తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 04 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 04 మార్చి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 04 మార్చి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

Advertisement

బెంగుళూరులో 2024 డబ్ల్యుటీసీఎ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్

వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ (డబ్ల్యుటీసీఎ) గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ యొక్క 54వ వార్షికోత్సవం బెంగుళూరులో మార్చి 3-6 మధ్య నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగుళూరు (కర్ణాటక)లో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశాన్ని ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపి, 12 విభిన్న పరిశ్రమ రంగాలలో పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక దృష్టితో ఈ కార్యక్రమం జరిగింది.

  • ఈ ఈవెంట్ ఎంపవర్నింగ్ ప్రోగ్రెస్ త్రూ ఇన్నోవేషన్ & కోలాబరేషన్ (ఎపిక్) అనే థీమ్‌తో నిర్వహించారు.
  • గ్లోబల్ బిజినెస్ ఫోరమ్‌ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరియు భారీ మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి మంత్రి ఎంబీ పాటిల్ ప్రారంభించారు.
  • ఈ ఈవెంట్ యందు డబ్ల్యుటీసీఎ చైర్ జాన్ ఈ. డ్రూ, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎంఆర్ జైశంకర్ మరియు డబ్ల్యుటీసీ బెంగళూరు మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ వర్మ మరియు డబ్ల్యుటీసీఎ కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
  • ఈ కార్యక్రమం ద్వారా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ మరియు బెంగుళూరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొత్తగా గ్లోబల్ బిజినెస్ ఫోరమ్‌ యొక్క రీబ్రాండింగ్ ప్రక్రియను ప్రారంభించాయి.
  • ఈవెంట్ ప్రధానంగా బి2బి అంశాల యందు దృష్టి కేంద్రీకరించింది.
  • అలానే డబ్ల్యుటీసీఎ సభ్యుల అంతర్జాతీయ వాణిజ్య ఉనికిని విస్తరించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
  • వివిధ గ్లోబల్ సప్లై చెయిన్‌లలో ఏకీకరణపై దృష్టి సారించడం ద్వారా వ్యాపారాలను గ్లోబల్‌గా కనెక్ట్ చేయడంకి మరింత ప్రాధాన్యతనిస్తుంది.

ట్రేడ్ అసోసియేషన్ యొక్క ఈ ప్రీమియర్ వార్షిక ఈవెంట్ డబ్ల్యుటీసీఎ సభ్యులను మరియు వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, మీడియా మరియు అంతర్జాతీయ సంస్థల నాయకులతో కూడిన వారి గ్లోబల్ నెట్‌వర్క్‌లను ఒకచోట చేర్చుతుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలను కనెక్ట్ చేయడంకు ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమానికి 35 సభ్య దేశాలు/ప్రాంతాలు మరియు దాదాపు 230 దేశీయ మరియు అంతర్జాతీయ వ్యాపారా సంస్థలు హాజరయ్యాయి.

బెంగుళూరు ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ (బీసీఐసీ) భాగస్వామ్యంతో ఈ ఈవెంట్ ఆన్‌సైట్ బి2బి మ్యాచ్‌మేకింగ్ సేవలను అందించింది. ఇది అంతర్జాతీయ ప్రతినిధులను కర్ణాటక రాష్ట్రంలో వ్యాపార అవకాశాలతో కలుపుతుంది. వ్యవసాయం & ఆహార ప్రాసెసింగ్, ఆటోమోటివ్, ఏవియేషన్ & ఏరోస్పేస్, బయోటెక్, ఎడ్యుకేషన్, భారీ ఇంజనీరింగ్, ఐటీ, ఐటీఈఎస్ & ఎలక్ట్రానిక్స్, తయారీ, రియల్ ఎస్టేట్ & నిర్మాణం, టెక్ స్టార్టప్‌లు, టెక్సటైల్ మరియు ట్రావెల్ & టూరిజం రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించింది.

  • భారతదేశం ప్రస్తుతం నామమాత్రపు జీడీపీతో ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది.
  • గ్లోబల్ కొనుగోలు శక్తి సమానత్వం ద్వారా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
  • బెంగుళూరును తరచుగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
  • ఈ నగరం ఇది అత్యాధునిక అభివృద్ధి మరియు ఆవిష్కరణల హబ్ హోదాకు ప్రసిద్ధి చెందింది.

బెంగళూరులో నిర్వహించిన డబ్ల్యుటీసీఎ  గ్లోబల్ బిజినెస్ ఫోరమ్, తమ సభ్యులకు మరియు హాజరయ్యే ప్రతినిధులకు ఈ ప్రాంతం యొక్క డైనమిక్ మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార దృశ్యాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది.

