తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 14 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.
డెహ్రాడూన్‌లో జనరల్ బిపిన్ రావత్ విగ్రహం ఆవిష్కరణ
భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) దివంగత జనరల్ బిపిన్ రావత్ యొక్క కాంస్య విగ్రహాన్ని రక్ష మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 12 ఆవిష్కరించారు. డెహ్రాడూన్‌లోని టాన్స్‌బ్రిడ్జ్ స్కూల్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ జనరల్ రావత్‌ను సత్కరించారు. జనరల్ బిపిన్ రావత్‌ను ఒక ధైర్య సైనికుడిగా మరియు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. సైనికులు తమ మూలాలతో సంబంధం లేకుండా దేశ భద్రత పట్ల అచంచలమైన అంకితభావాన్ని నొక్కి చెబుతూ, జనరల్ రావత్ దేశ సైనిక తత్వానికి నిజమైన ప్రతిరూపమని సింగ్ కొనియాడారు.
జనరల్ రావత్ మరణం దేశానికి తీరని లోటు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆయన చివరి క్షణాల్లో కూడా దేశానికి సేవ చేయడానికి అంకితమయ్యారని పేర్కొన్నారు. మొదటి సీడీస్‌గా జనరల్ రావత్ నియామకం యొక్క ప్రాముఖ్యతను రక్షణ మంత్రి నొక్కిచెప్పారు. ఇది దేశ సైనిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంస్కరణలలో ఒకటిగా అభివర్ణించారు. సాయుధ బలగాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ స్థానం ఏర్పాటు చేయడం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
టాన్స్‌బ్రిడ్జ్ పాఠశాల ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనను అభినందిస్తూ, సాయుధ బలగాల పరాక్రమ కథలను పిల్లల్లోకి తీసుకెళ్లి వారిలో దేశభక్తి & అంకితభావాన్ని పెంపొందించడమే లక్ష్యం అని రక్షా మంత్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మరియు జనరల్ బిపిన్ రావత్ వంటి వ్యక్తుల నుండి పిల్లలు నేర్చుకోవడానికి మరియు దేశ నిర్మాణానికి దోహదపడేందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.
- జనరల్ బిపిన్ రావత్ భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా పనిచేశారు.
- ఆయన సీడీస్‌గా ఉన్న సమయంలోనే డిసెంబరు 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
- అలానే రావత్ భారత సైన్యం యొక్క 26వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కూడా సేవలు అందించారు.
- సీడీస్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, భారత సాయుధ దళాల చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి 57వ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
- రావత్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్న సమయంలోనే 2017లో డోక్లామ్ వద్ద భారత సాయుధ దళాలు మరియు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా) మధ్య 73 రోజుల సైనిక సరిహద్దు ప్రతిష్టంభన జరిగింది.
- రావత్ మొదటి వర్ధంతి సందర్భంగా, యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యుఎస్‌ఐ) లో అతని ప్రతిమను రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఆవిష్కరించారు.
- మార్చి 2022లో స్థాపించబడిన జనరల్ రావత్ ఇండియా-ఆస్ట్రేలియా యంగ్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌కు రావత్ పేరు పెట్టారు.
- రావత్ 65వ జయంతి సందర్భంగా, ఓవరాల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో మొదటి స్థానంలో నిలిచిన మహిళా అగ్నివీర్ ట్రైనీ కోసం భారత నావికాదళం జనరల్ బిపిన్ రావత్ రోలింగ్ ట్రోఫీని ఏర్పాటు చేసింది.
- డిసెంబర్ 2013లో బారాముల్లాలోని జన్‌బాజ్‌పోరాలోని జీలం స్టేడియం పేరు జనరల్ బిపిన్ రావత్ స్టేడియంగా మార్చబడింది.
- 2022లో భారత ప్రభుత్వం మరణానంతరం ఆయనకు పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
ఢిల్లీ చలో మార్చ్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
ఫిబ్రవరి 13న ఢిల్లీ చలో మార్చ్‌కు భారత రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి రైతు సంఘాలు వారి డిమాండ్ల కోసం ఒత్తిడి చేసేందుకు ఈ ఢిల్లీ చలో మార్చ్ నిర్వహించారు. పోలీసు ప్రతిఘటన మరియు ప్రభుత్వ అడ్డంకులను ఎదుర్కొంటూ కనీస మద్దతు ధరను డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు ఢిల్లీ వైపు కవాతు చేశారు. రైతు సంఘాల ప్రధాన డిమాండులలో
- చట్ట పరమైన కనీస మద్దతు ధర హామీ
- స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు
- రైతులకు పింఛన్లు
- వ్యవసాయ రుణాల మాఫీ
- భూసేకరణ పరిహారం
- లఖింపూర్ ఖేరీ హింసకు న్యాయం
- విద్యుత్ సవరణ బిల్లు 2020 రద్దు
- 2020-2021 ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ఏడాదికి 200 రోజుల పని
- సుగంధ ద్రవ్యాల జాతీయ కమిషన్ ఏర్పాటు
- ఆదివాసీల హక్కుల పరిరక్షణ
- విత్తనాల నాణ్యతను మెరుగుపరచడం
- ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాల నుంచి ఉపసంహరణ వంటివి ఉన్నాయి.
