తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మార్చి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 03 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

భారత్ అధికారికంగా తీవ్ర పేదరికం నుండి దూరం

అమెరికన్ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ యొక్క తాజా నివేదిక ప్రకారం భారతదేశం అధికారికంగా అత్యంత పేదరికాన్ని అధిగమించింది. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ అంతర్జాతీయ పేదరిక ప్రమాణాల ప్రకారం భారత్ తీవ్ర పేదరికంను అధిగమించినట్లు పేర్కొంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ యొక్క బలమైన పాలసీ థ్రస్ట్ వలన ఇది సాధ్యమైనట్లు నివేదించింది.

  • ప్రముఖ ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా మరియు కరణ్ భాసిన్ రచించిన ఈ నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో భారత్ యొక్క సమ్మిళిత వృద్ధిని పెంపొందిస్తూ, భారత ప్రభుత్వం యొక్క బలమైన విధాన కార్యక్రమాలు ఈ విజయానికి కారణమని పేర్కొంది.
  • ఈ నివేదిక హెడ్‌కౌంట్ పేదరికం నిష్పత్తిలో గణనీయమైన క్షీణత మరియు గృహ వినియోగంలో పెరుగుదలను వెల్లడించింది.
  • ఈ డేటా ప్రపంచ బ్యాంకు యొక్క మునుపటి అంచనాలకు సవాళ్లను అందించింది, ఇది భారతదేశంలో పేద వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉందని సూచిస్తుంది.
  • ఈ నివేదిక అధిక ఆర్థిక వృద్ధి మరియు ఆదాయ అసమానతలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది.
  • హెడ్‌కౌంట్ పేదరికం నిష్పత్తి 2011-12లో 12.2% నుండి 2022-23లో 2%కి పడిపోయినట్లు తెలిపింది.
  • ఇటీవల విడుదలైన 2022-23కి సంబంధించిన అధికారిక వినియోగ వ్యయ గణాంకాల ప్రకారం, 2011-12 నుండి వాస్తవ తలసరి వినియోగ వృద్ధి సంవత్సరానికి 2.9%గా నమోదైంది.
  • దీని ప్రకారం పట్టణ వృద్ధి 2.6% కంటే గ్రామీణ వృద్ధి 3.1% తో గణనీయంగా పెరిగింది.
  • ఈ నివేదిక గత పదేళ్లలో భారతదేశానికి సంబంధించిన మొదటి అధికారిక సర్వే-ఆధారిత పేదరిక అంచనాలను అందించింది.
  • దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం చేపట్టిన జాతీయ మిషన్ వంటి చర్యలు మరియు సౌర విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు మరియు మంచినీటి కనెక్షన్లు వంటివి గ్రామీణ భారతంలో గణనీయమైన ఫలితాలు అందించినట్లు తెలిపింది.
  • ఆగస్ట్ 15, 2019 నాటికి భారతదేశంలో గ్రామీణ భారతంలో మంచినీటి కనెక్షన్ల యాక్సెస్ 16.8% ఉండగా, ప్రస్తుతం 74.7% శాతంకు చేరుకున్నట్లు తెలిపింది.
  • ఇది ప్రజల సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గణనీయంగా సహాయపడినట్లు తెలిపింది.

అయితే బ్రూకింగ్స్ నివేదిక దాని స్వంత విశ్లేషణ ద్వారా రూపొందించబడింది. ఇది అధికారిక భారత ప్రభుత్వ గణాంకాలు కాదు. ఈ నివేదిక ఇతర అంచనాలకు విభిన్నంగా ఉంది. ప్రపంచ పేదరిక గడియారం అంచనాలు మరియు నీతి ఆయోగ్ (ఇండియన్ థింక్ ట్యాంక్) నివేదిక వంటివి బ్రూకింగ్స్ నివేదిక కంటే అధిక పేదరికం రేటును సూచిస్తున్నాయి.

భారతీయ ఫార్మా ప్రమాణాలను గుర్తించిన మొదటి స్పానిష్ దేశంగా నికరాగ్వా

ఇండియన్ ఫార్మాకోపోయియా (ఐపి) అని కూడా పిలువబడే భారతీయ ఔషధ ప్రమాణాలను గుర్తించిన మొదటి స్పానిష్ మాట్లాడే దేశంగా నికరాగ్వా అవతరించింది. ఇటీవలే భారతదేశం మరియు నికరాగ్వా ఔషధాల నియంత్రణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం చేసుకోవడంతో ఇది చోటు చేసుకుంది.

