తెలుగులో 25 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.
భారతదేశపు మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటరుగా జసింత కళ్యాణ్
భారతదేశపు మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటరుగా కర్ణాటకకు చెందిన జసింత కళ్యాణ్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్‌లో కళ్యాణ్ నైపుణ్యం వెలుగులోకి వచ్చింది. ఆమె బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం పిచ్ సన్నాహాలను పర్యవేక్షించింది.
జసింత కళ్యాణ్ ఈ కెరీరుకు ముందు గత మూడు దశాబ్దాలుగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ యందు రిసిప్షన్ అడ్మిన్‌గా పనిచేసింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కోసం పనిచేసింది. ఫిబ్రవరి 2024లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్‌తో క్యూరేటర్‌గా కళ్యాణ్ అధికారిక నియామకం జరిగింది.
జసింత కళ్యాణ్ యొక్క మార్గదర్శక స్ఫూర్తి పిచ్ క్యూరేషన్‌లో పురుషుల ఆధిపత్య డొమైన్‌లోకి ప్రవేశించడానికి ఎక్కువ మంది మహిళలకు మార్గం సుగమం చేస్తుంది. ఆమె అంకితభావం మరియు నైపుణ్యం భారత క్రికెట్‌లోని మహిళా శ్రామిక శక్తిలో ఉన్న ప్రతిభ మరియు సామర్థ్యానికి నిదర్శనం. జసింత కళ్యాణ్ కథ కేవలం వ్యక్తిగత విజయం కంటే ఎక్కువ, క్రీడా నిర్వహణలో ఔత్సాహిక మహిళలకు ఇది శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుంది.
శరద్ పవార్ పార్టీకి కొత్త ఎన్నికల గుర్తు కేటాయింపు
భారత ఎన్నికల సంఘం శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్‌కు కొత్త ఎన్నికల గుర్తు కేటాయించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు మేరకు త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో మ్యాన్ బ్లోయింగ్ తుర్హా (ట్రంపెట్) గుర్తుతో పోటీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. తుర్హా అనేది ఒక సాంప్రదాయ బాకా. ఇది చంద్రవంక లేదా ఒక సి-ఆకారపు వాయిద్యం. ఇది స్వాగత చిహ్నంగా కొన్ని సందర్భాలలో వాయించబడుతుంది. పూర్వం రాజుల రాకను తెలియజేసేందుకు దీనిని వాడే వారు.
శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సిపి గత ఏడాది జూలైలో అజిత్ పవార్ మరియు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన తర్వాత చీలిపోయింది. ఇటీవలే ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్‌సిపిగా గుర్తించి, ఆయన నేతృత్వంలోని ఈ వర్గానికి అసలైన ఎన్‌సిపి పార్టీ పేరు మరియు దాని అధికారిక పార్టీ గుర్తు గడియారంను ఉపయోగించేందుకు అనుమతిచ్చింది.
అయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో కేసు ఇంకా కొనసాగుతుండటంతో ఫిబ్రవరి 22న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశం ప్రకారం తాత్కాలికంగా అజిత్ పవార్ వర్గాన్ని నిజమైన ఎన్‌సిపిగా గుర్తిస్తూ సంబంధిత గుర్తులు, పార్టీ పేరును తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపిని విడిచిపెట్టిన అజిత్ పవార్, గత ఏడాది జులైలో తన మద్దతుదారులతో కలిసి, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అధికార శివసేన-బిజెపి ప్రభుత్వంలో చేరారు. దీనితో ఈ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.
- శరద్ పవార్ 1999 లో భారత జాతీయ కాంగ్రెస్ నుండి బహిష్కరించబడిన తర్వాత ఎన్‌సిపి స్థాపించారు.
- ఎన్‌సిపి మహారాష్ట్రలోని ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
- ఈ పార్టీ తమహారాష్ట్రతో పాటు నాగాలాండ్ మరియు కేరళలో కూడా గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా ఉంది.
- తాజా చీలికతో నాగాలాండ్ రాష్ట్ర యూనిట్ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపితో వెళ్లగా, కేరళ రాష్ట్ర విభాగం శరద్‌తో కలిసి ఉంది.
శరద్ పవార్ కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి తరుపున నాలుగు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. పివి నర్సింహారావు మంత్రివర్గంలో రక్షణ మంత్రిగా మరియు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. రాజకీయాలకు అతీతంగా 2005 నుండి 2008 వరకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా కూడా పని చేసారు.