  • డబ్ల్యుటీసీఎ అనేది దాదాపు 100 దేశాల్లోని 300 కంటే ఎక్కువ వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కలుపుతున్న ఒక అంతర్జాతీయ వాణిజ్య సంస్థ.
  • ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వాణిజ్య కేంద్రాలను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.
  • ఇది అంతర్జాతీయ వాణిజ్యం మరియు పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహిస్తుంది.

ఐఎన్ఎస్ గరుడలో ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్‌ ప్రారంభం

భారత నావికాదళం కొత్తగా ప్రవేశపెట్టిన ఎంహెచ్-60ఆర్ సీహాక్ మల్టీ-రోల్ హెలికాప్టర్ యొక్క మొదటి స్క్వాడ్రన్‌ను మార్చి 6 న కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడలో ప్రారంభించింది. ఈ కమీషన్ వేడుక నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమం భారతదేశ రక్షణ ఆధునీకరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచించింది.

  • సీహాక్ మల్టీ-రోల్ హెలికాప్టర్ అనేది ఇప్పటికే ఉన్న బ్లాక్‌హాక్ హెలికాప్టర్ యొక్క సముద్ర వేరియంట్.
  • సీహాక్ స్క్వాడ్రన్ ఇండియన్ నేవీలో ఇండియన్ నేవల్ ఎయిర్ స్క్వాడ్రన్ (ఐఎన్ఎఎస్) 334గా ప్రారంభించబడింది.
  • ఈ హెలికాప్టర్‌లు ఫిబ్రవరి 2020లో భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగిన విదేశీ సైనిక విక్రయాల ఒప్పందంలో భాగంగా రూపొందించబడ్డాయి.
  • ఈ ఒప్పందం విలువ $2.6 బిలియన్ డాలర్లు.
  • ఈ ఒప్పందం ప్రకారం 2025 నాటికి 24 లాక్‌హీడ్ మార్టిన్/ ఎంహెచ్-60ఆర్ సీహాక్ యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ మరియు యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్ హెలికాప్టర్‌లు అందించబడతాయి.
  • ఈ హెలికాప్టర్‌లను యూఎస్ ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ అనుబంధ సంస్థ అయిన సికోర్స్‌కీ తయారు చేస్తుంది.

లాక్‌హీడ్ మార్టిన్ ఎంహెచ్-60ఆర్ సీహాక్ హెలికాప్టర్ అనేది ఒక యాంటీ సబ్‌మెరైన్ మరియు యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్ ప్లాట్‌ఫారమ్‌. దీనిని రోమియో అని కూడా అంటారు. ఇది శత్రు జలాంతర్గాములు మరియు ఉపరితల నౌకలు రెండింటిపై దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది తీర ఆధారిత మరియు నౌకలపై నుండి కూడా పనిచేయగలదు. ఎంహెచ్-60ఆర్ యొక్క అధునాతన డిజిటల్ సెన్సార్‌లలో మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్స్ సిస్టమ్, ఎలక్ట్రో-ఆప్టికల్ లేదా ఇన్‌ఫ్రారెడ్ కెమెరా, డేటాలింక్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్ సర్వైబిలిటీ సిస్టమ్స్, డిప్పింగ్ సోనార్ మరియు సోనోబాయిస్ ఉన్నాయి.

లాక్‌హీడ్ మార్టిన్, రోమియో యొక్క పూర్తి-సమీకృత మిషన్ సిస్టమ్ సముద్రం యొక్క ఉపరితలం మరియు సబ్‌సీ డొమైన్ రెండింటి యొక్క పూర్తి పరిస్థితుల చిత్రాన్ని రూపొందించడానికి దాని సెన్సార్‌ల ద్వారా సేకరించిన డేటాను ప్రాసెస్ చేయగలదు. ఇది అందించే కార్యాచరణ జ్ఞానంతో, ఎంహెచ్-60ఆర్ ఓడలు లేదా జలాంతర్గాములను ట్రాక్ చేయగలదు, లక్ష్యం చేయగలదు మరియు నాశనం చేయగలదు.

  • సీహాక్స్ హెలికాప్టర్లు శోధన మరియు రక్షణ, వైద్య తరలింపు, కమాండ్ మరియు నియంత్రణ మరియు నిలువు రీప్లెనిష్‌మెంట్ మిషన్‌ల కోసం కూడా రూపొందించబడ్డాయి.
  • ఎంహెచ్-60ఆర్ యొక్క ఆయుధాలలో టార్పెడోలు, ఎయిర్-టు-గ్రౌండ్ క్షిపణులు, రాకెట్లు మరియు సిబ్బందికి అందించే తుపాకులు ఉన్నాయి.
  • హెల్‌ఫైర్ ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులు మరియు మార్క్ 54 యాంటీ సబ్‌మెరైన్ టార్పెడోలు కూడా ఈ హెలికాప్టర్‌లలో అమర్చబడి ఉన్నాయి.

