Jeff Bezos | తెలుగులో జెఫ్ బెజోస్ బయోగ్రఫీ
Biographies

Jeff Bezos | తెలుగులో జెఫ్ బెజోస్ బయోగ్రఫీ

జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్

వ్యాపారం అందరూ ప్రారంభిస్తారు, కానీ అందులో కొద్దీ మంది మాత్రమే నెంబర్ వన్ కాగలరు. ఈ నెంబర్ వన్ జాబితాలో కూడా నెంబర్ వన్ గా ఉండేవాడే జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్. బెజోస్‌కు నెంబర్ వన్'గా ఉండటం మహాఇష్టం, అది వ్యాపారంలోనైనా, వ్యక్తిగతంగైన. అందుకే తన సంస్థకు ప్రపంచ అతిపెద్ద నది అయినా అమెజాన్ పేరును పెట్టుకున్నాడు. తన గ్యారేజీలో చిన్న ఆన్‌లైన్ పుస్తక దుకాణంగా ప్రారంభించిన అమెజాన్ సంస్థను, ప్రపంచ ఈకామర్స్ రారాజుగా తీర్చిదిద్దాడు. ఈ విజయం సాధారణ వ్యాపారవేత్తలకు సాధ్యమయ్యే పనికాదు. బెజోస్ దృష్టిలో అమెజాన్ అంటే పెద్దది లేదా నెంబర్ వన్ అని కాదు... సమస్తం అని అర్ధం. మీరు దగ్గరగా పరిశీలిస్తే బెజోస్ అమెజాన్'కు, అమెజాన్ నదికి పెద్ద తేడా కనిపించదు..నా దృష్టిలో ఆ రెండు ఒకటే...! ఈ ఐదు పదుల ప్రపంచ బిలియనీర్ జీవితంను ఈ జనరేషన్ యువత తప్పక తెలుసుకుని తీరాలి.

జెఫ్రీ బెజోస్ బాల్యం & విద్యాభ్యాసం

జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్‌సెన్ జనవరి 12, 1964న న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీలో జాక్లిన్ మరియు థియోడర్ జోర్గెన్‌సెన్ దంపతులకు జన్మించాడు. జెఫ్రీకి జన్మనిచ్చే సమయానికి జాక్లిన్ వయసు 17 ఏళ్ళు, థియోడర్ వయస్సు 19 ఏళ్ళు. ఈ పిల్ల దంపతుల వైవాహిక జీవితాల్లో విభేదాలు రావడంతో జాక్లిన్, థియోడర్ జోర్గెన్‌సెన్ నుండి విడాకులు తీసుకుని 1968లో క్యూబన్ వలసదారు మిగ్యుల్ "మైక్" బెజోస్‌ను వివాహం చేసుకుంది. ఈ బంధం ముడిపడిన కొద్దికాలానికే, మైక్ నాలుగేళ్ల జెఫ్రీని దత్తత తీసుకున్నాడు. దీనితో జెఫ్రీ ప్రెస్టన్ జోర్గెన్‌సెన్ కాస్త జెఫ్రీ ప్రెస్టన్ బెజోస్ గా మారాడు.

బెజోస్ ప్రాథమిక విద్యాభ్యాసం న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ మాంటిస్సోరి పాఠశాల నుండి ప్రారంభమైంది. నాలుగు నుండి ఆరవ తరగతి వరకు హ్యూస్టన్‌లోని రివర్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత తన కుటుంబం ఫ్లోరిడాకు మకాం మార్చడంతో, అక్కడే స్థానిక మియామి పాల్మెట్టో సీనియర్ స్కూల్ నుండి హైస్కూల్‌ విద్యను పూర్తిచేసాడు.

బెజోస్‌కు చిన్ననాటి నుండి సైన్స్ అంటే ఇష్టం. అందులోను ఎలక్ట్రానిక్స్ అంటే ప్రత్యేక ఆకర్షణ ఉండేది. హైస్కూల్‌  తర్వాత ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ సైన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు హాజరయ్యాడు. బెజోస్ యొక్క తాత లారెన్స్ ప్రెస్టన్ గిస్, అల్బుకెర్కీలోని యూఎస్ అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) యందు ప్రాంతీయ డైరెక్టరుగా పనిచేసేవారు. ఆయనకు ఈ ప్రాంతంలో 25,000 ఎకరాల గడ్డిబీడు ఉండేది. దీని అభివృద్ధి కోసం ఆయన ముందుగానే ఉద్యోగ జీవితం నుండి పదవీ విరమణ పొందారు. బెజోస్ యువకుడిగా ఉన్నరోజుల్లో చాలా సంవత్సరాలు వేసవి విడిదిగా ఇక్కడే గడిపేవాడు. ఈ క్రమంలోనే 1986లో ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ డిగ్రీ (BSE) పూర్తిచేసాడు.