నికరాగ్వాలోని భారత రాయబారి సుమిత్ సేథ్ మరియు నికరాగ్వా ఆరోగ్య మంత్రి మార్తా రేయిస్ ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఎప్పటిలానే తమ స్వంత ఫార్మకోపోయియాను కలిగి ఉంటాయి. అలానే మరొక దేశానికి చెందిన ఫార్మాకోపోయియాను కూడా గుర్తించాయి.

  • ఇండియన్ ఫార్మకోపోయియా కమీషన్ (ఐపీసీ) అనేది కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ.
  • ఇది దేశంలోని ఔషధాలకు ప్రమాణాలను నిర్దేశించడానికి రూపొందించబడింది.
  • ఇండియన్ ఫార్మకోపోయియా అనేది భారతీయ ఔషధాల పరిశోదన, తయారీ, ఉపయోగ ప్రమాణాలకు చెందిన అధికారిక పుస్తకం.
  • డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టం, 1940లోని రెండవ షెడ్యూల్‌లో ఐపి చట్టపరమైన హోదాను కలిగి ఉంది.
  • భారతదేశంలో దిగుమతి చేసుకున్న, తయారు చేయబడిన మరియు పంపిణీ చేయబడిన అన్ని మందులు తప్పనిసరిగా ఐపిలో క్రోడీకరించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
  • ఆఫ్ఘనిస్తాన్, ఘనా, నేపాల్, మారిషస్ మరియు సురినామ్ అనే ఐదు దేశాలు ఇండియన్ ఫార్మకోపోయియా ప్రమాణాలను అనుచరిస్తున్నాయి.

భారతీయ ఫార్మాకోపోయియా ముడి పదార్థాలు మరియు పూర్తయిన ఔషధ ఉత్పత్తులు రెండింటికీ కఠినమైన ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ ఒప్పందం భారతదేశం మరియు నికరాగ్వా రెండింటికీ సానుకూల పరిణామం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని మెరుగుపరచడానికి మరియు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.

రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా (స్పానిష్) సెంట్రల్ అమెరికాలో అతిపెద్ద దేశం. ఇది పసిఫిక్ మహాసముద్రం మరియు కరేబియన్ సముద్రం మధ్యలో ఉంది. ఈ దేశ ఉత్తర సరిహద్దులో హండూరాస్, తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, దక్షిణ సరిహద్దులో కోస్టారిక, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.

  • దేశం : రిపబ్లిక్ ఆఫ్ నికరాగువా
  • ఖండం : ఉత్తర అమెరికా
  • రాజధాని : మనాగ్వా
  • కరెన్సీ : నికరాగ్వాన్ కార్డోబా
  • అధికారిక భాష : స్పానిష్
  • అధ్యక్షుడు : డేనియల్ ఒర్టెగా

కటక్ రూపా తారకాసి & బంగ్లా మస్లిన్‌లకు జిఐ ట్యాగ్

చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ ద్వారా ప్రసిద్ధ కటక్ రూప తారకాసి (సిల్వర్ ఫిలిగ్రీ)కి మరియు బంగ్లా మస్లిన్‌లకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) ట్యాగ్ ఇవ్వబడింది. వీటితో పాటుగా అస్సాం మజులీ మాస్క్, నరసాపూర్ క్రోచెట్ లేస్, కచ్ రోగన్ క్రాఫ్ట్, రత్లం రియావన్ లాహ్సున్ (వెల్లుల్లి), అంబాజీ వైట్ మార్బుల్, త్రిపుర రిసా టెక్స్‌టైల్, హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్ మరియు అస్సాం మజులి మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్ కూడా ఈ గుర్తింపును దక్కించుకున్నాయి.

