' పాధే భారత్ ' పేరుతో 100 రోజుల రీడింగ్ క్యాంపెయిన్ ప్రారంభం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 100 రోజుల పఠన ప్రచార కార్యక్రమం 'పాధే భారత్' ను ప్రారంభించారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లో భాగంగా విద్యార్థులలో బుక్ రీడింగ్ అలవాటును పెంపొందించేందుకు స్థానిక లేదా మాతృభాషలో వివిధ పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు చిన్న వయసులో పుస్తక పఠనపై ఆసక్తి పెంచి, వారిలోని ఊహాశక్తిని, మానసిక వికాసాన్ని పెంపొందించనున్నారు.
పఠన ప్రచారం జనవరి 1, 2022 నుండి ఏప్రిల్ 10, 2022 వరకు 100 రోజుల (14 వారాలు) నిర్వహించబడుతుంది. ఏ కార్యక్రమంలో ప్రధానంగా 1 నుండి 8 తరగతి విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు.
రూర్బన్ మిషన్ అమలులో తెలంగాణ అగ్రస్థానం
నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (SPMRM) అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తర్వాత రెండు స్థానాలలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు చోటు సంపాదించుకున్నాయి. ఈ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 300 క్లస్టర్లలో తెలంగాణ నుండి సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.
ఈ పథకాన్ని 2016 లో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రారంహించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం స్థానిక గ్రామాల ఆర్థికాభివృద్ధిని ప్రేరేపించడం, ప్రాథమిక సేవలను మెరుగుపరచడం మరియు ప్రణాళికాబద్ధమైన గ్రామీకరణ చేయడం వంటివి ఉన్నాయి. ప్రధానంగా 25000 నుండి 50000 జనాభాతో ఉండే తీరప్రాంత, ఎడారి, కొండలు లేదా గిరిజన ప్రాంతాలను చిన్న పట్టణాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది.
ఏడు ఏళ్ళు పూర్తిచేసుకున్న ఉజాలా పథకం
విద్యుత్ మంత్రిత్వ శాఖ యొక్క ఫ్లాగ్‌షిప్ ఉజాలా ఎల్ఈడీ కార్యక్రమం జనవరి 05, 2022 నాటికీ విజయవంతంగా ఏడేళ్లు పూర్తిచేసుకుంది. అందరికీ అందుబాటులో ఎల్‌ఈడీల కాంతులు అందించాలనే లక్ష్యంతో ఉన్నత్ జ్యోతి (ఉజాలా) పథకాన్ని భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 05, 2015న ప్రారంభించారు. ఈ ఏడేళ్లలో దేశ వ్యాప్తంగా ఈ పథకం ద్వారా దాదాపు 36 కోట్ల ఎల్ఈడీ బల్బులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఉజాలా ఎల్ఈడీ కార్యక్రమం ద్వారా ఈ ఏడేళ్లలో ఏడాదికి 47,778 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ శక్తిని దేశం ఆదా చేసినట్లు తెలిపారు.
స్మార్ట్ సిటీలకు సంబంధించి SAAR ప్రోగ్రాం ప్రారంభం
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (AKAM) వేడుకల్లో భాగంగా, స్మార్ట్ సిటీస్ మిషన్, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) యొక్క సంయుక్త చొరవతో “స్మార్ట్ సిటీస్ అండ్ అకాడెమియా టువర్డ్స్ యాక్షన్ & రీసెర్చ్ (SAAR)” కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని 15 ప్రీమియర్ ఆర్కిటెక్చర్ & ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా చేపట్టిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లను డాక్యుమెంట్ చేయడానికి స్మార్ట్ సిటీలతో కలిసి పని చేయనున్నాయి. 2015లో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభమైన నాటి నుండి దేశవ్యాప్తంగా 2,05,018 కోట్ల పెట్టుబడితో 100 స్మార్ట్ సిటీలలో 5,151 లకు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయబడ్డాయి.
భారతీయ రైల్వే మిషన్ అమానత్ ప్రారంభం
భారతీయ రైల్వేలోని వెస్ట్రన్ రైల్వే జోన్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) రైల్వే ప్రయాణికులు తమ కోల్పోయిన లగేజీని సులభంగా తిరిగి పొందేందుకు "మిషన్ అమానత్" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
భారతీయ రైల్వే 'గార్డ్' హోదాను 'రైలు మేనేజర్'గా మార్పు
భారతీయ రైల్వే బోర్డు నూతనంగా 13 జనవరి 2022 నాటి సవరించిన హోదా పత్రల ప్రకారం ఇకముందు ప్యాసింజర్ అసిస్టెంట్ గార్డ్ - అసిస్టెంట్ ప్యాసింజర్ రైలు మేనేజరుగా, గూడ్స్ గార్డ్ - గూడ్స్ రైలు మేనేజరుగా, సీనియర్ ప్యాసింజర్ గార్డ్ - సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజరుగా మరియు మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైలు గార్డు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు మేనేజర్‌గా ఉంటారు.
భారతదేశ కార్లకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి
భారతదేశంలో కార్లకు కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. M1 కేటగిరీ (8 సీటింగ్) కిందకు వచ్చే కార్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. 01 అక్టోబర్ 2022 తర్వాత తయారు చేయబడే అన్ని కార్లకు ఈ ఆర్డర్ అమలులోకి వస్తుంది.
యోగ్యతా యాప్‌ను ప్రారంభించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్
గ్రామీణ ప్రాంతాల యువతకు వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని అందించడానికి, ఉమ్మడి సేవా కేంద్రాలు (CSC) కొత్తగా యోగ్యత " మొబైల్ ఫోన్ అప్లికేషన్‌ను ప్రారంభించింది ప్రారంభించింది. ఇందులో సైబర్ సెక్యూరిటీ, 3డీ పెయింటింగ్ వంటి ఆధునిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను ఉంచింది.
కోవిడ్ వ్యాక్సినేషన్ గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపు విడుదల
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా, కోవిడ్ వ్యాక్సినేషన్ 1వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వర్చువల్ ప్రోగ్రామ్‌లో స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. భారతదేశం యొక్క కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను గత ఏడాది జనవరి 16న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ప్రపంచ అతిపెద్ద టీకా డ్రైవ్ గా నిలిచింది.
డిపార్టుమెంటు ఆఫ్ హెల్త్ రీసెర్చ్ పేరుతో విడుదల చేసిన 500/- విలువ గల స్టాంప్‌లో ఆరోగ్య కార్యకర్త, సీనియర్ సిటిజన్‌కి కోవాక్సిన్ టీకా వేస్తున్నట్లు చూపబడింది. దీనితో పాటుగా స్టాంపులో ఐసీఎమ్ఆర్ లోగో ముద్రించబడింది.
చింతామణి పద్య నాటకంపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం
స్వాతంత్య్రానికి ముందు 100 ఏళ్ల నాటి ‘చింతామణి’ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకంపై ఇటీవలి కాలంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.