బెజోస్ ఉద్యోగ జీవితం

1986 లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక బెజోస్'కు డజన్ల కొలది జాబ్ ఆఫర్లు వచ్చాయి. అందులో ఇంటెల్, బెల్ ల్యాబ్స్, అండర్సన్ కన్సల్టింగ్‌ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. కానీ బెజోస్ ఫిటెల్ అనే ఫిన్‌టెక్ టెలికమ్యూనికేషన్స్ స్టార్టప్ నుండి ఉద్యోగ కెరీర్ ప్రారంభించాడు. ఫిటెల్, స్టార్టప్  కంపెనీ కావడంతో బెజోస్‌కు ఎక్కువ బిజినెస్ మెళుకువలు నేర్చుకునే అవకాశం లభించింది. ఆ సంస్థ కోసం అంతర్జాతీయ వాణిజ్య నెట్‌వర్క్‌ను నిర్మించే ఛాన్స్ దొరికింది. ఇదే సంస్థలో డెవలప్‌మెంట్ హెడ్‌గా మరియు కస్టమర్ సర్వీస్ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగాడు.

ఆ తర్వాత 1988-90 బ్యాంకర్స్ ట్రస్ట్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరి బ్యాంకింగ్ రంగంలో వ్యాపార అనుభవం పొందాడు. 1990 లో కొత్తగా స్థాపించిన డీఈషా & కో లిమిటెడ్ అనే ఫండింగ్ & ఇన్వెస్టుమెంట్ సంస్థలో చేరి 1994 వరకు అక్కడే పనిచేసాడు. ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే బెజోస్ బుర్రలో సొంత వ్యాపార ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నుండి అమెజాన్ పురుడుపోసుకుంది.

అమెజాన్ ప్రస్థానం

బెజోస్‌కు ముందునుండే సొంత వ్యాపారం ప్రారంభించాలనే కోరిక బలంగా ఉండేది. డీఈషా బ్యాంకింగ్ సంస్థలో పనిచేసే సమయంలో ఇంటర్నెట్ యొక్క పెట్టుబడి అవకాశాలను పరిశీలించే బాధ్యత బెజోస్‌కు లభించింది. వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ రంగం బెజోస్‌ను ఆకర్షించింది. దీనితో ఆయనలోని వ్యాపారవేత్త మరికొంచెం ముందుగా నిద్రలేచాడు. ఇంటర్నెట్ భవిష్యత్తును అంచనా వేసిన బెజోస్‌, 1993 చివరిలో, తన సొంత ఇంటర్నెట్ ఆధారిత ఈకామర్స్ సంస్థకు బీజం వేసాడు.

సొంత వ్యాపార ఆలోచనతో డీఈషా బ్యాంకింగ్ సంస్థను వదిలిన బెజోస్‌, తన సొంత గ్యారేజిలో కొంతమంది ఉద్యోగులతో తన వ్యాపార సైట్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించాడు. 5 జులై 1994 లో అమెజాన్ ప్రస్థానం మొదలయ్యింది. అమెజాన్ ప్రారంభంలో కేవలం పుస్తక ఈకామర్స్ సంస్థగా తన సేవలు మొదలుపెట్టింది. దీని ప్రారంభ పెట్టుబడి తల్లిదండ్రులు, తన స్నేహుతుల నుండి సేకరించాడు. ఈ వ్యాపార ప్రణాళికను సన్నిహితులు ఒక విఫల ప్రయత్నంగా అభివర్ణించారు. బెజోస్‌ ఎంపిక చేసుకున్న వ్యాపార మాధ్యమం గొప్పదైన..పుస్తకాల విక్రయం అనేది విజయవంతమైన వ్యాపార ఆలోచన కాదని విమర్శించారు. ఆశ్చర్యంగా విమర్శకులు అనుకున్నదే జరిగింది. అమెజాన్ ప్రారంభమైన ఏడాదికి మొదటి పుస్తకం అమ్మగలిగింది.