అమెరికా, యూరప్‌లతో పాండా దౌత్యాన్ని పునఃప్రారంభించిన చైనా
చైనా తన ప్రియమైన పాండా దౌత్య కార్యక్రమాన్ని తిరిగి ప్రకటించింది. ఇది పశ్చిమ దేశాలతో, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్‌తో సంబంధాలను మెరుగుపరచడానికి ఒక పునరుద్ధరణ ప్రయత్నాన్ని సూచిస్తుంది. విదేశాల్లోని జంతుప్రదర్శనశాలలకు గతంలో రుణం ఇచ్చిన పాండాలను చైనా రీకాల్ చేసిన అనేక సంవత్సరాల తర్వాత ఈ చొరవ తీసుకుంది.
చైనా వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అసోసియేషన్ ఇటీవల కాలిఫోర్నియాలోని శాన్ డియాగో జూ మరియు మాడ్రిడ్ జూ యందు పాండా సంరక్షణపై అంతర్జాతీయ సహకారానికి కొత్త చొరవను ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం శాన్ డియాగో జంతుప్రదర్శనశాల ఈ వేసవి ప్రారంభంలోనే కొత్త పెద్ద పాండా జంటను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
అలానే వాషింగ్టన్ డీసీ యొక్క నేషనల్ జూ మరియు ఆస్ట్రియా యొక్క స్కాన్‌బ్రూన్ జంతుప్రదర్శనశాలలతో కూడా చైనా తన సహకారాన్ని పునరుద్ధరించడం గురించి చర్చిస్తోంది. గత నవంబర్‌లో కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సమావేశం తర్వాత చైనాలోని అడవిలలో మాత్రమే నివసించే ఈ ఐకానిక్ జంతువులను తిరిగి అమెరికాకు పంపేందుకు సిద్ధమౌతున్నారు.
1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ చైనా పర్యటన తర్వాత, వాషింగ్టన్ జంతు ప్రదర్శనశాలకు బీజింగ్ నుండి ఒక జత పాండాలు బహుమతిగా అందించబడ్డాయి. ఈ సాంప్రదాయం ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడంలో సహాయపడింది.
అయితే గత దశాబ్ద కాలంగా ఈ సాంప్రదాయం అమలు కాలేదు. అలానే రుణ ఒప్పందాల గడువు ముగిసిన పాండాలను చైనా తిరిగి వెనక్కి రప్పించుకుంది. ప్రస్తుతం యూఎస్ అట్లాంటా జూలో మాత్రమే పాండాలు ఉన్నాయి, కానీ అవి కూడా ఈ సంవత్సరం చైనాకు తిరిగి వెళ్లడానికి షెడ్యూల్ చేయబడ్డాయి.
- జెయింట్ పాండాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 1800 మాత్రమే ఉన్నాయి.
- జెయింట్ పాండాలు పూర్తి స్నేహ పూర్వక జంతువులు.
- పాండాల పరిరక్షణ ప్రయత్నాలలో చైనా కీలక పాత్ర పోషిస్తుంది.
- దశాబ్దాలుగా చైనా విదేశీ సంబంధాలకు పాండా దౌత్యం మూలస్తంభంగా ఉంది.
- స్నేహపూర్వక ఈ ఎలుగుబంట్లు సాంస్కృతిక రాయబారులుగా ఉపయోగపడుతున్నాయి.
- పునరుద్ధరించబడిన ఈ అంతర్జాతీయ సహకారం, అంతరించిపోయే స్థితిలో ఉన్న ఈ ఎలుగుబంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రష్యన్ ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ జైలులో మరణం
రష్యన్ ప్రతిపక్ష రాజకీయ నాయకుడు మరియు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు అలెక్సీ నవల్నీ 47 సంవత్సరాల వయస్సులో 16 ఫిబ్రవరి 2024న జైలులో మరణించారు. ప్రస్తుతం ఆర్కిటిక్ సర్కిల్ లోపల జైలులో 19 ఏళ్ల సుదీర్ఘ శిక్ష అనుభవిస్తున్న అలెక్సీ, ఫిబ్రవరి 16న తన రోజువారీ నడక తర్వాత అస్వస్థతకు గురయ్యి మరణించినట్లు రష్యన్ మీడియా పేర్కొంది.
- అలెక్సీ నవల్నీరష్యా ప్రతిపక్ష నాయకుడుగా, న్యాయవాదిగా, అవినీతి వ్యతిరేక కార్యకర్తగా, పుతిన్ విమర్శకుడుగా మరియు రాజకీయ ఖైదీగా గుర్తింపు పొందారు.
- రష్యాలో అవినీతిని అంతమొందించేందుకు నావల్నీ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ కూడా స్థాపించాడు.
- పుతిన్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేఖ సంస్కరణల కోసం పెద్దఎత్తున పోరాటం చేసాడు.