ఈ హెలికాప్టర్లు భారతదేశం యొక్క సముద్ర సామర్థ్యాలను, ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతను గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎంహెచ్-60ఆర్ యొక్క కమీషన్ కీలక సమయంలో జరిగింది అని భావించవచ్చు.

అలానే ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణ నేపథ్యంలో ఎర్ర సముద్రంలో తీవ్రమవుతున్న సంక్షోభం నేపథ్యంలో ఈ సీహాక్స్ సముద్ర భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించడానికి భారతదేశం యొక్క సామర్థ్యాన్ని బలపరుస్తాయి.

హజ్ సువిధ యాప్ ప్రారంభించిన స్మృతి ఇరానీ

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ మార్చి 3 న హజ్ సువిధ యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ హజ్ తీర్థయాత్రకు సంబంధించిన సమస్త సమాచారం అందించడం ద్వారా యాత్ర అనుభవాన్ని పెంపొందిస్తుంది. హజ్‌ యాత్రను మరింత సజావుగా, సౌకర్యవంతంగా అందించేందుకు ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో దీనిని రూపొందించారు.

హజ్ సువిధ యాప్‌ హజ్ తీర్థయాత్రకు అవసరమైన సమాచారం మరియు శిక్షణ మాడ్యూల్స్, విమాన వివరాలు మరియు వార్షిక తీర్థయాత్రకు బయలుదేరే వారికి వసతి వంటి ముఖ్యమైన సేవలకు ప్రత్యక్ష ప్రాప్యతను అందిస్తుంది. అన్ని రాష్ట్రాల యాత్రికుల అవగాహన కోసం ఈ కంటెంట్ 10 భాషల్లో అందుబాటులో ఉంచింది.

హజ్ సువిధ యాప్‌ను మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జాన్ బార్లా సమక్షంలో విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించారు. ఇదే వేదిక ద్వారా హజ్ 2024 సన్నాహాల్లో భాగంగా రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కూడా ఇరానీ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 550 మందికి పైగా శిక్షకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

లేడీస్ వితౌట్ మెహ్రామ్ (ఎల్‌డబ్ల్యూఎం) కేటగిరీ కింద గత ఏడాది నాలుగు వేల మందికి పైగా మహిళలు విజయవంతంగా హజ్‌కు వెళ్లినట్లు స్మృతి ఇరానీ ప్రకటించారు. ఈ ఏడాది ఇదే కేటగిరీ కింద 5000 మందికి పైగా మహిళలు ఇప్పటికే హజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమె తెలిపారు.

న్యూఢిల్లీలో డెఫ్‌కనెక్ట్ 2024 ప్రారంభం

స్వదేశీ రక్షణ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రక్షా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మార్చి 4న న్యూఢిల్లీలో డెఫ్‌కనెక్ట్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సాయుధ దళాలు, రక్షణ పరిశ్రమ నాయకులు, స్టార్ట్-అప్‌లు, విద్యావేత్తలు మరియు విధాన రూపకర్తలతో సహా కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చుతుంది.

ఈ కార్యక్రమం దేశ రక్షణ ఆవిష్కరణ ల్యాండ్‌స్కేప్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్-డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది.

ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) ఫ్రేమ్‌వర్క్ 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాల్లోని వివిధ వాటాదారులకు ఏకీకృత వేదికను అందిస్తుంది. ఈ నిర్దిష్ట రంగంలో సాంకేతిక అభివృద్ధి మరియు సంభావ్య సహకారాలను పర్యవేక్షించడానికి ఇది ఒక గొడుగు సంస్థ వలె పనిచేస్తుంది. ఈ ఐడెక్స్ ఫ్రేమ్‌వర్క్ సైనిక సిబ్బందిని సహ-అభివృద్ధి నమూనాలో ఆవిష్కర్తలతో కలిసి పని చేయడానికి అనుమతిస్తుంది.

ఈ ఈవెంట్ రక్షణ రంగానికి సంబంధించి అత్యాధునిక సాంకేతికతలను ప్రదర్శించడం, రక్షణ రంగంలో సహకారం, ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకతను పెంపొందించడానికి ఒక పరివర్తన వేదిక అందించింది. ఈ కార్యక్రమం రక్షణ రంగంలో భారతదేశంలోని ప్రముఖ పరిశ్రమల నుండి పెద్ద సంఖ్యలో ఆవిష్కర్తలు మరియు పెట్టుబడిదారులను ఆకర్షించింది.

