జగనన్న విద్యా దీవెన & జగనన్న వసతి దీవెన పథకం
Scholarships

జగనన్న విద్యా దీవెన & జగనన్న వసతి దీవెన పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లను ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాల పేర్లతో అందిస్తుంది. ఈ రెండు పథకాలను ఇంటర్మీడియట్ నుండి పీజీ చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కేటగిరికి చెందిన విద్యార్థులకు అందిస్తారు.

జగనన్న విద్యా దీవెన పథకం (RTF)

జగనన్న విద్యా దీవెన పథకం కింద ఇంటర్‌, ఐటిఐ అప్ టు ఇంజనీరింగ్, మెడిసిన్, పిహెచ్‌డి చదువుతున్న విద్యార్థుల పూర్తి ట్యూషన్ ఫీజును సదురు కాలేజీలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. కుటుంబ కనీస ఆదాయం 2.5 లక్షల లోపు ఉండి, 75% హాజరు ఉండే విద్యార్థులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వారి కాలేజీ ఖాతాల్లో ఫీజును జమచేస్తారు.

మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని, గత పదిహేనేళ్లుగా వివిధ పేర్లతో అమలుచేస్తుంది. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎందరో నిరుపేద విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకుని, నేడు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఇదే మొదటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకాన్ని అప్పటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రారంభించారు.

జగనన్న వసతి దీవెన పథకం (MTF)

ఈ పథకం కింద ఇంటర్‌, ఐటిఐ అప్ టు ఇంజనీరింగ్, మెడిసిన్, పిహెచ్‌డి చదువుతున్న విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తున్నారు. విద్యార్థులు చదివే కోర్సును బట్టి, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున హాస్టల్, మెస్‌ చార్జీల కింద చెల్లిస్తారు.

ఈ చార్జీల మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రస్తుతం జమ చేస్తారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి యూనిక్‌ బార్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.

జగనన్న విద్యా దీవెన & వసతి దీవెన ఎలిజిబిలిటీ

  1. జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలు పొందాలంటే విద్యార్థులు మొదటిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కేటగిర్లకు చెందినవారై ఉండాలి.
  2. విద్యార్థి కుటుంబ ఆదాయం గరిష్టంగా 2.5 లక్షలకు మించి ఉండకూడదు.
  3. విద్యార్థి హాజరు 75 శాతానికి తక్కువ ఉండకూడదు.
  4. విద్యార్థులు స్టేట్ బోర్డు లేదా రాష్ట్ర యూనివర్సిటీల పరిధిలో అడ్మిషన్ పొందిఉండాలి.
  5. విద్యార్థి కుటుంబానికి అన్ని రకాల భూములు కలిపి 25 ఎకరాలకు మించి ఉండకూడదు.
  6. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉద్యోగ పెన్షన్ తీసుకునే వారు ఉండకూడదు.
  7. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.
  8. కుటుంబంలో ఎవరు ఆదాయ పన్ను చెల్లించే వారు ఉండకూడదు.

ఈ పథకం డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందేవారికి వర్తించదు. అలానే మానేజ్మెంట్ లేదా స్పాట్ అడ్మిషన్ పద్దతిలో జాయిన్ అయ్యే విద్యార్థులకు వర్తించదు. అంతేకాక కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ అడ్మిషన్ పొందే విద్యార్థులు కూడా ఈ పథకం పరిధిలోకి రారు.

జగనన్న విద్యా దీవెన & వసతి దీవెన దరఖాస్తు

పైన చెప్పిన అర్హుతలు ఉన్న విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాల్ లేదా జన్మభూమి వెబ్‌సైట్ నుండి జన్మభూమి స్కాలర్షిప్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులో అడిగిన వివరాలను తప్పులు దొర్లకుండా పూరించి, సంతకం చేసి తిరిగి ప్రిన్సిపాల్‌కు అందించాల్సి ఉంటుంది. దరఖాస్తు సబ్మిట్ చేసేముందు దాని ఐడీ నెంబరును విద్యార్థి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దశలో విద్యార్థి, దరఖాస్తును యాక్సిస్ చేసేందుకు ఈ ఐడీ అవసరం ఉంటుంది.

విద్యార్థి అందించిన దరఖాస్తులను, అడ్మిషన్ సమయంలో సదురు విద్యార్థి అందించిన దరఖాస్తుతో సరిపోల్చి, విద్యార్థి అర్హుతను కాలేజీ ప్రిన్సిపాల్ నిర్ణయిస్తారు. అర్హుత పొందిన దరఖాస్తు వివరాలను కాలేజీ వారు ఆన్‌లైన్ ద్వారా అప్లోడ్ చేస్తారు. ఆన్‌లైన్ యందు వివరాలు నమోదు అవ్వగానే సదురు విద్యార్థి వాటి వివరాలతో కూడిన మెసేజ్ అందుకుంటారు.

తరువాత దశలో విద్యార్థి, దగ్గరలో ఉండే మీసేవ సెంటరుకు పోయి, వారి దరఖాస్తు ఐడీ మరియు ఆధార్ నెంబరుతో కాలేజీ వారు అప్లోడ్ చేసిన ఆన్‌లైన్ ధరఖాస్తు వివరాలు సరి చూసుకోవాల్సి ఉంటుంది. తప్పులు ఏమైనా దొర్లితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తులో అన్ని వివరాలు సక్రమంగా ఉంటె సదురు దరఖాస్తును మీ ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణతో తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనితో దరఖాస్తు ప్రక్రియ పూర్తిఅవుతుంది.

తర్వాత ఏడాది రెన్యువల్ సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్, విద్యార్థి యొక్క ఈ ఏడాది అడ్మిషన్ తేదీని, హాల్ టికెట్ నెంబరును, ఉత్తీర్ణత వివరాలను పొందుపర్చడం ద్వారా విద్యార్థి అప్లికేషన్ రెన్యువల్ అవుతుంది.

రెన్యువల్ ప్రక్రియ పూర్తియిన విద్యార్థులకు, దాని వివరాలతో కూడిన మెసేజ్ వస్తుంది. మెసేజ్ అందుకున్న అభ్యర్థులు దగ్గరలో ఉన్న మీసేవ సెంటరులో ఆధార్ బయోమెట్రిక్ దృవీకరణ ద్వారా చేసుకోవడం ద్వారా స్కాలర్షిప్ రెన్యువల్ ప్రక్రియ పూర్తివుతుంది.