భారతదేశంలోని వ్యవసాయ సమస్యలను పరిష్కరించడానికి 2006లో ఏర్పడిన అత్యున్నత స్థాయి కమిటీ అయిన ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని నిరసనకారులు కోరుతున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు మరియు మార్కెట్ సంస్కరణలతో సహా రైతుల ఆదాయం మరియు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి వివిధ చర్యలను ఈ కమిటీ నివేదిక ప్రతిపాదిస్తుంది.
ఈ నిరసనకు దేశవ్యాప్తంగా 150కి పైగా రైతు సంఘాల వేదికగా చెప్పుకునే సంయుక్త కిసాన్ మోర్చా మరియు మరో 100 రైతు సంఘాల మద్దతుతో కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకత్వం వహిస్తున్నాయి. ఈ నిరసనలకు దల్లేవా ల్‌కు చెందిన జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మరియు కిసాన్ మజ్దూర్ మోర్చాకు చెందిన సర్వన్ సింగ్ పంధేర్ నాయకత్వం వహిస్తున్నారు.
2021లో మునుపటి నిరసనకు నాయకత్వం వహించిన దర్శన్ పాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహన్ , రాకేష్ తికైత్ , బల్బీర్ సింగ్ రాజేవాల్ మరియు గుర్నామ్ సింగ్ చారుని వంటి నిర్దిష్ట వ్యక్తులు ఈ నిరసనలో చురుకుగా లేరు. 2021లో భారత రైతుల గణతంత్ర దినోత్సవ నిరసన హింసాత్మకంగా మారిన సంగతి మనకు తెలిసిందే.
ఈ ఏడాది ఫిబ్రవరి 16 మరియు 23మధ్య శంభు మరియు ఖానౌరీ సరిహద్దుల్లో జరిగిన నిరసనల సందర్భంగా ఐదుగురు రైతులు మరణించారు. అయితే 21 ఏళ్ల నిరసనకారుడు శుభకరన్ సింగ్ పోలీసు కాల్పుల వల్ల మరణించాడని రైతులు ఆరోపిస్తున్నారు.
- ఢిల్లీ చలో మార్చ్ (రైతుల నిరసనలు) గతంలో 2020లో కూడా నిర్వహించారు.
- 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నిరసనలు జరిగాయి.
- కొత్తగా అమలులోకి వచ్చిన వ్యవసాయ చట్టాలకు ప్రతిస్పందనగా పంజాబ్ మరియు హర్యానా నుండి వేలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు.
- నాడు ఈ నిరసన జాతీయ మరియు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
- దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగిన ఈ రైతు ఉద్యమం చివరికి 2021లో రైతు చట్టాల రద్దుకు దారితీసింది.
గుజరాత్‌లో నరనారాయణ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని జెతల్‌పూర్‌లో నరనారాయణ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌ఐటి)ని ఫిబ్రవరి 12న ప్రారంభించారు. వాస్తవానికి ఈ కాలేజ్ 2007 లో స్థాపించబడింది. తాజాగా దీనిని విస్తరించి కొత్తగా ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ అధ్యయనాల కేంద్రంగా జెతల్‌పూర్ ఉంటుందని అమిత్ షా ప్రకటించారు. జెతల్‌పూర్‌లో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్, ఎంఎస్సీ సైబర్ సెక్యూరిటీ సహా డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
- ఈ కోర్సులతో అహ్మదాబాద్‌లోనే కాకుండా మొత్తం గుజరాత్‌లోని యువతకు ఫోరెన్సిక్ సైన్స్ అధ్యయనానికి జెతల్‌పూర్ కేంద్రంగా మారుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.
- నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని స్థాపించారు.
- మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీగా మార్చబడింది.
- 2020లో స్థాపించబడిన ఈ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ ప్రపంచంలోనే మొదటి మరియు ఏకైక ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం.
- ప్రస్తుతం ఈ యూనివర్సిటీ దేశంలో 10 అనుబంధ శాఖలను కలిగి ఉంది.
- దీని పరిధిలో ఆఫ్రికాలోని ఉగాండాలో తోలి విదేశీ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ క్యాంపస్ ఏర్పాటు చేయబడింది.
- ఈ యూనివర్సిటీ నుండి ఇప్పటి వరకు 154 దేశాల నుండి 22000 మందికి పైగా వ్యక్తులకు ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేశారు.
- 2025 నుండి యేటా 30 మంది విద్యార్థులు ఫోరెన్సిక్ సైన్సెస్ కోర్సులు పూర్తిచేసేలా ప్రణాళిక చేస్తున్నారు.