ఎన్‌ఆర్‌సి అమలు తీర్మానాన్ని ఆమోదించిన మణిపూర్ అసెంబ్లీ

మణిపూర్ అసెంబ్లీ తమ రాష్ట్రంలో అస్సాం తరహా ఎన్‌ఆర్‌సిని అమలు చేయడానికి దాదాపు రెండేళ్ల క్రితం ఆమోదించిన తీర్మానాన్ని పునరుద్ఘాటించింది. దీనికి సంబంధించి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ( ఎన్‌ఆర్‌సి )ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మణిపూర్ అసెంబ్లీ మార్చి 1న ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ తీర్మానం గతంలో ఆగస్టు 2022లో ఒకసారి మరియు తాజాగా రెండో సారి ఆమోదించబడింది. మణిపూర్ అసెంబ్లీ 2022 ఆగస్టులో రాష్ట్ర మరియు దేశ ప్రయోజనాల దృష్ట్యా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ని ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరుతూ మొదటిసారి తీర్మానం చేసింది.

  • నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది 2003 పౌరసత్వ చట్టం, 1955 సవరణ ద్వారా ఏర్పాటు చేయబడింది.
  • ఇది అక్రమ వలసదారులను గుర్తించి, బహిష్కరించేందుకు వీలుగా భారతదేశంలోని చట్టబద్ధమైన పౌరులందరికి గుర్తింపు కల్పిస్తుంది.
  • ఇది 2013 నుండి అస్సాం రాష్ట్రంలో అమలు చేయబడుతుంది.
  • 2019 భారత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో భారతదేశం మొత్తానికిఎన్‌ఆర్‌సి అమలు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది.
  • 2021 లో దేశంలోని మిగిలిన ప్రాంతాలకు దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను ప్రకటించింది.
  • అయితే కొన్ని వివాదాస్పద అంశాల కారణంగా ఇది అమలు చేయబడలేదు.

స్థిరమైన జీవనశైలిపై భారతదేశ తీర్మానాన్ని ఆమోదించిన ఐక్యరాజ్యసమితి

యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ (యూఎన్ఈఎ) 1 మార్చి 2024న స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడంపై భారతదేశం యొక్క తీర్మానాన్ని ఆమోదించింది. కెన్యాలోని నైరోబీలో 26 ఫిబ్రవరి నుండి 1 మార్చి 2024 వరకు జరిగిన యూఎన్ఈఎ ఆరవ సెషన్‌లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అన్ని సభ్య దేశాలు ఆమోదించాయి.

  • యూఎన్ఈఎ 2030 ఎజెండాలో భాగంగా పర్యావరణ స్థిరమైన అభివృద్ధి కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించింది.
  • ప్రకృతికి అనుగుణంగా స్థిరమైన అభివృద్ధి మరియు జీవనశైలి ప్రోత్సాహం కోసం ప్రతిచోటా సంబంధిత సమాచారం అందుబాటులో ఉంచుతుంది.
  • ఇది పౌరులను స్థిరమైన జీవనశైలి వైపు ప్రవర్తనా మార్పుల రిజల్యూషన్ ద్వారా ప్రోత్సహిస్తుంది.
  • ఇది సస్టైనబుల్ లైఫ్‌స్టైల్స్ మరియు ఎడ్యుకేషన్‌పై వన్ ప్లానెట్ నెట్‌వర్క్ ప్రోగ్రామ్ అందిస్తుంది.
  • ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రామ్ 10 ఏళ్ళ నిడివితో అంతర్జాతీయ, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో అమలు చేయబడుతుంది.
  • ఇది మరింత స్థిరమైన జీవనశైలికి మద్దతుగా ప్రైవేట్ రంగం, స్థానిక అధికారులు, స్థానిక సంఘాలు మరియు స్థానిక ప్రజల పాత్రను మరింత గుర్తిస్తుంది.
  • ఈ తీర్మానం సభ్య దేశాలు, అంతర్ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ రంగం మరియు ఇతర వాటాదారుల ద్వారా మరింత మెరుగుపర్చబడుతుంది.
  • భారతదేశం సమర్పించిన స్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించే తీర్మానాన్ని శ్రీలంక మరియు బొలీవియా సహ-స్పాన్సర్ చేస్తున్నాయి.

పర్యావరణ సుస్థిర జీవనశైలి భావనను ప్రధాని నరేంద్ర మోదీ 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్26లో ప్రపంచ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 20 అక్టోబర్ 2022న మిషన్ లైఫ్ (లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) అనే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ, యూఎన్ సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సమక్షంలో గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రారంభించారు.

