Advertisement
తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : సైన్స్ & టెక్నాలజీ
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : సైన్స్ & టెక్నాలజీ

2023 జనవరి నెలకు సంబంధించిన సమకాలిన సైన్స్ మరియు టెక్నాలజీ అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

వైరోవోర్ జీవులను కనుగొన్న అమెరికా పరిశోధకులు

యునైటెడ్ స్టేట్స్‌లోని నెబ్రాస్కా-లింకన్ విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజిస్ట్ జాన్ డెలాంగ్ మరియు అతని బృందం వైరస్‌లను తినే మొట్టమొదటి వైరోవోర్ జీవిని కనుగొన్నారు. న్యూట్లాస్ అనే సైన్స్ మ్యాగజైన్ ప్రకారం జాన్ డెలాంగ్ బృంధం సూక్ష్మ జీవులను తినే జీవులపై చేస్తున్న పరిశోధనలో ఈ అద్భుతం బయటపడింది.

వీరి అధ్యయనం ప్రకారం హాల్టేరియా జాతికి చెందిన మంచినీటి మైక్రోస్కోపిక్ సిలియేట్‌లు భారీ సంఖ్యలో ఇన్ఫెక్షియస్ క్లోరో వైరస్‌లను తింటున్నట్లు వెల్లడించారు. వీరి అంచనా ప్రకారం ఒక చిన్న చెరువులోని సిలియేట్స్ రోజుకు 10 ట్రిలియన్ వైరస్లను తినే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వీరి గణాంకాలు నిజమైతే ప్రపంచ కార్బన్ సైక్లింగ్‌పై పరిశోధకుల అభిప్రాయాలని మార్చుకోవాల్సి ఉంటుంది.

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతికి సంబంధించిన 2023 నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు జనవరి 4న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ మిషన్ రూపొందించారు. ఈ మిషన్ భారతదేశంను ఇంధన స్వతంత్ర దేశంగా మార్చడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాలను డీకార్బనైజేషన్ చేయడంలో సహాయపడనుంది.

ఈ మిషన్‌ ప్రారంభ వ్యయంగా రూ.19,744 కోట్లు కేటాయించారు. దేశంలో దాదాపు 125 గిగావాట్ల అనుబంధ పునరుత్పాదక శక్తితో పాటు సంవత్సరానికి కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయనున్నారు. 2030 నాటికీ ఈ రంగంలో దాదాపు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

యూస్‌లో ప్రపంచ మొట్టమొదటి హనీ బీ వ్యాక్సిన్ ఆమోదం

తేనెటీగలకు సంబంధించి ప్రపంచ మొట్టమొదటి వ్యాక్సిన్‌ను యునైటెడ్ స్టేట్స్ వ్యవసాయ శాఖ ఆమోదం తెలిపింది. ఈ వాక్సిన్ తేనెటీగల జనాభాను నాశనం చేయడానికి కారణమైన బ్యాక్టీరియాను లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రధానంగా అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ వ్యాధి మరణాలను నివారించడానికి ఇది రూపొందించబడింది.

గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2023

ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి మరియు సంక్షోభాలకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) యొక్క గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2023 విడుదల అయ్యింది. ఇది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ యొక్క 18 వ ఎడిషన్‌. ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తుత ఏడాది మరియు రాబోయే దశాబ్దంలో పెరుగుతున్న ప్రమాదాలను హైలైట్ చేస్తుంది.

  • ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా గొలుసులో అంతరాయం, భౌగోళిక ఆర్థిక ఉద్రిక్తతలతో ఈ ఏడాది కూడా వ్యాపారాలు గందరగోలన్ని ఎదుర్కొంటాయిని తెలిపింది.
  • క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతల అభివృద్ధి, సైబర్‌ సెక్యూరిటీ ప్రోటోకాల్‌లలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు ఎమర్జెన్సీ సైబర్ బెదిరింపులను ఎదుర్కొంటాయని వెల్లడించింది.
  • రాబోయే దశాబ్దంలో వాతావరణ మార్పులతో ప్రపంచం అత్యంత తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కోబోతుందని, ప్రకృతి వైపరీత్యాలు మరియు విపరీత వాతావరణ సంఘటనలతో జీవవైవిధ్య నష్టం మరియు పర్యావరణ వ్యవస్థ పతనం తప్పదని హెచ్చరించింది.
  • వాతావరణ మార్పు వేగవంతం కావడంతో వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా వ్యాపార సంస్థలు నూతన ఉత్పాదకతతో సిద్దమవ్వాల్సి ఉంటుందని నివేదించింది.
  • వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్ స్థాయిలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, వాతావరణ వేడిని 1.5°Cకి పరిమితం చేయాలనే గ్లోబల్ ఆశయాలను సాధించడం చాలా అసంభవం అని వెల్లడించింది.
  • ఆర్థిక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ సామర్థ్య సమస్యలు మరియు తీవ్రతరం అవుతున్న వాతావరణ పరిస్థితులు మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పును తెచ్చిపెడతాయని తెలిపింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అనేది స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ ప్రభుత్వేతర మరియు లాబీయింగ్ సంస్థ. దీనిని జర్మన్ ఇంజనీర్ మరియు ఆర్థికవేత్త క్లాస్ స్క్వాబ్ 24 జనవరి 1971న స్థాపించారు. ఇది ప్రపంచ, ప్రాంతీయ మరియు పరిశ్రమల ఎజెండాలను రూపొందించడానికి వ్యాపారం, రాజకీయ, విద్యా మరియు సమాజంలోని ఇతర నాయకులను, నిపుణులను భాగస్వామ్యం చేస్తుంది.

ఉగాండాలో ఎబోలా వ్యాధి వ్యాప్తి సమాప్తం

ఉగాండాలో సూడాన్ ఎబోలా వైరస్ వల్ల సంభవించిన ఎబోలా వ్యాధి వ్యాప్తి ముగింపు దశకు చేరుకున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకటించింది. గత ఏడాది 20 సెప్టెంబర్ 2022న ఉగాండాలోని సెంట్రల్ ముబెండే జిల్లాలో మొదటి కేసు నమోదు అయ్యింది. కాంటాక్ట్ ట్రేసింగ్, ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణ వంటి కీలక నియంత్రణ చర్యల ద్వారా నాలుగు నెలలోపే దీని వ్యాప్తికి ముగింపు పలికినట్లు డబ్ల్యుహెచ్ఓ ప్రకటించింది.

ఎబోలా వైరస్ డిసీజ్ (EVD) అనేది ఒక అరుదైన మరియు ప్రాణాంతక వ్యాధి. ఇది మనుషులను మరియు మానవేతర ప్రైమేట్‌లను (కోతులు, గొరిల్లాలు మరియు చింపాంజీలు) ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన రక్తస్రావం, అవయవ వైఫల్యం కారణంగా మరణానికి దారి తీస్తుంది. ఇది మొదటిసారి 1976లో కాంగోలోని ఎబోలా నది పరివాహక ప్రాంతాలలో కనుగొనబడింది.

జియోస్పేషియల్ హ్యాకథాన్ 2023 ప్రారంభం

భారత జియోస్పేషియల్ ఎకోసిస్టమ్‌లో ఇన్నోవేషన్ మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ “జియోస్పేషియల్ హ్యాకథాన్” 2023 ను ప్రారంభించారు. ఇది జనవరి 14 న ప్రారంభమయి 10 మార్చి, 2023న ముగుస్తుంది. జియోస్పేషియల్ డేటా అనేది భూమి యొక్క ఉపరితలంపై ప్రదేశాలు, వస్తువులు, సంఘటనలు లేదా ఇతర లక్షణాలను వివరించే సమాచారం.

జియోస్పేషియల్ హ్యాకథాన్‌ రూపకల్పనలో భాగస్వామ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, ఐఐఐటీ హైదరాబాద్ మరియు మైక్రోసాఫ్ట్ ఇండియాలను జితేంద్ర సింగ్ అభినందించారు. 2020లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అన్‌లాక్ చేసిన తర్వాత, జియోస్పేషియల్ సెక్టార్‌ను సరళీకరించడానికి మరియు ప్రజాస్వామ్యీకరించడానికి ప్రభుత్వం అనేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ హ్యాకథాన్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రభుత్వ మరియు ప్రైవేట్ జియోస్పేషియల్ రంగాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడమే కాకుండా మన దేశ జియోస్పేషియల్ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దీనిని రూపకల్పన చేసారు. 2030 నాటికి విశ్వసనీయమైన భారత భౌగోళిక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడుతుంది.