మాల్దీవుల్లోని భారత సైనిక సిబ్బంది స్థానంలో సాంకేతిక సిబ్బంది నియామకం
మాల్దీవుల్లోని భారత సైనిక సిబ్బంది స్థానంలో పౌర సాంకేతిక సిబ్బందిని నియమించబోతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవలే ఇరుదేశాల మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఫలితంగా భారత సైనిక సిబ్బందిని మార్చి 15లోగా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు డిమాండ్ అభ్యర్ధించారు. తమ దేశంలో విదేశీ ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలో ఉన్నట్లు ఆయన ఇటీవలే ప్రకటించారు.
మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ చేసిన అభ్యర్థనను భారత ప్రభుత్వం అంగీకరించింది. అయితే మానవతా ప్రయోజనాల కోసం మాల్దీవులకు విరాళంగా ఇచ్చిన విమానాలు మరియు హెలికాప్టర్ల నిర్వహణను కొనసాగించడానికి సైనిక సిబ్బంది స్థానంలో పౌర సాంకేతిక నిపుణులతో భర్తీచేస్తున్నట్లు పేర్కొంది.
భారతదేశం మాల్దీవులకు హెలికాప్టర్లు మరియు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా వివిధ రకాల రక్షణ పరికరాలను అందించింది. ఈ పరికరాలు ఆపరేట్ చేయడానికి దాదాపు 80 మంది భారతీయ రక్షణ సిబ్బంది అవసరం ఉంది. మే 10వ తేదీలోగా భారత్ తన బలగాల ఉపసంహరణను పూర్తి చేస్తుందని ఇరు దేశాల అధికారులు అంగీకరించారని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ గత నెలలో వెల్లడించింది. భారతీయ పౌర సాంకేతిక నిపుణుల మొదటి బృందం ఫిబ్రవరి 2024లో మాల్దీవులకు చేరుకుంది.
ఫిన్లాండ్ కొత్త అధ్యక్షుడుగా అలెగ్జాండర్ స్టబ్ ఎన్నిక
ఫిన్లాండ్ కొత్త అధ్యక్షుడుగా అలెగ్జాండర్ స్టబ్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే జరిగిన ఫిబ్రవరి 2024 అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన ఆయన 1 మార్చి 2024 నుండి ఫిన్లాండ్ యొక్క 13వ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలెగ్జాండర్ స్టబ్ గతంలో 2014 నుండి 2015 వరకు ఫిన్లాండ్ ప్రధాన మంత్రిగా పనిచేశారు.
ఈ అధ్యక్ష ఎన్నికలలో అలెగ్జాండర్ స్టబ్ మరియు మాజీ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడ్డారు. ఈ ఓటింగులో 4.3 మిలియన్ల ఓటర్లు పాల్గొన్నారు. అధికారిక ఓట్ల లెక్కింపు సమయంలో అలెగ్జాండర్ స్టబ్ 51.7 శాతం ఓట్లు సాధించి విజేతగా నిలిచారు.
ఐరోపాలో మారుతున్న భౌగోళిక రాజకీయ దృశ్యం ఈ కొత్త దేశాధినేతకు ప్రధాన సవాలుగా ఉంటుంది. ఫిన్లాండ్ అధ్యక్షడు ప్రధానమంత్రితో పోలిస్తే పరిమిత అధికారాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రభుత్వంతో కలిసి దేశ విదేశాంగ విధానాన్ని మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. అలానే అధ్యక్షుడు ఫిన్లాండ్ సాయుధ దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు.
ఉక్రెయిన్‌పై రష్యా 2022 దాడి చేసిన తరువాత మాస్కో మరియు హెల్సింకి మధ్య సంబంధాలు క్షీణించాయి. ఫిన్‌లాండ్ దశాబ్దాల సైనిక నాన్-అలైన్‌మెంట్‌ను విడిచిపెట్టి ఏప్రిల్ 2023లో నాటోలో చేరింది. ఈ దేశం రష్యాతో 1,340-కిలోమీటర్ల (830-మైలు) సరిహద్దును పంచుకుంటుంది.
- ఫిన్లాండ్ అధ్యక్షుడిని నేరుగా ఆరు సంవత్సరాల కాలానికి సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు.
- 1994 నుండి ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడిని వరుసగా రెండు పర్యాయాలకు మించి ఎన్నుకోలేదు.
- అధ్యక్షపదవి కోసం పోటీ చేసే నాయకుడు తప్పనిసరి ఫిన్నిష్ పౌరుడిగా ఉండాలి.
- ఫిన్లాండ్ అధ్యక్ష కార్యాలయం 1919 రాజ్యాంగ చట్టంలో స్థాపించబడింది.
- ఫిన్లాండ్ రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారం ఫిన్నిష్ ప్రభుత్వం మరియు ప్రెసిడెంట్ ఆదీనంలో ఉంటుంది.