ఈ లైఫ్ మూమెంట్ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సామూహిక చర్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం నేతృత్వంలోని ప్రపంచ సామూహిక ఉద్యమంగా మిషన్ లైఫ్ భావించబడుతుందని నాడు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమం రిడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. ఇది పర్యావరణ సంరక్షణలో పౌరులను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వాలను భాగస్వామ్యం చేస్తుంది.

అర్బన్ కో-ఆప్ బ్యాంకుల కోసం అంబ్రెల్లా బాడీని ప్రారంభించిన అమిత్ షా

కేంద్ర సహకార మంత్రి అమిత్ షా, అర్బన్ కో-ఆప్ బ్యాంకుల కోసం నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఎన్‌యుసిఎఫ్‌డిసి) అనే అంబ్రెల్లా బాడీని ప్రారంభించారు. ఎన్‌యుసిఎఫ్‌డిసి అనేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగానికి స్వీయ నియంత్రణ సంస్థగా మరియు వాటికి సంబంధించి ఒక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా పనిచేస్తుంది. దీనికి సంబందించిన బ్యాంకింగ్ అనుమతులను ఇది ఇప్పటికే ఆర్బీఐ నుండి పొందింది.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అమిత్ షా, 20 ఏళ్ల తర్వాత ఎన్‌యూసీఎఫ్‌డీసీ ఏర్పాటైందని, దీనికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు భారతదేశంలో చాలా కాలంగా పనిచేస్తున్నాయని, అయితే దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించగలిగినప్పటికీ అవి వేగంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయని ఆయన అన్నారు.

ఎన్‌యూసీఎఫ్‌డీసీ యొక్క ప్రధాన లక్ష్యం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టానికి కట్టుబడి అవి అభివృద్ధిలోకి వచ్చేందుకు సహాయపడాలని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,000 శాఖలతో పాటు 5 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్‌తో 1,500 కంటే ఎక్కువ పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావ్ కరాడ్, సహకార కార్యదర్శి ఆశిష్ భుటానీ, ఎన్‌యుసిఎఫ్‌డిసి చైర్మన్ జ్యోతీంద్ర మెహతా పాల్గొన్నారు.

  • నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారతదేశంలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌లకు మద్దతు ఇవ్వడానికి మరియు బలోపేతం చేయడానికి స్థాపించబడిన ఒక గొడుగు సంస్థ.
  • ఇది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు మరియు నియంత్రణ సంస్థల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేస్తుంది.
  • అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి, వాటి ఆధునికీకరణకు కృషి చేస్తుంది.
  • ఇది మరింత పటిష్టమైన మరియు సురక్షితమైన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్‌ను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.
  • సహకార్ సే సమృద్ధి (సహకారం ద్వారా శ్రేయస్సు) మరియు ఆత్మ నిర్భర్ భారత్ (స్వయం-ఆధారమైన భారతదేశం) యొక్క ప్రభుత్వ విజన్‌కు దోహదం చేస్తుంది.

బీఎస్ఎఫ్ యొక్క మొదటి మహిళా స్నిపర్‌గా సుమన్ కుమారి

ఇండోర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమారి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) మొదటి మహిళా స్నిపర్‌గా చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్మమెంట్ అండ్ వార్‌ఫేర్ స్కిల్స్ యందు 8 వారాల కోర్సును పూర్తి చేసిన తర్వాత ఆమె సరిహద్దు భద్రతా దళానికి మొదటి మహిళా స్నిపర్‌గా నియమింపబడ్డారు.

పంజాబ్‌లోని ఒక ప్లాటూన్‌కు కమాండ్‌గా ఉన్నప్పుడు సరిహద్దుల అవతల నుండి స్నిపర్ దాడుల బెదిరింపును చూసిన ఆమె స్నిపర్ కోర్సు కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సుమన్ కుమార్ కృతనిశ్చయం చూసి ఈ కోర్స్‌లో పాల్గొనేందుకు ఆమె ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు.

స్నిపర్ కోర్సును అభ్యసించిన తాజా 56 మంది పురుషులలో సుమన్ ఒక్కరే మహిళ. ఆమె సాధించిన విజయంతో, ఇతర మహిళా రిక్రూట్‌లు ఇలాంటి సైనిక పాత్రలను చేపట్టేందుకు ఆమె స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు. ఆమె కథ రక్షణ దళాలలో ఔత్సాహిక మహిళలకు ప్రేరణగా నిలవనుంది.

Advertisement

Post Comment