రాష్ట్రపతి భవన్'లో కొత్తగా నిర్మించిన 'ఆరోగ్య వనం' ప్రారంభం
రాష్ట్రపతి భవన్‌లో కొత్తగా నిర్మించిన 'ఆరోగ్య వనం' రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ప్రథమ మహిళ సవితా కోవింద్ కూడా పాల్గున్నారు. 6.6 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడిన ఈ ఆరోగ్య వనంలో వేప, తులసి, బేల్, అరంద్, అర్జున్, అశ్వగంధ మరియు హర్సింగార్ వంటి 215 రకాల ఔషధ మొక్కలను అందుబాటులో ఉంచారు.
చెన్నై వీధి జంతువుల కోసం ప్రత్యేక అంబులెన్స్
వీధి జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ చెన్నైలో ప్రారంభించబడింది. దీనిని అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ "ఫోర్ పా" సహకారంతో ప్రముఖ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అంబులెన్స్‌ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ అనిత సుమంత్ ప్రారంభించారు.
హైదరాబాద్ సుల్తాన్‌పూర్‌లో ఎఫ్‌ఎల్‌ఓ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం
సంగారెడ్డిలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్క్‌లో 50 ఎకరాల ఎఫ్‌ఎల్‌ఓ ఇండస్ట్రియల్ పార్కును తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ప్రారంభించారు. ఈ ఇండిస్ట్రియల్ పార్కును 250 కోట్ల పెట్టుబడితో FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) మరియు తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడిగా ఏర్పాటు చేసాయి. ఇది దేశంలో ఏర్పాటుచేయబడ్డ మొట్టమొదటి 100% మహిళల యాజమాన్య ఇండస్ట్రియల్ పార్కు. మహిళా పారిశ్రామికవేత్తలను వివిధ వ్యాపారాలు నిర్వర్తించేందుకు ఇది సహాయపడనుంది.
గురుగ్రామ్‌లో భారతదేశపు మొట్టమొదటి 'వరల్డ్ పీస్ సెంటర్'
అహింస విశ్వ భారతి సంస్థను స్థాపించిన శాంతి రాయబారి, ప్రముఖ జైనాచార్య డాక్టర్ లోకేష్‌జీ హర్యానాలోని గురుగ్రామ్‌లో భారతదేశ మొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించరు. ఈ కేంద్రం యువ భారత్ వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.
FIDE చెస్ ఒలింపియాడ్ 2022కి చెన్నై ఆతిథ్యం
FIDE చెస్ ఒలింపియాడ్ 2022కి భారతదేశం ఆతిధ్యం ఇవ్వనుంది. 2022 చెస్ ఒలింపియాడ్‌ను చెన్నైలో నిర్వహించేందుకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) సమర్పించిన బిడ్‌ను FIDE కౌన్సిల్ ఆమోదం తెలపడంతో, ఒలింపియాడ్ యొక్క 44వ ఎడిషన్ 26 జూలై 2022 నుండి 8 ఆగస్టు 2022 వరకు చెన్నైలో జరగనున్నాయి. 1927లో FIDE చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన తర్వాత భారతదేశం ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఈ పోటీలు నిజానికి రష్యాలో జరగాల్సింది. ఉక్రెయిన్ పై చేస్తున్న రష్యా ఏకపక్ష యుద్ధంగా కారణంగా ఈ అవకాశం కోల్పోయింది.
పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం
పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసారు. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఖట్కర్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇటీవలే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఆపార్టీ పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇటీవలే పూర్తియిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది, ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తో పాటుగా ఎస్‌ఏడీ పితామహుడు ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం అమరీందర్ సింగ్‌లు, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దు వంటి పేరున్న నాయకులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం ఆప్ 92 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ (18), శిరోమణి అకాలీదళ్ (మూడు), భారతీయ జనతా పార్టీ (రెండు), బహుజన్ సమాజ్ పార్టీ మరియు స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నారు.
మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ రెండోసారి ప్రమాణ స్వీకారం
మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో 60 అసెంబ్లీ సీట్లకు గాను 32 స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీరెన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీరెన్ సింగ్ 2017 నుండి మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన మణిపూర్ మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి రెండవ పర్యాయం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి 2వ పర్యాయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఓటమి చెందినా, తమ పార్టీ బీజేపీ అత్యధిక సీట్లు సాధించడంతో ఆయనకు తిరిగి ముఖ్యమంత్రి మంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం లభించింది. 70 సీట్లకు జరిగిన ఆ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ పార్టీ అత్యధికంగా 47 స్థానాలను దక్కించుకుని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ రెండోసారి ప్రమాణ స్వీకారం
గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు దక్కించుకోవడంతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం దక్కనుంచుకుంది. ప్రమోద్ సావంత్ 2019 నుండి గోవా ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి చరిత్రాత్మక ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలే జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పార్టీ భారీ విజయాన్ని దక్కించుకోవడంతో యోగి వరుసగా రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. యోగితో పాటుగా డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేయగా, 51 మందితో నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసారు. 403 సీట్లు ఉన్న యూపీ ఎన్నికలలో బీజేపీ పార్టీ అత్యధికంగా 255 స్థానాలు దక్కించుకుంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ 111 స్థానాలను దక్కించుకుంది.