  • ఒడిశా రూప తారకాసి : ఇది ఒడిశాలోని కటక్‌లోని ప్రసిద్ధ సిల్వర్ ఫిలిగ్రీ కళారూపం, ఇది క్లిష్టమైన డిజైన్‌లు మరియు చక్కటి హస్తకళకు ప్రసిద్ధి. ఇది 500 సంవత్సరాల కంటే పాతదిగా విశ్వసించబడుతుంది.
  • బెంగాల్ మస్లిన్ : ఇది బెంగాల్ యొక్క సాంప్రదాయ చేనేత క్రాఫ్ట్, ఇది సున్నితమైన నాణ్యత మరియు సున్నితమైన నేత సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది. ఇది సన్నని కాటన్ థ్రెడ్‌లతో తయారు చేయబడుతుంది. 300 మీటర్ల నూలు 1 గ్రాము బరువు ఉంటుంది.
  • అస్సాం మజులీ మాస్క్ :మజులి మాస్క్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజులి యొక్క సాంస్కృతిక గుర్తింపులో లోతుగా పొందుపరచబడిన ఒక శక్తివంతమైన కళారూపం. ఇవి 16వ శతాబ్దంలో ఉద్భవించిన ముఖ భొనా అనే సంప్రదాయ ముసుగు-ఆధారిత థియేటర్ రూపంలో ఉపయోగించబడతాయి. ఈ ముసుగులు దేవతలు, దేవుళ్ళు, రాక్షసులు మరియు జంతువులతో సహా హిందూ పురాణాల నుండి అనేక రకాల పాత్రలను వర్ణిస్తాయి.
  • మజులి మాన్యుస్క్రిప్ట్ పెయింటింగ్ : ఇది అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజులిలో ఆచరించే సాంప్రదాయక కళారూపం . ఈ పెయింటింగ్‌లు దృశ్యపరంగా అద్భుతమైనవి మాత్రమే కాకుండా మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి ప్రధానంగా భాగవత పురాణంలోని కథలు మరియు సన్నివేశాలను వర్ణిస్తాయి. ఇవి హిందూమతంలో ప్రధాన పాత్ర అయిన శ్రీకృష్ణుడి జీవితం మరియు బోధనలపై దృష్టి సారిస్తాయి.
  • నరసపూర్ క్రోచెట్ లేస్ : ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసాపూర్ పట్టణం నుండి ఉద్భవించిన లేస్ రూపం. ఇది గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయ వర్గాలలో ఈ క్రాఫ్ట్ సుమారు 150 సంవత్సరాల క్రితం ఉద్భవించిందని నమ్ముతారు. ఇది క్రోచెట్ సూదులను ఉపయోగించి చేతితో సూక్ష్మంగా సృష్టించబడుతుంది.
  • కచ్ రోగన్ క్రాఫ్ట్ : కచ్ రోగన్ క్రాఫ్ట్ అనేది గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని నిరోనా గ్రామంలో అభ్యసించే ఒక ప్రత్యేకమైన మరియు శతాబ్దాల నాటి కళారూపం. ఈ క్రాఫ్ట్ పర్షియాలో (ప్రస్తుత ఇరాన్) ఉద్భవించిందని నమ్ముతారు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఖత్రీ వలసదారుల కుటుంబం దీనిని భారతదేశానికి తీసుకువచ్చింది. నేడు ఈ కళారూపాన్ని నిరోనా యొక్క ఖత్రీ కుటుంబం మాత్రమే అభ్యసిస్తున్నారు. ఇది అరుదైన మరియు బాగా సంరక్షించబడిన సంప్రదాయ కళారూపం.
  • రత్లాం రియావాన్ లాహ్సున్ (వెల్లుల్లి) : దీనిని రియావాన్ సిల్వర్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలోని రియావాన్ గ్రామంలో కనిపించే వెల్లుల్లి రకం. ఇది ఘాటైన మరియు దృఢమైన రుచికి ప్రసిద్ధి చెందింది. రియావాన్ వెల్లుల్లి ఇతర రకాలతో పోలిస్తే అధిక నూనెను కలిగి ఉంటుంది. ఇది అధిక ఔషధ విలువలను కూడా కలిగి ఉంటుంది.
  • అంబాజీ వైట్ మార్బుల్ : ఇది గుజరాత్‌లోని పాలరాయి గనులలో లభ్యమయ్యే రకమైన పాలరాయి. ఇది లేత బూడిద రంగు లేదా నలుపు సిరలుతో కూడిన పాల తెలుపు రంగుకు ప్రసిద్ధి చెందింది. అంబాజీ వైట్ మార్బుల్ దాని దీర్ఘకాల మన్నిక మరియు సులభమైన నిర్వహణకు ప్రసిద్ధి చెందింది.
  • త్రిపుర రిసా టెక్స్‌టైల్ : దీనిని రిసా అని కూడా పిలుస్తారు. ఇది ఈశాన్య భారతదేశంలోని త్రిపురలోని స్థానిక కమ్యూనిటీలు ధరించే చేతితో నేసిన వస్త్రం. ఇది సాంప్రదాయకంగా స్థానికంగా లభించే పత్తితో తయారు చేయబడుతుంది. రిసా దాని మృదుత్వం మరియు సౌకర్యవంతమైన దుస్తులకు ప్రసిద్ధి చెందింది.
  • హైదరాబాద్ లాక్ బ్యాంగిల్స్ : ఇవి హైదరాబాద్ నగరంలో సాంప్రదాయకంగా తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన బ్యాంగిల్. ఇవి లాక్ కీటకం నుండి తీసుకోబడిన సహజమైన రెసిన్ అయిన లాక్ నుండి రూపొందించబడతాయి. ఇవి వాటి శక్తివంతమైన రంగులు, క్లిష్టమైన డిజైన్‌లు మరియు తేలికపాటి స్వభావానికి ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లో లాక్ బ్యాంగిల్ తయారీ కళ 500 సంవత్సరాల క్రితం మొఘల్ కాలంలో ఉద్భవించిందని నమ్ముతారు. ఈ గాజులు మొదట రాజ కుటుంబాల్లోని స్త్రీలు ధరించేవారు.

యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ సేవలు ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఇండియన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో సొంత యూపీఐ సేవలను ప్రారంభించింది. ఈ చొరవ ఫ్లిప్‌కార్ట్ యాప్‌ ద్వారా ఫండ్ బదిలీలు మరియు చెల్లింపులకు అనుమతి ఇస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ యూపీఐ కోసం నమోదు చేసుకున్న వినియోగదారులు @fkaxis హ్యాండిల్‌ని అందిస్తుంది.

  • ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవలు ప్రారంభం తర్వాత సూపర్‌కాయిన్స్, క్యాష్‌బ్యాక్, మైలురాయి ప్రయోజనాలు మరియు బ్రాండ్ వోచర్‌లు వంటి లాయల్టీ ఫీచర్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక చేస్తుంది.
  • గత ఏడాది నుండి తన సొంత యూపిఐ వేదికను ఫ్లిప్‌కార్ట్ పరీక్షిస్తోంది.
  • ఈ వేదిక దాని వినియోగదారులను ఇతర అప్లికేషన్‌లకు మారకుండానే యూపీఐ చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది.

ఇటీవలే కాలంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దేశంలో రెండు, మూడు యూపీఐ సంస్థలపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా యూపీఐ అనుమతులను సులభతరం చేస్తుంది. ఇదే అదునుగా వినియోగదారుల ఇంటర్నెట్ కంపెనీలు తమ స్వంత యూపీఐ వేదికలను అందుబాటులోకి తెస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ 2022 చివరిలో అతిపెద్ద యూపీఐ భాగస్వామి అయినా ఫోన్‌పే విడిపోయిన తర్వాత తాజాగా తన సొంత యూపీఐ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ వేదిక జీరో-కాస్ట్ సొల్యూషన్‌తో ఫ్లిప్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ లోపల మరియు వెలుపల ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ వ్యాపారి లావాదేవీలు చేసేందుకు వినియోగదారులకు అనుమతిస్తుంది.

చెంగల్‌పేట సమీపంలో నియోలిథిక్ ప్రదేశాన్ని కనుగొన్న మద్రాసు పరిశోధకులు

మద్రాస్ విశ్వవిద్యాలయం యొక్క ప్రాచీన చరిత్ర మరియు పురావస్తు శాఖ పరిశోధకులు ఇటీవల తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో నియోలిథిక్ బాలల శ్మశానవాటికను కనుగొన్నారు. ఈ ప్రదేశంలో అరుదైన బూడిద రంగు సామాను మరియు చోళ కాలం నాటి నాణేలతో సహా అనేక రకాల సాంస్కృతిక కళాఖండాలతో పాటుగా ఒక చిన్నారి యొక్క ఖనన అవశేషాలు బయటపడ్డాయి.

