ వంటి తదితర రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయి.

ఇంటర్ తర్వాత బ్యాచిలర్ డిగ్రీలు

ఇంజనీరింగ్, మెడిసిన్ తర్వాత కెరీర్‌ను సేఫ్‌గా మౌల్డ్ చేద్దామనుకునే వారికీ మూడేళ్ళ సాంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ జాబితాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్సీ), బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బీఏ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్) వంటి కోర్సులు ఉన్నాయి. ఇంటర్ యందు ఎంపీసీ, బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు వాటికీ కొనసాగింపుగా బీఎస్సీ యందు ఎంపీసీ, బిజెడ్‌సి కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు.

వీటితో పాటుగా ఎంపీసీ విద్యార్థులకు బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బయాలజీ విద్యార్థులకు బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బీఎస్సీ హోమ్ సైన్సెస్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ & న్యూట్రీయేషన్ వంటి మొదలగు కోర్సులు చేసేందుకు అవకాశం ఉంటుంది.

వీరు బీఎస్సీ తర్వాత ఉన్నత విద్య కోసం వెళ్లనుకుంటే మాస్టర్ డిగ్రీలు, అవి పూర్తియ్యాక పీహెచ్డీ, ఎంఫిల్ వంటి డాక్టరేట్ కోర్సులు కూడా చేయొచ్చు. అలా కాకుండా బ్యాచిలర్ డిగ్రీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మసీ, ఈకామర్స్ మరియు ఇతర పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీల ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఉన్నవారికి ఆర్ట్స్ కోర్సులు మంచి ఎంపిక, డిగ్రీ మొదటి ఏడాది నుండే పోటీ పరీక్షల దృష్టికోణంలో మీరు సన్నద్దమయితే డిగ్రీ చివరి ఏడాది వచ్చే సమయానికి ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు సిద్ధంగా ఉండొచ్చు.

కామర్స్ విద్యార్థులు బీకామ్ తర్వాత అకౌంటెంట్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియల్ అనలిస్ట్, టాక్స్ కన్సల్టెంట్, టాక్స్ కన్సల్టెంట్ , అకౌంట్స్ మేనేజర్, బిజినెస్ కన్సల్టెంట్, ఫైనాన్స్ మేనేజర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ వంటి వివిధ కొలువును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇంటర్ తర్వాత న్యాయ విద్య

న్యాయవాది వృత్తిపై ఆసక్తి ఉండే విద్యార్థులు ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సులో చేరొచ్చు. న్యాయ విద్య మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కూడా అందుబాటులో ఉంది. ఇంటర్ పూర్తియ్యాక ఏదైనా లా ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించడం ద్వారా లా కోర్సులలో చేరేందుకు అవకాశం లభిస్తుంది.

మారుతున్న సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు మరియు ఎప్పటికప్పుడు పెరుగుతున్న నియంత్రణ పాత్ర కారణంగా న్యాయవాద వృత్తికి రోజురోజుకి గిరాకీ పెరుగుతుంది. చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకుంటూ సెక్షన్లు, చట్టాలపై గురి కుదిరితే వృత్తి జీవితంలో వెనక్కితిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. జూనియర్ లాయరుగా ప్రారంభమై సుప్రీమ్ కోర్టు జార్జి స్తాయికి ఎదగొచ్చు.

న్యాయవిద్య ఒకప్పటిలా లేదు. ఇప్పుడు కొత్త కార్పొరేట్ లుక్ సొంతం చేసుకుంది. పరిశ్రమకు అనుగుణంగా ఏటా కొత్త స్పెషలిజషన్స్ పుట్టుకొస్తున్నాయి. మీ అభిరుచి, ఆసక్తి అనుగుణంగా క్రిమినల్ లాయర్, కార్పొరేట్ లాయర్. జ్యూడిషల్ సర్వీసెస్, లీగల్ జర్నలిస్ట్, లీగల్ అనలిస్ట్, సివిల్ లాయర్, లీగల్ అడ్వైజర్ వంటి వివిధ డిమాండ్ ఉండే ఎంపికలు మీకు అందుబాటులో ఉన్నాయి.

బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టొచ్చు. లేదనుకుంటే ఉన్నత విద్య పరంగా మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎమ్) లో చేరొచ్చు.

ఇంటర్ తర్వాత మేనేజ్‌మెంట్ కోర్సులు

ఇంటర్ తర్వాత మేనేజ్‌మెంట్ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (BBM) బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (BHM&CT), బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (BHM), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) మరియు హాస్పిటాలిటీ, మీడియా & మాస్ కమ్యూనికేషన్, ట్రావెల్ & టూరిజం సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సులు పూర్తిచేసిన వారు ఆతిథ్య రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందొచ్చు. క్లబ్ నిర్వహణ. హోటల్‌లు మరియు రెస్టారెంట్ల నిర్వహణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, క్యాటరింగ్, ఎయిర్‌లైన్ క్యాటరింగ్ & క్యాబిన్ సేవలు. అతిథి గృహాల నిర్వహణ, క్రూయిజ్ షిప్ హోటల్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ లాడ్జీలు, ప్రీమియం హోటల్ & క్యాటరింగ్ సంస్థలలో పనిచేసే అవకాశం దక్కించుకోవచ్చు.

బ్యాచిలర్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిఅయ్యాక వాటిలో పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని కోర్సులలో చేరేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిధిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఈ పరీక్షలో ర్యాంకు పొందండం ద్వారా దశ వ్యాప్తంగా ఉన్న హోటల్ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్లలో అడ్మిషన్లు పొందొచ్చు.

గ్రూపు ఏదైనా, కోర్సు ఏదైనా చివరి లక్ష్యం వాటి ద్వారా ఉపాధి పొందటమే కాబట్టి, కోర్సులను ఎంపిక చేసుకునే ముందు మీ ఆసక్తి అభిరుచులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఇంజనీరింగ్ చేరినవారంతా ఇంజినీర్లు అయిపోయినట్లు కాదు.

ఏ కోర్సు ఎంపిక చేసుకున్నా.. శ్రద్ధతో, క్రమశిక్షణ, పట్టుదలతో మీరు ఎన్నుకున్న రంగంలో కృషి చేస్తే..ఆయా రంగాల్లో ఉన్నతి స్థితికి చేరుతారు. కావున మీ అభిరుచికి, ఆసక్తి అనుకూలంగా కోర్సును ఎంపిక చేసుకుని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. విజయోస్తు ..!

Advertisement

Post Comment