బెజోస్‌ అంత త్వరగా వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. తన వ్యాపార ప్రణాళికలో లోపం లేదని తనకు తెలుసు. దాన్ని అమలు చేయడంలోనే ఉన్న లోపాన్ని గుర్తించాడు. ఈకామర్స్ వ్యాపారం ప్రజలకు కొత్త కావడంతో, వారిని ఆకర్షించేందుకు ప్రణాళిక రచించాడు. ఆకర్షణీయమైన ఆఫర్లతో, వేగవంతమైన డెలివరీ సదుపాయంతో, 24 గంటలు ఆర్డర్ చేసుకునే ఆప్షన్లతో పాటుగా పుస్తక అభిమానుల వ్యక్తిగత సమీక్షలను తమ సైట్ యందు అందుబాటులో ఉంచడంతో క్రమంగా, అమ్మకాలు, ఖాతాదారుల సంఖ్యా పెరగడం ప్రారంభమైంది.

లోకల్ బుక్ స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకుని సేవలలో నాణ్యత పెంచడంతో పాటుగా, ప్రింటుకు నోచుకుని వేలాది పుస్తకాలను అమెజాన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. దీనితో వ్యాపారం మరింత విజయవంతమైంది. ఇదే సమయంలో బెజోస్‌ అమెజాన్ విస్తరణపై దృష్టి సారించాడు. అమెజాన్ ద్వారా మరిన్ని వస్తువులను అందుబాటులోకి తీసికొచ్చేందుకు ప్రయత్నించాడు. 1998 ఏడాది మొదటి భాగంలో అమెజాన్ సీడీల అమ్మకాన్ని ప్రారంభించింది, ఆ తరువాత ఏడాది వీడియోల అమ్మకాన్ని దానికి జేతచేసింది. చూస్తుండగానే అమెజాన్ అతిపెద్ద ఈకామర్స్ సంస్థగా విజయవంతమైంది. 1999 టైమ్ మ్యాగజైన్ కవర్‌పై "పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా జెఫ్ బెజోస్ కనిపించాడు. ఇది అమెజాన్ యొక్క మొదటి విజయం.

2005 తర్వాత అమెజాన్ తన వినియోగదారుల కోసం ఎలక్ట్రానిక్స్, దుస్తులు, సాఫ్ట్వేర్ మరియు హార్డ్‌వేర్‌తో సహా విస్తారమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో 2006 నాటికీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), క్లౌడ్-కంప్యూటింగ్ వంటి ఇంటర్నెట్ సేవల్లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఏడాది అమెజాన్ డిజిటల్ రీడర్ రూపంలో తీసుకొచ్చిన అమెజాన్ కిండ్ల్ విశేష ఆదరణ పొందింది. 2010 లో అమెజాన్ స్టూడియోస్ పేరుతో తన స్వంత టెలివిజన్ షోలు మరియు చలనచిత్రాలను రూపొందించడం ప్రారంభించింది. అలానే స్పేస్ ఫ్లైట్ కంపెనీ బ్లూ ఆరిజిన్.. ఈ విధంగా అమెజాన్ సగటు వినియోగదారుడికి అవసరమయ్యే అన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి ప్రపంచ నెంబర్ వన్ ఈ కామర్స్ సంస్థగా రూపుదిద్దుకుంది. తన వ్యవస్థాపకుడు బెజోస్‌ను నెంబర్ వన్ బిలియనర్ సింహాసనం ఎక్కించింది.

1996 లో అమెజాన్ యొక్క వార్షిక నికర అమ్మకాలు $510,000  డాలర్లు. 1998 నాటికీ అమెజాన్ ఆదాయం $600 మిలియన్ డాల్లర్లకు చేరుకుంది. 2008 లో అమెజాన్ $19.1 బిలియన్ డాల్లర్ల మార్కును చేరుకుంది. 2018 నాటికీ అమెజాన్ అమెజాన్ సంపద అక్షరాలా $233 బిలియన్ డాలర్లు. 2018లో కంపెనీ నిర్వహణ ఆదాయంలో దాదాపు సగం AWS నుండి పొందబడింది. ప్రస్తుతం అమెజాన్ నికర ఆదాయం దాదాపు $469 బిలియన్ డాలర్లు. ఈ సుదీర్ఘ విజయ ప్రయాణంలో అమెజాన్, బెజోస్‌ ఇద్దరూ నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పుడే 2021 లో సీఈఓ పదవి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అయితే, అతను అమెజాన్‌లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నాడు. బెజోస్‌ లేని అమెజాన్ అంటే..నీరు లేని అమెజాన్ అని..ఈ రెండు ఎప్పటికి జరగవు.