రక్షిత మొక్కల జాబితాలో నీలకురింజిని

భారత పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 యొక్క షెడ్యూల్ III ప్రకారం నీలకురింజిని రక్షిత మొక్కల జాబితాలో చేర్చింది. ఇక మీదట ఈ మొక్కను పెకిలించిన లేదా నాశనం చేసిన వారికి ₹25,000 జరిమానా మరియు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

కురింజి లేదా నీలకురింజిగా పిలిచే ఈ మొక్క శాస్త్రీయనామం స్ట్రోబిలాంతస్ కుంతియానస్. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలలోని షోలా అడవులలో పెరిగే ఒక రకమైన పొద. నీలకురింజి అలంకార మరియు ఔషధ గుణాలు రెండింటినీ కలిగి ఉంటుంది. ఈ మొక్క ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాలానుగుణంగా పుష్పిస్తుంది.

పశ్చిమ కనుమలలో పెరిగే అరుదైన వృక్ష జాతులలో ఇది అరుదైనది. ఇది ప్రపంచంలోని మరే ప్రాంతంలోనూ పెరగదు. ఇది ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చబడింది.

నాగ్‌పూర్‌లో 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ISC) 108వ సెషన్ జనవరి 3న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జనవరి 3 నుండి 7వ తేదీ మధ్య 5 రోజులు పాటు సాగే ఈ సమావేశాలను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ISCA) నిర్వహిస్తుంది.

ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను "మహిళా సాధికారతతో సైన్స్ & టెక్నాలజీలో సుస్థిర అభివృద్ధి" అనే ఫోకల్ థీమ్'తో జరుపుతున్నారు. అలానే ఈ ఏడాది మొదటిసారిగా “చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్” సెషన్ కూడా నిర్వహిస్తున్నారు. అలానే డాక్టర్ జితేంద్ర సింగ్, గిరిజన మహిళల సాధికారతకు సంబంధించి “ట్రైబల్ సైన్స్ కాంగ్రెస్” అనే పేరుతో కొత్త ఈవెంట్‌ను జోడించారు.

ఈ సర్వసభ్య సైన్స్ సమావేశాలలో నోబెల్ గ్రహీతలు, ప్రముఖ భారతీయ మరియు విదేశీ పరిశోధకులు, అంతరిక్షం, రక్షణ, ఐటీ మరియు వైద్య పరిశోధనలతో సహా అనేక రకాల రంగాలకు చెందిన నిపుణులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

గుజరాత్‌లో మొదటి యానిమల్ ఐవీఎఫ్ మొబైల్ యూనిట్‌ ప్రారంభం

గుజరాత్‌లోని అమ్రేలీలో మొదటి యానిమల్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) మొబైల్ యూనిట్‌ను జనవరి 1న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభించారు. దీనిని భారత ప్రభుత్వం మరియు అమర్ డైరీ యొక్క జాయింట్ వెంచరుగా ఏర్పాటు చేయబడింది.

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అనేది సంతానంలో జన్యుపరమైన సమస్యలను నివారించడానికి మరియు పిల్లల గర్భధారణలో సహాయం చేయడానికి ఉపయోగించే సంక్లిష్టమైన సంతానోత్పత్తి ప్రక్రియ.  స్ర్తి, పురుష జీవుల నుండి సేకరించిన ఫలవంతమైన అండాలను, స్పెర్మ్ కణాలను ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి, స్త్రీ జీవులలో అభివృద్ధి చేస్తారు.

భోపాల్‌లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023

ఎనిమిదో ఎడిషన్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2023 ను భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జనవరి 21 నుండి 24 మధ్య నిర్వహించారు. దీనిని భారతదేశం యొక్క శాస్త్ర మరియు సాంకేతిక పురోగతుల విజయాలకు గుర్తుగా 2015 నుండి జరుపుకుంటున్నారు.

సామాన్య ప్రజలను సాంకేతిక అంశాల యందు భాగస్వామ్యం చేయడం. పాఠశాల పిల్లలలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం. ఈ ఏడాది ఈ వేడుకను "మూవింగ్ టువార్డ్స్ అమృతకల్ విత్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్' థీముతో నిర్వహిస్తున్నారు.

ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు. భోపాల్‌లో తొలిసారిగా జరుగుతున్న సైన్స్ ఫెస్టివల్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 8,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరిలో ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పరిశ్రమ నిపుణులు ఉన్నారు.

Post Comment