  • ఈ నియోలిథిక్ సైట్ చెన్నైకి 77 కిలోమీటర్ల దూరంలోని చెంగల్‌పేట సమీపంలోని చెట్టిమేడు పాతూర్‌లో ఉంది.
  • ఈ ప్రదేశం 2500 బీసీఈ మరియు 3000 బీసీఈ మధ్య ఉండవచ్చని ఈ పరిశోధకులు భావిస్తున్నారు.
  • తమిళనాడులో ఇప్పటి వరకు వెల్లూర్, ధర్మపురి, సేలం సహా కొన్ని నియోలిథిక్ సైట్‌లు మాత్రమే ఇప్పటివరకు నివేదించబడ్డాయి.
  • అయితే ఆ సైట్‌లలో బూడిద రంగు (బర్నిషింగ్) సామాగ్రి కనుగొనబడలేదు.
  • చెట్టిమేడు పాతూర్‌లో ప్రారంభ అన్వేషణలో హాప్‌స్కాచ్, బోన్ టూల్స్ మరియు ఇటుక బ్యాట్‌లు కనుగొబడ్డాయి.
  • వీటితో పాటుగా వివిధ రకాల కుండల పెంకులతో పాటు బూడిద రంగులో ఉన్న సామాను, బర్నిష్డ్ రెడ్ వేర్, బ్లాక్ అండ్ రెడ్ వేర్, ఆల్-బ్లాక్ వేర్, రెడ్ స్లిప్డ్ వేర్, రెడ్ వేర్ మరియు ముతక ఎరుపు రంగు సామాగ్రి కనిపించాయి.
  • మట్టి కోత మరియు మానవ కార్యకలాపాల కారణంగా మట్టిదిబ్బ ఉపరితలంపై గ్రాఫిటీ గుర్తులతో కూడిన కొన్ని కుండలు కూడా కనుగొన్నారు.

ఈ పరిశోధనకు మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న జిను కోశి, పురావస్తు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ జె సౌందరరాజన్ నాయకత్వం వహించారు. ఎంఏ ద్వితీయ ఏడాది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి వీరు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి అనుమతి తీసుకున్నారు.

లక్షద్వీప్‌లో కొత్త నావికా స్థావరంను స్థాపించిన ఇండియన్ నేవీ

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళాన్ని బలోపేతం చేయడంలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో కొత్త నౌకాదళ స్థావరాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వ్యూహాత్మక స్థానంమైన లక్షద్వీప్ దక్షిణాన ఉన్న మినీకాయ్ ద్వీపంలో ఐఎన్‌ఎస్ జటాయును అందుబాటులోకి తెచ్చింది.

  • నావికాదళ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ సమక్షంలో ఈ కమీషన్‌ కార్యక్రమం జరిగింది.
  • కవరత్తిలోని ఐఎన్‌ఎస్ ద్వీపరక్షక్ తర్వాత లక్షద్వీప్‌లో ఏర్పాటు చేసిన రెండో నావికా స్థావరం ఇది.
  • మినీకాయ్ నావల్ డిటాచ్‌మెంట్ 1980ల ప్రారంభంలో నావల్ ఆఫీసర్-ఇన్-చార్జ్ (లక్షద్వీప్) యొక్క కార్యాచరణ కమాండ్‌లో భాగంగా ఏర్పాటు చేయబడింది.
  • ఐఎన్‌ఎస్ జటాయు కమీషన్‌తో లక్షద్వీప్ దీవులలో భద్రతా మౌలిక సదుపాయాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

ఈ కొత్త నౌకాదళ స్థావరం అరేబియా సముద్రంలో యాంటీ పైరసీ మరియు యాంటీ నార్కోటిక్స్ కార్యకలాపాలకు అడ్డకట్టవేసేందుకు సమర్ధంగా ఉపయోగపడుతుంది. గ్లోబల్ ట్రేడ్‌లో గణనీయమైన భాగాన్ని తీసుకువెళ్లే కీలకమైన సీ లేన్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఈ ప్రాంతంలోనే ఉండటం వలన, ఈ వ్యూహాత్మక స్థానంపై భారత నావికాదళానికి పట్టు కుదురుతుంది.

అలానే ఇది హిందూ మహాసముద్ర ప్రాంతీయ భద్రతకు భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. ఈ ప్రాంతంలో తన నౌకాదళ పాదముద్రను బలోపేతం చేస్తుంది. ఇటీవలే భారత్ మరియు మాల్దీవుల మధ్య నెలకొన్న కొన్ని ఉద్రిక్తతల మధ్య ఊహాత్మకంగా ఈ కమీషన్ చేయబడింది. ఇది మాల్దీవుల సమీపంలో బలమైన నావికాదళ ఉనికిని ఏర్పాటు చేయడంలో భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది.

Post Comment