బెజోస్ వ్యక్తిగత జీవితం |పెళ్లి మరియు పిల్లలు

బెజోస్, 1993లో డీఈషా బ్యాంకింగ్ సంస్థలో పనిచేసే సమయంలోనే తన సహఉద్యోగి మెకెంజీ టటిల్‌ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె. ఈ దంపతులు తమ కుమార్తెను చైనా నుంచి దత్తత తీసుకున్నారు. బెజోస్ వ్యకిగత జీవితం చాలా చాలా వరకు పబ్లిక్ డొమైన్ అందుబాటులో ఉండదు. తన కుటుంబ విషయాలు తెలిపేందుకు బెజోస్ కూడా అంతగా ఆసక్తి చూపారు. ఈ దంపతుల సుదీర్ఘ వైవాహిక బంధం 2019లో విడాకులతో ముగిచింది.

బెజోస్ దాతృత్వం

బెజోస్ ఒకానొక సమయంలో కనికారంలేని, పిచనారి కుబేరుడుగా గుర్తించబడ్డాడు. మరోవైపు ఈ గొప్ప లక్షణం వలనే ప్రపంచ సంపన్నుడుగా ఎదిగాడు అనేవారు ఉన్నారు. ఏది ఏమైనా బెజోస్ ఈ రెండు వర్గాల్లో కూడా లేడు. అవసరమైన సందర్భాలలో బెజోస్ తన దాతృత్వాన్ని చూపిస్తూనే వచ్చాడు. ఇందులో గొప్పగా చెప్పేందుకు ఒకటీ లేకపోవచ్చు..కానీ మంచిగా చెప్పేందుకు చాలా ఉన్నాయి.

బెజోస్ 2009 మరియు 2017 మధ్య తనకు ఎంతో ఇష్టమైన ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు కొన్ని మిలియన్ డాలర్ల సహాయం అందించాడు. 2013లో అమెజాన్ మాజీ ఉద్యోగి స్థాపించిన లాభాపేక్ష లేని వరల్డ్‌రీడర్‌కి $500,000 ఆర్ధిక సహాయాన్ని అందించాడు. యూఎస్ వ్యాప్తంగా నిరాశ్రయులైన పిల్లల కోసం పనిచేసే స్వచ్చంద సంస్థలకు దాదాపు వంద మిలియన్లకు పైగా విరాళాలు అందించాడు. సొంతకాళ్లపై ఎదిగే ఆలోచన ఉన్న ప్రతి సహచరుడుకి బెజోస్ తన సహాయాన్ని అందించాడు. ఏదిఏమైనా గివింగ్ ప్లెడ్జ్‌పై సంతకం చేయని అతికొద్ది మంది మెగా సంపన్న వ్యక్తులలో బెజోస్ ఒకరు.

ముగింపు వ్యాఖ్యలు

జెఫ్ బెజోస్, తనను ఒక నికార్సయిన వ్యాపారవేత్తగానే గుర్తించుకోవాలని కోరుకున్నాడు. వ్యాపారాన్ని, వ్యాపారంలానే చేయాలనే ఒక బలమైన అభిప్రాయం తనలో ఉంది. తాను తింటున్న, నిదురిస్తున్న, చివరిగా విహారంలో ఉన్న సమయంలో కూడా వ్యాపారవేత్త గానే వ్యవహరించాడు. 2021 లో తన ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ద్వారా 10 నిముషాల అంతరిక్షయానం కోసం దాదాపు 5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినప్పుడు ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది..ఆ దుబారాతో సగం ప్రపంచానికి ఒక నెల తిండి పెట్టొచ్చు అని కూడా విమర్శించింది.

ఈ అంతరిక్ష విహారం అమెజాన్ షేర్ ధరలో పెరుగుదలకు కారణమై, బెజోస్ సుమారు ఒక్కరోజులో 13 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించాడు. అందుకే బిల్ గేట్స్ తరువాత అత్యధిక కాలం ప్రపంచ కుబేరుడుగా ఉన్నాడు. యువతకు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు. మీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు అందులో టాప్'లో ఉండాలని ఆకాంక్షించండి. దానికి సంబంధించి ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. దానికోసం ప్రపంచమంతా మాట్లాడుకునేలా కృషి చేయండి. అది కొన్నాళ్లకు మీకు బ్రాండింగ్ తెస్తుంది అని చెప్తాడు...నిజమే కదా..! జెఫ్ బెజోస్'కు మించిన బ్రాండ్ ఇంకేముంటుంది.

 

Post Comment