- 2013 మరియు 2014లో అక్రమార్జనకు సంబంధించి రెండుసార్లు సస్పెండ్ చేయబడిన శిక్షను అనుభవించాడు.
- రెండు క్రిమినల్ కేసులు రాజకీయంగా ప్రేరేపించబడినవిగా పరిగణించబడ్డాయి. ఆయన్ని భవిష్యత్ ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి.
- అలెక్సీ 2013 మాస్కో మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి 27% ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
- 2018 అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించబడ్డాడు.
- 2021 నుండి ఆర్కిటిక్ సర్కిల్‌కు ఉత్తరాన ఉన్న జైలులో తీవ్రవాద ఆరోపణలపై 19 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
- ఇది అత్యంత కఠినమైన జైళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది.
- అలెక్సీ నవల్నీ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేత మనస్సాక్షి ఖైదీగా గుర్తించబడ్డాడు.
- మానవ హక్కులపై అలెక్సీ నవల్నీ చేసిన కృషికి సఖారోవ్ బహుమతిని పొందాడు.
76% ఆమోదంతో మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ
76 శాతం అభిమాన ఆమోద రేటింగ్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడిగా అవతరించారు. ఇటీవలి అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రధాని మోదీ (76 శాతం) అగ్రస్థానంలో ఉండగా, ఆయన తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ (66 శాతం), రెండవ స్థానంలో, 63 శాతం ఆమోదంతో అర్జెంటీనా ప్రధాని జేవియర్ మిలీ మూడవ స్థానంలో, స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ (58 శాతం) నాల్గొవ స్థానంలో, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (49 శాతం) ఐదవ స్థానంలో నిలిచారు.
- నరేంద్ర మోదీ (76 శాతం) - ఇండియా
- ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ (66 శాతం) - మెక్సికో
- జేవియర్ మిలీ (63 శాతం) - అర్జెంటీనా
- అలైన్ బెర్సెట్ (58 శాతం) - స్విట్జర్లాండ్
- లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా (49 శాతం) - బ్రెజిల్
గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్ పేరుతొ విడుదల చేసిన ఈ సర్వేలో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ 40 శాతం ఆమోదింతో ఈ జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అలానే కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో 29 శాతం ఆమోదంతో 17వ స్థానంలో, యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ 25 శాతం ఆమోదంతో 20వ స్థానంలో ఉన్నారు.
ఈ రేటింగ్‌లు ఈ ఏడాది జనవరి 30 నుండి ఫిబ్రవరి 5 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఇవ్వబడ్డాయి. గత ఏడాది డిసెంబరు నెలలో ప్రధాని మోడీకి 76 శాతం ఆమోదం లభించినట్లు ఈ సర్వేలో తేలింది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
గత ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికలలో పీఎం మోడీ అధ్యక్షతన బీజేపీ పార్టీ భారీ విజయాలు సాధించింది. మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీకి, ఆయన పార్టీకి ఈ సర్వే ఫలితాలు బూస్ట్ అందిస్తాయి.
విజిలెన్స్ కమిషనర్‌గా ఏఎస్ రాజీవ్ ప్రమాణస్వీకారం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏఎస్ రాజీవ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో రెండవ విజిలెన్స్ కమిషనర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 09, 2024న భారత రాష్ట్రపతిచే విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయిన ఆయన, 11.03.2024న విజిలెన్స్ కమిషనర్‌గా కమిషన్‌లో చేరారు.
ఏఎస్ రాజీవ్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ రంగంలో గత 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. గతంలో సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలలో సేవలు అందించారు. అలానే న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నామినీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమలు కోసం ఆర్‌బిఐ ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ మరియు కోర్ గ్రూప్ మెంబర్‌గా కూడా ఉన్నారు.
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ప్రభుత్వరంగ అవినీతిని పరిష్కరించడానికి 1964 లో సృష్టించబడిన ఒక అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ.
- ఇది 2003లో పార్లమెంట్ ద్వారా చట్టబద్ధమైన హోదా పొందింది. ప్రస్తుతం ఇది స్వయంప్రతిపత్త సంస్థ హోదాను కలిగి ఉంది.
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
- సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం 2003 ప్రకారం ఈ సంస్థలో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ మరియు ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు నియమించబడతారు.
- విజిలెన్స్ కమీషనర్ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు లేదా పదవిలో ఉన్న వ్యక్తికి 65 ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది.
- ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ కమీషనరుగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
- విజిలెన్స్ కమిషనర్లుగా అరవింద కుమార్ మరియు ఏఎస్ రాజీవ్ సేవలు అందిస్తున్నారు.